బిత్తిరి సత్తీ,  సిమ్మాద్దిరీ

 

 

 

    ల.లి.త.

ల.లి.త.

సత్తీ… ఓ బిత్తిరి సత్తీ…   గిది చెప్పు. గిట్ల టీవీవార్తలల్ల ఊరి ముచ్చట్లు వెట్టాలని ఆలోసన ఎవురు జేశిన్రు? అదీ ఇంత అందమైన బాసల! తెల్సులే. మల్లన్న గదా! ఆయన మొదులు వెట్టిండు. ఆయనా, రాములమ్మా రచ్చ రేపిన్రు. గిప్పుడేమో నువ్వూ, మీ సాఫిత్రక్కా, మంగోలి మా అందరికీ  ఇంటి మనుసుల్లెక్కయిన్రు.  రాత్రి తొమ్మిదిన్నర కొట్టంగనే దినామూ  టీవీ తాన కొచ్చేస్తం. ఇగ శురూ ఐతది మీ ముగ్గురి తమాస. వార్తలు ఎవురైనా ఇంత సోపతితోని ఎన్నడైన జెప్పిన్రా?

ఎన్నడో దూరదర్శన్ తప్ప మరొకటి లేని కాలంల.. ఆఁ … వాల్లెవురబ్బా? కోమల్ జీ బీ సింగ్, రీనీ జోసఫ్, షమ్మీ నారంగ్… వాల్లందరూ ఎంత మంచిగ సదివెటోల్లు వార్తలు! ఏ బాసల వార్తలు జెప్తే ఆ బాసని నిండుగ, తియ్యగ పంచదార సెవుల బోసినట్టు పల్కెటోల్లు!  గిప్పుడా? ఇంగ్లిసోల్ల లెక్క సూట్లు, బూట్లేసుకొని మంచిగ తెల్గుల సుత మాట్లాడలేనోల్లంతా వార్తలు సెప్పనీకొస్తున్రు.  థూ, తెల్గుల గా ఇంగిలీసు మాటలు కల్పి పాయసంల ఉప్పు వోసినట్టు చేస్తున్రు. ఇగ పోరలకు బాసేమి నేర్వనొస్తది?  యాడ జూడు “రేటెంత? సెవెంటీ రుపీస్. టైమెంత? సిక్స్ ఫార్టీ ఫైవ్. సండే కలుస్తవా? రాలేను. మండే సూస్త” అనవట్టిన్రు అందురూ.  డిల్లీల సుత గీ బాస ఉండది. “సత్తావన్ రుపై, పచత్తర్ రుపై” అనుకుంటా మంచిగ ఆల్ల బాసల లెక్కలు సెప్పుకుంటరు వాల్లంతా. మన్ని పిసోని లెక్క జూస్తా అరవ్వోడు వాని బాసల్నే అన్నీ అర్సుకుంటడు.  బెంగాలోడు మా టాగోరో అనుకుంటా ఆయన్ని మించినోడు లేడనుకుంటా  డప్పుగొట్కుంటా తిర్గుతడు.

బాసను గిట్ల సావనూకుతున్రని తెలుగు టీవీల వార్తలు సూసుడే బందు జేసినం మా అసుంటి పాత మనుసులం. గింతలో మీరచ్చిన్రు.  మా బాస, మా తిండి, మా సంబురాలంటూ మన తెలంగాన ఉద్యమంల మీ అసుమంటోల్లు కూడా దిగిన్రు. నాయం, అన్నాయం, అన్నదమ్ములు ఇడిపోటం.. ఈ పెద్ద పెద్ద రాజకీయాల ముచ్చట్లకేమొచ్చెగానీ,  గింత బంగారం బాసను టీవీలల్ల ఎంత మంచిగ లెబట్టిన్రు!

మంచి మంచి సామెతలు కల్పి సెప్తరబ్బా నువ్వూ మీ సాఫిత్రక్కా వార్తలల్ల! దినాం వీల్లేమి ముచ్చట్లు జెప్తరో అని ఎదురు చూస్తం. నువు బిత్తిరోని లెక్క యాక్సన్ జేస్కుంటా నవ్విపిస్తవ్ గని, నీ మాటలల్ల షానా నిజముంటది సత్తీ!  అన్ని టీవీలూ పార్టీ  పెద్దోల్ల టీవీలే అని మందికి తెల్సిన ముచ్చటే గదా! అందుకే మీరు కేసీయార్ దొరను పొగుడ్తున్నా,  మోడీ దొరకు, సెంద్రాలు సార్ కు కాల్తున్న కట్టెతోని వాతలు వెడ్తున్నా ఏమనుకోములే సత్తీ! తీన్మార్ వార్తలల్ల మీ బాసకే ముందుగాల  మేం మొక్కేది.

