నామాలు

 

 

chaitanya(“సారంగ” ద్వారా తొలిసారిగా కథకురాలిగా పరిచయమైన పింగళి చైతన్య కథల సంపుటి “మనసులో వెన్నెల” వచ్చే  వారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చైతన్యకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కథని ప్రచురిస్తున్నాం. చైతన్య కథల సంపుటిలో  ఎనిమిది కథలున్నాయి, 96 పేజీలు. ప్రతులు: విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, నవయుగ , వెల: యాభై రూపాయలు. చైతన్య ఈ-చిరునామా: chaithanyapingali@gmail.com)

 

~

శైలుకి కంగారుగా ఉంది. బట్టలకి, దుప్పట్లకి మరకలు అయిపోతాయేమో  అని.

మరకలు అయితే, మామగారు లేవకముందే.. తెల్లారే లేచి, వాటిని ఉతుక్కొని, ఆఫీసుకి వెళ్ళాలి. లేటవటం దేవుడెరుగు.. ముందు ఆ దుప్పట్లు ఉతుక్కునే ఓపిక శైలుకి లేదు.

అసలు రేపు ఉతుక్కోవటం  వేరే విషయం.. ఇప్పుడు ప్యాడ్ మార్చుకోపోతే .. చచ్చిపొయేలా ఉంది. బయట ఉండే బాత్రూంకి వెళ్ళాలంటే.. ఇబ్బంది. అది పక్కనుండే బ్యాచిలర్స్  వాడతారు. అందుకే.. వాడేసిన ప్యాడ్ ని  ఆ బాత్రూంలో వదిలేస్తే  బాగోదు. రోడ్డు  మీదకెళ్ళి, చెత్త కుప్పలో పారేయాల్సిందే! టైమేమో ఒంటిగంట దాటుతోంది. రాత్రి తొమ్మిది ఐతేనే, ఆ వీధిలో ఎవరూ కనిపించరు. అలాంటిది, ఈ టైంకి ప్యాడ్ పారేయటానికి.. వీధి చివరిదాక వెళ్ళటానికి భయం వేసింది శైలుకి.

‘సుధీ.. లేవా.. ప్లీజ్.. తోడు రావా..’ అని బతిమాలింది. సుధి అంటే.. ఆమె భర్త సుధీర్ గుప్త. అతను ఆ వేళ ఆఫీసు నుండి ఇంటికొచ్చేసరికి పన్నెండు అయింది.

సుధీర్ కళ్ళు తెరవట్లేదు. ‘నా వల్ల కాదే… ప్లీజ్.. వదిలేయ్’ అని పడుకున్నాడు. కొంచెం  బతిమాలిందా.. అరిచేస్తాడు అని భయంతో శైలు పక్క మీద నుండి జరిగి, ఉట్టి నేల మీద దిండు వేసుకుని పడుకుంది.

నేల చల్లదనానికి నిద్రపట్టట్లేదు శైలుకి. అమ్మా, నాన్న.. గుర్తొచ్చారు. ఏడుపు తన్నుకొచ్చింది. కాని.. ముక్కు ఎగబీల్చిన చప్పుడు వినిపించిందా.. సుధీర్ నిద్ర లేస్తాడు. ‘ఎప్పుడు ఏడుపేనా? ఏమయిందే ఇప్పుడు?’ అని విసుక్కుంటాడు. గదిలో పడుకున్న శైలు అత్తగారు, మామగార్లకి ఆ అరుపులు వినిపించాయా బయటకి  వచ్చి, శైలునే తిడతారు. ‘వాడిని ప్రశాంతంగా పడుకోనీయవా?. అయినా.. నడింట్లొ ఏడుపు ఏంటమ్మా?.. దరిద్రం. ఉన్న దరిద్రం చాలదా?’ అని దెప్పిపొడుస్తారు.

ఎన్నిసార్లు జరిగింది ఇదే  సీను. అందుకే.. దుఃఖాన్ని  బలవంతంగా ఆపుకుంది శైలు. కాని ప్యాడ్ చిరాకు పెడుతోంది. చర్మం మంట పుడుతోంది. ఇక తప్పదని.. లేచి, ఆ పోర్షన్ బయట ఉండే బాత్రూంకి వెళ్ళింది. పాత ప్యాడ్ ని పేపెర్లో చుట్టి.. నెమ్మదిగా గేటు తీసి.. ఓసారి రోడ్డుని ఆ చివరి నుండి ఈ చివరి దాకా చూసింది. ఎవరు లేరు. ‘ఏమన్నా అయితే నాన్నకి ఫొను చేయాలీ’ అనుకుని సెల్లో నాన్న నంబరు ఓపెన్ చేసి, డైల్ బటన్ మీద వేలు రెడీగా పెట్టుకుని.. నెమ్మదిగా నడుచుకుంటూ.. వీధి చివర చెత్తకుప్ప దాకా వెళ్ళి , అది పారేసి.. గబగబా వెనక్కి పరిగెత్తుకు  వచ్చేసింది. ఇంటి మెయిన్ గేట్ వేసి, చెప్పులు విడిచినా.. శైలుకి దడ తగ్గలేదు. గేట్ వేస్తున్నప్పుడు తన చేతి మీద ఉన్న నామాలు కనిపించాయి శైలుకిరెండు భుజాల మీదా ఉన్న నామాల్ని రెండు చేతులతో తడుముకోగానే.. ఏడుపు  ఆగలేదు శైలుకి.

ప్రహరీకి వారగా ఉండే బాత్రూంలోకి వెళ్ళి, ట్యాప్ ఫుల్ల్ గా తిప్పి.. నీళ్ళ శబ్దంలో ఏడుపు వినిపించదు అని రూఢి అవ్వగానే.. నోటికి చేయి అడ్డుగా పెట్టుకొని.. చిన్నగా ఏడవటం మొదలుపెట్టింది.

fbఇంట్లోకి  వెళ్ళటం కంటే ఆ బాత్రూంలో ఉండటమే నయం అనిపిస్తోంది. వాళ్ళది సింగిల్ బెడ్రూం ఇల్లు. లోపల గదిలో అత్తయ్య, మామగార్లు పడుకుంటారు. కొత్తగా పెళ్ళి అయినాసరే.. శైలు, సుధీర్ హాల్లోనే పడుకునేవారు. ‘నోరు తెరిచి, సిగ్గు వదిలి, గదిలో మేము పడుకుంటాం అని ఏం అడుగుతాం’ అని సుధీర్ అంటాడు. ‘ఈ మంచం హాల్లో వేస్తె నడిచేదానికి చోటు ఉండదు. నేనేమో నేల మీద పడుకోలేను’ అని అత్తగారు అంటుంది. పగలు అయితే, ఆ బెడ్రూం లో ఉండే అట్టాచెడ్ బాత్రూంలొనే స్నానం చేస్తుంది శైలు. కాని మధ్య రాత్రే ఇబ్బంది. ఎప్పుడైనా బాత్రూంకి వెళ్ళాలంటే, వాళ్ళ  గదిలోకి వెళ్ళలేక, బయట ఉన్న బాత్రూం వాడుతుంది. కాని నెలసరి టైం లో మాత్రం చచ్చే చావు. ఆ అత్తగారు శైలుని ఇంట్లోకి రానివ్వదు. దానితో పక్కింటి బ్యాచిలర్స్ వాడే బాత్రూంలోనే స్నానం చెసేది శైలు. ఆ బాత్రూం పరమ అసహ్యంగా ఉండేది. పైగా, వాళ్ళున్నప్పుడు వెళ్ళాలంటే ఇబ్బంది. సుధీర్ నుండి చిన్న సాయం కూడా ఆశించలేను అని శైలుకి చాలా కాలం క్రితమే అర్ధమైయింది.

ఆమె నెల జీతం ఇరవై వేలు. ‘నా జీతం మీకే ఇస్తున్నా కదా.. డబుల్ బెడ్రూం ఇంట్లోకి మారదాం’ అంటే మామగారు ఒప్పుకోరు. ‘నీ మొగుడికి అప్పులు చేసి చదివించాం.. అవన్నీ తీరేదాక ఎటూ  కదిలేది లేదు. అయినా, నువ్వొచ్చావని ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్న ఇల్లు వదిలి వెళ్ళిపొతామా?’ అని సీరియస్ అవుతాడు.

