భవాని ఫణి
అనుకోకుండా మీకో పుస్తకం దొరికిందనుకోండి . అందులో ఎవరి పేరు రాస్తే వాళ్లు చనిపోతారని కూడా తెలిసిందనుకోండి . అప్పుడు మీరేం చేస్తారు? ఏం చెయ్యాలన్న ఆలోచన మాట అటుంచి అసలు అటువంటి పుస్తకం ఒకటుంటుందన్నఊహ కూడా మనకి రావడం కష్టం కదూ! అటువంటి ఒక విచిత్రమైన ఆలోచనకి దృశ్య రూపమే ‘డెత్ నోట్’
ఒటాకూ (Otaku ) అన్న పదం ఎప్పుడైనా విన్నారా ? పోనీ ‘మాంగా’ అన్న పదం? యానిమే అన్న పదం మాత్రం ఖచ్చితంగా విని ఉంటారు . ఇంట్లో ఓ మాదిరి వయసున్న పిల్లలుంటే ఈ పదాలు వినడం సర్వ సాధారణం . మరీ చిన్నపిల్లలున్న ఇంట్లో అయితే ఎప్పుడు చూసినా డోరేమన్, నోబితాల కబుర్లు వినిపిస్తూనే ఉంటాయి కూడా .
జపాన్ లో ప్రచురితమయ్యే కామిక్స్ ని ‘మాంగా’ అని పిలుస్తారనీ, అలాగే అక్కడ నిర్మించబడే యానిమేటెడ్ చిత్రాలని ‘యానిమే’ అంటారనీ చాలా మందికి తెలిసే ఉంటుంది . ఎక్కువగా ఆదరణ పొందిన మాంగాలు, యానిమేలుగా కూడా నిర్మితమవుతాయి . ఈ యానిమేలలో చాలా ప్రక్రియలు (జెనెరె )ఉన్నాయి. అన్ని వయసుల వారికోసం మాంగాలు వ్రాయబడతాయి . యానిమేలు నిర్మింపబడతాయి .
వాటిలో ముఖ్యంగా యుక్త వయసులో అడుగు పెట్టిన , పెట్టబోతున్న పిల్లల కోసం వ్రాసినవీ, తీసినవీ చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దబడతాయి . అటువంటి ఒక యానిమే గురించే ఇప్పుడు చెప్పబోతున్నది . దాని పేరు “డెత్ నోట్ “. ఇది ముందు ‘మాంగా’ గా ప్రచురింపబడింది . Tsugumi Ohba అనే ఆయన ఈ మాంగా రాసారు . తర్వాత ఇది యానిమేగా కూడా రూపొందించబడి , మంచి ప్రాచుర్యం పొందింది . దీనిలో కొన్ని హింసాత్మకమైన అంశాలున్నాయన్న విషయాన్ని కొంచెం పక్కన పెడితే , ఇంత శక్తివంతమైన, మేధతో కూడిన మైండ్ గేమ్స్ నీ, ఎత్తుల్నీ, పైఎత్తుల్నీ మరెక్కడా చూడలేమంటే అతిశయోక్తి కాదు . 37 ఎపిసోడ్ లున్న ఈ యానిమే సిరీస్, జపాన్ లోని నిప్పాన్ టీవీలో 2006 లో ప్రసారమైంది .
విజ్ఞానాన్నీ ,తెలివితేటల్నీ మంచికోసం వాడితే ఎంత ఉపయోగకరమో , చెడుకి ఉపయోగిస్తే అంత ప్రమాదకరమన్న విషయం అందరికీ తెలిసిందే . డెత్ నోట్ ఇతివృత్తం అదే .
