చంపడమే ఒక సందేశం!

 

 

–  రమణ యడవల్లి

 

ramana yadavalliఈ లోకమందు చావులు నానావిధములు. ప్రపంచంలోని పలుదేశాల్లో పలువురు తిండి లేకో, దోమలు కుట్టో హీనంగా చనిపోతుంటారు. కొన్నిదేశాల్లో రాజకీయ అస్థిరత, యుద్ధవాతావరణం కారణంగా పెళ్ళిభోజనం చేస్తుంటేనో, క్రికెట్ ఆడుకుంటుంటేనో నెత్తిన బాంబు పడి ఘోరంగా చనిపోతుంటారు. ఇంకొన్ని దేశాల్లో మెజారిటీలకి వ్యతిరేకమైన ఆలోచనా విధానం కలిగున్న కారణంగా హత్య కావింపబడి చనిపోతారు. 

నరేంద్ర దభోల్కర్, గోబింద్ పన్సరె, మల్లేశప్ప కల్బుర్గి.. వరసపెట్టి నేల కొరుగుతున్నారు. వీరు వృద్ధులు, వీరికి మతం పట్ల డిఫరెంట్ అభిప్రాయాలున్నాయ్. ఇలా ఒక విషయం పట్ల విరుద్ధమైన అభిప్రాయాలు కలిగుండటం నేరం కాదు. తమ అభిప్రాయాలని స్వేచ్చగా ప్రకటించుకునే హక్కు రాజ్యంగం మనకి కల్పించింది గానీ అందుకు మనం అనేకమంది దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాలి.

సౌదీ అరేబియాలో మతాన్ని ప్రశ్నించడం తీవ్రమైన నేరం. శిక్ష కూడా అత్యంత పాశవికంగా అమలవుతుంది. ఇదంతా వారు తమ రాజ్యాంగంలోనే రాసుకున్నారు. కనుక సౌదీ అరేబియా ప్రభుత్వం ఎటువంటి మొహమాటాలు లేకుండా దర్జాగా, ప్రశాంతంగా, పబ్లిగ్గా తన శిక్షల్ని అమలు చేసేస్తుంది. సౌదీకి అమెరికా మంచి దొస్త్. దోస్తానాలో దోస్త్‌లు ఎప్పుడూ కరెక్టే. అందుకే అమెరికా సౌదీ అరేబియా క్రూరమైన శిక్షల్ని పట్టించుకోదు!

సౌదీ అరేబియా శిక్షలు అనాగరికమైనవనీ, ప్రజాస్వామ్యంలో అటువంటి కఠినత్వానికి తావు లేదని కొందరు విజ్ఞులు భావిస్తారు. అయ్యా! ప్రజాస్వామ్య దేశాల్లో కూడా విపరీతమైన భౌతిక హింస, భౌతికంగా నిర్మూలించే శిక్షలు అమలవుతూనే వుంటాయి. కాకపొతే అవి అనధికారంగా అమలవుతాయి. ఎందుకంటే – ప్రజాస్వామ్య ముసుగు కప్పుకున్న ఈ దేశాలకి కూసింత సిగ్గూ, బోల్డంత మొహమాటం!

మతాన్ని ప్రశ్నించిన వారిని చంపడం ఎప్పుడూ కూడా ఒక పధ్ధతి ప్రకారమే జరుగుతుంది, కాకతాళీయం అనేది అస్సలు వుండదు. బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు బ్లాగర్లని వేదికి వెదికి వేటాడి మరీ నరికేస్తున్నారు. పాకిస్తాన్లో పరిస్థితీ ఇంతే. శ్రీలంకలో బౌద్ధమతాన్ని ప్రశ్నించినవారూ ఖర్చైపొయ్యారు! ఇక క్రిష్టియన్ మతం హత్యాకాండకి శతాబ్దాల చరిత్రే వుంది. ఇవన్నీ స్టేట్, నాన్ స్టేట్ ఏక్టర్స్ కూడబలుక్కుని చేస్తున్న నేరాలు. అంచేత ఈ నేరాల్ని స్టేట్ విచారిస్తూనే వుంటుంది. సహజంగానే నిందితులెవరో తెలీదు, కాబట్టి కేసులూ తేలవు.