దాదాపు మూడు నెలలుగా ఇవే గొడవలు. కాని.. ఈసారి  ఇబ్బంది మరీ ఎక్కువైపొయింది. అందుకే, ఏడుపు ఆపుకొలేక బాత్రూం లోకి వెళ్ళి, నల్లా తిప్పి, ఆ శబ్దాన్ని ఆసరాగా చేసుకొని ఏడుస్తోంది.

ఎవరో  బయట నుండి తలుపు తీయబోయినట్టు అర్ధమై, చేతులు సబ్బుతో కడుక్కుని, సెల్ తీసుకుని, బాత్రూం నుండి బయటకి వచ్చింది శైలు. పక్కింటి కుర్రాడు బయట నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే గబగబా ఇంట్లొకి వెళ్ళి, తలుపేసుకుంది.

సుధీర్ పక్కనే పడుకుంది. ప్యాడ్ మార్చుకున్నా రిలీఫ్ రాలేదు. రోడ్డు మీదకి వెళ్ళి వచ్చిన టెన్షన్ తగ్గలేదు. ఏది ఏమైనా, రేపు ఇల్లు మారకపొతే, నేను ఇక్కడ ఉండను అని చెప్పేయాలి అని నిశ్చయించుకుంది. వెంటనే నిద్ర పట్టేసింది.

పొద్దున్నే లేచాక, అత్తయ్య వేసిన గిన్నెలు కడిగి ఇస్తే, ఆమె వాటి మీద నీళ్ళు చల్లి, లోపలికి తీసుకెళ్ళింది. ఈ అయిదు రోజులు, శైలుకి ఇల్లు ఊడ్చే పని ఉండదు. లేకపొతే రోజు ఇల్లు ఊడ్చి, తడి బట్ట పెట్టి తుడిచి, అంట్లు తోమాలి. వంట పని, బట్టలు ఉతికే పని అత్తయ్య చేసుకుంటుంది. వంట అయిపొగానే బాక్స్ తీసుకుని వెళ్ళిపొతారు శైలు, సుధీర్. మామగారు ఏం పని చేయరు. అత్తగారు మాత్రం ఓ ఫ్యాన్సీ షాపు నడుపుతుంటుంది.

అత్తగారు షాపుకి బయలుదేరకముందే.. ఇంటి విషయం తేలిపొవలనిపించింది శైలుకి. ‘నా వల్ల కావట్లేదు సుధీ.. మనం డబుల్ బెడ్రూం ఇంటికి మారిపొదాం..’ అన్నది గట్టిగా అత్తమామలకి వినిపించేట్టుగా.

శైలు మాటలు విని అత్తయ్య పెద్ద గొంతు పెట్టుకుని, ‘చూడమ్మ.. సద్దుకుపోవాలి. ఎన్నేళ్ళుగా నేను సద్దుకుపొతున్నా.. పుట్టింట్లో సాగినట్టూ సాగవు..’ అన్నది వ్యంగ్యంగా.

‘నా వల్ల కాదత్తయ్యా.. ఈ ఇల్లు మారటం మీకిష్టం లేకపొతే, మీరు ఇక్కడే ఉండండి. మేమిద్దరం వేరేగా ఉంటాం..’ అని తెగేసి చెప్పేసింది శైలు.

అంతే. ఇక సుధీర్ తల్లి ఏడుపు అందుకుంది. ‘కులం కాని కులం.. కడజాతి పిల్లని తెచ్చి.. కొడుకుని బాధపెట్టడం ఇష్టం లేక.. తెచ్చుకుని నడింట్లొ పెట్టుకుంటే.. ఈరోజు నా కొడుకుని నాక్కాకుండా చేయటానికి ప్లాన్లు వేస్తోంది… ఊరికే అంటారా కనకపు సింహాసనమున అని..’ అంటూ శొకండాలు మొదలుపెట్టింది.

అమ్మ ఏడ్చేసరికి.. సుధీర్ కి కోపం బాగా పెరిగిపోయింది. ‘ఎన్నిసార్లు చెప్పాను.. వేరే ఇల్లు సంగతి మర్చిపొమ్మని.. నీకు డబుల్ బెడ్రూం ఇల్లు కావలనుకుంటే.. మీ నాన్నని ఒకటి కొనిపెట్టమను.. అప్పుడు మారదాం’ అన్నాడు.

Kadha-Saranga-2-300x268

శైలుకి చాలా చిరాకు వచ్చింది. పెళ్ళికి సుధీర్ అమ్మానాన్నలు ఒప్పుకోకపొతే.. ‘ఆ పిల్ల కూడా హిందు మతమే. కులందేముంది.. కూటికొస్తదా? గుడ్డకొస్తదా? ఆ పిల్ల అసలే ఎస్.సి., తెలివిగలది. రేపోమాపో గవర్నమెంటు ఉద్యోగం వస్తుందీ’ అని మధ్యవర్తులు సుధీర్ అమ్మానాన్నల్ని ఒప్పించటానికి ప్రయత్నించారు. కాని అవేం ఆమె చెవులకి ఎక్కలేదు. శైలు వాళ్ళ నాన్న పెళ్ళికి ముందే సుధీర్ చదువు తాలుకా అప్పు తీరుస్తానని, అయిదు లక్షల బంగారం ఇస్తానని, అయిదు లక్షల విలువ ఫర్నిచర్ కొంటానని, మరో అయిదు లక్షల క్యాష్ ఇస్తానని మాటిచ్చాడు. ఎలాగూ, తను చూసిన సంబంధం చేసినా, కట్నం అదీ, ఇదీ ఇవ్వలి కదా అని అయన ఆలొచన.

కాని సుధీర్ వాళ్ళ అమ్మకి అర్ధమైందల్లా ఒకటే. బాగనే సౌండ్ పార్టి అని, పైగా రోడ్ల డిపార్ ట్మెంట్ లో          ఉద్యోగం అని, బాగా సంపాదించి ఉంటాడు అని. ఏది దాచినా కూతురుకి, అల్లుడికి ఇవ్వడా అనిపించి.. పెళ్ళికి సరే అన్నది. కాని రెండు కండిషన్లు పెట్టింది. మొదటిది – తాము పూజించే స్వామి వారు ఆశీర్వదిస్తేనే పెళ్ళీ అని. రెండోది – పెళ్ళి మీరే చేయండి, మా చుట్టాలు మమ్మల్ని వెలేస్తారు. అదే పెళ్ళి మీరే చెసేసుకుని వస్తే, స్వామి వారి ఆశీర్వాదం కూడా ఉంది, తప్పు చేసాడని కొడుకుని వదిలేసుకుంటామా అని ఏదో ఒకటి సద్దిచెప్పుకుంటాము అన్నది ఆ మహాతల్లి.

కూతురు కోసం అన్నిటికి ఒప్పుకున్నాడు శైలు నాన్న. పెళ్ళీ, రిసెప్షను ఏడు లక్షలు పెట్టి ఘనంగా చేసి, పెళ్ళి టైంలో ఇస్తామని మాటిచ్చిన డబ్బుతో సహా కూతుర్ని అత్తగారింట్లో దింపాడు.

అన్ని తీసుకుని ఇప్పుడు.. మళ్ళి కొత్తగా డబుల్ బెడ్రూం ఇల్లు కూడా కొనిమ్మంటే.. ఆయనెక్కడనుండి తీసుకురాగలడు? సిగ్గు ఎగ్గు లేకుండా అడుగుతున్న సుధీర్ ని చూస్తే అసహ్యం వేసింది శైలుకి.

‘మా నాన్న ఎందుకివ్వాలి? ఇచ్చినదేమన్నా తక్కువా? నా కోసం ఆయన అన్నిటికి అడ్జస్ట్ అయ్యి, ఈ పెళ్ళి చేశాడు. ఇంకా ఎంతని చేస్తాడు?’ అని ఏడుస్తూ అడిగింది సుధీర్ని.

సుధీర్ అస్సలు చలించలేదు. ‘కూతురు ఇలా హాల్లో పడుకుంటే.. అయనకేం బాధ లేకపోతే.. ఓకె.. నాకేంటి?’ అన్నాడు.

