గమనమే గమ్యం -13

 

 

olga‘‘విశాలాక్షి స్వయంగా వచ్చి పిలిచింది. వెళ్ళక తప్పదు’’ అనుకుని చదువుతున్న పుస్తకాన్ని పక్కనపెట్టి నాటకానికి వెళ్ళేందుకు తయారవ్వాలని లేచింది శారద.

విశాలాక్షికి ఆ సంవత్సరం ఎమ్‌.ఏ లో చేరేందుకు సీటు దొరకలేదు. నాటకాల్లో వేషాలు  వేయటమూ తప్పలేదు. కొత్త నాటకం వేస్తుంటే శారదను పిలిచేది. శారద ఒకసారి మూర్తిని, సుదర్శనాన్ని కూడా తీసికెళ్ళింది. ఆ నాటకాలు  పెద్ద బావుంటాయని కాదుగానీ విశాలాక్షి కోసం, కోటేశ్వరి కోసం వెళ్ళేది.

ఇప్పుడేదో సాంఘిక నాటకమని చెప్పింది.

శారద ముందుగా విశాలాక్షి ఇంటికి వెళ్ళింది. ఇద్దరూ కలిసే థియేటర్‌కి వెళ్ళారు. వాళ్ళంతా వేషాలు  వేసుకుంటుంటే శారద విశాలాక్షికి సాయం చేస్తూ కబుర్లు చెబుతోంది. ఇంకో పావుగంటలో నాటకం మొదలవుతుండగా విశాలాక్షి తల్లి కోటేశ్వరి సంతోషంగా వచ్చింది.

‘‘విశాలా. నీ అదృష్టం బాగుందే. బళ్ళారి రాఘవరావు గారు మన నాటకం చూడటానికి వస్తున్నారు’’.

‘‘ఎవరొస్తే మనకేమిటమ్మా. మన నాటకం మనం ఆడాలి. తప్పదుగా’’

‘‘తిండి పెట్టేది అవి. ఆ నాటకాల  గురించి ఎందుకట్టా మాట్టాడతావు. పెద్దాయన వస్తున్నాడు. నువ్వు వినయంగా నమస్కారం చెయ్యి. ఆయన తల్చుకుంటే నిన్ను మహానటిని చేస్తాడు.’’

‘‘మహానటిని కావాని నాకేం కోరికలేదు. ఐనా మహానటులు  ఎవరికి వారు కావాల్సిందే. ఇంకొకరు చేయలేరు. ‘‘దురుసుగా అంది విశాలాక్షి.

‘‘నా మాటలన్నీ నీకు తప్పుగానే వినపడతాయి. చూడు శారదమ్మా, నీ స్నేహితురాలి వరస’’ అంటూ పక్కకు వెళ్లింది .

‘‘ఎందుకే. మీ అమ్మనట్లా బాధపెడతావు’’ జాలిగా అంది శారద.

‘‘నా లోపల, నా జీవితం గురించి ఎంత అసంతృప్తి ఉందో నీకు తెలియదు. ఎంత ఆపినా ఆగకుండా ఇలా పైకి తన్నుకొస్తుంది. అమ్మకూ నాకూ ఇది అలవాటేలే ` ’’

‘‘బళ్ళారి రాఘవ అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో మంచి నటుడు. నేను ఆయన నాటకాలు  చూశాను’’ ఉత్సాహపరచబోయింది శారద.

‘‘నేనూ చూశాను. గొప్ప నటులే – కాదన్నదెవరు?’’ నిర్లిప్తత పోలేదు విశాలాక్షి గొంతులో.

ఇంతలో నాటకం మొదలవుతుందనే పిలుపు. విశాలాక్షి వెళ్ళింది. శారద పెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చుంది.

అది గొప్ప నాటకం కాదు గానీ విసుగు పుట్టించలేదు.

నాటకం పూర్తయ్యాక బళ్ళారి రాఘవను స్టేజీ మీదకు పిల్చారు. ఆయన వచ్చి నాటకం గురించి నాలుగు మంచి మాటలు చెప్పి, ఆంధ్రదేశంలో గొప్ప బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి నాటకరంగంలో చరిత్ర సృష్టిస్తున్న కొమ్మూరి పద్మావతి కూడా నాటకానికి వచ్చిందనీ, ఆమె వేదిక మీదికి రావాలని కోరారు. పద్మావతి స్టేజి మీదకు వచ్చి అందరికీ నమస్కారం చేసేసరికి ప్రేక్షకుల  ఉత్సాహం రెట్టింపయింది.

