బహుజన బంధమే “అలాయి బలాయి”!

ఖాజా

1

తన కవిత్వంతో తెలుగు సాహిత్యంలో బలమైన ముద్రవేసిన స్కైబాబ, కథకుడిగా అట్టడుగు వర్గాల జీవితాన్ని  శక్తివంతంగా వినిపిస్తున్నాడు.  ఇప్పటికే అధూరే పేరిట తన కథల సంపుటి ప్రచురించి కథా సాహిత్యంలో ముస్లిం జీవితాల వెతలను ఆవిష్కరించాడు. ఇప్పుడు అలాయి బలాయి పేరుతొ బహుజన కథలు ప్రచురిస్తున్నాడు. బీసీ, ఎస్ సీలను కలిపి చెప్పడానికి స్కైబాబ ‘బహుజనుల’నే మాటను ఉపయోగించాడు. అలాయి బలాయి అంటే హృదయానికి హృదయాన్ని చేర్చి హత్తుకొని అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసే ముస్లిం సాంప్రదాయం. స్కై బాబ ఈ కథా సంపుటి ద్వారా బహుజన సమాజాన్ని తన గుండెలకు హత్తుకుంటున్నాడు… ఇక్కడి గ్రామీణ సమాజంతో, బహుజన సమూహంతో, తనలాంటి ముస్లిములకు వున్న బలమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తున్నాడు.

భారతీయ గ్రామీణ సమాజాన్ని తరచి చూస్తె  ప్రతి గ్రామం భారత దేశపు మినియేచర్ లా కనిపిస్తుంది..  వూరి పాలనను, సంపదను అనుభవిస్తూ పెత్తనం చెలాయించే అగ్రకుల వర్గం ఒక పక్క, వూరి విసర్జితాలని నెత్తిమీద మోస్తూ, వూరికి వూడిగం చేస్తూ, నిచ్చెన మెట్ల వ్యవస్థకి మరింత కింద, వూరి జనానికి మరింత దూరంగా, అంటరానితనంలో, పేదరికంలో దుర్భర జీవితం గడుపుతున్న దళిత సమాజం ఊరికి దూరంగా మరొక పక్క! ఈ రెండిటి మధ్య అటు అగ్రకుల సమాజాన్ని అందుకోలేక, ఇటు తన కన్నా కింద వున్న దళిత సమాజాన్ని హత్తుకోలేక నడుమన ఊగిసలాడుతూ BC సమూహం. హిందూత్వం హీనంగా చూసి, ఎదగనీయకుండా తోక్కేసిన  దళిత, బిసి కులాల సమాహారమే బహుజన సమాజం.

ఇది మన గ్రామీణ సామాజిక చిత్రం. ఈ గ్రామీణ సామాజిక చిత్రం అస్తిత్వ సాహిత్యం కన్నా ముందు తరం  కథల్లో, కవిత్వంలో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ ప్రవాహం పైకి ఎంత తేటగా కనిపించినా దీని అంతర్లీన ప్రవాహం అత్యంత మురుగు. అది అప్పుడప్పుడూ పైకి తేలుతూ తన స్వభావాన్ని ప్రదర్శించి మళ్ళీ మరుగై పోతుంది. మురుగై పోయిన పైన ప్రవాహం మళ్ళీ కుదురుకొని తేటగా మారడానికి చాలా కాలం పడుతుంది.  అస్తిత్వ సాహిత్యం ఈ సమాజపు లోపలి పొరలను అర్థం చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. గ్రామీణ సమాజపు లోపలి పొరల్లోని కుళ్ళిన ఈ భావజాల అవశేషాల్ని బహిరంగ పరచడం మనం ఇప్పుడు స్కైబాబ బహుజన కథల్లో చూడవచ్చు.

*

skyఈ సంపుటి లోని పదకొండు కథల్లో సోయి కథ ఒకటి.. గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించే ఈ కథలో సిటీలో సెటిలైన శేఖర్ రెడ్డి పర్స్పెక్టివ్ నుంచి కథ నడుస్తుంది. శేకర్ రెడ్డి ని స్కై బాబ బహుజన గుంపులోనుంచి తప్పి పోయిన వాడిగా చూసాడు. నిజానికి ఈ దేశంలో రెడ్డి, చౌదరి వంటి కొన్ని శూద్ర కులాలు పాలక వర్గ స్థాయికి ఎదిగి నిజంగానే తమను తాము శూద్రత్వం నుంచి తప్పించేసుకున్నాయి. మంచిదే! ఆర్థికంగా, పాలన పరంగా  శాశించె స్థాయికి చేరుకున్నాయి. సిటీలో సెటిలైన శేఖర్ రెడ్డి భద్ర జీవితంలోకి వెళ్ళిపోయాడు. గ్రామీణ జీవితంలోని ఆర్ధిక, సామాజిక సంఘర్షణ నుండి కొంత మేరకు బయట పడ్డాడు.   ఈ కథలో యాదగిరి గ్రామీణ బహుజన సమాజానికి ప్రతినిధి. ఎదుగూ బొదుగూ లేని జీవితం. భద్రత, భరోసా లేని ఉపాధి తో కష్టంగా సాగే బతుకు. తాగుడు కారణంగా విచ్చిన్నమవుతున్న కుటుంబాలు. సాధారణ గ్రామీణ బహుజనుల జీవితం ఈ కథలో అంతర్లీనంగా ప్రతిబింబిస్తుంది.

ఐతే సాధారణ  సమాజం కన్నా భిన్నంగా  తర్వాత తరాల పట్ల ఒక బాధ్యత గా యాదగిరి కొడుకు చైతన్యవంతుల ప్రతినిధిగా నిలబడటం ద్వారా భవిష్యత్తులో అయినా బహుజన సమాజం చైతన్యవంతమై స్వయం గుర్తింపు సాధిస్తుందని ఆశను రచయిత ప్రకటించాడు.

‘జమ్మి’, ‘అంటు’ కథలు రెండూ కూడా మానవ సంబంధాలన్నీ కుల సంబంధాలే అని చెప్పిన కథలు. దళిత కులాల మధ్య వున్న అసంబద్ధ అనైక్యతను ‘జమ్మి’ కథ ప్రతిబింబించింది. ‘అంటు’ కథ ముస్లిం సమాజానికి దళిత సమాజానికి మధ్య వున్న ఘర్షణను ఎత్తి చూపింది. కుల నిర్మూలన జరగాలంటే  కులాంతర వివాహాలు జరగాలన్నది అంబేద్కర్ ఆలోచన. కానీ ఏ కులం అందుకు సిద్ధపడి లేదు. గ్రామీణ సమాజంలో వున్న పిలుపుల్లోని బంధం ఏ అవసరానికైనా ఉపయోగ పడవచ్చేమో గాని సామాజిక మార్పుకు, ఉపయోగపడవు.  మొత్తానికి  అన్ని బంధాల్లో కుల, మత  బంధాలే  అత్యంత  బలమైనవి అని చెప్పె కథలు ఇవి.

