పరోపకారార్ధం

 

 

మధురవాణి: ఒక వేశ్య

కరటకశాస్త్రి: ఆమె పూర్వ విటుడు

కరటకశాస్త్రి శిష్యుడు

మధు:  (వీణ వాయించుచుండును) విద్య వంటి వస్తువ లేదు, నిజమే – ఒక్కటి తప్ప – అదేవిటి? విత్తం. డబ్బుతేని విద్య దారిద్ర్య హేతువ. ఈ వూళ్ళో నారదుడు వచ్చి పాడితే నాలుగు దమ్మిడీ లివ్వరు. గనక యీ వీణ యిటు పెడదాం. (తలుపు తట్టిన శబ్దం) యవరు మీరు? బంధువులా?

కరటక: ఆపద కడ్డం బడ్డ వారే బంధువులు. మేమ్మీకు బంధువులం కావు గాని, మీరు మాకు బంధువులు కాగల్రు.

మధు:  నాస్తులా?

కరటక: నాస్తం కట్టడానికే వచ్చాం.

మధు:  దేంతో కడతారు?

కరటక: నాస్తం కట్టడానికల్లా వున్నది వక్కటే గదా టంకం! బంగారం.

మధు:  మా పంతులు గారికి మీరు నాస్తులూ, బంధువులూ కూడా కాకపోతే తలుపు తియ్యొచ్చును. (తలుపుతీసి కరటకశాస్త్రిని గుర్తుపట్టి ముక్కుమీద వేలుంచుకొని) చిత్రం!

కరటక: యేవిటి చిత్రం?

మధు:  యీ వేషం!

కరటక: ఉదర నిమిత్తం బహుకృత వేషం; యిది దేవుడిచ్చిన వేషవేను.

మధు:  నాదగ్గరేనా మర్మం? యీ పిల్లెవరో?

కరటక: నాకుమార్త.

మధు:  నాటకవల్లా చెడి పొగటి వేషాల్లోకి దిగిందా? పెట్టిపుట్టారు గదా యేల యీ అవస్థ?

కరటక: నీదయ వల్ల దేవుడిచ్చిన స్థితికేం లోపం రాలేదు. నిన్ను చూదావని వచ్చాను.

మధు:  యిన్నాళ్ళకైనా యీ దీనురాలు మీకు జ్ఞాపకం రావడం అదెంత కాదు?

కరటక: నీలాంటి మనిషి మళ్ళీ వుందా? నిన్ను చూడ్డం బ్రహ్మానందం కాదా? నీదగ్గరకి రావడం చేదనా యిన్నాళ్ళూ రాలేదనుకున్నావు? డిప్టీకలక్టరుగారి కుమారరత్నం గారు నిన్ను చేపట్టారని తండ్రికి తెలిసింతరవాత, నేను గానీ నీయింటికి వస్తే పీక వుత్తరించేస్తాడేమో అనే భయం చాత కొంచం యడబెట్టి యితడికి యెప్పుడు బదిలీ అవుతుంది, మామధురవాణ్ణి యెప్పుడు చూస్తాను అని దేవుణ్ణి సదా ప్రార్ధిస్తూ వుంటిని. నువ్విక్కడెన్నాళ్ళాయి వున్నావు?

మధు:  డిప్టీ కలక్టరు గారి కుమారరత్నం గార్ని, తండ్రి, చదువు పేరు పెట్టి చన్నపట్ణం తగిలిన రెండునెల్ల దాకా ఆయన నాస్తుడు గిరీశం గారి ద్వారా డబ్బు పంపించాడు. ఆ తరువాత మొన్నటిదాకా గిరీశం గారు నన్నుంచారు గాని, డబ్బుకి యటాముటీగా వుండేది. డిప్టీ కలక్టరు అనుమానిస్తాడేమో అని పేరుగల వాడెవడూ నాయింటికి రావడం మానేశాడు. సంజీవరావు గారి అల్లరి కొంచం మరుపొచ్చిందాకా పైనుందావని యీ వూరొచ్చాను. (చిరునవ్వుతో) సరేగాని, యీ యిల్లాలు మాపంతులు కంటబడితే యీవిడ గుట్టు బట్ట బయలౌతుంది.

కరటక: యిల్లాలనేస్తున్నావేం అప్పుడేను? కన్నెపిల్ల; దీన్ని పెండ్లిచేయడానికే, నీ దగ్గిరికి తీసుకొచ్చాను.

మధు:  ఐతే యవరికి పెళ్లి చెయ్డం? నాకా యేవిటి? అలాగైతే సైయే. మొగవేషం వేసుకొని, పెళ్ళి పీటల మీద కూర్చుంటాను. మరి నాపెళ్ళాన్ని నాకిచ్చేసి మీతోవని మీరు వెళ్ళండి. (శిష్యుడి చెయిపట్టి లాగును) తరవాత పెళ్లి చేసుకుంటాను. అందాకా ముద్దియ్యి. (ముద్దెట్టుకొనును)

కరటక: నేరని పిల్లని చెడగొడుతున్నావు?

