ఆ పిల్ల …

Spring Explosive

-రమాసుందరి 

 

ఈ పిల్ల నాకు గుర్తుంది

అపుడెపుడో పచ్చని ఆకులు సన్నని జల్లుతో జోడు కట్టినపుడు

నేరేడు పండ్ల చెట్టు కింద నుండి పుస్తకాలు

గుండెకు హత్తుకొని తలవంచుకొని నడిచి వస్తూ ఉండేది.

ఆ పిల్ల నాకు ఏయూ అవుట్ గేటు కాడ

గద్దరు పాడుతుంటే బొంగురు గొంతుతో కోరస్ యిస్తూ కనబడేది

ఏడాదికోసారి శ్రీకాకుళం బొడ్డపాడులో

స్థూపం దగ్గర వంటరిగా కూర్చొని ఉండేది.

తరువాత యూనివర్సిటీ గోడల్లో

జేగురురంగులో వంకర టింకరగా యింకి పోయి కనిపించింది

సుల్తాన్ బజార్ గల్లీలో మారుమూల షాపులో

న్యూస్ ప్రింట్ కాగితంలో పెళుసు బారి స్థిరపడింది.

ఇటీవల చానా రోజులుగా ఆ పిల్ల కనబడలేదు.

మళ్ళీ చూశానా పిల్లని మొన్నా మధ్య

నెమలి ఈకలంత మెత్తదనంతో స్పర్శిస్తుంది చిన్నిపాపలను

మందపు అద్దాలతో తీక్షణంగా చూస్తోంది ఎవరి వైపో

ఆదర్శమో, ఆచరణో, ఆయుధమో ఏవో ఆ పిల్ల భుజం మీద వేలాడుతున్నాయి

చెట్లు కమ్ముకొన్న ఆకాశం కింద

చల్లని దారుల్లో

ఆ పిల్ల నాలో నుండి సాగిపోవడం చూశాను

వద్దు వద్దని నా గొంతు పెగలక ముందే

తిరిగి వచ్చి నా దగ్గరే కూర్చొని అడవి కబుర్లు చెప్పింది

యిత్తులు వేసి వచ్చిందంట కొలిమిని ఊదీ వచ్చిందంట

పంటలు పండే కాలం తొందరలోనే ఉందన్నది.

ప్రేమగా ఆమెను తాకబోతే

చెయ్యి పెగిలి ఉంది

కాలు కమిలి ఉంది

ఇదిగో చూడని

మర్మాంగాన్ని తెరిచి చూయించింది

గుత్త సంపదదారుడు కార్చిన సొంగ

పొంగి పొరులుతుంది అక్కడ

వెక్కి వెక్కి ఏడుస్తున్న నన్ను చూసి

వెక్కిరింతగా నవ్వింది

నిన్ను చూసి నువ్వు ఏడ్చుకొంటావెందుకని ప్రశ్న వేసింది

వేలు బెట్టి గుండెకు ఆనించి

నా కళ్లలోకి చిరునవ్వుతో చూస్తూ

నువ్వు యింకా బతికే ఉన్నావని చెబుతూ

మాయమయి పోయింది.

*

రమాసుందరి

రమాసుందరి

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. Rajendra Prasad. says:

    గుండెలు పిందేసేలా రాసావు రామా>>>>కొన్ని సెంటిమెంట్స్ లో నీ కలం చదివే వాళ్ళను ఎద్పిస్తుంది >>>>అవును ఎదవా వలసిన విశదమెగా >>>>>

  2. శ్రీనివాసుగద్దపాటి says:

    గుండెను పిండేశారు మేడమ్
    రాజ్యహింసకు ఇంకెన్నిపూలు రాలిపోనున్నాయో…..

  3. Delhi Subrahmanyam says:

    గుండెను కదిల్చేలా రాసారు. ఈ కదిలిన గుండెలు వాళ్ళ పోరాటాన్ని సమర్దించడానికి వాళ్ళకి కనీసం, రాజకీయం గానూ భావోక్తం గానూ మద్దతు ఇవ్వాలి.

  4. చందు తులసి says:

    నిన్ను చూసి నువ్వే ఏడుస్తావెందుకంది …

    – ఈ వాక్యం చాలు మరేమిటో చెప్పటానికి …. హృదయం, మానవత్వం ఉన్న కలం మీది.
    మొన్న రాసిన రెండు జళ్ళ పాప భవిష్యత్తు లా
    ఈ దుర్ఝటన కనిపించింది.

  5. buchireddy gangula says:

    excellent.. one. rama… గారు
    ——————————————–

    బుచ్చి రెడ్డి గంగుల

  6. laxman kalleda says:

    గుండెల్ని పిండేసింది

  7. prasadamurty says:

    Most powerful poem that I have read in recent times

  8. రమా సుందరి గారూ నిజంగా మీ కవిత విప్లవ పోరాటం లో అసువులు బాసిన ఎంతో మంది విప్లవ కారుల జీవితాలను బాల్యాన్ని సున్నితంగా స్పృశించింది. బాగుందండీ

  9. Aranya Krishna says:

    అనేక చోట్ల ఆ పిల్లని చూసానని చెప్పటం ద్వారా అమరురాలైన ఒక యువతికి సామాన్యత్వం తీసుకురావటం జరిగింది. కవితలో వాడుకున్న మార్మికత కూడా కవిత్వానికి ఒక గొప్ప బలమైంది. “నిన్ను చూసి నువ్వు ఏడ్చుకొంటావెందుకని ప్రశ్న వేసింది” అనటం ద్వారా కవి ఏ స్థాయిలో సహానుభూతి పొందారో తెలుస్తుంది. ఫీల్ పరంగానూ, టెక్నిక్ పరంగానూ ఎంతో బలమైన కవిత.