‘జవాబ్’, ‘అంటు’ కథలు ముస్లిం సమాజానికి బహుజన సమాజానికి వున్న  ఘర్షణను ప్రతిబింబించిన కథలు. జవాబ్ కథ గుజరాత్ లో ముస్లిముల మీద జరిగిన హత్యాకాండ నేపథ్యం తో రాసిన కథ. ఇందులో సైదులు పాత్ర బీసీ పాత్ర. ఈ సైదులు చేసిన ఒక పనికి వూరు ఊరంతా కలిసి పంచాయితీ పెడుతుంది.   అప్పుడు సైదులు తన లోపలి దుఖాన్ని మనిషిగా తన ఘర్షణని వ్యక్తీకరిస్తాడు. కొందరు స్నేహితులతో   కలిసి గుజరాత్ వెళ్లి అక్కడ పరిస్థితులు చూసి వచ్చిన సైదులు పంచాయితీలో అక్కడి ముస్లిముల స్థితి గురించి  ఆవేదన చెందుతాడు

*

గ్రామీణ బహుజన సమాజంతో ముస్లిం సమాజానికున్న బంధాన్ని, ఇబ్బందినీ కూడా చెప్పిన ఈ కథలలో అంతర్లీనంగా వున్న ముస్లిం ఆవేదన బహుజన సమాజానికి అర్థం అవుతుందని నేను భావిస్తున్నాను. స్కై బాబ ప్రచురిస్తున్న ఈ 11 కథలు, బహుజన సమాజానికి మైనారిటీ సమాజానికీ మధ్య ఒక చర్చకు తావిచ్చే సందర్భానికి అవకాశం కల్పిస్తాయని అనుకుంటున్నాను. ఈ కథల్లోని అన్ని అంశాలు సుదీర్ఘ చర్చనీయాలే అయినా నేను కొన్ని కథల్ని మాత్రమె ఉదాహరించాను. ఈ ముందు మాటను స్కై బాబ కథల రివ్యూ లాగా కాక, ఈ కథల సందర్భం చుట్టూ వున్న సామాజిక చారిత్రిక తాత్విక పరిణామాల పరిశీలన కోసం కొన్ని అంశాలను ప్రస్తావనకు తెచ్చాను. ఇంకా ఈ కథల నేపథ్యంగానే చర్చించాల్సిన అంశాలు చాలా వున్నాయి. బహుశా ఈ పుస్తకం బయటికి వచ్చాక ఉద్యమ, పరిశోధక మిత్రులు ఆ పని చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి చర్చకు సందర్భాన్నిచ్చిన మిత్రుడు స్కైబాబ కు అభినందనలు.

*

 

