కంచికి వెళ్ళని కథలు…ఎప్పుడొస్తాయి?!

 

 చంద్ర కన్నెగంటి

 

chandraప్రపంచ కథలు చదివేవాళ్లకు తెలుగు కథలు చదివేప్పుడు రెండు విషయాలు తేలిగ్గా అర్థమవుతాయి –  వస్తువులో కొత్తదనం అరుదనీ, దాదాపు అన్ని కథనరీతులూ కొన్ని మూసలకే పరిమితమనీ. ఇందుకు ఎక్కువ శాతం రచయితలూ, సంపాదకులూ, విమర్శకులూ, పాఠకులూ అలవాటు పడిపోయారు కూడా. పడటమే కాక అదే ధోరణి అవిచ్ఛిన్నంగా సాగడానికి దోహదపడుతున్నారు. అందుకు కారణాలు వెతకడమూ, వాటి వెనక ఆలోచనలు సరయినవేనా అని పరిశీలించడమూ ఇక్కడ నా ముఖ్యోద్దేశాలు.

ప్రాచీనకాలంనుంచీ ధర్మాన్నీ, నీతినీ బోధించే కథల వారసత్వం మనది. మరోవైపు బలమైన మౌఖిక సంప్రదాయం కూడా ఉంది. అందువల్ల ఆ కథలు బిగ్గరగా, స్పష్టంగా ఉంటాయి. సమాధానం వెతుక్కోవలసిన ప్రశ్నలూ తలెత్తనీయవు. సందేహాలకు తావునీయకుండా ఆ కథలోని ధర్మాన్నీ, నీతినీ చివరికి నొక్కి చెప్పేవి. ఆ సంప్రదాయం నేటికీ కొనసాగుతుంది. కథ చదవగానే పాఠకుడు ‘అయితే ఏమిటి?’, ‘ఇందలి నీతి యేమి?’ అనే వెతుక్కుంటాడు. ‘రాకుమారిని పెళ్ళి చేసుకుని రాజ్యాన్ని అనేక యేళ్ళు సుభిక్షంగా పరిపాలించాడు ‘ వంటి కచ్చితమైన ముగింపులు లేని అస్పష్టతలు అంగీకరించలేడు.

రచయితలూ అదే ఒరవడిలో సాగుతున్నారు. రచయిత కర్తవ్యం సమాజాన్నీ, దేశాన్నీ ఉద్ధరించడమేనని ముందే నిర్ణయించబడింది. అభినందించవలసిన భావనే. అయితే ఆ భారాన్ని ఆనందంగా తలకూ, భుజాలకూ ఎత్తుకోవడంతోటే తన చుట్టుపక్కలవారి కన్నా తాను నైతికంగా, ధార్మికంగా, బౌద్ధికంగా ఒక మెట్టు పైన ఉన్న భావన కూడా రచయితలో బలపడుతుంది. తాను పూనుకోకపోతే లోకం సరయిన బాటలో నడవదన్న నిశ్చయానికి వచ్చేస్తాడు. పాఠకులంతా అయితే అమాయకుల్లానూ – వాళ్లకు దారి చూపించాలి – లేదంటే దుర్మార్గుల్లానూ – వాళ్లకు బుద్ధి చెప్పాలి –  కనిపిస్తారు. దానికోసమై రచయిత పలు అవతారాలు ఎత్తవలసివస్తుంది. ధర్మజ్ఞుడూ, నీతిబోధకుడూ, మతాధికారీ, న్యాయాధికారీ, వేదాంతీ, ఆర్థిక నిపుణుడూ, రాజకీయవేత్తా, సామాజిక శాస్త్రవేత్తా, మనోవైజ్ఞానికుడూ, సాంస్కృతికాధికారీ మొదలయిన వాళ్లు చేసే పనులూ, చూపించే పరిష్కారాలూ చేసేసి ఊరుకుంటాడు. ఆయా రంగాల్లో తన అర్హత ఏమిటన్నది ప్రశ్నించుకోడు. ఎంత నిజాయితీగా, నమ్మకంతో చేసినా తనకు అలివికాని పని నెత్తిన వేసుకున్నప్పుడు అది నిష్ప్రయోజనం.

సమాజాన్ని పీడించే సమస్యలు అనేకం. కథ అనే సుత్తి చేతిలోకి తీసుకున్నాక ఆ మేకుల కోసమే వెదుకులాట.  కొత్తవేమీ దొరకవు. వాటిని వెలుగులోకి తెచ్చి చర్చకు పెట్టడంతో ఆగిపోకుండా పరిష్కారాలూ సూచించాలంటే అందుకు క్షేత్రస్థాయిలో కృషి చేసే వాళ్ళూ, ఆయా శాస్త్రాల్లో నిపుణులూ అయి ఉండాలన్న గమనింపు ఉండదు. ఇవన్నీ తన ఆక్రోశాన్ని వెళ్లబోసుకుని తృప్తి పడడానికి తప్ప ఉపయోగపడవు. ఒక రకంగా తన అపరాధభావన కడిగేసుకుని, మనిషిగా తన బాధ్యత తీరిపోయిందనుకుని మరేదీ చేయవలసిన అవసరం లేదని నచ్చచెప్పుకున్నట్టు ఉంటుంది. ఇద్దరు తోటి ప్రయాణికులు ‘ఎంత దారుణమమ్మా!’ అంటే ‘లోకం పాడయిపోయందమ్మా!’ అని వాపోవడం కంటే ఇందులో పెద్ద తేడా ఏదీ ఉండదు.

పోనీ, ఆ కథలు విలువయిన, నేర్చుకోవలసిన జీవిత పాఠాలే చెపుతున్నాయనుకుందాం. కాల్పనిక సాహిత్యం చదవడం వల్ల మనుషుల్లో సానుభూతీ, ఎదుటివారి స్థితిగతులను అర్థం చేసుకునే స్థాయీ పెరుగుతాయనే పరిశోధనలు తేలుస్తున్నాయి. అయితే అది తాత్కాలికం కాదనీ, ఆ ఆలోచన క్రియారూపం దాలుస్తుందనీ చెప్పడానికి ఆధారాలు లేవు. అసలు ముందే ఎక్కువ మోతాదులో స్పందించేవారే పుస్తకాలు చదివి ఆనందిస్తారనే విషయాన్నీ కొట్టిపారేయలేం. కథలూ, పుస్తకాలూ మనల్ని ఉన్నతులుగా చేస్తాయనీ, ఉదాత్తంగా మారుస్తాయనీ గుడ్డిగా నమ్మడమే కానీ స్పష్టమైన ఆధారాలు చూపలేం.

అటు ధర్మ సంస్థాపనో, ఇటు సమసమాజమో తన రాతల ద్వారా సిద్ధిస్తుందనుకోవడం ఒక భ్రమ. ఎంతగా నమ్మినప్పటికీ, అదెంత సరి అయిన ఆలోచన అయినా, ఎంతగా అభిలషించినా అది నిజం కాదు. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి – ‘ఈ కథలూ పుస్తకాలూ చదవకపోతే మరోలా ప్రవర్తించి ఉండేవాడిని ‘, ‘నా నిర్ణయం వేరేలా ఉండేది ‘ అనుకున్న సందర్భాలు గుర్తున్నాయా? ‘నాలో ఇంత సహనమూ, సంయమనమూ, పరిణితీ, దయా, జాలీ, క్షమా, త్యాగబుద్ధీ పుస్తకాలు చదవకపోతే ఉండేవి కావు ‘ అని ఎప్పుడయినా అనుకున్నారా? వ్యక్తిగతంగా ఎంత ఎదిగారు అన్నది కాక సమాజం దృష్టిలో మెరుగయిన వ్యక్తిగా మారారనిపించిందా? సమాజ సేవ చేస్తున్న వాళ్లంతా పుస్తకాలు చదివి చేయడం లేదు. హిట్లర్ తెగ చదివేవాడనీ, అతని గ్రంథాలయంలో పదహారు వేల పై చిలుకు పుస్తకాలుండేయనీ తెలుస్తూంది. పాఠకుల సంగతి అటుంచి తమ రాతలు రచయితలనయినా మారుస్తున్నాయనిపించదు. అందుకు ఇంటర్నెట్ సాహితీవేదికలపై చర్చల ధోరణినే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. (కలిసొస్తే కింద కామెంట్లలోనూ ఆ ధోరణి కనిపించకపోదు.)

పోనీ, ఆ కథలు నిజంగానే పాఠకుల్లో మార్పు సాధిస్తాయనే అనుకుందాం. తొమ్మిది కోట్ల తెలుగువారిలో ఇవి చదివే వారి సంఖ్య కొన్ని వేలకు మించదు. ఆ చదివేవారిలో అది చదివేప్పటికే ఆ కథ ఉద్దేశించిన చైతన్యం కలగి ఉండని వారెంతమంది? ఒక్క మనసునో, ఒక్క జీవితాన్నో మార్చినా చాలదా అనుకోవచ్చు కానీ, అప్పుడీ రచనావ్యాసంగమంతా చాలా అసమర్థమైనదనీ, ఇంతకంటే ఫలప్రదమయిన దారులు ఉన్నాయనీ గ్రహించవలసి ఉంటుంది.

ఈ మార్చడం మీదే దృష్టంతా కేంద్రీకరించడంతో, కథ ఒక కళారూపమన్న విషయం మరుగున పడి పనిముట్టుగానే మిగిలిపోయింది. కష్టాన్నీ, బాధనూ ఎత్తిచూపడం మంచి కథకు కొలమానంగా మారింది. అది ముందెన్నడూ ఎరగనిదయితే  మరీ మంచిదిగా భావించబడుతుంది. స్పందించే హృదయాలు సానుభూతి చూపక తప్పదు కానీ కథ అందుకే పరిమితమవుతూంది. కథను కథగా నిలిపే మిగతా అంశాలేవీ గమనించే, ఆస్వాదించే వీలు రచయితలూ, పాఠకులూ కల్పించుకోలేకుండా ఉన్నారు.

పాఠకులంతా ఒకే స్థాయిలో ఉండరు. వారి పఠనావసరాలు ఒకేలా ఉండవు. ఎవరూ ఒకేలాంటి సాహిత్యం పదేపదే చదవరు. వైవిధ్యం కావాలి. రచయిత బాధ్యత ఒకటే – కథ రాయడం. కష్టాలూ, బాధల గురించి రాసినా కొత్తవాటి గురించి రాయాలి, లేదా కొత్తగా రాయాలి. కనీసం ఇంతకుముందుకంటే బలంగా రాయాలి. సమాజానికి దిశానిర్దేశం చేయడమొక్కటే ధ్యేయమనుకోరాదు. తెలుగు కథ స్పృశించని జీవితకోణాలు శోధించాలి, అనుభూతులకు అక్షరరూపమివ్వగలగాలి. కల్పనా చాతుర్యమూ, ఊహా నైపుణ్యమూ చూపాలి. పాఠకుడికీ కథలో జాగా ఇవ్వాలి. మరింతమందిని చదివించాలి.

(హ్యూస్టన్ లో గత ఏడాది అక్టోబర్ లో వంగూరి ఫౌండేషన్ జరిపిన అమెరికా కథ స్వర్ణోత్సవాలు & 9 అమెరికా తెలుగు సాహితీ సదస్సులో చదివిన ప్రసంగ సారానికి కొన్ని చేర్పులతో)

*

మీ మాటలు

 1. “కలిసొస్తే కింద కామెంట్లలోనూ ఆ ధోరణి కనిపించకపోదు” — ఇంకా నవ్వాగట్లేదు.
  కథ మూస ధోరణిలో వుండటం, కష్టాలూ/కన్నీళ్ళు కథలో వుంటేనే మంచి కథ అనుకోవడం అనేవి నిజమే కానీ కథ ఎవర్నైనా మారుస్తుందా అంటే నావరకూ మారుస్తుందనే నమ్ముతున్నా. ఏ విశయం మీదనైనా మన స్పందన మనకు ఆ విశయం మీదున్న అవగాహనను బట్టే కదా వుంటుంది? అవగాహన మన స్వీయ పరిశీలన మీదో, అనుభవం మీదో కదా ఆధారపడుతుంది? ఉదాహరణకు మొన్న గుజరాత్‌లో జరిగిన పటేళ్ళ వుద్యమం చూస్తే అది న్యాయమనే వాళ్ళ అనుభవం/అవగాహన వేరు. అన్యాయమనే వాళ్ళ అనుభవం/అవగాహన వేరు. ఇందులో ఎవరికి వారు తమ వాదనే న్యాయమంటారు. పట్టణాల్లో పెరిగిన వారు కుల వివక్ష ఇప్పుడెక్కడుందీ అంటారు, పల్లెల్లో పెరిగిన వారు తద్భిన్నంగా ఆలోచిస్తారు.
  కథలు మనకు తెలియని పార్శ్వాన్ని అనుభవించేలా చేస్తాయని నా నమ్మకం. దాని వల్ల వివిధ అంశాల మీద అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరిగినప్పుడు ఏ అంశం మీదనైనా స్పందన భిన్నంగా వుంటుంది. కథకుడు పరిష్కారం చూపక్కరలేదు కానీ పాఠకుడు చూడని విశయాన్ని చూపించగలిగితే చాలు.
  “నాలో ఇంత సహనమూ, సంయమనమూ, పరిణితీ, దయా, జాలీ, క్షమా, త్యాగబుద్ధీ పుస్తకాలు చదవకపోతే ఉండేవి కావు.” – అనే అనుకుంటున్నా.

  మీ పూర్తి ప్రసంగ పాఠం ఎక్కడైనా లభ్యమైతే చెప్పండి, చదవాలని వుంది.

  • Chandra Kanneganti says:

   ఆ ప్రసంగం ఇంకా చిన్నదండీ! ఇక్కడ లేని విలువయినదేదీ అందులో లేదు.

 2. మరిన్ని దుఃఖాశ్రువుల్ని బయటకు తోడింది మీ కవిత.

