గూడు మార్చే ప్రయత్నం

 

మధురవాణి: ఒక వేశ్య

రామప్పంతులు: ఆమె విటుడు

మధు: యీ రామప్పంతులు కథ పైకి పటారం, లోపల లొటారంలా కనిపిస్తూంది. భూవులన్నీ తాకట్టు పడి వున్నాయిట; మరి ఋణం కూడా పుట్టదట. వాళ్ళకీ వీళ్ళకీ జుట్లు ముడేసి జీవనం జేస్తూన్నాడు. యీ వూరు వేగం సవరించి చెయ్ చిక్కినంత సొమ్ము చిక్కించుకొని పెందరాళే మరో కొమ్మ పట్టుకోవాలి. ‘తెలియక మోసపోతినే, తెలియక…’ (పాడుచుండగా రామప్పంతులు ప్రవేశం)

రామ: యేవిటో ఆ మోసపోవడం? తరవాత ముక్కేవిటి, పాడూ.

మధు: తరవాత ముక్కకేవుంది? మిమ్మల్ని నమ్మి మోసపోయినాను.

రామ: అదేం అలా అంటున్నావు? నిన్ను మోసపుచ్చలేదే? నిర్నయప్రకారం రెందొందలూ పట్నంలో యిచ్చాను. నెలజీతం నెలకు ముందే యిచ్చాను. యిహ మోసవేవుంది?

మధు: యేం చిత్రంగా మాట్లాడతారు పంతులుగారూ, నాకు డబ్బే ప్రధానవైనట్టు మీమనసుకి పొడగడుతూంది కాబోలు. నాకు డబ్బు గడ్డిపరక. మీభూవులు రుణాక్రాంతవైనాయని అప్పట్లో నాకు తెలుసుంటే మీదగ్గిర రెండొందలూ పుచ్చుకొందునా? మీరు ఖర్చు వెచ్చాలు తగ్గించుకుని సంసారం బాగుచేసుకోకపోతే నేను మాత్రం వొప్పేదాన్ని కాను. ఫలానా పంతులు ఫలానా సాన్నుంచుకుని బాగుపడ్డారంటేనే నాకు ప్రతిష్ఠ. మాయింటి సంప్రదాయం యిది పంతులుగారూ; అంతేగానీ లోకంలో సాన్ల మచ్చని వూహించకండి.

రామ: భూములు తణఖా అన్నమాట శుద్ధఅబద్ధం యవరన్నారో గాని; నేను మహరాజులా వున్నాను.

మధు: నాకంటికి మహరాజులా కనపడబట్టే యిల్లూవాకలీ వదలి మానం ప్రాణం మీ పాలుచేసి నమ్మి మీవెంట వచ్చాను. నన్ను మాత్రం మోసం చెయ్యకండీ; మిమ్మల్ని పాపం చుట్టుకుంటుంది.

రామ: నేను మోసం చేసే మనిషినేనా?

మధు: అలాగయితే లుబ్దావుధాన్లు గారికి పెళ్ళెందుకు కుదిర్చారు? నాకు తెలియదనుకున్నారా యేవిటి? ఆ ముసలాడికి పెళ్ళెందుకు? మీకోసవే యీ యెత్తంతాను.

రామ: ఆహా హా హా …. యిదా అనుమానం? కొంచెం గడ్డం నెరుస్తూంది, నన్ను కూడా ముసలాణ్ణంటావా యేవిటి?

మధు: చట్లకి చావనలుపు, మనిషికి చావ తెలుపూ. అనగా చీకట్లో నక్షత్రాల్లాగా, అక్కడక్కడ తెల్ల వెంట్రుక తగిల్తేనే చమక్.

రామ: స్వారస్యం మా చమత్కారంగా తీశావ్! యేదీ ముద్దు. (ముద్దుపెట్టుకోబోవును)

మధు: వేళాపాళా లేదా? లుబ్దావుధాన్లు పెళ్లి తప్పించేస్తే గాని నేను ముద్దుబెట్టుకోనివ్వను.

రామ: అంతా సిద్ధవైంతరవాత, నాశక్యమా ఆపడానికి? (బలాత్కారంగా ముద్దుబెట్టుకొనును)

మధు: సత్తువుందనా మోటతనం?

రామ: నాసత్తువిప్పుడేం జూశావ్? చిన్నతనంలో ధ్వజస్తంభం దండతో కొడితే గణగణమని గంటలన్నీ ఒక గడియ వాగేవి. నాడు జబ్బు చేసిందగ్గర్నుంచీ డీలా అయిపోయినాను.

మధు: యిదా డీలా? నాచెయి చూడండీ ఎలా కందిపోయిందో … అన్నా మోటతనం.

రామ: చాప చిరిగినా చదరంతని, నీప్రాణానికి యిప్పటి సత్తువే ఉడ్డోలంలా కనబడుతూంది.

మధు: యీ పెళ్లి మాన్పించకపోతే నేను మీతో మాట్లాడను.

