దిగంబర కవులను మరిచిపోయేంత మారామా?

 

గతాన్ని చదువుకుని, దానితో వర్తమానాన్ని పోల్చుకుంటూ గతానికీ వర్తమానానికీ మధ్య ఉండే అవినాభావ సంబంధం గురించి సిద్ధాంతరీత్యా తెలిసిఉండడం ఒక ఎత్తు. ఆ సంబంధాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్న ఘటనలనూ దృశ్యాలనూ పరిణామాలనూ ప్రతిక్షణమూ అనుభవిస్తూ గతవర్తమానాల అవిభాజ్యతను గుర్తించడం మరొక ఎత్తు. వర్తమానం ఒక సూచన చేస్తుంటే, గతంలో అటువంటి సూచనే ఉండిందని గుర్తింపు కూడ రాకపోవడం మరొక ఎత్తు. తెలుగు సమాజం నిరంతర గతంలో జీవిస్తున్నదనీ, మార్పు అనుకుంటున్నదేదీ రూపంలో మార్పే తప్ప సారంలో మార్పు కాదనీ చూపడానికి ఎన్నో ఆధారాలుండగా, పాత అవ్యవస్థే రంగు మార్చుకుని కొనసాగుతుండగా, కనీసం ఆ అవ్యవస్థ మీద గతం ప్రకటించిన ఆగ్రహాన్ని ఇవాళ గుర్తు చేసుకోవడానికి కూడ శక్తి లేకుండా ఉన్నదనీ చూడడం ఆసక్తికరం కన్న ఎక్కువగా విచారకరం.

సమాజం నిలువనీటి గుంట అయిందనీ, దీన్ని ధిక్కరించాలనీ, ఛీత్కరించాలనీ తెలుగునాట కోపోద్రిక్త యువతరపు అసంతృప్తికీ, ఆగ్రహానికీ ప్రతిఫలనంగా దిగంబరకవులు (నగ్నముని – మానేపల్లి హృషీ కేశవరావు, నిఖిలేశ్వర్ – కె యాదవరెడ్డి, జ్వాలాముఖి – ఆకారం వీరవెల్లి రాఘవాచార్యులు, చెరబండరాజు – బద్దం భాస్కర రెడ్డి, భైరవయ్య – మన్మోహన్ సహాయ్, మహాస్వప్న – కమ్మిశెట్టి వెంకటేశ్వర రావు) పొలికేక వేసి ఈ మే 6 కు సరిగ్గా యాబై సంవత్సరాలు నిండాయి. ఆరుగురు దిగంబర కవుల్లో చెరబండరాజు (1944-1982), జ్వాలాముఖి (1938-2008) మరణించారు. నగ్నముని (1939), నిఖిలేశ్వర్ (?), భైరవయ్య (1942), మహాస్వప్న (1940?) ఇంకా మనమధ్యనే ఉన్నారు. తెలుగు సమాజ సాహిత్యాల్లో దిగంబర కవుల ప్రాధాన్యత గురించి ఆలోచనాపరుల్లో తగినంత స్పృహ ఉంది. అయినా అర్ధ శతాబ్ది నిండిన సందర్భంగా ఉత్సవమో, జ్ఞాపకమో, గుర్తింపో ఎక్కడా జరిగినట్టు లేదు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ రచనలు కూడ పెద్దగా వచ్చినట్టు లేదు.

దిగంబర కవుల ఆవిర్భావం జరిగి యాబై ఏళ్లయిందని మనం ఇవాళ గుర్తు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా, మొత్తంగా దిగంబర కవులు తెలుగు సమాజం మీదా, సాహిత్యం మీద వేసిన ప్రభావం అపారమైనది. దాన్ని చారిత్రక సందర్భంగానైనా మననం చేసుకోకతప్పదు. వాళ్లు వేసిన ప్రశ్నలూ, వాళ్ల విశ్లేషణలూ కొన్ని ఇవాళ్టికీ సంబద్ధతను కోల్పోలేదు సరిగదా బహుశా మరింత ఎక్కువ సంబద్ధంగా ఉన్నాయెమోననిపిస్తున్నది.

‘ఇతి శాసనమ్’ అనే శీర్షికతో “దిగంబర శకం నగ్ననామ సంవత్సరం ఆశ రుతువు (సరిగ్గా క్రీ.శ. 1965 మే) న ఆంధ్రప్రదేశ్ రాజధానీ నగరం హైదరాబాద్ లో ప్రప్రథమంగా తాము దిగంబరకవులమని ప్రకటిస్తూ ఈ ప్రాపంచిక ఆచ్ఛాదనల్ని చీల్చుకుని కొత్తరక్తాన్ని ఇంజెక్ట్ చెయ్యడానికొస్తున్న నగ్నముని నిఖిలేశ్వర్ జ్వాలాముఖి చెరబండరాజు భైరవయ్య మహాస్వప్నల గుండెల్లోంచి ధైర్యంగా స్థైర్యంగా దూసుకొచ్చిన కేకల్ని ఈ పేజీల్లో పట్టుకోడానికి ప్రయత్నించిన దిగంబర కవితా ప్రచురణ సమర్పణ” అనే ప్రకటనతో దిగంబర కవులు తమ మొదటి సంపుటాన్ని వెలువరించారు. ఆ సంపుటాన్ని మే 6 అర్ధరాత్రి (దిగంబర కవులు జీరో అవర్ అన్నారు) హైదరాబాద్ ఆబిడ్స్ చౌరస్తాలో నాంపల్లి పాండు అనే రిక్షావాలా ఆవిష్కరించారు.