 3. క్షమించండి. మరోచోట రాయాల్సిన వాఖ్య పొరబాటున ఇక్కడ రాశా.

 4. On my way home, after watching a play, say a Daana Veera Soora Karna, if I come across a beggar on the street shivering – no, the play I watched wouldn’t make me go to him and serve him with food and clothes. If only art has that power over us! (That would be an interesting premise for a story, don’t you think? :) ) That said, because of the play, I now have an idea his poverty, my riches and the gulf between us. It brings to my notice, if I had forgotten, that I can’t be what I want to be. In that sense, art “does” something to us.

  What it does? At what level? In what way? How does it do? – all are personal experiences, I guess.

  Coming to stories written in our language, there is a serious dearth of experimentation and observation. Despite so much happening around us, we’re still inclined to tell a story in an obsolete way. We still want our stories to be told only in Telugu, even if we, while speaking in our daily lives, hardly complete a Telugu sentence without English / Hindi in it. We eat all fancy stuff with all fancy tools, but in a story, it has to be “kancham”, “aavakaaya”, “mudda”. In a story of daughter-in-law and mother-in-law, one of them has to have the “suryakantham” shades and the other is the victim! Most of the times, men are the culprits, the criminals. Software industry folks are consumeristic and materialistic, with no emotions whatsoever.

  And everyone’s responsible for it. The readers, the writers,the elusive editors! Somewhere, someone has to against the stream, if the scene has to change.

 5. బాగుంది. మా వేదిక ఈ ప్రయత్నమే చేస్తుంటాం. ఒకే మూసలో వెళ్ళిపోతూ…మీరన్నట్టు రచయిత బాధ్యత ఒకటే – కథ రాయడం. కష్టాలూ, బాధల గురించి రాసినా కొత్తవాటి గురించి రాయాలి, లేదా కొత్తగా రాయాలి.తెలుగు కథ స్పృశించని జీవితకోణాలు శోధించాలి, అనుభూతులకు అక్షరరూపమివ్వగలగాలి. !
  కాని కొందరు రచయితల, పాఠకుల స్పందనలు చూస్తుంటే వారి సహనం కంటే తాలిబాన్లకే సహనం ఎక్కువ ఉందేమో అనిపిస్తుంటుంది.
  ఈ జాలం అవతరించకముందు.ఇప్పుడు వస్తున్న ఈ కథలమీద, ఆ కథల కోసం తీసుకున్న వస్తువు మీద, ఆ పాత్రలు వాడిన భాషమీద కొంత మంది పాఠకుల అభిప్రాయాలని చదివిన తరువాత, ఇవన్నీ కూడా సెక్సు అంటే బూతు పదాలు వాడినందుకు వచ్చిన విమర్శలు అనే అనిపిస్తోంది. కొంత మంది అనుకునే బూతు ఆలోచనలు, అవి బయట పెట్టినందుకు వచ్చిన విమర్శలు గానే మిగిలిపోతాయి తప్ప మరొకటి కాదు.

 6. తప్పేమి జరగలేదు కాని నేను ఇద్దామనుకున్న లంకె ఇది:
  నాలుగు అక్షరాలు – మూడు కథలు

 7. ప్రతి రచయితా, తన జీవితం నుంచీ రాయడం మొదలుపెడితే “కొత్త” దానంతట అదే వస్తుందనిపిస్తుంది నాకు. నిజాన్ని, కల్పనలాగా జోడించి నెరేట్ చెయ్యగలిగే పట్టు కొంతకాలానికి చుట్టూ ఉన్న దేన్నైనా కథగా మలచగలిగే స్కిల్ ని ఇస్తుంది. కానీ ప్రారంభం స్వీయానుభవాల్లోంచీ కథలు అల్లడంతో మొదలైతే వైవిధ్యం వస్తుంది. చాలా వరకూ “నీతి కథల ధోరణి” తగ్గుతుంది.

 8. చందుతులసి says:

  కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందట….. ఎందుకో కన్నె గంటి చంద్ర గారి పై పోస్టు చదివాక ఆ సామెత గుర్తొచ్చింది. ఆ సామెత ఇక్కడ సరిగ్గా అతుకుతుందో లేదో కానీ నాకెందుకో హఠాత్తుగా స్ఫురించింది.
  – చంద్ర గారు అవసరమైన విషయాన్ని చర్చకు ఎంచుకున్నారు. రాసిన తీరు కూడా చాలా చక్కగా ఉంది. ప్రజాస్వామ్య దేశంలో…ఎవరు ఏ అభిప్రాయమైనా చెప్పవచ్చు. పోనీ ఓ సందర్భంలో ఒక అభిప్రాయమూ….మరో సందర్భంలో మరో అభిప్రాయమూ చెప్పాల్సిన భిన్న పరిస్థితులు ఎదురుకావచ్చు. కానీ పరస్పర భిన్న వ్యాఖ్యలు ఒకేసారి చేయడమే ఆశ్చర్యం కలిగించింది.

  – పోస్టు ప్రారంభంలో చంద్ర గారు ఏమంటారంటే….ఇక్కడ చంద్రగారు అన్నవి బ్రాకెట్లతో ఇస్తున్నాను.
  ( – ప్రపంచ కథలు చదివేవాళ్లకు తెలుగు కథలు చదివేప్పుడు రెండు విషయాలు తేలిగ్గా అర్థమవుతాయి – వస్తువులో కొత్తదనం అరుదనీ, దాదాపు అన్ని కథన రీతులూ కొన్ని మూసలకే పరిమితమనీ. ఇందుకు ఎక్కువ శాతం రచయితలూ, సంపాదకులూ, విమర్శకులూ, పాఠకులూ అలవాటు పడిపోయారు కూడా. పడటమే కాక అదే ధోరణి అవిచ్ఛిన్నంగా సాగడానికి దోహదపడుతున్నారు. అందుకు కారణాలు వెతకడమూ, వాటి వెనక ఆలోచనలు సరయినవేనా అని పరిశీలించడమూ ఇక్కడ నా ముఖ్యోద్దేశాలు. )

  ….ఇది చదివాక మనమేం ఏమనుకుంటాం…ఓహో మన తెలుగు కథ ప్రపంచ కథకంటే వెనకపడిపోయిందని… ఈ పోస్టు చదివాక మనకు మన కథ వెనకపడటానికి కారణాలు….అవి సరైనవో కావో తెలుసుకోబోతున్నాం అని అనుకుంటాం.
  అంతకన్నా ముందు ఇంకో సందేహం. చంద్ర గారు అంటున్నట్లు అసలు ప్రపంచ కథ అంటే ఏమిటీ….?
  ఇటు జపాన్ కథ నుంచి అటు పక్క హవాయి దీవుల దాకా ఉన్న ప్రపంచ భాషలన్నింటి కథా…?
  లేక ఆంగ్లమే ప్రపంచమనుకునే ప్రపంచం కథా…? పోనీ ఏదో ఒకటి. సరే ఆ ప్రపంచమో…ఈ ప్రపంచమో… ఏదో ఒక ప్రపంచ కథతో పోలిస్తే సర్వ విధాలా తెలుగు కథ వెనకపడిపోయింది. సరే మళ్లీ ఇంకో సందేహం. తెలుగు కథ అంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే తెలుగు వాళ్లంతా మాట్లాడే తెలుగు కథ గురించేనా…? లేక అమెరికాలోని తెలుగు కథా…? బహుశా రెండోది కాదనే నేననుకుంటున్నాను. అసలు అలాంటి అవకాశం కూడా ఉండకూడదనుకుంటాను. అమెరికా తెలుగు కథ ఐనా…ఫీజీ దీవుల్లో ఐనా తెలుగు మనుషుల కథ ..అందరి తెలుగు వాళ్ల కథ అవుతుంది అనుకుంటున్నాను. ఆ రకంగా తెలుగు కథ మిగిలిన ప్రపంచ కథతో వెనకబడిపోయింది.

  – ఇంకా చంద్ర గారు ఏమంటారంటే….

  @ ( ధర్మజ్ఞుడూ, నీతిబోధకుడూ, మతాధికారీ, న్యాయాధికారీ, వేదాంతీ, ఆర్థిక నిపుణుడూ, రాజకీయవేత్తా, సామాజిక శాస్త్రవేత్తా, మనోవైజ్ఞానికుడూ, సాంస్కృతికాధికారీ మొదలయిన వాళ్లు చేసే పనులూ, చూపించే పరిష్కారాలూ చేసేసి ఊరుకుంటాడు. ఆయా రంగాల్లో తన అర్హత ఏమిటన్నది ప్రశ్నించుకోడు. )
  – ఆయా రంగాల గురించి వ్యాసాలు రాయడానికో, పుస్తకాలు రాయడానికో ఐతే మీరు చెప్పిన అర్హత కావాలి. కానీ కథ రాయడానికి ఆయా రంగాల నిపుణులే రాయాలంటే ఎట్లా..? మతమో. నీతి సిద్ధాంతమో…ఆర్థిక సమస్యో..రాజకీయమో…తన మీద లేదా తనకు తెలిసిన వారి చూపిన ప్రభావాన్ని…వాళ్ల జీవితంలో లేపిన అల్లకల్లోలాన్ని పాత్రల ద్వారా చూపించే ప్రయత్నం కథా రచయిత చేస్తాడు. దానికి నిపుణత ఎందుకు….స్పందిచే గుణం చాలదా….? పోనీ నిపుణతను ఎలా చూడాలి….నిపుణుడే అని ఎవరు చెప్పాలి..? పోనీ ఒకసారి వచ్చిన నిపుణత ఆ రంగంలో సదరు వ్యక్తికి జీవితాంతంతం ఉంటుందా..? మొత్తంగ కథ రాయడానికి స్పందించే గుణం….ఆకట్టుకునే కథనం లాంటివి తప్ప… నైపుణ్యం దేనికండీ.?

  – ఇంకా నయం. ఇక్కడ స్పందించాల్సిన పాఠకులు కూడా ఆయా శాస్త్రాల్లో (? ) నిపుణులై ఉండాలని అనలేదు కాబట్టి నేను స్పందించాను.
  ఒక వేళ అలాంటి నిబంధన కానీ ఉండి ఉంటే నా రాతలు పట్టించుకోకండి. ఎందుకంటే నేను నిపుణుడిని కాదు. మీరు నిపుణులో కాదో కూడా నాకు తెలీదు.

  -@ కథలూ, పుస్తకాలూ మనల్ని ఉన్నతులుగా చేస్తాయనీ, ఉదాత్తంగా మారుస్తాయనీ గుడ్డిగా నమ్మడమే కానీ స్పష్టమైన ఆధారాలు చూపలేం.
  ….ఏది తోస్తే అది రాసేస్తే ఎలాగండీ….? పుస్తకాలు ఒక్క మనుషుల్నే కాదు…ప్రపంచాన్నే మరిచిన దాఖలాలు కోకొల్లలు. మీకు ఆధారాలు కావాల్సిందే అని చెపితే నేను తెలుగులోనే గురజాడ కన్యాశుల్కం నుంచి….గొరుసు జగదీశ్వర్ రెడ్డి గజఈతరాలు దాకా వంద సాక్ష్యాలు చూపిస్తాను. శ్రీశ్రీ మహాప్రస్థానం , చలం మైదానం, శివసాగర్, గద్దర్, వంగపండు పాట….ఇవన్నీ తెలుగులో వచ్చాయనీ అవి కొన్ని తరాల్ని ప్రభావితం చేశాయని మరిచిపోతే ఎలా చంద్రగారు…?

  – పోనీ ఇంకో సూటి ప్రశ్న….మీరు రాసిన ఈ వ్యాసం చదివి తెలుగు కథా రచయితలు మారితే బాగుండు అన్న ఆశతోనే రాశారా…ఆ మనం ఎన్ని రాసినా ఎవరూ మారరు అనే మీ గుడ్డినమ్మకం తోనే రాశారా…? బహుశా మంచి నమ్మకంతోనే రాశారని నేననుకుంటున్నాను. అంటే పరోక్షంగా మన రాతలు పుస్తకాలు మనుషుల్ని ప్రభావితం చేస్తాయని మీరే ఒప్పుకుంటున్నారు.

  – @ ( రచయిత ఆయా రంగాల్లో తన అర్హత ఏమిటన్నది ప్రశ్నించుకోడు. ఎంత నిజాయితీగా, నమ్మకంతో చేసినా తనకు అలివికాని పని నెత్తిన వేసుకున్నప్పుడు అది నిష్ప్రయోజనం. )

  – దీనికి స్పందించాల్సింది ఏమీలేదు. ఈ వాక్యంతో నేను చంద్రా గారితో నూటికి నూటయాభై పాళ్లు ఏకీభవిస్తున్నాను.
  నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీరే మీ గురించి చెప్పారు. ధన్యవాదములు.

  – @ ( పాఠకులంతా ఒకే స్థాయిలో ఉండరు. వారి పఠనావసరాలు ఒకేలా ఉండవు. ఎవరూ ఒకేలాంటి సాహిత్యం పదేపదే చదవరు. వైవిధ్యం కావాలి. రచయిత బాధ్యత ఒకటే – కథ రాయడం. కష్టాలూ, బాధల గురించి రాసినా కొత్తవాటి గురించి రాయాలి, లేదా కొత్తగా రాయాలి. కనీసం ఇంతకుముందుకంటే బలంగా రాయాలి. సమాజానికి దిశానిర్దేశం చేయడమొక్కటే ధ్యేయమనుకోరాదు. తెలుగు కథ స్పృశించని జీవితకోణాలు శోధించాలి, అనుభూతులకు అక్షరరూపమివ్వగలగాలి. కల్పనా చాతుర్యమూ, ఊహా నైపుణ్యమూ చూపాలి. పాఠకుడికీ కథలో జాగా ఇవ్వాలి. మరింతమందిని చదివించాలి.)

