ఉల్లిపాయసం 

 

                             -బమ్మిడి జగదీశ్వరరావు    

bajaraమా యింటి మీద ఒక్కసారిగా ఇన్ కమ్ టాక్స్ దాడులు! మా బంధు మిత్రుల యిళ్ళమీద కూడా దాడులు జరుగుతున్నాయేమో తెలీదు! నేనెప్పుడు కుబేరుల్లో కలిసిపోయానో నాకే తెలీదు! చూస్తూ వుండగానే మీడియా లైవ్ యిచ్చేస్తోంది! మా ఆవిడ లైవ్ లో తనని తాను టీవిలో చూసుకొని తెగ మురిసిపోతోంది! ‘ముందే చెపితే యెoచక్కా ముస్తాబయ్యేదాన్ని కదా?’ అని తెగ ఫీలైపోయి నా వంక నిష్టూరంగా చూస్తోంది! ఆగక, ‘నీ సంగతి తరువాత చూస్తా’నన్నట్టు కనుగుడ్లు యెగరేస్తోంది! చాలక, ఫేషన్ పెరేడ్ జరుగుతున్నట్టు పైటకొంగు నేల మీద ఈడుస్తూ పని వున్నా లేకున్నా అటూ యిటూ తిరుగుతోంది! ఇన్ కమ్ టాక్స్ వాళ్ళు లాగి పారేసిన చీరల్ని యేరుకొని యెoచక్కా మాటి మాటికి మార్చుకు వస్తోంది.. వెళ్తోంది.. కొంగు అటూ యిటూ తిప్పుతోంది! ఇటు కాలు అటుపక్కకేసి.. అటు కాలు యిటుపక్కకేసి.. తన పాదాలకి కాదు, భూమికే పుండయి పోయినట్టు అడుగులు వేస్తూ- వయ్యారాల హొయలు ఒలికిస్తూ నడుస్తూ ఆగి- అంతలోనే తల అటు తిప్పి యిటు తిప్పి చూసి- మళ్ళీ కదిలి వచ్చిన దారినే పోతోంది.

రెప్ప ఆర్పకుండా నేను మా ఆవిడ్నే చూస్తున్నాను! “మీ ఆవిడే కదా?” అడిగాడో అధికారి. అనుమానంగా చూసాను! “..తరువాత తీరికగా చూసుకుందురు” అని నవ్వాడు. తనతో రమ్మన్నట్టు తలవంచి సైగ చేసాడు. వెంట వెళ్లాను. అడిగిన అన్ని తాళాలు యిచ్చాను. తెరిచి చూపించాను. మీరెళ్ళి రిలాక్స్ కండి అన్నారు. మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి అన్నారు. బుద్దిగా నేలమీద మటం దిద్ది పోగేసిన పేపర్లూ ఫైళ్ళూ తిరగేసుకుంటున్నారు. అప్పుడే బడిలోంచి వచ్చిన పిల్లలిద్దర్నీ చేరదీసిన మాఆవిడ “చూడండి అంకుళ్ళు యెంత బుద్దిగా చదువుకుంటున్నారో..” ఆదర్శంగా చూపించింది. ఎప్పుడూ హోంవర్క్ చెయ్యడానికి యేడు చెరువుల నీళ్ళు తాగించే మా పిల్లలు తోటి క్లాసు పిల్లలతో పోటీ పడినట్టు అధికార్ల పక్కన కూర్చొని హోంవర్క్ లు చేసేసారు!

మా ఆవిడ ముఖంలో ఆనందం. “అమ్మా ఈ అంకుల్స్ ని రోజూ మన ఇంటికి రమ్మని చెప్పమ్మా..” యిద్దరు పిల్లలు యేకమై అడుగుతుoటే అధికారులు ముఖాముఖాలు చూసుకున్నారు. వాళ్ళకన్నా యెక్కువ అయోమయం నా ముఖంలోనే! నన్ను పట్టించుకోకుండా “వస్తారులే..” వొప్పించేయడానికి అన్నట్టు అధికారుల్ని చూసి నవ్వుతూ అంది. “రాకపోతే మీ నాన్న రప్పిస్తారులే..” భలే నమ్మకంగా బడాయిగా అంది మా ఆవిడ.