శైలుకి చీదరగా ఉంది. ‘కొడుకు హాల్లో పడుకుంటే.. మీ అమ్మానాన్నలకేమి బాధగా అనిపించటం లేదా? కోడలు పక్కింటి కుర్రాళ్ళ బాత్రూం వాడుతుంటే.. ఏం సిగ్గనిపించదా? పిరియడ్స్ వస్తే చచ్చిపొతున్నాను.. భర్తవి కదా.. నీకేం  బాధ్యత లేదా?’ అని గట్టి గట్టీగా ఏడుస్తూ అడిగింది.

ఆ ఏడుపులు పక్కింటి వాళ్ళకి , పైనింటి వాళ్ళకి వినిపించాయి. ఏదో గొడవ జరుగుతోందని అందరూ సుధీర్ వాళ్ళ గుమ్మం దగ్గరకి వచ్చి నిలబడ్డారు.

వాళ్ళని చూసేసరికి సుధీర్ కి కోపం వచ్చింది. ‘ఎవడికే బాధ్యత తెలీదు..’ అని శైలుని వంగదీసి, వీపు మీద పిడి గుద్దులు గుద్దాడు.

శైలు అత్తగారు.. ‘ఆగరా.. ఆగరా..’ అంటూ మధ్యలోకి వెళ్ళింది. కాని ఆమెని వెనక్కి నెట్టి, శైలు జుట్టు పట్టుకుని గోడకేసి తోశాడు.

బయట నిలబడిన వాళ్ళు అలాగే చూస్తున్నారు. శైలుని కొట్టడమూ మొదటిసారి కాదు. వాళ్ళు చూడటమూ మొదటిసారి కాదు.

కాని ఈసారి శైలుకి మొండితనం వచ్చేసింది. ఎంత కొడుతున్నా.. ఆ గొడకి ఆనుకుని అలాగే నిలబడింది. ‘వేరే ఇంట్లోకి మారదామా? వద్దా? మా నాన్న మాత్రం కొనివ్వడు. ఏదో ఒకటి తెల్చి చెప్పు..’ అని విసురుగా అడిగింది.

fb

సుధీర్ మళ్ళీ కొట్టాడు. శైలు మళ్ళీ అదే మాట అన్నది. అప్పుడు శైలు మామగారు మధ్యలో వచ్చి.. ‘వద్దురా అంటే దీన్నే చేసుకుంటాను అని పట్టు పట్టావు.. నువ్వు ఎంత చావబాదినా.. అదేం చలించదు.. మామూలు ఒళ్ళా అది? గొడ్డు మాంసం  తిని తిని, చర్మం మందం అయిపోయింది..’ అన్నాడు.

శైలుకి ఉక్రోషం తన్నుకొచ్చింది. శైలు ప్రేమ విషయం ఇంట్లో తెల్సినప్పుడు, ఆమె తండ్రి సుధీర్ తో మాట్లడటం మానేయమన్నాడు. భయపెట్టాడు. కొట్టాడు కూడా. అయినా, సుధీర్ ని మర్చిపోలేను అన్నది. దానితో ఆయన మాట్లడటం మానేశాడు. నాన్న మాట్లాడటం మానేస్తే తట్టుకోలేకపొతోంది.. అలా అని సుధీర్ని మర్చిపోలేకపోయింది. ఏం చేయాలో తెలీక, ఓ రోజు మణికట్టు దగ్గర చేతిని కొసేసుకుంది శైలు. అది చూసి భరించలేక, శైలు వాళ్ళ అమ్మ, నాన్న సుధీర్ ని ఓసారి ఇంటికి తీసుకురమ్మన్నారు.

సుధీర్ వచ్చాడు కూడా. ‘మనవి వేరే వేరే కులాలు బాబు.. రేపు ఏమన్నా గొడవలు అయితే..’ అని తన భయాన్ని సుధీర్ తో  చెప్పుకున్నాడు.

‘నాకు క్యాస్ట్ ఫీలింగేం ఉండదు అంకుల్. నేను అలా ఎప్పుడు ఆలోచించను. అమ్మావాళ్ళకి కొంచెం ఆచారాలు ఎక్కువ. వాళ్ళు ఒప్పుకోకపొవచ్చు. వాళ్ళు శైలుని కాదంటే.. నేను ఇంట్లో నుండి వచ్చేస్తాను. క్యాస్ట్ గురించి ఆలోచించకండి అంకుల్’ అని భరోసా ఇచ్చాడు.

‘క్యాస్ట్ ఫీలింగ్ లేకపొటం వేరు.. కులం పట్ల స్పృహ, అవగాహన ఉండటం వేరు. కులం ఎంత  క్యాన్సరో అర్ధం చేసుకున్న వాళ్ళు కులాంతర వివాహం చేసుకోటం వేరు.. నీకు..’ అని ఇంకా చెప్పబోతుంటే.. శైలు వాళ్ళ అమ్మ ఆయన మాటని కట్ చేస్తూ.. ‘క్యాస్ట్ ఫీలింగ్ లేకపొతే అంతకంటే ఏం కావాలి.. చూడు బాబు.. ఇంట్లో నుండి వచ్చెయమని.. మేము చెప్పటం లేదు. వాళ్ళని ఒప్పించటానికే ప్రయత్నించు.. ‘ అని చెప్పింది.

అప్పుడు జరిగిన మాటల్లోనే స్వామివారు ఆశీర్వదిస్తే మాకేం ఇబ్బంది లేదని సుధీర్ తల్లి చెప్పింది. పెళ్ళికి ముందు శైలుని ఆ స్వామివారి దగ్గరకి తీసుకెళ్ళింది. ఆయన రెండు రాష్ట్రాల్లో చాలా ప్రసిద్ధుడు. స్వయానా ముఖ్యమంత్రులే ఆయన్ని హెలికాఫ్టర్లు ఎక్కించుకుని తిరుగుతారు. వాళ్ళేంటి.. ఈ దేశ ప్రధాని కూడా ఆయన కాళ్ళ మీద పడతాడు. తిరుపతి దేవస్థానాల్లో ఆయనది పెద్ద హోదా కూడా. అంతటి ప్రఖ్యాత స్వామివారికి శైలును చూపించినప్పుడు .. ఆయన దీవించాడు. ‘హరికి ఇష్టులైన వారంతా హరిజనులే.. ఈ అమ్మాయ్ కి నామాలు వేయండి..’ అని చెప్పాడు. శైలు చాలా సంతోషపడింది, ఆయన ఆశీర్వాదం పొందినందుకు.

శైలుకి నామాలంటే ఏంటో తెలీదు. సుధీర్ కూడా వేయించుకుంటాడేమో అనుకుంది. కాని.. సుధీర్ తల్లి.. ‘వాడికొద్దమ్మా.. మాంసం అదీ తింటాడు కదా.. నేనే వేయించుకున్నాను కాని.. సుధీర్ వాళ్ళ నాన్నగారు వేయించుకోలేదు. మగవాళ్ళు ఏం నిష్ఠగా ఉంటారు చెప్పు..’ అన్నది.

‘అంటే, నాన్వేజ్ తినకూడన్నమాట’ అనుకుంది శైలు. నామాలు వేయించుకోటానికి లైన్లో నిలబడింది.

శంఖు, చక్రాలు అచ్చులున్న రెండు ఇనప కడ్డీలని.. ఎర్రగా కాల్చి, ఒకేసారి రెండు భుజాల మీదా.. ముద్రలు వేస్తారు. అదే నామాలు వేయటం అంటే. పక్కవాళ్ళకి వేస్తుంటే చూస్తేనే.. శైలుకి భయం వేసింది. కాని.. పెళ్ళికి ఒప్పుకున్నారు.. అది చాలు అనిపించింది. శైలు వంతు రాగానే.. కళ్ళు మూసేసుకుని.. ‘సుధీర్’ అని గట్టిగా అరిచింది. వాళ్ళు ఠక్కున అచ్చులు వేసేశారు. శైలు అరుపుకి ఆమె అత్తగారే ఆశ్చర్యపోయింది. ‘ఎంత ప్రేమ అమ్మా..’ అని జాలిపడింది కూడా. ‘పెళ్ళికి సరే అన్నట్టేనా, పెళ్ళి జరిగితే నేను షిరిడి వస్తాను అని మొక్కుకున్నాను..’ అని వేడికి కమిలిపోయి, నీరులా పట్టిన చర్మాన్ని ఊదుకుంటూ అడిగింది శైలు. ‘వైష్ణవం తీసుకునావమ్మా ఇప్పుడు.. హరి, హరి అవతారాలు తప్ప వేరే వారిని పూజించకూడదు.. షిరిడికి వద్దు..’ అని చెప్పింది సుధీర్ తల్లి. శైలు ఏం మాట్లాడలేదు. అత్తగారు ఇచ్చిన స్పిరిట్ ని చేతుల మీద అద్దుకుంటూ.. ఏడ్చింది. చేతులు కాలినందుకో.. భవిష్యత్తు లీలగా అర్ధమయ్యో..

