నేలపాటగాడు

 

 

బాల సుధాకర్ మౌళి

బాల సుధాకర్

 

ఒక
భైరాగి
ఏళ్ల తరబడి అవిరామంగా
గొంతెత్తి లోకాన్ని గానం చేస్తున్న
గాయకుడు
దేశదిమ్మరి
ఇంటికొచ్చాడు

ఎప్పుడో – చిన్నప్పుడు
వూళ్లో కనిపించాడు
మళ్లీ
ఈ వూళ్లోకొచ్చాడు
వస్తూనే
ఇల్లు తెలుసుకుని
యింటిలోపలికొచ్చాడు
పాత మల్లెపువ్వు నవ్వు నవ్వుతూనే
సంచిలోని కంజిర తీసి
రెండు పాటలు వినిపించాడు
వొకటి : నేల
రెండూ : నేలే
నేలపాటగాడు – నేల పాటలే పాడాడు
అతని యవ్వనం నుంచి
పుట్టలా పెరుగుతూ వొచ్చిన
నేల మీది ప్రేమ
దేశం మీద ప్రేమయి కూర్చుంది
దేశం మూల మూలా
వొట్టి కాళ్లతో తిరిగాడు

అతను
వెళ్లిపోయిన కాలాన్ని
వర్తమానం మొదల్లోంచి తవ్వి తీసి
చేతిలో నగ్నంగా పరిచాడు
వొట్టిపోతున్న వర్తమానాన్ని
భవిష్యత్ చంద్రవంకలోంచి చూపి
వూహల వంతెనలేవో అల్లాడు
రేపేమిటో
నువ్వే తేల్చుకొమ్మన్నాడు

నేలని అణువణువూ ఔపాసన పట్టి
నేల మీద నిటారుగా తిరిగినవాడు
నక్షత్రాల అమ్ములపొదిని తట్టి
తిరిగి నేలని ముద్దాడినవాడు
సగం కాలిన కలని వో చేత్తో
సగం విరిగిన రెక్కని వో చేత్తో
మోసుకుతిరుగుతున్నాడు

నేలిప్పుడు
అతని చేతుల్లో లేదు
అతని కాళ్ల కింద లేదు
అతని గొంతులోనూ లేదు

నేల పాటగాడు
పాడిన రెండు పాటలూ
గుండె నెరియల్లోంచి
కళ్ల సముద్రాల్లోకి
యింకుతున్నాయి

పాటగాడు
భైరాగి
ఇంకా ఇంటిలోనే ఉన్నాడు
ఈ రాత్రికి ఉండిపోతాడు

అతను నిద్రించిన చోట
ఈ వూరు మట్టిలోంచి
వొక  తూర్పుకిరణమైనా పొడుస్తుందా –

తెల్లారెప్పుడవుతుందో… !

( మా ఊరి నేలపాటగాడు ‘విశ్వనాథం’ కి… )

మీ మాటలు

 1. తిలక్ బొమ్మరాజు says:

  మౌళి గారు మీ పదచిత్రాలు అద్భుతంగా వున్నాయి.వొక బాధనూ ,సంతోషాన్ని మీ కవిత్వం వ్యక్తం చేస్తుంది.అభినందనలు.

 2. పాడిన రెండు పాటలూ
  గుండె నెరియల్లోంచి
  కళ్ల సముద్రాల్లోకి
  యింకుతున్నాయి

  నువ్వో మంచి కవితా పాటగాడివి మౌళీ.

 3. మౌళి! పొయెమ్ చాల బాగుంది. నేలపాట గాడు అనేది, మీప్రాంతంలో వున్న పదమో మీరు కాయిన్ చేసిందో గాని, చాల బాగుంది.

 4. balasudhakarmouli says:

  థాంక్యూ తిలక్, భాష్కరన్నా.
  గురువు గారూ ‘హెచ్చార్కె గారూ’ నమస్తే… నేలపాటగాడు పేరు నేను కాయిన్ చేసిందే. ఆ పదం వాడినప్పుడు.. గొప్ప మట్టిపరిమళం వీస్తున్నట్టు అనిపించింది. మా ఊరి పాటగాడు విశ్వనాథంను చూస్తే ఎవరైనా అట్లనే అంటారు.

 5. నేలిప్పుడు
  అతని చేతుల్లో లేదు
  అతని కాళ్ల కింద లేదు
  అతని గొంతులోనూ లేదు

  గుర్తుండే కవితా వాక్యాలు .. మంచి కవిత అందించారు.. మీ నుంచి ఇట్లాంటి మంచి కవితలు వస్తాయని ఆసిస్తూ అభినందనలు తెలుపుతున్నాను..

 6. కె.కె. రామయ్య says:

  “గొంతెత్తి లోకాన్ని గానం చేస్తున్న నేలపాటగాడి పాటలు
  గుండె నెరియల్లోంచి కళ్ల సముద్రాల్లోకి యింకుతున్నాయి “

  (‘సగం కాలిన కలని మోసుకు తిరుగుతున్న’) గద్దర్ పాడుతున్నప్పుడు వింటే ఇలాంటి అనుభూతే కలుగుతుంది ఎవరికైనా. మంచి కవితను ఇచ్చిన బాల సుధాకర్ మౌళి గారికి ధన్యవాదాలు.

 7. balasudhakarmouli says:

  ధన్యవాదాలు పవన్ గారూ, కె.కె.రామయ్య గారూ.

మీ మాటలు

*