  10. గుండెల్లో దాచుకోవాలిసిన కవిత

  11. Dr.Rajendra Prasad Chimata says:

    కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.ఈ త్యాగాలు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు?

  12. ఎ.కె.ప్రభాకర్ says:

    ఆ పిల్ల చూపిన దారిలో నడుద్దాం.

  13. చందు తులసి says:

    మేడం గారి కవితతో పాటూ …..స్పందనలు కూడా ఆకట్టుకుంటున్నాయి.

  14. కె.కె. రామయ్య says:

    వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో 15th Sep, 2015 న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతులైన ఇద్దరు మావోయిస్టులు శ్రుతి అలియాస్‌ మహిత, విద్యాసాగర్‌ రెడ్డి అలియాస్‌ సాగర్‌. ఎంటెక్ యువతి శ్రుతిని … తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రుతిని … కార్పోరేట్ల రాష్ట్రం వచ్చిందని ఆరోపిస్తూ మావో వైపు వెళ్లిన శ్రుతిని … పోలీసులు అత్యంత కిరాతకంగా చిత్రహింసలు పెట్టారని, అతి క్రూరంగా యాసిడ్‌తో గాయపరిచారని, లైంగిక దాడి కూడా జరిగిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. వారి ఆరోపణలు నిజమని నమ్మేలా శృతి శరీరంపై యాసిడ్ గాయాలు ఉండటం గమనార్హం.

    రామక్కా! మీ నివాళి గుండెల్ని పిండేసింది.

  15. kameswara rao says:

    చాల బాగుంది

  16. ఆ పిల్ల మన అందరి పిల్లా కదా..

  17. ఎవడో ఎల్లయ్య says:

    ఉద్యమం, యుద్ధం, అమరం అంటూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళలో పసివాల్లె ఎక్కువగా వున్తున్నట్టున్నారు? వాళ్ళన్ని రెచ్చగొట్టి అడవుల్లోకి తోల్క పోతంది ఎవురు? ఎందుకు ఆళ్ళని బలి చేస్తారు? పిల్ల గాళ్ళని బతకనియ్యండి. ముసిలి ముతకా, తెలివిగల మేధావులు(!) ఈ పోరాగాళ్ళతో రాజకీయం నడిపేవాళ్ళు, మీరు పొండి ఉద్యమాలకి. ఆళ్ళు సచ్చినా బతికినా ఎవురికి పట్టింది? అమ్మ అబ్బాకి ఎంత కడుపు కోత. నిజ్జంగా అడువుల్లోకి దూరి పోరాటాలుజేస్తే ఏదో జరిగిపోద్దని ఈ పిచ్చి నా బిడ్డలకి చెప్పేదెవరు? పిల్లలూ పోబాకండి. మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఈడనే నిలబడండి. నువ్వు పోయాక నాలుగురోజులు కవితలు కథలు రాసుకుంటారు. కానే నీ పేనం ఎవురు తేగలరు బిడ్డా. బతికిన్నోల్లు బద్రం. రండి ఈడనే, ఉఉరి మద్దెనే నిలబడి పోరాడదాం. సస్తే ఊరికాద్నె సద్దాం. అడివిల్లోకి పోయి సచ్చేదేంది, ఎవురికోసరం?సూడు, అందరూ టివి సుసుకుంటా , కతలు రాసుకుంటా , రేత్తిరికి టిపినీ రెడి సేసుకుమ్తా బానే వుండారు. ఇంత మాత్రం తెలివి నీకు లేకపోయిందే. అంత సదూ కున్నావు! కవిత బాగుండాది. ఇట్టాటి కవితలు రాసే అవుసరం ఎవురికీ రాకుడుంటే బాగుంటాది. నాకొద్దీ కవిత. నాకు మన పిల్లలు తెలివిగా భద్రంగా నూరేళ్ళు సల్లగా వుండాలి. దానికి ఆళ్ళని సంపకుండా మనమే ఇంకేదైనా ఆలోసిచ్చాలి. బుద్దుడు మడిసేగాడా. నోటి మాటతో గెలిసాడు ఏలమందిని. అట్టా ఆలోసించండి. అంతే.

    • విన్నకోట నరసింహారావు says:

      < "వాళ్ళన్ని రెచ్చగొట్టి అడవుల్లోకి తోల్క పోతంది ఎవురు?"
      < "అడివిల్లోకి పోయి సచ్చేదేంది, ఎవురికోసరం?"
      < "నాకు మన పిల్లలు తెలివిగా భద్రంగా నూరేళ్ళు సల్లగా వుండాలి."

      అక్షరలక్షలు విలువ చెసే మాటలు చెప్పారు మీరు "ఎవడో ఎల్లయ్య" గారూ.