ఆ సభా తతంగం అయ్యాక లోపల  మేకప్‌ రూంలోకి చాలా మందే వచ్చి అభినందించారు. రాఘవగారు, పద్మావతి గారూ నలుగురితో కలిసి వచ్చారు.

‘‘మా అమ్మాయి బి.ఎ చదివిందండి’’ అంది కోటేశ్వరి గర్వంగా.

‘‘మంచిది. చదువుకున్న వాళ్ళూ, కుటుంబ స్త్రీలు  వస్తేనే నాటకరంగ ప్రతిష్ట పెరుగుతుంది’’ అన్నారు బళ్ళారి రాఘవ.

‘‘కుటుంబ స్త్రీలంటే ఎవరండీ? కుటుంబ స్త్రీలు  కానిదెవరండి? ’’ చాలా కటువుగా అడిగింది విశాలాక్షి.

అందరూ నిశ్శబ్ధమైపోయారు.

IMG (2)

బళ్ళారి రాఘవ పక్కనున్న తెల్లటి అందమైన మనిషి సన్నగా నవ్వి ‘‘తప్పు ఒప్పుకొని ఆ అమ్మాయిని క్షమాపణ అడగండి’’ అన్నాడు.

పద్మావతి కంగారుపడుతూ ‘‘మీరూరుకోండి’’ అన్నది.

‘‘అమ్మా – ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నా పేరు గుడిపాటివెంకట చలం. కథలూ  అవీ రాస్తుంటాను. నువ్వడిగిన ప్రశ్న చాలా సరైన ప్రశ్న’’.

బళ్ళారి రాఘవ గంభీరంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆయనతో వచ్చినవాళ్ళూ వెళ్ళిపోయారు.

చలంగారు రెండు నిమిషాలు  నిలబడి ‘‘మీ నాటకం నాకేం నచ్చలేదు గానీ నీ మాటలూ , నువ్వూ –  మర్చిపోలేను’’ అంటూ వెళ్ళిపోయారు.

శారద చలం గారిని చూసిన సంభ్రమంలో మిగిలినవన్నీ మర్చిపోయింది.

‘‘విశాలా – చలంగారు’’ అంది విశాలను కుదుపుతూ.

‘‘ఔను – అదే – చూస్తున్నా’’

కోటేశ్వరి అందరినీ గదమాయిస్తూ సామాను సర్దిస్తోంది. ఆమెకు కూతురి మీద పట్టరాని కోపంగా ఉంది. అంత పెద్ద మనిషిని పట్టుకుని అవమానించింది. బి.ఏ చదివానని పొగరు. దీన్తో ఎలా వేగాలో తెలియటం లేదు. ఆమెకి విశాలాక్షి భవిష్యత్తు గురించి బోలెడు భయం.

విశాలాక్షి ఇల్లు చేరాక తల్లితో పెద్ద యుద్ధమే చేసింది.

‘‘నేనింక నాటకాలు వెయ్యను’’ అని ప్రకటించేసింది.

‘‘ఒకపక్క ఆ బ్రాహ్మలావిడ నాటకాల్లోకి వస్తే – నీకు పరువు తక్కువైందా నాటకాలేస్తే’’ అని కూతుర్ని తిట్టింది కోటేశ్వరి.

‘‘ఔనమ్మా ` బ్రాహ్మలు, కుటుంబ స్త్రీలు నాటకాలేస్తే గొప్ప. మనం ఏం చేసినా గొప్ప కాదు. వాళ్ళను చూసినట్లు మనల్ని చూడరు.’’

‘‘నీకు ఏం కావాలే? ఇప్పుడు నీకేం తక్కువైంది?’’ అరిచింది తల్లి.

‘‘అది నీకూ తెలుసూ. నాకూ తెలుసు. మళ్ళీ నా నోటితో చెప్పాలా? “గయ్యిమంది కూతురు.

కోటేశ్వరికి మండిపోయింది.

‘‘సరే – నోర్మూసుకుని తిండితిని పడుకో. చేసే పని సంతోషంగా చెయ్యటం చేతగాని దద్దమ్మవి. నీ మీద నీకు గౌరవం లేదు. నిన్ను నువ్వు గొప్పనుకోవటం తెలియదు. ఎవరో నిన్ను గొప్ప దానివనాలా ?నీ గురించి నీకు తెలియదా?’

