అబ్సలీట్ రియాలిటీ

 

satyaprasadచాలా సాధారణమైన ప్రశ్న అడిగింది. – “మీరేం అమ్ముతారు?” అని

నిజం చెప్పాలంటే చాలా అమాయకంగా వుందా ప్రశ్న.

పెళ్ళి చూపులులో భాగంగా, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటారేమో అంటూ మమ్మల్ని ఏకాంతంగా ఇంటి మేడ పైన వదిలేశారు. చల్లగాలి. చొరవ చెయ్యాలా వద్దా అన్న చిన్న బెదురు. ఎదురుగా అరుదుగా కనిపించే అందం. అదీ ఆకుపచ్చని చీరలో. ఏం మాట్లాడాలా అని తటపటాయిస్తున్న క్షణాలు.

సరిగ్గా అప్పుడే ఆమె అడిగిన ప్రశ్న. “మీరేం అమ్ముతారు?” అని.

“నేను టీవీ ఛానెల్ లో పని చేస్తాను. అమ్మడం ఏమీ వుండదు” అన్నాను నేను.

“టీవీలో చేస్తారని చెప్పారులెండి. అక్కడ మీరేం అమ్ముతారు అనే అడుగుతున్నాను.” అంది. అమాయకత్వమా అజ్ఞానమా? అనుకున్నాను.

“మీరు టీవీలో చూస్తుంటారే… “మధ్యాహ్నం మహిళ”, “కొడితే కోటి రూపాయలు” ఈ షోలకి నేనే ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్” అన్నాను

“నేను టీవీ చూడను”

అరుణ చెప్పిన ఈ మాట చాలా విచిత్రంగా అనిపించింది. “టీవీ చూడకపోవటమేమిటి? గేమ్ షోలు సరే… సీరియల్స్?”

“ఊహు”

“సినిమాలు? స్పోర్ట్స్? న్యూస్?”

“అసలు టీవీ ముఖమే చూడను మహాప్రభూ. మా ఇంట్లో అందరూ చూస్తారు” అన్నది. ఇంకేం చెప్పాలి?

“మీ నాన్నగార్ని, మీ అన్నయ్యలను చూసి నేను కూడా సేల్స్ ఉద్యోగం అనుకుంటున్నారా? నా ఉద్యోగం అలా కాదు” అన్నాను.

అరుణ నవ్వింది. నెమ్మదిగా నడుస్తూ మేడ మీదకు పాకిన కాగడామల్లెల తీగ నుంచి ఒక సన్నటి మొగ్గని తుంచి గాఢంగా వాసన చూసింది. ఆ తరువాత నా వైపు చూసి “కాదా?” అంది.

“కానేకాదు. నాది క్రియేటివ్ జాబ్” అన్నాను నేను. నా వైపు ఓ అర సెకను నిశ్చలంగా చూసింది. పిల్ల తెమ్మరలాంటి చూపు. ఆ చూపులో మెల్లెపూల సువాసనలు. కానీ ఆమె మాటల్లో…

“నా దృష్టిలో వుద్యోగాలన్నీ అమ్మకాలే. మీరు కూడా ఏదో అమ్ముతుంటారు. అదేంటో మీకే తెలియటంలేదు.” అంది చిరునవ్వు చెరగకుండా. పెళ్ళి చూపులు అయిపోయాక అమ్మాయి అబ్బాయి ఏకాంతంగా మాట్లాడుకోవడం అంటే కుటుంబం గురించో, అభిరుచుల గురించో, ఆర్థిక విషయాల గురించో మాట్లాడుకుంటారని ఇన్నాళ్ళు అనుకునేవాడిని. ఇక్కడ వ్యవహారం ఏదో తేడాగా వున్నట్లు అనిపించింది.

“మీకు అలా ఎందుకు అనిపిస్తోందో కానీ, అన్నీ వుద్యోగాలు సేల్స్ వుద్యోగాలు కావండీ…” అన్నాను ఆమె కళ్ళలోకే చూస్తూ. సిగ్గో, నా చూపులో వున్న చొరవో తెలియదు కానీ, ఆమె కళ్ళతోనే నవ్వేసి, పిట్టగోడ పట్టుకోని కొంచెం ముందుకు వంగుతూ మాట్లాడింది.