మంటలు మాట్లాడినట్టు రాసిన ‘దిగంబరశకంలోకి’ అనే ముందుమాట అర్ధశతాబ్ది తర్వాత చదువుతుంటే ఒకటి రెండు చోట్ల మినహా ఇవాళ్టి గురించి రాసినట్టే ఉంటుంది.

“కీర్తి, డబ్బు, యినప బూట్ల క్రిందపడి నలిగి కొనవూపిరితో గిలగిలా కొట్టుకుంటున్న మీ అసలు స్వరూపాన్ని ఎన్నడైనా, ఒక్కనాడైనా చూసుకున్నారా?

మీరు జీవిస్తున్నది మీ జీవితం కాదు. మీ ముసుగు – నటన జీవితం. అధికార జీవితం. డబ్బు జీవితం, గౌరవ జీవితం. వాటికోసం పడిచచ్చి వాటికోసం ఏదయినా సరే, చివరికి మిమ్మల్ని సైతం చంపుకునే దిక్కుమాలిన జీవితం.

ఏం, ఈ ముసుగు లేకపొతేనేం? స్వేచ్ఛగా అసలు స్వరూపంతో బతకడానికి యత్నిస్తేనేం?” అని యాబై ఏళ్ల కింద వాళ్లు చేసిన నిర్ధారణలు, వేసిన ప్రశ్నలు ఇవాళ్టికీ ప్రతిధ్వనిస్తున్నాయి.

మొదటి సంపుటం తర్వాత ఏడాదిన్నరకు దిగంబర కవుల రెండో సంపుటం వెలువడింది. మొదటి సంపుటం లోనే తాము రాసే ప్రక్రియను వచన కవిత అనే పేరుతో పిలవడం తమకు ఇష్టం లేదని, దానికి దిక్ అనే కొత్త పేరు పెడుతున్నామనీ ప్రకటించిన దిగంబర కవులు రెండో సంపుటానికి ‘దిక్ లు 30’ అనే శీర్షిక పెట్టారు. “దిగంబర శకం నిఖిలేశ్వర నామ సంవత్సరం మదిర రుతువు (సరిగ్గా క్రీ.శ. 1966 డిసెంబర్) లో ఇంకా భయం భయంగా బానిసత్వంగా దుర్భరంగా హేయంగా ఛండాలంగా ఉన్న ఆంధ్రదేశమనే మురిగ్గుంటలోంచి నగ్నముని నిఖిలేశ్వర్ జ్వాలాముఖి చెరబండరాజు భైరవయ్య మహాస్వప్నలు పలికిన కవిత దిగంబర కవితా ప్రచురణ సమర్పిస్తున్నది” అంటూ వెలువడిన ఈ సంపుటాన్ని విజయవాడ గవర్నర్ పేట సెంటర్ లో డిసెంబర్ 18 జీరో అవర్ లో జంగాల చిట్టి అనే హోటల్ క్లీనర్ ఆవిష్కరించారు.

ఆ తర్వాత ఇరవై నెలలకు, “నేటి ‘కుష్ఠు వ్యవస్థ’ పై దిగంబర కవులు సంపుటి 3” వెలువడింది. “ప్రజల అవిద్యని అజ్ఞానాన్ని అశక్తతని దోచుకు తినడం మరిగిన పరిపాలకులు, సంఘంలోని వివిధ వర్గాల వాళ్లు నేడు ప్రజలపై రుద్దుతున్న ‘కుష్ఠు వ్యవస్థ’ ని ఎదుర్కొంటూ దిగంబర కవులు పలికిన దిక్ లను జ్వాలా నామ సంవత్సరం అశ్రు రుతువు (సరిగ్గా క్రీ.శ. 1968 సెప్టెంబర్) లో దిగంబర కవితా ప్రచురణ వినిపిస్తున్నది” అంటూ వెలువడిన ఈ సంపుటిని “ఈ ‘కుష్ఠు వ్యవస్థ’ ఫలితంగా బిచ్చగత్తెగా మారి దుర్భరంగా బతుకుతున్న ఎడమనూరి యశోద (వయస్సు 20 సం.) విశాఖపట్నం, లక్ష్మీ టాకీస్ సెంటర్ లో 14.9.68 రాత్రి 12 గంటలకి” ఆవిష్కరించింది అని దిగంబర కవుల మూడో సంపుటిలో అతికించిన చిన్న వివరణ చెపుతుండగా, సాహిత్య చరిత్రకారులు కొందరు ఆమెను “వేశ్య” అని ప్రస్తావించారు.