మీ మాటలు

 1. ఖాజా ముందుమాట పూర్తి పాఠం..
  – – – – – – – – –
  మనుధర్మం vs ఫూలే అంబేద్కర్ ధర్మం
  బహుజనులారా ఎటువైపు?
  – – – – – –
  డా. ఖాజా
  – – – – – –
  1
  తన కవిత్వంతో తెలుగు సాహిత్యంలో బలమైన ముద్రవేసిన స్కైబాబ, కథకుడిగా అట్టడుగు వర్గాల జీవితాన్ని శక్తివంతంగా వినిపిస్తున్నాడు. ఇప్పటికే అధూరే పేరిట తన కథల సంపుటి ప్రచురించి కథా సాహిత్యంలో ముస్లిం జీవితాల వెతలను ఆవిష్కరించాడు. ఇప్పుడు అలాయి బలాయి పేరుతొ బహుజన కథలు ప్రచురిస్తున్నాడు. బీసీ, ఎస్ సీలను కలిపి చెప్పడానికి స్కైబాబ ‘బహుజనుల’నే మాటను ఉపయోగించాడు. అలాయి బలాయి అంటే హృదయానికి హృదయాన్ని చేర్చి హత్తుకొని అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసే ముస్లిం సాంప్రదాయం. స్కై బాబ ఈ కథా సంపుటి ద్వారా బహుజన సమాజాన్ని తన గుండెలకు హత్తుకుంటున్నాడు… ఇక్కడి గ్రామీణ సమాజంతో, బహుజన సమూహంతో, తనలాంటి ముస్లిములకు వున్న బలమైన సంబంధాన్ని ప్రతిబింబిస్తున్నాడు.
  భారతీయ గ్రామీణ సమాజాన్ని తరచి చూస్తె ప్రతి గ్రామం భారత దేశపు మినియేచర్ లా కనిపిస్తుంది.. వూరి పాలనను, సంపదను అనుభవిస్తూ పెత్తనం చెలాయించే అగ్రకుల వర్గం ఒక పక్క, వూరి విసర్జితాలని నెత్తిమీద మోస్తూ, వూరికి వూడిగం చేస్తూ, నిచ్చెన మెట్ల వ్యవస్థకి మరింత కింద, వూరి జనానికి మరింత దూరంగా, అంటరానితనంలో, పేదరికంలో దుర్భర జీవితం గడుపుతున్న దళిత సమాజం ఊరికి దూరంగా మరొక పక్క! ఈ రెండిటి మధ్య అటు అగ్రకుల సమాజాన్ని అందుకోలేక, ఇటు తన కన్నా కింద వున్న దళిత సమాజాన్ని హత్తుకోలేక నడుమన ఊగిసలాడుతూ BC సమూహం. హిందూత్వం హీనంగా చూసి, ఎదగనీయకుండా తోక్కేసిన దళిత, బిసి కులాల సమాహారమే బహుజన సమాజం.
  ఇది మన గ్రామీణ సామాజిక చిత్రం. ఈ గ్రామీణ సామాజిక చిత్రం అస్తిత్వ సాహిత్యం కన్నా ముందు తరం కథల్లో, కవిత్వంలో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఈ ప్రవాహం పైకి ఎంత తేటగా కనిపించినా దీని అంతర్లీన ప్రవాహం అత్యంత మురుగు. అది అప్పుడప్పుడూ పైకి తేలుతూ తన స్వభావాన్ని ప్రదర్శించి మళ్ళీ మరుగై పోతుంది. మురుగై పోయిన పైన ప్రవాహం మళ్ళీ కుదురుకొని తేటగా మారడానికి చాలా కాలం పడుతుంది. అస్తిత్వ సాహిత్యం ఈ సమాజపు లోపలి పొరలను అర్థం చేసుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. గ్రామీణ సమాజపు లోపలి పొరల్లోని కుళ్ళిన ఈ భావజాల అవశేషాల్ని బహిరంగ పరచడం మనం ఇప్పుడు స్కైబాబ బహుజన కథల్లో చూడవచ్చు.
  చాతుర్వర్ణ సమాజంలో పాదాల నుంచి పుట్టిన సేవక వర్గంగా బ్రాహ్మణీయ హిందూత్వం ముద్రవేసిన వర్గం శూద్ర జాతి. రకరకాల వృత్తి నైపుణ్యతలతో సేవకులుగా, శ్రామికులుగా వేల సంవత్సరాలుగా గ్రామాలను సుసంపన్నం చేసిన శూద్రుల స్థితి ఈ నాటికీ మారలేదు. ఎక్కువ శ్రమ – తక్కువ ఆదాయం. వూరి లోను పట్నాల్లోనూ చీప్ లేబర్ గా బతుకుతున్న వాళ్ళ సమాఖ్య ఎక్కువ. ఎక్కడా పూర్తిస్థాయిలో శూద్ర కులాల అభివృద్ది జరగలేదు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న పెట్టుబడిదారీ, నయా ఉదారవాద విధానాల వలన శూద్రుల్లోని ఉత్పత్తి, సేవా కులాల వారు మరింత నష్టపోయారు. ముఖ్యంగా యంబిసి(Minority backward castes) కులాల వారి జీవితం బాగా దిగజారి పోయింది. వ్యవసాయ సంక్షోభం కారణంగా గ్రామీణ శూద్ర కులాల్లో నిరుద్యోగం, పేదరికం పెరిగిపోయింది. ఏ భరోసాలేని చిన్న సన్నకారు రైతులుగా వున్న బహుజనులు సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక పక్క సంఖ్యలో మెజారిటీగా, అతి పెద్ద ఓటు బ్యాంకుగా అన్ని రాజకీయ పార్టీలకు సేవ చేస్తూ, అగ్రకులాలకు ఊడిగం చేస్తూ సంఖ్యకు తగిన వాటా దక్కక, అవకాశాలు లేక, అభివృద్ది ఊసే లేక వెనకబడిన కులాలుగా అలా మిగిలిపోయి వున్నారు.
  రిజర్వేషన్ల కారణంగా కాస్తో కూస్తో చదువుకొని, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో స్థిరపడిన దళితులూ, ఇంకా వూరి మకిల మోస్తూ, గుర్తించలేని బానిసత్వాన్ని మోస్తూ గ్రామాల్లో నిరుపేదలుగా దళిత సమాజం బతుకు బండిని లాగుతూ వుంది. మొత్తానికి ఈ బహుజన జాతి ఇన్నేళ్ళభారత స్వాతంత్ర్యాన్ని రెండవ తరగతి పౌరులుగానే అనుభవిస్తున్నారు తప్ప వారిది క్లాస్ వన్ పౌరసత్వం కాదనేది నిర్వివాదాంశం. పోనీ ఈ రెండవ తరగతి పౌరులందరి మధ్య, సమానత్వం, ఐక్యతా ఉన్నాయా అంటే.. లేవనే సమాధానం. బహుజన సమాజంలో చైతన్యం తెచ్చి రాజకీయ, ఆత్మగౌరవ ఉద్యమం నిర్మించాలనుకునే వారు ఈ సమాధానం దొరకని ప్రశ్నలతో ఘర్షణ పడుతూనే వున్నారు.
  *
  ఈ సంపుటి లోని పదకొండు కథల్లో సోయి కథ ఒకటి.. గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబించే ఈ కథలో సిటీలో సెటిలైన శేఖర్ రెడ్డి పర్స్పెక్టివ్ నుంచి కథ నడుస్తుంది. శేకర్ రెడ్డి ని స్కై బాబ బహుజన గుంపులోనుంచి తప్పి పోయిన వాడిగా చూసాడు. నిజానికి ఈ దేశంలో రెడ్డి, చౌదరి వంటి కొన్ని శూద్ర కులాలు పాలక వర్గ స్థాయికి ఎదిగి నిజంగానే తమను తాము శూద్రత్వం నుంచి తప్పించేసుకున్నాయి. మంచిదే! ఆర్థికంగా, పాలన పరంగా శాశించె స్థాయికి చేరుకున్నాయి. సిటీలో సెటిలైన శేఖర్ రెడ్డి భద్ర జీవితంలోకి వెళ్ళిపోయాడు. గ్రామీణ జీవితంలోని ఆర్ధిక, సామాజిక సంఘర్షణ నుండి కొంత మేరకు బయట పడ్డాడు. ఈ కథలో యాదగిరి గ్రామీణ బహుజన సమాజానికి ప్రతినిధి. ఎదుగూ బొదుగూ లేని జీవితం. భద్రత, భరోసా లేని ఉపాధి తో కష్టంగా సాగే బతుకు. తాగుడు కారణంగా విచ్చిన్నమవుతున్న కుటుంబాలు. సాధారణ గ్రామీణ బహుజనుల జీవితం ఈ కథలో అంతర్లీనంగా ప్రతిబింబిస్తుంది.
  ఐతే సాధారణ సమాజం కన్నా భిన్నంగా తర్వాత తరాల పట్ల ఒక బాధ్యత గా యాదగిరి కొడుకు చైతన్యవంతుల ప్రతినిధిగా నిలబడటం ద్వారా భవిష్యత్తులో అయినా బహుజన సమాజం చైతన్యవంతమై స్వయం గుర్తింపు సాధిస్తుందని ఆశను రచయిత ప్రకటించాడు.
  మన దేశంలో రాజ్య పాలన చేసే వర్గం ఒకటి, సామాజిక పాలన చేసే వర్గం మరొకటి. రాజ్య పాలన చేసే వర్గం సామాజిక పాలన చేసే వర్గం గీసే గీతలను అతిక్రమించదు. అసలు సామాజిక పాలనా వర్గమే రాజ్య పాలక వర్గానికి ప్రతి క్షణం మార్గదర్శకత్వం వహిస్తూ నడిపిస్తూ వుంటుంది. సామాజిక పాలక వర్గం అనేక సార్లు వైరుధ్యాల పుట్ట లాగా కనిపిస్తూ వుంటుంది. తమలో తామే ఘర్షణ పడుతూ వుంటుంది. మొత్తం మీద పాలన మీద తమ పట్టు సడలకుండా కాపాడుకుంటూ వుంటుంది.
  తమలో తామే రెండు వర్గాలుగా విడిపోయి, రెండు జెండాలతో యుద్దం చేసుకుంటూ ప్రభుత్వాలను తమ గుప్పిటలో ఉంచుకోవడం వర్ణ నీతి. దీనికి మహా భారతం ఒక ఉదాహరణ. మహా