“ఏం కాదు. ఇప్పటి ప్రపంచంలో ప్రతి ఉద్యోగం ఏదో ఒకటి అమ్మడానికే కల్పించబడింది. ప్రతి ఉద్యోగీ నేరుగా అమ్మకపోవచ్చు, కానీ ఏదో రకంగా అమ్మకానికే దోహదం చేస్తారు. ఒకోసారి ఆ ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళేమి అమ్ముతున్నారో” అంది.

“మరి స్కూల్ టీచర్ వున్నాడనుకోండి. ఆయనేం అమ్ముతున్నట్లు?”

Kadha-Saranga-2-300x268

“టీచర్లలో రకాలు వున్నాయి లెండి… ఒక రకం ర్యాంకులు, ఐఐటీ సీట్లు తద్వారా రాబోయే పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద జీతాలు… ఇంకో రకం ఉన్నారు పాపం వీళ్ళు జ్ఞానాన్ని, మన మీద మనకి నమ్మకాన్ని, జీవితం గురించి భరోసాని అమ్మాలనుకుంటారు. పాపం వాళ్ళ సరుకు అమ్ముడుపోదు…” కిసుక్కున నవ్వింది.

“చిత్రంగా మాట్లాడుతున్నారే… మరి గుళ్ళో పూజారి?”

“అమ్మో, ఆయన లిస్ట్ చాలా పెద్దది… భయం, భక్తి, ఆశ, దురాశ, స్వర్గం, నరకం…”

“సరే… సరే… మొత్తం మీద నేను చేసేది కూడా సేల్స్ ఉద్యోగమే అంటారు? పైగా నేను అమ్ముతున్నదేంటో నాకే తెలియదంటారు? అంతేనా” అన్నాను కాస్త తీవ్రంగా.

“అవును… మీరు అమ్మేదేంటో మీకు తెలియదు కాబట్టి… ఒక పందెం” కావాలనే అక్కడ ఆపింది. నేను అలాగే చుస్తూ వున్నాను. “ఏం. లేదు. మీరు అమ్మే ప్రాడక్ట్ ఏమిటో తెలుసుకోని నాకు చెప్పాలి… మన పెళ్ళి లోగా” అంటూ చీర కుచ్చిళ్ళని పైకి పట్టుకోని పరుగు లాంటి నడకతో మెట్లు దిగేసింది. మేడ పైన నేనూ, కాగడామల్లెతీగ మిగిలాము.

***

“ఏరా ఏమంటావ్?” అన్నాడు నాన్న కారు ఊరు దాటిన తరువాత.

ఆ అమ్మాయి మాటలు మళ్ళీ గుర్తుకువచ్చాయి. “మన పెళ్ళి లోగా…” అన్నదంటే ఆ అమ్మాయికి నచ్చినట్లే..! చెప్పకుండానే చెప్పేసింది! గడుసుదనం!!

“ఏరా? సమాధానం చెప్పవే?” నాన్న మళ్ళీ అడిగాడు.

“ఇంకేంటి చెప్పేది… అన్నయ్య అప్పుడే ఆ అమ్మాయితో డ్యూయెట్లు ఊహించుకుంటున్నాడు..” అంది చెల్లెలు శ్వేత.

“నాకు ఓకే నాన్నా… కాకపోతే కొంత టైం కావాలి” అన్నాను. ముందు సీట్లో డ్రైవర్ పక్కన వున్నాను కాబట్టి వెనక కూర్చున్నవాళ్ళ  ముఖాల్లో భావాలు తెలియట్లేదు. నా ముఖంలో వున్న భావాలు కూడా వాళ్ళకు కనపడవు కాబట్టి నా ఆలోచనలు వాళ్ళకు అర్థం కావు. “కోడితే కోటి రూపాయలు” గేమ్ షోలో కోటి రూపాయల ప్రశ్న దగ్గర ఆగిపోయిన అభ్యర్థిలా వుంది నా పరిస్థితి.