ఇంతలో యిరుగూ పొరుగూ చేరారు. అంతా సంతలా వుంది. మా ఆవిడ అడిగిన వాళ్లకి అడగని వాళ్లకి “మాయింటి మీద ఇన్ కమ్ టేక్సు వాళ్ళు పడ్డారొదినా.. పిన్నీ మాయింటి మీద ఇన్ కమ్ టేక్సు వాళ్ళు పడ్డారు.. అత్తా..” అని చాలా సంబరంగా అరిచిమరీ చెప్పింది.  అదో స్టేటస్ సింబల్ గా గర్వంగా తల తిప్పుకుంటూ యెగరేసుకుంటూ వచ్చింది. ఫ్రెండ్సుకూ పేరంటాళ్ళకూ ఫోన్లు కూడా చేసేసింది. టీవీలో చూడమని చెప్పేసింది. మధ్యలో యెందుకని యెవరో అడిగితే ‘సస్పెన్సు’ అని ఆట కూడా పట్టిస్తోంది. మరెవరితోనో ఏయే ఛానెళ్ళలో వస్తోందో అడిగి, రాని యేదో ఛానెల్ వాళ్ళ న్యూస్ కవరేజి బాగోదని, అసలు వాళ్లకి రేటింగ్ కూడా లేదని కసిదీరా రిపోర్ట్ యిచ్చేసింది.

“అమ్మా.. అమ్మమ్మా తాతయ్యా వాళ్ళకి చేప్పేవా?” పిల్లలు గుర్తు చేసారు. అందుకు ‘నా బంగారు కొండలు’ అని మెచ్చు కుంది. బంగారు కొండలయితే యెక్కడ యిన్ కమ్ టాక్స్ వాళ్ళు వదలకుండా పట్టుకుంటారోనని కలవరపడిపోయాను. నా బాధలో నేనుండగా మా ఆవిడ వెంటనే వాళ్ళ అమ్మానాయినలకు ఫోన్ చేసి చెప్పింది. అన్నా వదినలకు తను ఫోన్ చేసింది చాలక మళ్ళీ ఫోన్ చేసి చెప్పమంది. ఎవర్నీ మిస్సవవద్దంది. ఫోన్లో మాట్లాడుతూ “కనపడరుగాని దొంగ..” అని నా వంక ఓరగా మెచ్చుకోలు కళ్ళతో చూసింది. “ఇదిగో పక్కనే వున్నారు” అంటూ ఫోన్ నాకు అందించింది.

అవతల అత్తగారూ మాంగారూ స్పీకర్ ఆన్ చేసినట్టున్నారు, కలిసి మాట్లాడుతున్నారు. “మా యింటా వంటా లేదు అల్లుడుగారూ..” ఆ మాటకు తిడుతున్నారని గతుక్కుమన్నాను. “..మన మొత్తం బంధు మిత్రుల అన్ని ఫేమిలీలలో మీరే ఫస్ట్.. ఫస్ట్ అఫ్ ది ఫస్ట్..” మామగారి మాటకు అత్తగారు అడ్డు తగులుతూ “ముష్టి ముప్పైయ్యారించీల ప్లాస్మా టీవీ మన మొత్తం కుటుంబాలలో అందర్లోకీ మేమే మొదాట కొన్నామని మా చెల్లెలు వచ్చినప్పుడల్లా అందరిదగ్గరా టముకేసుకొని తెగ గొప్పలు చెపుతోంది కదా?, మా అల్లుడుగారి యింటిమీదే యిన్కం టేక్సోల్లు మొదాటపడ్డారని యిప్పుడు మనమూ చెప్పుకుందాము!..” మా అత్తగారు గొప్పలకు పోతున్నారు. అంతకుమించి పట్టుదలకు పోతున్నారు. “ ఏమైనా బాబూ.. మీరింత ప్రయోజకులైనందుకు నాకు యెంతో గర్వంగావుంది..” మామగారి మాట పూర్తి కాలేదు. “రేపు అన్ని పేపర్లలో వస్తుంది కదండీ..” మామగారిని మటల మధ్యలో అత్తగారు అడుగుతున్నారు.