  – అవును మీరు చెప్పాలనుకున్నది ఇది మాత్రంమే …ఐతే నేను మీతో ఏకీభవిస్తున్నాను. కానీ కింది వ్యాఖ్యలు మాత్రం అభ్యంతరకరం.

  -@ ( పాఠకులంతా అయితే అమాయకుల్లానూ – వాళ్లకు దారి చూపించాలి – లేదంటే దుర్మార్గుల్లానూ – వాళ్లకు బుద్ధి చెప్పాలి – కనిపిస్తారు. ) రచయితలకు పాఠకులు ఎలా కనిపిస్తున్నారో కానీ…మీకు రచయితలు ఎలా కనిపిస్తున్నారో నాకు అర్థమైంది.
  ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. కానీ మీరు ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పారు. చివరగా నాదో విజ్ఞప్తి…
  మన రాతలో ఆవేదన కనిపించవచ్చు. ఆరోపణా కనిపించవచ్చు. కానీ దానికి సరైన ఆధారం ఉండాలి. అప్పుడే అది అర్థవంతంగా ఉంటుంది.

  • Chandra Kanneganti says:

   Q.E.D అని రాసి వదిలేద్దామని కొంచెం పీకింది కానీ వ్యంగ్యపు విసుర్ల వల్ల చర్చకు ఒనగూడేదేమీ లేదు. నన్ను కించపర్చడంవల్ల నా వాదన వీగిపోదు. నా వాదంలో లొసుగులు ఉంటే చూపాలి, ఎదురు ఉదాహరణలివ్వాలి. సాధారణంగా వాదనలో ఆవేశం చోటు చేసుకున్నప్పుడూ, నేను చెప్తున్న విషయాల మీద కాక నా మీదికి చర్చ మళ్లించాలని చూసినప్పుడూ తప్పుకుంటాను. కానీ మీరు ఓపిగ్గా ఇంత వ్యాఖ్య చేశారు కనక బదులిస్తున్నాను.

   – కానీ పరస్పర భిన్న వ్యాఖ్యలు ఒకేసారి చేయడమే ఆశ్చర్యం కలిగించింది.

   అవేవో చెప్పడం మర్చిపోయినట్టున్నారు. ఎత్తి చూపితే సరి చేస్తాను.

   – ఆయా రంగాల గురించి వ్యాసాలు రాయడానికో, పుస్తకాలు రాయడానికో ఐతే మీరు చెప్పిన అర్హత కావాలి. కానీ కథ రాయడానికి ఆయా రంగాల నిపుణులే రాయాలంటే ఎట్లా..? మతమో. నీతి సిద్ధాంతమో…ఆర్థిక సమస్యో..రాజకీయమో…తన మీద లేదా తనకు తెలిసిన వారి చూపిన ప్రభావాన్ని…వాళ్ల జీవితంలో లేపిన అల్లకల్లోలాన్ని పాత్రల ద్వారా చూపించే ప్రయత్నం కథా రచయిత చేస్తాడు. దానికి నిపుణత ఎందుకు….స్పందిచే గుణం చాలదా….?

   కథలు ఆయా రంగాల్లో నిపుణులే రాయాలనలేదు. కథకుడికి కథలు రాసే నైపుణ్యం ఉంటే చాలు. ఆ వాక్యం మళ్లీ చదవండి – “…మొదలయిన వాళ్లు చేసే పనులూ, చూపించే పరిష్కారాలూ చేసేసి ఊరుకుంటాడు.” పరిష్కారాలు చూపడానికి ఆయా రంగాల్లో పనిచేసి ఉండాలనే నమ్ముతాను.

   – మీకు ఆధారాలు కావాల్సిందే అని చెపితే నేను తెలుగులోనే గురజాడ కన్యాశుల్కం నుంచి..

   అంటున్నారు కానీ ఇవ్వడం లేదు. కన్యాశుల్కం చదివి కన్యాశుల్కాలూ, బాల్యవివాహాలూ ఆగిపోయాయా? వరవిక్రయం వచ్చాక వరకట్నాలు ఆగిపోయాయా? గజ ఈతరాలు చదివి ఆత్మహత్యలు మానేశారా? ఉన్నాయనుకున్నా ఎన్ని ఉదాహరణలు ఇవ్వగలరు? తెలుగు సమాజం పై ఏ కథలయినా, నవల అయినా ఎటువంటి ప్రభావం చూపాయో ఏవయినా పరిశోధనలు జరిగాయేమో చెప్పగలరా?

   – పోనీ ఇంకో సూటి ప్రశ్న….మీరు రాసిన ఈ వ్యాసం చదివి తెలుగు కథా రచయితలు మారితే బాగుండు అన్న ఆశతోనే రాశారా…ఆ మనం ఎన్ని రాసినా ఎవరూ మారరు అనే మీ గుడ్డినమ్మకం తోనే రాశారా…? బహుశా మంచి నమ్మకంతోనే రాశారని నేననుకుంటున్నాను. అంటే పరోక్షంగా మన రాతలు పుస్తకాలు మనుషుల్ని ప్రభావితం చేస్తాయని మీరే ఒప్పుకుంటున్నారు.

   నేను కథల గురించి రాశాను. మీరు వ్యాసం గురించి ప్రశ్నిస్తున్నారు. అయినా చెప్తాను – మీ వాదన తేలిపోతుంది కనక మీరు నమ్మకపోయినప్పటికీ – మారతారూ, మారరూ అన్నదాకా నేను ఆలోచించలేదు. ఒక చర్చ జరుగుతుందని ఆశించాను. ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుందని ఆశించడం కూడా అత్యాశేనన్న గ్రహింపు నాకుంది. (మీ తర్కాన్నే వాడితే దీన్ని చదివి మీరు మారలేదు. మారరని మీరే నిరూపించారు.)

   > కానీ మీరు ఏదో చెప్పాలనుకుని ఇంకేదో చెప్పారు

   కచ్చితంగా చెప్పాలనుకున్నదే చెప్పానని నాకు తెలుసు. అది మీకు అర్థమయ్యేలా చెప్పలేకపోయి ఉండొచ్చు.

 9. “ప్రపంచ కథలు చదివేవాళ్లకు తెలుగు కథలు చదివేప్పుడు రెండు విషయాలు తేలిగ్గా అర్థమవుతాయి” ఈ వాక్యంతో మొదలైన వ్యాసం ఎట్ల ఉండబోతుందో మొదటి వాక్యంలోనే అర్ధం అయింది. అట్లనే ఉన్నది.
  పోలికలు, సారూప్యతలు చూసుకునే అవసరం ఏముంది? జీవన విధానాలు అట్లనే ఉన్నయా అన్ని దేశాల్లో?
  కొందరంటారు… “హాలీవుడ్ సినిమాల ముందు మన సినిమాలు ఎందుకు అక్కరకోస్తయ్”..అని.. ఆ అభిప్రాయానికీ ఈ అభిప్రాయానికి తేడా ఏముంది? అలా అనే వాళ్ళు చూసే సినిమాల స్థాయి కూడా అట్లనే ఉంటది.
  మంచివి వదిలేసి, ఫార్ములా సినిమాలు చూసి హాలీవుడ్ తో పోలికలు పెట్టి మన వాళ్ళెం తీస్తారని సినిమా పండితులు, మంచి సాహిత్యం వదిలేసి చదివిన కొన్నింటి మీద ప్రపంచ కథతో పోలిక పెట్టి మన వాళ్ళెం రాస్తారు అని “విమర్శకులు”..
  ఇంకా చదవండి.. తెలుగులో అద్భుతమైన సాహిత్యం ఉంది. మీరు చదవనంత మాత్రాన కంచికి పోనీ కథలు లేవని కాదు. మీరు చదవలేదంతే.

  • ఆరి సీతారామయ్య says:

   తెలుగులో మంచి కథలు రాలేదని చంద్ర గారు అనలేదు.
   “ప్రపంచ కథలు చదివేవాళ్లకు తెలుగు కథలు చదివేప్పుడు” అంటే సగటు తెలుగు కథను అలాంటి ఇతర దేశాల కథలతో పోలిస్తే అని అర్థం.

   ఆరి సీతారామయ్య

   • “అలాంటి ఇతర దేశాల కథలతో పోలిస్తే అని అర్థం”….
    అవును.. “పోలిస్తే” అనే అంశం గురించే ప్రస్తావించడం జరిగింది.

 10. ఆరి సీతారామయ్య says:

  “తాను పూనుకోకపోతే లోకం సరయిన బాటలో నడవదన్న నిశ్చయానికి వచ్చేస్తాడు. పాఠకులంతా అయితే అమాయకుల్లానూ – వాళ్లకు దారి చూపించాలి – లేదంటే దుర్మార్గుల్లానూ – వాళ్లకు బుద్ధి చెప్పాలి – కనిపిస్తారు. దానికోసమై రచయిత పలు అవతారాలు ఎత్తవలసివస్తుంది. ధర్మజ్ఞుడూ, నీతిబోధకుడూ, మతాధికారీ, న్యాయాధికారీ, వేదాంతీ, ఆర్థిక నిపుణుడూ, రాజకీయవేత్తా, సామాజిక శాస్త్రవేత్తా, మనోవైజ్ఞానికుడూ, సాంస్కృతికాధికారీ మొదలయిన వాళ్లు చేసే పనులూ, చూపించే పరిష్కారాలూ చేసేసి ఊరుకుంటాడు.”

  బ్రావో చంద్ర గారూ.

 11. మీరు వ్యాఖ్యనించబోయేముందు గొర్తి సాయిబ్రహ్మానందం గారి వ్యాసం ఇదే సారంగలో ఇక్కడుంది. అది కూడా చదివి వ్యాఖ్యానించండి.

  డయాస్పోరా కథ ఇంకా పసిబిడ్డే!

 12. krishna mohan says:

  కధ ఎవరిని మార్చిన దాఖలా లేనప్పుడు, మారుస్తాయని నమ్మకం మీకు లేనప్పుడు అసలు మీ వ్యాసానికే అర్ధం లేదు కదా? ఇంకా దేని గురించి మీ ఈ తాపత్రయం.

  • Chandra Kanneganti says:

   కథ కోసం. అది ఎవరినీ మార్చదని, మార్చినా ఆ మార్పు క్రియాశీలకమైనది కాదనీ, అయినా అంత ఎక్కువమంది ఏమీ మారరని తెలుసుకుంటే దాని పరిధి పెద్దదవుతుందని.

 13. నీహారిక says:

  కధలు ,నవలలు, సినిమాలు అనే కాదు రాజకీయాల్లో కూడా కొత్త ప్రయోగాలు చేయడం తెలుగువారికి అలవాటు లేదు. ఒక కొత్త ప్రయోగం చేయడం అనేది చాలా తక్కువమంది చేస్తారు అదికూడా తెలుగువారిలో చాలా తక్కువమంది అని అర్ధం. మళయాళీలు నేటివిటీకి దగ్గరగా ప్రయోగాలు ఎక్కువగా చేయడానికి కారణం కూడా వారిలో విద్యాధికులు ఎక్కువమంది ఉండడమే కావచ్చు. మనం ప్రయోగం చేసినా అర్ధం చేసుకోడానికి పాఠకులు కూడా విధ్యాధికులు అయిఉండాలి కదా ? తెలుగువారిలో పఠనాసక్తి కలవారెందరు ? జీవితంలో విషాదముంటుందని తెలిసినా తెలుగువారికి విషాదాంతం నచ్చదు. కొత్తదనం నచ్చదు, ఆర్ట్ సినిమాలకు కలెక్షన్లు రావు. యండమూరి కొత్తగా ఆలోచించి విజయానికి మెట్లు వ్రాయలేదు, ఎవరో వ్రాసింది చదివి వ్రాసారు. ఎవరు ఏమి వ్రాసినా వారి జీవితంలో జరిగిన,చూసిన వాటినే వ్రాయగలరు. మన జీవితాల్లో కొత్తగా ఏముందని కొత్త ఆలోచనలు కొత్త కధలు వస్తాయి ?

 14. Allam Vamshi says:

  అప్పట్లో మా దోస్త్ ఒకరు సేం టు సేం ఇట్లనే అంటుండే, ఏ కథ చుపెట్తిన్నా అబ్బే రష్యా కథల ముంగట అమెరికన్ కథల ముంగట మనవి ఉత్త ముచ్చట అసల్ వేస్ట్ అని అంటుండే.. ఇగ ఓ రోజు ఏం చేసినా అంటే పొద్దటికెల్లి సాయంత్రం దాక కూసోని రావిశాస్త్రి కథల్లో ఓ కథను, అల్లం రాజయ్య కథల్లో ఓ కథనూ, కొడవగంటి కథల్లో ఒక కథను అతి కష్టమ్మిద క్యారెక్టర్లూ, ప్రాంతాల పేర్లు మార్చీ పొద్దంత కథలను రీటైప్ చేసి, వాటి రచయిత మాక్సిం గోర్కీ అని పెట్టి ప్రింట్ తీసి “నాకు మస్తు నచ్చిన ఇంగ్లిష్ కథల్రా” ఇవి, అందుకే తెలుగులకు ట్రాన్స్ లేట్ చేసి పేపర్ కు పంపిద్దమనుకుంటున్న, ఓసారి నువ్ చదివి ఫీడ్ బ్యాక్ చెప్పు అని వాని ముంగట పెట్టిన.. అవి చదివి వాడన్నడు- , అరే అసల్ చూష్నవారా ఈ కథలెట్లున్నయో! అన్నేండ్ల కిందట్నే ఎంత గొప్ప సాహిత్యమో చూష్నవా అక్కడ! మనవాళ్లు ఇంక 200 యేండ్లైనా ఈ లెవెల్ కు రీచ్ కార్ర భై! మన మొత్తం రైటర్లను కలిపి కూసొబెట్టి రాపించ్చినా ఇసొంటి కథ ఒక్కటన్న రాస్తరారా? వాళ్ళు గ్రేట్ రా నిజంగ, అసల్ ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ లు ఎట్ల దొర్కుతయోరా వాళ్లకు!! గ్రేట్! అదే మనకాడైతె అన్ని ఏడుపుగొట్టు కథలే.. ఊకె అదే ఏడుపు! అందుకే నా మాట విని నువ్ కుడ దేశి కథలు బంజేసి ఇట్ల మెచూర్డ్ కథల్ సదువ్” అన్నడు. :)
  నేనేం మాట్లాడలే ఇగ.. 😜

  • Chandra Kanneganti says:

   తెలుగులో మంచి కథలు లేవనీ, రావడం లేదనీ అన్నానని ఎందుకు అర్థం చేసుకున్నారో తెలియదు. ఎక్కువ శాతం కథలు ఒక పరిధిలోనే ఎందుకు తిరుగుతున్నాయో తెలుసుకోవాలనుకునే ప్రయత్నం ఇది.