“ఇంకా టైం ఎందుకురా? నచ్చితే వచ్చే నెల్లోనే చేసేద్దామని వాళ్ళ నాన్నే చెప్పాడు” అమ్మ తన ఆతృతని బయటపెట్టింది.

“అది కాదులే అమ్మా… ఆ అమ్మాయి ఒక ప్రశ్న అడిగింది. పెళ్ళిలోగా సమాధానం చెప్పాలి” అన్నాను నేను.

“పెళ్ళిలోగా చెప్పాలా? లేక సమాధానం చెప్తేనే పెళ్ళి లేకపోతే లేదు అన్నదా మా వదిన” అంది శ్వేత ఉత్సాహంగా.

శ్వేత మాటల్లో కూడా నిజముందేమో అనిపించింది నాకు. ఇది ప్రశ్నా? లేకపోతే పరీక్షా?

“వాళ్ళ నాన్న ఇన్సూరెన్స్ అమ్ముతాడు, పెద్దన్నయ్య కార్ షోరూమ్ లో కార్లు అమ్ముతాడు, చిన్నన్నయ్య సరే సరి బట్టల షాపు కదా… అలాగే నా ఉద్యోగంలో కూడా నేను ఏదో అమ్ముతానట. అదేంటో కనుక్కోని చెప్పమంది” అన్నాను నేను.

“టీవీ ఛానల్లో అమ్మేదేముంటుంది?” ఆశ్చర్యపోయాడు నాన్న. నాన్నకు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసే అవకాశంలేదు. దూరదర్శన్ కాలం నాటి మనిషి, అంతే ఆలోచించగలడని నాకూ తెలుసు.

“ఏముందిరా అన్నయ్యా! టీవీ ఛానల్ అంటేనే ఎంటర్టైన్మెంట్. నువ్వు ప్రోగ్రాములు ప్రొడ్యూస్ చేస్తావు కదా… అదే నీ ప్రాడక్ట్… అదే అమ్ముతున్నావు.” అంది శ్వేత చాలా సులభైన పరిష్కారం కనుక్కున్నట్లు.

నిజమే కదా? ప్రేక్షకులే నా కస్టమర్స్ అనుకుంటే, వాళ్ళని అలరించే విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చెయ్యడమే కదా నా పని. అంటే నా షోలో కంటెంటంటే కదా నేను అమ్మేది. అంతే! ఫోన్ చేశాను.

“ఇంత త్వరగా ఫోన్ చేస్తారని అనుకోలేదు” అంది అరుణ. ఆమె గొంతు వినగానే ఏదో మధురభావన.

“కనుక్కున్నాను” అన్నాను క్లుప్తంగా.

“ఏమిటి?” అందామె.

“అదే నేను అమ్మేది.”

“చెప్పండి మరి”

“ఎంటర్టైన్మెంట్!” చెప్పాను.

“ఎంటర్టైన్మెంట్ అమ్ముతున్నారా? ఎవరికీ?”

“ప్రేక్షకులకి”

“అంటే ప్రేక్షకులే మీ కస్టమర్స్ అన్నమాట”

“అంతే కదా?” నా వెనకే కూర్చున్న శ్వేత ఉత్సాహంగా ముందుకు వంగి నా భుజం మీద తట్టింది.

“మరి కస్టమర్స్ అంటే మీరు అమ్మే వస్తువునో, సేవలనో డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి కదా? మరి మీ ప్రేక్షకుడు కూడా ఇస్తున్నాడా?”

“ఇస్తున్నాడు కదా? కేబుల్ టీవీ ఆపరేటర్ కి…”

“అది కేబుల్ కనెక్షన్ ఇచ్చినందుకు, సర్వీస్ చేస్తున్నందుకు. అయినా ఆ డబ్బులు టీవీ ఛానల్ దాకా రావు కదా?”

“అవును నిజమే”

“తొందరపడకూడదు… నెమ్మదిగా ఆలోచించి, పది మందిని అడిగి సమాధానం చెప్పాలి.. ఏం?” అంటూ పెట్టేసింది. చివర్లో నవ్విందా? నవ్వలేదా? నేనే అట్లా అనుకున్నానా? ఏమైనా ఆ అమ్మాయి నవ్వు మనోహరంగా వుంటుంది వినడానికి కూడా.