విశాలాక్షికి ఎవరో గట్టిగా నెత్తిమీద కొట్టినట్లయింది.

‘‘నీ మీద నీకు గౌరవం లేదు. ఎవరో నిన్ను గొప్పదానివనాలా ?’’ అన్న తల్లి మాటలు  అలజడి రేపాయి.

‘‘నిజమేనా? అసలు  సమస్య అదేనా? లోపం తనలోనే ఉందా?’’ విశాలాక్షికి బుర్రంతా గందరగోళమైంది. ఎంత ఆలోచించినా సమస్య తెగలేదు.

‘చిన్నతనం నుంచీ తను పడ్డ అవమానాలు తనకు తెలుసు. ఇప్పటికీ ఎవరో ఒకరు ఏదో ఒక తప్పుడు కూత కూస్తూనే ఉంటారు. అవి పట్టించుకుని బాధ పడకుండా తను బతికెయ్యాలా? అది తనను తాను గౌరవించుకోవటమవుతుందా? తల్లి అలాగే బతుకుతోందా? ఏనాడూ ఆమె తన వృత్తి గురించి చిన్నతనంగా అనుకోలేదు. గౌరవం లేదని బాధపడలేదు. తనకెక్కడినుంచి ఒచ్చిందీ బాధ. అమ్మలాగా నిబ్బరంగా జీవితంతో తలపడలేకపోతున్నదెందుకు? అమ్మకీ తనకీ తేడా ఉండాలని ఎందుకనుకుంటోంది. అమ్మ తనను తాను గౌరవించుకుంటే తాను నలుగురి గౌరవం కోసం చూస్తోందా? అమ్మ తన జీవితాన్ని ఉన్నదున్నట్లుగా అంగీకరించి దానితో తలపడుతోంది. తను అంగీకరించకుండా దీనంతటినుంచి బైటపడాలని పోట్లాటకు దిగుతోంది జీవితంలో. తనకు ఎక్కడినుంచి వచ్చింది ఈ అసంతృప్తి?.

కానీ తన ఆలోచనలే సరైనవి. అందరూ గౌరవించాలనుకోవటంలో తప్పేముంది?

తన కులమంటే గౌరవం లేదు తనకు. ఎలా వస్తుంది? ఆ వృత్తి మంచిది కాదు. తనకిష్టం లేదు. ఆ వృత్తి మంచిదని అమ్మెలా అనుకుంటోందో తనకర్థం కాదు. అమ్మకి అసలు ఆ వృత్తి మంచిదా కాదా అన్న ఆలోచనే లేదు. అది తమ కులవృత్తి. అంతే`

‘‘మంచీలేదు. చెడ్డాలేదు అంటుంది.’’

విశాలాక్షికి తల పగిలి పోతుంది. అతి ప్రయత్నం మీద ఆలోచనల్ని అణిచివేసి మండుతున్న కళ్ళను మూసుకుంది. కళ్ళనుంచి కన్నీళ్ళు కారి కాస్త చల్లబరిచాయి. ఎప్పటికో కాలే కడుపుతో, మండే గుండెతో నిద్రపోయింది విశాలాక్షి.

***

IMG (2)శారద ఎంతో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఒక రోజు రాత్రి ఎనిమిది గంటవుతుండగా సన్నగా, బలహీనంగా కనపడుతున్న యువకుడు వచ్చి శారద ఇంటి తలుపు తట్టాడు. శారదే తలుపు తీసింది. అతను శారద చేతిలో చిన్న కాగితం ముక్క పెట్టి ‘‘రేపు సాయంత్రం ఆరుగంటలకు పరశువాకంలో ఈ చిరునామాకి రావాలి. కాగితం చించెయ్యండి’’.

ఆ యువకుడు ఆవేశంగా ఉన్నాడు. దూరం నుంచి నడిచి వచ్చినట్లు ఆయాస పడుతున్నాడు. ఒళ్ళంతా చెమటు.

శారద సందేహంగా ‘‘మీ పేరు –ఇంత రాత్రి వచ్చారూ – ఏం జరుగుతుంది అక్కడ ? నేనెందుకు?’’ అంటూ సరిగా అడగలేనట్లు ముక్కలు  ముక్కలుగా ప్రశ్నలు  వేసింది.