digambara kavulu-3a

దిగంబర కవులు తమ కవిత్వం ద్వారా మాత్రమే కాక, పేర్లు, ప్రకటనలు, ఆవిష్కరణలు, ఆవిష్కరణ సమయాల ద్వారా కూడ సంచలనం సృష్టించారు. సమాజంలో, సాహిత్యలోకంలో దిగ్భ్రాంతిని కలిగించారు. సమకాలీన యువతరంలోని అశాంతినీ, అసంతృప్తినీ తమ కోపోద్రిక్త, ధర్మాగ్రహ అభివ్యక్తిలో ప్రతిఫలించి, యువతరం నుంచి అశేష ఆదరాభిమానాన్ని చూరగొన్నారు. వలస పాలన ముగిసి స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడిందని రాజకీయ నాయకత్వం ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ, ఒక తరం జీవితకాలం గడుస్తున్నప్పటికీ వలసవ్యతిరేక ప్రజా ఉద్యమ ఆకాంక్షలలో ఏ ఒక్కటీ ఫలించకపోవడం ఒకవైపు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణ (1951), ఆంధ్ర రాష్ట్ర ఉప ఎన్నికలలో కమ్యూనిస్టుల పరాజయం (1955), సోవియట్ కమ్యూనిస్టు పార్టీ ఇరవయో కాంగ్రెస్ లో నికిటా కృశ్చెవ్ శాంతియుత పరివర్తనా సిద్ధాంతంతో వర్గపోరాటానికి ప్రకటించిన సెలవు (1956), ఎన్నికల ద్వారా ఏర్పడిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వ పాలన ఇరవై ఏడు నెలల ముచ్చట అయి రద్దయిపోవడం (1957-59) వంటి పరిణామాలు మరొకవైపు సమాజాన్ని నిర్లిప్తతలోకీ, స్తబ్దతలోకీ నెట్టాయి. అలా నిరాశలో నిరుత్సాహంలో కూరుకుపోతున్న యువతరంలో, ప్రగతిశీల శక్తులలో, పోరాట స్ఫూర్తిని కొనసాగించాలనుకున్న శక్తులలో దిగంబరకవుల పెనుకేకలు ఆనందాన్ని నింపాయి. అటువంటి శక్తులన్నీ నిరభ్యంతరంగానో, కొన్ని అభ్యంతరాలతోనో దిగంబరకవులను ఆహ్వానించాయి. మరొకవైపు దిగంబరకవుల కవిత్వం, ప్రకటనలు వ్యవస్థా సమర్థకులకూ సాహిత్య పీఠాధిపతులకూ మర్యాదస్తులైన సాహిత్యకారులకూ సమానంగా ఆగ్రహం కూడ కలిగించాయి.

దిగంబరకవులు తన ప్రశంస, సిఫారసు, విమర్శ, నింద అవసరమైన స్థితిలో లేరనీ, వాళ్ల కవిత్వాన్ని తాను ఇంగ్లిషులోకి అనువదించి ధైర్యం ఉన్న ప్రచురణకర్త ఉంటే ప్రచురించదలచానని శ్రీశ్రీ రాశారు. పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యాక దిగంబర కవులను విమర్శించేవారికి శ్రీశ్రీయే చాల చోట్ల జవాబు చెప్పారు. “అభ్యుదయ కవిత్వం ఆంధ్రదేశంలో తన పాత్ర నిర్వహించి తెరవెనక్కి తప్పుకుంది. ఇప్పుడు కొత్త శక్తులు పెరుగుతున్నాయి. కొత్త మంటలు రగులుతున్నాయి. అభ్యుదయ కవిత్వం ఇప్పుడు వెస్టెడ్ ఇంటరెస్ట్ కాకూడదు. ఇవాళ రాస్తున్నవాళ్లు దిగంబరకవులు, తిరుగబడు కవులు, సంఘర్షణ కవులు. చేతనైతే వాళ్లకి చేయూతనివ్వండి, లేకపోతే నోరు ముయ్యండి” అని శ్రీశ్రీ రాశారు. “దిగంబర కవులు ఈ ద్వేషాన్ని ప్రజలలో పుట్టించడం అవసరం” అని కొడవటిగంటి కుటుంబరావు అన్నారు. “నెగెటివ్ గానే సంఘాన్ని విమర్శిస్తూ ఉండిన దిగంబర కవులు పాఠకలోకానికి విద్యుచ్ఛికిత్స చేయడంలో కృతార్థులయ్యారు. గండ్రగొడ్డళ్లలా అవినీతిమీద విరుచుకుపడ్డారు. వాళ్ల కోపం ఉన్మాదానికి గల తీవ్రతను సంతరించుకొంది” అని కె వి రమణారెడ్డి అన్నారు. “కూచిమంచి జగ్గకవి తిట్టు కవిత్వం చదివినప్పుడు కవికి కోపం వచ్చిందని పాఠకుడికి తెలుస్తుంది. దిగంబర కవిత్వం చదివినప్పుడు పాఠకుడికి కోపం వస్తుంది” అని వెల్చేరు నారాయణ రావు అన్నారు. “సాహిత్య రంగంలో ఏర్పడిన స్తబ్దత, సమకాలీన జీవితంలో కొట్టవచ్చినట్టు కనిపించే అక్రమాలు, అన్యాయాలు, పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ, వీటన్నిటిలో నుండి పుట్టిన విపరీత ధోరణిగల ఉద్యమం దిగంబర కవితోద్యమం” అని పురాణం సుబ్రహ్మణ్య శర్మ అన్నారు.

