జగదల్ పూర్ జైల్ సెల్ అనే నేను…!

కోగంటి  విజయ్ 
~
koganti
నా కనుల ముందట  యీ వుదయ, అస్తమయాలు రెండూ రక్త వర్షాలే!
రెండూ మదించిన కామపు వాసనలే!
కాంక్రీటుగోడల, ఇనుప తలుపులతో నిలచి వున్నా
నా ముందు తిరుగాడే యీ
అధికార మృగాలకు,
రోజూ శిథిల మయే హృదయాలకు,
నేనో క్షుభిత సాక్షిని!
ఎంక్వైరీ పేరున
నిరంతరంగా నా ముందు జరిగే
నిత్య స్త్రీ దోపిడీకి,
కర్కశత్వపు అడుగుల క్రింద,
పొగరు బట్టిన లాఠీల చివరన, జరిగే
క్రౌర్యపు శీల విధ్వంసానికి
క్షణక్షణం దహనమయే
నిస్సహాయపు అబలత్వానికి
నేనో  సిగ్గు విడిచిన సాక్షిని!
కరుణను మరచిన
మృగత్వపు దురదకు
మాంసపు ముద్దల్లా మారి
ఎండిన కన్నీటి చారలతో
దగ్ధమయే
వేదనా యోనులకు,
నేనో గుండె పగిలిన సాక్షిని!
అమాయకుల ఆక్రందనలకు,
ఆక్రమింపబడిన దేహాలను
పొర్లించుకున్న నెత్తుటి మరకల నేలలకు,
నేనో కాంక్రీటు సాక్షిని!
దిక్కులు పగిలేలా అరిచే
భయవిహ్వల గాత్రాలకు,
వేడుకోళ్ళకు,
నిస్సహాయపు తిట్లకు,
క్రూర వికటాట్ట హాసాలకు,
నేనో చెవులు చిల్లులు పడిన బధిర సాక్షిని!
అమాయకపు అడవి జింకలను వలవేసి
కబళించే
అన్యాయ వ్యవస్థా పరిరక్షక భటుల
పశు వాంఛలకు,
నేనో నిర్జీవచ్ఛవ సాక్షిని!
కళ్ళకే కాక మిగిలిన వాటికీ గంతలు కట్టుకు
వేచిచూసే ధృతరాష్ట్ర
తీర్పులకు,
నేనో అంథ సాక్షిని.
(నిర్దోషిగా యేడేళ్ళ పాటు క్రూరంగా హింసింపబడి వెలుగు చూసిన ఆదివాసీ ధీర హిద్మీ నరక యాతనలు చదివి చలించి వేదనతో-)

మీ మాటలు

  1. విలాసాగరం రవీందర్ says:

    టచింగ్ పోయెమ్ విజయ్ గారు

  2. రక్తం మసిలే స్థితిని అక్షరం చేసి కవితనేగరేశారు.

  3. N kutumba rao says:

    Heart touching పోయెమ్ విజయ్ sir

  4. VVLNSPrasad says:

    క్షుభిత, సిగ్గువిడిచిన, గుండెపగిలిన,కాంక్రీటు,
    బధిర, జీవచ్చవ,అంధ సాక్షి వేదన citynightpiece
    ని జ్ఞప్తికి తెస్తోంది సోదరా!ధన్యవాదాలు

    ,

  5. Lalitha P says:

    ఒక్కసారిగా కదిపి కుదిపేశారు విజయ్ గారూ. ధృతరాష్ట్ర తీర్పుల వరకూ కూడా వెళ్ళనివ్వకుండా ‘అన్యాయ వ్యవస్థా పరిరక్షక భటులు’ చేసే హింస ఎంతటిదో జైలు సెల్ లన్నీ నిజంగా చెప్పగల్గితే, ఆ ఘోష అన్ని వ్యవస్థల చెవులూ బద్దలుగొట్టేస్తుంది.

  6. మంచి ఆలోచింపచేసే కవిత బాగుంది! స్త్రీ ఎలా ఇప్పటికి అన్నిరకాలుగా హిమ్సిన్చాబడుతోందో తెలిపే కవిత!
    కీప్ ఇత్ అప్!
    దివాకర్

  7. VaraLakshmi says:

    బాబు,చాలా మూవింగ్ కవిత ! మూగ వెయ్దనకి మాటలు ….

  8. Delhi Subrahmanyam says:

    చాలా హృదంతంగా రాశారు. మనస్సును కదిలించి మన మీద మనకే కోపం తెప్పిస్తుంది, ఈ దుర్మార్గమయిన వ్యవస్థలో మనమూ భాగమయినందుకు.

  9. కె.కె. రామయ్య says:

    హృదయవిదారకమైన హిద్మీ నరక వేదనను అక్షర బద్దం చేసింది విజయ్ గారి కవిత.
    కవసి హిద్మీ అన్ హెర్డ్ స్టొరీ కి లింకు ఇక్కడ :

    https://arunferreira.wordpress.com/2015/05/03/the-relevance-of-kawasi-hidmes-unheard-story-by-sushmita-verma-art-by-sushmita/

  10. Vijay Koganti says:

    Thank you for reading my poem and your appreciation dear friends!

Leave a Reply to N kutumba rao Cancel reply

*