నా బుర్ర గిర్రున బొంగరం తిరిగినట్టు తిరుగుతోంది. మా ఆవిడ నా చేతిలోని ఫోన్ లాక్కుంది. “నాన్నా.. తెలుసుకదా? మా ఆయనకి గొప్పలు చెప్పుకోవడం అస్సలు యిష్టం వుండదు.. గొప్పలు చెప్పుకుంటే యీ మనిషితో మనకెందుకిన్ని తిప్పలు?” అని మూతి మూడొంకర్లు తిప్పింది. “మన గొప్పలు మనమే కదా చెప్పుకుంటున్నాం.. వూరోల్ల గొప్పలు చెప్పుకోవడం లేదు కదా!?,  అయినా మనకి మనం చెప్పుకుంటే తక్కువయిపోతామా? మన గొప్పలు మనం చెప్పుకోనిదే లోకం దానికది గుర్తిస్తుందా?” నన్నే అడిగిందో వాళ్ళ నాన్నతో అందో అర్థం కాలేదు. “సరి సరే వుంటాను, చాలా ఫోన్లు వస్తుంటాయి.. అవతల వాళ్లకి యేంగేజ్.. ఆ..” మా ఆవిడ ఫోన్ కట్ చేసింది. టీవీ పెట్టింది.

టీవీలో నన్ను చూసి “హే.. నాన్న..” పిల్లలు అరిచారు. చూస్తే- చూపించిందే చూపిస్తున్నారు. చూసిందానికి మాఆవిడ కామెంటరీ కూడా తోడయింది. “అదిగో అటు టాటా యిటు బిర్లా- మధ్యలో..” మా ఆవిడ చెప్పకముందే “మధ్యలో లైలా” అన్నారు పిల్లలు. “తప్పమ్మా నాన్నగారిని అలా అనొచ్చా?” నా గౌరవానికి భంగం కలిగినట్టు నోటిమీద వేలు వేయించింది. ఛానెల్ మార్చిందే కానీ కామెంటరీ ఆపలేదు. “అటు ముఖేష్ అంబానీ యిటు అనిల్ అంబానీ మధ్యలో..” పిల్లలు మాఆవిడకి అవకాశం యివ్వలేదు. “మధ్యలో మన నాన్న..” అన్నారు నోటిమీద వేలు తియ్యకుండానే. మాఆవిడ పిల్లలు ప్రయోజకులైనట్టు గర్వంగా చూసింది. రిమోట్ నొక్కింది. కామెంటరీ ఆగింది. అనుమానంగా చూసింది. అర్థం చేసుకున్న అధికారి వొకరు నివృత్తి చేసేలోగా మధ్యలో “ఆర్ నారాయణమూర్తి నాకెందుకు తెలీదూ..” అంది. “ఆర్ నారాయణమూర్తి కాడమ్మా.. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి.. ఆపక్క లక్ష్మీమిట్టల్..” అధికారి సరిదిద్దేలోపల “మధ్యలో మన నాన్న..” కోరస్ పాడారు పిల్లలు.