మరొకవైపు, “దిగంబర కవితోద్యమం తాటాకు మంట. ఎలా వచ్చిందో అలా పోతుంది” అని విశ్వనాథ సత్యనారాయణ అన్నారు. దిగంబర కవులను చాల తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోమసుందర్ వారి మొదటి సంపుటం ఆవిష్కరణ రోజే పిఠాపురం నుంచి ఉత్తరం రాస్తూ “…ఆవిష్కరణోత్సవం కవితా బహిష్కరణోత్సవంగా శ్రాద్ధయోగంగా జరుగుతుందని ఆశిస్తాను. ఈ ఆరుగురు కవులూ ఈ రాత్రి జీరో అవర్సు నుంచి ప్రారంభించి దిగంబరులుగానే సమాజంలో మసులుతారని కూడా నేనూహిస్తున్నాను… మీకు నా బట్ట విప్పిన అభినందనలు” అని రాశారు.  “మంత్రిని పిలవడం స్నాబరీ లేక స్లేవరీ. రిక్షావాణ్ని పిలవడం ఒక పోజు లేకపోతే ఓ రకమైన ఆత్మవంచన” అని తిలక్ అన్నారు. “దిగంబరకవులకు ఏ కోశానా భావుకత్వం లేదు. కవిత్వం రాయడం బొత్తిగా చేతకాదు. వచనం రాయడం, గేయం రాయడం చేతకాని వాళ్లందరూ వచనగేయం రాసినట్టే వీళ్లు వచనగేయం రాసినారు. కాని లిటరరీ లంపెన్ ప్రొలిటేరియట్ గనక వాళ్లు వచనగేయం అనకుండా ‘దిక్ లు’ అన్నారు. ఈ లిటరరీ అండర్ వరల్డ్ సాహిత్య రౌడీలు కనిపించినవాళ్లనందరినీ బూతులు తిట్టినారు. సమాజంలో పీడకులను వంచకులను మాత్రమే కాదు వాళ్లు తిట్టింది. సకల రాజకీయ పార్టీలను తిట్టి పీడిత జన కార్మిక జన పక్షపాతం వహించే పార్టీలను కూడా తిట్టినారు. గత వెయ్యి సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రలో ఇంత నీచమైన కుసంస్కారపు రచన మనకెప్పుడూ రాలేదు” అని రాచమల్లు రామచంద్రారెడ్డి అన్నారు. “సమాజం ఎంత చెడిపోయినా దిగంబరకవులది కవిత్వం అనుకునేంత చెడిపోయిందా” అని కూడ రారా ప్రశ్నించారు.

అటు పూర్తిగా ప్రశంసో, ఇటు పూర్తిగా తృణీకారమో కాక మధ్యే మార్గంగా గుణాన్నీ దోషాన్నీ చూసినవాళ్లు కూడ ఉన్నారు.

digambara kavulu-3

ఈ చర్చోపచర్చలన్నీ ఎలా ఉన్నప్పటికీ దిగంబర కవులు తెలుగు సమాజానికీ, సాహిత్యనికీ ఇవ్వదలచిన షాక్ ట్రీట్ మెంట్ పని చేసింది. లేదా, తెలుగు సమాజ సాహిత్యాలు అప్పటికి ఒక షాక్ ట్రీట్ మెంట్ అవసరమైన దుర్భర అనారోగ్యంతో ఉండి దిగంబరకవుల ఆవిర్భావానికి కారణమయ్యాయి.

దిగంబర కవుల సంచలనాన్నీ, కవిత్వాన్నీ అర్ధశతాబ్ది తర్వాత నిర్మమంగా పరిశీలిస్తే వాటిలో వస్తుగతంగానూ, వాటి ఫలితాల రీత్యానూ గణనీయమైన సానుకూలాంశాలు కనబడతాయి. సాహిత్య సంప్రదాయం నుంచి చూసినప్పుడు భాషా ప్రయోగం, తీవ్రత వంటి అంశాలు, స్త్రీలను అవమానించే సాంప్రదాయిక పురుషాహంకార పదప్రయోగాలు ప్రతికూలాంశాలుగా కనబడినా అవి సాధించదలచిన, సాధించిన ప్రయోజనం దృష్ట్యా, ఆ కాలపు అవగాహన పరిమితుల దృష్ట్యా అభ్యంతరకరమైనవి కావనీ, అర్థం చేసుకోవలసినవనీ అనిపిస్తుంది.

