భారత్ ను చూసి భయపడ్డాడు…చైనాలో నరకం చూశాడు!

స్లీమన్ కథ-10

కల్లూరి భాస్కరం

కల్లూరి భాస్కరం

 

భార్య ఎకతెరీనాతో అన్యోన్యక్షణాలు మళ్ళీ వెనకబెట్టాయి. ఎప్పటిలా ఎడమొహం, పెడమొహం. వాళ్ళ కాపురం చాలావరకూ భోజనం బల్లకు, ముక్తసరి మాటలకు పరిమితమవుతోంది. అయినా 1858లో రెండో సంతానం కలిగింది. ఈసారి ఆడపిల్ల, పేరు నతాల్య.  భార్యనుంచి దూరంగా పారిపోవాలన్న తహతహ ఆ ఏడాది వేసవిలో అతన్ని మరీ ఊపిరాడనివ్వకుండా చేసింది. మళ్ళీ సంచారానికి సిద్ధమయ్యాడు. ఈసారి తను చూడాలనుకున్న దేశాలన్నీ చూసిరావాలనుకున్నాడు.

మొదట స్వీడన్, డెన్మార్క్ లకు వెళ్ళాడు. వ్యాపార అవసరాలకోసం అప్పటికే అతను స్వీడిష్, డేనిష్ భాషల్ని నేర్చుకున్నాడు. ఈ దేశాల్లో తను అదనంగా నేర్చుకోవాల్సిందేమీ కనిపించలేదు. ఆ వెంటనే జర్మనీ వెళ్ళి తండ్రినోసారి చూసి ఇటలీ వెళ్ళాడు. అక్కడినుంచి గ్రీస్ వెళ్లాలనుకున్నాడు కానీ, అంతలో మనసు మార్చుకుని ఈజిప్టుకు దారితీశాడు. అక్కడ ఓ సాధారణ యాత్రికునిలా నైలు నదిపై దహబియాలో సెకండ్ కాటరాక్ట్ వరకూ ప్రయాణిస్తూ అరబ్బీ నేర్చుకున్నాడు. కైరో నుంచి వర్తకుల గుంపుతో కలసి జెరూసలెం వెళ్ళాడు. ఆ నగరం అతని కేమంత ఆసక్తిని కలిగించలేదు. స్మిర్నా, కిక్లాడెస్ దీవుల మీదుగా ఎథెన్స్ కు చేరుకున్నాడు.

[దహబియా: నైలునదిపై నడిపే ఒక రకం బోటు] [సెకండ్ కాటరాక్ట్: నదుల్లో ఎత్తైన గుట్టలు, రాళ్ళమీంచి నీళ్ళు వేగంగా కిందికి పడదాన్ని కాటరాక్ట్ అంటారు. నైలు నదిలో ఆశ్వాన్ నుంచి ఖార్టూమ్ వరకూ అలాంటి కాటరాక్టులు ఆరు ఉన్నాయి.]

ఎథెన్స్ లో ఒక మంచి హోటల్ లో దిగాడు. కొండ ఎక్కి పురాతనగిరిదుర్గా[ఎక్రోపోలిస్]న్ని చూశాడు. ఈ సందర్శన అతనికి పూర్తి సంతృప్తినిచ్చింది. ఎథెన్స్ ఎలా ఉంటుందని తను ఊహించుకున్నాడో సరిగ్గా అలాగే ఉందనుకున్నాడు. వెలుగులు విరజిమ్ముతున్న ఆ నగరం తనలోని నైరాశ్యపు చీకట్లను తరిమికొట్టిన అనుభూతి అతనికి కలిగింది. థియోక్లిటస్ విమ్పోస్ ఇచ్చిన పరిచయలేఖల సాయంతో కొంతమంది గ్రీకు పండితులను కలసుకున్నాడు. అతని గ్రీకు ఉచ్చారణ ఎక్కడా వంక పెట్టడానికి వీల్లేనట్టు ఉందని వాళ్ళు అభినందించారు. ట్రాయ్ వీరుడు ఓడిసస్ నివసించిన ఇథకా దీవిలో కొన్ని మాసాలు గడపాలని అనుకుంటున్నాననీ, దానిపై ఓ పుస్తకం రాసే ఉద్దేశం కూడా ఉందనీ అతను చెప్పినప్పుడు వాళ్ళు సంతోషించి భుజం తట్టారు. మరికొందరు పండితులకు పరిచయలేఖలు ఇచ్చారు.

