ఇసుక మేడలు      

Madhuఊరు టౌనుగా ఉన్నపుడు నిలకడగా నేలపై ఉండేది. కార్పోరేషన్గా మారగానే ఆకాశంలోకి పాకిపోయి ఊరి  స్వరూపాన్ని, నాగోజీ నుదిటి రాతలని మార్చేసింది. ఈ రోజు అయనకి ఘన సన్మానం.

ఆఫీసు కిటికీలోంచి సగం మొలచిన కట్టడాన్ని, రాసులుగా పోసున్న ఇసుకని చూస్తూ “అప్పిగా  ఏర్పాట్లేలా ఉన్నాయి” అని అడిగాడు నాగోజీ. “బెమ్మాండమండి, ఇందాక ఈర్రాజు ఫోన్సేసి ఊరంతా మీ పేరే అన్నాడండి…” మెలికలు తిరుగుతూ చెప్పాడు పీఏ అప్పారావు.

“ఎన్నేపారాలున్నా, మన పరపతి రోగంలా పాకిపోయినా… సమ్మానాల దారి ఏర్రా” అని ముక్తాయించాడు నాగోజీ.

“బాగా సెప్పారు” అని శ్రమ పడకుండా అన్నాడు పీఏ. గదిలోకొచ్చిన అసలు విషయం గుర్తొచ్చి “ఇసుక్కాంట్రాటర్… ఓ అరగంట నుంచి ఎయిటింగండి” అని చెప్పాడు

“ఆడవసరమా, మనవసరమా? కూర్చోనియ్యి….” అని విసురుగా చెప్పి ఏసీకెదురుగా కూర్చున్నాడు. గాలాడక్కాదు నాగోజీకి ఉత్సాహంతో ఊపిరి ఆడట్లేదు, పీఏకి విషయం అర్థమయి గది నుండి నిష్క్రమించాడు.

ఇంకో రెండు గంటల్లో స్టేజిపై సిల్క్ పంచె, లాల్చీ వేసుకుని ఉత్సవ విగ్రహంలా కూర్చుంటాడు, అసలే పసుప్పచ్చ శరీరమెమో ఫోకస్ లైట్ల కాంతిలో మెరిసిపోతుంది. అర నిముషానికోసారి ఏడుకొండలు ఫోటో తీస్తాడు. వీర్రాజు శాలువాతో సత్కరిస్తాడు. సమితి కార్యవర్గం మూకుమ్మడిగా మీదపడి ‘జన బంధు’ బిరుదు ప్రధానం చేస్తుంది. ఇక పొగడ్తల పోటీలు  కాగానే మొహమాటం నటిస్తూ ‘పెజాసేవ నా బాద్యెత, కితం జన్మ సుకుతం’ అని ముగిస్తాడు.

భవిష్యత్తు దృశ్య రూపంలో కవ్విస్తుంటే ఆదుర్దాగా మురిసిపోయాడు.

ఓ పావుగంటకి బండ గొంతుతో “అన్నారం ఎల్లాలటండి” అంటూ పీఏ లోపలకి అడుగెట్టగానే దృశ్యం నొచ్చుకుని అదృశ్యమయ్యింది.

నాగోజీకి మాట్లాడే మూడ్ లేకపోయినా కాంట్రాక్టర్తో ఒప్పందం తప్పదు కాబట్టి “సరే ఎదవని రమ్మను” అని పెళుసుగా  అన్నాడు. ఓ నిముషానికి ఇసుక కాంట్రాక్టర్ అన్నవరం తప్పు చేసినవాడిలా నిలబడ్డాడు.

“ఏరా! అంతడావిడేంటి? ఓ ఇద్దర్ని బయపెట్టి, నాలుక్కాలవలు తవ్వేసరికి పెద్ద మనిషైపోయావా?” అని హుంకరించాడు.

“అది కాదండి, కొంతూరెల్లాలి సీకటటుద్దని ”

“కొత్త యెమ్ఆర్వో ని లొంగెయ్యాలా.. యెమ్.ఎల్.ఏని సాచిపెట్టి కొట్టాలా? నువ్వంటే సీకటి బయపడాలి గానీ…నీకు బయమెంటేహే?… ” అని వెటకారంగా నవ్వాడు.

