దేవుళ్లకు జడ్జీల శఠగోపం

 

-సత్యమూర్తి

చాలా మందికి ప్రశ్నలు గిట్టవు. అవి కొత్తవీ, ఘాటువీ అయితే అసలు గిట్టవు. ప్రశ్నలేవైనా అవి స్వీకరించేవాళ్లను బట్టి ఆలోచనో, ఆగ్రహమో పుట్టిస్తాయి. తోలు మందంగా ఉన్నవాళ్లకు ఏవీ పుట్టవనుకోండి, అది వేరే సంగతి. ఇప్పుడు చెప్పుకోబోయేది వేరే వాళ్ల గురించి. కాస్త బుద్ధీజ్ఞానమూ ఉంటాయని, మంచీ చెడూ తెలుస్తాయని అని అనుకునే జడ్జీల గురించి. అయినా, రోజూ కోర్టుల్లో కక్షిదారులకు శరపరంపరగా ప్రశ్నలు వేసే జడ్జీలకు నా బోటి సామాన్యుడు వేసే ఈ ప్రశ్నలు వినబడతాయా? అని.

జడ్జీలు కోర్టుల్లో పెద్దోళ్లయితే కావచ్చు కానీ బయటి మాత్రం వాళ్లు కూడా మనందరిలాంటి వాళ్లే. అందరి మాదిరే తిరుగుతుంటారు. ఉరిశిక్షల వంటి పేద్ద కఠినశిక్షలు వేసే పేద్ద జడ్జీలైతే వై ప్లస్, జెడ్ ప్లస్ గట్రా సెక్యూరిటీతో తిరుగుతుంటారు. తిరిగే హక్కు అందరికీ ఉంది. ఎక్కడైనా తిరగొచ్చు. కానీ వాళ్ల తిరుగుళ్ల వల్ల సామాన్య జనానికి ఇబ్బంది ఉండకూడదు. వాళ్ల మనసులు గాయపడకూడదు. జనం కట్టిన పన్నులతో ఉబ్బిన సర్కారు ఖజానాకు చిల్లు పడకూడదు. కానీ ఇప్పడు జడ్జీల తిరుగుళ్ల వల్ల ఇవన్నీ యథేచ్ఛగా సాగిపోతున్నాయి.

జడ్జీలు గుళ్లకు వెళ్లారన్న వార్తలు కొన్నేళ్లుగా మన ఘనత వహించిన తెలుగు దినపత్రికల్లో విపరీతంగా వస్తున్నాయి. పెద్ద పెద్ద ఫొటోలతో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ పాఠకులకు ‘కనువిందు’ చేస్తున్నాయి. జడ్జీలు గతంలోనూ గుళ్లకు వెళ్లేవాళ్లు. కానీ అప్పుడు ఇలాంటి వార్తలు చాలా అరుదుగా వచ్చేవి. ఏ పత్రికలకైనా వాళ్లపై ప్రత్యేక గౌరవాభిమానాలు ఉంటే లోపలి పేజీల్లో ఏ మూలో సింగిల్ కాలమ్ లో పడేసేవి. కానీ ఇప్పుడు పత్రికలు ‘అభివృద్ధి’ చెందాయి కనుక ఈ వార్తలూ అభివృద్ధి చెందాయి. ఫలానా జస్టిస్ శర్మ, ఫలానా జస్టిస్ రెడ్డి, ఫలానా జస్టిస్ చౌదరి కుటుంబసమేతంగా(కుక్కలుంటే వాటితోనూ) ఫలానా ఆలయానికి వెళ్లి ఫలానా దేవుణ్ని, దేవతను దర్శించుకుని తరించారని(తరింపజేశారని!) భక్తిప్రపత్తి పదాలు దట్టంగా రంగరించిన వార్తలు వస్తున్నాయి. కొన్నిసార్లు మొదటి పేజీల్లోనూ వస్తున్నాయి. పేద్ద జడ్జీలైతే చాలాసార్లు పేజీల్లో పైన, బుల్లి జడ్జీలైతే మధ్యలోనో, అడుగునో వస్తున్నాయి. ఎక్కడో ఒకచోట రాకుండా మాత్రం పోవడం లేదు. ఇదంతా మెయిన్ పేజీల సంగతి. జిల్లా పేజీల సంగతి మీరే ఊహించుకోండి! ఈ వార్తలు తెలుగు పత్రికలకే ప్రత్యేకం. దేశంలోని మరే ఇతర భాషా పత్రికల్లోనూ ఇంత వెల్లువలా రావడం లేదు. పాశ్చాత్య దేశాల పత్రికల్లో అసలు రావడం లేదు. వాళ్ల వెనుకబాటుతనంతో మన పురోగతిని పోల్చుకుని బోర విరుచుకుని తిరగొచ్చు.