మధు:  నాలాంటివాళ్ళకి నూరు మందికి నేర్పి చెడగొట్టగలడు. ఎవరీ శిష్యుడు? యీ కన్నెపిల్ల నోరు కొంచం చుట్టవాసన కొడుతూంది.

కరటక: అంచాతే కాబోలు డబ్బీలో చుట్టలు తరచు మాయవౌతూంటాయి. మధురవాణీ, దేవుణ్నాకు నిన్ను చూపించాడు. పంతుల్లేని సమయం కనిపెట్టి వచ్చాను; మళ్ళీ అతడొచ్చేలోగా నా మాటలు నాలుగూ విని మాకు వొచ్చిన చిక్కు తప్పించు.

మధు:  మీకొచ్చిన చిక్కేవిటి? నేం చెయ్యగలిగిన సహాయవేవిటి?

కరటక: చిక్కన్నా చిక్కు కాదు. విను, యీ వూళ్ళో లుబ్దావుధాన్లని ఓ ముసలాడున్నాడు; వాడికి మా మేనగోడల్నివ్వడానికి మా బావ నిశ్చయించాడు. యీ సంబంధం చేస్తే నా చెల్లెలు నూతులో పడతానని వొట్టేసుకుంది. యేం వుపాయం చాస్తావో, దాని ప్రాణం కాపాడాలి.

మధు:  యీ పిల్లని అంతకి తక్కువ సొమ్ముకి అమ్మితే, లుబ్దావధాన్లు చంకలు గుద్దుకుని చేసు కుంటాడు. అతని దాకా యెందుకు, నేనే కొనుక్కుంటాను.

కరటక: చూపితే అందుకుపోయేదానికి నీకు మిక్కిలి చెప్పాలా యేవిటి?

మధు:  యిదివరకి నిర్ణయవైన సంబంధం యేమ్మిష పెట్టి తప్పించడం?

కరటక: నీ బుద్ధి కసాధ్యం వుందా, డబ్బు కసాధ్యం వుందా!

మధు:  బుద్ధికి అంతా అసాధ్యవే గాని, డబ్బుకి యక్కడా అసాధ్యం లేదు. యీ పెళ్ళిలో మా పంతులుకో పదిరాళ్ళు దొరుకుతాయనుకుంటున్నాడే!?

కరటక: నాసంబంధం చేసుకుంటే నేను యిరవై రాపాషాణాలు యిస్తాను.

మధు:  సరేగాని, చివరికి యేవి మూడుతుందో ఆలోచించారా?

కరటక: మధ్య నీకొచ్చిన పర్వా యేవిటి, నాకొచ్చిన పర్వా యేవిటి? యీకత్తెర మీసం, కత్తెర గెడ్డం కడిగేసుకుని నాతోవని నే వెళతాను. యీ కోక నీదగ్గిర పారేసి మాశిష్యుడు వెళతాడు. ఆ తర వాత యిదేవిటమ్మా యీ చిత్రవని నువ్వూ నలుగురమ్మలక్కలతో పాటు ఆశ్చర్యపడుదువు గాని. మీ పంతులుతో సిఫార్సు చేసి యీ మంత్రం యలా సాగిస్తావో గట్టి ఆలోచన చెయ్యి.

మధు:  మాపంతులు వక్కడివల్లా యీపని కానేరదు.

కరటక: మరి యింకా యవరి కాళ్ళు పట్టుకోవాలో చెప్పు.

మధు:  మాపంతులుతో మాట్లాడ్డం ఐన తరవాత అవుధాన్లు కూతురు మీనాక్షిని తండ్రికి తెలియకుండా చూసి, ఓ రెండు పెద్దకాసులు యిస్తానని చెప్పండి. ఆపైన సిద్ధాంతిని చూసి అతనికీ అలాగే ఆశ పెట్టండి. యీ పనికి సిద్ధాంతే కీలకం. నేను తెర వెనకనుంచి సమయోచితంగా హంగు చాస్తాను.

కరటక: నీమాట వేరే నే చెప్పాలా? నిన్ను సంతోషపెట్టడం నావిధి.

మధు: ఆమాట మీరు శలవివ్వడం నాకు విచారంగా వుంది. వృత్తి చేత వేశ్యని గనక చెయ్యవలసిన చోట్ల ద్రవ్యాకర్షణ చాస్తాను గాని, దయాదాక్షిణ్యాలు సున్న అని తలచారా? మీ తోడబుట్టుకి ప్రమాదం వచ్చినప్పుడు నేను డబ్బుకి ఆశిస్తానా?

*

మీ మాటలు

*