ఇట్లంటే సత్తి గుస్సా అయితడేమో! లేదులే, నువు చెప్పేటియి గూడ శానామంది టీవీలల్ల వొర్రే ఇసయాలకంటే మంచిగుంటయి సత్తీ. ఒగసారి ఎండ మండుతుంటే సిన్న టెంటునీడల కుసోని, ఎండలల్ల తిరిగెటోల్లు ఎంత కష్టవడాలోనని నువు యాష్టబోతుంటే సిన్న సిన్నోల్లు, అవీ యివీ అమ్ముకునేటోల్ల బాదలు యాదికచ్చి కండ్లకెల్లి నీల్లచ్చినయ్. టీవీలోల్లు ఎండ ఎట్ల సంపుతున్నదో సెప్పనీకి సిటీలల్ల పంకాలు తిరక్కపోవుడు, ఇండ్లలో కోడి పెట్టల్లెక్క కుసున్న మన్సులు అసోబుసో మనుడే సూపిస్తరు. మల్ల గవుర్న్మెంటు కరెంటు ఇస్తలేదని నిష్టురవడ్తరు. రైతులగ్గూడ ఇయ్యనీకుంట జేసి, ఉన్న తక్వ కరెంటును ఎక్వగా నూక్కపోతున్న పెద్ద పెద్ద సీరెల షాపులోల్లు, మాల్స్ పెద్ద మన్సుల్ని మీ టీవీలోల్లు ఒక్క మాట సుత అనరేం?

సీప్ లిక్కర్ని కేసీయార్ తెస్తున్నడని శాన నెత్తినొప్పొచ్చింది నీకు. ఊకుంటవా మరి! బిత్తిరి ఏసంతో సురక పెట్టుడే నీ తీరైపాయె. ఇగ సార సీసాలు వట్కోని ఒకటే ఎగురుడు. మంది ఆరోగ్యం కోసమే గిదంతా అని పద్మారావు సారు మాటలు యాది జేస్తూ, ఇంకా సిటీలల్ల ఎక్కువ మందు షాపులేంది, జిల్లాల పొంటి  అంత తక్కువేందని యాగీ జేసినవ్. మంచు లచ్మక్క, తాగి బండి నడిపెటోల్లకు పోలీస్ ఠానాల కూసొబెట్టి బుద్దులు జెప్తదని విని, తాగి బైక్ ను నడిపిస్తివే రోడ్డు మీద! అందర్నీ సారా తాగమని పద్మారావు సారూ, తాగి బండి నడపొద్దని నాయిని సారూ, తాగుబోతులకు మంచి ముచ్చట్లు జెప్తనని మంచు లచ్మీ తీన్మార్ ఆటలు ఆడుతుంటే బైక్ మీద నీ ఆటలూ, ముచ్చట్లూ నువ్ శురూ జేసినవ్….  మస్తు నవ్విపిచ్చినవ్ లే సత్తీ.  పక్కపొంటి యీ సావిత్రి పిల్ల ‘అన్నీ మంచికే’ అనవట్టుడు. సచ్చ బారత్ అంటా సీపుర్లు బట్టి పోటువలు దిగెటోల్లను మంచిగ బనాయించినవ్. వాల్లందరి కంటే సీపురుతో ఊడ్సి పంజేసిన నువ్వే కరెష్టయిన  బ్రాండు అంబాసిలండర్ వని చెప్పుకున్నవ్. సెత్త గుట్టలతాన నీ సెల్ఫీల కత జూశినంక గీ సేల్ఫీష్ ల పిసోల్లకు, ప్యాసను పోరగాన్లకు ఏమైనా గ్యానమొస్తదంటవా సత్తీ!  వానలు బగ్గ పడాలని లీడల్ర లెక్క యాగం జేస్తివి. గింత సుతారంగ వాతలు వెట్టుడు యాడకెల్లి  నేర్సిన్రమ్మా మీరంతా?

ఇంగిలీసును తెలుగు లెక్క మార్సి నవ్విపిచ్చుడు పాత కతే గానీ, నువ్ అది జేసి మంచిగనే నవ్విపిస్తవ్ తియ్. ఎల్నినో ని ఎల్లినూనె, గూగుల్ ను గుల్గుల్, విటమిన్లను ఈతముల్లు, ఎక్స్ క్లుసివ్ ని హెచ్చుకూలీ, హెరిటేజ్ ని ఎర్రి స్టేజీ … గిది నీ అందాల బాస. “సూస్కుందమిక” అనుకుంటా సిన్న పొల్లగాని లెక్క లాజిక్కులు మంచిగ తీస్తవ్! అయన్నీ జంగు పట్టిన మా దిమాగ్ లను తోముతా ఉంటయ్.