అసలు.. ఫలానా జడ్జీ ఫలానా గుడికి వెళ్లాడన్న విషయం వార్త అవుతుందా? అవుతుందని పత్రికలు చెబుతున్నాయి కనుక ఒప్పేసుకోవాలి. మరి ఆ జడ్జీ కూరగాయల కొట్టుకో, బట్టలకొట్టుకో, బస్టాండ్ లో మరుగుదొడ్డికో పోతే వార్త ఎందుకవదు? అక్కడ దేవుడు లేడు కనుక అవదా? లేకపోతే మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది కనుక అవదా? ఈ వార్తల వెనకున్న హిందూమతాధిపత్యం గురించి కూడా చెప్పుకోకపోతే విషయం పూర్తి కాదు. పత్రికల్లో గుళ్ల జడ్జీల వార్తలే వస్తాయి కాని, మసీదులకెళ్లే ముస్లిం జడ్జీల వార్తలు, చర్చీలకు వెళ్లే క్రైస్తవ జడ్జీల వార్తలు మచ్చుకు కూడా కనబడవు( మళ్లీ మంత్రులు, సినిమా తారలు గుళ్లకు వెళ్లినా, మసీదులకు, చర్చిలకు వెళ్లినా వార్తలే! సినీ తారలు వ్యభిచారం చేస్తూ పట్టబడితే పండగే పండగ). ఆ రకంగా మన పత్రికలు లౌకికవిలువలను బొంద పెట్టడంలో తమవంతు పాత్రను బహు చక్కగా పోషిస్తున్నాయి. తెలుగునాట డ్రైనేజీ స్కీములేక డేంజరుగా మారుతున్న భక్తిని కళ్లు బద్దలయ్యేట్లు పారిస్తున్నాయి.