 2. దీనికి మహా భారతం ఒక ఉదాహరణ. మహా భారతంలో కౌరవ పాండవులు రెండు బలమైన శత్రు వర్గాలు. అధికారం కోసం కొట్టుకునే ఆ ఇద్దరినీ పాలిత బహుజనం తమాషా చూస్తూ వుంటుంది. చివరికి ఇద్దరిలో ఎవరో ఒకరు కుర్చీ ఆక్రమిస్తారు. బహుజనంలో కొందరు కుర్చీ ఆక్రమించిన వాడికి జేజేలు పలుకుతారు.. మరి కొందరు కుర్చీ కోల్పోయిన వాడిని ‘వచ్చే సారి నీదే విజయం, బాధపడకు’ అని ఓదారుస్తుంటారు. నిజానికి ఆ రెండు కుటుంబాలు అన్నదమ్ములు. పదవులు పాలన అన్నీ వారివే. ఇద్దరికీ కొట్టుకునే అవసరమే లేదు… కానీ బయటి వాడు పోటీకి రాకుండా వుండెందుకు ఆ ఇద్దరూ అలా కొట్టుకుంటూ వుంటారు. ఒకరి తర్వాత ఒకరు మార్చి మార్చి అధికార పీఠం ఎక్కుతుంటారు. మొత్తానికి కింది కులాలు పాలన లోకి రాకుండా కుట్రలు పన్నటం ఎత్తులేయటం మనువాద రాజనీతి. ఈ రాజనీతి రహస్యాన్ని “ఓడిందెవరు ” కథ బట్ట బయలు చేసింది. ఈ కథలో అగ్ర వర్ణాలతో పాటు బీసీలు కూడా దళితుడు గెలవకూడదని కోరుకోవడం గమనించాల్సిన విషయం.
  పుట్టింది మొదలు నామకరణం, విద్యాభ్యాసం, పెళ్లి, చావు లాంటి అన్ని కీలక సందర్భాల్లో బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని మెజారిటీ బీసీలు ఆనందంగా మోస్తున్నారు. బీసీల్లోని ఈ బ్రాహ్మణీయ భక్తి భావమే సామాజిక పాలకవర్గానికీ, రాజకీయ పాలక వర్గానికీ కావలసింది. కింది వర్గాలను ఓడించడానికి పార్టీలకు అతీతంగా అగ్రకులాలు ఏకం అవుతాయి, ఈ ఏకీకరణకు బీసీ సమాజం చాలాసందర్భాలలో వంత పాడుతుంది. అగ్రకుల బ్రాహ్మణీయ భావజాల చట్రంలో ఇరుక్కుపోయిన శూద్ర సమాజం అంత తేలిగ్గా దాని బారి నుంచి బయట పడలేదు.
  మెజారిటీ శూద్ర సమాజం తమ కన్నా పైకులాల వైపు బలంగా మొగ్గి వుంది. అంబేద్కర్ ఓటమికి కారణం అదే! బీసీ సమాజంలో రావాల్సినంత మార్పు రాలేదనడానికి ఇది ఉదాహరణ.
  గ్రామీణ సమాజంలో అన్నా, అక్క, మామ, బావ, బాబాయి వంటి వరసలు సర్వ సాధారణం. ఎంతో అందంగా కనిపించే ఈ వరసలన్నీ ఫార్సేనా? కేవలం నాలుక చివరి పిలుపులేనా? ఒక మానవీయ సమానత్వ సంబంధానికి పనికి వచ్చేవి ఎంతమాత్రం కావా? ఇన్నేళ్ళ గ్రామీణ సమాజం ఈ వరసలలోని ఆత్మీయతలు సంబంధాలు కలుపుకునేంత బలమైనవి కావని నిరూపించింది. అందుకే మనం ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా కనీసం బిసి కులాల మధ్య కాని, దళిత కులాల మధ్య కాని, దళిత బిసి కులాల మధ్య కాని పెద్దలుకుదిర్చే ఒక కులాంతర వివాహాన్ని గాని ఘర్షణ లేని ఒక ప్రేమ వివాహాన్ని గాని చూడలేక పోతున్నాం.
  ‘జమ్మి’, ‘అంటు’ కథలు రెండూ కూడా మానవ సంబంధాలన్నీ కుల సంబంధాలే అని చెప్పిన కథలు. దళిత కులాల మధ్య వున్న అసంబద్ధ అనైక్యతను ‘జమ్మి’ కథ ప్రతిబింబించింది. ‘అంటు’ కథ ముస్లిం సమాజానికి దళిత సమాజానికి మధ్య వున్న ఘర్షణను ఎత్తి చూపింది. కుల నిర్మూలన జరగాలంటే కులాంతర వివాహాలు జరగాలన్నది అంబేద్కర్ ఆలోచన. కానీ ఏ కులం అందుకు సిద్ధపడి లేదు. గ్రామీణ సమాజంలో వున్న పిలుపుల్లోని బంధం ఏ అవసరానికైనా ఉపయోగ పడవచ్చేమో గాని సామాజిక మార్పుకు, ఉపయోగపడవు. మొత్తానికి అన్ని బంధాల్లో కుల, మత బంధాలే అత్యంత బలమైనవి అని చెప్పె కథలు ఇవి.
  ‘జవాబ్’, ‘అంటు’ కథలు ముస్లిం సమాజానికి బహుజన సమాజానికి వున్న ఘర్షణను ప్రతిబింబించిన కథలు. జవాబ్ కథ గుజరాత్ లో ముస్లిముల మీద జరిగిన హత్యాకాండ నేపథ్యం తో రాసిన కథ. ఇందులో సైదులు పాత్ర బీసీ పాత్ర. ఈ సైదులు చేసిన ఒక పనికి వూరు ఊరంతా కలిసి పంచాయితీ పెడుతుంది. అప్పుడు సైదులు తన లోపలి దుఖాన్ని మనిషిగా తన ఘర్షణని వ్యక్తీకరిస్తాడు. కొందరు స్నేహితులతో కలిసి గుజరాత్ వెళ్లి అక్కడ పరిస్థితులు చూసి వచ్చిన సైదులు పంచాయితీలో అక్కడి ముస్లిముల స్థితి గురించి ఆవేదన చెందుతాడు .. ఆ నేరంలో తనకూ భాగం ఉన్నట్లుగా ఫీలై నిలవలేక పోతాడు …
  అంటూ అక్కడి అమానవీయ దాడుల దృశ్యాన్ని చెబుతాడు.. ఈ పరిస్థితికి ఒక బీసీ వాడిగా చలించి పోతాడు. అభద్రతలో, ఒంటరై పోయిన ముస్లిం సమాజానికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలనుకుంటాడు. మెజారిటీ బీసీలు, దళితులు ఎంచుకున్న హిందూత్వ మార్గమే ఈ దాడులకి బలమని, బాధిత ముస్లిములను అర్థం చేసుకోవాలంటే హిందువుగా సాధ్యం కాదని తాను సుంతీ చేయించుకుంటాడు. దాన్ని గ్రామం లో, కుటుంబంలో అందరూ వ్యతిరేకిస్తారు. సంఘ పరివార శక్తులు దాన్ని తీవ్రంగా తప్పు పడతాయి. ఒక బీసీగా తన సమాజం చేసిన తప్పుకు ఏ సమాద్ధానం దొరకని స్థితిలో అటువంటి నిర్ణయం తీసుకుంటాడు.
  బహుజనులలో మెజారిటీ ఏ పక్షం వున్నారు, ఏ భావజాలంతో ముందుకు సాగుతున్నరనేది చాలా కీలకాంశం. ఈ విషయాన్నే ఈ రెండు కథల్లో స్కై బాబా చాలా బలంగా చెప్పాడు. పైకి కనిపించే బహుజన, ముస్లిం ఐక్యత లో భావజాల సారూప్యత కావలసినంత లేదనేది కళ్ళకు కనిపిస్తున్న వాస్తవం.
  *
  దళిత బహుజన ఐక్యత ద్వారా రాజకీయాధికారం కోసం ఎనభైల తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడింది. కానీ దేశంలో ఎక్కువ చోట్ల ఎస్.సి., ఎస్. టి., బి.సి., మైనార్టీ రాజకీయ ఐక్యత నినాదం అనుకున్నంతగా ప్రజల్లోకి వెళ్ళలేక పోయింది. దీనికి కారణం పెద్ద సంఖ్యలో వున్న బీసీలు అగ్ర కులాల వాళ్లకి మద్దతు ఇవ్వడం. తమకన్నా కింది వారితో, తమతో సమంగా ఉన్నవారితో కలిసిపోడానికి సిద్ధంగా లేకపోవడం.
  మన దేశంలో బీసీల సంఖ్య చాలా ఎక్కువ. వీళ్ళలో అధికం హిందువులే! కులాల వారీగా, రక రకాల దేవుళ్ళు, రకరకాల ఆచారాలు, రక రకాల వృత్తులు కలిగివున్న వాళ్ళు. స్వతహాగా కళాకారులు, తాత్వికులు, నైపున్యతలు కలిగిన వారు, ఉత్పత్తిదారులు. కానీ తమ శక్తిని, తమ చరిత్రను తాము గుర్తించలేక బ్రాహ్మనీయ పాదాల దగ్గర కాస్త చోటు కోసం పాకులాడే ప్రయత్నం లోనే తరాలు వెళ్లదీస్తున్నారు.