రామ: యీ పెళ్ళిలో నీకు మేజువాణీ నిర్నయించుకున్నాను కానూ, నీకు పదిరూపాయల సొమ్ము దొరుకుతుంది, మరి వూరుకో!

మధు: యేం చిత్రవైన మనుషులు పంతులుగారూ! (తమలపాకు చుట్టతో కొట్టి) మేజువాణీ బుద్ధిలో వుంచుకొని యీ పెళ్లి కావడానికి విశ్వప్రయత్నం చేశారూ? యంత సత్యకాలపదాన్నయినా ఆ మాత్రం ఊహించుకోగల్ను. లేకపోతే, నే యంత బతిమాలుకున్నా యీ పెళ్లి తప్పించక పోవడవేవి? మీ బుద్ధికి అసాధ్యం వుందంటే నే నమ్ముతానా?

రామ: ఆ మాట్నిజవే గాని, అన్ని పనులూ ద్రవ్యాకర్షణ కోసవే చాస్తాననుకున్నావా యేవిటి? ఆ ముసలాణ్ణి కాపాడదావనే, యీ పెళ్లి తలపెట్టాను.

మధు: ‘చిత్రం, చిత్రం, మహాచిత్రం’ అని కథుంది, అలా వున్నాయి మీ చర్యలు!

రామ: ఆ కథేదో చెబుదూ, నాక్కథలంటే మా సరదా!

మధు: పొగటిపూట కథలేవిటి! ముందు యీ చిత్రకథేవిటో సెలవియ్యండి.

రామ: అది చెప్పేది కాదు, చెప్పను.

మధు: చప్పకపోతే వొప్పను.

రామ: వొప్పకేం జేస్తావు?

మధు: యేం జేస్తానా? యీ జడతో కొడతాను, శాస్త్రంలో కాముకులకు చెప్పిన ఆయుధవిది.

రామ: నేఁ దెబ్బలికి మనిషిని కాను. శాస్త్రం గీస్త్రం వకపక్కనుంచి మోటసరసం మాను. చెప్పమంటే చెబుతాను గాని, అలాంటి కబుర్లు నువ్వు వినకూడదు. మరేంలేదు. లుబ్దావధాన్లు వెధవ కూతురు, మీనాక్షి ప్రవర్తన మంచిది కాదు. పెళ్ళయితే దాని ఆట కడుతుంది.

మధు: మీనాక్షి ప్రవర్తన బాగుంది కాదంటూ మీరే చెప్పాలీ!? మీరు కంటబడ్డ తరవాత యే ఆడదాని ప్రవర్తన తిన్నగా వుంటుంది?

రామ: అదుగో చూశావా? అలా అంటావనే కదూ చప్పనన్నాను.

మధు: యీ చిక్కులు నాకేం తెలియవు. పెళ్లి మానిపించెయ్యండి.

రామ: యీ పెళ్ళిలో మేజువాణీ పెట్టి పదిరాళ్ళిప్పిస్తాను. మాటాడకూరుకో!

మధు: (ముక్కుమీద వేలేసుకొని) లుబ్దావధాన్లు యదట నేను మేజువాణీ…. ఆ!?

రామ: పేరు వాడు గాని, సభలో పెద్దన్నేనే కదూ?

*

మీ మాటలు

 1. buchi reddy gangula says:

  ***కథానిక అంటే మల్లి మల్లి చదివించే వచన ఖండకావ్యం . వెనుక నుంచి సముద్రం హోరు
  వినిపిస్తూ చూడటానికి మాత్రం కెరటం లా కనిపించేది ****
  బుచ్చి బాబు

  సహజత్వం –ఉత్కంట అనే రొండు చక్రాల మీ దే కథ సాగాలి —–మధురాంతకం రాజారాం

  కథ ను ఏ రూపం లో రాసినా కథ ద్వారా పాటకుల కు ఒక సంస్కారాన్ని
  ఒక కొత్త దృష్టిని కలిగించడం ముఖ్యం *****గోపీచంద్

  సాని వాడల సంభాషణలు — యిందులో ఏమి ఉందో తెలుసుకోవాలని ???
  ——————————————————————————-
  బుచ్చి రెడ్డి గంగుల

 2. పూటకూళ్ళమ్మ says:

  అస్సల్ బాగా లేదు … ఇవి సాని వాడల సంభాషణలా … ఔరా ! “కన్యాశుల్కం ” తెలిసిన వారు ఎవరయినా దీన్ని ఆస్వాదిస్తారా ? ఏడిసినట్టు ఉంది – రాయలేనమ్మ రాయకుండా ఉండాలి గానీ … ఇరగాదీస్తాను అని రాస్తే ఇదిగో ఇలాగే చండాలంగా ఉంటుంది – ఎందుకొచ్చిన బాధ గానీ … తప్పుకుందురూ … దయ చేసి – పూటకూళ్ళమ్మ , విజయనగరం

మీ మాటలు

*