  18. shanti prabodha says:

    “నువ్వు యింకా బతికే ఉన్నావని చెబుతూ

    మాయమయి పోయింది”

    ఆ పిల్లలో ఎందఱో పిల్లలు ..నువ్వు బతికే ఉన్నావు , మా అందరినీ కాపాడుకోలేరా.. .ప్రశ్నిస్తున్నట్లుగా ..

  19. చందు తులసి says:

    ఎల్లయ్య గారూ మీ వాదన సరైనదే. పోరాడాలంటే అడవులకే పోనక్కరలేదు. మీరన్నట్లు ఊరి మధ్య నిలబడే కొట్టాడొచ్చు.
    కానీ కారణమేదైనా కిరాతకంగా బలైన ఓ ఆడపిల్ల బలిదానానికి సానుభూతి ప్రకటించలేమా..? ఒక్క చుక్క కన్నీరు కాల్చలేమా..?

    • ఎవడో ఎల్లయ్య says:

      మీకు నేను సరిగా కమ్యూనికేట్ చెయ్యలేక పోయినట్టున్నాను. బలి అయినది ఆడ అయినా మగ అయినా – నిజానికి ఇద్దరు బలి అయ్యారు. నా కడుపు రగిలి పోతుంది- వాళ్ళు అలా కావడానికి కారణమయిన రాజకీయం పైన-రాజకీయ నాయకుల పైన కాదు. నాయకుడు నాలోంచి నీలోంచి – నువ్వు , నేను ఎలక్షన్లప్పుడు జేబులో వేసుకున్న డబ్బులోంచి వచ్చాడు. నాయకుడిని ఎన్నుకునేది జనం. సమస్య కిందినుండి వచ్చింది. దాన్ని సరి చెయ్యకుండా రాజ్జ్య హింస, దొంగ నాయకులు అని ఎంత కొట్టుకులాడినా లాభం లేదు. పిల్లలిని ప్లాన్ ప్రకారం రాజకీయం కోసమే ఉద్యమాల లోకి దించుతారు. అసలు పెద్దలు బావుంటారు. వీళ్ళు అన్నయ్మై పోతారు. ఇది నిజం. పిల్లలు ఈ కుట్ర అర్ధం చేసుకోవాలి. తరవాత నిదానంగా ఆలోచించాలి. తెలుస్తుంది ఎలా సమాజాన్ని మార్చాలో, తాము ఎలా ఉండాలో, ఎలా రోల్ మోడల్స్ కావాలో. ఇలా అర్ధంతరంగా స్మశానానికి పొతే దేశం ఒక గొప్ప యోధుడిని కోల్పోతుంది. చచ్చేటంత ధైర్యం వుంది. అది అడవిలోకి పోయి దాక్కోకూడదు. ఇక్కడే నిలబడు. నీ ప్రాణం కాపాడు. అది దేశానికి చాలా అవసరం. దేశంలో ప్రానాలిచే ధీరులు అసలే తగ్గిపోతున్నారు. పిల్లాడా, ఓ పాపా నీ తల్లీ తండ్రులకు గర్భ శోకాన్ని ఇవ్వవద్దు. మీ బద్ధ్యాట్ ముఖ్యంగా వారిఎదలే వుంది. మిగిలినవన్నీ తరవాతే. ప్రతి మనిషిలో స్వార్ధం వుంది . ఎవరితో పోరాడి ఎవరికీ న్యాయం చెయ్యాలని చూస్తావు?

      .
      .
      .
      .
      .
      .

      • అజిత్ కుమార్ says:

        ఎవడో ఎల్లయ్య గారు చెప్పింది ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలలో తోటి మనుషులను చంపే పార్టీ గా పేరు పొందిన ఒక పార్టీకి సంబంధించిన విమర్శగా కనిపిస్తుంది. కానీ అన్ని రాజకీయ పార్టీలలోనూ ఈ రకమైన ధోరణి ఉంది. అన్ని పార్టీలలో చంపేవారూ చచ్చేవారూ ఉన్నారు. తగినంత సెక్యూరిటీ కూడా ఏర్పరచుకున్నా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వారి విషయమై కవులు స్పందించాల్సిన అవసరం కలుగదు. ఇక్కడ కవులు కవయిత్రులు ఎర్రరంగు తువ్వాలు/ చీర ధరించి కవిత్వం చెబితే అది చదివి పాపం యువకులు ఉత్తేజితులై అసువులు బాస్తున్నారు. ఆయా పార్టీలలోకి యువకులను ఆకర్షించేది కవులు, గాయకులూ, నటులూ, చిత్రకారులు వంటి కళాకారులే. వీరు ప్రజల బలహీనతలను రెచ్చగొట్టే విధంగా తమ కళారూపాలతో ఆకర్షిస్తారు. మీరు కూడా కవిత బాగుందని చెప్పారు. అలాగే యువకుల యాత్ర యడల మీ సంతాపాన్ని తెలిపారు. కవిత బాగుందని మెచ్చుకున్నారుగనుక మీకు తదుపరి కాలంలో ఏదైనా కారణాంతరాలవల్ల మనోనిబ్బరం కోల్పోగానే మీరు కూడా వెళ్ళి అమరులయ్యే అవకాశం ఉన్నంట్లుగా నేను ఆందోళనా ఉన్నాను. ఎప్పుడైనా రానున్న కాలంలో ఎవడో ఎల్లయ్యగారి త్యాగాన్ని కళారూపంగా చూస్తామేమో… ఏదో సామెత చెప్పినట్లు… మీరు జాగర్త.