కొనసాగుతున్న అన్ని విలువలనూ ప్రశ్నించడం అనేది దిగంబర కవుల ప్రధానాంశం. నిజంగా వలస పాలన అనంతరం ఇరవై సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క సామాజిక రాజకీయ సాంస్కృతిక అంశంలోనూ మార్పు లేకపోవడం, వలస పాలనా కాలపు దుస్థితి మరింత పెరుగుతూ ఉండడం అన్ని విలువల్నీ ప్రశ్నించే ఆగ్రహావేశాల్ని ప్రేరేపించకపోతే ఆశ్చర్యపోవాలి గాని ప్రేరేపించినందుకు కాదు. ఆ ఆగ్రహం నుంచే దిగంబర కవులు ఆచ్ఛాదనలన్నిటినీ తొలగించాలనుకున్నారు. తమ పేర్లు మార్చుకున్నారు. ఆశ్చర్యం కలిగించే, కొట్టవచ్చినట్టు కనిపించే పేర్లు పెట్టుకున్నారు. కాలమానాన్ని, కాలానికి అప్పటిదాకా సమాజం ఇచ్చిన పేర్లను మార్చదలచారు. తమ పేర్ల మీదనే సంవత్సరాలను, ఆశ, తపన, అశ్రు, మదిర, విరహ, విషాద రుతువులను, స్నేహ, విశృంఖల, క్రాంతి, సృజన, వికాస, అనంత వారాలను సృష్టించారు. ఏ వస్తువు చెపుతున్నారనేదానితో సంబంధం లేకుండా వచన కవిత ఒక ఉద్యమంగా మారి, వచన కవితను ప్రచారం చేయడానికి ఒక సంస్థ ఏర్పడిన వాతావరణంలో తమ రచనాప్రక్రియను వచనకవిత అనే పేరుతో పిలవడానికి నిరాకరించారు. దిక్ అనే కొత్త పేరు పెట్టారు. అప్పటిదాకా సాగుతున్న పూలదండల, శాలువాల, సన్మానాల, పరస్పర ప్రశంసల, వందిమాగధ భజనల పుస్తకావిష్కరణల సంప్రదాయాన్ని తిరస్కరించదలచారు. ఆవిష్కరించిన మూడు సంపుటాలనూ మూడు ప్రధాన పట్టణాలలో జీరో అవర్ లో, రిక్షావాలాతో, హోటల్ క్లీనర్ తో, బిచ్చగత్తె (వేశ్య) తో ఆవిష్కరింపజేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవస్థ మీద తమ తిరస్కారాన్ని, కసిని, ధిక్కారాన్ని అనేక రూపాలలో, అనేక వ్యక్తీకరణలలో ప్రకటించదలచారు. బుద్ధిజీవులను తనలోకి లాగేసుకుంటున్న, కొనేస్తున్న, మౌనంలోకి నెడుతున్న వ్యవస్థను చీల్చి చెండాడదలచారు. కొనసాగుతున్న విలువలను, యథాస్థితిని ధిక్కరించదలచారు. ఆ పనులను మూడు సంపుటాల కవిత్వంతోనూ, రాష్టవ్యాప్తంగా కవితా పఠనం తోనూ, ఉపన్యాసం తోనూ విజయవంతంగా నిర్వహించారు.

నిజానికి దిగంబరకవుల ఆవిర్భావానికి దారి తీసిన సామాజిక రాజకీయ సాంస్కృతిక నేపథ్యాన్నీ, వాళ్ల కృషినీ, దాని పర్యవసానాలనూ తెలుగు సమాజం ఇంకా పూర్తిగా విశ్లేషించలేదనీ, విశ్లేషించినంత మేరకైనా సంలీనం చేసుకోలేదనీ అనిపిస్తుంది. ఒకరకంగా యథాస్థితిమీద తీవ్ర విమర్శతో, కోపావేశాలతో సర్వ విధ్వంసకవాదులుగా, నిహిలిస్టులుగా మొదలైన దిగంబరకవులు రెండో సంపుటం నాటికి విధ్వంసం ఒక్కటే సరిపోదనీ, ప్రత్యామ్నాయ నిర్మాణ ఆలోచనలు కావాలనీ అవగాహనకు వచ్చారు. మూడో సంపుటం నాటికి ఆ అవగాహన ఇంకా స్పష్టతను సంతరించుకుంది. మూడు సంపుటాలనూ కలిపి మార్చ్ 1971లో ఎమెస్కో ప్రచురించిన సమగ్ర సంకలనంలోని కవితలను వరుసగా చదివితే వాళ్ల అవగాహనలలో క్రమానుగత పరిణామం, కొందరి కవితలలో గుణాత్మక పరిణామం కూడ కనబడుతుంది. బహుశా ఏ చరిత్ర వాళ్ల ఆవిర్భావానికీ, కవిత్వానికీ, సంచలనానికీ కారణమయిందో, ఆ చరిత్ర గమనమే వాళ్ల గురించి చర్చను కూడ పక్కన పెట్టే స్థితి కల్పించినట్టుంది.

దిగంబర కవులు విశాఖపట్నంలో 1968 సెప్టెంబర్ లో తమ మూడో సంపుటం ఆవిష్కరించారు. అప్పటికే శ్రీకాకుళ విప్లవోద్యమం నక్సల్బరీ పంథాలోకి మళ్లింది. విశాఖపట్నానికి ఆ వేడి తగులుతున్నది. ఆ సంపుటంలోని చెరబండరాజు ‘వందేమాతరం’ గాని, ‘యాభై కోట్ల మంటలు’ కవితలో “యాబై కోట్ల కంఠాలు తిరుగుబాటు మంటలుగా మారాలి” అనే పాదాలు గాని ఆ పోరాట వాతావరణానికి స్పష్టాస్పష్ట ప్రతిఫలనాలే. ఆ విశాఖపట్నంలోనే మరొక ఏడాది తర్వాత, 1970 ఫిబ్రవరి 1న శ్రీశ్రీ అరవయ్యో పుట్టినరోజు జరిగింది. మామూలుగా సన్మానాలను వ్యతిరేకించేవాళ్లు గనుక దిగంబరకవులు దానికి వెళతామని అనలేదు. కాని అంతకుముందు కటక్ లో జరిగిన సభకు వెళ్లి వెనక్కి తిరిగి వస్తూ జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ లు విశాఖపట్నంలో ఆగి ఆ సభలో పాల్గొన్నారు. ఆ సభలో ‘రచయితలారా మీరెటువైపు’ అని ఎలుగెత్తిన సవాల్ కు ఆ ఇద్దరూ సానుకూలమైన జవాబు ఇచ్చారు. అప్పటికే భైరవయ్య, మహాస్వప్నలు మిగిలిన నలుగురితో విభేదిస్తున్నారు గనుక వాళ్లిద్దరూ విడిగా ఉండిపోయినా నలుగురు దిగంబరకవులూ 1970 జూలై 4 ఉదయాన ఏర్పడిన విప్లవ రచయితల సంఘంలో భాగమయ్యారు. నాలుగు సంవత్సరాల తర్వాత జ్వాలాముఖి, నిఖిలేశ్వర్ విరసం నుంచి బైటికి వచ్చి జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య స్థాపించారు. నగ్నముని 1979లో విరసం నుంచి వైదొలిగారు. చెరబండరాజు 1982 జూలై 2న బ్రెయిన్ ట్యూమర్ తో మరణించేదాకా విరసంలో కొనసాగారు. భైరవయ్య, మహాస్వప్న కూడ దిగంబర కవిత్వ సంప్రదాయాన్ని కొనసాగించలేదు. వ్యవస్థ మీద అంత ధిక్కారాన్ని, ఆగ్రహాన్ని ప్రకటించిన దిగంబర కవులలో కొందరు తాము విమర్శించిన, ఈసడించుకున్న సన్మానాల, రాజీల, శాలువాల, పరస్పర ప్రశంసల, మొహమాటాల సంస్కృతికి కూడ లొంగిపోయారు.