మీ సాఫిత్రక్క, మంగోలి కట్టే బట్టలు సూస్తనే సంతోశమైతది సత్తీ.  బుగ్గ సేతుల జాకిట్టేస్కోని, నూలుసీరెలు గట్టి, సన్న గొంతుతోని సక్కదనాల సాఫిత్రక్క వార్తలు జెప్తుంటే షాన మంచిగనిపిస్తది. మీ ముగ్గుర్లో  గా సక్కనిసుక్క మంగోలికి సురుకెక్కువ.  గా పిల్లకు ఐదరాబాదు మాటలు, ఇంగిలీసు మంచిగస్తయ్.  నీ లొడాసు అంగీలైతే బాగున్నయ్ గాని, వార్తలు సదివేటప్పుడు ఆ కోట్ ఏంది సత్తీ? మంచిగ పంచె, అంగీ కట్టు…  ఓహో, నీ బిత్తిరి మాటలకు ఆ యేషం నడుస్తదో లేదో అని గా కోటు తగిలించినావ్? మీ అన్న మల్లన్న ఎంత మంచిగ పంచె గట్టి, తలపాగ జుట్టి, సేత కర్ర బట్టి అచ్చెటోడు! గా యేషంల ఆయన పెద్ద పెద్ద రాజకీయ నాయకుల తానికి పొయ్యి, తీరొక్క ముచ్చట్లు, వాతలు బెట్టెటోడు. పొన్నాల లక్ష్మయ్యతోని, ఇంకా లీడల్ర తోని మల్లన్న పెట్టిన ముచ్చట్లు ఏమన్న ఉన్నయా? పెద్ద మన్సి  కాని పెద్దమన్సి మన మల్లన్న, దమ్మున్నోడు. ఇంకొక మాట గూడ ఉన్నదిలే. గాయన తెలంగాన ఉద్యమం జోర్ల  వీ సిక్స్ తీన్మారని మొదులు వెట్టిండు. ఉద్యమం వేడిగుండే. అప్పుడాయన ఏ ముచ్చట ఏ తీర్గ సెప్పినా నడ్సింది. మల్లన్న తెల్వి మల్లెపువ్వు లెక్క ఆసన గొట్టింది. ఇప్పుడు నీకు అలాంటి శాన్సు లేదులే సత్తీ. అందుకే బిత్తిరి యేశాలేసి నవ్విపిస్తా కొన్నైనా నిజాలు సెప్పనీకి సూస్తున్నవ్. కోదండరాం సార్ తో ఎంత గౌరవంగ మాట్లాడిండు మల్లన్న!  గా పెద్ద సార్ను ఓ సారి అర్సుకోవా నువ్వు సత్తీ.  ఇప్పుడాయన ఏం చేస్తుండో ఎట్లున్నడో!

ఊరోనివి నువ్వు. అందుకే నీకు రైతులంటే అంత  పాయిరం.  వాన మొగిల్లు అయిదరాబాద్ కెందుకు, ఊర్లపొంటి పోకుండానని మొత్తుకుంటివి. రైతులు జీవి దీస్కుంటాంటే అర్సుకోని సర్కారును ఏమీ అనకుండా, సిటీల కూలీలై బత్కుతున్న బక్క రైతులకు నువ్వే దైర్నమియ్యనీకి సూస్తివి. ఇసుమంటి న్యూస్ రిపోర్టింగ్ నీతోనే మొదులయింది తమ్మీ. నీది కొద్దిగా ‘ఆల్ ఈజ్ వెల్’ సెంటిమెంటులెక్క గొడ్తది తమ్మీ ఒక్కొక్కసారి. త్రీ ఇడియట్స్ సిన్మ జూసినవా? బిత్తిరిగా ముచ్చట్లు వెడ్తానే మల్లన్నలెక్క రాజకీయాలోల్ల సెవుల్నుండి రక్తం దియ్యాలే. కష్టమంటవా? కావచ్చులే!

ఎన్డీటీవీ, టైమ్స్ నౌ  … గిసుమంటి ఇంగ్లీసు సానెల్లన్నీ ఏదో ఓ పార్టీకీ మతానికీ అంబానీకీ అదానీకీ కాల్మొక్తా బత్కుతయ్ తమ్మీ. నీకు తెల్వని కత గాదు. ఎన్డీటీవీ ఇంగ్లీసు సానెల్ ముచ్చటకేమి గానీ, ఆల హిందీ సానెల్ల ‘రవీష్ కీ రిపోర్ట్’ అని ఓ ప్రోగ్రాం వస్తది సూడు. సుట్టూ ఎన్నెన్ని అన్యాలాలు జర్గుతున్నయో అయన్నీ మనకు సూపెట్టుడే గా రవీష్ సార్ పని. ఆయ్న పనికి అడ్డు వెట్టకుంట వొదిలేసిన్రు ఎన్డీటీవీ హిందీ సానెలోల్లు. ఈ మాయలోకంల ఆయనకెట్లనో దొర్కింది మంచిగ నిజాలు సెప్పే మోక. నువ్ కూడ సానెలోల్లను మస్కగొట్టి సెప్పెయ్ నిజాలు.