నామాలు వేయించుకున్న దగ్గర నుండి, నిజంగానే  నాన్వేజ్ తినటం మానేసింది. కనీసం గుడ్డు కూడా తినలేదు. కాని పుట్టుకతో శాఖాహారి అయిన సుధీర్ మాత్రం హోటెల్లోనో.. శైలు వాళ్ళంటికి వచ్చినప్పుడో.. హాయిగా మాంసం, చేపలు తినేవాడు. తిండి దగ్గర కూడా రాజిపడి.. బతుకుతుంటే.. ఏడ్చేందుకు కూడా స్వేచ్ఛ లేకుండా బతుకీడుస్తుంటే.. గొడ్డు మాంసం తిని తిని.. ఒళ్ళు మందం అయిపోయిందని మామగారు తిట్టారు.

ఆ రోజున క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్పిన సుధీర్.. ఆ మాట అంటుంటే.. కనీసం ‘ఆగండి నాన్నా’ అని కూడా అనలేదు!

అసలే నెలసరి వచ్చి, విసుగ్గా, నీరసంగా ఉంది. పైగా దెబ్బల ధాటికి.. సూటిపోటి మాటలకి అలసిపొయింది శైలు. మళ్ళి కొట్టటానికి వస్తున్న సుధీర్ని వెనక్కి తోసి, బైక్ కీస్ తీసుకొని గుమ్మం దాటుతోంది.

‘ఎక్కడికే..?’ అంటూ సుధీర్ వెనకే వచ్చాడు.

‘ఇఫ్లూ లో బీఫ్ ఫెస్టివల్ జరుగుతోంది.. అక్కడికి..’ అని బండి స్టార్ట్ చేసి, వెళ్ళిపొయింది.

*

మీ మాటలు

  1. వనజ తాతినేని says:

    చాలా బావుంది . కులపట్టింపు లేదంటూనే ఇలా ప్రవర్తించేవాళ్ళు కోకొల్లలు. నామాలు పై బీఫ్ చెళ్ళున చరచినట్లు ఉంది .

  2. dr.klv prasad says:

    ఇప్పుడు ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని నేను అనుకోవడం లేదు. కులాంతర వివాహాలు చేసుకున్న పాత తరం
    ఇలాంటి ఇబ్బందులు పది ఉండవచ్చు. గొడ్డుమాంసం చాలామంది శాకాహారులు ఈ రోజుల్లో బాహాటంగానే తింటున్నారు.
    రచయిత్రి దృష్టిలో ఇంకా ఇలాంటి కుంతుమ్భాలు వుంటే అది భాదకరమయిన విషయమే .
    కథ చెప్పిన విధానం ప్రశంశనీయం .

    • chaithanya says:

      గొడ్డు మాంసం సాఖాహారుల్లో మామూలుగానే తిన్తుంటీ.. బీఫ్ ఫెస్టివల్ చేసుకోవాల్సిన పరిస్తితి ఎందుకు వస్తోంది? దళితులనే తిననివ్వట్ల. మధ్యప్రదేశ్ లో గుడ్డు ని మధ్యాహ్న భోజన పధకంలో ఆపేశారు. ఇది మన దేశం లో పరిస్తితి. ఇది శాఖాహార, మాంసాహార సమస్య మాత్రమె కాదు.. కులం కావరం.

  3. suresh k digumarth says:

    Very simple very powerful

  4. జనాన్ని సాదిచ్చి మతాలూ మారిపిచ్చే క్రిస్టియన్లని చాలా మందిని చూశాను(అందరూ కాదులే)-ఇల్లాటి వైష్ణవులు నాకు తగల్లేదే! కధ చాలా చిత్రంగా వుంది! నేను చుసిన లవ్ మారేజ్లో పిల్ల బ్రామ్హిన్ భర్త క్రిస్టియన్ -ఇప్పుడు అన్నీ తింటోంది-ఇష్టపడే తిన్తోందేమో -ఎప్పుడూ అడగాలా-ఎవరిష్టం వాళ్ళది-కానీ నాన్ వెజ్ మానేసిన వాళ్ళుంటారా!! అదీ అత్తా చెప్పిన్న్దని–ఈ నామాల తంతు కూడా విడ్డురం-రక రకాల్ మనుషులు.

  5. Mythili Abbaraju says:

    పింగళి వారి ఇంటి పేరు మీ కథ చేత దన్యమవుతోంది చైతన్య గారూ.

  6. ఊపిరాడట్లేదు చదువుతుంటే, ఎప్పుడెప్పుడు బయటపడుతుందా ఆ అమ్మాయి అనే వుందండీ. ఇలాంటి బాధను ఒకరు రాస్తారు, ఇలాంటి కొన్ని కుటుంబాలు ఇంకా వున్నాయని పదిమందికీ తెలుస్తుంది అనే లోకజ్ఞానం కూడా లేదు నాకు, కానీ 20 ఏళ్ళుగా అదే బాధలో కూరుకొని ఉన్నఆవిడ మా రోడ్డుకి అవతలి వైపే వున్నారు. 24 ఏళ్లగా పూర్తి శాఖాహారిగా మారి, కొందరికి ధనం సంపాదించి పెట్టి, అన్నీ అమర్చి పెట్టి వెన్నుముక విరుగుతున్నా మొహంలో దరిద్రం(దిగులు) కనపడకుండా జాగ్రత్తగా ఉన్న ఆవిడ. శైలు లాగా ఆవిడ వెళ్ళలేరు ( వెళ్ళరు కూడానేమో ). శైలు కి శుభాకాంక్షలు. ఛైతన్యవాణి గారికి అభినందనలు, ఇంత బాధను గుర్తుండిపోయే కధలో పరిష్కారం తో సహా రాసినందుకు . Great Good Luck to u Mam

    • chaithanya says:

      థాంక్ యు.. రేఖ గారు. నిజానికి ఎన్ని కధలు ఉంటాయండి.. మన చుట్టూ.. మనం చూడాలే గాని..

  7. చివరి వాక్యం పెటేల్నసమాజం మూతి మీద తన్నింది. నామాల బాగోతం విన్నాను గాని ఇంత detail గా తెలియదు. పనిలోపనిగా నామాల సామిని కూడా దంచేసారు, working women, inter caste marriages కొత్త కథా సందర్భాలు.

  8. ఇందులో రెండు కథలున్నాయి.
    కొత్తగా పెళ్ళయినమ్మాయి కొత్తింట్లో అదీ కొత్తగా పెళ్ళయిన వారున్నారనే స్పృహలేని పెద్దలున్న ఇంట్లో పడే భాధలు. పీరియడ్స్ సమయంలో వారు పడే బాధలూ ఓ కథ అయితే, కులాంతర/మతాంతర/ప్రాంతేతర వివాహాలూ, వాటితో వచ్చే బాధలూ మరో కథ.

    రెండు వేర్వేరు కథలుగా రాసివుంటే పదును మరింత పెరిగేదని నా అభిప్రాయం.

    • chaithanya says:

      రెండు కధలుగా రాయోచు. కాని ఒకటే ఎందుకు రాసా అంటే.. బ్రాహ్మల, కోమట్ల ఇళ్ళల్లో ఇంకా నెలసరి సమయంలో ఉండే ఇబ్బందులు.. తెలియాలని, అందులోను ఒక దళిత మహిళా వాళ్ళ ఇంట్లో అడుగుపెడితే.. ఆ సమయంలో ఎదుర్కోవలసిన బాధ గురించి.. తెలియాలని.. ఇందులోనే రాసా.

