ప్రయాణం ఆగింది

మేడి చైతన్య 

 

scan0033నా ఏడుపు నాకే వినిపించనంతంగా డపుక్కుల మోత. నిశబ్దంగా నడుస్తున్నట్లున్న గుంపులోని గుసగుసలన్నీ తనలో కలిపేసుకుంటున్న టపాసుల శబ్దం. దింపుడు కళ్ళెం ఆత్రంగా మొఖం వైపు చూశా ఏమైనా కదలిక ఉందోనని! మూడుసార్లు గుండ్రంగా తిరిగేటపుడు అడుగడుక్కీ దూరం అనంతంగా పెరుగుతున్నట్టుంది. చెవి దగ్గరకెళ్ళి తడి ఆరిన పెదాలను గట్టిగా కూడబలుక్కున్నా.

నా… న్నా!…..

 

***

చద్దన్నం తినడం, తెల్లారుతుండగానే సైకిల్మీద పొలానికెళ్ళడం, తెల్లటి మేఘాల్లా మెరిసిపోతున్న పత్తి గుబ్బలను అక్కతో పోటి పడి తీయడం, కొద్దిసేపటికే రెండు మూడు చెట్లను పందిరిలా అల్లి ఆకులోంచి వస్తున్న నీరెండను తప్పించుకోవాలనుకోవడం, పచ్చడితో సల్లబువ్వ తాగడం, సాయంత్రమయ్యేసరికి ముందు వెనుక బస్తాలేసి నాన్న నడిపిస్తుంటే సైకిల్ సీటు పైనే కూర్చోని నడిచొస్తున్న అక్కని చూసి వెక్కిరించడం, పొద్దుగూకినాకే నీళ్ళుపోసుకోవడం, తెచ్చిన పత్తిమీదే పడుకోవడం…. చిన్నప్పటి నాజీవితం.

ఇద్దరూ వళ్ళు హూనం చేసుకోని పత్తిమీద వచ్చిన డబ్బుతో వరిపొలమొకటి కొన్నారు. అరెకరం నుండి ఎకరన్నర ఆసామిగా నాన్న కూలి నుంచీ రైతుగా తన అస్తిత్వాన్ని రూపాంతరీకరణ చేసుకున్నాడు! అమ్మ కూలికెల్తానన్నా ‘రైతు భార్య వేరే వాళ్ళ పొలంలో పనిచేయొచ్చా?’ అనంటే ఉన్న పొలంలోనే పని చేసేది. రెడ్డిగారి పొలం కౌలుకి తీసుకుందామని నాన్నంటే, పెట్టుబడికి అమ్మ చెవికమ్మలను తాకత్తు పెట్టమని ఇచ్చింది.

***

గాలి వీచినప్పుడల్లా బరువుతో తల నేలకి గిరాటేసి వెర్రిగా నృత్యం చేస్తున్నాయి వరికంకులు! వరిపొట్టు ముదరటానికి ఇంకొన్ని రోజులు పట్టొచ్చు! వరికోతకు అప్పుడే కొడవళ్ళు చేయించి, ఏళ్ళుగా వెలుతురు చూడని వరిగుమ్మిని బూజుదులిపింది అమ్మ. ఎన్నో రోజుల తర్వాత నాన్న కంటినిండా నిద్ర పోయాడు.

పొద్దున్నేకాలు బయటపెట్టానో లేదో కర్రిమబ్బొకటి మింగేయడానికొచ్చినట్లు వచ్చింది. చూట్టూ ముసురు కమ్ముకుంది. చలనం లేకుండా నిల్చున్న నన్ను చూసి నాన్న లోపలనుంచి వచ్చాడు.

“ఏమైందబ్బాయ్?” అని అడుగుతూ నా భుజంపై వేసిన ఆయన చేయి మీద రుపాయిబిళ్ళంత వాన చినుకొకటి పడింది. తలెత్తిన మరుక్షణమే ఎడతెరపి లేకుండా వస్తున్న వాననీ, నోట మాట రాక నిస్సహాయంగా చూస్తున్న నాన్న చూపుల్నీ చూసి బిత్తరకపోయాను.