శ్వేత పిలుపుతో మళ్ళీ ఈ లోకం లోకి వచ్చాను. “ఏమనింది వదిన?” మళ్ళీ అడిగింది.

“కాదటమ్మా… అమ్మకం అంటే ఒక కస్టమర్ వుండాలి, అతను డబ్బులు ఇచ్చి మన దగ్గర్నుంచి ఏదైనా తీసుకోవాలి. అదీ ట్రాన్జాక్షన్ (transaction)… లావాదేవి. అలా జరిగితేనే అమ్మకం జరిగినట్లు.”

“అలా అని వదిన చెప్పిందా?” అడిగింది. నేను తలాడించాను. “అయితే కరెక్టే అయివుంటుంది” నవ్వేసింది.

***

“అయితే నువ్వు వెళ్ళింది పెళ్ళి చూపులకి కాదన్నమాట… స్వయంవరం” అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ.

“ఏంట్రా? నువ్వేదో హెల్ప్ చేస్తావని అడిగితే నా మీదే జోక్ చేస్తున్నావా?” అన్నాను నేను ఉక్రోషంగా. ఇరానీ చాయ్ ఘుమఘుమల మధ్య వేడిగా వాడిగా చర్చ జరుగుతోంది. మాతో ఛానల్ లోనే పనిచేసే వంశీ, శివరావ్ కూడా వున్నారు.

“అయినా కొశ్చన్ ఇంటరస్టింగా వుంది బ్రో” అన్నాడు శివరావ్

“నేనొకటి చెప్పనా?” అన్నాడు వంశీ. విషయాన్ని ముక్కలు ముక్కలుగా చెప్పడం న్యూస్ రీడర్ గా వాడికి కొట్టినపిండి. తరువాత వాక్యం కోసం అందరూ ఎదురుచూశారు. “ఇవన్నీమార్కెటింగ్ కి సంబంధించిన విషయాలు. మన ఇస్మాయిల్ ని అడిగితే చెప్పేస్తాడు” అన్నాడు. ఒకేసారి నా కళ్ళు పెద్దవి చేసి, చిరునవ్వు నవ్వుతూ నిటారుగా కూర్చున్నాను. అరుణతో పెళ్ళికి రెండు క్యూబికల్స్ దూరమే వున్నట్లు ఒక చిత్రమైన ఫీలింగ్. ఇస్మాయిల్ క్యాబిన్ లోకి వెళ్ళాను.

“కన్ఫూజ్ చెయ్యకు భాయ్. మనం ప్రేక్షకులకు అమ్మేదేంటి? ఎమోషన్స్… ఎంటర్టైన్మెంట్… ఆనందం, బాధ, టెన్షన్, కోపం, అసహ్యం, జుగుప్స…” చెప్పాడు

“అవన్నీ ఎక్కడున్నాయి ఇస్మాయిల్?”

“మన సీరియల్స్ లో, క్రైమ్ కథల్లో…. న్యూస్ పోగ్రామ్స్ లో ఎలాగూ తప్పదు” అన్నాడు నవ్వుతూ.

“కానీ ప్రేక్షకులు మన కస్టమర్స్ కాదంటోందే మా ఆవిడ” అన్నాను. ఆవిడ అన్న పదం నోరు జారింది కానీ అందులోనూ ఒక థ్రిల్ అనిపించింది. ఇస్మాయిల్ వెంటనే పట్టేశాడు.

“అరేయ్ భాయ్… అప్పుడే ఆవిడనేస్తున్నావే… కంగ్రాట్స్” అన్నాడు. ఆ తరువాత కాస్సేపు ఆలోచించి చెప్పడం మొదలుపెట్టాడు. “మనకి ఆదాయాన్ని ఇచ్చేవాడు కస్టమర్ అయితే, ప్రేక్షకుడు మనకి ఏ రూపంలోనూ డబ్బులు ఇవ్వటం లేదు కాబట్టి ప్రేక్షకుడు మన కస్టమర్ కాదు. అంటే ప్రేక్షకుడే కస్టమర్ అన్న భ్రమలో మనం వున్నాం. భలే పాయింట్ కదూ?” అన్నాడు.