తీరా అతను ఆ దీవికి బయలుదేరి వెళ్లబోతుండగా సెయింట్ పీటర్స్ బర్గ్ నుంచి తంతి వచ్చింది. 1857 ఆర్థికసంక్షోభంలో దివాళా తీసిన ఓ వర్తకుడు అతనిపై  హై కోర్టులో దావా వేసినట్టు అందులో ఉంది. నిజానికి ఆ వర్తకుడే స్లీమన్ కు కొంత మొత్తం బాకీపడ్డాడు. దానిని చెల్లించే బదులు స్లీమనే తనను మోసగించాడంటూ ఎదురు అభియోగం తెచ్చాడు. దావాను కొంతకాలం వాయిదా వేయచ్చునా అని అడుగుతూ స్లీమన్ తంతి పంపించాడు. కోర్టు వీల్లేదని చెప్పింది. దాంతో అతను హుటాహుటిన సెయింట్ పీటర్స్ బర్గ్ కు తిరిగి వచ్చాడు. ఆ రావడం రావడం అయిదేళ్లపాటు మళ్ళీ అక్కడినుంచి కదలలేకపోయాడు.

దావాలో అతనే గెలిచాడు. కానీ ఇతర ఆసక్తులకు మళ్ళీ దూరమయ్యాడు. యధాప్రకారం వ్యాపారంలో పీకల్లోతున కూరుకుపోయాడు. అదే అసహనం, చిటపటలు, ఏజెంట్లను దుమ్మెత్తిపోస్తూ ఉత్తరాలు…అయినాసరే ఏజెంట్లు అతన్ని సహించేవారు. కారణం-ప్రపంచం మొత్తంలోనే అతిపెద్ద దిగుమతి వ్యాపారుల్లో అతనొకడు. చెల్లింపులు సక్రమంగా జరిపేవాడు. పైగా అతనిప్పుడు వ్యాపారాన్ని ఇంకా విస్తరిస్తున్నాడు. ఇంతవరకూ ఆలివ్ నూనె, నీలిమందు వ్యాపారానికే ప్రధానంగా పరిమితమయ్యాడు. ఇప్పుడు కాటన్, తేయాకు వ్యాపారంలోకి కూడా పెద్ద ఎత్తున అడుగుపెట్టాడు.

1861లో అతను కీలకమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాడు. వ్యాపారం బహుముఖాలుగా వృద్ధి చెందింది. ఆ ఏడాదే మూడో సంతానం కలిగింది. ఈసారి కూడా ఆడపిల్లే. వ్యాపారవృద్ధిని దృష్టిలో ఉంచుకుని అమ్మాయికి నడేజ్దా అని పేరు పెట్టారు. ‘ఆశ’ అని ఆ మాటకు అర్థం. 1862-63లో పోలండ్ లో తిరుగుబాట్లు సంభవించి ఆ దేశంతో రష్యా వాణిజ్యాన్ని దెబ్బతీసినా, విచిత్రంగా స్లీమన్ వ్యాపారం మాత్రం అనూహ్యస్థాయిని అందుకుని అతనికి మూడో భాగ్యాన్ని మూటగట్టింది. కాలిఫోర్నియా బంగారం భూముల నుంచి, క్రిమియా యుద్ధం నుంచి గడించిన మొత్తాల కన్నా ఇది చాలా పెద్దది. ఒక్క నీలిమందులోనే పెట్టుబడి మీద 6 శాతం వడ్డీ గిట్టి, 15 లక్షల పౌండ్ల వార్షికలాభం సమకూడింది. తనింక ఎట్టి పరిస్థితుల్లోనూ దివాళా తీయబోనన్న భరోసా అతనికి చిక్కింది.