లైట్ యాగామీ అనే పదేహేడేళ్ల అబ్బాయి చాలా తెలివైనవాడు. వయసుకి మించిన పరిపక్వత కారణంగా అతనికి జీవితం నిస్సారంగా అనిపిస్తూ ఉంటుంది . అదే సమయంలో షినిగామీ (మరణ దేవత) ల లోకం నుండి జారి పడిన ఒక పుస్తకం లైట్ కి దొరుకుంతుంది. ఆ పుస్తకంలో ఎవరి పేరు రాస్తే వాళ్లు చనిపోతారు . ఒకే పేరు ఎక్కువ మందికి ఉండే అవకాశం ఉండటం వల్ల, ఆ వ్యక్తి ముఖాన్ని చూసిన తర్వాత అది గుర్తు తెచ్చుకుని పేరు రాస్తేనే అతని మరణం సంభవిస్తుంది . షినిగామీలు ప్రపంచంలోని అందరి మరణాన్నీ నిర్దేశించలేరు . కానీ డెత్ నోట్ ని ఉపయోగించి కొందరి మరణాన్ని ముందుకు జరపడం ద్వారా తమ ఆయుష్షుని పొడిగించుకోగలరు . అటువంటి ఒక పుస్తకాన్ని సరదా కోసం ఒక షినిగామీ భూలోకంలో పడేస్తాడు . అదే లైట్ యాగామీకి దొరుకుతుంది . నిరాసక్తమైన జీవితాన్ని గడుపుతున్న లైట్ , ఆ పుస్తకం నిజంగా శక్తి కలదని తెలుసుకుని ఉత్తేజాన్ని పొందుతాడు . ఆ పుస్తకాన్ని ఉపయోగించి దేశంలో నేరస్తులందరినీ చంపి , తద్వారా నేర వ్యవస్థని సమూలంగా నాశనం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు .
టీవీలో కనిపించే నేరగాళ్ల పేర్లతో ఒక జాబితా సిద్ధం చేసుకుని వాళ్లందరినీ చంపేస్తూ ఉంటాడు . అతని తండ్రి పోలీస్ అధికారి కావడం వల్ల అతనికి నేరగాళ్లకి చెందిన మరింత సమాచారం లభిస్తూ ఉంటుంది . ఇలా ఎక్కువ రోజులు గడవకుండానే ఏదో జరుగుతోందని ఇంటర్ పోల్ కి అనుమానం కలగడంతో, “ఎల్(L)” అనే ఒక అత్యంత ప్రతిభావంతుడైన డిటెక్టివ్ ని రంగంలోకి దింపుతుంది . లైట్ మాత్రం , అభిమానులతో ‘కీరా’ అనే మారు పేరుతో పిలవబడుతూ విపరీతమైన ప్రాచుర్యాన్ని పొందుతాడు .
లైట్ యాగామీనే ‘కీరా’ అన్న అనుమానం డిటెక్టివ్ ‘ఎల్’ కి మొదట్లోనే కలుగుతుంది . అతన్ని పక్కదోవ పట్టించడం కోసం ఇన్వెస్టిగేషన్ లో సహాయపడుతున్నట్టుగా నటిస్తాడు లైట్.
“ఎల్ ” పూర్తి పేరు తెలియకపోవడం వల్ల అతడ్నిమాత్రం ఏమీ చెయ్యలేకపోతాడు .ఆ సమయంలో లైట్ , ఎల్ లు ఉపయోగించే తెలివైన యుక్తులు , కుయుక్తులూ, పరస్పరం చేసుకునే మానసికమైన దాడులూ , ప్రతి దాడులూ చాలా మేధోవంతంగా రచించబడి,రెప్ప వెయ్యనివ్వనంత ఉత్కంఠని రేకెత్తిస్తాయి.
డెత్ నోట్ అసలు యజమాని అయిన, ర్యూక్ అనే పేరుగల షినిగామీ కూడా లైట్ దగ్గరకి వచ్చి అతని దగ్గరే ఉంటూ ఉంటాడు . ఆ షినిగామీ, లైట్ కి తప్ప వేరే వాళ్లకి కనిపించడు . ఇంతలో కీరా వీరాభిమాని అయిన ప్రఖ్యాత మోడల్ మీసా అనే అమ్మాయికి మరో డెత్ నోట్ దొరుకుంతుంది .
లైట్ నే కీరా అని తెలుసుకుని అతన్ని వెతుక్కుంటూ వస్తుంది . ఆ అమ్మాయికి తన మీదున్న అభిమానాన్ని అవకాశంగా తీసుకుని , ఆమెని కూడా కీలుబోమ్మని చేసి ఆడిస్తూ , తన ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటూ ఉంటాడు లైట్ . డెత్ నోట్ లో ఉన్న వివిధ రకాల నియమాలని తనకి అనుకూలంగా మార్చుకుని తప్పించుకు తిరుగుతూ, నేరగాళ్ల హత్యలు కొనసాగిస్తూనే ఉంటాడు . ఆఖరికి ప్రపంచాన్ని ఉద్దరించాలన్న అతని కోరిక, స్వీయ ఆరాధనగా మారి, అమాయకులని సైతం చంపడంతో పాటుగా స్వంత తండ్రినీ , చెల్లెలినీ కూడా అంతం చెయ్యడానికి వెనుకాడనంత క్రూరత్వంగా రూపాంతరం చెందుతుంది . ఎన్నో మలుపుల తర్వాత , చివరగా లైట్ మరణంతో కథ ముగుస్తుంది .
