తప్పదు రా తమ్ముడూ..

 

“హలో…రేయ్ అన్నయ్యా..నేను ఈ ఉద్యోగం చేయలేను. వదిలేస్తాను..”

“సంతోషం..”

“నిజంగా వదిలేస్తాను రా..వెళ్ళి మా యముడితో చెప్పేస్తాను..”

“రేయ్..రేయ్..ఆగు. ఇదేదో “బరువు తగ్గుతాను, ఉదయం త్వరగా లేస్తాను” అని నువ్వు వారానికొకసారి చెప్పే జోక్ అనుకుని అలా అన్నాను.ఇంతకీ ఏమైంది?”

“ఇక్కడ ఆఫీసులో ఉన్నవాళ్ళంతా సిటీ లో పుట్టి పెరిగిన వాళ్ళు రా..నాతో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు..”

“నువ్వే వెళ్ళి వాళ్ళతో మాట్లాడు..”

“వాళ్ళు మాట్లాడే విషయాలేవీ నాకు తెలీదు. క్రికెట్ గురించో, తెలుగు సినిమాల గురించో అయితే నేను విజృంభించేవాడిని. అవి వాళ్ళుమాట్లాడిచావరు. నేను రిజైన్ చేసేస్తాను..”

“క్రికెట్, తెలుగు సినిమాల గురించి మాట్లాడే వయసు దాటేసావు రా నువ్వు. ఇక రాజకీయాలు, రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాలి.ఇంకొన్నేళ్ళయ్యాక షుగర్, థైరాయిడ్ కి మారిపోవాలి. ఆ తరువాత ఏది మాట్లాడటానికైనా రెడీ గా ఉన్నా..మాటలు వినే మనిషి దొరకడు. సరేలే..ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తే ఇద్దరం డిప్రెషన్ లోకి వెళ్తాం. కాబట్టీ…పిల్ల చేష్టలు మాని, పెద్దవాళ్ళు చర్చించుకునే కష్టాలేమైనా ఉంటే చెప్పు..”

“నా ఫ్రెండ్స్ ఎవ్వరూ ఈ ఊళ్ళో లేరు..”

“ఇదేమైనా పదవ క్లాసు తరువాత ఇంటర్మీడీయేట్ చేరడమనుకున్నావా..ఫ్రెండ్స్ అందరూ కూడబలుక్కుని ఒకే కాలేజ్ లో చేరటానికి? ఇందాకచెప్పాను గా…పిల్ల చేష్టలు ఇక కుదరవు..”

“నన్ను ప్రశాంతంగా భోజనం కూడా చేయనివ్వరు రా. మిగతా సమయాల్లో మాట్లాడరు కాని, భోంచేసేటప్పుడు మాత్రం బలవంతంగా లాక్కెళ్తారు. క్యాంటీన్ కి వెళ్ళాక..అక్కడ అన్నీ పంచుకుని తినాలంటారు. ఈ రోజు నాకు బాగా ఆకలిగా ఉంటే ఫుల్ మీల్స్ తీసుకున్నాను. నాతో పాటు వచ్చిన మిగతా ఏడుగురు ఏడు రకాలు ఆర్డర్ చేసారు. మొత్తానికి నేను ఏమి తిన్నానో తెలుసా? ఒక ముద్ద పప్పు అన్నం, ఒక పీడ్జా ముక్క, నాలుగుఫ్రెంచ్ ఫ్రైస్, రెండు స్పూన్ లు సూప్, అర అంగుళం నూడుల్ తీగ, దోస తో పాటు ఇచ్చే పల్చని పచ్చడి. ఇప్పుడు చెప్పరా..ఇంకా నన్ను ఉద్యోగం చేయమంటావా?”

“ఇలాంటివి ఏ ఉద్యోగానికెళ్ళినా ఉంటాయి రా. పోనీ ఇది మానేసి ఏం చేద్దామని నీ ఆలోచన?”

cartoon

“పొలం దున్నుకుని బతుకుతా..”

“పొలమా? ఏ పొలం?”

“అదే…పొలం కొని..దున్నుకుంటాను..”

“ఆ పొలం కొనే డబ్బే మన దగ్గర ఉండుంటే..నీ కన్నా ముందు నేనే ఉద్యోగానికి రాజీనామా చేసేవాడిని రా నాయనా..కాబట్టీ..పొలం కొనే డబ్బుపోగయ్యాక..ఆ డబ్బు తో ఇల్లు కొని, మళ్ళీ పొలం కొనటానికి డబ్బు పొగయ్యేదాకా ఉద్యోగం చెయ్…అర్థమయ్యిందా?”

“అయితే అప్పటిదాకా ఈ నరకం అనుభవించాల్సిందే నా?”

“కొన్ని కిటుకులు చెబుతాను..రోజూ పాటించు. మంచి ఇంగ్లీషు సినిమాల పేర్లు చెబుతాను..వాటి గురించి వికిపీడియా లో చదువుకుని కొన్నిపాయింట్లు రాసుకో. చేతన్ భగత్ పుస్తకాలు, ఆ నాగుపాముల పుస్తకాల పేరేంటి గుర్తు రావట్లేదు…అవీ..కొని..వాటి వెనకాల అట్ట మీద ఉన్న నవలసారాంశం చదువు. ఆఫీసుకెళ్ళి గంటకొకసారి నువ్వు బట్టీ పట్టిన సినిమాల పేర్లు చెప్పు..ఆ పుస్తకాలు చదివారా అని అడుగు..నాకు తెలిసి మీ టీంలో వాళ్ళెవరూ ఈ టాపిక్ లు దాటి వెళ్ళరు.”

