నేను నీకు తెలుసు

 

 

శ్రీరామోజు హరగోపాల్ 

 

మర్చిపోయినట్టుగా గాలి పలకరించదు

గుర్తే లేనట్టు చెట్టు పూలు కురవదు

ప్రాణహితలా ప్రవహించిన కన్నీళ్ళు కూడా మర్చిపోయాయి

మేఘరాగాలు మాలలై గొంతునిండిన పాటలకే ఎరిక లేనన్నవి

 

దినదినం రాలిపోతున్న ఎండపుప్పొడులు

రాత్రయినా నైట్క్వీన్ పరిమళాలు దూరంగా పారిపోతున్నాయి

దిగులుచుట్టుకుని నిద్రించే కలల రంగులపుస్తకం దొరకదు

వానను భుజం మార్చుకుని మోసే రుతువులు వుట్టిగనె మాట్లాడవు

 

ఏమైనట్టు ఈ తురాయిపువ్వుల బాట తప్పిపోయిందా

ఆవిరులైన ఆశల్ని బోర్లించిన మూకుడులా ఆకాశం ఒడిసిపట్టుకుంటదా

నేను నిల్చున్న చోటే పిడుగు చోటడిగింది

రవ్వలు,రవ్వలుగా గువ్వపిట్టలు పొద్దుటిగూడు నుండి

 

ఎంత కలవరం మనసంతా

వొలికిపోయిన సిరా గీసినట్టున్నది బొమ్మ

మౌనంగా అక్షరాలు

ఏమైంది నీకు, నన్నిలా వొదిలిపొయ్యావు

నేనే కరిగి నీకు పారదర్శకధ్వనినై కప్పుకున్నాను

 

కాలాన్ని కాలుతీసి కడగా పెట్టమన్న

ఒక్క డై ఆటకన్నా నువ్వొస్తవని తెలుసు

 

(డై అంటే ఒక్కసారి అని తెలంగాణా పిల్లలాటలో వాడకం)

*

haragopal

 

 

మీ మాటలు

  1. రవ్వలు,రవ్వలుగా గువ్వపిట్టలు !!! పద ప్రయోగాలు ఎంత బాగున్నాయో సర్

  2. బాగుంది సర్

  3. తిలక్ బొమ్మరాజు says:

    చాలా చాలా కొత్తగా వుంది మీ కవిత.పదాల అణకువ నచ్చింది సర్.ధన్యవాదములు.

Leave a Reply to Bhavani Cancel reply

*