మీరు తెలంగాన సంస్కృతి అని గర్వంగ చెప్తరు గదా! తెలంగాన సంస్కృతి, మాట, ముచ్చటే మీ ప్రోగ్రామ్ కు పానం కదా!  గీ సంస్కృతిల సిన్మా సెత్తను ఎందుకు గుసాయిస్తున్నవ్ తమ్మీ అప్పుడప్పుడు?  యాక్సను మంచిగ జేస్తురు గదా మీరంతా సినేమాలల్ల గుసాయిస్తరేమోనని బుగులు వెడ్తది.  ఆంద్రల సుత సెక్కబజన్లు, హరి కతలు, బుర్రకతలు, నాట్ల పాటలు, తోలుబొమ్మలు… ఎన్నో ఉండేయి. అయన్నీ ఇడ్సిపెట్టి జనం సిన్మాలెంట పడిన్రు. ఇంత మంచిగ బత్కమ్మ సంబురాలు, బోనాలు జేస్కోని, ఒగ్గుకతలు మంచిగ  సెప్పుకుంటా, పాటే పానమైన తెలంగానోల్లకు గీ సిన్మాల సీడ ఏంది సత్తీ? సిటీల లోకంతీరు ఎట్లున్నా, తీన్మార్ వార్తలల్ల తెలంగానా ఊర్లెంట తిర్గి పెద్దమన్సులు, రైతులు, సిన్న పిల్లల కతలు సూపిస్తున్నరు మీరు!  సిన్నిబిడ్డ యశ్వంత్ వొగ్గుకతను ఎంత మంచిగ సెప్తున్నడో సూపించింది గదా సాఫిత్రక్క.  గట్లనే పండుగలు, సంబురాలు, పాటలు రిపోర్ట్ సెయ్యుండ్రి.  పరబాసు, రాం చరణ్, తమన్నాలను ఇడ్సిపెట్టురి. సాఫిత్రక్క కట్టే సీర్లకూ సిన్మలోల్ల ష్టైలు ముచ్చట్లకూ కుదరది. గా మతిలేని ఫేషను షోల ముచ్చట్లు మనకెందుకు తమ్మీ? మంచిగ బొమ్మలేసే తెలంగాన తమ్ముల్లను సూపియుండ్రి. ఏ గోండు గూడెంతాననో మెట్ల కిన్నెర తీగలు బిగించే పెద్ద మన్సిని సూపెట్టురి. సాలోల్లను అర్సుకో తమ్మీ.

ఓ సాఫిత్రక్కా, మంగోలి, బిత్తిరి సత్తీ… మీకూ, మీ ఎనకున్న టీం.. అందరికీ శనార్తులు. మీ తీన్మార్ వార్తలు  సల్లగుండాలె.

***

ఇన్నావా సిమ్మాద్దిరీ, ఆలంత గొప్పగ ఆల బాసలో సెప్పుకుంతన్నారు వార్తల్ని. మనకాడేటుంది అలగ?  మన సంగతులు సేప్పీ వోలు ఎవులూ నేరు. టీవీల మన్ని సేరదీసీవోడూ నేడు. ఆల్లాల్ల నూసులు, గొప్పలు ఆలే సెప్పుకుంతారు. మనకేదేనా ఆపదొస్తే, వరదొస్తే మనూర్లకొచ్చి ఇంటర్వీలు సేత్తారు మన్ని. అంతే. మన రోజువారీ మాటా, పాటా, ఇకటాలూ ఎవులిగ్గావాలి?

మన సెంద్రబాబుని, జగన్ రెడ్డినీ  ఆలు సెంద్రాలుసారు, జగనాలుసారు అని పిల్సి ఎంత బాగా ఇకటాలాడతారు సూడుమీ. అసలుకి మన సెంద్రబాబే మన యేసాన్నీ బాసనీ పట్టిచ్చుకోట్లేదని నాకు వనుమానం వర్లచ్చిమీ! అందర్నీ గొప్పోల్లు సేత్తా, ఊర్ని సింగపూరు సేత్తా అంటాడా బావు. మనూరు సింగపూరు ఐపోతే ఆకిరికి మనం ఆ సింగపూరోల్ల  బాస నేర్సుకోవాలో ఏటో! అసలికే ఆ బావు,  సెరిత్రలు సదవొద్దు, అందరూ వింజినీర్లు ఐపోయి డబ్బు కూడబెట్టీయాలంతాడు. డబ్బులు సెట్లకి రాల్తాయేటి? అయినా ఒక్క డబ్బుంటేనే సరిపోద్దా మణిసికి? నాకూ ఆ బిత్తిరిసత్తిలాగే టీవీలో కెలిపోయి మన కవుర్లు సెప్పీయాలని శానా యిదిగా ఉంది వర్లచ్చిమీ! మన కుర్రోల్లు కూడా టీవీల్లో మన బాసే మాటాడితే మనకెంత బాగుంటాది? గానీ ఆలు యిప్పటికే సినేమాల బాస నేరిసీనారు. ఎలగో ఏటో! పల్లెటూరోల్లని ఎర్రబస్సుగాల్లని ఇకటాలాడ్డం కాదు. మనకాడా ఎన్నో ఇసయాలు నేరుసుకోవొచ్చని సిటీలు పట్టీసినోల్లకి ఏనాటికి బోద పడాల? మనకీ తీన్మారోల్ల లాగే ఒక్కరగంట టీవీలో సోటిత్తే  ష్టాపు నెగ్గొట్టీవాఁ ? ఆ సేత్తోటే రాయల్సీమోల్లకీ, ఇంకా మన రకరకాల యాసల బాసలకీ ఒక్కొక్క అరగంట శాన.