దక్షిణ ఆసియా దేశాల్లో మెజారిటీకి వ్యతిరేకంగా డిఫరెంట్ అభిప్రాయాల్ని కలిగున్నవారిని గాడ్‌ఫాదర్ సినిమా టైపులో పద్ధతిగా ఎలిమినేట్ చేస్తుండడం అత్యంత దారుణం. ఇటువంటి హత్యలు అరుదుగా జరిగే సంఘటనలేనని, వీటికి స్టేట్‌తో సంబంధం లేదని కొందరు వాదించవచ్చు. కానీ – ఈ హత్యలు పౌరసమాజానికి స్టేట్ పంపుతున్న ఒక సందేశంగా చూడాలని నా అభిప్రాయం. ఈ హత్యలు జరిగిన దాని కన్నా ఆ తరవాత దర్యాప్తు సంస్థలు చూపించే నిర్లిప్తతని పరిశీలించి ఒక అభిప్రాయం ఏర్పరచుకోవల్సిందిగా నా విజ్ఞప్తి.

ఇంకో విషయం – ఈ హత్యలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చదువుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ‘మతాన్ని కించపరిచే ఎవరికైనా ఇదే శిక్ష’ అంటూ హత్యకి సపోర్ట్ చేస్తూ వికటాట్టహాసం చేస్తున్న వ్యాఖ్యలు వెన్నులో వణుకు తెప్పిస్తున్నయ్! దభోల్కర్‌తో మొదలైన ఈ హత్యా పరంపర ఇంకా కొనసాగవచ్చు, రైతుల ఆత్మహత్యల్లానే ఇదీ ఒక రెగ్యులర్ తంతు కావచ్చు, అప్పుడు మీడియాలో ఈ హత్యలు ఏ పదో పేజి వార్తో కావొచ్చు!

మరీ హత్యల వల్ల ప్రయోజనం?

సమాజంలో ఒక భయానక వాతావరణం ఉన్నప్పుడు, ప్రాణాలకి తెగించి ఎవరూ రాయరు, మాట్లాడరు. అంచేత వాళ్ళు ఏ సినిమా గూర్చో, పెసరట్టు గూర్చో రాసుకుంటారు. ఇంకొంచెం మేధావులు – ఉదయిస్తున్న భానుడి ప్రకాశత గూర్చీ, వికసిస్తున్న కలువల అందచందాల గూర్చీ, అమ్మ ప్రేమలో తీపిదనం గూర్చీ సరదా సరదాగా హేపీ హేపీగా రాసుకుంటారు – అవార్డులు, రివార్డులు కొట్టేస్తారు! ఈ హత్యల పరమార్ధం అదే!

*

మీ మాటలు

  1. true sir

  2. ట్రూ సర్

  3. ఖండిస్తున్నాం అని ఊరుకుంటే సరిపోదనుకుంటాను .. ఇది మొదలు ఇంకా ఎన్ని చూడల్లో ..

  4. ఈ హత్యలు పౌరసమాజానికి స్టేట్ పంపుతున్న ఒక సందేశంగా చూడాలని నా అభిప్రాయం కూడా ..

