ప్రేమతో “సహ చరణం” — జగద్ధాత్రి కవిత్వం

 

బొల్లోజు బాబా

 

సమకాలీన సాహిత్యంలో ఉత్తరాంధ్రనుంచి బలంగా వినిపించే గొంతు జగద్ధాత్రి గారిది. కథలు, వ్యాసాలు, అనువాదాలు, కవిత్వం, సభానిర్వహణ – ప్రక్రియ ఏదైనా తనదైన శైలి, ముద్ర ఆమె రెండు దశాబ్దాల సాహిత్యసేవ ద్వారా ఏర్పరచుకొన్నారు.

జగద్ధాత్రి గారు ఇటీవల వెలువరించిన కవిత్వ సంకలనం పేరు “సహచరణం”. “కవిత్వంలో కవి తనను తాను బయిల్పరచుకొంటాడు” అంటారు.  ఈ సంకలనంలోని కవితలన్నింటిలో, ప్రేమ, ఆప్యాయతలు, ఆరాధన, ఆత్మవిశ్వాసం, ప్రకృతిసౌందర్యం పట్ల ఆశ్చర్యం, సామాజిక అంశాలపట్ల సహానుభూతి వంటి అనేక జీవనస్పందనలు కన్పిస్తాయి.  ఇవన్నీ మానవవిలువలు.  మానవుల ఉత్తమజీవనానికి సహాయపడే విలువలు. ఇవి ఈ కవయిత్రిని గొప్ప ప్రేమమయిగా నిరూపిస్తాయి. ఈ కవిత్వాన్ని గొప్ప కవిత్వంగా నిలబెట్టాయి.

 

ఇన్నేళ్ళకి ఒక స్వతంత్ర నిర్ణయం

తీసుకొన్న సాయింత్రం

నిర్భీతిగా, నిశ్చలంగా

సంధ్య కెంజాయలోకలిసి

నీరవ నిశీథిలోనికి

ఒక వెలుగు రేఖ కోసం పయనించిన

సాయింత్రం…..!!!

        —   పై వాక్యాలు “పయనం” అనే కవితలోనివి.  జీవితంలో నిస్సహాయ స్థితి ఆవరించాకా, ఆశలన్నీ ఆవిరవగా, మొండి ధైర్యంతో ఒక వెలుగు రేఖకోసం ఒక వ్యక్తి పయనం సాగించటం ఈ కవితకు వస్తువు.  నాకొచ్చిన కష్టమిదీ, నేను తీసుకొన్న నిర్ణయమిదీ అని కవయిత్రి ఎక్కడా చెప్పదు.    అయినప్పటికీ చదువరి, కవయిత్రి దుఃఖంతోను, ధైర్యంతోనూ మమేకమవుతాడు.  మనస్థితిని అక్షరాలద్వారా అందచేసి అదేస్థాయిలో భావతీవ్రతను కలిగించటం అనేది ఉత్తమ కవితా లక్షణం.

 

ఒంటరితనం మనిషికి చాలా అవసరం

మనిషితనం మిగులుందో లేదో అప్పుడప్పుడూ

ఎవరికి వారు చేసుకునే అంతరీక్షణ

 — (వరం) ఈ కవితలో ఒంటరితనం మనల్ని మనకు దర్శింపచేసే సాధనంగా, అంతరంగపు అద్దంలో విశదంగా చూసుకొనే వరంగా అభివర్ణించటం ఒక నూతన అభివ్యక్తి.

 

తనవారి కళ్ళలో తానో జ్ఞాపకంగా మెదిలే

ఈ అశ్రువుల ముత్యాలు ప్రేమకు మానవత్వానికి

సార్వకాలిక ప్రతీకలు

మానవునికి సృష్టి ఒసగిన అపురూప అమూల్య

కానుకలు …. కన్నీళ్ళు..

(ఇవీ).  అపూర్వమైన ఆలోచనతో కూడిన వాక్యాలు ఇవి. కన్నీళ్లని చెలులుగా, స్మృతుల చినుకులుగా, ముత్యాలుగా, సృష్టి ఒసగిన కానుకలుగా వర్ణించటం గొప్ప ఊహ.  ఎంతో రమ్యంగా సాగే కవిత ఇది.