అలా ప్రముఖుల మధ్యలో నన్ను చేర్చి పెట్టడమేకాదు, నన్నో ‘పెద్ద చేప’గా ‘తిమింగలం’గా టీవీ ఛానెల్స్ వాళ్ళు తమ తమ క్రియేటివిటీని చూపిస్తూవున్నారు. “మమ్మీ.. డాడీ పేద్ద చేపా? తిమింగాలమా?” పిల్లల డౌట్లు పిల్లలవి. “మొదట బుల్లి చేప.. తరువాత బిగ్ చేప.. తరువాత తిమింగలం.. తరువాత బకాసురుడు..” మాఆవిడ ఆన్సర్లు మాఆవిడవి. “డాడీ.. డాడీ నువ్వెప్పుడు బకాసురిడివి అవుతావ్?” పిల్లలు నన్నడిగారు. “మీనాన్నకి అంత సీన్ లేదు..” మాఆవిడ నిరసన స్వరం. యేo అన్నట్టుగా చూసారు పిల్లలు. “బకాసురులవ్వాలంటే.. రాజకీయాల్లోనయినా వుండాల.. రాజకీయాలయినా నడపాల..” నన్నో వేస్టుగాణ్ణి చూసింది మాఆవిడ.

చూసి- యిటు పిల్లల డౌట్లు తీరుస్తూ.. అటు లైవ్ ల్లో.. ఫోనుల్లో.. వచ్చీ పోయే వాళ్ళతో.. వీధిలో వాళ్ళతో.. ఫ్రెండ్స్ తో.. పేరంటాళ్ళతో మాఆవిడ అవధానం చేస్తూ “లైవ్ యివ్వడం లేదా?” మా ఆవిడ వుస్సురుమంది. “టీలూ కాపీలూ తాగారు.. టిపిన్లు పెడితే తిన్నారు.. చిన్న కునుకు తీస్తన్నారు.. లెగిసి సూటింగులు చేస్తారులేమ్మా..” సర్ది చెపుతోంది పనిమనిషి. ఓపిక పట్టలేక ఛానెళ్ళు మార్చుతోంది మా ఆవిడ!

“అమ్మా.. యిన్కం టేక్షోల్లు పడ్డారుకదా.. యిప్పుడయినా నా జీతం పెంచడమ్మా..” పనిమనిషి వొద్దికను మించి వుషారుగా అడిగింది. మా ఆవిడ నన్ను అడక్కుండానే సరేననేసింది.

టీవీలో- “ఊ!.. తాలింపు యెయ్యడానికి దాకే లేదు, యిల్లంతా యిత్తడి పెనాలని!.. వుల్లిపాయల రేటు తగ్గించడాకే లేదు, యీలు పత్తేకంగా ఓదా పట్టుకోస్తారంటే నమ్మీయాలా?” మూతి మూడొంకర్లు తిప్పి వెళ్లిపోయింది చిక్కోల్ ముసల్ది. ‘ప్రత్యేక హోదా సంగతీ రాజధాని సంగతీ  తరువాత ఆలోచించ వచ్చని, ముందు వుల్లి ధరలు తగ్గించాలని సామాన్య జనం కోరుకుంటున్నార’ని న్యూస్ యాంకర్ చెపుతున్నాడు.

యాంకర్ గొంతు నొక్కినట్టుగా రిమోట్ నొక్కింది మా ఆవిడ. న్యూస్ రూమ్ డిస్కషన్ నడుస్తోంది. అందరూ వొక్కసారే యెవరి వాదనని వారు బలంగా వినిపించి యెవరికీ యేమీ అర్థం కాకుండా చక్కగా మాట్లాడడంతో కాసేపటికిగాని అర్థం కాలేదు. ప్రతి రైతూ విధిగా తనకున్న భూమిలో పావొంతు వుల్లి పండించాలని ఆదర్శ రైతు వొకరంటే, వుల్లిని పౌడర్ చేసి పేస్టు చేసి దాచుకొని నిలవా పెట్టుకోవాలని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ యిప్పటికే సూచించారని అధికార పార్టీ సభ్యుడు గుర్తు చేసాడు. ఉల్లిని అధికార పార్టీ వాళ్ళూ వాళ్ళని సపోర్ట్ చేసే బడా వ్యాపారులు బాగానే నిలవా చేసారని ప్రతిపక్ష సభ్యుడు దుమ్మెత్తి పోసాడు.  ఉల్లి దొంగల్ని గజదొంగలుగా పరిగణించాలని జర్నలిస్టు మేథావి సూచిస్తే, అసలు వుల్లి లేకుండా వంట చేయడం మీద పరిశోధనలు జరగాలని సామాజిక మేథావుల సంఘం కన్వీనర్ అభిప్రాయపడ్డారు!