  5. ఈ హత్యల కంటే కూడా మీరన్నట్లు, ఈ వార్తలనంటుకొని వచ్చే వాఖ్యలు ఎక్కువ కంగారుపెడుతున్నాయి.
    మన విధ్యావిధానంలోని లోపాన్ని ఇవి చూపుతున్నాయి. సహనశీలత మన సంస్కృతిగా చెప్పుకొనే దేశంలో ఇంత అసహనం ఎలా పెరుగుతోంది? హేతుబద్ద ఆలోచనాధోరణిని విద్య కలిగించటం లేదు. పరీక్షలు పాస్ కావడం ఒక్కటే విధ్యార్థుల లక్ష్యం. దానికోసం బాబాలను, మంత్రగాళ్ళను కూడా నమ్మే విధ్యార్థులు తయారవుతున్నారు.
    ఈ విపరీత భావాల వాఖ్యల సరళి చూస్తుంటే ఇప్పటికే జరగాల్సిన నష్టం చాలా జరిగినట్లుగా అనిపిస్తున్నది. రైటిస్టులు, లెఫ్టిస్టులు ఓ నిష్పత్తిలో వుండటం సమాజ ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు ఓ వైపుకే ఎక్కువ పోలరైజేషన్ జరిగి మరో వైపును నాశనం చేస్తున్నాం.
    తటస్థులు తేలిపోతున్న వైపుకు ఇప్పుడు జరగాల్సిన అవసరాన్ని ఈ సంఘటనలు సూచిస్తున్నాయి.

  6. /దభోల్కర్‌తో మొదలైన ఈ హత్యా పరంపర ఇంకా కొనసాగవచ్చు, రైతుల ఆత్మహత్యల్లానే ఇదీ ఒక రెగ్యులర్ తంతు కావచ్చు, అప్పుడు మీడియాలో ఈ హత్యలు ఏ పదో పేజి వార్తో కావొచ్చు!/
    సూపర్ సర్,

  7. /దభోల్కర్‌తో మొదలైన ఈ హత్యా పరంపర ఇంకా కొనసాగవచ్చు, రైతుల ఆత్మహత్యల్లానే ఇదీ ఒక రెగ్యులర్ తంతు కావచ్చు, అప్పుడు మీడియాలో ఈ హత్యలు ఏ పదో పేజి వార్తో కావొచ్చు!/
    పచ్చి నిజం చెప్పారు.

  8. Allam Chaitanya says:

    ఆధ్యాత్మికోన్మాదం కూడా ఒక రకమైన ట్రాన్స్ లాంటిదే. తార్కికమైన ఆలోచనలు కానీ, హేతుబద్దమైన వాదనలు కానీ ఉండవు. self-fulfilling prophecy స్థితిని కూడా దాటి మూర్ఖత్వం వైపుకు మెదడుని తీసుకపోతున్నరు. వివేకం, విచక్షణ, ఇంగిత ఙానం వదిలెసిన ఉన్మాద పరిస్థితులన్నీ ముమ్మాటికీ వంద శాతం భయానకమైన పరిస్థితులే.
    ఎవరి మాట ఎలా ఉన్నా రచయితల స్పందనలో మాత్రమే ఈ ఆగత్యాన్ని గుర్తించిన వ్యాసపు ముగింపు ఎంత వరకు సరైన ప్రశ్న? సూర్యోదయాలకూ, కలువ పూల సోయగాలకు, మతోన్మాదాలకూ ముడి పెట్టాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.

    • Dr. Rajendra Prasad Chimata. says:

      స్పందించని రచయితల ను తప్పు పట్టడంలో తప్పేముంది. కలం పట్టుకున్న ప్రతి వ్యక్తీ స్పందించాల్సిన సంఘటన. ఎవడో రచయిత ఎలా ఛస్తే నాకేం నా ఊహా ప్రపంచంలో నేనుంటాను అనుకోడం కరెక్టేనా?

  9. మెజారిటీ ఆలోచనలకి వ్యతిరేకంగా ఆలోచిస్తే, చంపేయడం…ఎలా స్పందించాలో కూడా తెలియటం లేదు. నాకేమని అనిపిస్తుందంటే, ఇంకొన్ని రోజుల తరువాత, ఈ హత్యలు విన్నా మనం పెద్దగా ఇబ్బంది పడమేమో. ఇలాంటి వార్తలు అలవాటై పోతాయేమో.