 

రంగురంగుల కాగితాలతో

నన్ను ప్రియంగా అందంగా చేసావు

నాకో అస్తిత్వాన్నిచ్చావు

నీ ఆశలతోక తగిలించి గాలిలోనికి వదిలావు.   (పతంగ్) ……

Jagathi

కారణాలేమైనా తల్లిపై ప్రేమను వ్యక్తీకరిస్తూ వచ్చినంత సాహిత్యం తండ్రి పై రాలేదు. ఇప్పుడిప్పుడే ఈ లోటు భర్తీ అవుతున్నది.  పతంగ్ అనే కవితలో ఈ కవయిత్రి తన తండ్రి తనను ఒక గాలిపటాన్ని చేసి ఎగరేసారంటూ, ఆ గాలిపటం తుఫానుగాలులకు జీవితపుచెట్టుకు చిక్కుకోగా, ఆ తండ్రి ప్రేమను ఏ విధంగా స్పూర్తిగా తీసుకొని జీవితంలో ముందుకు నడుస్తున్నదీ– అంటూ సాగే ఈ కవిత కథనాత్మక శైలిలో ఒక కూతురు తన తండ్రిని ఏ విధంగా దర్శించిందో అక్షరీకరిస్తుంది.  ఈ కోవలో వచ్చిన కవితల్లో ఇది వినూత్నంగా నిలుస్తుంది.

 

అప్పుడే క్షణంలోనే

అంతరాంతరాల్లో

భావ బీజావాపన జరిగే

దివ్య క్షణం లోనే అదాటుగా

అతను నా దేహాన్ని ఆక్రమించుకొన్నాడు

వారించానా….

తగవును వరించానన్న మాటే

అందుకే నిశ్శబ్దంగా

నాలోకి నేను జారుకొన్నా—- (అంతర్యానం).

అంటూ మొదలయ్యే ఈ కవితా వస్తువు చాలా సాహసోపేతమైనది.  సంగమ సమయంలో, వాంఛలేకుండా శరీరాన్ని అప్పగించిన ఒక స్త్రీ ఆలోచనా తరంగాలు ఏవిధంగా సాగాయి అనేదే కవితా వస్తువు.  ఇలాంటి కవితకు ఎత్తుగడ, నడక, ముగింపు ఉత్తమంగా లేకపోతే  ఔచిత్యభంగం ఏర్పడి రసవిభ్రంశం కలుగుతుంది.   చదువరిని కవితలోకి సరసరా లాక్కొనే సరళమైన ఎత్తుగడ, బిగిసడలని నడకా, ఉదాత్తమైన ముగింపు ద్వారా కవయిత్రి తన ప్రతిభ అనన్యమని నిరూపించుకొన్నారు.

 

కలయిక అనే మరో కవిత

దేహాన్ని అర్పించడమంటే

మనసిచ్చినంత సులువుకాదు

మనసుముడి విప్పినంత తేలికగా

రవికె ముడి విప్పలేము ……

అంటూ చాలా బలమైన అభివ్యక్తితో సాగుతుంది.   అటువంటి వ్యక్తీకరణ స్త్రీవాద కవిత్వంలో ఇంతవరకూ కనిపించని ఒక కొత్త కోణాన్ని చూపిస్తూ, కొత్తవెలుగుని ప్రసరింపచేస్తుంది.

 

“వాసన” అనే కవితలో ఈ కవయిత్రి భావనా పటిమ శిఖరాల్ని చేరుకొని ఒక గొప్ప మొజాయిక్ చిత్రాన్ని మనకళ్లముందు నిలుపుతుంది.

