మట్టి పరిమళం ఎగజిమ్మిన కధలు

 

 

రమాసుందరి

రమాసుందరి

కొంతమంది వ్యక్తులు ఉంటారు. స్వాప్నిక సుషుప్త అవస్థలో మనకు అత్యంత చేరువగా ఉంటారు. స్నేహంగా స్పర్శిస్తారు. ప్రేమగా సంభాషిస్తారు. అమితంగా స్పందిస్తారు. మన ప్రాచీన స్మృతిలో పోగొట్టుకొన్నదాన్నేదో గుర్తు చేస్తారు. చెయ్యి పట్టుకొని అందమైన తోటల్లోకి, అద్భుతమైన సమాజంలోకి మనల్ని విహంగ విహారం చేయిస్తారు.  అలాంటి వ్యక్తులు కధలలో పాత్రలుగా మారితే నిజ జీవితంలో మనసు మారుమూలల్లోకి వెళ్ళి పేరుకొని పోయిన అశుచిని శుద్ధి చేస్తారు. ఆ పాత్రలే ఒక సైన్యంగా మారి మనిషిలో దాగున్నశత్రువును హతమారుస్తాయి. అలాంటి  పాత్రలు ఉన్న కధలు మనిషి పరిమళంతో, స్వచ్ఛమైన స్నేహ పరిమళంతో, కులరహిత సమాజ పరిమళంతో, కల్తీలేని ప్రేమ పరిమళంతో, నికార్సైన అనుబంధాల పరిమళంతో, బలమైన జ్ఞాపకాల పరిమళంతో, అడవి పరిమళంతో, త్యాగాల పరిమళంతో, సహజీవన సౌందర్య పరిమళంతో, సమసమాజాన్ని స్వప్నించిన  యువతీ యువకుల ఆశల పరిమళంతో .. యిన్ని పరిమళాలు కలగలిసిన  ‘జాజి పూల పరిమళం’తో మనసంతా సుగంధం చేసి సంతోష పెడతాయి.

‘జాజిపూల పరిమళం’ పుస్తకం (కధలు) ఎందుకు చదవాలి అంటే నేను చాలా కారణాలు చెబుతాను. అవన్నీ నా యిష్టానికి, తత్వానికి సంబంధించినవి. వాటితో సంబంధం లేకుండా  ‘కధను ఎంత సులభంగా చెప్పవచ్చో’, ‘సంభాషణలు ఎంత సహజంగా రాయవచ్చో’, ‘కధనాన్ని ఎంత నిరలంకారంగా నడిపించవచ్చో’ ఈ కధల ద్వారా  నేర్చుకోవచ్చు. వీటన్నిటిని మించి పుస్తకం ద్వారా అబ్బే సంస్కారం ఒకటి ఉంటుంది. దాన్ని ఈ కధల ద్వారా పుష్కలంగా అందుకోవచ్చు. సమాజాన్ని అపోసన పట్టిన వ్యక్తుల నుండి జిజ్ఞాస గలిగిన వ్యక్తులు అందుకొనే ఎరుక  అద్భుతమైన ఆహ్లాదాన్నిఇస్తుంది. మనసు తెరిచి మంచిని ఆహ్వానించే వాళ్ళు ఆ ఆహ్లాదాన్ని అమితంగా పొందవచ్చు. దాదాపు నలభై కధలు ఉన్న ఈ పుస్తకంలో కొన్ని కధలు పురుషాధిక్యత, స్త్రీ పురుష సమానత్వం, సామాజిక కుటుంబిక దొంతరలలో స్త్రీలపై జరిగే అణచివేతలను  మైక్రో లెవెల్ లో చర్చించాయి. అయితే ఈ పుస్తకంలో సగం కధల్లోని కధా వాతావరణం పాఠకులకు కొత్తగా ఉంటుంది. కొన్ని సమస్యలు కూడా కొత్తవే. మనుషుల మధ్య సంబంధాలకూ, అనుబంధాలకూ, త్యాగాలకూ, సంతోషాలకూ కొత్త అర్ధం ఈ కధలు తెలియచేస్తాయి. ఈ కధల్లో ప్రధాన పాత్రలు స్త్రీలే. చైతన్యవంతులైన స్త్రీలు సమాజాన్ని అర్ధం చేసుకొనే క్రమాన్ని అద్భుతంగా రాశారు షహీదా.