కాని వ్యక్తులుగా వాళ్లు ఏమైనప్పటికీ, వాళ్లు ప్రారంభించిన, వాళ్లు స్థిరపరచిన వ్యవస్థా ధిక్కార ధోరణులకు, న్యాయమైన ఆగ్రహానికి, కోపోద్రిక్త అభివ్యక్తికి ఎప్పటికీ కాలం చెల్లదు. ఆ గతం ఎప్పటికీ వర్తమానమే. ఆగతానికి కూడ మార్గదర్శకమే. మరీ ముఖ్యంగా దిగంబర కవులు అసహ్యించుకున్న, తిరస్కరించిన సామాజిక, సాహిత్య ధోరణులు మళ్లీ ఒకసారి మనమధ్య కోరలు చాస్తున్నప్పుడు, మళ్లీ ఒకసారి సాహిత్యలోకంలోకి సాహిత్యేతర కృతిభర్తలు ప్రవేశిస్తున్నప్పుడు దిగంబరకవులను తలచుకోవడం అత్యవసరం. మనమింకా వాళ్లను మరిచిపోయేంతగా మారలేదు.

 • ఎన్ వేణుగోపాల్

మీ మాటలు

 1. బాగుంది నేను దిగంబర కవిత్వం గురించి ఎవరూ రాయలేదు అనుకుంటున్నాను.
  .

 2. dr makkena sreenu says:

  వేణు గోపాల్ గారు మీ వ్యాసం బాగుంది . నిఖిలేశ్వర్ గారి జననం 1938, వీరవల్లి గ్రామం , నల్లగొండ 1965 నుండి 70 వరకు దిగంబర కవిత్వోద్యమం….. ఈ వ్యాసంలోని ఆయన పక్కనే వున్నా బ్రాకెట్టును చూసి ఈ విషయం తెలియపరచాను .. చెయ్యి ఊరుకోక అంతే …. మీకు అభినందనలు

  • N Venugopal says:

   డా. మక్కెన శ్రీను గారూ,

   ధన్యవాదాలు. దిగంబరకవులు సంపుటంలో ఆ ఆరుగురి పరిచయాలు రాశారు. వాటిలో నిఖిలేశ్వర్ గారి పుట్టిన సంవత్సరం వేయలేదు. చెరబండరాజు ది కూడ తెలియదని రాశారు గాని, ఆ తర్వాత రచనల్లో ఆయన పుట్టిన సంవత్సరం నమోదయింది. నిఖిల్ ది కూడ మరెక్కడయినా నమోదు అయిందేమో. నేను చూడలేదు. ఆ లోటు పూరించినందుకు కృతజ్ఞతలు.

 3. P V Vijay Kumar says:

  దిగంబర కవులిచ్చిన షాక్ ట్రీట్ మెంట్ కు …..పోస్ట్ మోడ్రనిజం కు సంబంధించి గాని, వేరేలా గాని…వచ్చిన బూతు సాహిత్యానికి లింక్ పెట్టి గొప్పగా ఫీల్ అవ్వడం ఏంటో అర్థమవ్వదు. అంటే – దేనికో……ఇంకా దేనికో…..లింక్ పెట్టడం లాగన్న మాట. దిగంబర కవులు సాహిత్యం లో చరిత్రను తిరగ రాసారు. ఊపిందంతా తొండమవ్వదు…తోక కూడా అవ్వచ్చు… What a preliminary understanding of present day marxist intelluctuals ?

  • p v vijay kumar says:

   It is need of the hour to remember them . Venu garu, thanq for letting present day marxist intelluct to dervie inspiration out of them.

 4. ఆనాటి దిగంబర కవిత్వ పాత్రను, అది కలిగింఛిన సంచలనాన్ని గుర్తిద్దాము. ప్రశంసిద్దాము.
  అయితే అది మళ్ళి ఇప్పుడు ఆవసరమా?

  ఈనాడు ఎన్నో ప్రగతి శీల శక్తులు అనాటి కంటే వేగంగా తీవ్వ్రంగా సమాజ రుగ్మతల మీద ప్రతిస్పందిస్తున్నాయి. పోరాడుతున్నాయి.
  ఇక అస్తిత్వ నుంచి విముక్తి ఉద్యమాల సంగతి చెప్పనక్కర్లేదు.