“వామ్మో! వర్షపు చాయలు మరో నెల రోజుల వరకు కనిపించవని చెప్పాడు కదే ఆ వార్తలు చెప్పేవాడూ!!?” అని నుదురుమీద చేతులేసుకోని కొట్టుకుంటా అమ్మ ఏడుస్తోంది.

అక్క మౌనంగా పైకప్పు కన్నాల్లోంచి పడుతున్న వాన చుక్కలకి ఇల్లంతా మట్టి రొచ్చు కాకుండా కూరసట్టెలు, చెంబులు పెడుతుంది.

నాన్న వడి వడిగా గోనెపట్టా కొప్పెర వేసుకోని బయటకెళ్ళిపోయాడు.

“మీ నాన్న ఉలుకు పలుకు లేకుండా కుర్చున్నాడు వెళ్ళి తీసుకురారా చిన్నోడా” అని చుట్టింటి తాత చెప్పేసరికి పొలం దగ్గరకెళ్ళా. వరంతా నేలరాలింది. మడి మధ్యలో కూర్చోని వాన నీటిలో తేలియాడుతున్న వరికంకులను ఏరుతున్నాడు నాన్న. రెక్కపట్టి లేపితే నా భుజం మీద పడి బావురుమన్నాడు. చేతికందొచ్చిన కొడుకు కళ్ళముందే చనిపోతే ఎలా ఉంటుందో నాన్న కన్నీళ్ళలో కనిపించింది. స్పృహ లేనట్లున్న నాన్నని కష్టం మీద నడిపించుకుంటా ఇంటికి తీసుకొచ్చాను.

 

***

‘ప్రభుత్వం నష్టపోయిన పంటలకు డబ్బులిస్తుందని, పంచాయితి ఆఫీసుకి రేపు పాసుపుస్తకాలు తీసుకురావాలని’ దండోరా వేయించాడు సర్పంచ్. రెడ్దిగారి జీతగాడొచ్చి ఇంటికి రమ్మంటున్నాడంటే ఇద్దరం వెళ్ళాం. ‘రెండెకరాల కౌలు డబ్బులెప్పుడిస్తావ’ని అడిగాడు రెడ్డి నాన్నని.

‘పంటంతా పోయింది, ఇంట్లో జరుగుబాటుకే కష్టంగా ఉంద’నేసరికి పడక కుర్చీలోంచి లేచి లోపలకెళ్ళి ఓ వంద రూపాయిలు తెచ్చి నాన్న చేతిలో పెట్టి మళ్ళీ లోపలకెళ్ళాడు. ‘ఏందబ్బా ఇంత దాతృత్వం!?’ అనుకుంటుండగానే గుమస్తా మా దగ్గరకొచ్చి “రేపు ప్రభుత్వం వాళ్ళు అడిగినపుడు కౌలుపొలం లెక్కలోకి చెప్పొద్దన్నాడు రెడ్డి. కౌలుకట్టలేకపోయినోడు కట్టలేనట్లే ఉండాలని చెప్పమన్నాడు” అన్నాడు.

నిల్చున్న నేల బద్దలవుతున్నట్టుంది. ఆ డబ్బులొస్తే ఇంట్లోకి జరుగుబాటు అన్నా అవుద్దనుకున్న మాకు ఏడుపు తన్నుకొస్తుంటే సన్నగా వెకిలి నవ్వొకటి నవ్వుతూ రెడ్డి బయటకొచ్చాడు. 5 సం.లకు కౌలు కుదుర్చుకున్న ఒప్పందపత్రం చించేశాడు.

నవ్వంతా మీసాల చాటున దాచిపెట్టి గవర్నమెంట్ ఇచ్చిన పంటనష్టాన్ని “విషణ్ణవదనంతో” అందుకున్నాడు రెడ్డి.

 

***

అమ్మ మంగళసూత్రాలు మా కడుపుల్ని ఆదుకున్నాయి.

ఈ ఏడాదంత వర్షపు జాడ లేదు. నేల నోరు తెరిచి ఆత్రంగా నీటి కోసం ఎదురు చూస్తున్నట్టుంది. పొలాలకని పక్క రాష్ట్రం నుండి తెచ్చిన నీళ్ళను ఎగువకాల్వలోకి వదులుతామని ప్రభుత్వం వార్తల్లో చెప్పిందంట. ఆ నీళ్ళ కోసం మేము కూడా నేలతల్లి లాగా ఆత్రంగా చూస్తున్నాం.