‘‘అదంతా అక్కడకు వచ్చాక తెలుస్తుంది. ఇది చాలా రహస్య సమావేశం. ఎవరితోనూ చెప్పకండి. ఆ కాగితం చించెయ్యండి. జాగ్రత్త. మీరు రావటం ఎవరైనా గమనించి మీ వెనుక వస్తున్నారనుకుంటే మధ్యలో దారి మార్చి మీ స్నేహితుల ఇంటికి వెళ్ళిపొండి. పరిసరాలు  గమనిస్తూ రండి’’.

శారదకిప్పుడు ఏ సందేహమూ లేదు. అతన్ని చూసి చిరునవ్వుతో  ‘‘మీరు చెప్పినట్లే చేస్తాను. వెళ్ళి రండి’’ అని తలుపు వేసేసింది.

మర్నాడు పగంతా కాలేజీలో ఆస్పత్రిలో ఎలా గడిచిందో శారదకు తెలియదు.

సాయంత్రం సన్నని ఖద్దరు చీర కట్టుకుని తయారై తల్లి దగ్గరకు వెళ్ళింది.

సుబ్బమ్మ శారద ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నా ‘‘ఎక్కడికెళ్తున్నావు, ఈ వేళప్పుడేమిటి? వచ్చేసరికి ఎంత సమయం పడుతుంది’’ ఇలాంటి ప్రశ్నలు అడగదు. కూతురి మీద విపరీతమైన నమ్మకం. పిచ్చి ప్రేమ. తన కూతురి వంటి వాళ్ళు ఇంకొకరుండబోరని అనుకుంటుంది.

శారద ఈ రోజు తల్లితో వచ్చేసరికి ఆలస్యమవుతుందని, తన కోసం ఎదురు చూడకుండా నిద్రపొమ్మనీ చెప్పింది.

‘‘అలాగే – ఇవాళ ఏదో మీటింగున్నట్టుంది. రేపు నాకు ఆ విశేషాలన్నీ చెప్పాలి’’ అంది కూతురితో.

‘‘నే చెప్పక పోయినా నేను ఎక్కడికి ఏ పనిమీద వెళ్తున్నానో నీకెలా తెలుస్తుందమ్మా’’ అనడిగింది శారద.

‘‘నీ ముఖం చూస్తేనే నాకంతా తెలుస్తుందే చిట్టితల్లీ. నా ప్రాణాన్నీ నీ మీదే కదా. నా ప్రాణం సంగతి నాకు తెలియకుండా  ఎట్లా ఉంటుంది?’’.

మొదటిసారి శారదకు తల్లి ప్రేమను చూస్తే భయమేసింది. తానేవేవో పనులు  చెయ్యాలనుకుంటోంది. అమ్మ వాటన్నిటినీ ఆమోదించి తనతో వస్తుందా? రాకపోతే అమ్మకోసం తను ఆగగలదా? ఆగకపోతే అమ్మ ఏమవుతుంది? రెండు నిమిషాల పాటు ఆ ఆలోచన కంగారు పెడితే అలాగే ఆగి, తర్వాత ఈ పిచ్చి ఆలోచనతో ఇప్పుడే ఆగేలా ఉన్నానని నవ్వుకుంటూ బైటికి నడిచింది.

పరశువాకం శారదకు బాగానే తెలుసు. వడిమేలు కోసం వెళ్ళేది. కానీ ఈ చిరునామా అంత తేలికగా దొరకలేదు. ఆ ప్రాంతపు మురికి వాడు తెలుసు గానీ ఇది మరీ లోపలికి ఉంది.

ఆ పరిసరాలు ఎప్పుడూ శారద మనసుని కుంగదీస్తాయి.

వాటిని, అక్కడి మనుషులనూ అంతా పరిశుభ్రంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా చేయగలిగితే?

కమ్యూనిజంలో అది సాధ్యం. కమ్యూనిస్టులే అలా చేయగలుగుతారు అనుకుంటు గుర్తు వెతుకుతూ, సందులు తిరుగుతూ ఆ ఇల్లు చేరుకుంది. ఆ గది కాస్త విశాలంగానే ఉంది. పాతికమంది దాకా ఉన్నారు. శారద తప్ప అందరూ మగవాళ్ళే. ఆశ్చర్యంగా సుదర్శనం, మూర్తీ ఇద్దరూ లేరు. ఇద్దరు ముగ్గురు విద్యార్థులు తప్ప శారదకు తెలిసిన వాళ్ళు లేరు.