 15. Madhu Chittrvu says:

  ఎప్పుడో ముళ్ళపూడి గారు జ్యోతి మాస పత్రిక లో రాసినది గుర్తుకొస్తోంది.తెలుగు వాడిని తిట్టి ఏ బెంగాలీ వాడినో ఇంగ్లీషు వాడినో మలయాళీ వాడినో మెచ్చుకునే వాడు కూడా తెలుగు వాడేనట.కథలు మనని ప్రభావితం చేయపోకపోవడం ఏమిటి!.మన సాహిత్యం ప్రపంచ కథా సాహిత్యం కన్నా ఏమీ తీసిపోదు.కథలు మన కలెక్టివ్ కాన్షస్ నెస్.మన విజ్ఞానం అభిరుచులు జీవితం మీద దృక్పథం అంతా సాహిత్యం నుంచి వచ్చింది కాదూ?నువ్వు చదివే పుస్తకాలు చెప్పు నీ గురించి తెలుస్తుంది.ఏదో కొన్ని కథలు రాసి మనం మొత్తం తెలుగుసాహిత్యం లోని అందరిని విమర్శించాలి అనుకుంటే అది పొరబాటు..ఈ విమర్శ చేసిన వారు ఇంకా తెలుగు కథలని, ఎందరో రాసిన గొప్ప మంచి కథలని చదివి అభిప్రాయం ఏర్పరచుకోవాలి. ఈ కథలూ సాహిత్యం చదవక పోతే జీవిత మే అర్ధం అయ్యేది కాదు అని నేను అనుకుంటున్నాను. నేనుఎంత రాసినా నేను ఎవరిని ఏ రచయిత ని విమర్శించి విలువ కట్టడానికి సాహసించను.కథా సాహిత్యం తెలుగు వాళ్ళ కి దేవుడిచ్చిన వరం.అని నేను నమ్ముతాను.అది ప్రపంచానికి అర్ధం కాక పోతే ఓకే .

  • Chandra Kanneganti says:

   తెలుగులో గొప్ప కథలూ, మంచి కథలూ లేవని నేననడం లేదు. ఎక్కువ కథల assumptions, presumptions గురించీ, అవి స్పష్టపర్చుకుంటే కథలకు జరిగే మంచి గురించీ ఈ వ్యాసం. మంచి అభిరుచులూ, జీవితం పట్ల అవగాహనా కలుగజేస్తాయనుకోవడం పట్ల నాకు పేచీ ఏదీ లేదు. అవి బాహ్యజీవితంలో ఎట్లా ప్రకటితమవుతున్నాయన్న విషయమే నేను తెలుసుకోవాలనుకుంటున్నది. కథలు రాసే, చదివే వాళ్ల వల్ల రాయని, చదవని వాళ్ల కంటే చుట్టుపక్కల వాళ్లకీ, సమాజానికీ ఎక్కువ మేలేదయినా కలుగుతుందా? అని నాకనిపించడం లేదు.

 16. చందు తులసి says:

  చంద్ర గారు …..నేను కూడా ఆరోగ్యకరమైన చర్చ
  జరగాలనే అనుకుని అలాగే చర్చించాననుకుంటున్నాను. మిమ్మల్ని పూర్తిగా కొట్టిపారేయలేదు. కొన్ని చోట్ల మీతో ఏకీభవించాను. మీ వ్యాసానికి స్పందించా కాబట్టేపోస్టు రాశాను. మీ స్పందనకు థాంక్యూ

 17. ఎ కె ప్రభాకర్ says:

  ‘ఈ కథలూ పుస్తకాలూ చదవకపోతే మరోలా ప్రవర్తించి ఉండేవాడిని ‘, ‘నా నిర్ణయం వేరేలా ఉండేది ‘ ‘నాలో ఇంత సహనమూ, సంయమనమూ, పరిణితీ, దయా, జాలీ, క్షమా, త్యాగబుద్ధీ పుస్తకాలు చదవకపోతే ఉండేవి కావు ‘ …. ఇవన్నీ పెద్దమాటలు ; కానీ
  పుస్తకాలు చదవకపోతే నేను తప్పనిసరిగా చెడిపోయి వుండేవాణ్ని .

 18. నీహారిక says:

  >>>>>పుస్తకాలు చదవకపోతే నేను తప్పనిసరిగా చెడిపోయి వుండేవాణ్ని <<<<<<

  ఏం చెప్పారండీ ?!

 19. johnson choragudi says:

  సందర్భం ‘కధ’ అయినా చాలా ప్రాధమిక చర్చకు చంద్ర కన్నెగంటి తెర తీశారు. అభినందనలు.

  సమాజాన్ని- సాహిత్యాన్ని వేరువేరు గా చూడ్డం సాధ్యం కాదనే విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానం వుండదు.
  ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడినుండి మాట్లాడుతున్నారు? అనే ప్రశ్నలకు జవాబులు ఎదురుగానే వున్నాయి.

  ఇక మిగిలింది ఎవరి గురించి మాట్లాడారు అనేది – వాళ్ళు అక్కడ లేరు, ఇక్కడ వున్నారు.

  మీకు తెలుసు, ఇక్కడిది రూపాంతరం చెందుతున్న సమాజమని. చరిత్రలో ప్రతి మలుపు కొన్ని ఏళ్ళపాటు ఇక్కడ ఇప్పటికీ సాహిత్య రూపం తీసుకుంటూనే వుంది. ఉదా: బెంగాల్ విభజన, స్వాతంత్రం, మండల్ కమీషన్, విఫలమయిన 2 వ హరిత విప్లవం, ఆర్ధిక సంస్కరణలు, సరళీకరణ మొదలయినవి. ఇది విషయం గురించి.

  ఇక రాసేవారు, వాళ్ళు ఈ సమాజం లో భాగమే. ఇక వాటిని చదివేవారు – వాళ్ళు ఇక్కడి వాళ్ళే.

  ఇది – మీకు ‘ప్రిమిటివ్ ఫార్మేట్’ గా కనుక అనిపిస్తే, నిజమే కావచ్చు. కాదని అనడంలేదు. కాని గ్రేడ్ కనుక చేయగలిగితే ఇక్కడ కూడా మంచి వున్నది.

  అయితే ఆ ‘మంచి’ ని మీరు కాలము, ప్రాంతము ద్రుష్టి నుండి చూడాలి, తప్పదు. అప్పుడు ఇక్కడి కధకుల్ని, కధను – ‘బి లిటిల్’ చేసే ధోరణి మీకు ఉండకపోవచ్చు, లేదా తగ్గవచ్చు. అలా అన్నానని బాధపడకండి. ప్రయత్నం చేయండి.

 20. కాస్త ఘాటు ఎక్కువనిపించినా అవసరమైన వ్యాసం.

 21. mohan.ravipati says:

  అసలు మనకు కథలు లేవు, రావు అని ఈ సెల్ఫ్ పిటీ ఎందుకో నాకు అర్ధం కావటం లేదు. తెలుగు సినిమాలలో మంచి సినిమాలు రావు, తెలుగులో మంచి కథలు రావు, తెలుగువారికి సాహిత్యాభిలాష లెదు…………..ఇలా ఇదో సెల్ఫ్ పిటీ. తెలుగులో చాలా మంచి కథలు ఉన్నాయి, జీవితాలను ప్రభావితం చేసే కథలున్నాయి. ప్రపంచ కథలు చదివే వారికి తెలుగు కథలు చదివేటప్పుడు, కొత్తదనం అరుదు అని …. నిజమే అయ్యుండొచ్చేమో , మీరు ఏ దేశపు కథ అయితే బాగుంది అని మీరు అనుకుంటున్నారొ, ఆ దేశస్థుడి కి మన తెలుగు కథ ఇవ్వండి, చదివి తప్పనిసరిగా బాగుంది అంటాడు. అది మానవనైజం . మన కథ, కథనం, మన సంస్కృతి అన్ని వారికి కొత్తగా విభిన్నంగా అనిపిస్తాయి, మనకి వారి కథ, కథనం విభిన్నంగా అనిపిస్తాయి. కొత్త కథలు రావాలి , కథలో కొత్తదనం ఉండాలి అని కోరుకోవటం లో తప్పు లేదు. కానీ తెలుగు కథే కొరగానిది అన్నట్లు చెబితే ఎలా ??
  ఇక మీరన్న రెండో విషయం కథల్లో ఎక్కువ పాఠకుడు కూడా కథలో నీతి ఏముందా అని వెతుక్కుంటాడు అని, అలా యితే మీరు చెప్తున్న ప్రపంచ కథల్లో కూదా ఎక్కువ మంది భారతీయ పాఠకులు నీతినే వెతుక్కుంటాడు కదా ! మరి తేడా ఏముంది ??? నీతిని వెతుక్కుంటున్నాడు అంటే దాని అర్ధం ఆ కథ ఆ పాఠకుడిని ప్రబావితం చేసింది అనే కదా అర్ధం . అలా ప్రభావితం కాకపోతే అందులో నీతిని వెతుక్కోడు . అసలు రాతలకు ఎవ్వరూ ప్రభావితులు కారు, అని మీరు మనసారా నమ్మినట్లయితే మీరు కూడా ఈ వ్యాసం రాసుండేవారు కాదేమో ! ఇంతమంది దీని మీద చర్చ జరిపుండేవారు కాదేమో !! అలాగే రాసే ప్రతి కథ సమాజం మీద ప్రభావం చూపించినా అది సమాజానికి చెడే చేస్తుంది. ఏ కథ ను ఎంత ప్రభావవంతంగా తీసుకోవాలి, దానికి ఎంతమేర ప్రభావితులు కావాలి అనేది సమాజం తనకు తాను నిర్ణయించుకుంటుంది . సమాజానికి ఆ పరిణితి ఉంది

 22. johnson choragudi says:

  మనది ‘మిడియోకర్’ సమాజము, మనవి అదే స్టాయి ఆలోచనలు, అనే విషయంలో మాత్రం – నాకు అభ్యంతరం లేదు. కాని, దానికున్న హేతువు కూడా చూడాల్సివుంది.

 23. ఈ పోలిక బాలేదు కాని, సాహిత్యం లేదా పుస్తకాలు చదువరిని ప్రభావితం చేయవు అని ముందే అనేసుకుంటే కోట్ల కొద్ది సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు ఎందుకు కొంటున్నరొ అచ్చు వేస్తున్నారో అలోచించాల్సిందే. ప్రభావితం చేయవు అని ముందే అనేసుకోవటం తప్పు.

  దాన్నలా పక్కనబెట్టి, ఈ వ్యాసం ఉద్దేశ్యం మరింత బాగా రాయాలి అని రచయితలకు చెప్పటం అయితే అదెప్పుడూ అవసరమే. మనల్ని అత్యంత ప్రభావితం చేసిన శ్రీ శ్రీ లాంటి వాళ్ళు దేశీయ అంతర్జాతీయ సాహిత్య అధ్యయనాపరులూ. జీవితానుభవం ఉన్నవాళ్ళూ. మరీ ముఖ్యంగా రాసే సత్తా ఉన్నవాళ్ళూ.

  ఈ మూడు లక్షణాలు లేనివాళ్ళు ఉద్దరించే సాహిత్య ఉపన్యాసకులు. వాళ్ళ సాహితీ ప్రక్రియలు అలాగే ఏడుస్తాయి. అది కథ కావచ్చు, కవిత, వ్యాసం ఏదయినా కావచ్చు. అలాంటి వాటిని ఇవాళ విమర్శకులు తప్ప పాఠకులెవరూ చదవటమ్ లేదన్నది నిజం. అందుకే ‘మిత్రులకు ఆత్మీయంగా’ అని ఉచితంగా పంచేయటం.