సందేళే ఒక ముద్ద తిని, నాన్న నేను పొలానికి బయల్దేరాం. “చిన్నోడా! ఈ ఏడు ఎలాగైనా అక్కను ఒక మంచి ఇంటికి పంపిస్తే నా బరువు తీరిపోతుందిరా! అమ్మ సూత్రాలు కమ్మలు తెచ్చివ్వలేనేమో గాని ఒక రెండు చీరలన్నా కొనాలి. నన్ను చేసుకున్న పాపానికి ఏరోజూ నోరెత్తి నాకిదికావాలి అడిగిన పాపాన పోలేదు.

నీళ్ళొస్తాయనీ పంట పండుతుందనే ఆనందంలో కడుపునిండా తినడానికే లేదన్న సంగతి మర్చిపోయాడు. నీళ్ళు వచ్చేలోగా ఒక కునుకేద్దామని రగ్గు తీసి పక్కేసాం. నాకు ఒళ్ళు తెలియనంత నిద్ర కమ్మేసింది.

గాలి వీస్తున్న దిశలో ఏటవాలుగా వడ్లు తూర్పారపడుత్తున్నారు. మానికలతో కొలచి బస్తాల్లో పోసి వాటిని దబ్బనంతో కుడుతున్నారు. గడ్డంతా తీసి వామేస్తున్నారు. చీకటి పడుతుండగా పోల్చుకోలేని

ఆకారమొకటి మా దగ్గరకొచ్చింది. పనిచేస్తున్న వారంతా, ఆ ఆకారం చెప్పిందే తడవుగా

బస్తాలని ఎడ్ల బండ్లోకి మోసుకెళుతున్నారు. నాన్న ధాన్యం ఇవ్వనని అరుస్తున్నాడు. అలా అంటున్న నాన్న రెక్కలు మడిచి వెనక్కి పట్టుకున్నారు. ‘మా నాన్నని విడవండి – మా నాన్నని విడవండి’ అని అరుస్తూ పరిగెత్తుతూ బోర్లా పడ్డాను. నుదురు రాయికి కొట్టుకుని ముఖం అంతా రక్తం.

“చిన్నోడా! నీళ్ళొస్తన్నాయ్” అని అమ్మపెట్టిన కేకకు ఉలిక్కిపడి లేచేసరికి, నీళ్ళ శబ్దం కాలవలో.

వచ్చిన కలని తల్చుకుంటున్నకొద్దీ భయంగా ఉంది. ఆందోళనగా నాన్నవైపు చూశాను. కాలవకి గండిపెట్టి పొలాన్ని తడుపుకోవడానికి అమ్మనాన్న వంగి సాళ్ళని గట్టి చేసుకుంటున్నారు.

క్షణక్షణానికి దగ్గరవుతున్న నీళ్ళ శబ్దానికి నాన్న ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తోంది.

శబ్దం తప్ప నీళ్ళు రావేందీ!? ఏదో స్పురణకి వచ్చినవాడిలా దిగ్గున లేచాడు. నేను కూడా కాలవ మీదకి పరిగెత్తి నాన్నతో నడిచాను. ముందుకెళ్ళి చూస్తే, రెడ్డి జీతగాడు కాలవకి అడ్డకట్టు వేసి రెడ్డి పొలమును తడుపుతున్నాడు.

‘నీళ్ళు మీరే మళ్ళిస్తుంటే మా పొలాలెలా తడవాలి?’ అని అడుగుతుంటే పొగ వదులుకుంటూ రెడ్డి మెల్లగా వచ్చాడు.

“నోటి కాడ కూడు లాక్కెళ్ళడడం మీకు ధర్మం కాదు బాబయ్యా, ప్రాణాలన్నీ పంటమీదే పెట్టుకున్నాం, మీరు దయతలస్తే మా భూమి కూడా తడుపుకుంటాం” అని నాన్న అంటుంటే ఏమి విననట్టు చూస్తా నిలబడ్డాడు.