దేవుళ్లను, పత్రికలను, పాఠకులను తరింపజేసే ‘జడ్జీల గుళ్ల సందర్శన’ వార్తలు మీడియా విప్లవంలో భాగం అనుకోవడం అమాయకత్వం. ఈ వార్తల వెనుక.. మేధావుల మాటల్లో చెప్పాలంటే రాజకీయార్థిక, సామాజిక కారణాలు ఉన్నాయి. ప్రతిఫలాపేక్ష వీటి అసలు ఉద్దేశం. పది, పదిహేనేళ్ల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఇప్పడు ఏపీ, తెలంగాణలో పచ్చ, గులాబీ, ఎరుపు, మువ్వన్నెల నానా రంగుల  పార్టీల నాయకులపై బోలెడు అవినీతి కేసులు నమోదయ్యాయి, అవుతున్నాయి. వీళ్లలో కొందరు ఢిల్లీ లెవెల్ నాయకులైతే, కొందరు హైదరాబాద్ లెవల్, గల్లీ లెవల్ లీడర్లు. వీళ్లలో చాలామందికి సొంత పత్రికలు, కొందరికి బాకా పత్రికలు, కొందరికి అవసరార్థం ఆదుకునే పత్రికలు ఉన్నాయి. వీళ్లు తరచూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు గుళ్ల చుట్టు తిరిగినట్లు. గుళ్ల జడ్జీల ముందు వినయంగా నుంచుని వాళ్ల ప్రశ్నలకు భక్తిప్రపత్తులతో జవాబులు చెబుతుంటారు. కోర్టుల్లో ఇండియన్ పంక్చువాలిటీ మరింత ఎక్కువ కనుక విచారణ ఏళ్లూపూళ్లూ సాగుతుంది. జడ్జీల ముఖారవిందాల సందర్శన భాగ్యాలూ పెరుగుతుంటాయి. బెయిళ్లు రావాలన్నా, తీర్పులు తమకు అనుకూలంగా రావాలన్నా జడ్జీలను న్యాయమార్గంలోనో, అన్యాయమార్గంలోనో ప్రసన్నం చేసుకోవాల్సిన అగత్యం తలెత్తుతూ ఉంటుంది. ఆ క్రమంలో న్యాయమార్గంలో.. సదరు ఘనత వహించిన న్యాయమూర్తులుంగార్ల భక్తిపారాయణతను అశేష ప్రజానీకానికి వెల్లడి చేసి, వాళ్ల అజ్ఞానాన్ని తమ జ్ఞానఖడ్గాలతో  సంహరించడానికి సదరు నిందితుల తరఫు పత్రికలు కంకణం కట్టుకుని జడ్జీల గుళ్ల ఫొటోలను, వార్తలను సప్తవర్ణాల్లో అచ్చోసి వదలుతుంటాయి. సదరు ఘనత వహించిన వాళ్లు వాటిని చూసి ఆనందకందోళిత మనస్కులై ‘నాకిది, నీకది’ న్యాయం ప్రకారం తీర్పులు ఇచ్చేస్తూ ఉంటారు. అందరూ జడ్జీలు అలా ఉంటారని కాదు. దేనికైనా మినహాయింపులు ఉండి తీరతాయి.