  చంద్ర చెప్పిన ఈ క్రింది వాక్యాలే ఈ వ్యాసానికి కీలకం. మిగతాది స్వకీయం.
  —–
  రచయిత బాధ్యత ఒకటే – కథ రాయడం. కష్టాలూ, బాధల గురించి రాసినా కొత్తవాటి గురించి రాయాలి, లేదా కొత్తగా రాయాలి. కనీసం ఇంతకుముందుకంటే బలంగా రాయాలి. సమాజానికి దిశానిర్దేశం చేయడమొక్కటే ధ్యేయమనుకోరాదు. తెలుగు కథ స్పృశించని జీవితకోణాలు శోధించాలి, అనుభూతులకు అక్షరరూపమివ్వగలగాలి. కల్పనా చాతుర్యమూ, ఊహా నైపుణ్యమూ చూపాలి. పాఠకుడికీ కథలో జాగా ఇవ్వాలి. మరింతమందిని చదివించాలి.
  —–
  – Sashank

 24. chandramouli kalyanachakravarthy says:

  “కధ” రచయిత భావ వ్యక్తీకరణ సాధనం అని నేను నమ్ముతాను …… ఇక్కడ తెలుగు కధ లేక ఇంగ్లీష్ కధ అనే వ్యత్యాసం చూడలేక పోతున్నాను ……నా అనుభవం లేక నా అనుభూతి …….. పదాల రూపంలో ప్రదర్శిస్తే …… దాని ద్వారా నాకు కొంత ఆనందం కలిగితే …… ఆ ఫలితంగా వచ్చిన సాహిత్యం …… చదివిన వారికి నచ్చితే ……. అది కదో, కధానికో, నవలో ….ఏదో ఒకటి అవుతుంది …… ఈ విషయంలో స్థాయీ బేధాలు ఎలా నిర్ణయిస్తారు ?? ఇది గొప్పది ….ఇది గొప్పది కాదు అని ఎలా నిర్ణయిస్తారు ??కొలమానం ఏమిటి ?? …….. నలుగురు కూర్చొని ఒక కధని మంచిది అంటే అది ఆ నలుగురి అభిప్రాయం మాత్రమె ……. అక్కడ లేని వారి అభిప్రాయం కాదు కదా ?? ఈ మధ్య ” మిసిమి ” పత్రిక లో ఒక రచయిత గురించి వ్రాస్తూ అయన ప్రపంచ స్థాయీ రచయిత అని వ్రాసారు ….. అందుకు ఉదాహరణకి అయిన వ్రాసిన ఒక కధ ఆ కధ లోని పాత్రల వయస్సు ఆ రచయిత వయస్సుకంటే చాల ఎక్కువ …… అంత చిన్న వయస్సులో అంత పెద్ద ఆలోచన చేయటం గొప్ప అన్నారు ( నేను ఇక్కడ ఆ వ్యాసం గురించి విమర్శా చెయ్యటంలేదు ) ….. అంటే ఒక టీనేజర్ ముసలి వాళ్ళ కధ వ్రాస్తే అది గొప్ప కదా ?? ………. పాటకుని స్థాయీ అంచనా వెయ్యలేము ……… కేవలం రచయిత తన భావవ్యక్తీ కరణ ……….. తాను చేస్తే చాలు …….. పాటకుని స్థాయీ ని అంచాన వేస్తూ వ్రాయక్కర్లేదు ………….గొప్ప కళాకారులు తమ ఆనందం కోసం తాము సృజియించుకొంటారు………..ఇతరుల కోసం కాదు …… కనుక నేను వ్యాస రచయిత భావాన్ని వ్యతిరేకిస్తున్నాను …….

 25. Chandra Kanneganti says:

  విడివిడిగా జవాబులివ్వడం కష్టం కనుక –
  ప్రపంచ కథలతో తెలుగు కథలను పోల్చడం కొంతమందికి కష్టం కలిగినట్లుంది. సరే, దాన్ని వదిలేసి ఇప్పుడు వస్తున్నతెలుగు కథలలో ఎక్కువ శాతం కథలు ఒకే మూస ధోరణిలో ఉన్నయో లేదో ఆలోచించండి. అవుననిపిస్తే దానికి కారణమని నేను చెప్తున్నaassumptions and presumptions సరయినవా కాదా అని ఆలోచించండి. అవుననిపిస్తే అవి సహేతుకమేనా అని ఆలోచించండి. కాదనిపిస్తే మీకు తోచిన కారణాలు చెప్పండి.
  ప్రభావం అంటే వ్యక్తిగతంగా మేలు చేయడం కంటే నా అసలు ప్రశ్న – కథలు రాసే, చదివే వాళ్ల వల్ల రాయని, చదవని వాళ్ల కంటే చుట్టుపక్కల వాళ్లకీ, సమాజానికీ ఎక్కువ మేలేదయినా కలుగుతుందా?
  రచయితలను గాయపరచే ఉద్దేశం నాకు లేదు. వాళ్ల ఉద్దేశం పట్ల సందేహం లేదు, వ్యక్తిగతంగా వాళ్ల పట్ల గౌరవానికి లోటు లేదు. మంచికథల శాతం పెంచాలనే నా ప్రయాస. కొంచెం నిష్కర్షగా ఉన్నట్టనిపిస్తే అందుకు కారణం నా నిరాశా నిస్పృహలే.

 26. చౌదరి says:

  చర్చలో పాల్గొన్న వారంతా ఈ వ్యాసాన్ని కూలంకషంగా చదివారా అని సందేహం! తెలుగులో మంచి కథలే లేవనీ రాలేదనీ వ్యాసకర్త అన్నట్టు అందరూ మూకుమ్మడిగా అభిప్రాయ పడ్డారు? ఇటీవల గత కొన్నేళ్ళుగా వస్తున్న కథల్లో 90% ఈ సంస్కరణ వాదం అనే జ్వరం పట్టుకుని తీసుకు చస్తున్నది నిజం కాదా? పాజిటివ్ దృక్పథం తోనో, మానవీయ కోణాలతోనే, And they lived happily ever after ముగింపులతోనో తెలుగు కథ అలరారడం లేదా? ఉదాహరణకు సారంగ పత్రికలోని కథలే తీసుకుని పరిశీలించండి!
  99 శాతం ఇవే కథలు! సారంగే కాదు, మిగతా పత్రికలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి! చాయిస్ లేదు

  ప్రతి రచయితా సాంఘికాంశాల పట్ల స్పందించి కథ రాసి పారేయడాన్నే కర్తవ్యంగా భావించి కథా సృష్టి చేస్తున్నది అబద్ధమా? సాంఘికాంశాల మీద స్పందించడం ఒక మనిషికి సహజం కావొచ్చు, కానీ అది రచయిత చేసి తీరాల్సిన పనిగా ప్రతొక్కరూ భావించి , ప్రతి సమస్యకూ పరిష్కారం తనకు తోచినంతలో సూచించి, కథను సుఖాంతం చేయడం!

  మనుషుల్లో మార్పు అంత తేలిగ్గా రాదు. కళ్ళ ముందు ఎన్నెన్ని ఘటనలు జరిగినా అప్పుడు కల్గే స్పందన తాత్కాలికం మాత్రమే! సినిమాల్లో కరుణ రసాత్మక దృశ్యాలు చూసి కల్గే తాత్కాలిక దుఃఖం లాంటిది ఈ స్పందన!

  ఇలా ప్రతొక్కళ్ళూ సంస్కరణ కథలూ తీర్పుల కథలూ మార్పుల కథలూ రాసేట్టయితే, ఆ తర్వాత వెలువడే సంకలనాలన్నీ నీతి శతకాలు గానే తయారవుతాయి. కొన్నాళ్ళకు తెలుగు కథ నిర్వచనమే మారి పోతుంది.

  మోహన్ (రావిపాటి) గారూ, పాఠకుడు కథలో కథ కోసమే వెదుక్కుంటాడండీ ! నీతి కోసం కాదు. నీతి కోసం కథల్లో వెదుక్కోవల్సిన స్థాయిలో తెలుగు పాఠకుడు లేడు. వ్యాసకర్తది సెల్ఫ్ పిటీ కాదు, ఆవేదన, ఆశ్చర్యం! కాలం గడిచే కొద్దీ ఏదైనా ఒక నిరంతర ప్రక్రియ అభివృద్ధి వైపు సాగాలి తప్ప క్షీణించ కూడదు. పాత కథల్ని ఇప్పటి కథలనీ రెంటినీ చదివితే కానీ జరుగుతున్నదేమిటో స్పష్టం కాదు. లేదా పాత సాహిత్యమంతా అర్థం కాకుండా అయినా మిగ్లి పోతుంది మీకు!

  కష్టాలు, సమస్యలూ కథల్లో ఉండాలి. కానీ ప్రతి కథలోనూ కాదు. చాలా మంది “ఇది నిజంగా జరిగిన కథే ! కథ గా రాశాను” అంటుంటారు! రచయిత పని తాను సాక్షి గా ఉన్న సంఘటనలను కథా రూపంలోకి ప్రతిభా వంతంగా తీసుకు రావడమే తప్ప ఆ సమస్యను పరిష్కరించడం కాదు. ఆ మాటకొస్తే పరిష్కారాలతో సహా కథలు రాసే ససంస్కరణ వాదులైన రచయితల్లో ఎంతమంది నిజ జీవితంలో ఆ వైపుగా ఆలోచిస్తారంటారు?

  కథ రాసేంత వరకే ..పరిష్కారాలు చేసెయ్యాలనే ఆత్రుత! దాన్నుంచి బయట పడ్డాక ప్రతి ఒక్కరూ వారి వ్యకితగ పరిథిలోనే ప్రవర్తిస్తారు.

  చంద్ర గారూ, మీ ఉద్దేశాన్ని పాఠకులు (వీళ్లలో రచయితలే ఎక్కువమంది ఉన్నట్టున్నారు) గ్రహించక పోగా సెల్ఫ్ డిఫెన్స్ లో పడి, అసలు విషయాన్ని పక్కన పెట్టి మీకు లేని ఉద్దేశాన్ని ఆపాదిస్తూ ఎదురు దాడి చేసినట్టుగా అనిపిస్తోంది !

 27. ఆరి సీతారామయ్య says:

  “కలిసొస్తే కింద కామెంట్లలోనూ ఆ ధోరణి కనిపించకపోదు”.
  ఎవరో తథాస్తు అన్నట్లున్నారు!

 28. “కథ కళారూపం. పనిముట్టు కాదు” – ఆహా! ఈ వాక్యం చాలండీ… ఏరుకున్నాను. ధన్యవాదాలు, అభినందనలు చంద్ర గారూ…

 29. వంగూరి చిట్టెన్ రాజు says:

  “గత అక్టోబర్ లో అమెరికా తెలుగు కథ 50 వ వార్షికోత్సవాలలో ఈ ప్రసంగం నేను ప్రత్యక్షంగా విన్నప్పుడు బాగా అర్థం అయింది, మంచి పాయింట్లు చెప్పాడు అనుకున్నాను. ఇప్పుడు చదివాక అప్పటికంటే ఎక్కువ అంశాల మీద విశ్లేషణ..ఉన్నాయి. రెండు, మూడు సార్లు జాగ్రత్తగా చదివితే లేవదీసిన చాలా అంశాలని దేని కది విడదీసి అర్థం చేసుకోగలను. నా మటుకు నేను ఎప్పుడు ఏ కథ చదివినా “ఈ కథ రాయడం లో రచయిత అసలు ఉద్దేశ్యం ఏమిటీ” అని ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా సార్లు రచయితా చెప్పదల్చుకున్నది ఒకటయితే, పాఠకులు అర్థంచేసుకునేది మరొకటి. తెలుగు కథకులు ఇంచుమించు ఒకే మూస లో వ్రాస్తున్నారు అనే అభిప్రాయం సరి అయినదే.
  చాలా అవసరమైన, మంచి వ్యాసం అందించినందుకు చంద్ర కన్నెగంటి కి అభినందనలు.

 30. శివకుమార్ తాడికొండ says:

  చంద్ర గారు వ్యాసాన్ని ముగిస్తూ, “రచయిత బాధ్యత ఒకటే – కథ రాయడం” అన్నారు. నా ఉద్దేశంలో “రచయిత,” “బాధ్యత” అనేవి రెండు పొసగని పదాలు. ఒకవ్యక్తి తనని తాను రచయితగా ముద్ర వేసుకోవడంతోనే (లేకపోతే ఇంకొకళ్ళు వేసిన ముద్రని ఆమోదించడంతోనే) వస్తుంది చిక్కంతా. రచనని బాధ్యతగా స్వీకరించగానే అదో గుదిబండ అయి కూర్చుంటుంది. .

  “రచయితలూ అదే ఒరవడిలో సాగుతున్నారు. రచయిత కర్తవ్యం సమాజాన్నీ, దేశాన్నీ ఉద్ధరించడమేనని ముందే నిర్ణయించబడింది.” అన్నారు. ఈ “ముందే” అన్నది ఎప్పుడన్నది చంద్రగారు “ప్రాచీనకాలంనుంచీ ధర్మాన్నీ, నీతినీ బోధించే కథల వారసత్వం మనది:” అన్న వాక్యంలో చెప్పారు. అయితే, కథలను సామాజిక స్పృహతోనే రాయాలని నిర్దేశించడం మొదలవ్వడం గూర్చి బుచ్చిబాబుగారు ఒక కథ మొదలులోనే ప్రస్తావించడం గుర్తుంది. (కథ పేరు ఠక్కున గుర్తుకు రావడంలేదు.) అంటే, ఈ పోకడ గురజాడతో మొలకెత్తిన సామాజిక కథల క్రమంలో బుచ్చిబాబుగారి తరం మధ్యలో మొదలైంది. అయినాగానీ, పద్మరాజు గారు గానీ, రాజారాం గారు గానీ, శేషగిరిరావుగారు గానీ, ముళ్లపూడి గారు గానీ, వీర్రాజు గారు గానీ … (ఎంతమందొ; అందరినీ పేర్కొనలేను) ఇలాంటి ప్రభావానికి లోనవలేదు. ఇంక ఈనాటి విషయానికి వస్తే, సందేశాత్మక రచనలకే బహుమతు లొస్తున్నప్పుడు ఆ మాత్రం అర్థం చేసుకున్నవాళ్ళు సందేశం చుట్టూనే కథని అల్లుతారు. కొన్నిచోట్ల అవి అస్థిపంజరానికి తొడిగిన ఎముకల్లాగా వుంటాయి. అప్పుడప్పుడూ ఆ ఎముకలని మాంసంతోనూ, క్రొవ్వుతోనూ కప్పేసి, అందమైన బాపు బొమ్మల్లా కనిపిస్తాయి. రాసేవాళ్లకి తాము అస్థిపంజరానికి తొడిగిన చర్మంలాంటి పదార్థాన్ని తయారు చేస్తున్నామని తెలిసే అవకాశం ఎంత అనేది వాళ్లు ఎంత చదివారు అన్న దానిబట్టి ఆధారపడి వుంటుంది. పాఠకులకి నచ్చకపోతే ఒకటి రెండు పేరాలు చదివి ఆపేసే అవకాశముంది. పాపం, అలాంటి వాటిని చదివి, ప్రచురించే పత్రిక సంపాదకుల పరిస్థితిని ఆలోచించండి! ముఖ్యంగా, వారపత్రికల సంప్దాకుల గూర్చి. 2004 లో అనుకుంటా, న్యూ జెర్సీ లో చిట్టెన్ రాజు గారు నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆంధ్రభూమి సంపాదకులు M.V.R. శాస్త్రి గారు వారపత్రికల ఆకలి బకాసురుడి ఆకలి వంటిదన్నారు. అలాంటప్పుడు అన్నీ గొప్ప కథలే వెయ్యాలి అని నిర్ణయించుకుంటే ఈ పత్రికల గతి ఏమవుతుందంటారు?

