మూసిన కనురెప్పల్లో…

 
– జయశ్రీ నాయుడు
కొన్ని ప్రవాహాల్లో తడుస్తుంటాం
కొన్ని వెచ్చదనాలై కరిగిపోతాం
అడవిలా అగమ్యగోచరమైన కాలం లో
గాలివాటుగా పెనవేసుకున్న అడవి మల్లెలం
వెచ్చదనంలా ప్రవహిస్తూ
ఊపిరి పలకరింపులైనప్పుడల్లా
కాలం అనుభూతుల గలగలల్ని
కొన్ని హృదయపు శృతుల్లో బంధించుకుంటుంది
చిగుళ్ళు కనిపించని పరిచయాల మొక్కల్లో
పూయని పూల సొగసులు దాచుకున్న మనసు మోహంలా
ఏరుకొచ్చిన క్షణాల్ని పోగేసుకుని
ఆనందాల్ని అత్తరులా
మూసిన కనురెప్పల్లో అద్దుకుంటాము!
పరిమళాలే పాటలౌతూ
గడియల్లా ఘడియలో పెనవేసుకుంటాయి
అడుగుల జాడలు మిగలని దారిలా జీవితం వున్నా
నడకలో తోడుకూడిన గుండె చప్పుళ్ళు చాలవూ
శ్వాసగా ఆశని నింపుకుంటూ
ఎన్నో అక్షరాలుగా కలల్లో గుబాళించేందుకు!
*
jayasri

మీ మాటలు

 1. srivasthava says:

  ఊపిరి పలకరింపులైనప్పుడల్లా
  కాలం అనుభూతుల గలగలల్ని
  కొన్ని హృదయపు శృతుల్లో బంధించుకుంటుంది
  చిగుళ్ళు కనిపించని పరిచయాల మొక్కల్లో
  పూయని పూల సొగసులు దాచుకున్న మనసు మోహంలా
  ఏరుకొచ్చిన క్షణాల్ని పోగేసుకుని ( ఈ లైన్స్ చాల బాగున్నై )

 2. Jayashree Naidu says:

  థాంక్యూ శ్రీ వాస్తవ గారూ

 3. వాసుదేవ్ says:

  కలలకీ అత్తరు సువాసనల గుభాళింపులద్దే మీ వాక్యాల రేర్ గా పలకరించినా సమ్మోహనమే జయా జీ!

  • Jayashree Naidu says:

   దేవ్ జీ…

   కొన్ని అనుభవాలు అలా నాచుపట్టేసి మనసుని వదలక
   అక్షరాలుగా తర్జుమా అయేందుకు కూడా మొరాయిస్తాయి…
   :)

 4. Sadlapalle Chidambara Reddy says:

  కళల గుబాళింపులు అవి … కలలు కావు !!

  • Jayashree Naidu says:

   కళలకు మొదటి అడుగులు కలల్లోనే కదా మొదలు…

   థాంక్స్ ఫర్ ది కామెంట్ రెడ్డి గారూ

 5. Beautiful Mam !!

 6. Dr.Vijaya babu,Koganti says:

  “…అడుగుల జాడలు మిగలని దారిలా జీవితం వున్నా
  నడకలో తోడుకూడిన గుండె చప్పుళ్ళు చాలవూ…” బ్యూటిఫుల్ జయశ్రీ గారు!

 7. Jayashree Naidu says:

  థాంక్స్ అ లాట్ డాక్టర్ విజయ్ కోగంటి గారు

మీ మాటలు

*