“అయ్ బాబోయ్! అదేవీ లేదండి… ఓ రెండ్రూపాయలు ఎనకేసుకుంటే గిట్టనెధవలు ఇలేకరికి కబురెట్టి యాగీ సేసారండి”

Kadha-Saranga-2-300x268

“ఈ మద్యన ఇసక్కోసం కలెట్టర్ని కప్పెట్టెసారని సదివాను… అలాంటి.. ”

“లేదండి.. మనకెందుకండి పాపపు డబ్బు, నాయంగా సంపాయించుకుంటే నిలుద్దండి”

“మరే… ఆ ఇసయం నువ్వూ, నేను..చాగంటోరి పక్కన కూర్చుని జనాలకి సెప్పాలి” అని గది దద్దరిల్లేలా నవ్వాడు.

“మీకు మహా ఎటకారమండి…” అని గొంతు కలిపాడు అన్నవరం.

“అవునొరేయ్ మీ ఓడు పంపా, నువ్వు తాండవని కొబ్బరి చిప్పలా కోరేత్తునారంట” అని ఆరాగా అడిగాడు.

“లేదండి పట్టా ఉన్న మేరకే తవ్వేవండి”

“ఇనాలె గానీ రోజంతా సొల్లు సెపుతావు… ఒచ్చిన ఇసయం సెప్పు”

“… అంటే ముప్పై కాడికి సేసుకుందారండి”

“ఇరవై”

“ఇంకో మాట సెప్పండి”

“తేరగా దొరికిందానికి పదిచ్చినా దండగే”

“అంత మాట అనేయ్యకండి, పై నుంచి కింద్దాకా ఇచ్చుకుంటూ రావాలి”

“సూర్రావు ఇరవై రెండన్నాడు”

“గిట్టదండి, పాటకి పాతిక, లోడు దింపడానికి మూడండి..రెండు కూడా మిగల్దు”

“నేనీ రోజు పుట్టలేదు….. తత్తి కబుర్లు సెప్పకు”

sarange.isuka meda

“మీ దగ్గర దాపరికం ఎందుకండి.. సూర్రావుది తొర్ర ఇసకండి, అంతా మట్టి.. తాండవ ఇనుమండి…మహా గట్టిసక”

“దగ్గరుండి పండించావా?”

“నిజమండి… పరాసికాలు కాదు”

“సరే నీ మాట అట్టుకుని సిమెంట్ ఆపిచ్చేత్తాను…  ఇసక, ఇటుక కలిపి ఇల్లు కట్టేయ్యచ్చు”

“అంటే… మన ఇల్లల్లో ఇసకెక్కువని టాకండి” అని గురి చూసి కొట్టాడు అన్నవరం.

ఆ మాటకి ఖంగు తిని నాగోజీ కాస్త వెనక్కి తగ్గాడు “ఏ ఎదవన్నాడు, కాల్లు సేతులు ఇరిసెయ్యగలను…అపాట్మెంట్టు కనికలా కట్టించాను… రాయిలాంటి ఇల్లు” ఉద్వేగంగా అన్నాడు నాగోజీ. .

“నేనూ పాడెదవలకి అదే సెప్పానండి” అని లోపల నవ్వుకున్నాడు.

లొసుగులు మనసు విప్పి చెప్పుకునేసరికి ఇద్దరికీ గౌరవం పుట్టుకొచ్చింది.

“ఈర్రాజు ఫోనండి.. హాల్ దగ్గరున్నాడు” అని పీఏ పిలవగానే బయటకి వెళ్ళాడు నాగోజీ.

రహస్యం మాట్లాడాలంటే వాళ్ళు పెట్టుకున్న కోడ్ పదం ‘ఫోను’. ముందే చేసిన లెక్కలు పీఏతో మరోసారి సరి చూసుకున్నాడు నాగోజీ. ఈ ప్రకారం బేరం కుదిరితే ఖర్చు పదహారుకు మించదని పక్కాగా తేల్చుకుని లోపలకి వచ్చాడు.

అన్నవరాన్ని కిటికేలోంచి బయటకి చూపిస్తూ “ఈ పక్కది కాకుండా మనవి మూడు కొత్తవొత్తాయి, అన్నింటికి నువ్వే ఇసుక తోలుకో, డబ్బు బదులు అపాట్మెంట్ రాసిత్తాను.. ఏమంటావ్” అన్నాడు నాగోజీ.

“అన్నారం…ఎటు చూసినా నీకే లాబం..ఉంచుకో…అమ్ముకో.. నీ ఇట్టం” అని యజమానిని సమర్ధించాడు పీఏ.