  20. వార్తలు చదవుతుంటే విపరీతమైన కోపం .. ఈ కవిత చదువుతుంటే రక్తం సల సల మరిగిపోయింది .
    కాని ఎందుకో ఎల్లయ్య గారి స్పందన చదివిన తరువాత ఆలోచిస్తున్నాను .

  21. వల్లకాట్లో రావయ్య (కె.కె. రామయ్య) says:

    యీ ఎవడో ఎల్లయ్య గారు జీవన సాగరాన్ని యీదిన గజయీతగాడైనా లేదా అంతర్జాలాల సాహితీ సంవేదకుడైనా అయ్యుండొచ్చెమో. కాని వారి వాదన ఏకపక్షమైనదేమో. భారత స్వతంత్ర పోరాటం నుంచి నిన్నటి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమం వరకూ క్రొన్నెత్తుటి యువత బలిదానాలు లేకుండా జరగలేదనేది కూడా కఠోరమైన వాస్తవమేగా. బూటకపు ఎన్ కౌంటర్ మరణాలని, మానవ హక్కుల కాలరాసివెయ్యటాన్ని ఖండించటము కూడా చెయ్యాలేమో. ” పిల్లాడా, ఓ పాపా నీ తల్లీతండ్రులకు గర్భశోకాన్ని ఇవ్వవద్దు “, నిజమే కాని అంతకంటే భరించరాని దుర్భర లోక శోక నివారణ కోసం యువత అల్లల్లాడుతున్నారేమో. శృతితల్లి ఆత్మశాంతికై ప్రార్ధిస్తూ ~ ఇట్లు ఎవడో ఎల్లయ్య గారి అపిమాని వల్లకాట్లో రావయ్య.

    • ఎవడో ఎల్లయ్య says:

      అబిమానికి దణ్ణాలు రావయ్యా. గజ ఈతా లెదూ గొంగురా లేదు. నన్నుజుస్తే నువ్వు అచ్చ్ర్య పోతావు. నేనో శానా సాదా సీదా మడిసిని. ఆ పక్క దేశంలో ఒంటికి బాంబులు గట్టుకుని ఓ పిల్లోడు కనబడ్డాడు. ఇన్ని బామ్బులేక్కదియిరా చిన్న , దీపాలి చంనల్లున్డిగా అన్నా. పెద్దన్న అమెరికా కొని గట్టాడు అని చెప్పాడు. అంతే కిటుకు తెలిసిపోనాది. బాంబు మెల్లో ఎసుకునేతోడు సిన్న తమ్ముడూ, కట్టేటోడు పెద్దోడు. ఏడైనా ఇదే జరుగుద్ది.
      .
      .

      .

  22. b.ramnarayana says:

    వేరి గుడ్,వల్లకాట్లో రామయ్య!

  23. అజిత్ కుమార్ says:

    వల్లకాట్లో రావయ్య(కె.కె. రామయ్య) గారూ మీరు పత్రికలు బాగాచదివడానికి , ఎవరు ఏం చెప్పినా వినడానికి బాగా అలవాటు పడినట్లున్నారు.
    భారత స్వాతంత్ర్యం యువత బలిదానాల వల్ల రాలేదు. అలాగే ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కూడా యువత బలిదానాల వల్ల రాలేదు. దానికి రాజకీయాలున్నాయి.
    చట్టప్రకారము శాంతిభద్రతలు కాపాడాల్సిన ప్రభుత్వాలు బూటకపు ఎన్ కౌంటర్ లతో అడవులలో ఆయుధాలు మోస్తూ తిరుగుతున్న వారిని చంపడం గుర్తించారుగదా. మానవ హక్కులు హరించబడ్డాయంటే ప్రభుత్వం వారు ఊరుకుంటారా…
    ప్రార్ధన చేస్తే ఆత్మ శాంతిస్తుందా… ప్రార్ధన చెయ్యకపోతే కోపగిస్తుందా…
    ఇంతకీ ఎవడో ఎల్లయ్యగారిని ఎక్కడికో పంపే ప్రయత్నం చేస్తున్నట్లుంది….

    • ఎవడో ఎల్లయ్య says:

      తమ్ముడు అజితా, రెండో ప్రేపంచక యుద్ధం రాపోయుంటే మనికి స్వతంత్రం అప్పుడు వచెది కాదు (బహుసా). సిన్న సిన్న కుర్రోళ్ళు తెలంగాణా కోసరం సచ్చారు. దాన్ని గుడా నేను సమర్ధించను. ఆ పిలగాల్లని ఎంకరేజ్ సేసిన పెద్దోళ్ళు హాయిగా పిల్లా పాపలతో కాపరాలుజేసుకుంటా, పదవులు పంచుకుంటా వున్నారు. నిజమే గాదా. ఏదో పార్టీ అంతన్నఉ
      . నాకేటీ తెలీదబ్బ. నువ్వు నమ్ము నమ్మక పో. నా మనసుకి తోసిందే నే చెబుతా . నువ్వు ఎం జేసినా ఇంకోటి చెప్పా. ఎవుడో ఎల్లయ గాదని అందరు నన్ను కీతాగా జుస్తారనుకున్న. నే రాసింది గుడా సదివినారు. సంతోషం. నేను అర్ కె నారాయణ తమ్ముడు ఆర్కే లక్ష్మణ్ కామన్ మాన్ అంతరాత్మని. రాజకీయపోదిని గాదు. నేను పార్టీల్లో సెరేవోదినిగాదు. నా గురించి నువ్వు అలా అంచనా ఎయ్యమాక తమ్ముడా. నేను ఏరే. బొత్తిగా ఏరే.