“రామాయణంలో ఈ పిడకల వేటేమిటో?..” నాలో నేను అనుకున్నాననుకున్ననేగాని పైకి అనేసాను. మాఆవిడ దగ్గర అన్నిటికీ ఆన్సర్ వున్నట్టే దీనికీ వుంది. “రామాయణంలో పిడకలవేట వుంది.. లంకా ప్రవేశం చేయడానికి సముద్రంలో  వానర సైన్యం వారధి నిర్మించింది. అప్పుడు సముద్రంలో వేసిన రాళ్ళన్నీ పిడకలగా తెలిపోయాయట.. వారదికోసం చేసిన రాళ్ళ వేటే రామాయణంలో పిడకలవేటగా ప్రసిద్దికెక్కింది..” మాఆవిడ వివరణకి నేనూ పిల్లలూ మాత్రమే కాదు ఇన్కమ్ టాక్స్ అధికారులూ నోళ్ళు వెళ్ళబెట్టారు!

‘ఉల్లిపాయలకూ ఇన్కమ్ టాక్స్ వాళ్ళకూ ఏమిటి సంబంధం?’ నా ఆలోచనలను అలవాటుగా స్కాన్ చేసిన మాఆవిడ “చెట్టు మీది కాయకీ సముద్రంలో వుప్పుకీ వున్న సంబంధమే!” అంటూ చెవిలో గుసగుసగా చెప్పి ముసిముసిగా నవ్వింది.

మా రొమాంటిక్ సీన్ ని అధికారులు ఆరాధనగానూ అనుమానంగానూ చూసారు.

మళ్ళీ రిమోట్ నొక్కింది. సెన్సెక్స్ స్థానంలో ‘ఆనియనెక్ష్’ యిస్తున్నారు. షేర్స్ లో తరగడం పెరగడం వుంది. కాని వుల్లికి సంబంధించిన ‘ఆనియనెక్ష్’లో పెరగడమే తప్ప తరగడం లేదు.  సెన్సెక్స్ పడిపోయినప్పుడు వచ్చిన గుండెపోట్లు కంటే  ‘ఆనియనెక్ష్’ పెరిగి పోయినప్పుడు వచ్చిన గుండెపోట్లే యెక్కువ!

ఛానెల్ మారింది. దృశ్యం మారింది. మా పిన్నీ కూతురు పద్మ. “పద్దూ వదిన వచ్చింది” సంబరంగా అంది మాఆవిడ. యింటి మీద యిన్కం టాక్స్ వాళ్ళు పడితే ‘బంధువులతో కూడా మాట్లాడిస్తారా?’ అవాక్కయాను. అందుకు కాదని కొన్ని క్షణాల్లో అర్థమయ్యింది. పద్దూ మొగుడూ లైవ్ లోకి వచ్చేసాడు. ‘యెంతో ప్రేమగా వుండే వాళ్ళు వీళ్ళకేమొచ్చింది?’ జుట్టు పీక్కున్నాను.