కులం మనిషి జీవితంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది? ‘దేవుడే అందర్నీ చేశాడు కాబట్టి మనుషులందరూ సమానమే’ అనే ప్రాధమిక భావన నుండి ‘కులం తోటివారి నుండి మనల్నివేరు చేస్తుంది’ అనే స్పృహ పిల్లలకు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా పరిణితి చెందినట్లు. అగ్రకుల లాభ ఫలాలు అనుభవం అయ్యే పిల్లల్లో కూడా కులం లేని జీవితంలో ఉన్న మాధుర్యం, సహజత్వం అనుభవం అయ్యాక యిక దాన్ని ప్రతిఘటించటం అనివార్య చర్య అవుతుంది. ఆ ప్రతిఘటన ఒక్కోసారి నిరసనగా  ‘మీరు! మేము??’ కధలో శ్రీవిద్య లాగా బాత్రూమ్ లో నీళ్ళు పారబోయటం దగ్గర కనిపిస్తుంది.  ఇంకోసారి ‘విభజన రేఖలు’ కధలో శిరీషలాగా తనకు కూడా వీరన్నలాగే ఆకులోనే అన్నం పెట్టమని భీష్మించిన ధిక్కారంగా మారుతుంది. కులం గురించి ఇంకా గాఢంగా చర్చించిన కధ ‘ఒకటీ, ఒకటీ ఎప్పుడూ రెండేనా?’  సమాజపు కట్టుబాట్లను ఎదిరించిన ‘సక్సెస్ ఫుల్ దళిత యువకుడు’, ‘ప్రోగ్రెసివ్ అగ్రకుల యువతు’ ల మధ్య చివురించిన ప్రేమ వారిద్దరికి సంబంధించినదైనా పెళ్లి మాత్రం సమాజానికి సంబంధించిందనే అవగాహన ఈ కధ నేర్పుతుంది. ‘చదువుకొని పైకి వచ్చిన దళిత యువకులను అగ్రవర్ణ యువతులు ఎగరేసుకొని పోతే మా దళిత ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది కదా’ అనే ప్రశ్నకు చలించి పోయిన మౌనికకు ‘కులాంతర వివాహాలు చేసుకొని కుటుంబానికి పరిమితం అయితే యిలాంటి ప్రశ్నలే వస్తాయి. కుల నిర్మూలన కోసం ఆ దంపతులు కృషి చేస్తేనే ఆ వివాహానికి నిజమైన అర్ధం ఉంటుంది.’ అని అంతర్లీనంగా కధ యిచ్చిన జవాబు ఎంత సముచితమైనది! ఈ జవాబు విప్లవోద్యమంలో కలిసి పని చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకొంటున్న అనేకమంది యువతీ యువకులకు చక్కటి వివాహ సందేశం. గుంపుగా కలిసి తిరిగే చిన్న చేపలు అన్నీ కలిసి ఒక పెద్ద చేపను స్ఫురింప చేస్తాయనే అనే అర్ధవంతమైన ప్రతీకతో కధ ముగుస్తుంది.