      .

  24. Sadlapalle Chidambara Reddy says:

    కవిత చదువుతూంటె గుండెల్లొ ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్లయ్యిది. అద్భుతంగా రాశారు రామాసుందరి గారూ.

  25. balasudhakarmouli says:

    చాలా గొప్ప కవిత.. నిర్మాణం నచ్చింది.వస్తువు గుండెని మెలిపెట్టె.

  26. ఇక్కడ కల్పించుకోవాలనుకోలేదు. సరైంది కాదేమో. ఇదే విషయమై వ్యాసం లాంటిది రాశాను ఇంటర్మెట్ లోనే మరో చోట. (ఫేస్ బుక్ లోని ‘కవిత్వం’ గ్రూపు లో).

    ఇక్కడ కూడా నా మాటొకటి చెప్పాలని వుంది. ఎవడో ఎల్లయ్య పేరుతో రాసిందెవురో గాని, వారిని అభినందిస్తున్నా. పోరాట గీతాలు, స్మృతి గీతాలు… ఇవి మరణం చుట్టు తిరుగుతాయి గనుక బాగోక పోవడం వుండదు. ఆ కవితను చెడగొట్టడం కష్టం. ఎందుకంటే, సెక్సు లాగే మరణం తీవ్రోద్వేగ భరితం. రాయడం ఎంత సులభమో. ఆ కవిత పాఠకులను అంత సులభంగా ఉద్వేగ పరుస్తుంది.

    అందరూ కాదు, ఇక్కడ ఈ కవిత భలే వుందన్న వాళ్లు బహుశా ఏమీ కాకపోవచ్చు, ఇలాంటి వాటి నుంచి ఉద్వేగపడే వారిలో కొందరు… ఇది ఎవరి గురించి రాయబడిందో వారి వైపు పయనించే అవకాశం వుంది. వాళ్లు ఆ వుద్యమ లోతు పాతులు తెలుసుకుని వెళ్తే బాధ్యత వారిదే అవుతుంది. చాల సార్లు కవితలు చదివి, పాటలు విని ఉద్రేకాలకు లోనై, తమ జీవితాలలో అలాంటి భౌతికి ఉద్వేగాలు తోడైనప్పుడు, అటువైపు వెళ్తారు. అదిగో వాళ్ల గురించే ‘ఎవడో మల్లయ్య’జాగర్త చెబుతున్నది.

    మరో మాట. ఈ చర్చ ఇలా అజ్ఞాత నామాలతో అరకొరగా కాకుండా సీరియస్ గా జరగాలి. అసలు పేర్లతో బహిరంగంగా జరగాలి. చెడ్డ పేరొస్తుందా? రానీ, పిల్లల ప్రాణాల కంటె ఎక్కువా అనే తెగింపుతో జరగాలి. సొంత పేర్లతో చర్చ జరగపోతే, దానికి సీరియస్ నెస్ రాదు. ఎవడో మల్లయ్య గారూ!, వల్లకాట్లో రామయ్య గారూ! దారిన పొయ్యే దానయ్య గారూ! వారు వీరనక అయ్యలందరికి నమస్సులు. శ్రుతి తల్లికి, విద్యాసాగర్ రెడ్డికి, వివేక్ కి ఒక ప్రామిస్ చేద్దాం. మరింత మంది యువతీ యువకుల్ని నష్టపోక ముందే అడవుల్లో కాకుండా వీధుల్లో పోరాడే పద్ధతుల కోసం కృషి చేస్తామని. వీధుల్లో కూడా చనిపోతాం గాని అది బహిరంగం. నలుగురితో కలిసి వుంటుంది.
    సరిగ్గా చెప్పగలిగానీ లేదో.

  27. కె.కె. రామయ్య says:

    ” శ్రుతి తల్లికి, విద్యాసాగర్ రెడ్డికి, వివేక్ కి ఒక ప్రామిస్ చేద్దాం. మరింత మంది యువతీ యువకుల్ని నష్టపోక ముందే అడవుల్లో కాకుండా వీధుల్లో పోరాడే పద్ధతుల కోసం కృషి చేస్తామని ” అన్నఅనుభవజ్ఞులు హెచ్చార్కె గారికి వొందనాలు.

    హెచ్చార్కె గారూ, మీ కవితల్లానే మీ మాటా పదునుగా ఆలోచింపజేసేలా ఉంది. ప్రభుత్వ విదివిదానాలను ప్రభావితం చేసిన ఇటీవల కాలం (వీధుల్లో) ప్రజా పోరాటాలు ( యువత కూడా నడుం కట్టిన పోరాటాలు ) గురించి మీరు సూచిస్తున్నట్లుగా భావిస్తున్నాను. జనబాహుళ్యాన్ని సమీకరించి ఇలాంటి ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించగల గాంధీ తాతో, కమ్యూనిస్ట్ గాంధి సుందరయ్య అన్నో లాంటి వారు ఇప్పుడెక్కడున్నారో.