జడ్జీలు వాళ్ల మానాన వాళ్లు గుళ్లకు పోతుంటే పత్రికలు, టీవీ చానళ్లే హంగామా చేస్తున్నాయనే వాదనొకటి ఉంది. ఇది పచ్చి బూటకం. సాధారణ జనానికి మల్లే విలేకర్లకు, ఫొటోగ్రాఫర్లకు కూడా రాజకీయ నాయకుల, సినీ తారల(టీవీ సీరియల్ల పుణ్యమా అని టీవీ తారల) ముఖాలే బాగా పరిచయం. దేశానికంతా, లేకపోతే ఒక రాష్ట్రానికంతా తెలిసిన జడ్జీ ముఖం ఒక్కటీ లేదు. మరి ఈ అనామక(అముఖ!) జడ్జీలు తిరుపతి, శ్రీశైలం వంటి ప్రముఖ ఆలయాలకే కాక, మూరుమూల గ్రామాల్లోని అంకాళమ్మ, నూకాలమ్మ గుళ్లకు వెళ్లినా ఈ విలేకర్లకు, మీడియా ఫొటోగ్రాఫర్లకు ఎలా తెలుస్తోంది? అప్పటికప్పుడు కలాలు ఎలా చెలరేగిపోతున్నాయి? కెమెరాలు ఎలా క్లిక్కుంటున్నాయి? వీళ్లకు ఆ జడ్జీల రాక గురించి ముందస్తుగా ఏ కర్ణపిశాచాలు చెబుతున్నాయి? హైదరాబాద్ లో అయితే పెద్ద జడ్జీలను తరచూ చూసే విలేకర్లు ఉంటారని సరిపెట్టుకోవచ్చు. మరి ఆ జడ్జీలు మారుమూల గుళ్లకు వెళ్లినప్పడూ చాటంత వార్తలు, ఫొటోలు ఎలా వస్తున్నాయి? సులభంగానే ఊహించుకోవచ్చు. జడ్జీలు గుళ్లకు తమ పోకడ గురించి స్వయంగానో, అనుయాయుల ద్వారానో మీడియా చెవిన వేస్తున్నారు. అహాన్ని కొబ్బరికాయలా పగల గొట్టుకోవడానికి దేవుడి వద్దకు వెళ్లే ఆ న్యాయమూర్తులు ఇళ్ల నుంచి బయల్దేరే ముందు ‘మేమొస్తున్నామహో..’ అంటూ టాంటాం వేయుంచుకుని మరీ వెళ్తున్నారు. గుళ్లకు వెళ్లాకయినా అహన్ని చంపుకుంటున్నారా అంటే అదీ లేదు. వీళ్లకు పూజరులు పట్టుగుడ్డలతో శాస్ర్తోక్తంగా స్వాగతం పలుకుతారు. అప్పడు ఒక ఫొటో. ధ్వజస్తంభం దగ్గర మరో ఫొటో. గర్భగుడి ముందర మరో ఫొటో. తర్వాత దైవ దర్శనం(అప్పడూ దేవుడితో కలసి ఫొటో తీయుంచుకోవాలనే ఉంటుంది కాని, పాపం మరీ మొహమాటం). తర్వాత శఠగోపం పెట్టించుకుంటూ ఒక ఫొటో. ఆనక బయటకొచ్చి గాలిగోపురం ముందు కుటుంబసభ్యులతో మరో ఫొటో. అందరూ నిలబడి ఒకటి ఫోటో, నడుస్తూ స్లో మోషన్ లో మరో ఫొటో. మొహమాటానికైనా వద్దన్న పాపాన పోరు. అలా ఛాయాచిత్రగ్రాహకులు ఒకపక్క జడ్జీల ఫొటోలను తీస్తూ తరిస్తూ ఉంటే.. మరోపక్క సర్వాలంకారభూషితులైన దేవుళ్లు, దేవతలు తమవైపు కన్నెత్తి చూసే కెమెరా లేక బిక్కుబిక్కుమంటూ ఉంటారు. ఈ తతంగం మధ్యలో సాధారణ భక్తులను క్యూలలో పడేసి చిత్రవధ చేయడం.

అయితే ఈ గుళ్ల జడ్జీల వార్తల వల్ల జనానికి వచ్చిన నష్టమేంటి? ఒట్టి అక్కసు కాకపోతే అని కొందరనుకోవచ్చు. ఈ వార్తల వల్ల చాలా నష్టాలున్నాయి.

మొదటి నష్టం… పత్రికలను డబ్బులిచ్చికొనే పాఠకులకు వార్తలకు బదులు ఆ అవార్తలను, కువార్తలను చదవాల్సిన ఖర్మ పట్టడం.

రెండో నష్టం… ఆ వార్తలు పత్రికల్లో స్థలాన్ని కబ్జా చేయడంతో పాఠకులకు(ప్రజలకు) కచ్చితంగా తెలియాల్సిన  సంక్షేమ పథకాలు, తుపాను హెచ్చరికలు, రైళ్ల, బస్సుల రద్దు వంటి ప్రధానమైన వార్తలకు చోటు దక్కకపోవడం. దక్కినా అవి అరకొరగా, ఏ మూలో సర్దుకోవాల్సి రావడం. ప్రజలు ఎదుర్కొంటున్న కరువు, కొండెక్కుతున్న నిత్యావరసరాల ధరలు వంటి వార్తలకు కూడా ఇదే గతి పట్టడం. ఈ జడ్జీల వార్తలు క్రైమ్ వార్తల్లాంటివే. ఎలాగంటే.. క్రైమ్ వార్తలను సవివరంగా అచ్చేస్తున్న పత్రికలు జడ్జీల వార్తలనూ అలాగే అచ్చేస్తున్నాయి కనుక. గుడి గురించి, భక్తి గుర్తించి, ఆలయ సందర్శన భాగ్యం(దేవుడికి భాగ్యం!) గురించి సదరు జడ్జి వాక్రుచ్చిన మాటలు పొల్లుపోకుండా వస్తున్నాయి కనుక.

