తరగతిగది హత్య

-అరణ్య కృష్ణ
కొమ్మలకు ఊగాల్సిన ఈ పూలేంటి
ఇలా ఉరికొయ్యలకు వేలాడుతున్నాయి?
 
మనలో చెట్టుతనం చచ్చిపోయిందిలే
****
 
పుస్తకాల బరువు మోయలేకో
ఊపిరి తీసుకోనివ్వకుండా వెంటాడే గడియారాన్ని తప్పించుకోలేకో
ప్రేమగా హత్తుకోవాల్సిన అమ్మనాన్నల ఆకాంక్షల కర్కశత్వాన్ని తట్టుకోలేకో
రక్తం జుర్రుకునే రాగింగ్ కి తలవంచలేకో   
దేహాల్ని కళేబరాలు చేసుకున్నారా చిట్టితల్లులూ?
 
తోటల్లేవ్ పాటల్లేవ్ అనుభూతుల పక్షుల్లేవ్
 
చదువొక పిశాచమై రక్తనాళాల్ని పేల్చేస్తుంటే
పుస్తకాలు భూతాలై గుండెకింది చెమ్మనంతా పీల్చేస్తుంటే
ఎదిగే మొక్కలాంటి జీవితం అస్తిపంజరమైపోతున్టే
నీళ్ళు పోయాల్సిన తోటమాలులందరూ
ద్రోహంతో వేళ్ళ మొదళ్ళలో విషం కుమ్మరిస్తుంటే
బతుకుమీద తేళ్ళు కొండేలతో పొడుస్తున్నట్లుంటుంది
****
 
చదువు వ్యాపారంలో
కొనుగోలుదారులే అమ్మకపు సరుకులు
బాల్య యవ్వనాలు తూకానికి అమ్ముడుపోతాయ్
ఇక్కడ పిల్లలందరూ పుట్టుకతోనే ఖైదీలు 
పసిపిల్లల వీపుల మీద
అక్షరాలు లాఠీచార్జీలై గద్దిస్తుంటాయి
స్కూళ్ళు కాలేజీలు హాస్టళ్ళన్నె జైళ్ళే
టీచర్లు హెడ్మాస్టర్లు వార్డెన్లందరూ పోలీసులే
బార్బ్ డ్ వైర్ ఫెన్సింగ్ తో ఎత్తైన గోడల మధ్య
చదువెంత క్రూరమైందో హెచ్చరించే ఆల్సేషియన్ల పహారాలో
దివారాత్రాలు భయం నిర్బంధం
క్లాసు నుండి క్లాసుకి అస్తిమిత యాంత్రిక పరుగులు
వికసించే వయసుల సంక్లిష్ట మనోనేత్రం మీద భీతావహ దృశ్యాల ముద్ర
పల్లానికి పరవళ్ళు తొక్కే హార్మోన్ల అలజడిలో ఉద్రేక నైరాశ్యల వెల్లువ
 
శతృదేశం కాన్సంట్రేషన్ క్యాంపుల్లో
యుద్ధఖైదీలు మాతృదేశం మీద బెంగపడ్డట్లు
అర్ధరాత్రి అమ్మ గుర్తుకొస్తే నాన్న తలంపుకొస్తే
ఉలిక్కిపడి లేస్తే
చుట్టూ నిద్రలోనే పాఠాలు వల్లెవేస్తూ పలవరించే
సాటి పాక్షిక అనాధలు
 
పశువుల కొట్టంలో కట్టేసిన దూడకైనా
పక్కనే పాలుతాపే పొదుగుల్నిండిన తల్లులుంటాయి
మరిక్కడ ఏ సన్నని ఇనుపమంచం
అమ్మ కౌగిళ్ళను మంజూరు చేయగలదు?
పోలీసు లాఠీల్లా పంతుళ్ళ బెత్తాలు భయపెట్టినప్పుడు
ఏ వసారాల గోడలు నాన్న భుజాల్లా కాపు కాయగలవు?
నెలకొకసారి అమ్మానాన్న మునివేళ్ళ ములాఖత్ ల కోసం ఎదురుచూపు
వాళ్ళొస్తారు
ఎదురు చూసిన భుజం మీద తలవాల్చితే బండరాళ్ళ స్పర్శ!
****
 
నిఘంటువుల్లో కొత్తపదాన్ని చేర్చండి
ఎన్ కౌంటర్, లాకప్ డెత్ తో పాటు  
తరగతిగది హత్యని!
*
aranya

మీ మాటలు

  1. Dr. Koganti Vijaya Babu says:

    Very timely and beautiful Aranya Krishna garu.