“అయితే మన ఛానల్ కి డబ్బులు ఇచ్చేది ఎవరు?” అడిగాను ఆతృతగా. ఇస్మాయిల్ నవ్వాడు.

“అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ఏజన్సీలు, కంపెనీలు…” మార్కెటింగ్ అనుభవమంతా కనపడింది అతని మాటల్లో. సమాధానం దొరికింది.

వెంటనే నా కాబిన్ లోకి వచ్చాను. మొబైల్ చేతిలోకి తీసుకోని ఫేవరెట్స్ లో మొదట వున్న అరుణకి ఫోన్ చేశాను.

“అపూర్వ ప్రశ్నల అరుణాదేవీ… తెలిసిపోయింది”

“అయితే చెప్పేయ్యండి రాకుమారా..” అంది నవ్వేస్తూ.

“మా కస్టమర్ ప్రేక్షకుడు కాదు, కార్పొరేట్ సంస్థలు, యాడ్ ఏజన్సీలు…” అన్నాను ఆవేశంగా.

“నాకు తెలుసు మీరు కనిపెడతారని. కానీ, నేను అడిగింది మీరు అమ్మేదేంటి అని కదా. మీరు ఎవరికి అమ్ముతున్నారో చెప్పారు” అంది అరుణ కాస్త వ్యంగం ధ్వనిస్తున్న గొంతుతో.

“వాళ్ళకి అమ్మేదేముంది… అడ్వర్టైజ్మెంట్ స్లాట్… అదే కదా వాళ్ళకు కావాల్సింది…” అన్నాను

“ఇంకేముంది… గెలిచినట్లే… కాకపోతే అడ్వర్టైజ్మెంట్ స్లాట్ అమ్మడానికి మీ ప్రోగ్రామ్ లకి సంబంధం ఏమిటి? రోజు రెండు గంటలో, మూడు గంటలో అడ్వర్టైజ్మెంట్లే ఒక కార్యక్రమంలా వేయచ్చు కదా?” అంది. ఆమెకు కావాల్సిన సమాధానం ఇంకా రాలేదని అర్థం అయ్యింది. ఆ విషయం నేరుగా చెప్పకుండా ప్రశ్నలతో సమాధానం రాబట్టాలని చూస్తున్నట్లుంది.

“చెప్పండి… సాయంత్రం ప్రోగ్రామ్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ కి ఒక రేటు, మధ్యాహ్నం కార్యక్రమానికి ఒక రేటు ఎందుకుంటుంది?” మళ్ళీ అడిగింది.

“అది చూసే జనాన్ని బట్టి మారుతుంది. దాన్నే టీఆర్పీ అంటారు. ఎక్కువమంది చూసే టైమ్ ఎక్కువ విలువైంది. తక్కువ ప్రేక్షకులు చూసే టైమ్ లో అడ్వర్టైజ్మెంట్ అంటే తక్కువ రేటుకే…” ఆగిపోయాను నేను. ఏదో కొత్త విషయం తెలుస్తున్నట్లు అనిపించింది. అవతల వైపు నవ్వు.

“కాబట్టి ఇప్పుడు చెప్పండి. మీరు మీ ఉద్యోగంలో ఏం అమ్ముడానికి సహాయపడుతున్నారు?” అడిగింది చివరగా.

“ఐబాల్స్… ప్రేక్షకుల సమయం. మంచి ప్రోగ్రామ్ చెయ్యడం ద్వారా, ఎక్కువ మంది ప్రేక్షకులు చూసేలా చేసి, అలా చూస్తున్నారు కాబట్టి ఎక్కువ డబ్బులు వసూలు చేసి మరీ ఆ సమయాన్ని అడ్వటైజర్లకు అమ్ముతున్నాము.” అన్నాను ఆలోచనతో పాటే మాట్లాడుతూ.