 3. బీసీ సమాజాన్ని బ్రాహ్మణీయ హిందూత్వం నించి విముక్తం చేయాలని చాలా మంది సాంఘిక ఉద్యమ కారులు, రచయితలు ప్రయత్నం చేసారు. చేస్తూనే వున్నారు. ఆధునిక ఆత్మగౌరవ ఉద్యమాలకి స్పూర్తి ప్రదాత అయిన మహాత్మా జ్యోతి బా ఫూలే, బడుగు, బలహీన వర్గాలను సంఘటితం చేసిన సామాజిక విప్లవ మూర్తి. కింది కులాలను అణిచివేస్తూ, రాజ్యాధికారాన్ని, సామాజిక అధికారాన్ని అనుభవిస్తూన్న అగ్ర కులాలపై తాత్విక యుద్ధానికి తెరతీసిన సామాజిక విప్లవ యోదుడు. అయితే మెజారిటీ బీసీలు ఫూలేను తమ వాడిగా గుర్తించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దళిత వాడల్లోకి అంబేద్కర్ చేరినంత గా బీసీ వాడల్లోకి ఫూలే చేరలేక పోయాడు. దళితులు అంబేద్కర్ ను ఆవాహన చేసుకున్నట్టు, బీసీలు ఫూలేను ఆవాహన చేసుకోలేక పోయారు. చైతన్య వంతులైన బీసీలకు తప్ప చాలామందికి ఫూలే తెలియదు. బీసీ తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మం కాని, వేమన, పెరియార్, త్రిపురనేని రామస్వామి చౌదరి, నారాయణ గురు వంటి వారెవరినీ బీసీ లు గుర్తించలేక పోయారు. ఈ ప్రత్యామ్నాయ తాత్వికతను అందుకోలేక పోవడం కారణంగా తమదైన ప్రత్యెక సామాజిక, తాత్విక, రాజకీయ మార్గాన్ని నిరించలేక పోయారు. ఈ వైఫల్యం కారణంగానే నాయకులుగా ఎదగలేక పెద్దకులాలకు, పెద్ద పార్టీలకు వెనక నడిచే అనుచరులయ్యారు.
  అంతెందుకు సమకాలీనంగా వున్న బహుజన మేధావులను గుర్తించడంలో, వారిని అనుసరించడంలో, వారిచ్చే చైతన్య భావజాలాన్ని ప్రచారం చేయడంలో చదువుకున్న బహుజన సమాజం విఫలం అయింది. మన సమాజం నించి అగ్ర కుల సమాజంతో ఒకరు మాట్లాడుతున్నారంటే, ఏం మాట్లాడుతున్నారు? ఏ ప్రశ్నలు లేవనెత్తు తున్నారు? ఎలాంటి హేతుబద్ధ చర్చ చేస్తున్నారు? అని ఆలోచించే వారు లేకుండా పోయారు. బహుజనులుగా కాక బ్రాహ్మణ హిందువులుగా స్పందిస్తున్నారానడానికి బహుజన సమాజం కంచే ఐలయ్య పట్ల వ్యవహరించిన తీరు ఒక ఉదాహరణ. బహుజన మేధావి, దళిత బీసీ సమాజ అభ్యున్నతి కోసం మాట్లాడుతున్నాడన్న కనీస భావజాల స్పృహలేని బహుజనత్వం నిరుపయోగం. ఏ బహుజన మేధావి అయినా అవతలి శక్తుల చేతిలో ఆట బొమ్మలా కాక, బహుజన స్పృహ తో చర్చ చేస్తున్నపుడు బహుజనులు దాన్ని సమర్థించకపోయినా నష్టం లేదు కాని, చర్చకు వ్యతిరేకంగా దాన్ని అనిచివేయటం అంటే బ్రాహ్మణ శక్తుల చేతిలో ఆయుధంగా మారటమే విషాదం!
  *
  బీసీ కులాల వారిలో, కుల ప్రాతిపదిక పైన రిజర్వేషన్లు ఇవ్వదాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా వున్నారు. రిజర్వేషన్స్ వలన మెరిట్ దెబ్బ తింటుందని భావించే వాళ్ళూ వున్నారు. (అగ్రకులాల వారే కాదు బీసీ లలో కూడా!!!) ఇదే భావజాల వెనకబాటు, భావజాల బానిసత్వం. స్వతంత్ర భారత దేశంలో వెనకబడిన కులాలకు రిజర్వేషన్స్ ఇవ్వాలని 1951 లో తొలి రాజ్యాంగ సవరణ ద్వారా తీర్మానం జరిగింది, కానీ బ్రాహనీయ శక్తులు ఈ రిజర్వేషన్లను తొక్కి పెట్టారు. రిజర్వేషన్ల మీద బ్రాహ్మణ శక్తుల ఒత్తిడికి సమాధానంగా జనతా దళ్ ప్రభుత్వం బిపి మండల్ అధ్యక్షతన 1979 జనవరి లో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానిస్తూ నివేదికను 1980 డిశంబర్‌ 31న ప్రభుత్వానికి సమర్పించింది. అయినా అగ్రకుల పాలక శక్తులు (కాంగ్రెస్ ది అధికారిక బ్రాహ్మినిజం, బిజెపిది ప్రతిపక్ష బ్రాహ్మినిజం) బీసీ లకు రిజర్వేషన్స్ ఇవ్వడానికి సుముఖత చూపలేదు. బిజెపి అగ్రకుల శక్తులు రిజర్వేషన్ వ్యతిరేక వుద్యమాలు నడిపారు. ఈ బీసీ రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమానికి స్వయంగా బీసీలే జెండాలు మోసిన అమాయకత్వంలో కొందరు బీసీలు వుండటం బాధాకరం. చివరికి విపి సింగ్ ప్రభుత్వం 1989 లో బిసి రిజర్వేషన్లు అమలులోకి తెచ్చింది. బ్రాహ్మాణీయ, అగ్రకుల శక్తులు, వారి పార్టీలు రాజీవ్ గోస్వామి లాంటి వారిని ఆత్మ హత్యలకు పురిగొలిపి బిసిలకు రిజర్వేషన్లు దక్కకుండా చేయాలని చూసాయి. మండల్ నివేదిక ప్రకారం దేశంలో 52శాతం బి.సి.లున్నారు. సుప్రీంకోర్టు మొత్తం అవకాశాల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని తీర్పునిచ్చింది. దేశంలో విద్యా, ఉద్యోగ రంగాల్లో ఎస్‌.సిలకు 15%, ఎస్‌.టిలకు 7.5%, రిజర్వేషన్లు అమలౌతున్నాయి. (మొత్తం 22.5 శాతం) ఆ కారణంగా బి.సి.లకు 27శాతం రిజర్వేషన్లు సిఫార్సు చేయగా వి.పి.సింగ్‌ నాయకత్వంలోని జనతాదళ్‌ అధికారంలోకి వచ్చి ఆగస్ట్‌ 17,1990న బి.సి.లకు కేంద్ర విద్యా, ఉద్యోగాల్లో 27శాతం రిజర్వేషన్లను ప్రకటించింది.
  మొత్తం ఈ ప్రాసెస్ లో బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించి నిలబడిన శక్తులు బిజెపి, ఎబివిపి, ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషత్ సమూహాలు. వీళ్ళతో పాటు కాంగ్రెస్ లోని అగ్రకులాలు. వీళ్ళంతా ఈ బ్రాహ్మనీయ కుట్రను ప్రతిభ పేరిట ప్రచారం చేసారు. ఈ కాలంలో రిజర్వేషన్ వ్యతిరేక కథలు, సినిమాలు చాలా వచ్చాయి. ఈ బ్రాహ్మనీయ మాయను చాలా మంది బహుజనులు అర్థం చేసుకోలేకపోయారు. ఈ నాటికీ రిజర్వేషన్ల పట్ల స్పష్టమైన అవగాహన లేని బీసీలు వున్నారు. రిజర్వేషన్ మా హక్కు అని గొంతెత్తి నినదిం చలేని ని వెనకబాటుతనం లో నంగి నంగి గా బతికేస్తూ వున్నారు.