మూడో నష్టం… పత్రికలను ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులో ఉంచడానికి వీలుగా ప్రభుత్వం వాటికి ఇస్తున్న సబ్సిడీల లక్ష్యం దెబ్బతినడం. పత్రికలు వాడే కాగితం(న్యూస్ ప్రింట్)పై కోట్లలో సర్కారు సబ్సిడీలు ఇస్తోంది. న్యూస్ ప్రింట్లో ఎక్కువ భాగం దిగుమతి చేసుకునేదే. ఆ రకంగా విదేశీ మారక ద్రవ్యానికీ గండి. పోస్టల్ చార్జిల్లోనూ, ఇతరత్రా వ్యవహారాల్లోనూ సబ్సిడీలు ఉన్నాయి. ఈ సబ్సిడీలు ప్రభుత్వ పెద్దల కష్టార్జితంలోంచి కాక, గుళ్ల హుండీల్లోంచి కాక,  జనం కట్టే పన్నుల్లోంచి ఇస్తుండడం వల్ల అంతిమంగా ప్రజలకే తిరుపతి గుండు కొట్టడం. గుళ్ల బాపతు వార్తలు, రాజకీయ నాయకును కీర్తించే వార్తలు, జనం మధ్య చిచ్చు రేపే విద్వేష వార్తలతో, అబద్ధాలతో పత్రికలు సబ్సిడీల ఉద్దేశానికి గండికొడుతున్నాయి కాబట్టి వాటికి ఎలాంటి సబ్సిడీలూ ఇవ్వొద్దనే డిమాండ్ ఒకటి చాలా కాలం నుంచి వినిపిస్తోంది.

నాలుగో నష్టం… ఈ ప్రతిఫలాపేక్ష వార్తల వల్ల న్యాయవ్యవస్థ కొంతైనా ప్రభావితమై నేరస్తులు శిక్షల నుంచి తప్పించుకోవడం, లేకపోతే తాత్కాలిక ఉపశమనాలు పొందడం. ఫలితంగా వాళ్ల నేరాల వల్ల దెబ్బతిన్న జనానికి న్యాయం జరక్కపోవడం. సందర్భం వేరు కావొచ్చు కానీ, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కేసులో సినీ నిర్మాతల వినతిపై కోర్టు అతనికి బెయిలిచ్చింది. అతడు విదేశాలకు వెళ్లి సినిమా షూటింగులు చేస్తున్నాడు. అతని సినిమాలు విడుదలై కోట్లు సంపాదిస్తున్నాయి. అతడు వీరోచితంగా కారుతో గుద్ది చంపేసిన మనిషి కుటుంబం, గాయపడిన వాళ్లు న్యాయం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు, ఆకలితో మాడి చస్తున్నారు. సంజయ్ దత్ పెరోళ్లపైన పెరోళ్లపై ఇంటికీ జైలుకూ తేడా లేకుండా గడిపేస్తున్నాడు. జడ్జీలకు అన్ని సంగతులూ తెలుసు. కానీ ప్రముఖుల ప్రయోజనాలపైనే వాళ్లకు శ్రద్ధ. తమను కూడా ప్రముఖులుగా ప్రజలకు పరిచయడం చేసే గురుతర బాధ్యత తలదాల్చిన పత్రికలపై మాత్రం శ్రద్ధ ఉండదా?