అందరూ శారదను ఆశ్చర్యంగా, ఆసక్తిగా చూశారు. వడిమేలు శారద దగ్గరకు వచ్చి పక్కన కూచుని ఒక వ్యక్తిని చూపించి ‘‘సోవియట్‌ రష్యా నుంచి వచ్చిన కామ్రేడ్‌ అతనే’’ అన్నాడు.

అతను శారద వంక చూసి స్నేహంగా నవ్వాడు. శారద అప్రయత్నంగా నవ్వింది.’’ ఈయనకు మారు పేర్లు చాలా ఉన్నాయి. అసలు పేరు అమీర్‌ హైదరాలి ఖాన్‌. ఎన్నో దేశాలు తిరిగాడు. రష్యాలో అనేక సంవత్సరాలున్నాడు. భారతదేశంలో -ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టుపార్టీ నిర్మించాలని వచ్చాడు’’ వడిమేలు క్లుప్తంగా ఆయన పరిచయం చేశాడు.

‘‘ఈరోజు నా పేరు శంకరం’’ అంటూ అమీర్‌ హైదరాలి ఖాన్‌ చాలాసేపు మాట్లాడాడు. ముఖ్యంగా వర్గ సిద్ధాంతం గురించీ, వర్గాలనూ, వర్గ ప్రయోజనానూ కాపాడే రాజ్యం గురించి మార్క్సు, ఏంగెల్స్‌, లెనిన్‌లు  ఏం చెప్పారో దాని సారాంశాన్ని చెప్పాడు. శారద ఆయన చెప్పిన వాక్యాలన్నీ శిలా శాసనంలా మనసులో చెక్కుకుంది. పార్టీ నిర్మాణం గురించి, పాటించాల్సిన క్రమశిక్షణ గురించి, రహస్యంగా కార్యక్రమాలు నడపాల్సిన తీరు గురించీ ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మాట్లాడారు.

‘‘మనం కాంగ్రెస్‌లోనే ఉండాలి. కాంగ్రెస్‌లోని అతివాదులతో, సోషలిస్టు భావాలున్న వాళ్ళతో కలిసి పని చెయ్యాలి. ఆ పని చేస్తూనే ప్రజలలో కమ్యూనిస్టు భావాలు వ్యాపింప చేయాలి. ఈ పని పరమ రహస్యంగా జరగాలి. భావాలు ప్రజలోకి తీసికెళ్ళాలి గానీ మనం వీలైనంతవరకూ రహస్యంగానే ఉండాలి’’ అంటూ కొన్ని సూచనలు చేశాడాయన. ఆయన కోసం అప్పటికే పోలీసులు వెతుకుతున్నారు. పట్టుబడితే చంపుతారనే భయం ఉంది.

శారదకు ఎంతో బాధ్యత వచ్చి మీదపడినట్లయింది.

కమ్యూనిస్టు సాహిత్యం – మార్క్సు, ఎంగెల్స్‌, లెనిన్‌ రచనలను సంపాదించి చదవటం అత్యవసరమని – అవి చదివి చర్చించుకోవాలని అనుకున్నారు. త్వరలో భగత్‌సింగ్‌ని ఉరితీసి సంవత్సరం అవుతుందనీ, ఆ రోజు ఏదో ఒక పని చేసి ప్రజలలో సంచనం తెచ్చి, భగత్‌సింగ్‌ ఆశయాలను వారి హృదయాకు హత్తుకునేలా చేయాలని అన్నారు వడిమేలు, అమీర్‌.

‘‘దానికింకా నాలుగు నెలల సమయముందిగా’’ అన్నది శారద.

‘‘మనం రహస్యంగా పని చెయ్యాలి గనుక అది తక్కువ సమయమే. మనం బహిరంగంగా సభలు పెట్టి మాట్లాడలేం. కానీ మన ఆలోచనలను, మన భిన్న స్వరం ప్రజకు వినిపించాలి. అది తేలిక కాదు.’’

‘‘ఒక పత్రిక భగత్‌సింగ్‌ ఆశయాలు వివరిస్తూ తెద్దాం’’ శారద వడిమేలుతో అంది.

‘‘ఇక్కడ అచ్చేస్తే పోలీసుకు తెలుస్తుంది. పత్రిక అమ్ముతుంటే వారిని పోలీసులు పట్టుకోవచ్చు. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆలోచిద్దాం’’ హైదర్‌ఖాన్‌ మాటతో అందరూ అంగీకరించారు.