గృహజీవితం మాత్రం ఎప్పటిలా అశాంతిని రేపుతూనే ఉంది. ఇద్దరి మధ్యా ఎడతెగని కీచులాటలు. వాళ్ళ కలహ కాపురంలో ఇప్పుడు కొత్తగా పిల్లల పెంపకం, చదువు వచ్చి చేరాయి. సెర్గీ లో మంచి చురుకుదనం, తెలివీ ఉట్టిపడుతూ చదువులో బాగా రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రికి ఎంతో ఇష్టుడూ అయ్యాడు. పిల్లల పెంపకం, చదువే స్లీమన్ కు ఇప్పుడు అన్నింటికన్నా ముఖ్యంగా కనిపిస్తున్నాయి. వ్యాపారం విరమించడమే కాదు, ఏకంగా రష్యానుంచే పూర్తిగా మకాం ఎత్తేసి జర్మనీ వెళ్లిపోవాలన్న నిర్ణయానికి వచ్చాడు. భార్యతో విభేదాలు, పంతాలు కూడా అందుకు ప్రేరణ అయ్యాయి.

డ్రెస్డెన్[తూర్పు జర్మనీ నగరం]లో స్థిరపడే ఉద్దేశంతో అక్కడో ఇల్లు కొనుక్కున్నాడు. పిల్లల్ని తీసుకుని వెంటనే డ్రెస్డెన్ కు రమ్మని భార్యకు తంతి మీద తంతి పంపించాడు. ఆమె ససేమిరా రానంది. ‘నీతో దాంపత్యం నెరపాలన్న కోరిక నాకెంతమాత్రం లేదు, నువ్వు ఎవత్తెనైనా ఉంచుకున్నా నాకు అభ్యంతరం లే’దని తెగేసి చెప్పింది. దాంతో అతను బెదిరింపులు ప్రారంభించాడు. తను సెయింట్ పీటర్స్ బర్గ్ కు వచ్చి పోలీసుల సాయంతో పిల్లల్ని బలవంతంగా తీసుకుపోతాననీ, వాళ్ళను డ్రెస్డెన్ లో ఉంచి జర్మన్ చదువు చదివిస్తాననీ హెచ్చరించాడు. ఓ ఉన్నతాధికారికి కూడా భార్యపై ఫిర్యాదు చేశాడు. కానీ అతని గోడు ఎవరూ వినిపించుకోలేదు. ఏ ఒక్కరి నుంచీ సానుభూతి దక్కలేదు. వట్టి నిరంకుశుడివనీ, తిరుగుబోతువనీ భార్య దుర్భాషలాడింది.

అతను దిక్కు తోచని స్థితిలో పడ్డాడు. అంతలో స్టెఫన్ సొలొవీఫ్ అనే వ్యక్తినుంచి అతనికి రావలసిన ఓ భారీ మొత్తం అందింది. అది చేతిలో పడగానే రష్యానుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. వ్యాపారాన్ని అమ్మేశాడు. కొంత మొత్తాన్ని భార్య పేరున, పిల్లల పేరున పెట్టాడు. తీరా అవన్నీ అయిన తర్వాత అతనికి ఏం చేయాలో తోచలేదు. అయిదేళ్ళ క్రితం ఆగిపోయిన సంచారాన్ని పునఃప్రారంభించడం తప్ప మరో దారేదీ అతనికి కనిపించలేదు. దానికీ ఓ ప్రణాళికంటూ ఏమీలేదు. యాత్రానుభవాలను గ్రంథస్థం చేస్తూ తనో రచయితగా మారితే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడు. అయితే తన రచనలమీద అతని కేమంత గొప్ప అభిప్రాయంలేదు. తనవన్నీ పైపై రాతలే తప్ప లోతున్నవి కావనీ, అవి పునాదుల్లేని ఇంటిలా కుప్పకూలిపోతాయనీ ఓ సందర్భంలో రాసుకున్నాడు.