  10. బ్రెయిన్ డెడ్ says:

    వాళ్ళు ఏ సినిమా గూర్చో, పెసరట్టు గూర్చో రాసుకుంటారు. ఇంకొంచెం మేధావులు – ఉదయిస్తున్న భానుడి ప్రకాశత గూర్చీ, వికసిస్తున్న కలువల అందచందాల గూర్చీ, అమ్మ ప్రేమలో తీపిదనం గూర్చీ సరదా సరదాగా హేపీ హేపీగా రాసుకుంటారు – అవార్డులు, రివార్డులు కొట్టేస్తారు! ఈ హత్యల పరమార్ధం అదే! ……………గుండెలో నీళ్ళు గడ్డకట్టేలా మితవాదం పుచ్చుకుంటారు . కుండ బద్దలు కొట్టేసారు

  11. ఇలాంటి హత్యలను రాజ్యం శుభ్రంగా ఒప్పుకుంటుంది. ఒక్క రాజకీయనాయకుడూ వీటిని ఖండించడు. స్కాలర్స్ వోట్ బ్యాంకు ఎంత? వేలల్లో ఉంటుందేమో! మరి ఆ శైవ పీఠాలు, ఆ మతం వాళ్ళ వోట్లు లక్షల్లో. ఏ జ్ఞానాన్నీ కొత్తదనాన్నీ సహించం. రచయితలు, మేధావులు ఎంత అల్ప సంఖ్య అండీ. ఎంత మొత్తుకున్నా వాళ్ళ వోట్ బ్యాంకు ఎంత? ఎంతమంది రాసినా సివిల్ సొసైటీ కదలాలి కదా. అది మతం మత్తులో ఉంది. కల్బుర్గి గారి స్నేహితుడు భగవాన్ గారికీ అదే గతి పట్టిస్తామన్న ట్వీట్ కి ఆయన పాపం ఆ tweeter ని తన దగ్గరకు వచ్చి మాట్లాడితే మేధో చర్చ చేస్తానంటున్నారు. తను ఏమాత్రం భయపడనని అంటున్నారు. మేథో చర్చకు ఇవి రోజులా? అంత పెద్ద వయసులో ఉన్న స్కాలర్స్ ని చంపుతుంటే చూస్తున్న సమాజంలో బ్రతుకుతున్నాం. ప్రధాన మంత్రి ముఖ్య మంత్రి స్థాయిలో వీటిని ఖండించి శిక్షలు పడేలా చేస్తే తప్ప ఏ న్యాయమూ జరగని రోజులు. గుజరాత్లో ఎహ్సాన్ జాఫ్రీ గారి భార్య ఆ అన్యాయాన్ని దిగమింగుతూనే బతుకుతోంది. ఎంతమంది ఎంతో రాసి సమాజం అంతగా కదిలిన ఆ సంఘటన లోనే న్యాయం జరగలేదు. ప్రపంచం కుడి వైపుకే నడుస్తూ ఎడమచేతిని నరుక్కుంటోంది.

  12. Mohad Khaism says:

    ఇది నిజంగా సమాజం సిగ్గు పడవలసిన సంఘటన . ఎవరు ఏమి అనుకున్నా ప్రతి మానవీయ హృదయం స్పందించి విమర్శించినప్పుడే ఇలాంటి సంఘటనలు సమాజం హర్షించదు అని తెలుస్తుంది. పోరాడే ధైర్యం అందరికి ఉండు. కాని పోరాటంలో అమరులైన యోధులను స్మరించడం మన కనీస కర్తవ్యం