    ( అజిత్ కుమార్ గారూ, భారత స్వాతంత్ర్యం పోరాటం, ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం పోరులలో యువత బలిదానాల గురించి ప్రస్థావించానే కాని వాటి ఒక్కటి వల్లే ఆశయ సాధన జరిగిందని నేను అనలేదు. దయచేసి గమనించగలరు. అట్టాగే , తమ్ముడు ఎల్లయ్య పదికాలాలు సల్లంగుండాలనే నేనూ కోరుకుంటున్నా.)

  28. అజిత్ కుమార్ says:

    ఎల్లయ్య అన్నగారికి నమస్కారాలు. మీరు డబల్ స్టేటమెంట్ ఇచ్చారు. కవిత బాగుంది అన్నారు. కవితలో ఇచ్చిన సందేశాన్ని పట్టించుకోవద్దనీ, ప్రాణ త్యాగాలు చేసుకోవద్దని చెప్పారు. కవితలు చెప్పడం వివిధ కళారూపాలను అభివృద్ధి చేసుకోవడం ఈ రోజుల్లో విరివిగానే జరుగుతుంది. కానీ కవితకు ఒక ముఖ్య ఉద్దేశ్యం ఉంది. అది రసాస్వాదనకు వీలుగా ఉండడం. కళలు కల్పితాలుగావుండాలేగాని నిజ జీవితాలు వర్ణించ కూడదు. నలుగురికీ పరిచయమున్న వ్యక్తి గురించి ఆమె వివాహం గురించో, మరణం గురించో కవిత్వం , కధలు , నాటికలు ఇలాంటి కళా రూపాలుగా చెప్పకూడదు. అది కవిత్వ/కళల లక్షణం కాదు.
    అందుకే ఎవరైనా అకాల మృత్యువాతబడ్డప్పుడు శోకాలను నియంత్రించడానికి పెద్దలు ప్రయత్నిస్తుంటారు. త్వరగా దహన /ఖనన కార్యక్రమం నిర్వర్తించాలని చూస్తారు. మాజీ ముఖ్యమంతి వైయ్యస్సార్ మృతి చెందినప్పుడు కూడా ఒక టీవీ ఛానల్ నిరంతరాయంగా శోకదృశ్యాలను చూపడం వల్ల అనేకమంది ఆత్మహత్యలు చేసుకున్నవిషయం తమకు తెలియందేంకాదు.
    కనుక అన్నగారూ కళ కళకోసం కాదు ప్రజలకోసం అంటూ చంపబడిన వారిగురించి / నిజ జీవిత సంఘటనల గురించి కవితలు వ్రాయ కూడదని తమవంటి పెద్దలు చెప్పాలని నా ఆకాంక్ష. కవిత్వంలో కవిచేత చెప్పబడే వ్యక్తి నిజజీవితంలో ఎక్కడా గుర్తుపట్టేలాగా ఉండకూడదు. అది కవిత్వానికుండవలసిన ముఖ్య లక్షణం.
    మీరు బాగుందని మెచ్చుకున్న కవితలో ఎక్కువమందికి తెలిసిన, ఎంటెక్ చదివిన, తెలంగాణా ప్రత్యేకరాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఒక ప్రముఖ స్త్రీ హత్యగు గురియైన విషయాన్ని వర్ణంచబడి ఉన్నందువల్ల అది కవిత కాదు. అది నిరంతర శోకం. దాన్ని చదివినవారికి ఆ శవం, దాని స్థితి, చిత్రవధ చేయబడిన ఆనవాళ్ళు కనిపిస్తూనేవుంటాయి. దాన్న ఎవరైనా యువతీ యువకులు పదేపదే చదివితో అది వాళ్ళ మనో స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కవిత ద్వారా రసాస్వాదన జరగాలిగాని మనో వేదన కలుగకూడదు. తీవ్ర ద్వేషభావనలు జనించకూడదు.
    అన్నగారూ… తమవంటి పెద్దలు ఈ తరం కవులకు సరైన సందేశం ఇచ్చి దిశా నిర్దేశం చెయ్యాలని నా కోరిక.

  29. ఎవడో ఎల్లయ్య says:

    నువ్వు జెప్పింది నిజం. కవిత, కత మడిసికి సంతోషం కలిగించాల. ఏదన గుడా ఇయ్యోచ్చు. కానీ ద్వేషం పెంచగుడదు. ద్వేషాన్ని గుడా ప్రేమతో రాసే గోప్పోల్లున్నారు. ఓ రాత గాడు పలక కథ రాస్తే పలక లేని పిలగాడి కోసం ఎతికినానాననుకో. అట రాస్తే మడిసి సెddoడైనా ఆలోసిస్తాడు. ఒక్కోరు రాస్తే ఆళ్ళు ఈ కులమో మతమో గురుతు పట్టలేనంత ప్రేమగా అందర్నీ కలుపుకు రాసేస్తారు. మా బోటి మావులు మడుసులకి ఆల్లే దగ్గిరవుతారు. ఏవైనా నీను నీయంత గ్యనం గలోడిని కాదులే. ఈ కవిత సంగతి ఈడ వదిలేస్తా. లేపోతే ఆనక ఆల్లెవులో టివి వోళ్ళు ఇసయం పెద్ద జేసినట్టు వుంటది నా తంతు గుడా.