ఈ పుస్తకంలో చక్కటి ప్రేమ కధలు కూడా ఉన్నాయి. ఆ ప్రేమలు రూపం, డబ్బు, హోదా, కెరీర్ లాంటి కృతకపు విలువలను మోసే వ్యక్తులను కాకుండ వస్త్ర, అలంకార రహితమైన వ్యక్తి నికార్సైన ఆత్మలను ప్రేమిస్తాయి. వ్యక్తులతో అనుసంధానమైన సామాజిక బాధ్యతలను ప్రేమిస్తాయి. వ్యక్తి ప్రేమ నుండి సామాజిక ప్రేమకు అవి ప్రవహిస్తాయి. అందుకు సంబంధించిన షరతులకు తలవొగ్గక పోతే ఆ ప్రేమను తిరస్కరిస్తాయి. కొంకణీ  వెళ్ళే రైలులో తారసపడిన ఒకప్పటి ప్రియురాలు ‘సుజీ’ చిక్కిపోయి, కళ్ళు గుంటలు పడి, వెంట్రుకలు నెరిసి పోయి ఉన్నా ఆలోచనలలో యవ్వనంగానే ఉంది. ఆరెంజ్డ్ మారేజ్ చేసుకొన్న ఆమె ఒకప్పటి ప్రియుడు మందుల కంపెనీలో పని చేస్తుంటే ఆమె ఒక మతోన్మాద వ్యతిరేక సంస్థలో పూర్తి కాలం పని చేస్తుంది. ఇద్దరూ గతాన్ని వడబోసుకొంటారు. ఈ కధలో బాబ్రీ మసీదు కూడా ఒక పాత్రే. ప్రేమికులను విడదీసిన దుష్ట పాత్ర. ఆ దుష్టత్వం పరోక్షంగా వాళ్ళిద్దరినీ విడదీసింది. ‘నేను లేక పొతే తను ఉండలేదనే అనుకొన్నాను అన్నాళ్ళూ …. కానీ నాలాంటి బలహీనుడికే తన అవసరం ఎక్కువుందని అర్ధం కావడానికి ఎంత కాలం పట్టిందో … తనదేముంది తన విలువలతో బతికేస్తుంది …’ అనుకొంటాడతను. ‘పైకి ఎంత అభ్యుదయంగా ఉన్నా నీలో తొంగి చూసిన ఆ హిందుత్వవాదిని ఆ రోజు చూసి తట్టుకోలేకపోయాను… నిన్నే కాదు ఎవర్నీ, దేన్నీ సగం సగం ప్రేమించడం రాలేదురా, ఇప్పటికీ అంతే …’ చెప్పుకొంటుందామె. అయితే ఆమె ప్రేమద్వారా పొందిన ఉన్నత సంస్కారం అతనిలో నిగూఢంగా దాగి ఉంది. గుజరాత్ అల్లర్లలో తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డను తెచ్చి సాక్కుంటాడు. ఆ విషయం అప్పటికే తెలుసుకొన్న సుజీ అతని ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళింటికి అతిధిగా వెళ్లడానికి ఒప్పుకోవటంతో కధ ముగుస్తుంది.

అలాంటిదే ఇంకో కధ  ‘విప్లవంలో ఓ ప్రేమ కధ’. ‘అతను నక్సలైట్లలో కలుస్తాడు నాకు తెలుసు. బతుకు పాడు చేసుకోకు’ ఎస్సై హితబోధ. ‘అతనలా ఉంటాడనే నేను యిష్టపడింది. అందుకోసం వదిలేయమంటాడేంటి?’ ఆమె విస్మయం. ఆమె విశ్వాసం ఆమె ప్రేమ మీద మాత్రమే కాదు. అతని ప్రిన్సిపుల్స్ మీదా, జీవితం పట్ల అతనికి గల దృక్పధం మీద, అన్యాయాన్ని ఎదిరించి దేనికైనా సిద్దపడే అతని స్వభావం మీద. ఇతరుల కోసం త్యాగం చేసే తత్వం, నిస్వార్ధం లేకుండా అతను లేడు. అతని పై శ్యామల ప్రేమా ఉండదు. విప్లవానికి వారిద్దరూ ఉండరు. ప్రేమ అనే మాటను ధైర్యంగా ఉపయోగించే అవకాశం కల్పిస్తుంది శ్యామల. ఆ నమ్మకంతోనే అడివికి వచ్చి అమరురాలు అవుతుంది.

