గిలిగింతలు పెట్టి నవ్వులు పూయించే నవల “ప్రేమలేఖ”

 

 

SomaSankar2014

కొల్లూరి సోమశంకర్

ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన తొలి నవల “ప్రేమలేఖ”. ఎందరో రచయిత్రులు తమ రచనల ద్వారా తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసినా, పొత్తూరి విజయలక్ష్మి గారి ప్రభావం విలక్షణమైనది. సాంఘిక ఇతివృత్తాలతో కొన్ని రచనలు చేసినా, హాస్యకథలు ఆవిడ ప్రత్యేకత. సున్నితమైన హాస్యంతో, కథన నైపుణ్యంతో రచనలు చేయడం పొత్తూరి విజయలక్ష్మి గారి శైలి. తొలుతగా 1982 అక్టోబర్ నెల చతుర మాసపత్రికలో ప్రచురితమైన ఈ నవల “శ్రీవారికి ప్రేమలేఖ” సినిమాకి మూలం.

***

కథానాయకుడు ఆనందరావు అమాయకుడు, అందగాడు. బి.ఇ. పాసయి తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాదులో ఏదో ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూంటాడు. ఆనందరావుకి తండ్రి పరంధామయ్య పెళ్ళి సంబంధాలు చూస్తూంటాడు. త్వరగా పెళ్ళి చేసుకోమని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేస్తు ఉంటాడు. పరంధామయ్యది అదో రకం స్వభావం. తాటాకుమంటల్లా ఎప్పుడూ చిటపటలాడిపోతుంటాడు. తండ్రి అంటే మా చెడ్డ భయం ఆనందరావుకి. ఒక్క ఆనందరావుకేం ఖర్మ, అతని అన్నయ్య భాస్కరరావుకి, అక్క కామేశ్వరికి, వదిన అన్నపూర్ణకి, బావ సూర్యానికి, అమ్మ మాణిక్యంబకీ కూడా భయమే.

ఈ నేపథ్యంలో ఓ నడి వేసవి రోజున మిట్టమధ్యాహ్నం లంచ్ చేయడానికి తన కాబిన్‍లోంచి బయటకి వస్తాడు ఆనందరావు. అతని సెక్రటరి మార్గరెట్ అతనికొచ్చిన పర్సనల్ లెటర్స్ అందిస్తుంది. ఏసి హోటల్లో కూర్చుని ఒక్కో ఉత్తరం చదువుతూంటాడు. మొదట తండ్రి ఉత్తరం, తరువాత అక్క ఉత్తరం చదువుతాడు. మూడోదే.. అసలైనది… “ప్రియా” అనే సంబోధనతో మొదలవుతుంది. ఉలిక్కిపడతాడు. తనకేనా సంశయపడతాడు. ఆ ప్రేమలేఖ చదివి తన్మయుడవుతాడు. పరవశుడవుతాడు. ఇక అక్కడ్నించి, ఆ ఉత్తరం వ్రాసిన సోనీ ఎవరో తెలుసుకోడానికి నానా పాట్లు పడతూంటాడు.

ఇక కథానాయకి స్వర్ణలతకి పెద్దగా చదువబ్బదు. తండ్రి బలవంతంమీద ఏదో చదువుతున్నానని అనిపించుకుంటుంది. తనకి పెళ్ళీడు వచ్చేసిందని, తండ్రి గ్రహించకుండా ఇంకా చదువు చదువు అని పోరుతున్నాడని ఆమె అభిప్రాయం. ఆమె తండ్రి తిలక్‌కి కూతుర్లిద్దరినీ బాగా చదివించాలని ఆశ. పెద్ద కూతురు హేమలత బిఎ పూర్తి చేయగానే మధుసూదనం ఆమెని ఇష్టపడి పెళ్ళిచేసుకుంటాడు.  సరే పెద్ద కూతురు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిందికదా, చిన్న కూతురినైనా గొప్ప విద్యావంతురాలిని చేయాలని ఆయన తపన. కానీ స్వర్ణ కేమో చదువుకన్నా పెళ్ళి మీదే ధ్యాస ఎక్కువవుతుంది. చివరికి అనుకున్నదే అవుతుంది. బిఎస్సీ తప్పుతుంది, ఇక స్వర్ణకి పెళ్ళి చేసేయడమే మంచిదనే నిర్ణయానికొస్తాడు తండ్రి.