      • మరి వేరే కులాల్లో లక్షల కొద్దీ కట్నాలు కుమ్మరిస్తేనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మరి ఆ సమస్యలు మీకెందుకు కన్పించలేదు చైతన్య గారు? బ్రాహ్మల ఇళ్ళల్లో వుండే సమస్యలే కన్పించాయా మీకు? ఒక కులం ని టార్గెట్ చేసుకుని ఇంత ఓపెన్ గా కథ రాయటం అస్సలు ప్రొఫెషనల్ గా లేదు. ఈ రోజుల్లో చదువుకున్న అమ్మాయిలు అంత కట్నం ఇచ్చి , ఉద్యోగం చేస్తూ ఇలా తన్నులు తింటూ ఎవరూ ఉండట్లేదు. పైన ఎవరో చెప్పినట్లు 80,90 కథ లాగా ఉంది

  9. bhanu prakash says:

    అసలు విజృమ్భిస్తున్నారుగా… మొన్న గౌరవం ఈరోజు నామాలు మీరు ఎం చెప్పినా చెప్పె ఆ విధానం బాగుంది. మామూలు సమస్యలు మామూలు మాటలు కాని చదివే వారు మాత్రం మాములుగా స్పన్దించలేరు ఖచ్చితంగా భుజాలు తడుముకునేలా ఉంటుంది ఈ సమాజానికి.

  10. శభాష్ చాలా బాగుంది కద. దంచేసారు. కడ దాక విడవకుండా చదివించింది.

  11. ramprasad rao says:

    ఈ కథ ఒక్కప్పటి మాటేమొ కాని ఇప్పటిది కాదు ఇప్పటి రోజులు చాలా మార్పు వొచ్చింది ఏ కొడుకు కూడా భార్య కి వ్యతిరేకంగా తల్లి తండ్రులని సమర్థిస్త లేడు … ఇప్పుడు ఉన్న కాలం లో కొత్తగా వొచ్చిన కోడలిదే పైచేయి ఉంటుంది అది అన్య కులమైనా అన్య మతమైనా ………. ఇలాంటి పరిస్తితే వస్తే ఆ కొడలికి పిలిస్తే పలికే దేవుడి లా కోర్టు లూ కేసులూ చాలా అందుబాటులో ఉన్నాయి

  12. vijaya bharathi says:

    చాలా బాగుందండి…

  13. Laxma Reddy says:

    అనేక కులాంతర మతాంతర వివాహాలు జరుగుచున్న ఈరోజుల్లో ఈకథలోని అంశాలు,యుక్త వయసులోని ప్రేమికులు ,తల్లి దండ్రులు ఆలోచించే విధంగా ,తమ ప్రవర్తన సవరించుకునే ప్రయోజనమున్నట్లున్నది .

  14. చైతన్య గారూ? రమణమూర్తి గారు మీ నాన్నగారా? విజయ విహారం??
    నేను ఆ పత్రిక కు దారుణమైన అభిమాని ని అప్పట్లో!!

  15. I liked your previous story! I must say this one is a disappointment.

    It is sloppy and the characters are from bad telugu family movies of 80s & 90s. I don’t see a compelling reason for this girl to marry him to begin with.

    As far as vegetarianism goes, a lot of vegetarians don’t want people eating meat in their homes. When meat eaters live with vegetarians(even with roommate situation), it is an issue.

  16. సారీ అండీ చైతన్య గారూ! ఎన్కౌంటర్ దశరథ్ రామ్ గారు అని టైపు చెయ్యబోయి..దశరథ్ రామ్ గారు అని చేసాను. మీరు దసరతరం గారి కూతురేనా?

  17. srivasthava says:

    కుల వ్యవస్థ వలన ఎదుర్కునే బాధని బాగా చేపేరు

  18. దేవరకొండ says:

    పై కామెంట్ లో ‘ఛేపేరు’ మంచి జోక్!

  19. Delhi (Devarakonda) Subrahmanyam says:

    చాల గొప్పగా రాసారు చైతన్య గారూ. సైకిల్ తీసుకొని వెళ్లేముందు ఆ మొగుడు వెదవని ఒక్కటిచ్చుకుని వెడితే మంచి ముగింపు అయ్యేదేమో . ఇప్పటి పరిస్థితులల లేవన్న వ్యాఖ్యలు చూస్తే. ఇప్పటికీ కనీసం రోజుకో ఇలాంటి వార్త చూస్తూనే ఉంటాం. మీ కథలో ల ధైర్య చేయక ఇంకా సమహానికి భయపడి ప్రాణ త్యాగం చేసుకుంటున్న వార్త కనీసం రోజుకొకటి చూస్తూనే ఉన్నాం. అయిన పరిస్థితులు బొల్డు మరిపోయని మానని మనం మోసం చేసుకుంటుంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. మంచి కదా రాసినందుకు ఇంకో సరి అభినందనలు

  20. Delhi (Devarakonda) Subrahmanyam says:

    చాల గొప్పగా రాసారు చైతన్య గారూ. సైకిల్ తీసుకొని వెళ్లేముందు ఆ మొగుడు వెదవని ఒక్కటిచ్చుకుని వెడితే మంచి ముగింపు అయ్యేదేమో . ఇప్పటి పరిస్థితులలా లేవన్న వ్యాఖ్యలు చూస్తే చాల చిరాకొచ్చింది.. ఇప్పటికీ కనీసం ఇలాంటి వార్త రోజుకటి చూస్తూనే ఉంటాం. మీ కథలో లా ధైర్య చేయలేక ఈ పిత్రురాజ్య సమాజానికి అనవసరం గా భయపడి అమ్మాయల ప్రాణత్యాగ వార్తలు రోజు చదువుతున్నా, 1990 లో పరిస్థితులు వేరని ఇప్పుడు చెప్పుకోదగ్గ మార్పు వచ్చిందని మనని మనం మోసం చేసుకుంటుంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. మంచి కదా రాసినందుకు ఇంకో సరి అభినందనలు

  21. ఎప్పుడో ఎన్నో దశాబ్దాల క్రితము జరిగేవేమో ఇలాంటి సంఘటనలు. ఇప్పుడు కులాంతరాలు చేసుకున్నా ఈ కథలోలా ఎక్కడా జరుగుతున్నట్టు వినలేదు. అమ్మాయిలూ చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు, తల్లిదండ్రులు కూడా ఇది తెలుసుకునే మసులుతున్నారు. అయినా, బ్రాహ్మణ, వైశ్య కులాలే దొరికాయా ఎకసెక్కాలాడడానికి? ఎన్ని మతాల్లో ఇంతకన్నా హేయమైనవి జరగడం లేదు? వారిని గురించి అనే సాహసం ఉందా ఓ రచయిత్రీ? కులాల ప్రస్తావనతో కథరాసి మీ లాంటి భావజాలం ఉన్న ఓ నలుగురిచేత ఓహో అనిపించుకునే ప్రయత్నం తప్ప ఈ కథలో ఎం ఉంది? గొడ్డుమాంసం తింటారని ఒక కులాన్ని అవహేళన చేస్తూ ఉంటే వారంతా ఎందుకు ఊరుకున్నారో? ఇప్పుడు అందరూ మానేసిన హరిజన అనే పదాన్ని మళ్ళీ బయటికి తీసి మీ కులాన్ని కించపరిస్తే మీకెవరికీ చీమకుట్టలేదా, వారికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒంటికాలు మీదలేచేవారూ? మహిళలందరికీ తప్పని ఒక విషయాన్ని (అయినా దాని గురించి బయట నలుగురిలోనూ వాల్లే చెప్పుకోరు) ఇంత గలీజుగా రాయడం బాగాలేదు. ఈ రోజుల్లో శంఖచక్రాల ముద్రలు రచయిత్రి చెప్పినంత భయంకరంగా వెయ్యడం లేదు.
    ఏవో ఒకటిరెండు నోరులేని కులాలని ఎద్దేవా చేస్తూ రాసి కాలరు ఎగరేద్దామన్న ఆత్రం తప్ప ఈ కథలో విషయం లేదు. ఇంటి పేరు బట్టి ఈవిడ కూడా బ్రాహ్మణ కులానికే చెందినట్టు కనిపిస్తోంది. బాగు బాగు.