“అంతేనా, టమాటాలు గ్రేడింగ్ చేసినట్లు ప్రేక్షకుల సమయాన్ని గ్రేడింగ్ చేసి దానికి టీఆర్పీ అని పేరు పెట్టి, ప్రైమ్ టైమ్, స్లాక్ టైమ్ అని విభజించి అమ్ముతున్నారు…”

“అవును నిజమే…”

“ఇప్పుడు అర్థం అయ్యిందా నేను ఎందుకు టీవీ చూడనో… నాకు ప్రోగ్రామ్ అనే ఎరవేసి నా సమయాన్ని దొంగిలించి గ్రేడ్ చేసి అమ్ముకునేవాళ్ళకు సహకరించడం నాకు ఇష్టం లేదు. పైగా అలా మోసపోడానికి నేనే కేబుల్ చార్జెస్ రూపంలో ఎదురు డబ్బులు ఇవ్వాలి…”

నేను చాలాసేపు సమాధానం చెప్పలేదు. నేను చేస్తున్న ఉద్యోగాన్ని ఈ కోణంలో చూడటం కొత్తగా వుంది. ఇప్పటిదాకా నాది క్రియేటివ్ జాబ్ అనుకున్నాను, నన్ను వాడుకుంటున్నారని అర్థం అవటం అప్పుడే మొదలైంది.

“ఏంటి ఆలోచిస్తున్నారు?”

“ఉద్యోగం చెయ్యక తప్పదు కదా… ఇప్పట్లో వదిలెయ్యలేనేమో…”

“వదిలెయ్యమని నేను చెప్పలేదే… కాకపోతే మీ చేత ఏం పని చేయిస్తున్నారో తెలుసుకోని వుండాలి కదా?”

“అవును. అన్నట్లు ఒకటి మాత్రం చెయ్యగలను. మనింట్లో టీవీ వుండదు…”

“అయ్యో టీవీ లేకపోతే ఎలా? టీవీ వుండాలి… కేబుల్ అఖర్లేదు. అప్పుడప్పుడు మనిద్దరికీ నచ్చిన సినిమాలు డీవీడీ వేసుకోని చూడటానికి, మన పెళ్ళి వీడియో మళ్ళీ మళ్ళీ చూసుకోడానికి…” అంటూనే నవ్వేసింది అరుణ. నేనూ ఆమెతో శ్రుతి కలిపాను. ఛానల్ ఆఫీస్ లో ఎవరి హడావిడిలో వాళ్ళున్నారు. వాళ్ళా అరుపుల్లో, నా నవ్వు ఎవరికీ వినపడట్లేదు.

***

 

మీ మాటలు

  1. వనజ తాతినేని says:

    విలువైన సమయమే అసలైన ధనం. భలే ఇంట్రెస్టింగ్ గా ఉందీ స్టోరీ. కళ్ళు విచ్చుకున్నాయండి :)

  2. prasad bhuvanagiri says:

    యద్వేర్తిసేమేంట్ అమ్మేది ఫీలింగ్స్ , వస్తువుని కాదు అన్నది . మార్కెటింగ్ లో ఒక సూత్రం , మీ కధ ఈ సూత్రానికి దగ్గరగా వుంది. నిజంగా కొత్త పాయింట్ , టీవీ అక్కర లేదు అనుకోవటం కొంచం extra . అల్ ది బెస్ట్

    • అసలు టీవీ అక్కర్లేదు అని అనుకోవడం సహస్రార చక్రం దాకా చేరడం. అందరికీ అది సాధ్యపడదు. పడనివ్వని శక్తులు చాలా వున్నాయి. అందుకే చివర్లో అరుణ టీవీ వద్దు అనదు. కేబుల్ వద్దు అని మాత్రమే అంటుంది. టీవీ ఒక కుటుంబ అవసరం అయినప్పుడు ఒక్కరి నిర్ణయంతో ఇది జరగదు. అయినా టీవీ వద్దనుకున్న ఇళ్ళు నాకు చాలా తెలుసు. మా ఇంట్లో టీవీ వుంది కానీ నేను చూడను. దానివల్ల నేను నష్టపోయింది ఏమీ లేదు.

  3. Vijaya Karra says:

    ఇలాంటి అహల్లాదకరమైన కథ చదివి చాలా ఏళ్లయింది. సింప్లీ సూపర్బ్ !