  “ఈ మార్చడం మీదే దృష్టంతా కేంద్రీకరించడంతో, కథ ఒక కళారూపమన్న విషయం మరుగున పడి పనిముట్టుగానే మిగిలిపోయింది.” అని కూడా అన్నారు. కళా రూపమ్ అని నిర్ణయింపబడిన ఏ ప్రక్రియలోనయినా అందరూ గొప్ప కళారులే లేరు. ఓ హెన్రీ లాగా, మొపాసా లాగా, రావిశాస్త్రి గారిలాగా, శ్రీపాద వారిలాగా అందరూ రాయలేరు. అలా రాయగలిగిననాడు వాళ్లకి విలువ వుండదు. పైగా, కాపీ కొట్టారంటారు. బీనాదేవి గారు అలాంటి నిందని తప్పించుకోలేకపోయారు గదా! అందరూ ఐన్స్టీన్లు కాలేరని ఒప్పుకుంటున్నాం! ప్రతి శాస్త్రీయ పరిశోధనా నోబెల్ బహుమతికి అర్హతని సంపాదించుకో లేదు. అలాగని, నోబెల్ ప్రైజ్ రాని పరిశోధనలని వృధా అనలేం గదా!

  అందరూ బాధ్యతగా స్వీకరించే కథలు రాస్తారని నేననుకోను. అలాగని, ఎవరూ కావాలనే చెత్త కథలు రాయరని కూడా అంటాను. (అలాగే, సినిమా తీసిన ప్రతివాళ్ళు – బాపు, రమణలతో సహా – తాము తీసిన సినిమా గొప్పగా ఆడుతుందనే అనుకుంటారు. ప్రేక్షకులు కొన్నిసార్లు వేరేగా అనుకోవడంతోనే చిక్కుల్లో పడతారు.) వందలాది కథలు రాసినవాళ్ళ దగ్గరినుంచీ ఒకట్రెండు రాసినవాళ్ళ దాకా తమకు తోచినట్టుగా కల్పన చేస్తారనీ, అది తిరిగొస్తే ఎందుకొచ్చిందో తెలియనివాళ్లు కూడా చాలామందే వుంటారని నా నమ్మకం. అలాగని, ప్రపంచాన్ని బాగుచెయ్యడానికి పూనుకునే రచయిత(త్రు)లు వుండరని కాదు, అలాంటి బాధ్యతలని రచయితలు నెత్తికెత్తుకోరేమని ఆక్రోశించే పాఠకులు లేరనీ కాదు. నా మాటుకు నేను, గాలి గమనాన్ని నిర్దేశించ లేనట్టే, పత్రికలలో వచ్చే కథల నాణ్యతని నిర్దేశించలేనని నచ్చచెప్పుకుని, నచ్చినవాటిని చదువుతుంటాను. లేకపోతే, ఒకట్రెండు పేరాలో ఒక పేజీనో చదివి వదిలేస్తాను.

  అయితే, నాకు అర్థం కాని విషయ మొకటుంది. “కథ రాయడం. కష్టాలూ, బాధల గురించి రాసినా కొత్తవాటి గురించి రాయాలి, లేదా కొత్తగా రాయాలి. కనీసం ఇంతకుముందుకంటే బలంగా రాయాలి. సమాజానికి దిశానిర్దేశం చేయడమొక్కటే ధ్యేయమనుకోరాదు. తెలుగు కథ స్పృశించని జీవితకోణాలు శోధించాలి, అనుభూతులకు అక్షరరూపమివ్వగలగాలి. కల్పనా చాతుర్యమూ, ఊహా నైపుణ్యమూ చూపాలి. పాఠకుడికీ కథలో జాగా ఇవ్వాలి. మరింతమందిని చదివించాలి.” అన్నారు. దీన్ని ఒక పాఠకుడి (చంద్రగారి) అభిప్రాయంగా మాత్రం పరిగణించి వదిలెయ్యాలా, లేక దీనికి సాకారత నివ్వడంకోసం ఏవైనా వర్క్ షాపుల లాంటివి ఈనాడు పత్రికలలో కనిపించే రచయితలకోసం నిర్వహించాలా? ఎందుకడుగుతున్నానంటే, ప్రేక్షకుడిగా ఒక సినిమా బాగోలేదని నిష్కర్షగా చెప్పొచ్చు. అలాంటి అభిప్రాయాన్నే ఒక దర్శకుడు ఇంకో దర్శకుడి గూర్చి చెప్పటంలో తేడా వున్నది గదా, అందుకు!

 31. శివకుమార్ గారు,

  ఫలానా వారు “…వారపత్రికల ఆకలి బకాసురుడి ఆకలి వంటిదన్నారు.” మరి సంపాదకులు ఉన్నదెందుకని? వారి బాధ్యత ఏమిటి? నిద్ర సుఖమెరుగదు. ఆకలి రుచేరుగదు. పంది పన్నీరు మెచ్చునా , అని అనుకుంటూ అడ్డమైన చెత్తా ప్రచురించెయ్యడమేనా? పాఠకుడికి ఒక అభిరుచిని ఏర్పరిచే బాధ్యతలేదా సంపాదకుల వారికి?

  రచయిత అన్నవాడు కమ్మిస్టూ కావచ్చు, రైటిస్టూ కావచ్చు. అవి రెండూ కాని వాడు కూడా కావచ్చు. కాని వాడికి ఒక బాధ్యత ఉంటుందనుకుంటాను. అలాగే పాఠకుడికి కూడా. తెలియని వాడికి తెలియజెప్పాలి. వినడం వినకపోవడం వారి స్వవిషయం. వ్రాయడం, వ్రాయకపోవడం అలాగే చదవడం, చదవకపోవడం పాఠకుడి ఇష్టం అనుకుంటాను.

  ఇన్ని చర్చలు జరుగుతున్నా ఒకానొక వారపత్రిక దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రతివారం కొన్ని లక్షలలో ప్రతులని అమ్ముకుంటోంది. పాఠకులుండబట్టేకదా! మరి ఆ పత్రికలోని కథలు వార్షిక కదా సంపుటాల ఎన్నికలలో కనపడవేమి? ఈ జాల పత్రికలలో కొందరు రచయితలు / రచయిత్రుల రచనలు ఉండవేమి?

  తెలుగులో గొప్ప కథలు లేవని వ్యాసకర్త అనలేదే! అమ్రిక కధలు, ఆంగ్ల కధలే గొప్ప కధలు అని అనలేదే!

  ఎక్కడపుట్టిన గడ్డి అక్కడే అన్నట్టు…మన కథలు అలాగే ఉండిపోవల్సిందేనా! కదలమా?

  • శివకుమార్ తాడికొండ says:

   అనిల్ గారూ,

   నేను, నా ఉద్దేశంలో “రచయిత,” “బాధ్యత” అనేవి రెండు పొసగని పదాలు. అని నా అభిప్రాయాన్ని ముందే చెప్పాను. మీరు, రచయితకి ఒక బాధ్యత ఉండాలి అన్నారు. అభిప్రాయ భేదాలు. సరే, కానివ్వండి.

   కానీ, మీ “పాఠకుడికి ఒక అభిరుచిని ఏర్పరిచే బాధ్యతలేదా సంపాదకుల వారికి?” అన్న అభిప్రాయాన్ని మాత్రం వ్యతిరేకిస్తాను. “ఉండకూడదు,” అనేది స్వాభిప్రాయం. పాఠకునికి అభిరుచిని ఏర్పరచాలని కంకణం కట్టుకునే సంపాదకులు అలాంటి అభిప్రాయంతో పాఠకుల తెలివితేటలని అవమానిస్తారు. పాత కాలంనాటి “జ్యోతి” మాసపత్రికని తీసుకుంటే, ఆ సంపాదకులు, మా పత్రికల్లో ఉండేవి ఇవ్వీ – అని చెప్పారు. నచ్చిన పాఠకులు కొనుక్కున్నారు. అంటే, ఆ పత్రికలో పాఠకులు తమకి నచ్చిన అంశాలున్నయ్యని ఒప్పుకున్నారు (ఎక్కువమంది ఆ పత్రికని కొనుక్కుని చదివి అనలేదనుకోండి, అది వేరే విషయం). అంతే తప్ప, ఆ సంపాదకులు పాఠకులకి ఎలాంటి అభిరుచినీ కొత్తగా కలిగేలా చెయ్యాలని సంకల్పించుకోలేదు. ఈనాడు అత్యధిక సంఖ్యలో అమ్ముడయ్యే వారపత్రిక గూర్చి – మీరు చెప్పినట్లుగానే, పాఠకులున్నారు. అయితే, కథా సంకలనాల్లో ఆ పత్రికలోని కథలు లేకపోవడం ఆ సంకలనాల సంపాదకుల అభిరుచికి తప్ప మరి దేనికీ గీటురాయి కాదంటాను. ఉదాహరణకి, వంశీ కథలు అద్భుతమైన బాపు బొమ్మలతో అందులో వచ్చాయి. అలాగే, ఇంకా చాలామందివి. శ్రీ శ్రీరమణ గారి మిథునం కథ మీరు ఉదహరించిన కథా సంకలనాల్లో రాలేదు. (అలాగే, రచనలో వచ్చిన వేటూరి సుందరరామ్మూర్తి గారి కథ.) అలాగని దాన్ని గొప్ప కథ కాదని నేననను. మీరు కూడా అనరనుకుంటాను. చూడండి, చురకలు పెట్టే హాస్యం, వ్యంగ్యం వున్న కథలు ఈ సంకలనాల్లో ఒకటో ఆరో వుండుంటే నేను మిస్ అయి వుంటాను. వెదికి పట్టుకుని నాకు చెప్పండి, ప్లీజ్! నా మట్టుకు నాకు, పొత్తూరి విజయలక్ష్మి గారు రాసిన “ఏలినవారి దివ్య సముఖమునకు” అన్న కథకి ఈ సంకలనాల్లో చోటు కల్పించక ఆ సంకలనాల స్థాయిని పెంచే అవకాశాన్ని కోల్పోయా రనిపిస్తుంది.
   “ఈ జాల పత్రికలలో కొందరు రచయితలు / రచయిత్రుల రచనలు ఉండవేమి?” అని అడిగి (వాళ్లు పంపుతారో, లేదో, ఒకవేళ పంపినా, పొరపాటున, మీరు చెప్పినట్లుగా పాఠకులకు ఒక అభిరుచిని ఏర్పరచాలని కంకణం కట్టుకున్న సంపాదకులు ప్రచురించట్లేదో నాకు తెలియని విషయం గనుక, ఆ ప్రశ్నకు నేను సమాధాన మివ్వలేను), మీరు ఇంకొక గీటురాయిని ప్రతిపాదించారు. వేరే విధంగా చెప్పాలంటే, ఒక రచయిత(త్రి) ఈ జాల పత్రికలలో మాత్రమే రాస్తుంటే, ఈ సంగతి తెలిసిన రచన అంటే ఇష్టమైన వాళ్లు, వాటిని వెదుక్కుంటూ వచ్చి ఇక్కడే చదువుతారు. కనుక, కొందరి రచనలు కొన్ని పత్రికలకే పరిమితమై వుండడం ఒక సమస్యా కాదు, ఒక గొప్పదనమూ కాదు.

  • శివకుమార్ తాడికొండ says:

   సంకలనాల్లో చేరని మంచి కథలకి ఇంకొక ఉదాహరణ – చంద్ర గారిదే – “మచ్చ” – సృజనాత్మకంగా నాకు చాలా నచ్చిన కథ. (ఈమాట లో చదవడమే గాక తెలుగు నాడిలో వచ్చినప్పుడు జంపాల గారికి తెలియజేశాను కూడా.) ఇది కూడా ఏ సంకలనాల్లోనూ చూసిన గుర్తులేదు. ఇది నిజమో కాదో, చంద్ర గారు చెప్పగలరు.

 32. Chandra Kanneganti says:

  శివకుమార్ గారూ,

  “నా ఉద్దేశంలో “రచయిత,” “బాధ్యత” అనేవి రెండు పొసగని పదాలు.”

  పైన అంతా ఆ బాధ్యత ఏదీ నెత్తిన వేసుకోనక్కర్లేదు అని చెప్తూ రావడంతో ఆ మాట పడింది. అక్కడ ‘బాధ్యత (ఒకటుందని అనుకుంటూ ఉంటే) అది రాయడం’ అని ఉంటే నేను చెప్పదల్చుకున్న దానికి దగ్గరగా ఉంటుంది.

  “సామాజిక స్పృహతోనే రాయాలని నిర్దేశించడం మొదలవ్వడం గూర్చి బుచ్చిబాబుగారు ఒక కథ మొదలులోనే ప్రస్తావించడం గుర్తుంది. (కథ పేరు ఠక్కున గుర్తుకు రావడంలేదు.) అంటే, ఈ పోకడ గురజాడతో మొలకెత్తిన సామాజిక కథల క్రమంలో బుచ్చిబాబుగారి తరం మధ్యలో మొదలైంది.”

  నిజమే, ఆధునికథ విషయంలోనూ అది ఎలా తిరిగి మొదలయిందో, బలపడిందో రాసి ఉండవలసింది.

