వెంగలిమణులు నీ వేలిగోర బోలునా?

 

అవినేని  భాస్కర్ 

Avineni Bhaskarప్రపంచంలో మొట్టమొదటి కవిత స్త్రీ ప్రేమను పొందడానికో, లేదు స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడానికో పుట్టుంటుంది!

స్త్రీలు అలంకార ప్రియులు. ఎంత అందంగా ఉన్నా ఆభరణాలతో అలంకరించుకుంటారు. తమ అందాన్ని చుట్టూ ఉన్నవాళ్ళు గమనించాలనీ, పొగడాలనీ అనుకుంటారు.

మామూలుగా మనం “అమ్మాయి అందంగా ఉంది” అని చెప్పడానికి “అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది” అనంటాం. మన భారతీయ సంస్కృతిలో మహాలక్ష్మి ముఖ్యమైన దేవతే కాదు, అందానికి మారుపేరుకూడా. అటువంటి మహాలక్ష్మికైనా ఇంకా అందంగా కనిపించాలనే తపన పడుతుంది. ఆభరణాలతో అలంకరించుకుంటుంది. ఇది గమనించిన ఆమె చెలికత్తెలు “సహజంగా అందగత్తెవు! ఎందుకు నీకు ఈ పై మెరుగులు?” అని ప్రశ్నిస్తూ ఆమె అందాలను పొగుడుతున్నారు.

ఈ సందర్భానికి అన్నమయ్య రాసిన కీర్తనిది.

AUDIO : గందము పూసేవేలే కమ్మని మేన
పాడినవారు : సుశీల, వాణిజయరాం
స్వరపరచినవారు : గుంతి నాగేశ్వర నాయుడు

 

పల్లవి

గందము పూసేవేలే కమ్మని మేన యీ –

గందము నీ మేనితావికంటె నెక్కుడా

 

చరణం 1

అద్దము చూచేవేలే అప్పటప్పటికిని

అద్దము నీ మోముకంటే నపురూపమా

ఒద్దిక తామరవిరివొత్తేవు కన్నుల నీ –

గద్దరి కన్నులకంటె కమలము ఘనమా

 

చరణం 2

బంగారు వెట్టేవేలే పడఁతి నీ మెయినిండా

బంగారు  నీ దనుకాంతి ప్రతివచ్చీనా

ఉంగరాలేఁటికినే వొడొకపువేళ్ళ

వెంగలిమణులు నీ వేలిగోరఁ బోలునా

 

చరణం 3

సవర మేఁటికినే జడియు నీ నెరులకు

సవరము నీ కొప్పుసరి వచ్చీనా

యివలఁ జవులు నీకునేలే వెంకటపతి –

సవరని కెమ్మోవి చవికంటేనా

 

మూలం : తి.తి.దే వారు ముద్రించిన తాళ్ళపాక సాహిత్యం సంపుటం : 5 కీర్తన : 2

annamayya

 

తాత్పర్యం (Explanation) :

ఓ పడతీ, ఒంటికి చందనం పూసుకుంటున్నావెందుకు? నీ మేనిలో సగజంగా ఉన్న సుగంధంకంటే ఈ గందపు వాసన ఏం గొప్పదనీ?

అద్దంలో ఏముందని పదేపదే చూసుకుంటున్నావు? అద్దంకంటే అపురూపమైనది నీ ముఖం. కళ్ళకి తామర పువ్వులొత్తుకుంటున్నావు. నేర్పెరిగిన నీ కన్నులతో పోలిస్తే తామరపువ్వులు ఏ కొసకీ సరిపోవు. అలాంటి వాటిని అద్దుకుంటే నీ కళ్ళల్లోని చల్లదనం తామరపువ్వులకి వెళ్తుందిగానీ? తామపువ్వులొత్తుకోవడం వల్ల కళ్ళకేం చల్లదనం వస్తుంది?

ఒంటిపైన బంగారు నగలను తొడుక్కుంటున్నావు. నిగనిగలాడే నీ ఒంటి కాంతికంటే ఈ నగల నిగనిగ దేనికి పనికొస్తుందనీ? సన్నగా, పొడవుగా, నాజూగ్గా ఉన్న నీ వేళ్ళకి ఉంగరాలవి అవసరమా? వేళ్ళ చివర్లో తెల్లగా మెరిసే నీ గోళ్ళకి సాటిరావు ఆ లేహపు ఉంగరాలు.

జుట్టు పలుచగా, పొట్టిగా ఉంటే సవరం కావాలేమోగానీ, పొడవుగా, ఒత్తుగా మెరిసే నీ జుట్టుకి సవరమెందుకు? అలికుంతలివి! సవరం చుట్టుకుంటే సహజమైన నీ కొప్పకి సరితూగుతుందా?వేంకటపతి ప్రేయసివి. అతని ఎర్రటి పెదవుల రుచి ఎరిగినదానివి! ఆ కెమ్మోవి రుచి ముందు ఇహలోకంలో ఏవీ రుచించవు.

 

కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :

గందము = చందనం (గంధము), సువాసన

ఏల, ఏలే = ఎందుకు, ఎందుకే

కమ్మని = తీయని పరిమళం

మేని = ఒళ్ళు

తావి = సువాసన

ఎక్కుడా = గొప్పదా, మేలైనదా

 

ఒద్దిక = పోలిక

గద్దరి = గడుసరి స్త్రీ, నేర్పరి

గద్దరికన్నులు = నేర్పెరిగిన కన్నులు

 

పడతి = స్త్రీ

మెయి = ఒళ్ళు, తనువు

ప్రతివచ్చీనా = సరితూగేనా

ఒడికపువేళ్ళు = సన్నగా పొడవుగా ఉండే నాజూకైన వేళ్ళు

వెంగలిమణులు = లోహములతో తయారు చేయబడిన నగలు

బోలునా = పోలిక ఉంటుందా?