“ఈ ఉద్యోగం లో కొనసాగాలంటే ఇంత నటించాలా? దీని బదులు నేను యాక్టర్ అయితే నెల తిరిగేలోపు నేషనల్ అవార్డు కొట్టేస్తాను..”

“తప్పదు రా తమ్ముడూ..నేను చెప్పిన మార్గం లో వెళ్ళిపో. కొద్ది రోజుల తరువాత నీకే అర్థమైపోతుంది..మనల్ని మనం మోసం చేసుకుని బ్రతకటం ఎంత సులభమో..విజయోస్తు!”

***

IMG_20150831_205034_1

ఇందాక ఇందిరా పార్కు పక్కనున్న కేఫ్ లో చాయ్ తాగుతూ ఉంటే..రోడ్డుకి అటువైపు ఒక పెద్దాయన గోడకున్న పోస్టర్ చూసి కోపంగా “ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ప్రశ్నించే వాడే లేడా?” అని అరుస్తూ కనబడ్డాడు. విషయం కనుక్కుందామని అటు వెళ్ళాను. గోడకున్న పోస్టర్ చూసాను. “కుంకుమ భాగ్య – మధ్యతరగతి మగువ మనోభావం” అని రాసుంది. కొత్త డబ్బింగు సీరియల్ అనుకుంటా. ఆ టైటిల్ కి, ఆ క్యాప్షన్ కి అర్థమేంటని ఆ పెద్దాయన ఆవేదన కాబోలు. ఆ పోస్టర్ మళ్ళీ చూసాను. రానున్న 300 ఎపిసోడ్ల కథ అర్థమైపోయింది. ఆయన్ని ఓదార్చటానికి కూడా ప్రయత్నించలేదు. మరో ఇద్దరు వచ్చారు. అందరూ కలిసి ఆ పోస్టర్ చించే లోపు ఫొటో తీసాను. ఇప్పుడు మనం ప్రపంచ యుధ్ధం ఫొటోలు చూసి ఆ సమయంలో జనం అనుభవించిన బాధ గురించి మాట్లాడుకున్నట్టు..ఒక యాభై సంవత్సరాల తరువాత నేను తీసిన ఈ ఫొటోను గురించి చర్చించుకుంటారు.

***

facts-about-mosquito-bites-the-truth-and-myths

“ఆరుబయట..పున్నమి చంద్రుడు..చల్ల గాలి..ఆహా..” అని జీవితాన్ని రొమాంటిసైజ్ చేద్దామనుకుంటుండగా..చేతికి చిక్కకుండా చెవి దగ్గర చేరి “గుయ్య్” అని నస పెడుతున్న దోమ..”ఇంట్లో మస్కిటో రిపెలెంట్ లేదు..దోమల వల్ల రాత్రి నిద్ర పట్టకపోతే ఉదయం ఆలస్యంగా లేస్తావు..ట్రాఫిక్ లో ఇరుక్కుపోతావు..” అని గుర్తు చేసి జుగుప్త్స కలిగించే రియాలిటీ లోకి లాగేసింది.

(మళ్ళీ వచ్చే  గురువారం…)

మీ మాటలు

  1. మణి వడ్లమాని says:

    భలే గా ఉంది సిద్దార్ధ! ఇంటరెస్టింగ్ కూడా ఉంది. అవును తప్పదు .ఈ చిన్న జీవితం లోఎన్నో ఎన్నెన్నో సర్దుబాట్లు.పోటి లో అర సెకను కూడా ఏమరుపాటు కూడదు

  2. తహిరో says:

    చూడ్డానికి అంత సీరియస్ ముఖం తో ఉన్నారు – కడుపులో విశ్వమంత సెన్సాఫ్ హ్యూమర్ ని ఎలా దాచుకున్నారండి బాబూ :)

  3. ఈ హ్యూమర్ నాకు అంత త్వరగా జీర్ణం కాదు. ఇంతకీ ఆ పోస్టర్ నిజమేనా? అదేంటో కన్నడ టైటిల్లా వుంది.

    • పవన్ సంతోష్ says:

      ఆ టైటిల్ మీకెంత ఆశ్చర్యంగా తోస్తోందో నేను అర్థం చేసుకోగలను.. దాన్ని మొన్న చూసినప్పుడు అలా ఆశ్చర్యపడ్డాను కాబట్టి. కానీ అది నిజ్జంగా నిజం.

  4. Mythili Abbaraju says:

    ” ఇప్పుడు మనం ప్రపంచ యుధ్ధం ఫొటోలు చూసి ఆ సమయంలో జనం అనుభవించిన బాధ గురించి మాట్లాడుకున్నట్టు..ఒక యాభై సంవత్సరాల తరువాత నేను తీసిన ఈ ఫొటోను గురించి చర్చించుకుంటారు.” – బ్రహ్మాండం …ఇప్పుడే చదివి తెగ నవ్వుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అండీ .

  5. sr musunuri says:

    మీ కురుక్షేత్ర సైనికుడి డైరీ ఏమయ్యిందండీ

  6. “కుంకుమ భాగ్య – మధ్యతరగతి మగువ మనోభావం”

    కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి …అంత నవ్వాను -ఎన్ని రోజులైందో

  7. చందు తులసి says:

    నాకు ఆ సీరియల్ కు ఆ పేరెందుకు పెట్టారో అర్థం
    కావడంలా …..తెలుగు భాషను నానాభ్రష్టు పట్టించిన అనువాద సీరియళ్ళ బ్యాచ్ ఆఖరికీ ఇలా తెగపడ్డారన్న మాట. తెలుగు భాషా సంఘం వాళ్ళకెమైనా ఫిర్యాదు చేస్తే పట్టించుకుంటారా..?
    మనోభావాలు దెబ్బ తీసినందుకు కేసు పెట్టవచ్చా ?

Leave a Reply to Mythili Abbaraju Cancel reply

*