  అసలు ప్రశనేమిటంటే మళ్లీ ఇప్పుడు అలాంటి తిట్టు కవిత్వం అవసరమా?
  ఆలా అయితే చెర , నిఖిల్ , జ్వాలలు ఆ తర్వాతి సమాజ దశను గుర్తించి తమ దిశను మార్చుకోవటం తప్పీ అవుతుంది.
  నోస్టాల్జియా శృతి మించితే ‘గత కాలమే మేలు …’ అవుతుంది సుమా …

  అలాగే దిగంబర కవిత్వం పై స్త్రీవాద విమర్శను వదిలేస్తే ఎలా?

  – Sashank

 5. దిగంబర కవిత్వం ఈ నాడు చదివినా కొన్ని కొన్ని ఉపమానాలు జుగుప్సను కలిగిస్తాయి. కోట్ చెయ్యటం సభ్యతకాదేమోనని సందేహించే పరిస్థితీ ఉంటుంద్. అయినప్పటికీ, తెలుగు సాహిత్యచరిత్రలో అదొక ముఖ్యమైన దశ. ఇంకా చెప్పాలంటే ఆ తరువాత సాహిత్యంలో వచ్చిన పోకడలకు అది కావాల్సిన చోదక శక్తినిచ్చింది. సమాజ దుస్థితికి శత్రువు ఎవరు అని గుర్తించేలా చేసింది. మరీ ముఖ్యంగా 80 -90 లలో వచ్చిన విప్లవసాహిత్యానికి ఒక దిశ దశ ఇచ్చి, సమాజ ఆమోదయోగ్యంగా చేసిన క్రెడిట్ దిగంబరకవిత్వానికి దక్కాలి.
  ఆ దశను, దాని ప్రభావాన్ని ఈ రోజు స్మరించుకోవటం సాహిత్యవారసులుగా మన బాధ్యత. అలాగని అలాంటి కవిత్వం మళ్ళీ రావాలనుకోవటం, డైనోసార్లను బతికించాలనుకోవటమే. After all Nature selected them for extinction – thats all. ఇదీ అంతే.
  ఇక వ్యవస్థ పట్ల దిక్కార వ్యక్తీకరణ అంటారా, ఈ రోజు చిన్నపిల్లలకు కూడా ఎక్కడ దోపిడీ జరుగుతుందో తెలుసు, నా వాటా ఎంతో ముందు చెప్పండి అనేంత తెలివితేటలు కలిగి ఉంటున్నారు.

  • భాస్కరం కల్లూరి says:

   ఒక తరాన్ని కల్లోలితం చేసిన దిగంబర కవిత్వాన్ని గుర్తు చేసుకోవడం బాగుంది వేణుగోపాల్ గారూ…అయితే, దిగంబర కవులను మరిచిపోయేంతగా మారామా? అనడంలో మీరు ఉద్దేశించకుండానే ‘కొంత మారా’మనే ధ్వని వస్తున్నట్టుంది. నిజానికి దిగంబర కవిత్వానికి కూడా చలించనంతగా వ్యవస్థ బిరుసెక్కి, రాటుదేలి, రాళ్లవానకు కూడా కదలని దున్నపోతులా మారి, ఇమ్యూనిటీ పెంచుకుని, మరింత జుగుప్సావహంగా మారిందనాలేమో?!

   • Dr.Rajendra Prasad Chimata says:

    దిగంబర కవులను చదివి ప్రభావితమై అంత పవర్ ఫుల్ గా రాయాల్సింది ఈరోజు కవితలు రాస్తున్న రచయితలు.ఈ దున్నపోతు వ్యవస్థను ఎంత పదునుగా పొడిస్తే అంత మంచిది.

 6. buchi reddy gangula says:

  p.v. vijayakumar..గారి ఒపీనియన్ తో నేను ఎకిబవిస్తాను —
  రాయడం వరకే — నడుచుకునే తిరు లో తేడాలు ‘
  సన్మానాలు — శాలువలు కప్పుకోవ డాలు — బంగారు కంకణం తోడుక్కోవడం ??? ఆచరణలో ????
  యీ మధ్య తెలుగు సాహితీ లోకం లో అంతా రాజకీయం — గ్రూపులు — గుర్తింపు కోసం — పేరుకోసం –నానా గడ్డి క రుస్తూ —
  priniciples..
  values–
  commitment..
  honesty..
  ఒక stand..అంటూ లేకుండా — రాజకీయ నాయకుల్లా — రాజకీయాలు చేస్తూ —నేటి కవులు –రచయితలు
  మనం చూస్తున్న నిజాలు
  ————————————-బుచ్చి రెడ్డి గంగుల

 7. దిగంబర కవులను మరిచిపోయేంత మారామా?
  ఎవరు మారిపోయింది?
  .వారా? లేక వారిని గుర్తు పెట్టుకున్న ఆ నాటి పాఠకులా?.