ఎంతాశ సిమ్మాద్దిరీ నీకు?

ఓ టీవీలోల్లూ, ఎవులైనా ఆలకిత్తన్నారా?

*

 

 

 

 

 

 

మీ మాటలు

  1. T. Chandra Sekhara Reddy says:

    టీవీ కార్యక్రమాలపై ఎన్నాళ్లకి ఒక మంచి అభిప్రాయ ప్రకటన చూశాను. మంచి ప్రసారం కావటమే కాదు, అనుసరించటం కూడా అరుదై పోయింది టీవీ కార్యక్రమాల విషయంలో.

    వనపర్తిలో మూడు సంవత్సరాలు, పెద్దపల్లిలో ఐదు సంవత్సరాలు, జగిత్యాలలో రెండు సంవత్సరాలు ఉద్యోగం చేసిన నాకు; మారుమూల గ్రామాల్లో రోజులకి రోజులు గడిపిన నాకు తెలంగాణా మాండలికంతో, జీవన రీతితో విస్తృత పరిచయం, అవగాహన ఉంది. అందుకని, నేను ఈ కార్యక్రమాన్ని (ఒక ఎపిసోడ్ బాగా నచ్చితే, ఉదయం ఎనిమిది గంటలకు పునఃప్రసారం కూడా) చూడని రోజు ఉండదు.

    ఈ వార్తలు ఎప్పటినుంచి ప్రసారం అవుతున్నాయో నాకు తెలీదు. ఆలస్యంగా చూడటం ఆరంభించినందుకు బాధపడని రోజూ ఉండదు.

    నాకున్న దిగులు ఒకటే. తెలుగు టీవీ కార్యక్రమాలు అరుదుగా చూసే నేను ఈ మధ్య కార్యక్రమం ఒకటి anchors కోసమే చూడటం మొదలు పెట్టాను. వాళ్లలో ముందు వింధ్య, తర్వాత ఆ కార్యక్రమం నుంచి భార్గవా కనుమరుగయ్యారు. నేను కోరుకునేది ఒకటే, సాపిత్రక్కా, సత్తీ, అపుడపుడు సత్తితో మందు గోలీ అని పిలవబడే మంగోలీ అలా కాకూడదని.

    ఇది స్వార్ధం అనిపించొచ్చు. టీవీ ముందు కూర్చున్నపుడు, హృదయం సంచలించే సందర్భాలు అరుదైనపుడు; ప్రేక్షకుల్లో అలాంటి కోరికలు అసహజమెలా అవుతాయి.

  2. చందు తులసి says:

    చాలా బాగా రాశారండీ …..
    నిజమే ఆంధ్ర ప్రాంతం…రాయలసీమ భాషల్లో ఒక అరగంటయినా ఇలాంటి ప్రోగ్రాంఉంటే ఎంత బాగున్ను.

  3. AMBALLA JANARDHAN says:

    ల.లి.త.మ్మా!
    శాన బాగ జెప్పినవమ్మా. మన కాళోజి గారన్నట్టు, బడిపలుకుల భాష జాగల పలుకుబడిల భాష టీవీల రావాలే. గప్పుడే మన తెలంగాణ భాషకు మంచి గుర్తింపొస్తది. ముంబాయిలోని మా ప్రాంతంల వీ 6 చానల్ రాదు. గందుకని టీ చానెళ్ళ అచ్చే ధూం ధాం ముచ్చట్లతోని సరిపెట్టుకుంటున్నం. మిగిలిన తెలంగాణ చానెల్లల్ల గూడా తెలంగాణ భాషల కార్యక్రమాలు శురూ జేత్తరని ఎదిరిసూత్తున్నా.

    • తీన్మార్ వార్తలు ఇంటర్నేట్ల దినాము వాల్ల సైట్ల దొర్కుతయి. యు ట్యూబ్ లో కూడ దొర్కుతయి. నేను కూడ రాష్ట్రం బైటనే ఉన్న. టీవీల చూడడం కుదరని దినం నేను నెట్ లో చూస్త. పలుకుబడుల బాసను ఇడ్సిపెట్ట. మీరు కూడ గట్లనే సేయున్రి సార్.