1864 ఏప్రిల్ లో ట్యూనిస్(ట్యునీసియా రాజధాని)లో ఉన్నాడు. కార్తేజ్ శిథిలాలను నోరు వెళ్లబెట్టుకుని చూశాడు. ఆ తర్వాత మరోసారి ఈజిప్టును సందర్శించాడు. అక్కడినుంచి భారతదేశానికి వచ్చాడు. ఇక్కడ అతని భాషానైపుణ్యాలేవీ పనిచేయలేదు. ఉర్దూ కానీ, ఇతర భారతీయభాషలు కానీ అతనికి ఆసక్తి కలిగించలేదు. సిలోన్, మద్రాస్, కలకత్తా, బెనారెస్, ఆగ్రా, లక్నో, ఢిల్లీ చూశాడు. హిమాలయ పాదాలదగ్గరికి వెళ్ళాడు. భారత్ లోని విపరీతమైన వేడి, రణగొణధ్వనులు అతన్ని భయభ్రాంతం చేశాయి. సింగపూర్ మాత్రం ఉల్లాసం కలిగించింది. చైనా వెడుతూ మధ్యలో ఆగిన జావా కూడా అతనిలో ఆనందం నింపింది. చైనా యాత్ర సుదీర్ఘంగానూ, తీరుబడిగానూ సాగింది. ఆ దేశం మీద అతను ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కనీసం అక్కడ గొప్ప పండితులు, విద్వత్తును గౌరవించేవారూ ఉంటారని తలపోశాడు.

కానీ చైనా పర్యటన అతనికి నరకం చూపించింది. అక్కడి తిండి, వసతి, దుమ్మూధూళీ, దృశ్యాలు వాసనలు- ప్రతిదీ అతని సహనాన్ని పరీక్షించాయి. చిన్నపాటి రెండు చక్రాల బళ్ళలో ప్రయాణం మరింత కంపరం కలిగించింది. చైనాలో తను కలసుకున్న ఒకే ఒక వ్యక్తిపై మాత్రం డైరీలో ప్రశంసలు కురిపించాడు. అతను చైనాలో స్థిరపడిన ఒక ఆంగ్లేయుడు. పేరు, రాబర్ట్ థామస్. అతను క్రైస్తవప్రచారకుడిగా ఉండేవాడు. తర్వాత మతం మీద నమ్మకం పోయి, చీఫూలోని కస్టమ్స్ హౌస్ దగ్గర దుబాషీగా ఉంటున్నాడు. స్లీమన్ అతన్ని ఇష్టపడడానికి కారణం, తనలానే అతనికీ చాలా భాషలు తెలుసు. రష్యన్, స్వీడిష్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, పోర్చుగీస్, ఇటాలియన్, జపనీస్, చైనీస్ భాషల్లో ధారాళంగా మాట్లాడగలడు. ఇంకా విశేషం ఏమిటంటే, స్లీమన్ నేర్చుకున్న పద్ధతిలోనే ఇతను కూడా ముందుగా మాటల్ని, వాక్యాల్ని రాసుకుంటూ వాటినుంచి కథలు అల్లుతూ ఈ భాషల్ని నేర్చుకున్నాడు. “వినమ్రత, తెలివీ మూర్తీభవించిన ఈ వ్యక్తి” కాస్త సంపాదన వైపు కూడా దృష్టి పెట్టి ఉంటే మరింత రాణించేవాడని స్లీమన్ రాసుకున్నాడు.

రెండు చక్రాల బండి మీద నానా అవస్థలు పడుతూ 1865 ఏప్రిల్ 30న తీసితిన్ నుంచి రాజధాని పెకింగ్ చేరుకున్నాడు. ఆ ప్రయాణంలో ప్రతి క్షణాన్నీ ఏవగించుకున్నాడు. బండిలో లోపల కూర్చోడానీకీ, నిలబడడానికీ కూడా వీలు కాక ఎక్కువ సేపు బండి మొగ దగ్గర రాట మీద కూర్చునే ప్రయాణం చేశాడు. సాయంత్రానికి పెకింగ్ చేరుకున్నాడు. అప్పటికి అతనిలో సహనమూ పూర్తిగా సన్నగిల్లిపోయింది. ఆ నగరం చుట్టూ ఉన్న పెద్ద పెద్ద రాతిగోడల్ని చూసి ముగ్ధుడయ్యాడు కానీ, లోపలికి వెళ్ళగానే మాత్రం భయపడిపోయాడు. హోటళ్లు లేవు. ఓ బౌద్ధ మఠంలో గది దొరికింది. కిరాయి 12 ఫ్రాంకులన్నారు. గీచి గీచి బేరమాడితే 6 ఫ్రాంకులకు తగ్గించారు. ఆ గదిని చూడగానే నీరుగారిపోయాడు. ఇటుకలతో పేర్చిన పడక. సన్యాసులు నీళ్ళు చల్లడంతో నేల అక్కడక్కడ బురద బురదగా ఉంది. చిన్న చిన్న టేబుళ్లు, స్టూళ్లు. గోడలమీద పెద్ద పెద్ద రాతపత్రాలు వేలాడుతున్నాయి. వాటి మీద చైనా భాషలో కన్ఫ్యూషియస్ సూక్తులు రాసి ఉన్నాయి. ఒక బౌద్ధమఠంలో వాటిని ప్రదర్శించడం అతనికి వింతగా అనిపించింది.