 8. Mandapaka kameswar rao raju says:

  The article is quite imposing.The conditions in the present day society are even murkier than what was 5decades ago.They are the trend setters and created the conditions to pave the way for modern Telugu literature.It is definitely a positive sign and revisit them for a more meaningful dialogue.I thank Shri venugopal for this thought provoking article…

 9. Dr.Vijaya Babu Koganti says:

  “మరీ ముఖ్యంగా దిగంబర కవులు అసహ్యించుకున్న, తిరస్కరించిన సామాజిక, సాహిత్య ధోరణులు మళ్లీ ఒకసారి మనమధ్య కోరలు చాస్తున్నప్పుడు, మళ్లీ ఒకసారి సాహిత్యలోకంలోకి సాహిత్యేతర కృతిభర్తలు ప్రవేశిస్తున్నప్పుడు దిగంబరకవులను తలచుకోవడం అత్యవసరం. మనమింకా వాళ్లను మరిచిపోయేంతగా మారలేదు.”

  వ్యాసం బాగుంది వేణు గారు.
  భాస్కరం గారు మరియు కామేశ్వర రావు రాజు గారు అన్నట్లు వ్యవస్థ మరింత హీనంగా తయారయింది. ఇంకా పదునైన ఉప మానాలూ వాదాల్సివచ్చినా తాపు లేదు. మొబైల్ మత్తులో జోగుతున్న యువత కు ఈ కవిత్వాన్ని చదివి పధ్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ధన్యవాదాలు.

 10. drsjatinkumar says:

  venu gaaru ,your essay reminds the past, I have been rereading dikkulu from last 3 weeks just to identify the metamorphosis in them.on the occasion of 50 yrs occasion,their response and anger and anguish are adorable but TODAYare they not irrelevant?they had fulfilled a historic need and rightly transformed to a more concrete revolutionary line.nostalgia does not serve any purpose . but I feel that their contribution was not assessed correctly then or even now , ther e is a need to reassess them ,in the past they were totally condemned by the corner from which they needed/expected support . the political sympathies and apathies and their intentions are to be told to the present generation. than to celebrate 50 yrs of digambara kavitha.

 11. కె.కె. రామయ్య says:

  “దిగంబర కవులు ప్రారంభించిన, వాళ్లు స్థిరపరచిన వ్యవస్థా ధిక్కార ధోరణులకు, న్యాయమైన ఆగ్రహానికి, కోపోద్రిక్త అభివ్యక్తికి ఎప్పటికీ కాలం చెల్లదు. దిగంబర కవులు అసహ్యించుకున్న, తిరస్కరించిన సామాజిక, సాహిత్య ధోరణులు మళ్లీ మనమధ్య కోరలు చాస్తున్నప్పుడు, దిగంబరకవులను తలచుకోవడం అత్యవసరం “. హాట్స్ ఆఫ్ వేణు గారు ( ఫర్ యువర్ క్రిటికల్ అండ్ బాలెన్స్డ్ అనాలిసిస్ ఆఫ్ దిగంబర కవితోద్యమం ). హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ లాంటి వాళ్లు పూనుకుంటే దీని ప్రచురణ మళ్లీ వెలుగు చూస్తుందని మీమీద ఆశపెట్టుకుంటున్నాము.

  చారిత్రక పాత్రను పోషించి, తరువాత తరం ఉద్యమాలకు స్పూర్తిదాయకమైన దిగంబర కవితోధ్యమాన్ని గుర్తించటము, సముచితంగా గౌరవించటము మన కనీస బాధ్యత. అట్లని వెన్నక్కు వెళ్లి మళ్లీ అదే పంధాను తొక్కమని ఎవరూ చెప్పరు. కాలానుగుణంగా ఉద్యమాలు వాటి పంధాలు ఎంచుకుంటాయి కదా.

 12. Sameer Kumbam says:

  Thank you N. Venugopal garu for an informative and a well written article on Digambara Kavitodhyamam. This really helps us in getting to know the historic facts about a crucial chapter in telugu literature. As you rightly pointed out, it is a sad fact that social injustice and inequality still remain in our society even after 50 years of this literary movement raising the voice for the rights of oppressed classes against the ruling class.

 13. Aranya Krishna says:

  ముందుగా వేణుగోపాల్ కి అభినందనలు, ఇంకా ధన్యవాదాలు కూడా. చాలా ఆబ్జెక్టివ్ గా రాసిన వ్యాసం ఇది. కవిత్వం లో శ్రీశ్రీకి, వచనంలో చలంకి వున్న స్థాయి దిగంబర కవిత్వానికి కూడా వుందని నా అభిప్రాయం. ఒకరకంగా చెప్పాలంటే దిగంబర కవిత్వం శ్రీశ్రీకి కొనసాగింపే. శ్రీశ్రీ అంతటి మహాకవి ఆ సమయమో ఎలా రాసి వుండాల్సిందో అలా వచ్చిందే దిగంబర కవిత్వం. ఈ శతాబ్దం నాది అన్న మహాకవి కూడా చప్పబడ్డ సందర్భంలో వచ్చిన అగ్గిబరాటా కవిత్వం దిగంబర కవిత్వం. తిట్లు, బూతులకి స్థానం లేని జీవితాలా మనవి? మనభాషలో మనకు ఎక్కటానికి వాడిన దిగంబర కవులు వాడిన భాషని ఏ సాహితీ మర్యాదల్తో కొలవాలి? మనం వాళ్ళని మర్చిపోతున్నామంటే లేదా వాళ్ళని తగినంతగా గుర్తు చేసుకోవటం లేదంటే అర్ధం ఆ కవిత్వం మళ్ళీ రావాల్సిన అవసరం వుందనే.

మీ మాటలు

*