Premalekha back cover

సోనీని మనసులో ఉంచుకుని ఆనందరావు, ఆడపిల్లలు మగపిల్లలకి ఏ మాత్రం తీసిపోరనే భావంతో స్వర్ణలత తమకొచ్చిన సంబంధాలను తిరగగొడుతుంటారు. చివరికి ఆనందరావుకి పిచ్చి అని, స్వర్ణకి పొగరు అని ముద్ర పడిపోతుంది. ఆనందరావుకి వచ్చే సంబంధాల క్వాలిటీ ఏ 1 నుంచి సి 3కి పడిపోతుంది. స్వర్ణ గురించి పుకార్లు వ్యాపించిపోతాయి.

అదృష్టవశాత్తు, రెండు కుటుంబాల పెళ్ళిళ్ళ పేరయ్యలు బంధువులు కావడంతో, ఆనందరావు కుటుంబానికి, స్వర్ణలత కుటుంబం గురించి చెప్పి పెళ్ళి చూపులకి వప్పిస్తారు.

ఇక ఇక్కడ్నించి కథ వేగం పుంజుకుంటుంది. అపార్థాలు, అలకలు, అనుమానాలు, సందేహా నివృత్తులు… అన్నీ జరిగిపోయి కథ సుఖాంతం అవుతుంది.

 

***

కథ చాలా వరకు సంభాషణల రూపంలో నడవడం వల్ల హాస్యం జొప్పించడం తేలికైంది. కథనంలో సన్నివేశాన్ని హాస్యభరితంగా సృజించడం కన్నా, పాత్రల మధ్య సంభాషణలని హాస్యంతో నింపితే ఆ సంఘటన పాఠకుల మనస్సులను సులువుగా తాకుతుంది. నవలలోని ఒక్కో పాత్రకి ఒక్కో లక్షణం. వాటన్నింటిని మేళవిస్తూ, కుటుంబ సభ్యుల్లో అంతర్లీనంగా ఉండే ఆపేక్షలు, అనుబంధాలను వెల్లడిస్తుందీ నవల.

సినిమాగా వచ్చిన నవల కాబట్టి నవలనీ, సినిమాని పోల్చుకోకుండా ఉండలేరు. సినిమాలో “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..” పాటకి ఏ మాత్రం తీసిపోదు నవలలోని ప్రేమలేఖ.  ఆ పాట విని పెళ్ళి కాని వారు ఊహాలోకాల్లోకి వెళ్ళిపోతారు. నవలలోని ప్రేమలేఖని చదివినా కూడా అదే ఎఫెక్ట్. పెళ్ళయిన వాళ్ళు తమ తొలినాళ్ళని గుర్తు చేసుకుంటారు.

సినిమాలోని సంభాషణలు, సన్నివేశాలు కూడా చాలా వరకు నవలలోవే కావడం వల్ల దర్శకుని సృష్టిగా భావించినవి.. నిజానికి మూల రచయిత్రి సృజన అని తెలుసుకుని విస్తుపోతారు పాఠకులు.

***

హాయిగా నవ్విస్తూ, చివరిదాకా ఆసక్తిగా చదివించే నవల “ప్రేమలేఖ”. 142 పేజీల ఈ నవలని శ్రీ రిషిక పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. రూ. 80/- వెల గల ఈ పుస్తకం సోల్ డిస్ట్రిబ్యూటర్స్ నవోదయ పబ్లిషర్స్, కాచీగుడా, హైదరాబాద్. ఈ-బుక్ కినిగెలో లభ్యం.

*

 

మీ మాటలు

*