మదర్ థెరేసా మళ్ళీ మళ్ళీ పుట్టాలని కోరుకొనే వాళ్ళకీ, మదర్ థెరేసాల అవసరమే లేని సమాజం రావాలని కోరుకొనేవాళ్ళకు ఉన్న తేడా ఎంత? సమాజాన్ని యిలాగే ఉంచి ఉద్ధరిద్దామని అనుకొనేవాళ్ళకూ, దాన్ని సమూలంగా మార్చివేయాలని కోరుకొనే వాళ్ళకూ ఉన్నంత తేడా. బడుల్లో సోషల్ వర్క్ క్లాసుల గురించి క్రిటికల్ గా రాసిన కధ ‘సోషల్ వర్కూ – సోషలిజమూ’. ఇంచుమించు ఇలాంటి సందేశాన్నే మోసుకు వచ్చిన కధ ‘జ్ఞాపిక’.  ‘లోపలి’ నుండి వచ్చిన ఒక మహిళా రోగి నర్మద బాధ్యత సంతోషంగా స్వీకరిస్తాడు శంకర్. కొద్దిగా కోలుకొన్నాక ఆసుపత్రి నుండి యింటికి తీసుకొని వెళతాడు. ఆమెతో సాహిత్యం, సినిమాల గురించిన అభిప్రాయాలు పంచుకొంటాడు. కలిసి వండుకొని కబుర్లు చెప్పుకొంటారు. ఆమె ప్రేమ కవిత్వాన్ని బిడియంగా చదువుతుంటే విని ఆస్వాదిస్తాడు. కొనే ప్రతి వస్తువు దగ్గర ఆమె ‘ప్రజల డబ్బు’ అంటూ జాగ్రత్త పడుతుంటే అబ్బురపడతాడు. ఆమెతో గడిపిన ప్రతి క్షణం ఒక గొప్ప అనుభవంగా, పాఠంగా దోసిలి పడతాడు. ఆమె ‘లోపలికి’  వెళ్ళి పోయే రోజు దగ్గర పడుతుంది. దిగులుగా అలిగి కూర్చోంటాడు. ఎన్ని రోజులుగానో అతనిని వేధిస్తున్న ప్రశ్నకు జవాబు చెప్పటానికి ఆమె సంసిద్ధం అవుతుంది ఆమె అప్పుడు. ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె దాచుకొన్న భరిణా, అందులో వంద రూపాయల నోటూ ఎవరి జ్ఞాపికలు? ప్రేమించి ఆమెతో అడవి దాకా అడుగులు వేసిన ఆమె భర్తవనే అనుకొంటాడు. కానీ ఆమె వెళుతూ చెప్పిన చివరి పాఠం అన్నిటి కంటే అమూల్యమైనది. డబ్బే లేని సమాజం రావాలని కోరుకొనే వాళ్ళు డబ్బు దాచుకోనవసం లేదు. ఆ నోటు ‘తీసుకోవటమే తప్ప యివ్వటం చేతకాని’ ఆమె చిన్నప్పటి పనిమనిషి యిచ్చినది. పార్టీ తనలాంటి పేద ప్రజల విముక్తి  కోసం పనిచేస్తుందనే నమ్మకంతో పంపిన పార్టీ చందా అది. అలాంటి లక్షలాది విప్లవాభిమానుల ఆశలనూ, కోరికలనూ మనసులో మోసుకొని నర్మద ‘లోపలికి’ వెళ్ళి పోతుంది.

పార్టీలు, ప్రజా సంఘాలు ఎలా నడవాలి? ఎవరి కోసమైతే పని చేస్తున్నామో ఆ  పేద ప్రజల మీదే ఆర్ధికంగా ఆధారపడితే వాళ్ళు ఏమి యివ్వగలరు? అసలు వాళ్ళను ఎలా అడగగలం? ఇలాంటి సందేహాలు విప్లవోద్యమంలో పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక దశలో వస్తాయి. ఆ సందేహాలకు చెంప చెళ్లుమనే సమాధానం ‘అర్ధ శేరు ధాన్యం’ కధ చెబుతుంది. సంఘం కోసం బియ్యం, డబ్బులు అడుగుతూ పేద దళిత వాడకు వెళతారు. ఎవరికి తోచింది వాళ్ళు కాదనకుండా యిస్తారు. దరిద్రం, అనారోగ్యం, పోషహాకార లోపం పిల్లల్లో, మహిళల్లో కొట్టొచ్చినట్లు కనబడుతుంది. చివరి ఇంట్లో భర్త వలస పోయి ఉంటాడు. భార్య జ్వరం వచ్చిన కొడుకుకు గుడ్డ కూడా కప్పలేని దారిద్యంతో ఉంటుంది. ఆమెను మంచి నీళ్ళు మాత్రం అడిగి పోయించుకొని తాగి తిరిగి రాబోతారు. ‘అందరిండ్లలో అడిగిన్రు .. మమ్మల్నడుగుత  లేరన్నా?’ ఆమె ప్రశ్నకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ‘సగం శేరు దంచిస్తా’ అని వాళ్ళను కూసోబెట్టి అక్క వేస్తున్న ఒక్కొక్క పోటు వాళ్ళ సందేహాలను పటాపంచలు చేస్తుంది. ఎంత ఆర్ధ్రమైన కనువిప్పు! పేద వాడల్లో విరాళాలు వసూలు చేయటం అంటే వాళ్ళతో బంధాన్ని గట్టి పరుచుకోవటమే కదా.