కొన్ని దేహాలు మృగాల వాసన వేస్తాయి

కొన్ని ఆకలి వాసన వేస్తాయి

కొన్ని పురుషదేహాలు

వాంఛా సుగంధం వెదచల్లుతాయి

మరికొన్ని ఉన్మత్తతను పెంచుతాయి

 

ఆటవిడుపు అనే కవితలో-  గ్లోబల్ వార్మింగ్, పాలస్తీనాలో పాలుగారే పసిపిల్లల బుగ్గలపైనుంచి జారే కన్నీటి చుక్కలు, అంటార్కిటికాలో కరుగుతున్న మంచు, గోద్రా మంటలు, నందిగ్రామ్, ముదిగొండ పేలుళ్ళు వంటి సమకాలీన అంశాలను స్పృశిస్తూ,  ఇవి మానవాళి శాంతిని భగ్నం చేస్తున్నాయని, వీటినుంచి ఆటవిడుపు తీసుకొని కాసేపు ఆలోచించమని- ఆటవిడుపు అంటే విరామం కాదు,  ఆటగాళ్లుగా మనందరం విశ్వశాంతికై తర్ఫీదు పొందే సార్ధక సమయం అనీ కవయిత్రి అంటారు. సమకాలీన సమస్యలను భిన్న ఇజాలు ఎలా దర్శించినా, ఈ కవిత హ్యూమనిజం దృక్కోణాన్ని వ్యక్తీకరిస్తుంది.

 

ఈ కవితాసంపుటిలోని అనేక కవితలలో ప్రకృతి సౌందర్యం చక్కని అలంకారాలతో, శోభాయమానంగా కన్పిస్తుంది. అందమైన పదచిత్రాలను మనకళ్లముందు నిలుపుతుంది.

సాయింకాలపు గాలికి

అప్పుడే నీళ్ళోసుకున్న మల్లెతీగ

ఈడేరిన మొగ్గలతో నెమ్మదిగా

అటూ ఇటూ కాకుండా ఊగుతోన్నట్లు(సాలోచనగా)

 

మరో కవితలో

ఒక్కో చెట్టూ కొన్నివెల ఎర్ర జండాల సమూహంలా

ప్రపంచ కార్మికులంతా ఏకం కండి అన్నట్టు

వేనవేలుగా ఏకమై ఒక్కో చెట్టును రుధిర తేజస్సుతో నింపుతాయి

తురాయిలంటారట వాటిని (పూల సైనికులు)

51 కవితలు కలిగిన “సహచరణం” జగద్ధాత్రి గారి మొదటి కవిత్వసంపుటి.  ఈ కవితలలో కనిపించే పదునైన అభివ్యక్తి, లౌకిక చింతన, ప్రేమ, మైత్రి, ప్రకృతి పట్ల తాదాత్మ్యత వంటి వివిధ భావనలు మంచి పఠనానుభవాన్ని కలిగిస్తాయి. ప్రముఖ కవి శ్రీ శివారెడ్డి గారు ఈ పుస్తకానికి వ్రాసిన ఆత్మీయవాక్యాలలో అన్నట్లు “She is not a frozen Feminist”.           జీవితంలోని అన్ని పార్శ్వాలకు తలుపులు తెరిచి, లోలోపల జనించే అలజడిని, ఆవేదనల్ని అక్షరాలలోకి వొంపిన గొప్ప “ప్రేమమయి”.  అందుకనే ఈ కవితలలో లోకంపట్ల ప్రేమ, దయ అంతర్వాహినులుగా ప్రవహించాయి.

పుస్తకం లభించు చోటు

చినుకు పబ్లికేషన్స్, విజయవాడ

ఫోన్: 984832208

మీ మాటలు

 1. మీ విశ్లేషణ జగధ్దాత్రి గారి కవిత్వం సహచరణం పై కవయిత్రి అంతరంగాన్ని పట్టిచ్చేలా గొప్పగా సాగింది.ఇరువురికీ అభినందనలు.

 2. msk krishnajyothi says:

  చాలా బావున్నాయి . వినయ పూర్వక అభినందనలు – మీరు ఫెమినిస్ట్ కాదు – హ్యూమనిస్ట్.

 3. Aranya Krishna says:

  మంచి పరిచయం.

 4. ధన్యవాదాలు బొల్లోజు బాబా అఫ్సర్ సాబ్ కల్పనా రెంటాల మరియు సాహితి మిత్రులకు _()_ప్రేమతో మీ జగతి

 5. g.venkatakrishna says:

  బొల్లోజు బాబా గారు , మీ రివ్యు చదువు తూనె ,పుస్తకం సంపాదించి చదవాలని పిస్తోంది .

 6. Sadlapalle Chidambara Reddy says:

  చక్కని వివరణ

మీ మాటలు

*