  “అలాంటప్పుడు అన్నీ గొప్ప కథలే వెయ్యాలి అని నిర్ణయించుకుంటే ఈ పత్రికల గతి ఏమవుతుందంటారు?”

  అన్నీ గొప్ప కథలూ, మంచి కథలూ రావాలన్న కోరిక నాకు లేదు. వాటి శాతం పెరిగితే చాలు. అభిరుచులు మప్పడం లో సంపాదకుల పాత్ర తక్కువేమీ కాదనే నా నమ్మకం.

  “కళా రూపమ్ అని నిర్ణయింపబడిన ఏ ప్రక్రియలోనయినా అందరూ గొప్ప కళాకారులే లేరు.”

  ఉండరు. కానీ అది కళ కూడా అని గుర్తిస్తే చాలు.

  “అందరూ బాధ్యతగా స్వీకరించే కథలు రాస్తారని నేననుకోను. అలాగని, ఎవరూ కావాలనే చెత్త కథలు రాయరని కూడా అంటాను.”

  అన్ని కథలకూ వాటి పాఠకులు వాటికుంటారు. మనం చెత్త అనుకున్న కథలను మరొకరు నెత్తిన పెట్టుకుంటారు. వాటితో నాకు ఇబ్బంది లేదు. అదే కథ మళ్లీ మళ్లీ చదవవలసినప్పుడే పేచీ.

  “పత్రికలలో వచ్చే కథల నాణ్యతని నిర్దేశించలేనని నచ్చచెప్పుకుని, నచ్చినవాటిని చదువుతుంటాను. లేకపోతే, ఒకట్రెండు పేరాలో ఒక పేజీనో చదివి వదిలేస్తాను.”

  నా బలహీనత ఏమిటంటే నేనలా మధ్యలో వదిలేయలేను. ‘ఈ కథలు బాగున్నాయి’ అని ఎవరయినా ఓపిగ్గా అన్నీ చదివి ఎంచి చూపే ఏర్పాటు ఉన్నట్టయితే నేనీ వ్యాసం రాసే వాడిని కాదేమో!

  “దీన్ని ఒక పాఠకుడి (చంద్రగారి) అభిప్రాయంగా మాత్రం పరిగణించి వదిలెయ్యాలా, లేక దీనికి సాకారత నివ్వడంకోసం ఏవైనా వర్క్ షాపుల లాంటివి ఈనాడు పత్రికలలో కనిపించే రచయితలకోసం నిర్వహించాలా?”

  ఇది ఒక పాఠకుడిగా నా అభిప్రాయం మాత్రమే. మరికొంతమంది పాఠకుల అభిప్రాయం కూడా అని తెలుస్తూంది. వదిలేయాలా లేదా అన్నది మన చేతుల్లో ఉందా? (కాసిని కథలు రాసిన మాట నిజమే కానీ, నేను రచయితని అనుకోను. తేడా ఏమిటని అడక్కండి.)

  ‘మచ్చ ‘ కథ-నేపథ్యం 2 లో వచ్చింది.

  • శివకుమార్ తాడికొండ says:

   చంద్ర గారూ,
   ప్రస్తుతం “సమస్య, పరిష్కారం, సందేశం” మూలంగా పెట్టుకుని, ఉదాత్తతని అగ్రపాళ్లల్లో మేళవించి, దానికి సెంటిమెంటుని జత కలిపి పత్రికల్లో కథలు (అన్నీ కాదు, చాలా) రాజ్య మేలుతున్న మాట నిజమే నని నేనూ అంటాను. ఒక పది, పదిహేనేళ్ల పాటు “యదార్థ జీవిత వ్యధార్త బాధలు” ఇతివృత్తంగా పత్రికల నేలాయి, కొన్ని సంకలనాల్లో చోటుచేసుకున్నాయి. అలాగే, అమెరికా వెళ్లిన పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోకపోవడం గూర్చి, ప్రపంచీకరణ గూర్చి కూడా. ఇప్పుడు ఆ రెండు ప్రభంజనాల జోరు తగ్గినట్లనిపిస్తోంది. This too will pass. అయితే, తరువాత వచ్చే దేదీ అన్నదే ప్రశ్న. అయితే, తరువాత దేన్నయినా తేవడానికి తెలుగు చదివి, రాయగలిగిన మనుషులు వుండడం అన్నది pre-requisite అవుతుంది.

 33. Mythili Abbaraju says:

  ” ఇద్దరు తోటి ప్రయాణికులు ‘ఎంత దారుణమమ్మా!’ అంటే ‘లోకం పాడయిపోయందమ్మా!’ అని వాపోవడం కంటే ఇందులో పెద్ద తేడా ఏదీ ఉండదు.” ..చాలా అవసరమైన మాటలు చెప్పారు, చదవగానే సంతోషమనిపించింది.

  మీ కథ ఒకటి నాకు ఇష్టం…” ఓర్నీ పిల్ల, నా కాడ అలుగుద్దీ ” అని మురుసుకునే వృద్ధుడిది.

 34. శివకుమార్ తాడికొండ says:

  చెహోవ్ కాలంలోనే మిగతా భాషల్లో ఎలాంటి కథలు వచ్చేవో ఈ వ్యాసం చదివితే తెలుస్తుంది.

  http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/04102015/Details.aspx?id=2936891&boxid=25844512

  ఈ రచన వల్ల గిరి గీసుకుని కూర్చుని మంచిని మాత్రమే రాసే “ఆధునిక” (కనీసం రష్యన్) రచయిత 19వ శతాబ్దంలోనే వున్నాడని తెలిసింది.
  మిగతా భాషల్లోని పేరెన్నిక గన్న కథకులని, రచనలని సంకలనాలల్లో మాత్రమే చదవడం వల్ల దూరపుకొండల సామెత కథలకి కూడా వర్తింప జేసుకుంటున్నా మనుకుంటున్నాను.

  • Chandra Kanneganti says:

   19వ శతాబ్దంలోనే ఉన్నారు, ఇప్పుడెక్కడా తగలడం లేదు. :-) ఇక ఈ విషయం చెహోవ్ అప్పట్నుంచీ చెపుతున్నా మనం పెడచెవిన పెడుతూనే ఉన్నాం. స్పష్టంగా చెడేదో చూపాలనీ, రచయిత ఏ వైపో చెప్పాలనీ విమర్శకులు నొక్కి చెప్తూనే ఉంటారు. చెహోవ్ దే ఇంకో లేఖ –

   “You abuse me for objectivity, calling it indifference to good and evil, lack of ideals and ideas, and so on. You would have me, when I describe horse-stealers, say: “Stealing horses is an evil.” But that has been known for ages without my saying so. Let the jury judge them, it’s my job simply to show what sort of people they are. I write: you are dealing with horse-stealers, so let me tell you that they are not beggars but well-fed people, that they are people of a special cult, and that horse-stealing is not simply theft but a passion. Of course it would be pleasant to combine art with a sermon, but for me personally it is extremely difficult and almost impossible, owing to the conditions of technique. You see, to depict horse-stealers in seven hundred lines I must all the time speak and think in their tone and feel in their spirit, otherwise, if I introduce subjectivity, the image becomes blurred and the story will not be as compact as all short stories ought to be. When I write I reckon entirely upon the reader to add for himself the subjective elements that are lacking in the story.”

   • శివకుమార్ తాడికొండ says:

    “19వ శతాబ్దంలోనే ఉన్నారు, ఇప్పుడెక్కడా తగలడం లేదు. :-)” అన్న తరువాత చెహోవ్ గార్ని కోట్ చేశారుకాబట్టి, మొదటిదాన్ని జోక్ గానే తీసుకుంటా. కాకపోతే, “ఇప్పుడెక్కడా తగలడం లేదు” అన్న అభిప్రాయంతో వ్యతిరేకించడానికి కావలసినంత సాన్నిహిత్యం ఆ చెహోవ్ కోట్ తరువాత శతాబ్దానికి పైగా వెలువడిన ప్రపంచ భాషల సాహిత్యంతో నాకు లేదు. ఈ జన్మలో నాకు అది సాధ్యమని కూడా అనుకోను – ఎవరన్నా నన్ను ఉద్యోగం మానేసి కూర్చొమ్మని చెప్పి చదవడానికి, బతకగల్గడానికి కావలసినంత డబ్బిస్తే తప్ప. అలాంటి అవకాశమేదీ ఆ హొరైజన్ దగ్గర కూడా కనిపించట్లేదు ;-)

    ఇకపోతే, “ఇక ఈ విషయం చెహోవ్ అప్పట్నుంచీ చెపుతున్నా మనం పెడచెవిన పెడుతూనే ఉన్నాం” లో, ఆ “మనం” ఎవరన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే,చెహోవ్ ని చదివిన వాళ్లు నేటి తరం రచయితల్లో ఎంతమంది వున్నారు, వాళ్ళల్లో, రచనలు చెయ్యడానికి చెహోవ్ వే గాక ప్రసిద్ధ తెలుగు రచయితల రచనలని కూడా ముందు చదవాలి అని ఎంతమంది అనుకుంటారు? తెలుగు రచయిత లందరూ చెహోవ్ ని చదివి కూడా ఆయన మాటలని పెడచెవిని పెడుతున్నారని నిరూపించాలంటే దానికి తగినన్ని సాక్ష్యాధారాలు కావాలి. పత్రికలలో బహుమతి పొందిన సమస్య, పరిష్కారం, సందేశం వున్న ఇతివృత్తాల కథలని చదివి, అలాంటివే రాయాలి గామోసునని అభిప్రాయపడడంలో పొరపాటుపడట్లేదనుకుంటాను. ఈ మధ్య ఒక పోటీలో, పాపం, “మాకు మూస కథలొద్దు” అని ప్రకటనలో ఇచ్చారు. కానీ, అది చదివిన వాళ్లకి “మూస కథలెలాంటివి” అన్నది అర్థమయిందా అని నాకు అనుమానమొచ్చింది.

    తెలుగు నాటక రంగంతోనూ, సాహిత్యంతోనూ చిక్కేమిటంటే, దాన్నే వృత్తిగా చేసుకుని బ్రతకడ మనేది దుస్సాధ్యం – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో మొదలుపెట్టి నేటిదాకా. ఏదో పోటీలని పెడితే, రచనలకి కొద్దిగా పారితోషికం ముట్టే అవకాశముంది. లేకపోతే, అసలు ప్రచురణ అవుతే చాలుననే పరిస్థితి. (“రచన” పత్రికలో సాధారణ ప్రచురణకి స్వీకరించబడిన కథలకి పారితోషిక ముండదని సంపాదకులు శ్రీ శాయిగారు ఒక సంచికలో స్పష్టం చేశారు.) దాని తరువాత రచయితలే స్వంత డబ్బులతో సంకలనాలని అచ్చువేసుకోవడం. అదే, అమెరికా నించీ ప్రచురింపబడే పత్రికలల్లో అయితే, ప్రచురణకి తీసుకుంటే, పేజీకి ఇంత అని ముట్టచెబుతాయి. (ఒకచెయ్యి వేళ్లమీద లెక్కించగల్గిన) ఎవరో కొద్దిమంది తప్పితే, రాయడాన్నే వృత్తిగా స్వీకరించలేని పరిస్థితి. ఉదాహరణకి, మధురాంతకం రాజారాం గారు బడిపంతులుగా పనిచేస్తూ కథలని రాశారని మీకు తెలుసు. ఇంగ్లీషు పాఠశాలలో ఇంగ్లీషునే బోధిస్తూ ఇంగ్లీషులోనే కథలు రాసే George Saunders లాంటి వాళ్లు మనకి తెలుగులో ఎంతమంది కనిపిస్తారు – నాడూ, నేడూ కూడా? (తెలుగు ఉపాధ్యాయులు కావ్యాలు లేక పద్యాలు రాయట్లేదని నేను అనడంలేదు. హైస్కూల్లో మా తెలుగు పంతులు శ్రీ అన్నంరాజు సత్యనారాయణగారు వేణీ సంహారం అన్న కావ్యాన్ని (?) రాశారని నాకు గుర్తుంది.)

    దీనికి తోడుగా, కథలనే వాటిని, సమాజంలోని చెడునీ, కుళ్లునీ ఎండగట్టడానికి వాడుకోవాలనే ఖచ్చితమైన అభిప్రాయాలు కూడా తెలుగులో వున్నాయి, ఈనాటికీ పేపర్లల్లో వ్యాసాల్లో కనిపిస్తుంటాయి. మిగిలిన భారతీయ భాషల్లోనే ఇలాంటివి వున్నయ్యా అనేది, తమిళ కథలని అనువదించే గౌరీ కృపానందన్ గారి లాంటివాళ్లు, కన్నడ కథలని అనువదించే జి. వెంకటసుబ్బయ్య, రామచంద్రశర్మ గారి లాంటి వాళ్లు చెప్పాలి.