  4. Rishi Srinivas says:

    ఆలోచన చాలా బాగుంది. కధ ఇంకా బాగుంది. కానీ మీరు చెప్పిన అమ్ముడుపోవడం అనే కాన్సెప్టు వన్ వే కాదు. మ్యూచువల్ !
    ఒక డి.టి.హెచ్. ఆపరేటర్ సేటిలైట్ స్లాట్ కొనుక్కోవడానికి చానల్ వాడికి డబ్బు ఇస్తాడు. మీరు చెప్పినట్లు ఏడ్ కంపెనీలు చానల్ వాడికి డబ్బులిస్తాడు. అంటే చానల్ వాడు ఏడ్ కంపెనీకి, డి.టి.హెచ్. వాడికి అమ్ముడుపోతే… డి.టి.హెచ్. వాడు మనకి అమ్ముడుపోతాడు. ఒక ప్రోగ్రాం వచ్చినప్పుడు కళ్ళార్పకుండా టి.వి. చూసే మనం… ఏడ్స్ మొదలవ్వగానే చానల్ మార్చేస్తాం. అంటే , వాడు ఏం చూడాలని డబ్బులిస్తున్నాడో అదే మనం చూడడంలేదు. అలాంటప్పుడు మనం ఎంతవరకు అమ్ముడుపోతున్నాం అన్నది నిజంగా ప్రశ్నార్ధకం అవుతుంది.
    మొత్తానికి భలే చర్చకు లేవనెత్తారు ప్రసాద్ గారూ.. అభినందనలు !

  5. ఇంటరెస్టింగ్ స్టొరీ

  6. :-)

  7. “Kadha-Saranga-2-300×268

    “టీచర్లలో రకాలు వున్నాయి లెండి… ఒక రకం ర్యాంకులు, ఐఐటీ సీట్లు తద్వారా రాబోయే పెద్ద పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద జీతాలు… ఇంకో రకం ఉన్నారు పాపం వీళ్ళు జ్ఞానాన్ని, మన మీద మనకి నమ్మకాన్ని, జీవితం గురించి భరోసాని అమ్మాలనుకుంటారు. పాపం వాళ్ళ సరుకు అమ్ముడుపోదు…” :)

  8. కథ బాగుంది. అభినందనలు. అయితే కథకు మీరు పెట్టిన పేరు confusing గా వుంది నాకు. అది absolute reality నా, లేక obsolete reality నా తెలియటం లేదు. ఎందుకంటే లీట్ అన్నది obsolete లోని lete కే వర్తిస్తుంది. Obsolete అనే మరో పదం ఉండటమే ఇక్కడ తికమకకు తావిస్తోంది. మీ ఉద్దేశం ప్రకారం అది absolute reality యే అయివుంటుందని అనుకుంటున్నాను. సందేహ నివృత్తి చేస్తే కృతజ్ఞుడిగా వుంటాను.

    • Obsolete అనే పెట్టాను. మనకు తెలిసిన నిజం Absolute Reality అనుకుంటాం. కానీ అది Obsolete అని కథానాయకుడు తెలుసుకోవడమే కథ అని…
      అర్థం కాని వారి కోసం:
      Absolute Reality: (పరి)పూర్ణమైన వాస్తవం
      Obsolete Reality: చెల్లని (వాడకంలో లేని) వాస్తవం

  9. వెంకట్ కొండపల్లి says:

    కథ, కథనం బాగున్నాయి అండి, ముల్లపూడి వారిని గుర్తుకు తెచ్చారు.

  10. ఒక రీడరు says:

    అరిపిరాల సత్యప్రసాద్ గారూ,
    మీరు చెప్పదలుచుకున్నదీ, మీ ఉద్దేశ్యం చాలా మంచిగానూ, అమాయకంగానూ వున్నా, చెప్పినది మాత్రం చాలా తెలివితక్కువగా వుంది. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. ఇలా అనేవాళ్ళు కూడా వుంటారని మాత్రమే అర్థం చేసుకోండి. “ఆర్థిక శాస్త్రం” పైపైన మాత్రమే అర్థం చేసుకుంటే, మనుషులు ఇలాంటి జ్ఞానాన్నే పొందుతారు. కాబట్టి, పెళ్ళి కొడుకు ఎంత మంచిగా, నిజాయితీగా, “నాకు తెలియనిది ఏదో వుంది. దాన్ని తెలుసుకోవాలి” అని ఎలా అనుకున్నాడో, అలాగే మీరు కూడా, ఎప్పుడన్నా, వీలైనప్పుడు, “నేర్చుకోవలసింది ఇంకా ఏమన్నా వుందా?” అని ప్రశ్నించుకుని, ఇంకా రకరకాల పుస్తకాలు – ఆర్థికశాస్త్రానికి సంబంధించినవి – చదవండి. అది మీ కోసమే. ఎవరికీ ఏమీ రుజువు చెయ్యక్కర్లేదు. నా సలహా ఏడిసినట్టుంటే, చెత్త బుట్ట దాఖలా చెయ్యండి. తిట్టకండి దయచేసి.
    – ఒక రీడరు

  11. ch chandraiah says:

    చాలా మంచి కథండి.,ఈ కథ చదివ్యాక ప్రతి ఇంట్లో ఓ అరుణ వుండాలనే అత్యాశ కలిగింది.

  12. ఆరి సీతారామయ్య says:

    కథలను పాఠాలు చెప్పటానికో నీతులు చెప్పటానికో వాడుకున్నంతకాలం ఇలాంటి కథలే వస్తాయి.

    • సీతారామయ్యగారు,
      మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. ఈ కథను కథ రూపంలోనే చెప్పాలా వద్దా అని నేను కూడా ఆలోచించాను. నా నిర్ణయం తప్పైతే కావచ్చు.

  13. S. Narayanaswamy says:

    బావుంది, కానీ మీరింకా బాగా రాయగలరు.

    • ఆరి సీతారామయ్య says:

      నేను నారాయణస్వామి గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.
      బాగా రాయగలిగిన వారు కథ స్థాయిని పెంచే ప్రయత్నం చెయ్యాలి.

  14. Absolute – అబ్‌స్‌సలూట్
    [ab-suh-loot, ab-suh-loot]
    http://static.sfdict.com/staticrep/dictaudio/A00/A0037600.mp3

    Obsolete – ఆబ్‌స్‌సలీట్
    [ob-suh-leet, ob-suh-leet]
    http://static.sfdict.com/staticrep/dictaudio/O00/O0019200.mp3
    ఆ రెండు పదాలు తెలుగులో ఇలా వ్రాయాల్సిఉంటుందనుకుంటాను.

    సత్యప్రసాద్, ఏమంటారు?

  15. అనిల్ అట్లూరి గారూ,

    తెలుగులో రాసినప్పుడు ఉండవలసిన ఆ రెండు పదాల సరైన రూపాలను తెలిపినందుకు ధన్యవాదాలు. ఆబ్సలీట్ అని కాక అబ్సలీట్ అని రాసినందుకే నేను అయోమయానికి గురయ్యాను. అరిపిరాల గారూ! నా సందేహాన్ని తీర్చినందుకు కృతజ్ఞతలు.

  16. కథ చాల బాగుంది సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ప్రసాద్ గారు ప్రేమతో జగతి

  17. విలాసాగరం రవీందర్ says:

    బాగుంది కథ అరిపిరాల గారు

  18. Sadlapalle Chidambara Reddy says:

    హహ్హహా శానా బాగుంది!!

  19. చక్కని కథ ప్రసాద్ గారూ!! అభినందనలు.

  20. bhaskar g says:

    Very good story. I love the character of Aruna, but I can’t believe the naivete of protagonist. Everyone knows the TV channels are actually ‘selling’ entertainment to viewers, so that’s where the cable charges go, why is it so hard to understand? Of course, using those eyeballs/ratings they make money from the advertisers as well… Don’t we ‘buy’ a movie ticket to watch a film? The transaction there is pretty simple, but if in the same movie, if there are product placements and the movie producers make money on the backend, they are making most of their opportunity. In fact, if you look at ‘creative’ people in TV channels, or even in writing department of any filmmaking endeavor, they are selling their time, by taking salaries… Most of the business plans of any internet site are based on CPM projections.

Leave a Reply to Vijaya Karra Cancel reply

*