ఇంటికి వెళ్లే మనుషులు

 

 

– కందుకూరి రమేష్ బాబు

Kandukuri Rameshఫుట్ పాత్ మీది నుంచి ఇంటిముఖం పడుతున్న ఇద్దరు స్త్రీలను చూడండి.
అతి సాధారణమైన చిత్రమే ఇది. సామాన్యమైన నడకే వారిది.

కింద, ఆ కాలిబాట కింద జనమంతా ట్రాఫిక్ గా… వెహికిల్స్ తో రద్దీగా మారిన ఆ రోడ్డుపై…ఇరుకిరుగ్గా ఇబ్బంది పడుతూ వెళుతుంటే వీరు మాత్రం కాస్త నయం అనిపిస్తుంది. నిదానంగా ప్రధానంగా వెళుతున్నారూ అనిపిస్తుంది.

నడక మరి.
కాలిబాట మీది నడక చిత్రణ ఇది.
అంతే కాదనుకొండి.

వారలా ముదురు వర్ణాలతో నిండైన ఆశలతో, బయటకు కానరాని అంతరంగాలతో వెళుతుంటే బహిరంగంగా వారేమిటో తెలియడం కష్టమే గానీ, గమనిస్తే…ఒకామె తన చేత ధరించిన ఆ బుగ్లలు చూడండి. ఆమె తల్లి అని దృశ్యం చెప్పకనే చెబుతోంది.

+++

నగరంలో కూలీనాలీ చేసుకునే వాళ్లు, నాలుగో తరగతి ఉద్యోగులు ఎందరెందరో…
కానీ, యునిఫాం తీసేశాక మాత్రం వాళ్లు మనుషులుగా కానరావడం గుర్తిస్తాం.
ఆ మనుషులు అత్యంత యధాలాపంగా కానవచ్చినా కొంచెం గమనింపుతో చూస్తే మటుకు ఆకాశంలో అకస్మాత్తుగా పొడిచే హరివిల్లు మాదిరి వారు అనేక వర్ణాలతో కానవచ్చి అదృశ్యమైతారు. అనుబంధాల సింగిడిగా మెరిసి మాయమైతారు.

ఆఫీసులో ఉన్నప్పుడు వారు కేవలం పనిలో నిమగ్నమై ఉంటారు.
మనకు వారు పని మనుషులుగానే కనిపించి ఏ విశేషమూ ద్యోతకం కాదు.
కానీ, సాయంత్రం ఆరు అయిందా? వారు తల్లులవుతారు. భార్యలవుతారు. అక్కలవుతారు, చెల్లెండ్లవుతారు.

వారి నడకలో కూడా వారేమిటో తెలుస్తుంది.
వారు ఇంటికి వెళుతూ తీస్కెళ్లే వాటితోనూ తామేమిటో తెలిసి వస్తుంది.

ఈ చిత్రం అదే.

బంజారాహిల్స్ నుంచి వాళ్లు తిరిగి వెళుతుంటే, చేతిలో సంచి, ఆ సంచితో పాటు ఒకామె చేతిలో మూడు బెలూన్స్…దారి మధ్యలో ఆమె తన బిడ్డకోసం వాటిని కొనుక్కుని నడుస్తున్నదంటే ఉదయం నుంచి ఆ తల్లి మనసు ఎక్కడుందో ఇట్టే తెలిసిపోతుంది. ఈ చిత్రం అందుకే. ఆ మగువల్లో ఒకరిని తల్లిగా ఆవిష్కరించే ప్రయత్నమే.

మరొకామె చేతిలో నెమలీక ఉన్నది.
అది ఈ చిత్రంలో కనబడటం లేదుగానీ, మరొక చిత్రంలో స్పష్టం.
తాను ఒక నెమలి పింఛం రేకును చేత ధరించి నడుస్తూ ఉన్నది.

ఇట్లా ఇద్దరు.
ఆ  ఇద్దరూ ఏవో చిన్నగా సంభాషిస్తూ ఒక గాలి అల మాదిరిగా వెళుతుంటే చూడగలిగితే మనల్ని చుట్టేస్తారు.
చుట్టేసిన క్షణాన వారిని ఇలా చిత్రంగా నిలపాలనిపించింది.
తీస్తే ఇది. తర్వాత మరొకామె నెమలీకతో కానవచ్చింది.
అది వేరే దృశ్యం.

కానీ, పట్టించుకోకపోతే ఏదీ చిత్రం కాదు.
అసలు మనకేమీ తెలియదు.

వారలా రోజూ వెళతారు కాబోలు.
కానీ మనకేం తెలుసు, ఎవరు తల్లో మరెవరు భార్యో మనకేం తెలుసు?
ఒక చిత్రంగా వారిని నమోదు చేసుకుంటే ఆ చిత్రణ నుంచి వారిని కనిపెట్టడం కాస్త సులువు.

వారిద్దరూ అలా నిదానంగా మాటల వంతెన మీంచి పదం పదం దాటుకుంటూ వెళుతుంటే, అదొక ముచ్చట అని, ఇంటికి చేరేలోపు నడిచే ఒక ఆత్మీయ సంభాషణా చేతన అనీ, చూడగలిగితే ఆ ఇద్దరూ తమవైన ప్రపంచాలతో ఒక తల్లిగానో ఒక జవరాలిగానో తమ తమ స్థలాలకు చేరుతున్నారనీ తెలుస్తుంది.

సాయంత్రం ఇంటికి వెళుతున్నప్పుడు మనల్ని కూడా ఎవరైనా బంధిస్తే బాగుండు.
లేకపోతే కేవలం పనిమనుషులుగా కూడా మనల్ని ఎవరూ గుర్తించరే!
అందరం యజమానులమే అనుకుని, మనుషులుగా మనం జనారణ్యంలో కాటగలిసి పోతాం.

ఏమంటారు?

*

మీ మాటలు

  1. చందు తులసి says:

    నిజం రమేశ్ గారు.. అతి సాధారణ చిత్రాలే అనంత భావాలు అందజేస్తాయి. చూసే కళ్ళుండాలి మీ కెమెరా లాగా

మీ మాటలు

*