“..దుర్మార్గం కాకపొతే యేమిటండీ యిదీ.. అదనపు కట్నం అడిగితే.. మగనాకొడుకులు అంతా యింతే పోన్లే అని సరిపెట్టుకున్నాం, అత్తింటి వారు వుల్లి.. వుల్లిపాయలు అడిగితే పెట్టాలా అండీ.. అది సాధ్యమయ్యే పనేనా అండీ.. గొంతెమ్మ కోరికలు కోరితే యెట్లా అండీ..” మాపద్దూ రెచ్చిపోతోంది. “అదికాదండీ వుల్లిపాయలు నిండా వేసుకొని ఆమ్లెట్ తిని యెన్నాళ్ళయిందో తెలుసా అండీ.. యేమండీ ఆమ్లెట్ కాదండీ, వుల్లిగారెలు తనకీ యిష్టమేనండీ.. తను తింటుందనే అడిగాను..” కళ్ళ నీళ్ళ పెట్టేసుకున్నాడు మాబావ. ఎందుకో నా కళ్ళలోనూ నీళ్ళు తిరిగాయి. ఉల్లివల్ల కుటుంబాలు కూలిపోవడమే కాదు, ప్రేమలు యెలా పగలుగా మారుతున్నాయో.. విడాకులకు దారితీస్తున్నాయో న్యూస్ యాంకర్ చెప్పింది. సాక్ష్యంగా మరికొన్ని బైట్స్..

“మా ఆయన యెప్పుడూ నన్నొక మాట అనేవారు కాదు, వుల్లి పాయలు దుబారాగా వాడి సంసారాన్ని నాశనం చేసానని అన్నప్పుడు యింక అతనితో యెంత మాత్రమూ వుండకూడదనుకున్నాను.. డైవోర్స్ తీసుకొని పుట్టింటికి వచ్చేసాను..” కళ్ళు  వొత్తుకుంది ఓ ఆడ పడుచు.

“.. అరే.. నేనేమన్నా బాహుబలి టిక్కెట్లు అడిగానా? లేదే, రూబీ నక్లెస్ అడిగానా? లేదే, ఆధార్ కార్డు పట్టుకొని రైతు బజార్లో యిచ్చే సబ్సిడీ వుల్లి తెమ్మన్నాను, క్యూ అంటాడు, ఎర్రగడ్డ రైతుబజార్ క్యూ ఎల్బీనగర్ దాక వుందంటాడు.. ఎల్బీనగర్ కాదండీ విజయవాడ వరకూ.. విశాఖపట్నం వరకూ క్యూ వుంటుంది.. వుంటే మాత్రం ఫ్యామిలీ అంటే బాధ్యత లేదా? ఆ మాత్రం చెయ్యలేవా? అడిగాను. సంసారమే చెయ్యలేనన్నాడు.. దట్సాల్.. వుయ్ క్లోస్డ్ అవర్ రిలేషన్ షిప్..” డోoట్ బాదర్డ్ అన్నట్టు చెప్పింది ఓ పడుచుపిల్ల.

ఇంతలో నా సెల్లు ఘోల్లుమంది. హలో అన్నాను. పోలో మన్నాడు మిత్రుడు. నువ్వింత నమ్మక ద్రోహివి అనుకోలేదన్నాడు. ఔనౌను అన్నాను. మరి అధికారుల కళ్ళూ చెవులూ నన్నే చూస్తున్నాయి. నవ్వాను. ఏడ్చినట్టుంది అన్నాడు. ఔనౌను అన్నాను. ‘పిల్ల పెళ్ళికి కాస్త సాయం చెయ్యరా, అదీ అప్పుగా అంటే లేదన్నావ్’ అన్నాడు. ఔనౌను అన్నాను. ‘మరి నీ యింటి మీద యిన్కమ్ టేక్సోళ్ళు యెలా పడ్డార్రా?’ అన్నాడు. ఔనౌను అలవాటుగా అనేసి, నాలుక్కరుచుకొని తెలీదన్నాను. “ఇన్నాళ్ళూ డబ్బులు లేవని చాలడం లేదని తెగ దొంగేడుపులు యేడ్చేవా.. యిప్పుడు నిజంగా యేడు.. తధాస్తు దేవతలు వుంటార్రా..” తిట్టి తాటించి మరీ ఫోన్ పెట్టేసాడు.