  30. ఇలా బలై పోయిన ఏ అమ్మ గన్న పరాయి పిల్లల గురించో కడుపు నిండా భోంచేసి కంప్యూటర్ ముందు కూకుని ఎంచక్కా కవితలు వ్యాసాలు రాసి ఫేస్బుక్ లో లైకులు కొట్టేద్దాం, మన పిల్లల్ని మాత్రం మంచి కాలేజీలో ఇంజనీరింగ్ లు చదివించి అమెరికా పంపిద్దాం! వీలుంటే సెలవుల్లో మనమూ వెళ్ళి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసొద్దాం

  31. గిరిజ గారూ! భారత సైన్యం త్యాగాల గురించి అందరం ప్రస్తుతిస్తుంటాం గదా. మరణించిన సైనికులకు గౌరవ వందనాలు, అవార్డులూ లాంటివి ఇస్తుంటారు గదా. – దీని పట్ల ఎలా స్పందిస్తారండీ మీరు? ఇలాగేనా?
    పొట్టి శ్రీరాములు ప్రాణాలర్పించారని ఆయన అమరత్వాన్ని గానం చేస్తుంటారు గదా…-దీని పట్ల?
    గాంధీ మహాత్ముడు , భగత్ సింగ్, అల్లూరి దేశం కోసం ప్రాణాలొదిలిన మహనీయులు…అని పిల్లలకు వారి పట్ల ఆరాధనా భావం కలిగిస్తుంటాం గదా -దీని పట్ల?

  32. p v vijay kumar says:

    బలవంతంగా అదుముకున్న ఒక్కో సారి కన్నీళ్ళు రావు…ప్చ్!
    బండ బారి పోయిన గుండెలంతే !
    Thanks for helping people like us !

  33. రాఘవ గారూ,

    ఉద్యమాల కోసమూ దేశ రక్షణ కోసమూ ప్రాణాలు అర్పించిన వారి మీద నాకు గౌరవమేఉంది. కానీ సరిహద్దులో సైనికుడు మరణించినపుడు మన రాజకీయ నాయకులు “ఇలాటి ఎన్నో త్యాగాల ఫలితమే ఈ విజయం. ప్రతి తల్లీ వీరమాత కావడానికి సిద్ధ పడాలి” అంటుంటారు చూశారా..కొడుకుల్ని కేం బ్రిడ్జ్ లోనూ, హార్వర్డ్ లోనూ చదువులకి పంపి? ఇదిగో ఇలాటి కవిత్వాలు చూసినపుడు నాకు వాళ్ళే గుర్తొస్తుంటారు.మనం మాత్రం ఏం తక్కువ తిన్నాం? మన పిల్లకాయల్ని భద్రంగా చూసుకుంటూ చదివించుకుంటూ అడవుల్లో బలై పోయిన అసహాయ శూరుల మీద నాలుగు కవితలు రాసి మూడో రోజుకు కొత్త టాపిక్ వెదుక్కుంటున్నాం!

    పిల్లలకు ఆ వైపుగా ఆలోచించే స్పృహ అయినా కల్గిస్తున్నామా? లేదే

    కడుపుకోత మిగిలింది ఆ తల్లి దండ్రులకేగా?

    ఇక పోతే ..ఏ రాష్ట్ర విభజన అయినా బలిదానాలు, ఆత్మ హత్యల మూలంగా జరుగుతుందంటారా ఏంటి మీరు? నిన్నెవరో వ్యాఖ్యాత రాసినట్టు అవన్నీ పైకి కనపడేవే కానీ విభజన రాజకీయాలు, కాలిక్యులేషన్స్ ఎప్పటికప్పుడు ఏర్పడతాయి.

  34. msk krishnajyothi says:

    మనిషి మృగం కాదు. మృగానికి అకారణమైన క్రూరత్వం వుండదు. మనిషి సృష్టిలో ఓ హీనమైన భాగం అనిపిస్తుంది-ఇటువంటి అంశాలు చూసినప్పుడు. ఒక ఆడపిల్లని హేయంగా అంతం చేయడం పైశాచికం. ఒక యువ ప్రాణాన్ని ఆర్పివేయడం అంటే ఒక తరపు అస్తిత్వాన్ని సవాలు చెయ్యడం. దీనికి బాధ్యత ఒకరిది కాదు. ఎల్లయ్య గారు చెప్పినట్టు ఒక నాయకుడు, ఒక పోలీసు, ఒక అధికారి కాదు. సమాజంలో వున్న ప్రతి మనిషికీ నైతిక బాధ్యతా వుంది. ప్రజాస్వామ్య సమాజంలో భాగంగా నేను కూడా దీనికి బాధ్యత తీసుకుంటున్నాను. ఈ సంఘటనని కనిపించని ఇటువంటి అనేక సంఘటనలని నేను నా పూర్తి గమనంతో ఖండిస్తున్నాను. సాటి మనిషి పట్ల ఒక మనిషి చూపిన ప్రేమ రాహిత్యాన్ని నేను ఖండిస్తున్నాను. దురాశ, దురహంకారం, హింస, నిర్లక్ష్యం, బలంతో దేనినైనా అనిచివేయగలం అనే మానవ(కొద్దిమంది మానవులలో కాదు, ఇంచుమించు అందరిలో ఈ ధోరణి వుంది. బలవంతుడు బలంతో, ధనవంతుడు ధనంతో, తుపాకీ అందుబాటులో వున్నాడు తుపాకీతో ఇలా ఎవరికీ అందుబాటులో వున్న వనరులతో వారు అధికులు కావాలని చూస్తున్నారు) వాదాన్ని నేను పరిపూర్ణంగా ఖండిస్తున్నాను. అలాగే, హింసని హింసతో గెలవాలి అనే వాదాలని కూడా నేను సమర్ధించలేను. కష్ట సాద్యంగా అనిపించినా దీనికి కారణమైన పరిస్టితులను చక్కదిద్దడానికి మనల్ని మనమే సంస్కరిమ్చుకోవాలి. ప్రజాస్వామ్మ్యాన్ని మరింత పకడ్బందీ గా నిర్మించుకోవాలి. ప్రపంచంలో వున్న అనేక పరిపాలనా విధానాల్లో అత్యుత్తమమైనది ప్రజాస్వామ్మ్యమే. కానీ ప్రస్తుత స్థితిలో పౌరులకి పౌరసత్వ శిక్షణ ఇవ్వాలి. ఇది అత్యంత ప్రధానమైన విషయం. నాయకునికి మరింత జటిలం అయిన నియామక విధానాలు రావాలి. పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేసి వారిలో సున్నితత్వాన్ని తీసుకురావాలి. ఇవ్వన్నే సాధ్యమే! నేనూ నువ్వూ అర్ధం చేసుకుని పని చేస్తే.

  35. Aranya Krishna says:

    అసలు విషయం ఏమిటంటే ఎన్ కౌంటర్లలో చనిపోయినవారి గురించి మనం మాట్లాడక పోతేనో, వారి త్యాగం గురించి మనం గుర్తు చేసుకోకపోతేనో లేదా వారిని మనం స్ఫూర్తిగా భావించి అలా వ్యక్తపరచకపోతేనో మన అంతరాత్మ పరిశుద్ధంగా వున్నట్లు. ఇదేమిటో చిత్రం వారి త్యాగాన్ని గుర్తిస్తే అది యువతని రెచ్చగొట్టటంట. “మీరు, మీ పిల్లలు సౌఖ్యంగా వుండాలి, వేరే తల్లి బిడ్డలు దళాల్లో చేరాలా” అంటూ దీర్ఘాలు తీస్తున్నారు ఒక్కో సున్నిత మనస్కులు.ఒక విషయం ఏమిటంటే శృతి విరసం సభ్యుడి కుమార్తె. వివేక్ సానుభూతి పరుల కుటుంబ సభ్యుడు. సానుభూతి పరులు తాము ఏమి చేస్తారో డబ్బా కొట్టుకోవాలా? మన పిల్లలు దళాల్లో చేరతామంటే వద్దంటే తప్పే. కానీ మనం తల్లిదండ్రులుగా వాళ్ళని ఏదో బళ్ళో వేసినట్లు దళాల్లో వేస్తామా? మీరంతా దేశభక్తి గలిగిన పౌరులు కదా, మరి మీ పిల్లల్ని భారతీయ సైన్యంలో ఎందుకు చేర్చరు? వివేకానందుడ్నో, కంచి కామకోటి పీఠాధిపతినో ఆరాధించే వారందరూ తమ పిల్లలకి సన్యాసం ఎందుకు ఇప్పించరు? ఉద్యమాల మంచి చెడులు ఖచ్చితంగా చర్చించాల్సిన విషయమే. కొంతమంది జెన్యూన్ గా పిల్లల త్యాగాలు వృధా అవుతున్నాయనుకుంటున్నారు. అలా జరుగుతుందనుకుంటే బాధ కలుగుతుంది. ఆ కోణం నుండి చర్చించండి. బాగుంటుంది. అంతేకానీ అసలు చనిపోయినవారి గురించి బాధపడితే ఇలా దాడి చేయటం నిర్హేతుకం.

  36. Revolution can’t be face(fake)bookied…dandaga maari sollu kaburla web discussion…better stop it….don’ you know about the Revolution…. Be Red than Dead

  37. రాణీ రాజ సులోచనా దేవి says:

    తాము నమ్మిన లక్ష్యం కోసం….బలైపోయిన ఓ అమ్మాయి త్యాగం మీద కవిత రాస్తే….తప్పు పట్టిన హెచ్చార్కే గారు….
    వాకిలి పత్రికలో పూడూరి రాజిరెడ్డి రాసిన పచ్చి బూతు కథ మాత్రం భలే వుంది అని సంబరపడ్డారు…
    అంటే రచయితలు అలాంటి పచ్చి పచ్చి బూతు కతలు రాయాలి.. యువత అది చదివి ఆయనలాగే బలేబలే అనాలి… అంతే కానీ త్యాగం గురించి రాయడం బూతు కన్నా నేరం.
    హెచ్చార్కే గారూ…బాగుంది.

Leave a Reply to Dr.Rajendra Prasad Chimata Cancel reply

*