 35. చంద్ర గారి వ్యాసం ఆలోచనాత్మకంగా ఉంది. దానికి స్పందనలు ప్రయోజనాత్మకంగా ఉన్నాయి. తెలుగు కథ గురించి ఎవరి అభిప్రాయం ఏమైనా – ఈ వ్యాసంలో తగినన్ని ఉదాహరణలు లేవు.
  మేము రచన మాసపత్రికలో నెలనెలా వివిధ పత్రికల్లో వచ్చిన బహుమతి కథలను విశ్లేషిస్తున్నాం. 1992నుంచి సాహితీపథ్యంగా మాకు గొప్పదనిపించిన ఓ కథను నెలనెలా పరిచయం చేస్తున్నాం. పుస్తక పరిచయాల పేరిట ఇప్పటికి వందకి పైగా కథాసంపుటాలను పరిచయం చేసి ఉన్నాం. వాటన్నింటిలో 90 శాతంకంటే ఎక్కువగానే అద్భుతమనతగ్గవి ఉన్నాయి. మా పరిశీలన ప్రకారం తెలుగులో చాలా గొప్ప కథలు విరివిగానూ, తరచుగానూ వస్తున్నాయి. అవి ఏ మూసకూ లొంగకుండా విలక్షణంగా, విభిన్నంగా ఉంటున్నాయి. రచనలో సాహితీవైద్యంలో పరిచయం చెయ్యబడ్డ కథలన్నీ చదివేక ఇప్పటి ఈ వ్యాసమూ, చర్చా కనుక వచ్చి ఉంటే కనుక ఈ విషయంలో ఎవరి అభిప్రాయం వారిది అనుకోవచ్చు. ఐనా కూడా సాహితీవైద్యంలో గొప్పదిగా అభివర్ణించబడ్డ కథలు ఎందుకు మూస అనిపించుకుంటాయో, వాటి గొప్పతనాన్ని ఎందుకు అంగీకరించకూడదో వివరించడం కూడా విమర్శకుడి బాధ్యత అని మా అభిప్రాయం.
  స్వాతి వార మాసపత్రికల్లో వచ్చే కథలన్నీ గొప్పవి కాకపోవచ్చు. కానీ ఏటా వాటిలోనూ బోలెడు గొప్ప కథలు వస్తున్నాయి. వాటినీ, ఇతరపత్రికల్లో మా దృష్టికి వచ్చిన ఇతర ఉత్తమ కథల్నీ(అ)సాధారణ కథలుగా రచనలో నెలనెలా పరిచయం చేస్తున్నాం.
  ఇలాంటి చర్చల్లో general statements కి బదులు సోదాహరణంగా కథల్ని ప్రస్తావించడం అవసరం.
  ఎందుకంటే పుస్తక పరిచయాలకి ముందు తెలుగు కథపై మాకూ ఇంచుమించు చంద్ర గారి అభిప్రాయమే ఉండేది. విమర్శనాత్మక దృష్టితో కథలు చదవడం మొదలెట్టేక – అభిప్రాయాలకు అక్షరరూపం ఇవ్వాలనే సరికి ‘మానిషాద ప్రతిష్ఠాంత్వ’ స్థాయి కథలు చాలా కనిపిస్తున్నాయి. తెలుగు కథమీద ఓ అభిప్రాయం ఏర్పరచుకోవాలంటే ముందు తెలుగు కథల్ని విరివిగా చదవాలి. నిరసించతగిన కథల పేర్లు నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పాలి. అప్పుడే విమర్శకూ, కథకులకూ, పాఠకులకూ ప్రయోజనం ఎక్కువ. ఉదాహరణకు – ఇటీవల బహుమతులు అందుకుంటున్నకథలు – ముఖ్యంగా విదేశీ నిర్వహణలో జరుగుతున్న పోటీలనుంచి వచ్చినవి – చాలావరకూ నీరసంగా ఉంటున్న మాట నిజం.
  న్యాయనిర్ణేతలకు ఓపిక అవసరం. మా పరిశీలనకు వచ్చిన ప్రతి కథా ఎంత చెత్తది అనిపించినా చివరి అక్షరం వరకూ శ్రద్దగా చదవడం మా అలవాటు. ఆరేడ్ పేజీల కథలు మరీ మూసగా ఉన్నట్లు తోచి సగంలో పక్కన పెట్టి, కాసేపాగి పూర్తి చేస్తే మొత్తం కథ అద్భుతమనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి మాకు. అప్పుడు మళ్లీ పూర్తిగా చదివితే – అవి గొప్ప విలక్షణ రచనలు అనిపించేవి. కథని ఆసక్తికరంగా వ్రాయడం రచయితకి అవసరమే. కానీ మంచి కథని గుర్తించడానికి న్యాయనిర్ణేతలకు ఓపిక ఉండాలి. తాము న్యాయనిర్ణేతలమనీ, కథని పరిశీలిస్తున్నామనీ కాక, తమకంటే గొప్పవాడి రచనని అవగాహన చేసుకుందుకు ప్రయత్నిస్తున్నామన్న భావన న్యాయనిర్ణేతలకి అవసరం.
  మన సమస్య ఏమిటంటే – మన విమర్శకుల్లో రామాయణ కల్పవృక్షాన్ని మెచ్చినవారు, రామాయణ విషవృక్షాన్ని నిరసిస్తారు. రెండోదాన్ని మెచ్చినవారు మొదటిదాన్ని ఈసడిస్తారు. అసలైన విమర్శకుడికి వాటి సాహితీ విలువలు, లోపాలు మాత్రమే గోచరించాలి. అలాంటి విమర్శకులు మనకి తక్కువ.
  తెలుగు భాషకీ, తెలుగు సమాజానికీ, తెలుగుతనానికీ, తెలుగు పాఠకలకీ అనుగుణంగా తెలుగులో గత నూరేళ్లుగా నిరవధికంగావస్తున్న అత్యుత్తమ సాహిత్యానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. 1991నుంచి రచనలో వాటిని మా పరిమితుల మేరకు లోబడి ఉదహరిస్తూనే ఉన్నాం. మాకులా మరెందరో ఈ విషయమై కృషి చేస్తూనే ఉన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకోతగినవిగా చంద్ర వంటివారు భావిస్తే సంతోషం.
  చంద్రగారి సమీక్షలో తెలుగు కథ భావి గురించిన కలవరముంది. ఆ కలవరానికి తగిన factual information లేదు. ఆ సమాచారం – తెలుగులో ఉత్తమ సాహిత్యం విరివిగా వస్తున్నదన్న మా భావనకు భిన్నంగా ఉండొచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది వాదోపవాదాలు కాదు. మన మాట నెగ్గడమూ కాదు. తెలుగు సాహిత్యం ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు సహకరించడం. ఇప్పటికే చేరుకుని ఉంటే దిగజారకుండా కాపాడుకుందుకు సహకరించడం.
  మా ఈ స్పందనకు దోహదం చేసిన శ్రీయుతులు చంద్ర, తాడికొండ శివకుమారశర్మ, ఇతర సాహితీప్రియులకు ధన్యవాదాలు.

 36. ఆరి సీతారామయ్య says:

  నాకు ఈ మధ్య వస్తున్న ప్రపంచ సాహిత్యంతో పెద్దగా పరిచయం ఉందని చెప్పలేను. కాని థాయ్, ఇండోనేసియా (ముఖ్యంగా బాలి) దేశాల కథలను చదవే ప్రయత్నం చేశాను. అవి కూడా ఆసియా దేశాలే కదా. ఇండియా కంటే పెద్ద భిన్నమైన సమాజాలు కాదు. వాళ్ళ కథలు మన కథలకంటే వేరుగా ఉన్నాయా, ఇలాగే ఉన్నాయా అని చూడటానికి చేసిన ప్రయత్నమే ఇది. సంకలనాల్లో కథలు చదవలేదు. అలా చదివితే ఎవరో వడపోసిన కథలు మాత్రమే చదివటం జరుగుతుంది. పుస్తకాల షాపులో ఏది కనపడితే అది చదివాను.

  నా అభిప్రాయంలో బాలి కథలు తెలుగులో సాధారణంగా వస్తున్న కథలకంటే చాలా మెరుగు. థాయ్ కథలు కూడా మన కథలకంటే బావుంటాయి, కాని బాలి కథలంత బాగా ఉండవనిపించింది. కానీ రెండు దేశాల కథల్లోనూ పాత్రలూ, సందర్భాలూ, వస్తువుల్లో తెలుగులోకంటే చాలా ఎక్కువ వైవిధ్యం కనబడుతుంది.

  తెలుగులో ముఖ్యమైన జబ్బు కథకు ఒక అస్తిత్వం లేకపోవటం. రాజకీయ ప్రయోజనాలకో, సో-కాల్డ్ ఉద్యమప్రయోజనాలకో కథ ఒక అనుబంధం మాత్రమే. రెండు పేజీలు రాయటం చేతైన ప్రతి రచయితా (చేత కాని వాడు కూడా) సమాజాన్ని మార్చే బాధ్యత తన భుజాలమీద ఉందనుకుంటాడు. నీతులు చెప్తాడు. పాఠాలు చెప్తాడు. నా అభిప్రాయంలో ఎనభై కంటే ఎక్కువ శాతం తెలుగు కథలు ఈ కోవకు చెందినవే.

  థాయ్, బాలి కథల్లో, అవి బాగా ఉన్నా లేకపోయినా, కథలో నిజాయితీ మాత్రం ఉంటుంది. చెప్పదల్చుకున్న నీతిని ముందు నిర్ణయించుకుని దానికి తగిన కార్డ్ బోర్డ్ పాత్రలను తయారు చేసినట్లు కనబడదు.

 37. అజిత్ కుమార్ says:

  కధ చదవబోయేముందు పాఠకుడు తనను తాను ఖాళీ చేసుకోవాలి. భోజనం చేయబోయేముందుగా ఎలా సిద్ధపడాలో అలాగా. మూతలు తీయకముందు రుచులను ఊహించుకోవాలి; వాసన చూసి నిర్ధారించుకోవాలి; చూస్తూ నోటిలోకి నీళ్ళు తెచ్చుకోవాలి. మెల్లిగా రుచులను ఆస్వాదిస్తూ తినాలి. అలాగే ఏదైనా కధను చదవడానికి కూడా ఇలాంటి సిద్ధపాటు ఉండాలి. హడావుడిగా, నోట్లోకి అన్నాన్ని కుక్కుకుంటూ తింటే ఎలాగా రుచీపచీ తెలుసుకోలేమో అలాగే గబగబా పేజీలు తిప్పుతూ చదివితే ఫరవాలేదులే అని చప్పరించాల్సుంటుంది.
  అయితే రచయిత కర్తవ్యం సమాజాన్ని ఉద్ధరించడం కాదు. (ఉద్ధరించడం అంటే కాలుతో ఎగిరి తన్నడం) పాఠకుని అభిప్రాయాల్ని మార్చడం రచయిత కర్తవ్యం. కనుక రచయిత ఎదుటివాళ్ళను మోసం చేసేవాడుగానో, మాయ చేసేవాడుగానో ఉండాలి.
  సమాజాన్ని పీడించే సమస్యలను సుత్తితో కొట్టి పరిష్కరించాలని చూడలేం. కానీ సమస్యలను విశ్లేషించవచ్చు. మేకులనే అభిప్రాయాలను రచయితలు కథలనే సుత్తెలతో మనుష్యుల మెదళ్ళలో దిగగొడతారు. కవులను రచయితలను చూడగానే మనకు సన్నగా తలనొప్పి ప్రారంభం కావడం అందుకే…
  కథలు మనుషులను ఉన్నతులుగా , ఉదాత్తంగా మారుస్తాయని చెప్పడానికి ఆధారాలు లేవన్నది నిజమే. కధల ఉద్దేశ్యం మనిషిని తాననుకున్నట్లు మార్చడమేగాని, గొప్పవానిగానూ మంచివానిగానూ మార్చడం కాదు. మీకు తెలియందేంకాదు వ్యభిచారానికి సహకరించేవి కళలు. వాటిలో ప్రధానమైనవి లలితకళలు. అంటే రచయిత ఓ కథ వ్రాసాడంటే అది చదివిన కుర్రవాడు ప్రేమలో పడాలి. కనుక వ్యభిచారాధారిత వృత్తి రచనలు చేయడం. పాటలు పాడడం , నాట్యం చెయ్యడం, బొమ్మలేయడం. వీటిద్వారా ఉన్నతమైన మానవుడ్ని ఎలా తయారు చేయగలం.
  సినిమాకి ఓ కథ రాయండి అని కవిగారిని అడిగితే ఓ అమ్మాయి, ఓ అబ్బాయి , ప్రేమ, డాస్సులు, తదితరాలు ఉంటాయి. ఇవిలేకుండా కుదరదు. ఓ బొమ్మ గీయమంటే మొదట కొవ్వొత్తి ,జండా…ఇలా మొదలు పెట్టి చివరకు పెద్ద ఆర్టిస్తుగా మారబోతూ బట్టలు లేని మనుషుల బొమ్మలు గీయాలి. డాన్సు చెయ్యమంటే రతి భంగిమలు చూపించాలి. ఎందుకంటే ఇవన్నీ వ్యభిచారానికి సంబంధించిన వృత్తులు. వీటితో మనం మరేదో చెయ్యబోతే వీలవదు.
  కనుక రచయితలు కొత్తగా వ్రాయాలి , బలంగా వ్రాయాలని వారిని వొత్తిడి చేస్తే … మీరు ఊహించిన ఫలితాలు రావేమోనని నా అభిప్రాయం.

 38. Chandra Kanneganti says:

  వసుంధర గారూ,
  నా పరిశీలనకు ఆధారం నేను చదువుతున్న కథల పుస్తకాలూ, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న కథలూ, విమర్శలూ. మీరన్నట్టు ఉదాహరణలు ఇవ్వకపోవడం ఈ వ్యాసంలో ఒక లోటే. కానీ ఏ విమర్శనయినా రచయిత వ్యక్తిగతంగా తీసుకున్నంత వరకూ ఆ ఉదాహరణలు అసలు విషయాన్ని పక్కదోవలు పట్టిస్తాయన్న భయం నాకుంది. (అయినా ఉదాహరణలు కావలిస్తే ఈరోజే వచ్చిన నవ్య వారపత్రిక లోని కథలు చాలు.)

  రచన పత్రిక చూచి చాలా ఏళ్లయింది. మీరు చదువుతున్న కథల పుస్తకాల్లో 90% వరకూ అద్భుతమైన కథలు వస్తున్నాయంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తానో లేదో కానీ మీరు చేస్తున్న సాహితీపథ్యం ఆలోచనను అభినందిస్తున్నాను. అవన్నీ పుస్తకంగా తీసుకొచ్చే వీలుంటుందేమో చూడండి. ఈ నెలాఖరుకు అక్కడికి వచ్చినప్పుడు అందులో కొన్నయినా చదివి నా అభిప్రాయం తెలియజేస్తాను.

మీ మాటలు

*