    • శివ రామ్ గారు.. నమస్తే. ఇంటి పేరు బట్టి కులం ఊహించకండి. తంగిరాల అనే ఇంటి పేరు ఉన్నవారు బ్రాహ్మల్లో ఉన్నారు, మాదిగల్లో కూడా ఉన్నారు. కొడాలి ఇంటి పేరు ఉన్నవారు కమ్మలో, మాదిగలో ఉన్నారు. మీరు తొందరపడకండి. ఇంకా మీరు.. ‘ఆ నలుగు రోజుల’ gurinchi maatladakudadu అనే daggare aagipoyaara!! enduku matladakudadu? మీరు, nenu, ee prapanchamlo prati jeevi puttukaki.. moola kaaranam.. stree ki unde bahisraavame!. intha matram science telusane anukuntunna. mari mana puttakaku moolanni enduku matladakudadu? tappenti? oka sahajamaina prakruti siddhamaina kriya patla nirasana undatam ‘galeez’ anipinchatam leda? ina.. ippudu ఆ timelo gudiloki anumatinchalani adigedaaka vacham. bahistu raktamto oka mahila painting vesindi telsaa. మీరు ఇంకా ekkado aagipoyi ఉన్నారు. raasta. ee vishayaala meeda.. asalu ee vihsyala meede.. rasta. baraabar raasta. nakem galeez anipinchaam ledu. ఇక naamala vishayam.. meeku telusa veyinchatam ledani? మీరు chusaara? nenu naa kalla tho chusanu.. kaalchi mudralu veyatam. vesaka ela bobbalu kadataayo naa kallatho chusanu. chinna jeeyar veyistadu. vestadu. migilina matallo కూడా chala murkhatvalu untay. vati gurinchi matladanu ani meeku nenu eppudaina cheppana? nenu em matladagalano, em matladaleno.. meekela telusu? brahmalu, vysyulu chetakani vallu ite.. minority vargam loki vache ‘vaari’ alavatlani.. desam loni andari meeda rudde prayatnam cheyaru. e vishyam meeda meekemanna sandeham unte.. osari newspaper sarigga chudandi. enduku beef festival cheskovalsi vastondo, enduku maharastra lo mamsam nishedhinchaaro.. paper kshunnamga chadavakkarla. headlines chusina, u wil know.

    • “ఏవో ఒకటిరెండు నోరులేని కులాలని ఎద్దేవా చేస్తూ రాసి కాలరు ఎగరేద్దామన్న ఆత్రం తప్ప ఈ కథలో విషయం లేదు.” చాలా చక్కగా చెప్పారు

  22. లిపిజ్వలన says:

    నిజమే కధ కావాలని రాసినట్టుగా ఉ౦ది ఈ కాల పరిస్థితులకు తగ్గట్టు లేదు . మ౦చీ చెడు పాలూ నీరు లాటివి
    పెళ్లికిము౦దె వెజిటేరియన్ అమ్మాయికోసం నాన్వెజ్ ఎగ్ తొ సహా మానేసినవారు నాకు తెలుసు. పెళ్ళయాక భార్యను అపురూపంగా చూసుకున్నవారూ తెలుసు , కుల ప్రసక్తి లెకు౦దా ఒక జీవితం గడిపిన వారు తెలుసు
    ఎ౦దుకిలా ద్వేషాలతో అక్కసు వెళ్లగక్కడం.
    ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకునే ఒక సహకార విధానం. పెళ్ళయాక భర్త మారిపోయాడంటే అమ్మాయి అంచనాలు తప్పు తప్పు దారిన వెళ్లి ఎవరినో ని౦ది౦చదమ్ ఎ౦దుకు?
    కుల మతాల ప్రసక్తి ఉన్న కధలకు చోటివ్వకపోడం ఉత్తమం

    • లిపిజ్వలన గారు.. ఈ కధని కావాలనే రాసాను. కధ రాయటం కంటే ఎం చేయలేక. నామాలు వేసిన వెధవని ఒక్కటి తన్నలేక, పిచి దానిల.. అవన్నీ భరించిన ఆ పిల్లని రెండు చెంపల కొట్టలేక.. ఒక కధ రాసి పారేసాను. చేవలేక. చేతకాక.. ఇది ద్వేషం కాదు.. ఇంతకంటే చేతకానితనం లో కక్కిన.. బాధ. ఇక మీరు అన్న.. ప్రేమ పెళ్ళిళ్ళ వ్యవహారానికి వస్తే.. పెద్ద కష్టం మీకు, నాకు.. ఇద్దరికీ వద్దు. పేపర్ చదివితే.. తెలిసే విషయాల గురించి.. చర్చలు దేనికి? ఒక అణచివేత ఎక్కడ ఉన్న దాని గురించి మాట్లాడాలి.. కులం, మతం, జెండర్, రేస్.. వీటన్నిటి గురించి.. రాయాలి. కధలో, వ్యాసాలో, నవలలో.. రాయాలి, మాట్లాడాలి. తప్పదు.

  23. msk krishnajyothi says:

    రచయిత్రి ఈ కధకి నామాలు అని పేరు ఎందుకు పెట్టారో తెలీలేదు. సమస్య నామాలు కాదు. వైష్ణవం ఆహింసని సమర్ధించే మతం. దాని స్ఫూర్తి తోనే చిప్కో ఉద్యమం పుట్టింది. పచ్చబొట్లు పోడిపించుకున్నట్టు ఇష్టపడి నామాలు వేయించుకుంటారు. అంతేగానీ బలవంతంగా వేయించరు. ప్రదాన పాత్రదారికి బొత్తిగా వెన్నెముక లేదు. మొగుడు కొడుతూ వుంటే పాత కాలం హీరొయిన్లా చానాళ్లు భరించింది. ఇది పూర్తిగా అసాధ్యం. ఈ రోజుల్లో ఓక్క దేబ్బ పడుతూనే నాకు తెలిసి కేసు పెట్టేస్టారు. అల్లుడిని నయానో భయానో దారికి తెచ్చేస్తారు. అంతేగానీ అన్ని తన్నులు తినరు. అదీ వుద్యోగం చేస్తూ.

    • ఓసారి.. చరిత్ర తిరగేస్తే.. ఎం మతాలు ఎం చెప్పాయో.. తెలుస్తుంది. బౌద్ధ, జైన దేవాలయాల మీద.. అచ్చం ఇస్లాం చాందసవాదులు చేసినట్టే చేసిన దాడుల వివరాలు త్తెలుస్తాయ్. కనీసం ఉండవల్లి గుహలకి వెళ్లి చుడండి.. వైష్ణవం ఆహిమ్సాని ప్రబోదిస్తూందో లేదో.. తెలుస్తుంది. ఇక ఆ అమ్మి భరించే విషయం దగ్గరకి వస్తే.. ఆడవాళ్ళు ఇవన్ని భారిచాకపోతే.. ఇన్ని కాపురాలు ఉండవండి. పాత కాలం హీరొయిన్ లు ఇప్పటికి.. మన చుట్టూనే ఉన్నారు. చూడాలి.. అంతే.

      • msk krishnajyothi says:

        నేను ఒక పేరు పొందిన విశ్వా విద్యాలయంలో చరిత్రలో పీ.జీ చాలా ఎక్కువ మార్కులతో(distiction ) పాస్ కావడం పక్కన పెట్టేస్తాను. మతాలలో కొన్ని మంచి విషయాలు వుంట్టాయి. కొన్ని పనికి రాని సంగతులు కూడా. నీ వలెనె నీ పొరుగువారిని ప్రేమించు అని క్రిస్ట్ బోధించాడని మతం చెబుతోంది. కానీ రోమ్ నగర వీధుల్లో తగలdiన శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారు? ట్రినిటీ పేరుతొ అమెరికా వాడు జపాన్ మీద బాంబు ఎందుకు వేశాడు-మతం ఏమి చెప్పింది? తప్పు మతానిద ? మనిషిద ? నీతో విభేదిస్తూ బ్రతికే కన్నా నిన్ను స్వీకరించి ప్రేమిస్తూ జీవించడం నాకు నచ్చుతుంది. ఇలా ఏ మతం చెప్పినా నాకు .. వ్యక్తిగతంగా నాకు నచ్చుతుంది తల్లీ. అంతే గానీ చరిత్ర తవ్వి వాటి లోతుల్లోకి తొంగి చుస్తే అందులోకి జారి పడిపోతాం. చరిత్ర ఒక శిక్షణ. అంతే. వర్తమానంలో మానవ ప్రవర్తన మేరుగుపడాలంటే మనం పాజిటివ్గా మార్పు తీసుకు రావడానికి ప్రయత్నించాలి. కానీ ఎవరు నోచుకునే విధంగా వుందరాదు. సమకాలీన వైష్ణవం ఎవరినీ హింసకి ప్రేరేపించడం లేదుకదా. మరి వైష్ణవ చిహ్నం పేరుతొ ఒక హింసా ప్రవ్రుత్తి గల కుటుంబాన్ని కధకించడం నాకు సరి కాదు అనిపించింది. నాకు అర్థమైనదీ నేను దర్శించినదీ సత్యమా లేక సత్యాన్ని వేరు వేరు వ్యతులు వేరు వేరు రకాలుగా దర్శిస్తున్నారా? నేను ఇక్కడ దేవుని గురించీ మతం గురించీ కాదు రాసింది. తమాషా.. నాది వైష్ణవ మతం కాదు , బ్రంహన కులం కాదు, అయినా నాకు ఎందుకో నామాలని హేళన చేయడం .. ఒకింత తగిలింది.పాత కాలం హెరాయిన్ విషయం వదిలేస్తాను …సమస్య జటిలము అవుతుంది. నా వ్యాఖ్యలో అంతర్గత అంశం వివరించడానికి ప్రస్తుతం నాకు ఇష్టం లేదు. నా విమర్శ నచ్చక పొతే జస్ట్ లీవ్ ఇట్.

  24. p v vijay kumar says:

    contemporary relevance unna story …gud

  25. అజిత్ కుమార్ says:

    ” నామాలు” కథ బాగుంది. కానీ విమర్శకుల విమర్శ బాగాలేదు. సాహిత్యాన్ని గురించి తెలీనివాళ్లు దీనిలో వేలు పెట్టకూడదు. బాగుంది…. ఫరవాలేదు…. వంటి వ్యాఖ్యానం వరకూ మంచిది. ఉదాహరణకు మనకు సంగీతం తెలీక పోయినా గాయని పాటను విని మెచ్చుకోవచ్చు. నాట్యం గురించి తెలీక పోయినా నర్తకి అభినయాన్ని మెచ్చుకోవచ్చు. చిత్రలేఖనం గురించి తెలీకపోయినా చిత్రాలు చూసి ఆనందించవచ్చు. సాహిత్యాన్నివిమర్శించే విషయంలో సాహిత్యం గురించి తెలిసినవారూ, తెలీనివారు అందరూ విమర్శించడానికి అనుకూలంగా ఉంటుంది గనుక ఎక్కువగా విమర్శలు చేస్తుంటారు. అది ఇతర కళలలో అంతగా ఉండదు. ఉదాహరణకు నాట్యాన్ని చూసి అంటే – స్వామి రారా – అనే పాటకు వివిధ రీతులలో తన స్వామిని ఆహ్వానిస్తూ అభినయిస్తుంది. రారా.. అంటూ తొడగొట్టి పిలవలేదే… అని ఎవరూ విమర్శించరు. కథల విషయంలో చులాగ్గా దూకేస్తారు. ఎడాపెడా విమర్శిస్తారు. కథకు ఈ పేరే ఎందుకు పెట్టారు? ఆ అమ్మాయికి శైలజ అనే ఎందుకు పెట్టారు? ‘ ఆ విషయం’ ఎందుకు ప్రస్తావించారు ? మామతం పేరు మాకులం పేరు ఎందుకు చెప్పారు? మరోటి చెప్పొచ్చుగదా… అనే విమర్శలు సాహిత్య విమర్శలు అనిపించుకోవు.గిల్లికజ్జాలు అనవచ్చు. మరొకటి కథలోని సంఘటనలు మనకు తేలికైనవిగా కనిపించడం సహజం. పీత కష్టాలు పీతవి అన్నట్లు. అలాగే రచయితలు కూడా ప్రతి విమర్శకూ అదే స్తాయిలో స్ఫందించాల్సిన అవసరం లేదు. దయచేసి గమనించగలరు.

    • msk krishnajyothi says:

      మాటకి చెబుతా … శ్రీ వైశ్నవుల్లో సుదీర్ అనే పేరు విచిత్రమే! (కాలాన్ని బట్టి వీటిలోనూ మార్పు ఉంటోంది!
      ) పేరు పెట్టడానికి కొన్ని రూల్స్ వుంటాయి-అంటే అమ్మాయి పేరు బేసి సంక్యలో, అబ్బాయి పేరు సరి సంక్యలో — పేరుని పూర్ణ అక్షరంతో ఎండ్ చేస్తారు. ఏ విషయంలోనైన ఎవరి స్థాయిని ఎవరు నిర్ణయించగలరు? సాహిత్యం సినిమా కాదు. ప్రతివాళ్ళు దాని వంక చూడరు. కొంత కావన కండూతి వున్నవాళ్ళు మాత్రమె ఇటు చూస్తారు. ఎలా చూసినా నాది చెప్పుకోదగ్గ స్థాయి కాకపోవచుగానీ …నిజమే…విమర్శలు చెయ్యకూడదు. ఇవేమీ మార్క్ త్వినూ లేదా ఆస్కార్ వైల్డ్ రాసినవి కాదు గాబట్టి ..లోతుకి పోవలసిన అవసరం లేదు. రచయిత్రి ప్రయత్నాన్ని హర్షిస్తున్నాను. ఇక ముందు ఆమెని ఎట్టి పరిస్తితుల్లో విమర్శించనని…!!!టేక్ మై వర్డ్స్ ఈజీ మై డియర్ ఫ్రెండ్.

  26. Rishi Srinivas says:

    పీరియడ్స్ లో ఇంట్లోకి రానివ్వని చాలా కులాల వాళ్ళు నాకు తెలుసు. కులం ప్రస్తావన ఎక్కడా రాకుండా కూడా ఇదే కధను వ్రాసి ఉంటే.. ఆడవాళ్ళను నెలసరి సమయంలో ఇబ్బంది పెడుతున్న అన్ని కులాల వాళ్ళు భుజాలు తడుముకునే వాళ్ళు. అలా కాకుండా బ్రాహ్మణుల్ని మాత్రమే టార్గెట్ చేసి.. వాళ్ళను లేకి వాళ్ళగా, రిజర్వేషన్ వల్ల వచ్చే ఉద్యోగం కోసం పెళ్ళిళ్ళు చేసే కక్కుర్తి వాళ్ళగా, కోడల్ని హింసించే కౄరమైన వాళ్ళగా చిత్రీకరించడం వల్ల మీరు చెప్పాలనుకున్నదేమిటి?

  27. ఇప్పుడు పరిస్థితి ఇలా లేదు అని కథని తప్పుపట్టేవారు ఏలోకంలో వున్నారో గానీ, వాళ్ళనుకుంటున్నట్టు లోకం వుంటే ఎంత బావుండును.

    రాజకీయ నాయకులని చూసి ప్రజలూ అలా తయరవుతున్నారో ఏమో గానీ, ఈ కులాన్నే కథలో ఎందుకు వాడావు ఆ కులాన్ని ఎందుకు వాడలేదు? సుధీర్ అన్న పేరెండుకు పెట్టావు, మగధీర్ అని ఎందుకు పెట్టలేదు? పసిపిల్లాడి పేచీలా వుంది.

    • వెల్ విషర్ says:

      ఈ కథ బలిపీఠమ్ పోలిక ఉంది. రచయిత్రి విమర్శలను పాసిటివ్ గా తీసుకోకుండా నేను ఇలాగే రాస్తాను ఇంకా రాస్తాను అని జవాబివ్వటం పరిణతి లేమి ని సూచిస్తోంది. ఆమె నచ్చినవిధంగా కథలు రాసుకోవచ్చు. కాని చదవటానికి పాఠకులే ఉండరు. నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని మొoడికేస్తే సమీప భవిషత్ లో ఆమేకి నేటి రంగనాయకమ్మ పరిస్థితి ఎదురు కావచ్చు.

  28. Rishi Srinivas says:

    అవును … పసి పిల్లాడి పేచీ లాగే ఉంటుంది . ఎందుకంటే కధను బట్టే పాఠకుడు స్థాయిని తగ్గించుకోవాలి కదా.