ఎటువంటి డిటెక్టివ్ కథ అయినా దీని ముందు దిగదుడుపే అనిపించేంత బిగువుగా అల్లబడిన కథే ఈ డెత్ నోట్ పాపులారిటీకి కారణం . ఇద్దరు మేధావుల మధ్య జరిగే ఈ దోబూచులాట ఊహించలేనన్ని మలుపులతో నిండి ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది . అన్ని పాత్రల స్వభావం , చిత్రీకరణ వాటి వాటి పరిధులలో ఎటువంటి లోటు పాట్లూ లేకుండా ,అత్యున్నతంగా తీర్చిదిద్దబడ్డాయి . అంతే కాక డెత్ నోట్ నియమాలు విచిత్రంగా, చాలా ఆసక్తికరంగా ఉంటాయి . సంగీతం కూడా ఈ యానిమేకి గొప్ప బలం .
మచ్చుకి కొన్ని డెత్ నోట్ నియమాలు
- ఈ పుస్తకం లో పేరు రాయబడిన వ్యక్తి చనిపోతాడు
- చంపాలనుకునే వ్యక్తి ముఖాన్ని మనసులో ఊహించుకుని పేరు రాస్తేగానీ మరణంaug27 సంభవించదు .
- పేరు రాసిన నలభై సెకండ్ల లోపు , మరణానికి కారణం కూడా రాయాలి .
- మరణానికి కారణంకనుక పేర్కొనకపోతే, అదిహార్ట్ అటాక్ గా తీసుకోబడుతుంది .
- డెత్ నోట్ కలిగి ఉన్నమనిషి, ఆ డెత్ నోట్ అసలు యజమాని అయిన షినిగామీకి చెందుతాడు .
- డెత్ నోట్ కలిగి ఉన్న మనిషి లేదా తాకినమాత్రమే ఆషినిగామీని చూడగలుగుతాడు . వినగలుగుతాడు
- డెత్ నోట్ ని వేరే మనిషికి పూర్తిగా ఇచ్చివేయడం గానీ , కొన్ని రోజుల పాటు ఇవ్వడం గానీ చెయ్యవచ్చు .
- ఒక వ్యక్తి డెత్ నోట్ నివేరే వాళ్లకి ఇచ్చి వేస్తే , దానికి సంబంధించిన విషయాలన్నీ మరచిపోతాడు .
………………………..
ఇటువంటి నియమాలు వంద పైనే ఉంటాయి . అవన్నీ చూడాలనుకుంటే ఇక్కడ చూడచ్చు .
http://deathnote-club.deviantart.com/art/All-Deathnote-Rules-116939019
ఇంతకీ “ఒటాకూ” అంటే చెప్పనేలేదు కదూ , ఏదైనా ఒక వ్యాపకానికి దాసోహం అయిన వ్యక్తిని జపనీస్ లో “ఒటాకూ” అని పిలుస్తారు . ముఖ్యంగా యానిమేలు చూడటానికి అలవాటు పడిన వారికోసం ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు . ఒకసారి ఒటాకూగా మారి , వాటికి ఎడిక్ట్ అయితే పిల్లలైనా పెద్దలైనా బయట పడటం కొంచెం కష్టమే .
అయినా సరే చూడాలనుకునేవారి కోసం డెత్ నోట్ మొదటి ఎపిసోడ్ లింక్ ఇదిగో
http://kissanime.com/Anime/Death-Note/Episode-001-Rebirth?id=93417
నేను ఒటాక కాదు. కాని మీ రివ్యూ చదివిన తర్వాత మాత్రం చూడాలనిపిస్తోంది
ఓహ్ , ధన్యవాదాలు దత్తాత్రేయ రెడ్డి గారూ
మీరు రాసే విశ్లేషణలు చాలా నచ్చుతాయి నాకు భవాని గారు .వొక కవితలోకో,కథలోకో చొచ్చుకుపోయి రాయడం వేరు.కానీ యిటువంటి వాటి మీద రాయడం చాలా కష్టం .మీరు మాత్రమే యిలా రాయగలరు.అద్భుతంగా రాసారు భవాని గారు.కంగ్రాట్స్.
చాలా హాపీ , thank you తిలక్ గారూ