“ఏంటండీ సుబ్బారావన్నయేనా?, చెప్పలేదని తెగ ఫీల్లవుతున్నారా? అవరూ.. యింటి మీద యిన్కం టేక్సోల్లు పడ్డారని యిప్పుడన్నా ఫ్రెండ్స్ కి మెసేజులు పెట్టండి.. మెయిల్లు చెయ్యండి.. మా ఫ్రెండ్ యింత గొప్పవాడయ్యాడని వాళ్ళూ పదిమందికి గొప్పగా చెప్పుకుంటారు. అది వాళ్ళకీ గౌరవం.. మనకీ గౌరవం.. నేనయితే నా ఫేస్ బుక్ లో మన ‘స్టేటస్’ పెట్టేసా..” టీవీ వదిలి కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కూ టక్కూ లాడిస్తూ వుంది.

పిల్లల చేతికి రిమోట్ దొరికింది. ఛానెల్స్ ఛేoజ్ చేస్తున్నారు. రీమిక్స్ సాంగ్ దగ్గర ఆగారు. కొత్త సినిమా పాట కాదు. పాతది. మూగనోము లోది.

“ఉల్లివి నీవే.. తల్లివి నీవే.. చల్లగ కరుణించే దైవము నీవే..” పాటకు మా పిల్లలిద్దరూ “ఉల్లివి నీవే.. తల్లివి నీవే..” అంటూ తెరమీది పిల్లలతో కలిసి కోరస్ యిస్తున్నారు.

“ఏవండీ..” పిలుపు విని మా ఆవిడ పక్కన చేరాను. ఫేస్ బుక్ లో తను బుక్కయింది చాలక నన్నూ లాగింది. “.. మీరు వుల్లిపాయలకు వెళ్ళేటప్పుడు.. పోలీస్ స్టేషన్ లో మీ యిన్ఫర్మేషన్ యిచ్చి వెళ్ళండి.. మార్గం మధ్యలో యెవరితో మాట్లాడకండి.. వీలయితే కిందింటి కుర్రాడు సైదుల్ని మీతో తోడు తీసుకువెళ్ళండి.. చైన్ స్నాచర్స్ లాగే ఆనియన్ స్నాచర్స్ తయారయ్యారు జాగ్రత్త.. బ్యాంకుకు వెళ్ళేటప్పుడు మనీ డ్రా చేసేటప్పుడు యెన్ని జాగ్రత్తలు తీసుకుంటామో వుల్లిపాయలకి వెళ్ళినప్పుడు- కొని తీసుకోస్తున్నప్పుడు అన్నే జాగ్రత్తలు తీసుకోవాలి..” చదువుతూ చెప్తోంది. మా ఆవిడ మాటకు గంగిరెద్దులా తలాడించాను. అలా తలాడిస్తే నేనెంతో ముద్దోచ్చేస్తానట!?

ముద్దుముద్దుగా మాఆవిడ “ఉల్లిని కోస్తే కళ్ళు మంట! ఉల్లిని కొంటె గుండె మంట! ఉల్లి ఉంటేనే వంట! ఉల్లి లేకుంటే తంటా! ఎలావుందంటా?” చెప్తే మురిసి? “నువ్వే నా కవితంట” అన్నాను!

ఇన్కమ్ టాక్స్ అధికారులు రిపోర్టులు తయారు చేసి పని పూర్తయినట్టు లేచి నిల్చున్నారు. నాతో కొన్ని సంతకాలు కూడా తీసుకున్నారు. “థాంక్స్ ఫర్ యువర్ కోపరేషన్..” అధికారి మాటకి “వెల్ కం.. మోస్ట్లీ వెల్ కం..” మాఆవిడ మగపెళ్లివారితో అన్నట్టు యెంతో ప్లీజింగ్ గా ప్లెజర్ గా అంది.