  29. చైతన్య గారూ, మీరు రాసిన కథలోని అసమంజసత్వాలని ఎత్తి చూపిస్తేనే మీకు అంత కోపం వచ్చిందే, మరి కావాలని ఒకటి రెండు కులాలను పేరుతో సూచించి, వారిని మూర్ఖులు గా చూపిస్తే వారికి ఇంకెంత కోపం రావాలి. ఎవరి ప్రాపుకోసమో కావాలని ఆ కులాలల్ని నోటికొచ్చినవిధంగా మాట్లాడడం మీ అనుభవ రాహిత్యాన్నీ, మనస్తత్వాన్నీ తేటతెల్లం చేస్తోంది. ఒక రచన పబ్లిక్ లోకి వచ్చాకా దాన్ని విమర్శించే హక్కు చదువరులకు ఉంటుంది. మీరు నన్ను తిట్టారు కాబట్టి ఒళ్ళుమండి ఇంకా రాస్తాను, రాసి పారేస్తాను అంటే నవ్వు వస్తోంది. మీ రాతలతో సమాజాన్ని బాగు చేద్దామనో, పాడు చేద్దామనో మీరు భావిస్తే అది మీ ఇష్టం కాని, వాటిని ఎవ్వరూ పట్టించుకోరు. కాలప్రవాహం లో ఎందరు రాలేదు, పోలేదు మీ లాంటి వాళ్ళు. రాసి పారేస్తే పారేసుకోండి!

  30. సుజన says:

    ఈ కథ ఒకసారి చదివినప్పుడు ఏ కులాన్ని పేరు పెట్టి అనడం కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ చదివాను. కనిపించలేదు. ఒకటి రెండు కులాలను పేరుతో ఎక్కడ సూచించారో చెప్పండి. నేను పొరపాటు పడినా పడచ్చు.
    ఈ కథలో అమ్మాయిది గుండెల్ని పిండేసే అనుభవం. ముసలి అత్త మామలు గదిలో పడుకుంటే వయసులో ఉన్న కొడుకు, కోడలు హాల్లో పడుకోవడం. చర్చ జరిగాల్సింది ఇలాంటి వాటి మీద. కులాల మీద చర్చ జరుగుతోంది.

    • రచయిత్రి కథ లో కులాల ప్రస్తావన తేలేదు కానీ కామెంట్స్ లో బ్రాహ్మణ , వైశ్య కులాల ఇళ్ళల్లో బాధల గురించి ప్రస్తావించారు. ఒక్క కథ తో ఆవిడా సమాజాన్ని ఉద్దరించాను అనుకుంటే మరి ఆదిలాబాద్ లో ఆదివాసుల జీవితాల్లో ఏంటో మార్పును తెచ్చిన జీయర్ స్వామి గారు ఏమనుకోవాలి?వైష్ణవ మతం ఎవరు ఎవరి మీద బలవంతం గా రుద్దరు. దాని మీద కూడా రచయిత్రి ఉండవల్లి గుహల్లో చరిత్ర గురించి కూడా కామెంట్స్ లో ప్రస్తావించారు. చరిత్ర లో చాలా విషయాలు చెప్తారు. తవ్వుకుంటూ పొతే బోలెడు. మౌర్య సామ్రాజ్యం స్థాపన వెనకాల ఉన్న చాణుక్యుడు బ్రాహ్మడే , భారత దేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన గాంధీజీ గారు వైశ్యుడే. మనం ఏ కళ్ళ తో చూస్తే అదే కన్పిస్తుంది లోకం లో మంచైనా చెడైనా. సమాజం లో ఒక్కో చోట ఒక్కో బాధలు ఉంటాయి. అది generalize చేయడం చాల తప్పు. కథ విషయానికి వస్తే , ఆ అమ్మాయి ఆలోచన ఆ అత్తామామలు మొగుడికంటే దారుణం గా ఉంది అంటాను.మనకి తల్లి లా పాలిచ్చే ఆవుని, పొలం దున్ని మనకోసం కష్టపడే పశువు ని చంపి తినడం ‘పండగా’? మొగుడి మీద కోపం తో అలాంటి పండక్కివెళ్తుందా ? సమాజానికి పనికి వచ్చే పని ఏదైనాచేయచ్చు కదా ?

  31. dr.klv prasad says:

    రచయిత/రచయిత్రి ,అనుభవమే కరెక్ట్ అనుకుని కథలు రాసి చదవండి అంటే,ఇక ఎవరూ స్పందించవలసిన
    అవసరం లేదు.కథను చదివి స్పందించడానికి ,పాటకుడు సాహిత్య కారుడై ఉండాల్సిన అవసరం లేదు ,ఒకరి
    అభిప్రాయాన్ని,విమర్శగా తీసుకుని ముక్కులు ఎగపీల్చవలసిన అవసరంకూడా లేదు !!

  32. చక్రి says:

    చక్కని సందేశాత్మక కథ. ప్రేమావేశంలో పెద్దలమాట వినక ఇతరకులాలవాళ్ళని చేసుకుంటే వచ్చే కష్ట నష్ట నిష్టూరాలు బాగా రాశారు. ప్రతికమ్యూనిటికి నమ్మకాలో అపనమ్మకాలో గుడ్డినమ్మకాలో మూర్కపు వ్యవహారాలో ఉంటాయనీ అవేవీ తెలుసుకోక పెళ్ళిదాకా పోరాదనీ యువతకు తెలియచెప్పారు. కులం అంటే, నమ్మకాలూ, ఆచార వవ్యవహారాలూ, ఆహారపు అలవాట్లు మొదలగునవి అనీ… వాటిని త్యాగం చేసి ప్రపంచంలో ఉద్దరించేది లేదనీ , ఏదో కోల్పోయిన బాధతో బతకాల్సిన అక్కరలేదనీ ..సేమ్ కమ్యూనిటి వాళ్ళని చేసుకుంటే ఇలాంటి గొడవలేవీ ఉండవనీ చెప్పకనే చెప్పారు . కుల మతాంతర వివాహాలు ఎక్కడో ఓటి తప్ప పెద్దగా రాణించవనీ, పెళ్ళికి ముందు అటుఏడు తరాలూ ఇటు ఏడు తరాలూ చూ డటం సబబే అని చెప్పినట్టుంది. ఇహ పోతే నాకుతెలిసి మొహానికి పెట్టుకునేవి నామాలు. మీరుచేప్పేదాన్ని ముద్రాధారణ అంటారు. విచిత్రంగా ప్రతి మతంలో ఏదోరూపాన స్వహింస ఉంటుంది. గొడ్డుని బాదినట్టు ఒకరు బాదుకుంటే..బ్లేడులతో రక్తంవచ్చేలా రక్కుకునేది ఒకరు . ఇవన్నీ మనిషి జనం వివిధ ఆటవిక తెగలనించి ఎదిగే పరిణామ క్రమాన్ని సూచిస్తుంటాయి. ఇలాంటికథలు విరివిగా రాసి యువతని జాగ్రుత పరుస్తారని అనుకుంటున్నాను!!

    • సూపర్ గా విశ్లేషించారు!!!!ఇది మాకు తట్టలేదే!

  33. @చక్రి
    బాగా చురకలేశారు. అగ్ర కులాల వాళ్ళని తిడుతూనో, దళితులని సమర్థిస్తూనో,లేదా బొట్టు, జంధ్యం వంటి ఆచారాల్నో సంప్రదాయాల్నో విమర్శిస్తూ రాస్తే అతి త్వరగా గుర్తింపు వస్తుందన్న టెక్నిక్ ని రచయితలు కనిపెట్టారు. అందుకే ఈ తంటాలు. లేదా స్వానుభవంలో చూసిన కుల భేదాల్ని జనరలైజ్ చేస్తూ కథలు సృష్టించడం, అంతటా అదే పరిస్థితి ఉన్నదని నొక్కి వక్కాణించడం. గట్టిగా అడిగితే “ఇది ఫిక్షన్” అని దబాయించడం!

    వీళ్ళంతా ఒకళ్ళకి ఒకళ్లు కోటరీ అనుకుంటా!ఈ పరిస్థితి మారక పోతే వీళ్ళు రాసిందే ముందు తరాలకు సాహిత్యం గా చేరే ప్రమాదం ఉంది

Leave a Reply to prasad Cancel reply

*