***

ayalan kurdi

మొన్నామధ్య  పత్రికల్లో.. మన తెలుగు పత్రికల్లో కూడా గుండెలు మెలిపెట్టే ఫొటో ఒకటి వచ్చింది. సిరియా నుంచి యూరప్ కు వలస వెళ్తూ పడవ మునిగి చనిపోయిన సిరియా బాలుడు అయలాన్ కుర్దీ ఫొటో అది. సముద్రపుటొడ్డున విగతజీవిగా పడున్న ఆ మూడేళ్ల బాలుడి ఫొటో ప్రపంచ దేశాల మనసు కరిగించి, కన్నీరు పెట్టిస్తోంది. శరణార్థులకు ఆశ్రయమిస్తామని యూరప్ దేశాలు ముందుకొస్తున్నాయి. ఫొటో జర్నలిజం శక్తికి ఆ చిత్రం తాజా ఉదాహరణ. టర్కీ మహిళా ఫొటోగ్రాఫర్ నీలూఫర్ దెమిర్ ఆ ఫొటో తీసింది.

మన తెలుగు మీడియా ఫొటోగ్రాఫర్లు కూడా తలచుకుంటే అలాంటి ఫొటోలు ఎన్నో తీయగలరు. నగరాల్లో చితికిపోతున్న బాలకార్మికులు, అప్పులతో, కరువుతో పొలాల్లోనే పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకుంటున్న బక్క రైతులు, నానా చోట్ల దోపిడీపీడనలకు గురవుతున్న శ్రమజీవులు.. అనాథలు, అభాగ్యులు.. ఎంతమంది లేరు! నీలూఫర్ దెమిర్ కళ్లతో చూడాలే గాని మన చుట్టూ లక్షలాది అయలాన్లు కనిపిస్తారు! కానీ మన కెమెరా కళ్లు గుళ్ల జడ్జీలవైపు నుంచి చూపు తిప్పనంత కాలం వాళ్లు మనకు కనిపించరు. మన చెవులను కర్ణపిశాచాలు కొరుకుతున్నంత కాలం ఆ అభాగ్యుల ఆర్తనాదాలూ వినిపించవు…

*

 

మీ మాటలు

 1. వనజ తాతినేని says:

  మంచి వ్యాసం . మన కెమెరాలు దృష్టి మారిస్తే .. ప్రపంచానికి కళ్ళల్లో నీరేం ఖర్మ మనకి కూడా రక్తం కారుతుంది.

 2. Nageswara Rao says:

  బాగుంది.. మరి అయలాన్ తాలూకు కుటుంబం వారు ఇంకా కొన్ని లక్షల మంది దిక్కు లేకుండా ఎందుకు పారిపోవలసి వస్తున్నదో ఆ కారణాలు కూడా రాస్తే బాగుంటుంది..మతం – దాని దారుణాల గురించి దేశాలు ఎందుకు ఇవాళ తలకిందులవుతున్నాయో సవిస్తరంగా చెబితే బాగుంటుంది.. మరి మన కళ్లకు అది కనిపిస్తోందా?

 3. చందు తులసి says:

  ఈ సంస్క్రతి ఒక అగ్ర దినపత్రిక మొదలు పెట్టింది. కేసుల నుంచి బయటపడేందుకు వేసిన కుక్క బిస్కెట్ లాంటివే ఈ వార్తలు. మన గవర్నర్ గారైతే రాజ్ భవన్ కన్నా గుళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు….

 4. buchi reddy gangula says:

  చక్కగా రాశారు సర్

  అసలు రాష్ట్రాలకు — గవర్నర్ lu– m.l.c… లు అవసరమా ????

  డబ్బులు — విందులు — యిస్తే —- టి .వి coverage… కు కొదువ లేదు — యీ రోజుల్లో
  అమెరికా లో —–మనం యిచ్చే ధర ను బట్టి time.slot….లు —

  రాష్ట్రం లో ఒక దళిత నాయకుని యింటి ముందు టి వి ల వాళ్ళు బస చేస్తారట —
  కారణం –2 రాష్ట్రాల గురించి మాట్లాడుతాడట —-(support..oppose…మాటలు —తనుకు ముట్టే డబ్బు ను బట్టి )
  —————————————————-బుచ్చి రెడ్డి గంగుల ————————-

 5. Palle nagaraju. says:

  చాల బాగుంది సారూ.

మీ మాటలు

*