“మా పొలం తడవనియ్ ముందు తర్వాత చూద్దాం” అని “ఒరే మన పొలమంతా తడిసేదాకా చుక్క కూడా కిందకొదలొద్దు” అని ఇంకొక చుట్ట వెలిగించాడు.

“నీవు దౌర్జ్యనంగా దోచుకుతింటుంటే, నీ కాళ్ళ కింద బానిసల్లాగా బతికేటోళ్ళెవ్వరు లేరు” అని

అడ్డకట్టు కొట్టడానికి ముందుకెళ్ళా. జీతగాడు ముళ్ళుగర్ర తీస్కోని నా మీద కొస్తుంటే చేతికి దొరికిన

రాయితీసుకోని వేశా. వాడి తల పగిలింది. ముందుకి అడుగేసేలోపు కర్రొకటి నావీపు మీదా బలంగా

పడింది. వెనక్కి తిరిగి చూద్దామనుకునేసరికి తలమీద ఇంకో దెబ్బ. నీరంతా ఎరుపెక్కి రెడ్డి పొలంవైపే పారుతున్నాయి. స్పృహ తప్పింది.

లేచి చూసేసరికి అక్క దిగాలుగా ‘రెడ్డిని కొట్టినందుకు పోలీసులు నాన్నను తీసుకెళ్ళారం’ది ఏడుస్తా. అమ్మేమో రెడ్డి కాళ్ళ మీద పడైనా నాన్నను విడిపించుకొని రావడానికి వెళ్ళిందట. మూడు రోజులవుతున్నా నాన్న ఇంటికి రాలేదు.

ఈ మూడు రోజులూ నీళ్ళు రెడ్డి పొలాన్ని తడుపుతూనే ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళు పంటలన్నింటికీ నీళ్ళందించినందువల్ల కాలువ మూసేస్తున్నామని చెప్పారు.

కాలువ నీళ్ళు ఆగిపోయిన తెల్లారే నాన్న ఇంటికొచ్చాడు.

 

***

కడుపులు నింపుకోవడానికి జనం కూలీలుగా వలసలు వెళుతున్నారు. చాలా ఇళ్ళు మనుషుల్లేక శిధిలాలుగా మారిపోతున్నాయి.

నాన్న వచ్చే ఏడు పెట్టుబడి కోసం ఎవరెవరినో అప్పు అడుగుతున్నాడు. అప్పులొద్దు మనం కూడా కూలీకి వెళ్దామంటే “రైతనేవాడు ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా మట్టిని నమ్ముతూనే ఉండాలిరా, నా ఒంట్లో సత్తువ ఉన్నంతవరకూ నా పొలంలోనే రైతుగానే పని చేస్తానురా, నా పొలాన్నే నమ్ముకుంటా, అది నన్ను అన్యాయం చేయదు” అన్నాడు.

‘ఆ పొలమే తాకట్టులో ఉంది. ఇంకదేం సాయం చేసిద్దయ్యో’ అని అమ్మ అంటానే ఉంది. నాన్న విననట్లుగా అప్పు కోసం తిరుగుతానే ఉన్నాడు.

రోజులు గడుస్తున్నాయి. అక్కకు మంచి సంబంధం వచ్చింది. అక్క వాళ్ళకి నచ్చింది. వారం రోజుల్లో పెళ్ళి. ఎంత మంది చుట్టో అప్పు కోసం తిరుగుతున్నాడు నాన్న. ఈసారి అప్పు పొలం పెట్టుబడి కోసం కాదు. కట్నం డబ్బుల కోసం.

నాన్న ఇంటికి రాగానే ఆయన ముఖం వైపు కాకుండా చేతులవైపే చూస్తున్నాం ఇంట్లో అందరం. ఉత్తచేతులే.

అప్పుడే పొలం మీద తీసుకున్న అప్పు పది రోజుల్లో తీర్చాలని, లేకపొతే పొలం జప్తు చేస్తామని బ్యాంకు నోటీసు వచ్చింది.

దారులన్ని ఒకొక్కటే మూసుకుపోతున్నాయనిపించింది. “భూమికూడా పోతే ,ఇంకెలాగురా మనం బతికేది? బతుకంతా ఇంకొకరికి ఊడిగం చేయాల్సిందేనా?” అని పిల్లాడిలా నాన్న రాత్రి నా మంచం పక్కన కూర్చోని తల మీద చేతులేసుకోని ఏడ్చాడు.