  ఇప్పటి చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా బీసీలు అర్థం చేసుకోలేక పోవడం వారి వెనకబాటు తనానికి నిదర్శనం. నిజానికి ప్రస్తుత మహిళా రిజర్వేషన్ బిల్లు గంప గుత్తగా మహిళలకు రిజర్వేషన్ ను హామీ ఇచ్చేలా వుంది తప్ప అందులో బీసీ మహిళలకు ప్రత్యెక అవకాశం ఏమీ లేదు. ఒక వేళ ఇది యథా తదంగా ఆమోదించబడితే అన్ని చోట్లా మెజారిటీగా అగ్రకుల మహిళలు రిజర్వేషన్ అవకాశాన్ని ఆక్రమిస్తారు. బీసీ మహిళలకు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా వుండే అవకాశం వుంది. అలా కాక ఇందులో కోటా వుండటం ద్వారా వెనకబడిన కులాల స్త్రీలు రాజకీయంగా అవకాశాలు అందుకోవచ్చు. కాని బిల్లు యథాతదంగా ఆమోదం పొందాలని డిమాండ్ చేస్తున్న అగ్రకుల పార్టీల బీసీలు కూడా మన చట్ట సభల్లో వుండటం దురదృష్టం. ఈ బ్రాహమనీయ రాజకీయం అర్థం చేసుకోకుండా వారి చేతిలో పావులుగా, వారి భావజాలానికి ప్రతినిదులుగా వుండటం ద్వారా సొంత సమాజానికి నష్టం చేస్తున్నామని బీసీలు తెలుసుకోవాల్సిన అవసరం వుంది.
  2
  ఇప్పటిదాకా చూసింది ఒక రకం బహుజన సమూహాన్నే ! మరో రకం బహుజన సమూహం లెక్క వేరే!! అసలు పెద్ద బహుజన సమూహం ఇదే!!
  *
  ఆధునిక కాలంలో బ్రాహ్మణీయ హైందవం సాధించిన సంకలుగుద్దుకునే విజయం శూద్రులు అగ్ర వర్ణాలుగా, బీసీలు గా చీలిపోయిన సందర్భం. నడుస్తున్న చరిత్రలో తాము చూస్తుండగానే తమలోని శూద్రులే కొంతమంది నిచ్చెన లోని పై మెట్టు మీదకు చేరిపోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలని, పొందుతున్న ప్రతిఫలాన్ని కళ్ళారా చూస్తున్నారు కింది వర్గం బీసీలు. అంటరాని తనాన్ని అచ్చం బ్రాహ్మణుల లాగే పాటించడం, అగ్ర వర్ణ రాజకీయ పార్టీలలో చేరడం, తమ కింది వారైన దళితుల మీద దారుణమైన ఆత్యాచారాలకు పాల్పడటం, సంస్కృతీ పేరుతొ బ్రాహ్మనీయ మత ఆచార వ్యవహారాలను ఇంటా బయటా పాటించడం లాంటివి కొన్ని ప్రయత్నాలు.
  భూమి మీద ఆధిపత్యం, హక్కు కలిగి వున్న కమ్మ, రెడ్డి వర్గాలు కొద్ది పాటి చిన్న చిన్న బ్రాహ్మణ వ్యతిరేక పోరాటాలతో తక్కువ కాలంలోనే (వందల ఏళ్ళలోనే) బ్రాహ్మణ వర్గాల మెట్టు దాకా చేరి “అగ్రవర్ణాల” వాళ్ళుగా మారిపోయారు. భూమి మీద హక్కు, అజమాయిషీ లేని శూద్ర కింది కులాల వాళ్ళు ఉన్నత శూద్ర కులాల వాళ్ళు చేరిన అగ్ర వర్ణ స్థాయిని చేరుకోడానికి వాళ్ళు చూపిన దారినే ఎంచు కున్నారు. దేశాన్ని ఏలుతున్న సీనియర్ బ్రాహ్మణ పార్టీ అయిన కాంగ్రెస్ లో చేరుతున్నారు. మను స్మృతిని విశ్వసిస్తూ, సంస్కృతి పేరుతొ వర్ణ ధర్మాన్ని పాటించి, ప్రోత్సహించే అమానవీయ అసమానత్వపు భావజాలాన్ని బలపరుస్తూన్న బిజెపి లాంటి మత రాజకీయ సంస్థలలో కార్యకర్తలుగా చేరి ఛోటా మోటా గల్లీ నాయకులుగా ఎదుగుతున్నారు. కమ్మ రెడ్డి వర్గాల లాగానే దళితుల మీద హేయమైన దాడులకి పాల్పడుతునారు. కాపు, బలిజ, యాదవ, గౌడ, పద్మశాలి మొదలైన వర్గాల వాళ్ళు రాజకీయంగా అగ్ర వర్ణాల స్థాయికి చేరడమే కాకుండా బ్రాహ్మణ హైందవ ధార్మిక సంస్థల్ని ప్రోత్సహిస్తున్నారు. ఇతర మైనారిటీ మతస్తుల స్వేచ్చను కాలరాస్తూ, హైందవ ధార్మిక సంస్థలు ఏర్పాటు చేసే కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు, నిర్వహణా బాధ్యతలను భుజాలకెత్తు కొంటున్నారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జనాలు, హనుమాన్ జయంతి ఉత్సవాలు, శీరామ జయంతి ఉత్సవాలు మొదలైనవి ఒకరు పదుగురై ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు! ఆ కాలంలో రోజులకి రోజులు వీధులు, రోడ్లు ఆక్రమించి, బలవంతంగా చందాలు వసూలు చేసేది కూడా ఈ బీసీ వర్గాల చోటా నాయకులే అన్నది అక్షర సత్యం!
  ఆ సందర్భాలలో, ఆ మాటకొస్తే వారి రోజువారీ వేషంలో కూడా బ్రాహ్మణ హైందవ తనాన్ని ఉత్సాహపడి ప్రతిబింబింపచేస్తున్న వాళ్ళు కూడా వీళ్ళే! నుదిటిన పెద్ద పెద్ద కుంకుమ బొట్లు ధరించడం, చేతులకి రంగు రంగుల దారాలు కట్టుకోవడం, సెల్ఫోన్లలో హైందవ భక్తీ పాటల్ని కాలర్ ట్యూన్లుగా పెట్టుకోవడం, నిమిషానికొక హైందవ దేవుడి అబిషేకాన్నో, బాబాల మాయా మహాత్తులనో ఫేస్ బుక్, వాట్సప్ పేజీల్లో పోస్టు చేయడంలో మునిగి వున్నారు. నిజానికి హైందవ ధర్మ కర్తలు, మనుస్మ్రుతి సృష్టి కర్తలు బ్రాహ్మలైతే శూద్ర కులాలవారు ఈ సంస్కృతికి, ఆచారాలకు జీతం లేక కాపలా కాసే బానిసలు. సంరక్షణ కర్తలు, రక్షక భటులు.
  తర్వాతి తరాన్ని రూపొందించి బలోపేతం చేయడానికి ఈ బీసీలే దళిత వాడల్లోకి, ఆదివాసీ సమూహాల్లోకీ చొరబడి అక్కడున్న బాల బాలికల్ని అల్లరి, ఉత్సాహం, ఎంజాయ్ మెంట్, చిల్లర డబ్బులు ఎర జూపి హైదవీకరణ చేస్తున్నారు. లాఠీలు చేతికిచ్చి త్రిశూలాల మర్మం నేర్పిస్తున్నారు.
  యువకుల్లో విద్యార్తులైతే ABVP లాంటి మతతత్వ విద్యార్థి సంఘాల్లోకి చేరి ప్రేమికుల రోజుల్లాంటి వాటిని వ్యతిరేకిస్తూ, మనువు కాలం నాటి హైందవ సంఘటనల్ని తవ్వి తీసి వాటికి ప్రాశస్త్యాన్ని కల్పించడానికి పూనుకుంటున్నారు. వూరి గోడలమీద, విశ్వ విద్యాలయాల గోడలమీద “ఈ దేశంలో వుండాలంటే వందేమాతరం పాడాల్సిందే ” అనే అర్థం, తత్త్వం తెలియని కాషాయ నినాదాల్ని రాసి అదే చైతన్యం, జ్ఞానం అనుకుంటున్నారు. ఈ మిడి మిడి జ్ఞానంతోనే నుదుట తిలకాలు దిద్ది, నెత్తికి రుమాళ్ళు చుట్టుకొని, పలుగూ పారా తీసుకొని గుమ్మటాల విధ్యంసానికి, మైనారిటీ స్త్రీలని చెరచడానికి, టోపీ వాలాల్ని చంపడానికి బ్రాహ్మనీయ శక్తుల చేతిలో త్రిశూల ఆయుధాలై చెలరేగుతున్నారు. మసీదుల్లో, చర్చీల్లో బాంబులై విధ్యంసాన్ని, భయాన్ని సృష్టిస్తున్నారు.