రాత్రి తొమ్మిది గంటలవుతుండగా సమావేశం ముగిసిందన్నారు. ఒక్కొక్కరుగా పది పదిహేను నిమిషాల వ్యవధానంలో బైటికి వెళ్ళాలనుకున్నారు. శారదను ముందుగా పంపించారు.

శారద ఇంటికి వచ్చేసరికి పది గంటలయింది.

‘‘ఇంకా ఆలస్యమవుతుందనుకున్నా. త్వరగానే వచ్చావే. ఏం మీటింగమ్మా’’ అప్పుడే పడుకోబోతున్న సుబ్బమ్మ లేచి వచ్చింది.

‘‘తల్లితో కూడా చెప్పకూడని రహస్య సమావేశం’’ మనసులో అనుకుంది శారద.

‘‘ఏదో విద్యార్థుల మీటింగ్‌లేమ్మా. ఉద్యమమంతా చల్లారింది గదా. మళ్ళీ వేడెక్కాంటే ఏం చెయ్యాలా అని మాట్లాడుకున్నాం’’.

‘‘ఆ గాంధీ గారు ఏం చెయ్యమంటే అది చేస్తారు. దానికి మీ ఆలోచనేమిటి? మీరు చెప్పింది ఆయన ఒప్పుకుని చేస్తాడా?’’

‘‘ఆయనకి ఎన్నో పనులమ్మా. ఇక్కడ మనం ఒక్కొక్కరం ఏం చెయ్యాలో పిలిచి చెప్తారా? పెద్ద ఉద్యమమైతే ఆయన అందరికీ పిలుపిస్తాడు. మళ్ళీ పెద్ద సత్యాగ్రహం చేసే లోపల మనం ఊరికే కూర్చోలేం కదా’’.

‘‘ఊరికే ఎక్కడ కూర్చుంటున్నారు. దుర్గ కాకినాడలో సమావేశాలు జరిపి అరెస్టయిందిగా ` మధుర జైల్లో ఉందిట. ఆ మీనాక్షి అమ్మవారే కాపాడాలి.’’

‘‘శారదకు దుర్గను తల్చుకుంటే బాధనిపించింది. సత్యాగ్రహపు రోజుల్లో అందరితో కలిసి జైలుకెళ్ళటం వేరు. ఇప్పుడు తనొక్కతే వెళ్ళటం వేరు. అప్పుడు జైలంతా సత్యాగ్రహం స్నేహితులు. ఇప్పుడు ఒంటరిగా మామూలు దొంగలతో, ఖూనీ కోర్లతో – ఎలా ఉందో ? దుర్గకు తను కమ్యూనిస్టునని తెలిస్తే ఏమంటుందో ? కానీ చెప్పకూడదు. అన్నపూర్ణకూ చెప్పకూడదు. మూర్తికి మటుకు చెప్పాలి. చెప్పటమేంటి మూర్తిని పార్టీలో చేర్పించాలి. ఎందుకు? తనకెందుకు మూర్తి విషయం? తనకు కాకపోతే మరెవరికి? మూర్తి మంచి స్నేహితుడు. స్నేహితుల గురించి ఆలోచించటం తప్పెలా అవుతుంది? అసలీ తప్పు అనే ఆలోచనే తన మనసులోకి రాకూడదు. ఒక మనిషి మీద ప్రేమ, స్నేహం కలిగి మనసులో ఆనందం కలుగుతుంటే అది తప్పవటమేమిటి?’

భోజనం ముగించి తల్లి హెచ్చరికతో నిద్ర నటిస్తూ రాత్రంతా మేలుకుని ఉంది.

కమ్యూనిస్టు పార్టీ పనులు చురుకుగా సాగుతున్నాయి. ముఖ్యమైన పని, విద్యార్థులకు, కార్మికులకు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు వివరించటమే. గ్రూపు సమావేశాలు ఏర్పాటు చేసుకుని వాటిల్లో మాట్లాడుతూ, చదువుతూ, చర్చిస్తూ –

ఇంకోవైపు కాంగ్రెస్‌ సోషలిస్టుగా కాంగ్రెస్‌ కార్యక్రమాలు కొన్నింటిలో పాల్గొనటం, ఆ మీటింగు ఏర్పాటు చేయటం.