  13. ‘ఇవన్నీ స్టేట్, నాన్ స్టేట్ ఏక్టర్స్ కూడబలుక్కుని చేస్తున్న నేరాలు. అంచేత ఈ నేరాల్ని స్టేట్ విచారిస్తూనే వుంటుంది. సహజంగానే నిందితులెవరో తెలీదు, కాబట్టి కేసులూ తేలవు.’ …….. సమాజంలో ఒక భయానక వాతావరణం ఉన్నప్పుడు, ప్రాణాలకి తెగించి ఎవరూ రాయరు, మాట్లాడరు. అంచేత వాళ్ళు ఏ సినిమా గూర్చో, పెసరట్టు గూర్చో రాసుకుంటారు. ఇంకొంచెం మేధావులు – ఉదయిస్తున్న భానుడి ప్రకాశత గూర్చీ, వికసిస్తున్న కలువల అందచందాల గూర్చీ, అమ్మ ప్రేమలో తీపిదనం గూర్చీ సరదా సరదాగా హేపీ హేపీగా రాసుకుంటారు – అవార్డులు, రివార్డులు కొట్టేస్తారు! ఈ హత్యల పరమార్ధం అదే!’

    పౌర సమాజంలో జరిగే ఇలాంటి చర్చలే, ఈ హెచ్చరికలే, ఈ మెలకువలే కాస్త రక్షణ మనకు. మంచి వ్యాసం రాసారు సార్.

  14. అజిత్ కుమార్ says:

    రమణ యడవల్లి గారు అనేకమంది వృద్ధులు చంపబడుతున్నారన్నారు. ( అది ఎందుకు జరుగుతుంది… ఎందుకని వృద్ధులే చంపబడుతున్నారు… యువకులెందుకు చంపబడడం లేదు… ఎందుకంటే మేము ముసలివాళ్ళము పెద్దతనం వల్ల ఏదేదో మాట్లాడుతుంటాము … అని సమర్ధించుకునే అవకాశం వారికి ఉంది. ఈమధ్యన కళ్ళు సరీగ్గా కనిపించడంలేదు , మాటలు సరీగ్గా వినిపించడం లేదు , తినలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను అని ఇలా సానుభూతి కోసం ఎదురు చూసే మనస్తత్వం అలవడుతుంది. ఇదే అదనుగా నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడితే ఊరుకుంటారా… అందుకే చంపారు. కనుక చంపడం తప్పాఒప్పా అనే చర్చను అలావుంచితే , ఇలా మాట్లాడడం తప్పు అని మనం గ్రహించాలి. ఇతరులను విమర్శించకూడదు. ఒక ఉదాహరణ అనగనగా ఒక గ్రామం ఉంది ఆ గ్రామ జమీందారుకు అస్వస్థతగా ఉంది. అదే సమయంలో ప్రక్క గ్రామ జమీందారు కాలంచేశారని కబురొచ్చింది. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి తన చిన్నకుమారుడ్ని పిలిచి విషయం చెప్పి, అక్కడ నలుగురూ ఏమంటున్నారో అవేమాటలు చెప్పమని చెప్పి పంపాడు. చిన్నవాడు ఆగ్రామంలోకి వెళ్ళగానే అక్కడున్న ఓనలుగురిని అడిగాడు మీ గ్రామ జమీందారు చనిపోయరటగదా అని.. దానికి వారు పోతే మంచిదేగదా, ఇన్నాళ్ళకి మావూరికి పట్టిన పీడ వదిలినట్టుంది అని అన్నారు. చిన్నవాడు ఇవేమాటలు జమీదారు ఇంటివారితే చెప్పి తన్నులు తిని ఇంటికొచ్చాడు. విషయం తెలుసుకున్న జమీందారు తన పెద్ద కొడుకును పంపి జరిగినదానకి క్షమాపణలు చెప్పిరమ్మని పంపాడు. పెద్దవాడు వెళ్ళి తమ తమ్ముడు అన్న మాటలకు క్షమాపణలు కోరి, ఈ సారి మీఇంట్లో ఇలాంటిది జరిగితే నేనే వచ్చి ఓదారుస్తానని చెప్పాడు. వాళ్ళు వీడ్ని కూడా తన్ని పంపారు. అద్యక్షా…అన్నదమ్ములిద్దరికీ ఎవరితోనూ శత్రుత్వం లేదు. తామకు తెలిసిన విషయాలు చెప్పాడు. అయినా శిక్షించబడ్డారు. ) ఇలా ఒక విషయం పట్ల విరుద్ధమైన అభిప్రాయాలు కలిగుండటం నేరం కాదు. తమ అభిప్రాయాలని స్వేచ్చగా ప్రకటించుకునే హక్కు రాజ్యంగం మనకి కల్పించింది గానీ అందుకు మనం అనేకమంది దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాలి. (రాజ్యాంగం ఇచ్చిందని మాట్లాడితే ఇలాంటివి తప్పదు. ఆకాలంలో ప్రజలు దయాదాక్షిణ్యాలు ఎక్కువగా ఉండడం వల్ల జమీందారు పిల్లలు తన్నులతో తప్పించుకున్నారు. నేటి కాలంలో ప్రజల దయాదాక్షిణ్యాల స్థాయి ప్రకారం వృద్ధులైనా చంపబడుతున్నారు. ప్రజలు ప్రతిస్పందించే తీరు ఇలా ఉండడానికి లేక తీవ్రస్థాయిలోకి మారడానికి కారణం ఏమిటి… మనం తయారయ్యే విధానంలో లోపం. అంటే మనం విద్య నేర్చుకునే పధ్ధతిలోని లోపం వల్ల ఇలాంటి తీవ్రవాద ధోరణి ప్రబలమౌతుంది. ముస్లీం తీవ్రవాదులకు మరణశిక్ష విధించడం తప్పుకాదని ప్రజలు భావించడానికి కారణము ఈ విద్యావిధానమే. హేతువాదులమని చెప్పుకునేవారి పిల్లలు , కమ్యూనిష్టులమని చెప్పుకుంటున్నవారి పిల్లలు కమ్యూనిష్టులు కాకపోవడానికి కారణం ఈ విద్యా విధనమే. లోపం ఎక్కడుందో గమనించకుండా నిందను ఎవరిపై వేస్తారు… నేటి విద్యా విధానం వల్ల సమాజం మతప్రభావంగల తీవ్రవాదులుగా మారింది.
    2. వీరు వృద్ధులు, వీరికి మతం పట్ల డిఫరెంట్ అభిప్రాయాలున్నాయ్. ఎందుకని వృద్ధులకు మాత్రమే మతం పట్ల డిఫరెంట్ అభిప్రాయాలున్నాయి… యువకులకు ఎందుకని మతం పట్ల వ్యతిరేక అభిప్రాయం కలగడం లేదు.అంటే అది విద్యావిధానంలోని విషమే. అక్షరాలు నేర్పే నెపంతో మతవిధానాలు పిల్లల మనసుల్లో నింపబడుతున్నాయి. మనం మన పిల్లల్ని మంచి పాఠశాలలో చదివించినా గానీ వాళ్ళు అలాగే తయారౌతున్నారు. మన పిల్లల్ని మనమే చేజేతులా మతవాదులకు అప్పగిస్తున్నాము. అంత గొప్ప నాయకుని పిల్లలైయుండి మీరేమిటిలా అంటారని సిగ్గుకు వెరచి ఇలా అలా వస్తూపోతూ ఉంటారేగాని వీరిలో వారి తండ్రి ఆలోచనా విధానాలు లేవు. విద్యవల్ల వారిమనసు కలుషితమైపోయింది. వీరి తరువాతి తరం అసలు ఈ వైపుకే చూడరు. డిఫరెంటు అభిప్రాయాలు గలవారిని చంపేవారుగా తయారౌతారు. ఎవరినో నిందించడం, లోపాలు ఎవరిపైనో వేయడం సమస్యకు పరిష్కారం కాదు. కూలిపోతున్న మన శిబిరాలను సింహావలోకనం చేయండి.

  15. Sadlapalle Chidambara Reddy says:

    చచ్చు బతుకుల్ని చూసి భయపడాలి కానీ యుదాల్లో వీర మరణాల్ని చూసి భయపడ కూదదు.

Leave a Reply to suresh Cancel reply

*