భోజనం కోసం వాకబు చేశాడు. ఈ సమయంలో భోజనం దొరకదని సన్యాసులు చెప్పారు. ఆకలితో, అలసటతో నిద్రలోకి జారిపోయాడు. పొద్దుటే అయిదు గంటలకు నౌకరు వచ్చి లేపాడు. ఓ గిన్నెలో చద్దివాసన కొడుతున్న అన్నం, గ్రీన్ టీ తీసుకొచ్చాడు. వాటిని చూడగానే అతను బిత్తరపోయాడు. దానికితోడు అది ఉప్పులేని చప్పిడి కూడు. టీలో పాలూ, చక్కెరా లేవు. ఇక్కడ పాలూ, చక్కెరా దొరకవని నౌకరు చెప్పాడు.  అతని చేత ఉప్పు తెప్పించుకున్నాడు. చోప్ స్టిక్స్ తో తినడం చేతకాక, వేళ్ళతోనే తీసుకుని తిన్నాడు. కత్తులు, ఫోర్కులే కాదు సరికదా; పాలూ, చక్కెరా కూడా లేకుండా వీళ్ళు ఎలా బతికేస్తున్నారనుకుని ఆశ్చర్యపోయాడు. వట్టి అడవిజనాలనుకున్నాడు.

నౌకర్ని పంపించి గుర్రాలు తెప్పించాడు. రోజంతా నగరంలో తిరుగుతూ గడిపాడు. ఎక్కడబడితే అక్కడ ముష్టివాళ్లు, చెత్త ఏరుకునే వాళ్ళు కనిపించారు. మరణశిక్షలు అమలు చేసే ఓ బహిరంగప్రదేశంలో తెగిపడిన శిరస్సులను చూసి భయవిహ్వలుడైపోయాడు. అర్థంపర్థంలేని అంత్యక్రియల తంతు చూసి విస్తుపోయాడు. కొన్ని దేవాలయాలను దర్శించాడు. వెలిసిపోయి పెచ్చులూడుతున్న దేవుళ్ళ వర్ణచిత్రాలు చూసి పూజార్లను తిట్టుకున్నాడు. దేవుళ్ళకు తొడిగిన పట్టు గౌన్లు చీలికలు పేలికలై దారప్పోగుల్లా వేలాడుతున్నాయి. అట్ట కిటికీలు కూడా ఎక్కడికక్కడ చిరిగిపోయి ఉన్నాయి. చుట్టూ దట్టంగా అల్లుకుపోయిన తీగలు ఆలయం మొత్తాన్నే తినేస్తున్నట్టు అనిపించింది.

మధ్యలో వర్షం పడి వీథులన్నీ బురద బురద అయిపోయాయి. అతనెక్కిన గుర్రానికి అడుగు తీసి అడుగువేయడం కష్టమైపోయింది. దాంతో అతనిలో కోపం నసాళానికి అంటింది.

అప్పటికి చైనా యువ సామ్రాజ్ఞి త్సూ షీ సింహాసనం మీద ఉంది. యాంగ్సీ లోయలో తైపింగ్ తిరుగుబాటు సాగుతోంది. మొత్తం దేశమే విస్తృతమైన మార్పుల దిశగా పయనిస్తోంది. కానీ స్లీమన్ డైరీ రాతల్లో ఆ ఊసు కొంచెమైనా లేదు. అతను పెకింగ్ లో గడిపింది, చూసింది ఒక్కరోజు. ఆ ఒక్క రోజు సందర్శనతోనే ఆ నగరం గురించి అనేక తొందరపాటు నిర్ణయాలు చేసేశాడు. ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ఊహించుకుంటూ కాగితాలు నింపేశాడు.

