కొన్నిమాటలంతే …

 

 

అనిల్ డ్యాని  

Anil dani

 

 

మంచు కురిసినప్పుడు

కొంతగడ్డి పూలమీద

కొంత సాలె గూడు తీగల మీద పరుచుకుంటుంది

కొన్నిమాటలూ అంతే నేమో

 

ఈ కాఫీ బాగుంది అని చెప్పేలోపే

కాలి పట్టీల  శబ్దం వంటగది గుమ్మంలోకి

విసవిసా వెళ్ళిపోతుంది

భద్రంగానే ఉంది కదా కాఫీ కప్పు

అయినా ఏంటి గుండెలో ఏదో భళ్ళున పగిలిన శబ్దం

 

స్పర్శ లేకపోయినా

మాటలు భలేగా గుచ్చుకుని పోతాయి

ఇటుక ఇటుక  మధ్యలో మౌనాన్ని

నింపి  నిర్మించాక

నాలుగు గోడల మధ్యన  జీవిత ఖైదు

ఒకానొక అలవాటుగా మారిపోతుంది

 

అవును నీవొక నక్షత్రానివే

నీకై నీవు వెలుగులు నింపాలి

ఎక్కడిదో నీదికాని కాంతిని

పూసుకుని వెలిగి పోవాలి

కాదనలేనంత వైశాల్యం నీకున్నా

వెలిగినంత సేపు వెలిగి

నీ గుమ్మం ముందే కదా   రాలి పోవాలి

 

పోగేసుకున్నంతకాలం

రాయో , రప్పో  పక్కనే ఉంటాయి

వాటితో పాటుగా మాటలూనూ

ఆయుధాలుగా పనికొచ్చేవన్నీ

వదిలి పెట్టి మాటలనే

వాడుతూ పోతే చివరకి మిగిలేది

రాళ్ళు , రప్పలు ,మాటలు చేసిన మౌన గాయాలు

*

మీ మాటలు

  1. Anil Dani says:

    సంపాదక వర్గానికి థాంక్యూ వెరి మచ్ మొదటి సారిగా నా కవితను ఇక్కడ ప్రచురించినందుకు

  2. కొన్ని మాటలు భలే వాడావ్, డానీ, ఎండిగ్ ఇలా వుంటే బావుండేదనిపించింది,.
    పోగేసుకున్నంతకాలం

    రాయో , రప్పో పక్కనే ఉంటాయి

    వాటితో పాటుగా మాటలూనూ

    అవి చేసిన మౌన గాయాలూనూ.

  3. కవిత బాగుంది అనిల్ డ్యాని గారూ. చివరి ఏడు పంక్తుల్లో చెప్పిన భావం చాలా బాగుంది. కంగ్రాట్స్. అయితే ‘వంటగది గుమ్మంలోకి’ అనే బదులు ‘వంటగదిలోకి’ అంటే సరిపోయేదేమో.

  4. అనిల్ డ్యాని says:

    భాస్కర్ అన్నా ధన్యవాదాలు , నేను మొదట రాసుకున్న వెర్షన్ అదే అయితే మరీ కొంచం ప్రాసతో ముగించాల్సివస్తుందేమో ఇలా రాసాను

  5. అనిల్ డ్యాని says:

    ఎలనాగ గారు మీ లాంటి పెద్దల మాటలు ఆశీర్వచనాలు అయితే అక్కడ ఒక సన్నివేశాన్ని సృష్టించడం కోసం వంటగది గుమ్మం అని వాడవలసి వచ్చింది. మీ కన్నా చిన్నవాడిని మీ కవిత్వం మరియు అనువాదాలు చదువుతూ ఉత్తేజం పొందినవాడిని నన్ని అనిల్ అనండి చాలు గారు అని అవసరం లేదు సార్

  6. ఆర్.దమయంతి. says:

    ఈ కాఫీ బాగుంది అని చెప్పేలోపే

    కాలి పట్టీల శబ్దం వంటగది గుమ్మంలోకి

    విసవిసా వెళ్ళిపోతుంది

    ‘ఈ కాఫీ బాగుంది అని చెప్పేలోపే

    కాలి పట్టీల శబ్దం వంటగది గుమ్మంలోకి

    విసవిసా వెళ్ళిపోతుంది

    భద్రంగానే ఉంది కదా కాఫీ కప్పు

    అయినా ఏంటి గుండెలో ఏదో భళ్ళున పగిలిన శబ్దం.. ‘
    – ఎంత సహజమైన భావ వ్యక్తీకరణ! మీ పదాలలో అది కవిత్వమై చుట్టుకోడమే ఇక్కడి విశేషం.
    అభినందనలు.

  7. అనిల్ డ్యాని says:

    ధన్యవాదాలు దమయంతి గారు

  8. N Venugopal says:

    అనిల్ డ్యాని గారూ,

    కవిత బావుంది. ఒక సున్నితమైన భావనను శక్తిమంతమైన అభివ్యక్తిలో చెప్పారు. కొద్దిగా ఎడిట్ చేసి ఉంటే మరింత సాంద్రంగా తయారయ్యేది….

  9. అనిల్ డ్యాని says:

    వేణు గోపాల్ గారు ధన్యవాదాలు , మీ సూచన స్వీకరిస్తాను

  10. బ్రెయిన్ డెడ్ says:

    మాటలు చేసిన మౌన గాయాలు !! సున్నితంగా గుచ్చింది

  11. dr makkena sreenu says:

    అనిల్ గారు ! మాట భలేగా గుచ్చుకు పోతుంది ఆయుధంలా ! ఆ మాట తో మిగిలేది వెనకేసిన రాళ్ళు రప్పలు మౌన గాయల్లాగా … చక్కటి మాట చెపారు మీ కవిత్వం ద్వారా … సరళంగా వుంది .. మనసుకు హత్తుకునేట్లు వుంది .. కొన్ని మాటలే మీ కవిత్వం గురించి … అవి “మీకు నా అభినందనలు”

  12. SREERAM PUPPALA says:

    Dany, Your poem is wonderful…………mugdhudnaipoyaaanu……expression is really wonderful.

  13. వనజ తాతినేని says:

    చాలా చక్కగా ఉంది . నచ్చింది అనిల్ గారు .

మీ మాటలు

*