కమ్యూనిస్టుపార్టీ సమావేశాలు అతి రహస్యంగా నిర్వహించాలి. అది ఎక్కడ ఎప్పుడు ఎంత రహస్యంగా నిర్వహించాలనేది నిర్ణయించటానికే ఎక్కువ సమయం పట్టేది. పత్రిక తీసుకురావటం మరింత కష్టంగా ఉండేది. అన్ని కష్టాలు పడుతూనే భగత్‌సింగ్‌ వర్థంతికి కరపత్రాలు ముద్రించారు. ఆ కరపత్రాలు చేతులో పట్టుకుని భగత్‌సింగ్‌ తనే అయినట్లు గర్వపడుతూ స్టేషన్‌లో, బీచిలో పంచింది శారద. ఆ కరపత్రం ఎలాంటిది? సలసలా రక్తాన్ని మరిగించే కరపత్రం. బ్రిటీష్‌ పాలాకుల  మీద ద్వేషాన్ని బుసబుస పొంగించే కరపత్రం. భగత్‌సింగ్‌ జీవించి ఉంటే తప్పక కమ్యూనిస్టు అయ్యేవాడు అనుకుంది శారద.

ఒకవైపు పరీక్షలు  తరుముకు వస్తున్నాయి. ఆఖరి సంవత్సరపు పరీక్షలు. ఈ పరిక్షయిన తర్వాత తండ్రి కోరిక ప్రకారం ఇంగ్లాండ్‌ వెళ్ళాలి. అది గుర్తొస్తే శారదకు నీరసం ఒస్తోంది.

పార్టీ పనులు, జాతీయోద్యమం, ఇక్కడి స్నేహితులు , తల్లి – అంతటినీ, అందరినీ ఒదిలి ఇంగ్లండ్‌ వెళ్ళాలంటే అసలు  మనసొప్పటం లేదు.

కానీ తండ్రి కోరిక. తన చిన్నతనంలో తండ్రితో రాజ్యలక్ష్మమ్మ అమ్మమ్మ అదే చెప్పింది. చివరి రోజుల్లో దగ్గరై తాతయ్యా అనిపించుకున్న వీరేశలింగం పంతులు గారూ అదే చెప్పారు.

ఏం చెయ్యాలి? పరీక్షలు, అప్రెంటిస్‌షిప్‌ అయ్యేసరికి దాదాపు సంవత్సరం పడుతుంది – అప్పుడు ఆలోచించొచ్చులే అని పక్కకు పెట్టేసింది. దేనినైనా మనసులో పెట్టుకుని కుమలటం శారద తత్త్వం కాదు. నిర్ణయం తీసుకుందా అందులో మనసు నిమగ్నం చేస్తుంది.

IMG (2)

కానీ ఇంగ్లండ్‌ ప్రయాణం అంత తేలికైంది కాదు. కేవలం నిర్ణయంతో జరిగేదీ కాదు. డబ్బుతో కూడిన పని. శారదకు తన కుటుంబపు ఆర్థిక స్థితి గురించి అంతగా తెలియదు. సుబ్బమ్మ, తన అన్నదమ్ములతో రామారావుగారి వైపు బంధువులతో కలిసి ఆ విషయాలు చూస్తోంది.  పొలాల మీద వచ్చే ఆదాయం తగ్గిపోతోందని, ఆర్థిక కాటకం వల్ల  రైతులు చాలా దరిద్రంలో ఉన్నారనీ, అప్పు చెయ్యక తప్పటం లేదనీ అపుడపుడు మేనమామ తల్లితో చెబుతుండటం వినేది. ఆర్థిక కాటకం గురించి శారద సంఘపు సమావేశాల్లో చర్చించేది కూడా –  విద్యార్థి మిత్రులందరూ దాని బారిన పడినవారే – ఊళ్ళనుంచి తల్లిదండ్రులు డబ్బు పంపలేకపోతున్నారు. ఉద్యోగాలు దొరకటం లేదు. అంతకు ముందు మూడు పూటలా తినే వాళ్ళు ఇపుడు రెండు పూటలే తింటున్నారు. ఒక్కోసారి సగం తిండితో సరిపెట్టుకుంటున్నారు.

శారద డబ్బు విషయాలు తల్లితో మాట్లాడబోతే ఆమె ఊరుకునేది కాదు.

‘‘అవన్నీ మేం చూసుకుంటాంగా -నువ్వు చదువుకో. నీ చదువు పూర్తయితే తర్వాత అన్నీ నువ్వే చూసుకుందువుగాని’’ అనేది.

శారద అంతటితో ఆ సంగతి వదిలేసేది.