  4. అసురుడు says:

    చానా దినాల తరువాత టీవిల భాష మీద మంచి వ్యాసం సదివిన. వి6 ఛానెల్లో తీన్మార్ వార్తలు ఎట్లా షూరు జేసిండ్రబ్బా అనుకున్న. నాకు తెల్సిన దోస్తును వట్టుకోని ఓ నాడు గాళ్ల ఆఫీసు కాడికి పోయిన. మా దోస్తు నాకు గా తీన్మార్ రాసే పోరగాండ్లను కలిపిచ్చిండు. అస్సలు గీ ఆలోశన మీకెందుకొచ్చిందని అడిగిన. గిది మా ముచ్చటగాదని జెప్పిండ్రు. గాళ్ల బాసే గివన్నీ జెప్తడట. బిత్తిరి సత్తికి, అంతకు మునుపు మల్లన్నకు ఏషాలేపిచ్చింది గాళ్లే సారేనంట. కుర్వ ఊషన్న అనే తాత ఓకాయన ఉండేనంట. గాళ్ల సారోల్ల ఊర్ల. గా ముసలాయన ఏషమే మల్లన్నకేసిండ్రంట. బిత్తిరి సత్తి ఏషం గూడా గంతేనంట. గాళ్ల సార్ ఊర్ల బిత్తిరోడొకడు ఉండేనంట. గాన్ని జూసే గంత అంత అంగీ లోడాసు లోడాసు లాగే ఏపిచ్చిండంట. మనం గూడ జూస్తగద ఊరికో బిత్తరోడు ఉంటడు గాడు అన్ని నిజాలే జెప్తడు. నిజాలు చెప్పటోళ్లను పన్కి మాలినోళ్లు అనుకుంటం గద మనం. మన తప్పుగాదు అది గట్ల తయారైనం ఎందుకోమరి. రాములమ్మకు కట్టు బొట్టు, మాట తరీకే అన్నీ గాళ్ల సారే జెప్పిండంట. గాళ్ల సారే పెద్ద తీన్మార్ ఉన్నట్లుంది.
    అంతా పోనియిర్రి గని. గా ల.లి.త మేడం రాసిన నాలుగు మాటలు సద్విన తరువాత నాకు గూడ రాయాలనిపిచ్చింది ఈ రెండు మాటలు రాసిన. ఇంగో మాటేందంటే గీ పోగ్రాం నేను గూడ దినాం సూస్తనే ఉన్న. గీవి ఊరి మాటల వార్తలు. ఊరి ముచ్చట్లు. నాకైతే గీ వార్తలు జూస్తే ఎండకాలం మాపటిజాం ఈతకల్లు దాగినంత సంతోషమైతది.

    • మంచి ముచ్చట జెప్పిన్రు సార్. రాములమ్మ వేశం కంటే ఆ ఎన్క అచ్చిన సావిత్రి యేశంల ఊరి పరిమళం ఇంకా మంచిగున్నది గద ! ఎంత ఆలోసనతోని ఇయన్నీ చేసిన్రో గా పెద్ద తీన్మార్ రవి సారు.

  5. prasadamurty says:

    చాలా బావుంది. 10టివిలో ప్రోగ్రాం చేద్దాం చూడండి.

    • నిబద్ధతతో చేస్తే ఎంత బాగా వస్తుందో తీన్మార్ వార్తల కార్యక్రమం నిరూపిస్తోంది. 10 టీవీలో చేద్దామని మీరు సంకల్పించటం చాల సంతోషం. తీన్మార్ లో రాములమ్మ పక్కన చిట్టెమ్మ అనే శ్రీకాకుళం అమ్మాయితో కూడా మాట్లాడించారు. ఆంధ్రలో కనీసం నాలుగైదు మాండలికాలు ఉన్నాయ్. comninations తో కార్యక్రమం చెయ్యవచ్చు. మట్టివాసన పట్టగల మనుషులు కావాలంతే.

  6. ఆ ప్రోగ్రాం మల్లన్న మొదలు వెట్టిందికాదు. ప్రోగ్రాంతో మల్లన్న జనంలోకి వచ్చాడు. తీన్మార్ దశ, దిశ, గతం, వర్తమానం, భవిొష్యత్, తొలి ప్రేక్షకులు CEO రవి సార్…

    నిజం తెలియాలి కాబట్టి చెప్పాను

  7. సుమనస్పతి says:

    ఒకప్పటి తీన్మార్ మల్లన్నతౌ ఈ పరిచయం చూడగలరు !

    http://www.telanganatalkies.com/interview-naveen-talks-about-the-making-of-teenmaar-mallanna/

  8. సుమబాల says:

    సారంగ లాంటి సాహిత్యపత్రికలో మా ఛానెల్ గురించి రావడం..అందులోనూ మాండలికవార్తలైన తీన్మార్ గురించి ఇంత పెద్ద వ్యాసం నిజంగా చాలా సంతోషం అనిపించింది. వి6లో చేస్తున్నందుకు మళ్లోసారి చాలా గర్వపడ్డాను. లలితగారు అన్నట్టు ఈ వార్తలను మల్లన్న మొదలు పెట్టలేదు. ఎంతటి అమూల్యమైన వస్తువైనా గోడచేర్పు ఉండాలి…ఎలాంటి మహత్తరమైన ద్రవానికైనా పాత్ర దన్ను ఉండాలి. అలాంటి దన్నులా మొదట్లో మల్లన్న అయ్యాడు..ఇప్పుడు బిత్తిరి సత్తి అయ్యాడు. రేపు ఇంకొకరు అంతే…లలిత గారూ మీ విశ్లేషణ చాలా బాగుంది. మీకో విషయం తెలుసా ఈ తీన్మార్ వార్తల్ని అడ్డుకోవాలని ఎన్నో కుట్రలు జరిగాయి. మా ఛానల్ రేటింగ్ ని దీన్తో ముడిపెట్టి దెబ్బ కొట్టాలని చూశారు. కానీ ఎంత కాలితే అంతగా మెరిసే బంగారంలా మా తీన్మార్ మెరిస్తోంది…వన్నెతేలుతోంది.
    ఇది లోపలి విషయమైనా తప్పకుండా చెప్పాల్సిందే..ఎందుకంటే తీన్మార్ ని ఇంతగా అభిమానించి అక్కున చేర్చుకుంటున్న వారికి తెలవాల్సిన విషయం కాబట్టి…అదేంటంటే…మీరో విషయం గమనించారా? తీన్మార్ తర్వాత ఇలాంటి ప్రోగ్రాంనే చాలా ఛానల్స్ మొదలుపెట్టాయి. మక్కీకి మక్కీ కాపీ చేశాయి. కొన్ని ఛానల్స్ అయితే తీన్మార్ టీం మొత్తాన్నీ ఇక్కడినుండి లాగేశాయి…కానీ వారనుకున్నదేదీ జరగలేదు…ఇక్కడ కొంపలు మునగలేదు…అక్కడ వాళ్లేం బావుకోలేదు. ఇదే టీం కదా..ఎందుకు వేరేదగ్గర సక్సెస్ కాలేదు? అని డౌట్ రావాలి. ఎందుకంటే దానివెనకున్న వ్యక్తి వేరు. మా బాస్..తీన్మార్ లో కనిపించే ప్రతీదీ..ఆయన బుర్రలోనుండి వచ్చిన ఆలోచనే…ఏ అంశాన్నిఎలా చెబితే..ఎలా ఐటం చేస్తే జనాలకు నచ్చుతుందో ఆయనే గైడ్ చేస్తారు. చివరకు సార్ ఫైనల్ గా చూసి ఓకే చేస్తే కానీ ఎయిర్ కాదు. అందుకే పొద్దున తొమ్మిదిన్నరనుండి రాత్రి ఎనిమిది వరకు ఆ టీం చాలా హడావుడి పడతారు. మీటింగులు, స్క్రిప్టులు, షూటింగులు, వాయిస్ ఓవర్లు, ఎడిటింగులు…ప్రివ్యూలు…ఒకవేళ బాగాలేకపోతే మళ్లీ రీ షూట్స్…ఇంత కష్టపడతారు. కాబట్టే ఆ ప్రోగ్రాం జనాల్ని రీచ్ అవుతుంది. భాషను వాడుకలోకి తేవాలని ఇప్పుడంటున్నారు…కానీ v6 ఆ పని ఎప్పుడో చేసింది. తీన్మార్ వార్తలతో తెలంగాణ భాషకు గౌరవం తెచ్చింది. మిగతా కార్యక్రమాల్లోనూ తెలంగాణ భాషకే పెద్దపీట వేస్తోంది. కాస్త పెద్ద ఉత్తరమే.. కానీ మీ వ్యాసం చదివిన సంతోషంలో ఇవన్నీ పంచుకోవాలనిపించింది.

    • నవీన్ చింతపండు, వార్తను వార్తలా చెప్పటం కాకుండా జనం ఆ వార్తను ఎలా తీసుకుంటారో అలా చెప్పటం అనేది తన ఊహఅనీ దానికి రవి అంకం సార్ ప్రోత్సాహం ఇచ్చారనీ చెప్పారు. లోపలి కతలు మీరు చెప్పారు. ఇది ఎవరు చేసినా టీం వర్క్ కూడా కదా. అయితే మీరో ముఖ్యమైన విషయం చెప్పారు. బయటకు వెళ్ళినవాళ్ళు విజయం సాధించలేదని. ఇది ఆలోచించాల్సిన మాటే. ఏదేమైనా ప్రోగ్రాంను ఇంత చక్కగా కొనసాగిస్తున్న రవి అంకం సార్ కు మొదటగా మొక్కాలి. ఆయన ఊహలను సాకారం చేస్తున్న టీం కూ అభినందనలు చెప్పాలి. మీరు ఇదంతా రాసినందుకు కృతజ్ఞతలు.