వెళ్ళిపోతున్న అధికారుల వెంట పడి “సార్.. యిప్పుడు యేమవుతుంది?” నా భయం కొద్దీ నేనడిగాను. “మొదటిసారి కదా.. అందుకని..” మాఆవిడ నవ్వింది. నవ్వి “యిన్కం టేక్సు రెయిడ్స్ జరిగినోల్లంతా అలా కోర్ట్ కు వెళ్లి యిలా వచ్చేస్తున్నారు.. సొసైటీ అన్నాక పెద్దవాళ్ళన్నాక పెద్ద సమస్యలు వస్తాయి.. పోతాయి.. కామన్..” చెప్తూ వుంటే మాఆవిడ నాకు ధైర్యం చెపుతోందో అధికార్లని అధైర్యపరుస్తోందో అర్థం కాలేదు!

“సార్.. యింతకీ మా యింటి మీదే మీరు యెందుకు పడ్డారు?” అని నా ప్రశ్న నాకే సబబుగా తోచక “ మీరంటే మీ  యిన్కం టేక్సోల్లు యెందుకు పడ్డారు సార్?” దీనాతిదీనంగా హీనాతిహీనంగా అడిగాను.

నా ముఖం చూసి నిజం చెప్పకుండా వుండలేక పోయారు.

“టెన్ డేస్ బాక్ మీరు ఆనియన్ దోస ఆర్డర్ చేసి తిన్నారు.. గుర్తుందా?” అడిగి, అదే కారణమన్నట్టు ఒక్క క్షణం చూసి, ఆగిన అధికారి సిబ్బందితో ముందుకు అడుగెయ్యబోయాడు.

సరిగ్గా అప్పుడే మాఆవిడ “యేవండీ మీకిష్టమని ముద్దపప్పుచేసాను,  పపూ టమాటా కూడా వండాను, రండి వేడిగా తిందురు..” నన్ను పిలిచింది.

ముందుకు వెళ్ళబోతున్న యిన్కమ్ టాక్స్ వాళ్ళు ఆగి వెనక్కి చూసారు!

*

మీ మాటలు

 1. Delhi Subrahmanyam says:

  ఎంత గొప్ప వ్యంగ్యం రాసారండి. అభినందనలు.

 2. msk krishnajyothi says:

  చాల సరదాగా వుంది. గుడ్.

 3. వెంకట్ కొండపల్లి says:

  బమ్మిడి జగదీశ్వర రావు గారు, ఉల్లి ధరల మీద సాటైర్ చక్కగా వ్రాసారు అండి, బాగా నవ్వు కున్నాము . కొంచెం క్లుప్తీకరించి ఉంటే ఇంకా ఆసక్తిగా ఉండేదేమో అని నాకు అనిపించింది అండి.

 4. రెడ్డి రామకృష్ణ says:

  అవునుమరి,పప్పులుకూడా మేము గొప్పవాళ్ల పక్షమేఅని ఎప్పుడో తేల్చి చెప్పేసాయి! ఈ మధ్య మరీ పెట్రేగిపోతున్నాయి. వాటిని మీరు వాడుతున్నందుకు రెండోసారి రైడు చెయ్యాల్సి వస్తుందేమోనాని ఇనకం టేక్సు ఆఫీసరులు అలాచూసుంటారు

 5. చాలా బాగుందండి.
  మీరు ఉల్లి మీద రాసిన సమాజం మీద విసిరినా విసుర్లు భాగున్నాయి. ఇంకం టాక్స్ దాడు లంటే క్రిమినల్ కేసులు పెడితే, లేక పెట్టించు కుంటే, కన్నబిడ్డల్ని హత్య చేస్తే, చివరకు ఎవర్నో ఒకరిని హత్య చేయటం మీడియాలకెక్కడమ్ సమాజం లో స్టేటస్ పెంచు కోవటానికి సింబల్. ఇక పై ఎవరు ఏ కేసులు పెట్టక పోయినా , పెట్టించు కొని మరీ గౌరవాణ్ని పెంచు కాలం! వస్తూ……. వుంది.

మీ మాటలు

*