ఉదాహరణకు, అతనికా నగరంలో అక్కడక్కడ తెల్ల గ్రానైటుతో నిర్మించిన పేవ్ మెంట్ల తాలూకు శిథిలాలు, ప్రతిచోటా పురాతనకాలపు మురుగు కాల్వల శిథిలాలు, స్తంభాలపై వెలిసిపోయి తునకలు తునకలైన కళాకృతులూ, మట్టిలో సగం కూరుకుపోయిన విగ్రహాలు కనిపించాయి. ఈ నగరంలో అనేకచోట్ల బ్రహ్మాండమైన గ్రానైట్ వంతెనలున్నాయనీ, వాటిలో సగం శిథిలావస్థలో ఉన్నాయనీ ; ఈ శిథిలాలను బట్టి చూస్తే ఒకప్పుడు ఈ నగరంలో రకరకాల నైపుణ్యాలు కలిగిన గొప్ప నాగరికులు ఉండేవారని తెలుస్తుందనీ, ఇప్పుడీ నగరవైభవం అన్ని విధాలా క్షీణించిపోయి, అనాగరికులతో నిండిపోయిందన్నాడు. చప్టా చేసిన పరిశుభ్రమైన వీథులతో, అద్భుత ప్రాసాదాలతో, చక్కని మురుగు నీటి పారుదల వ్యవస్థతో విలసిల్లిన ఈ నగరం ఇప్పుడు మురికి ఓడే చవకబారు ఇళ్లతో తనే ఓ పెద్ద మురుగుకాల్వగా మారిపోయిందన్నాడు. మొత్తానికి నగరం మొత్తం భూమిలో సమాధై తవ్వకాలకు ఎదురుచూస్తున్నట్టు అతనికి కనిపించింది. అన్నింటినీ మించి శిథిలాలపై అతని కున్న మక్కువా, ఆసక్తీ ఈ రూపంలో బయటపడింది.

వాస్తవం ఏమిటంటే పెకింగ్ లో అప్పటికేనాడూ చప్టా చేసిన వీథులు, రాతితో నిర్మించిన మురుగునీటి కాల్వలు, గ్రానైట్ వంతెనలు లేనేలేవు.  చైనా గురించి, చైనీయుల అలవాట్ల గురించి ముందుగా తెలుసుకుని వాటిని సక్రమంగా అర్థం చేసుకుని ఉంటే అతని రాతలో ఇలాంటి పొరపాట్లు దొర్లేవి కావు. ఆ సహనం లోపించడమే అతనిలో సమస్య.  మెరిసిపోయే ప్రాసాదాలు కూడా అతనికి శిథిలాలుగా కనిపించడానికి కారణం, చుట్టూ ఉన్న చెట్ల ఆకులు వాటిని కప్పేయడం. బాహ్యపరిసరాలను సాదాసీదాగా ఉంచుకుని, లోపల అందంగా, కళాత్మకంగా తీర్చిదిద్దడం చైనీయుల అలవాటు. తను నగరంలో తిరిగినప్పటి వాతావరణం, తన అలసట, విసుగు కూడా తన పరిశీలనను ప్రభావితం చేస్తాయని అతనికి తట్టలేదు. తగిన అధ్యయనం, శిక్షణ లోపించడంతో అపోహలను, తప్పుడు అభిప్రాయాలనే నిజమని నమ్మి కాగితం మీద పెట్టడం ఇలాంటి విడ్డూరపు చిత్రణకు దారితీసింది.

ఆ తర్వాత అతను ప్రపంచ వింతలలో ఒకటైన చైనా గోడను సందర్శించాడు. అక్కడో చిన్న దొంగతనానికి కూడా పాల్పడ్డాడు…

(సశేషం)

 

మీ మాటలు

  1. ఎన్నో మంచి విషయాలు , కొత్త విషయాలు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు

మీ మాటలు

*