ఇంటినిండా ఎప్పుడూ బంధువు, స్నేహితులు ఉంటూనే ఉంటారు. ఖర్చుకి మితిలేదు. తండ్రి ఉన్నప్పటి దర్జా లేదు గానీ ఇది తక్కువైంది అనుకోటానికీ లేదు. శారద చేతిలో డబ్బు నిలవదని సుబ్బమ్మగారి అభిప్రాయం. ఎవరైనా అవసరం అంటే చాలు అది తీర్చేదాకా శారద అల్లాడిపోయేది. సుబ్బమ్మగారికి అది కొంచెం కష్టంగా ఉండేది. శారద తనకంటూ పెట్టుకునే ఖర్చేమీ ఉండదు. నూలు చీరొ, ఖద్దరు చీరొ కడుతుంది. నగలేమీ పెట్టుకోదు. కమ్యూనిస్టు సిద్ధాంతాలూ, గాంధీగారి ప్రభావమూ ఆమెను మరింత నిరాడంబరంగా తీర్చిదిద్దాయి. కానీ తన చుట్టూ  ఉన్నవారి అవసరాలు చూడటం, అవి తీర్చటం తన బాధ్యత అనుకుంటుంది. ఈ స్వభావం ఆమెకు తండ్రి నుంచి వచ్చిందని సుబ్బమ్మ అంటుంది.

‘‘ఈ కాటకం ఇప్పట్లో పోయేలా లేదు. ఇంగ్లండ్‌ వెళ్ళి చదవటం జరిగే పనేనా’’ అందిసుబ్బమ్మ.

‘‘జరక్కపోతే మరీ మంచిది మానేద్దాం’’ అంది శారద ఉత్సాహంగా.

‘‘ఎంత కష్టమైనా పడాల్సిందే. ఇంగ్లండ్‌ వెళ్ళాల్సిందే. నేను బతుకుతున్నదే అందుకు’’ అంది సుబ్బమ్మ.

‘‘డబ్బు లేకుండా ఎలాగమ్మా’’

‘‘డబ్బు ఎలాగోలా పుట్టిస్తాను. నేను చూసుకుంటాను. ఇవాళ్టి నుంచీ నువ్వు అనవసరపు ఖర్చు తగ్గించు. నే చెప్పినట్టు విను’’ కాస్త గట్టిగా అంది.

‘‘అనవసరపు ఖర్చు నేనేం పెడుతున్నానమ్మా’’ తల్లి నుంచి ఎన్నడూ చిన్నమాట అనిపించుకోవటం అలవాటులేని శారదకు కళ్ళలో నీళ్లు తిరిగాయి.

‘‘నిన్ను ఎవరైనా అవసరంలో ఉన్నామని అడగటమే పాపం కదా – ఇవ్వకుండా ఊరుకుంటావా? అది కాస్త తగ్గించు, అంటున్నా. అంతకంటే ఏమీ లేదు’’.

‘‘ఎవరైనా పది రూపాయలు కావాని అడిగితే నేను ఇంగ్లండ్‌ వెళ్ళాలి. అంచేత ఇవ్వలేను అనమంటావా?’’ దు:ఖాన్ని మింగేసి నవ్వబోయింది శారద.

‘‘నువ్వేమంటావో నాకనవసరం – ఆ ఖర్చుకు నన్నింక డబ్బు అడక్కు.’’ శారద కోపంగా అక్కడినుంచి వెళ్ళింది గానీ తల్లి మాటల్లో అబద్ధం లేదు. చాలా ఖర్చు తగ్గిస్తే గానీ ప్రయాణం కుదరదు.

శారదతో పాటు చదువుతున్న సరళను, మార్తాను మిషనరీ వాళ్ళే పంపుతున్నారు.

శారద పరీక్షలు  పూర్తయ్యాయి. మిగిలిన విద్యార్థులంతా ఇళ్ళకు వెళ్ళారు. శారద తన పనుల్లో తానుంటూనే, కమ్యూనిస్టు సాహిత్యంతో పాటు ఇతర సాహిత్యం చదవటం, ఇంగ్లండ్‌ వెళ్ళటానికి కావసిన ఏర్పాట్లు చేసుకోవటంతో తీరిక లేకుండా ఉంది.

*

మీ మాటలు

  1. rajani patibandla says:

    బొప్పాయి చెట్టు సిద్దాంతం సూపర్

మీ మాటలు

*