ఆయన కళ్ళలో నిస్సహాయత కన్నా తప్పు చేస్తున్నాననే భావన ఎక్కువగా కనిపించింది. గడ్డికని తెల్లారెళ్ళిన నాన్న ఎంతకూ రాకపోయేసరికి పొలం వైపు వెళ్ళాను. చెట్టుకి సుఖ దుఃఖాల నడుమ ఉరితాడుతో నాన్న ఉయ్యాలూగుతున్నాడు.

రైతుగానే చనిపోతానన్న నాన్న మాటాలు గుర్తొచ్చాయి. కష్టాలన్నీ తీరిపోయి తేలికవుతానని అనుకున్నడేమో కాని ఇప్పుడే నాన్న బరువుగా అనిపించాడు. కిందకి దించలేక చుట్టింటి తాతదగ్గరకెళ్తే ‘ఇంకెవరికీ చెప్పొద్దనీ, ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎప్పుడో కట్టిన ఇన్సూరెన్సు డబ్బు రాకపోగా, ఊళ్ళో వాళ్ళందరూ హేళనగా చూస్తార’ని చెప్పాడు.

దు:ఖాన్ని తాత భుజం మీద పడి కాస్త దించుకున్నాను. ఇద్దరం కలిసి నాన్నని చెట్టు నుంచి దించాం. ఎవరూ చూడకుండా నాన్నని భుజాలపై మోసుకెళ్ళి పాకలో పడుకోబెట్టి ఏమీ తెలియనట్టుగా తాతతో బయటకెళ్ళిపోయాను.

అబద్ధపు అస్తిత్వపు చుట్టూ బతికిన నాన్న అబద్ధంగానే చనిపోయాడు. సమాజం రైతు చుట్టూ అల్లిన ఒక విషవలయంలో నాన్న చిక్కుకున్నాడు. రైతనే ఉనికి కంటే జీవితం గొప్పదని తెలుసుకోలేకపొయాడు. రైతనే అస్తిత్వం కోసం ప్రాణలనే విడిచాడు.

నువ్వు చనిపోలేదు నాన్నా! ఆత్మహత్య చేయబడ్డావు! అని గట్టిగా అరవాలనిపించింది కాని పొలం మీదున్న అప్పు నా నోటిని మూసేసింది.

 

***

రోడ్డు మీద గతుకులు ఇప్పుడు ఇబ్బందిగా అనిపించట్లేదు. నాతో పాటు చాల మంది కూలీలుగా

తెల్లారిగట్టే వెళ్ళి, నడిరేతిరికి ఇదే బస్సులో వస్తున్నారు. ఎవరైనా ‘నీవెవర’ని అడిగితే ఎండిపొయిన ఎకరన్నర ఆసామినని చెప్పుకోవాలా లేక పలుగు, పార పట్టి మురుక్కాల్వలు తవ్వే రోజువారీ కూలి అని చెప్పాలా అనే సంకట స్థితిలో నేను లేను. నిస్పృహ లోంచి వెలుగు పంచే చిన్న చిరునవ్వొక్కటే నా దగ్గర సమాధానంగా మిగుల్చుకున్నాను కనుక.

చీరకన్నా చిరుగులెక్కువున్న గుడ్డపీలికలనే అమ్మ మళ్ళీ మళ్ళీ కుడుతోంది కూలికెళ్ళే

సమయమైందని. యవ్వనమంతా గుప్పెడన్ని గింజలు సంపాదించడానికే సరిపోయిందని పాకలో అక్క వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టుంది – చూడలేక ఆకాశం నల్లముసుగు కప్పుకుంటోంది.

*****

 

 

 

మీ మాటలు

  1. వనజ తాతినేని says:

    మళ్ళీ మళ్ళీ ఇవే కథలు . ఎన్ని వ్రాసినా తరగని వ్యధలు . పరిష్కారం దొరకని కథలు . మీ శైలి బావుంది .

  2. వ్యధాభరితంగా రైతు కథను ఆవిష్కరించారు. కథనం విభిన్నంగా వుంది.

  3. Super bro.

మీ మాటలు

*