  9. సుమనస్పతి says:

    ఒకప్పటి తీన్మార్ మల్లన్న తౌ ఈ పరిచయం కూడా చూడండి :
    http://www.telanganatalkies.com/interview-naveen-talks-about-the-making-of-teenmaar-mallanna/

  10. ఒక ఎపిసోడ్ బాగా నచ్చితే, ఉదయం ఎనిమిది గంటలకు పునఃప్రసారం కూడా .. మంచి అంశం పై వ్యాసం లలిత గారు.. బాగుంది .. మా నాన్న మా అమ్మ సంగతి చెప్పొద్దూ రోజు టైం కి రిమోట్ పట్టుకొని కూసోని బిత్తిరి సత్తి గురించి ఎదురు చూస్తాడు .. ఇది సడువుతుంటే అనిపిస్తుంది ఇంతమంది ఇంతిష్టంగా జూస్తున్న్రా తీన్మార్ వార్తల్ని అని ..

  11. p v vijay kumar says:

    An out of box article….thanq for sharing and pls keep up the same !

  12. Kcube Varma says:

    ఆంధ్ర తెలంగాణా తేడా లేకుండా అంతబాగా రిసీవ్ చేసుకుంటున్న programme . మంచి పరిచయం థంక్ యు.

  13. మేం గాలి ముచ్చట్లు చెప్పం.. గందుకేమా గొప్పదనం రాష్ట్ర ప్రజలే కాదు … దేశమంత సెప్తున్నరు…

    ల.లి.త.గారు చెప్పినట్టు మట్టివాసన పట్టి మన భాషలో వార్తలిస్తే మన వాళ్లు ఎంత ఆదరించి సొంతం చేసుకుంటారో చెప్పడానికి ఇంకొన్ని నిజాలను ఈ వెబ్ లింకుల్లో చూడొచ్చు. దేశంలోనే ఎక్కువమంది చూసే వార్తా కార్యక్రమాల్లో దాదాపు అన్నీ హిందీవే ఉంటే అందులో మొదటి ఐదులో నిలిచిన ఏకైక ప్రాంతీయ వార్తల కార్యక్రమం మన తెలంగాణ భాషలో వచ్చే తీన్మార్. ఈ సంగతి టీవీని చూసే జనానికే కాదు టీవీకి చేసే మీడియా జనానికి కూడా తెలీదు.

    http://www.tvnews4u.com/tvnews-exclusive/v6-news-channel-emerge-as-the-topper-in-hyderabad-and-telangana-market/

    http://www.tvnews4u.com/buzz/comparison-of-news-channels-ratings-in-andhra-telangana-market/

    అచ్చ తెలంగాణ బిత్తిరి సత్తి, సాఫిత్రి, మంగోలి లాగే అచ్చ తెలుగులో వార్తలు చెప్పడానికి ఓ సిమ్మాద్దిరి, అప్పన్న, పోలిగాడు, కొండారెడ్డి, శీనుగాడు, ఎంకటేసు, మల్లిగాడు, రాజిగోడు, రవణ, లచ్చి, మంగతాయారు, నూకాలు చాలామందే దొరుకుతారు. మీడియా బుర్రలకు కాస్త పనిపెడితే వీళ్లంతా పుడతారు. కానీ మన భాషలో వార్తలు చెప్పేవాళ్లని కనుక్కోవడం కంటే ‘కొనుక్కునేవాళ్లే’ మన మీడియాలో ఉన్నారు. కొనుక్కునేవాళ్ల ఉద్దేశం కూడా మన భాషలో వార్తలివ్వడమే అయితే ఫర్వాలేదుగానీ, ఇచ్చేవాళ్లని దెబ్బతీసే లక్ష్యం కావడమే మీడియాకు, మనభాషకు పట్టిన దౌర్భాగ్యం. మన భాషలో వార్తలిస్తే హిందీ జనంతో పోటీపడి ఆదరించే సంస్కారం మన జనానికి ఉందని చెప్పడమే నా ఉద్దేశం. కానీ ఆ సంస్కారానికి మన మీడియా పెద్దలు అర్హత తెచ్చుకుంటారా? లేదా? అన్నదే తెలీదు.

  14. సుమనస్పతి says:

    యిది బాగున్నది!

  15. సగం కూడా చదువలేక పోయిన. సర్రున పోకుండ ఎక్కుడు దిగుడు యాస. మాట్లాడ్తె అర్థమైన్తదేమో గానీ రాసింది సద్వుడు కష్టమే!
    ఇంగోటేందంటే… కామిడి కామిడి లెక్క ఉండవట్టే సిన్మాల కామిడి లెక్క వాడుకున్నరు. టివిల గూడ కామిడీ కిందనే వాడుతున్నరు. ఏదో మాటలల్ల ఓ రెండుమూడు పదాలు పడ్తే సర్పాయ్ గానీ… అదేపనిగ తెలంగాన యాస మీద పడ్తే ఇంకమనం గక్కణ్ణే, పైకచ్చుడుండదు !!

  16. Srinivas Denchanala says:

    Mentally disabled gestures, postures and accent is not Telangana rural innocent culture.

మీ మాటలు

*