అన్నవరం ఊహించని ఒడంబడికకి కాస్త ఆశ్చర్యం, బోలెడు అనుమానం వేసింది.

“మావోడికి ఓ మాట సెప్తానండి” అని ఫోన్ తీసి బయటకెళ్ళాడు, కాసేపటకి లోపలకి వచ్చి “అంటే… మావోడు ఓ సారి సూసి రమ్మనాడండి” అని అన్నాడు.

“యాపారం నీ దగ్గర, మీఓడి  దగ్గర నేర్సుకోవాలి… ” మెచ్చుకోలుగా చురక పెట్టాడు నాగోజీ

పీఏ తొందరపడుతూ “తర్వాత సూపిద్దారండి… ఇంకో గంటలో సమ్మానం” అన్నాడు.

“పర్లేదేహే దార్లోనే కదా…” అని నిదానం నటించాడు నాగోజీ.

కారు అపార్ట్ మెంట్ దగ్గర ఆగగానే గోడపై సన్మానం తాలూకు పోస్టర్ కనపడింది. నాగోజీ దాని వంక గర్వంగా  చూసుకుంటూ కారు దిగాడు. కూలివాళ్ళు ఆ రోజు పనులు ముగించుకుని సామాన్లు సర్దుకుంటున్నారు, పీఏకి ఇవ్వాల్సిన కూలీ డబ్బులు గుర్తొచ్చి ‘ఓ నివషంలో వచ్చేత్తాను” అని మేస్త్రీ దగ్గరికి పరిగెత్తాడు, మిగతా ఇద్దరు ముందుకెళ్ళారు.

వాచీ చూసుకుంటూ అన్నవరాన్ని అమ్ముడవ్వని నాలుగో అంతస్థు అపార్ట్మెంట్కి తీసుకొచ్చాడు నాగోజీ. గదులు, కిటికీలు, ఆకాశాన్ని చూపించి ‘ఏమంటావ్?” అనడిగాడు

ఓ రెండు గంటల తర్వాత…

హాల్ కిట, కిటలాడుతోంది. ఏసీ సరిగ్గా పనిచేయక జనాలు పేపర్లు విసురుకుంటూ, విసుక్కుంటూ స్టేజీ కేసి చూస్తున్నారు. ఓ గంట ఆలస్యంగా జనవాహిని కార్యదర్శి శ్రీ వీర్రాజు స్టేజీ పైకొచ్చి “మన నగరానికి గర్వకారణం…జనబంధు శ్రీ నాగోజీ గారు… ఈ రోజు అపార్ట్ మెంట్ కూలి మృతి చెందారు. వారి కుటుంబానికి జనవాహిని తీవ్ర సంతాపం తెలియజేస్తోంది…… ” అని ముగించాడు.
*****

మీ మాటలు

  1. రావిశాస్త్రిగారు పూనారా …మధుగారూ..గిల్లుతూనే కితకితలు పెట్టారు ..

    • నర్సన్ గారు, మీ ఎక్స్ ప్రెషన్ “గిల్లుతూనే కితకితలు పెట్టారు ..” బావుంది :-)

  2. వెంకట్ కొండపల్లి says:

    మధు గారు,
    అన్నారం నాగోజి ల మద్ద్య సంభాషణ, ఊహించని మలుపుతో కథని ముగించిన తీరు నచ్చింది.

    • థాంక్స్ వెంకట్ గారు, మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.

  3. S. Narayanaswamy says:

    చాలా బావుంది. అభినందనలు.

  4. మధు-రావి శాస్త్రి పూనారా అని పైన అన్నట్లు రావు గోపాల్ రావు దిగోచ్చాడా అనిపించింది….మాటలు మసాల బటాన్నీలాగా కర కర మరియు గర గర. అపార్ట్ మెంట్ ఎక్కగానే జానే భి ధో యారో గుర్తొచ్చే……truly an intoxicating potion! ముగింపు వెటకారంగా, నిర్దయగా , నిగమ శర్మ అక్క లాగున ఉంది!

  5. Raja Rajeswari Kalaga says:

    చాలా బాగుంది . ఏకబిగిన చదివించింది కధనం.మీరు త్వరలో సినిమాలకి సంభాషణలు రాసినా ఆశ్చర్యం లేదు…అంత బాగున్నాయి సంభాషణలు.

Leave a Reply to Madhu Cancel reply

*