 4. లెక్కల ప్రకారం దేశంలో అత్యన్నతమైన పదవుల్లో వున్న వాళ్ళలో అధిక శాతం మంది బ్రాహ్మణులే! ఆ తర్వాతి స్థానంలో వాళ్ళు అగ్రకుల శూద్రులు. అంతే కానీ బీసీలు కారు. ఒక వేల బీసీలు అధికార స్థానాల్లో వున్నా కేవలం తోలుబోమ్మలుగా తెరవనక శక్తుల అవసరాలకోసం పని చేయాల్సిందే!!
  సంఖ్యలో ఎక్కువ వున్న బీసీలు తమది కాని మను ధర్మపు భావజాలంతో చేరి తమది కాని సంస్కృతిని తమదిగా భావించి బ్రాహ్మనీయ మనువాదాన్ని నిరంతరం మోయడం ద్వారా దాన్ని సజీవంగా వుంచుతున్నారు. బీసీల్ని ఇలా తమ భావజాల బానిసలుగా చేసుకొని తాము చెప్పినట్టల్లా ఆడే కీలుబొమ్మలుగా మార్చి బ్రాహ్మనిజం ఘన విజయం సాధించింది. చేయాలనుకున్న పనిని చేతికి మట్టి అంటకుండా చేయగల ఉచిత సైన్యంగా బీసీల్ని మలుచుకొని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదురులేని శక్తిగా బ్రాహ్మినిజం తన పునాదిని నిరంతరం బలోపేతం చేసుకుంటుంది.
  ఏ భావజాల బానిసత్వం నించి శూద్ర, అతి శూద్రులని బయటికి లాగాలని ఫూలే, అంబేద్కర్ లు ప్రయత్నించారోఅందులోంచి బయట పడేందుకు మెజారిటీ బహుజన సమూహం మాత్రం ఇంకా పూనుకోలేదు. పైగా మరింత బ్రాహ్మణీయ అనుసరణ కోసం పాకులాడుతున్నారు. నూతన రాజ్యంగ సమానత్వ విలువల్ని కాలరాసి వర్ణ వ్యవస్థని తిరిగి పటిష్టంగా ప్రతిష్టించాలని బ్రాహ్మనిజం చేసే ప్రయత్నానికి పావులుగా మారి తమ శక్తి యుక్తుల్ని మనువాదులకు తాకట్టు పెట్టి అందుకు ప్రతిఫలంగా చిన్న చిన్న పదవులు పొందుతున్నారు. బ్రాహ్మినిజం ఈ సమాజాన్ని ప్రభుత్వాలను ఎలినంతకాలం ఏనాటికైనా తమ సామాజిక స్థాయి మారదని గుర్తించలేక పోతున్నారు.
  *
  పార్టీలు జెండాలు ప్రచారాలు వేరైనప్పటికీ, ఇప్పటివరకూ స్వతంత్ర భారత దేశాన్ని పాలించిన వారు మను ధర్మం నర నరాన నింపుకొని ఆచరించే వారే తప్ప దేశ రాజ్యాంగాన్ని ఆచరణ లోకి తేవాలని నమ్మిన వారు కాదు. అంబేద్కర్ ధర్మాన్ని గాని ఫూలే ధర్మాన్ని గాని పాటించే వారు కాదు. ఐతే వారి కుర్చీకి నాలుగు కాళ్ళలో రెండు కాళ్ళను మోసేది పీడిత బహుజన కులాలు.`
  బహుజనులు ఆలోచించ కుండా ఆచరిస్తున్న మను ధర్మం కుల క్యాన్సర్ ను పెంచేది. బహుజనులకోసమే పుట్టిన ఫూలే ధర్మం, అంబేద్కర్ ధర్మం కుల క్యాన్సర్నించి సమాజాన్ని విముక్తం చేసేది. ప్రతి బీసీ, ఎస్ సి ఎస్ టి, మైనారిటీల్లో కూడా వ్యక్తిక్గత చైతన్యం లేకుండా సామూహిక మార్పు సాధ్యంకాదు.
  “శూద్రత్వం” నుంచి బయట పడకుండా బీసీ సమాజ విముక్తి సాధ్యంకాదు. వర్ణ సిద్దాంతం ప్రకారం పాదాల్లోంచి పుట్టినవారు శూద్రులు. పాదాల్లోంచి పుట్టారని అనడం అంటే, నవమాసాలు మోసి కన్న తల్లిని అవమానించడం. లేదా మొత్తం బహుజనజాతి తల్లులు పాదాల స్థాయి వారని చెప్పడం. ఏదేమైనా ‘శూద్ర’ పదం జాతికి అవమానం. మీ స్థాయి పాదాల స్థాయి అని చెప్పడం. ఇటువంటి అవమానకర పేరును ఒక జాతికి పెట్టడం ద్వారా మొత్తం జాతి గౌరవాన్ని తగ్గించడం బ్రాహంనీయ కుట్ర. ఈ అవమాన కర సర్వ నామాన్ని మోయాలా లేదా దాన్నుంచి బహుజన జాతి తమను తాము విముక్తుల్ని చేసుకోవాలా? అన్నది తేల్చుకోవాలి. హరిజన, మాల, మాదిగ వంటి కులం పేరిట పిలుపులు అవమానమని దళితులు గొంతెత్తి వాటిని ప్రభుత్వం నిషేదించేలా చేసారు. ఆయా పదాల అర్థాన్ని, విలువను మార్చడం కోసం పేరుచివర కులం పేరు పెట్టుకునే ప్రయత్నం చేసారు. మొత్తానికి తర తరాలుగా వున్న విలువలేని తనాన్ని, తక్కువ తనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. నిజానికి శూద్ర వర్గం కూడా తమను “శూద్ర ” పదాన్ని, అందులోని బ్రాహ్మనీయ అగౌరవ జన్మ రహస్యాని ధ్వంసం చేయాలి.
  *