 

జడియు = ఎక్కువయిన (పొడవైన అని అన్వయించుకోవచ్చు), ప్రసిద్ధమైన

నెరులు = కురులు, జుట్టు

ఈవల = ఇహలోకము, మామూలు, ఇక్కడ

చవులు = రుచులు

సవరని = అందమైన, చక్కని

కెమ్మోవి = ఎర్రని పెదవులు

చవి = రుచి, అనుభవం

 

విశ్లేషణ (Analysis) :

గందము అన్న పదం చదవగానే ఇదేదో అచ్చుతప్పేమో అనుకోనవసరం లేదు. గందము సరియే! సులువైన భాషలో, జానపద శైలీలో ఉన్న అన్నమయ్య కీర్తనల్లో సంస్కృత పదాలను అక్షరాలలో ఇలా ఒత్తులు తీసేసి వాడటబడటం తరచుగా కానవచ్చు. అలాగే ఆయన, కీర్తనలకు మేలైన నుడి అని దేన్నీ ఎన్నుకోలేదు. తాను తెలుసుకున్న పరతత్వాన్నీ, జీవితసారాన్నీ సమాజంలో అన్ని వర్గాల వారికీ అందించాలన్న రీతిలో కీర్తనలు రాశాడు. ప్రపంచంలోని ప్రతిదీ పరబ్రహ్మ రూపంగానే భావించాడు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నది లేదన్నమయ్య దృష్టిలో.

అందుకే తాను చెప్పాలనుకున్న భావాన్ని పలు రకాల భాషల్లో చెప్పాడు. కొన్ని కీర్తనలు పూర్తిగా పామరుల భాషలోనే ఉంటాయి. కొన్నేమో అచ్చతెలుగు పదాలు. కొన్నేమో గ్రాంధికమైన తెలుగు. కొన్నేమో పూర్తి సంస్కృతం. మరికొన్నిట్లోనేమో అన్నిట్నీ కలిపి రాయడం. అన్నమయ్య కీర్తనల్ని ఏ కోణంలో చూసినా ఆయన సర్వసమతా దృష్టి అగుపిస్తుంది. భాషా పండితులు ఆయన కీర్తనల్లో ఎన్నోచోట్ల దుష్టసమాసాలు ఉన్నట్టూ, వ్యాకరణ దోషాలున్నట్టు చెప్తారు. అంటే ఆయన భాష చేతగాక, వ్యాకరణం తెలియక కాదు. చంధోబద్ధమైనవీ రాశాడు. కీర్తనల్లో ఆయన చెప్పాలనుకున్న భావానికి ప్రాధాన్యమిచ్చాడు.

యేల(ఎందుకు), యాడ(ఎక్కడ), ఏంది(ఏమిటి) వంటి పదాలు నేడు చిన్నచూపుకి లోనయ్యాయి! నిజానికి అవి ఎంత అందమైన తెలుగుపదాలో!

అత్తర్, సెంట్లు రాసుకోవడం, బ్యూటీ సలూన్ లలో చేసే ఫేస్‌ప్యాక్, బాడీప్యాక్ లు, కళ్ళకింద డార్క్ సర్కిల్స్ కి కీరకాయల ట్రీట్మెంట్ వంటివి ఆ రోజుల్లో కూడా ఉండేవని అన్నమయ్య కీర్తనలద్వారా తెలుసుకోవచ్చు. కళ్ళకి నేడు కీరకాయ ముక్కలు, నాడు తామర పువ్వులు! అంతే. ఇవి ఎప్పుడూ ఉన్నవే కాబోలు.

*

 

మీ మాటలు

  1. nice write up

  2. అరుణ్ గడ్డిపాటి గారి మాటలు కింద ఇస్తున్నాను.

    గద్దరి అన్నపదానికి నేనిచ్చిన అన్వయానికి ఒక సవరింపు సూచించారు. ఆయన వ్యాఖ్యలో పేర్కొన్న అంశము సరియైనదే.

    “ఒద్దిక తామరవిరివొత్తేవు కన్నుల నీ –
    గద్దరి కన్నులకంటె కమలము ఘనమా”

    ఇక్కడ ’గద్దరి’ అన్న పదానికి, ’విశాలమైన’, ’వెడల్పైన’, ’విచ్చుకున్న’ అన్న అర్థాలు, ’ఒద్దిక’ అన్న పదానికి ’సమానమైన’ అన్న అర్థమూ తీసుకోవాలని నా అభిప్రాయం. అప్పుడు పై పాదాలకు అన్వయం ఇలా ఉంటుంది.

    ’కన్నులకు తామరలను అద్దుకుంటున్నావు, ఏం విప్పార్చిన నీ కన్నుల కన్నా తామర పువ్వులు అంత గొప్పవా?’

    —-
    ధన్యవాదములు, అరుణ్.
    ఇట్లు,
    భాస్కర్

  3. ఆర్.దమయంతి. says:

    వాణి జయరామా? పాడింది? పోల్చుకోలేకపోయానండి.
    మీ విశ్లేషణ బావుంది భాస్కర్ గారు.
    అభినందనలు.

  4. వనజ తాతినేని says:

    చక్కగా ఉంది .

  5. అద్భుతం సర్ …

మీ మాటలు

*