రహస్యోద్యమాన్ని వెన్నుతో కాచిన వాళ్ళు విప్లవ సానుభూతిపరులు. కుటుంబాలకు కుటుంబాలు, తరాలకు తరాలు ఉద్యమాలకు  నిండు హృదయంతో సహాయ సహకారాలు అందించటం వలనే అవి మనగలిగాయి. ఏళ్ళ క్రితం అందించిన ఆయుధాలను భద్రంగా దాచి ఇవ్వాల్సిన వాళ్ళకు యివ్వాల్సిన పద్దతిలో అందచేయటం చేయటంలో పార్టీకి గుర్తు చేసిన కర్తవ్యం ‘మళ్ళీ మొదలు పెట్టమని’. ఆ సమూహాలు ఎన్ని రోజులు పార్టీకి భౌతికంగా దూరంగా వున్నా మానసికంగా అక్కడే ఉంటాయి. ఆ కార్మికవర్గ మనస్తత్వాన్ని కళ్ళకద్దుకొని ఆ కర్తవ్యాన్ని తలకెత్తుకోవాలనే చెప్పే కధ ‘మొదలు’.

ఎన్ని కధలు! ఎంత జీవితం! ఎంత ఘర్షణ! ఎన్ని పోరాటాలు! ఎన్ని మథనాలు! ఎన్ని సందేశాలు! ఇవన్నీ ఎంత సహజంగా రాయగలిగారు షహీద! నీటిలో చేపలాగే ప్రజలలో మమేకమైన వారికే కదా ఇంత బతుకు తెలిసేది! ప్రజల ఆకాంక్ష, వాంఛ, భాష, నడక, నడత తెలిసిన వాళ్ళు మాత్రమే కదా ఇంత బాగా వ్యక్తీకరించగలిగేది!

*

మీ మాటలు

  1. మీ పరిచయమే గుండెను ముద్ద చేసింది ఇక కథలెంత కరిగిస్తాయో!
    వెంటనే కొని చదవగలిగే అవకాశం వుంటే ఇప్పుడే చదువుదును.

  2. రమాసుందరి గారూ

    చాలా మంచి పరిచయం చేశారు. Thank you.

  3. Allam rajaiah says:

    రమా సుందరిగారు
    మంచి మాటలు రాసారు

  4. sivalakshmi says:

    “నీటిలో చేపలాగే ప్రజలలో మమేకమైన వారికే కదా ఇంత బతుకు తెలిసేది! ప్రజల ఆకాంక్ష, వాంఛ, భాష, నడక, నడత తెలిసిన వాళ్ళు మాత్రమే కదా ఇంత బాగా వ్యక్తీకరించగలిగేది!”
    షహీదాని ఎంత బాగా పట్టుకున్నారు రమా?ఎప్పటినుంచో షహీదా కథలు చదువుతున్నాం.ప్రతి కథా ఒక్కో ఆణిముత్యమే!కొందరు మిత్రులం కలిసి మాలో మేము చర్చించుకునేవాళ్లం.షహీదా అమ్మ కి అంకితం అని రాసుకున్న “ఆ అరగంట కోసం” అనే కధ గురించి రాద్దామని మొదలు పెట్టానంతే! ఈ పరిమళాల గురించి మొదటగా మీరే సరైన విశ్లేషణ నందించారు.
    ధన్యవాదాలు రమా!

  5. వనజ తాతినేని says:

    రమ గారు .. మీ పరిచయమే ఆర్ద్రత తో ఉంది కథలు చదవకుండానే కథలని గురించి ఆలోచింపజేస్తుంది . ఈ కథల సంపుటిని కొనుక్కుని తప్పక చదువుతాను .

మీ మాటలు

*