  2. విలాసాగరం రవీందర్ says:

    వర్తమాన కార్పోరేటు చదువు ఖార్కానల దృశ్యం యథాతథంగా అక్షరీకరించారు…

  3. Chimata Rajendra Prasad says:

    గుండెల్ని పిండిన యదార్థ దృశ్యం. congratulations .

  4. కార్పొరేట్ చదువుల అఘాయిత్యాన్ని, పసి తనాన్ని చిదిమేయడాన్ని చాలా చక్కగా ఆవిష్కరించారు.
    అక్కడక్కడా వున్న అక్షరదోషాల్ని సరి చేస్తే ఇంకా బావుంటుంది.

  5. shanti prabodha says:

    మాయమైపోతున్న బాల్యపు యదార్థ దృశ్యాన్ని కళ్ళ ముందు ఆవిష్కరించారు

  6. వనజ తాతినేని says:

    హృదయం బరువెక్కింది. అక్షరమక్షరంలో ఆవేదన ఉంది .

  7. T. Chandra Sekhara Reddy says:

    అరణ్యకృష్ణ గారికి,

    అభిప్రాయం వ్యక్త పరలేనందుకు అన్యధా భావించవద్దు. హృదయంలో కలిగిన కొన్ని సంచలనాలకి అక్షరాలు కొలమానాలుగా ఒక్కో సారి అస్సలు, అస్సలంటే అస్సలు పనికి రావు.

    టి. చంద్రశేఖర రెడ్డి

  8. T. Chandra Sekhara Reddy says:

    చూశారా, వ్యక్తపరచలేనందుకులో,’చ’కూడా మిస్ అయింది.

  9. “బాల్య యవ్వనాలు తూకానికి అమ్ముడు పోతాయ్. శత్రుదేశం కాన్సంట్రేషన్ క్యాంపులలో యుద్ధ ఖైదీలు మాతృదేశంమీద బెంగ పడ్డట్టు.” ..పూలు ఉరికొయ్యలకు వేలాడుతుంటే.. చెప్పలేని బాధేస్తోంది అరణ్యకృష్ణ గారూ. చాలా బాగా రాశారు.

  10. వాణి says:

    అద్భుతంగా రాశారు

  11. Mandapaka Venkata kameswar rao raju says:

    వన్ అఫ్ ది బెస్ట్ ……ఫ్రొం Aranya Krishna గారు ….

    • Aranya Krishna says:

      ధన్యవాదాలు మండపాక కామేశ్వర రావు రాజు గారు.

  12. Sadlapalle Chidambara Reddy says:

    ఏమి మాట్లాడ్దామన్న ఎ అక్షరాలూ సహకరించవు!! కారణం కరిగి కన్నీళ్లై ప్రవహిస్తూ వాటిలొ అవే దూకి రొదిస్తూ ….

  13. శుభోదయం సార్!
    ‘తరగతి గది హత్య’ చదివాను. గుండె గదిలో ప్రవహిస్తున్న కన్నీటి జలపాతాల వెల్లువకు అడ్డుకట్ట వేయలేక..మౌనంగానే మనసున నీరాజనాలర్పిస్తూ…మీ కవితాభిమాని తిప్పేస్వామి

  14. ఎవడో ఎల్లయ్య says:

    నిజం జెప్పవు తమ్ముడూ. బిడ్డని బడికాడ వొదిలి చేతులు దులుపుకోకండా అమ్మ అబ్బలు ఏదో రకంగా కాపుగాయాల. ఊర్క్నే ఏడస్తా కుకోకుండా నా సుట్టుపక్క బిడ్డలని ఈ దినం నుండీ నే కాపుగాసి నాకుకుదిరినంత కాపాడతా-ఇది నా పెమానం.

Leave a Reply to వనజ తాతినేని Cancel reply

*