  బహుజన సమూహంలో భాగమైన దళితుల స్థితి భిన్న మైంది. సామాజిక హోదాలో బీసీల కన్నా వెనక వున్నా, రాజకీయ రిజర్వేషన్ల కారణంగా రాజ్యాధికారంలో, పదవుల్లో తమ వాటా తాము పొందుతూ అభివృద్ది వైపు నడుస్తున్నారు. ఇంకా చదువులేక, ఆస్తిలేక, భూమి హక్కులు లేక గ్రామాల్లో నిరంతర అంటరానితనం, పేదరికం, వివక్ష అనుభవించే దళితుల జీవితంలో రావలసినంత మార్పు రాలేదు.
  దళిత సామాజిక వుద్యమాలు ఒక స్థాయి దళిత యువతలో అత్యంత చైతన్యాన్ని రగిలించినా, మనువాద భావజాలం నుంచి విముక్తి పొందిన దళితుల సంఖ్య చాల తక్కువ. అంబేద్కర్ ఒకవైపు సామాజిక, రాజకీయ ఉద్యమాలు నడుపుతూనే మరో వైపు తాత్విక, భావజాల విప్లవం కోసం నిరంతర కృషి చేసాడు. దళిత సమాజంలో ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తిలో భావజాల, తాత్విక మార్పు రాకుండా దళిత విమోచన సాధ్యంకాదు. ఇన్నేళ్ళ దళిత రాజకీయ, సామాజిక ఉద్యమాలు గానీ రిజర్వేషన్ ఉద్యమాలు గానీ, మెజారిటీ దళిత సమాజం అనుసరిస్తున్న భావజాల మార్గాన్ని గురించి సీరియస్ గా పట్టించుకోలేదు (కొన్ని సంస్థలు, కొందరు నాయకులు ఇందుకు మినహాయింపు). అందుకే ఒక వైపు మను ధర్మ నిర్మితమైన కుల వివక్షను గురించి తీవ్రంగా మాట్లాడుతూనే మరోవైపు అదే మనుధర్మాన్ని అత్యంత భక్తీ శ్రద్ధలతో ఆచరించే దళిత సమాజాన్ని మనం చూడవచ్చు. నిరంతరం బ్రాహ్మనీయ విలువలను గౌరవిస్తూ, హిందూత్వ వేషధారణ, హిందూత్వ జీవన అనుసరణలో, తమను తాము “మోర్ హిందూస్ ” గా ప్రొజెక్ట్ చేసుకునే దళిత సమాజం పెద్దది. ఈ దళిత సమాజం హిందూత్వ బ్రాహ్మనీయ సామాజిక, రాజకీయ అధికారాన్ని దిక్కరించకుండా అంబేద్కర్ చెప్పిన వర్ణ నిర్మూలన సాధ్యమా? ఇప్పుడు దళిత సమాజం తేల్చు కోవలసిన పెద్ద సమస్య ఇది. ఒక వైపు సమ్ఘ పరివార్ శక్తులు ఘర్ వాపసీ పేరిట వివక్షా పూరిత కుల సమాజాన్ని పునః ప్రతిష్టించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతోంది. అంబేద్కర్ ధర్మానికీ, ఫూలే ధర్మానికీ వ్యతిరేక మైన ఈ పనిని హిందూ దళితులు ఎలా చూస్తున్నారనే దాని మీదే వర్ణ నిర్మూలన కానీ, వర్ణ వివక్ష నిర్మూలన కానీ, ఎస్ సి, ఎస్ టి , బిసి, మైనారిటీ ఐక్యత కానీ, బహుజన రాజ్యాధికార లక్ష్యం కానీ ఆధారపడి వుంది.
  దళిత వాదం, బీసీ వాదం లేదా అంబేద్కర్ వాదం, ఫూలే వాదం మాట్లాడితే, చర్చిస్తే కవిత్వం గా రాస్తే సరిపోతుందా లేదా అది ఆచరణ లోకి రావాలా అన్నది తెల్చుకోకుండా బహుజనులు మనువాదం మీద పోరాడితే అది గాలిలో చేసే పోరాటమే తప్ప వాస్తవ యుద్ధం కాదు. హిందూ మహాసముద్రాన్ని కూలదోయాలనుకునే దళితులూ అదే సముద్రంలో మునిగిపోతే విముక్తి ఎప్పటికి సాధ్య మవుతుందో ఊహించడం కష్టం.
  *
  గ్రామీణ బహుజన సమాజంతో ముస్లిం సమాజానికున్న బంధాన్ని, ఇబ్బందినీ కూడా చెప్పిన ఈ కథలలో అంతర్లీనంగా వున్న ముస్లిం ఆవేదన బహుజన సమాజానికి అర్థం అవుతుందని నేను భావిస్తున్నాను. స్కై బాబ ప్రచురిస్తున్న ఈ 11 కథలు, బహుజన సమాజానికి మైనారిటీ సమాజానికీ మధ్య ఒక చర్చకు తావిచ్చే సందర్భానికి అవకాశం కల్పిస్తాయని అనుకుంటున్నాను. ఈ కథల్లోని అన్ని అంశాలు సుదీర్ఘ చర్చనీయాలే అయినా నేను కొన్ని కథల్ని మాత్రమె ఉదాహరించాను. ఈ ముందు మాటను స్కై బాబ కథల రివ్యూ లాగా కాక, ఈ కథల సందర్భం చుట్టూ వున్న సామాజిక చారిత్రిక తాత్విక పరిణామాల పరిశీలన కోసం కొన్ని అంశాలను ప్రస్తావనకు తెచ్చాను. ఇంకా ఈ కథల నేపథ్యంగానే చర్చించాల్సిన అంశాలు చాలా వున్నాయి. బహుశా ఈ పుస్తకం బయటికి వచ్చాక ఉద్యమ, పరిశోధక మిత్రులు ఆ పని చేస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి చర్చకు సందర్భాన్నిచ్చిన మిత్రుడు స్కైబాబ కు అభినందనలు.

మీ మాటలు

*