కాలమయి పోయిన “కళల” పంటలు!!

 

సడ్లపల్లె చిదంబర రెడ్డి 
     నేను ముందే సెప్పితిగదా– మా కాపుదనము గుంపు, కమసలోళ్లు ఒచ్చి ఊరు కట్టుకోని వుండేదని!! అది యపుడు ఒచ్చిండారో తెలీదుగానీ 1850 ఇరుమైల్లో (దాదాపు) ఒగ పెద్ద ఇల్లు కట్టుకో నుండారు. అది యంత పెద్దదంటే తూరుపు బెంగులూరు రోడ్డు నుంచి పడమర ఊరిలోని కంకర రోడ్డు దంకా నూరు అడుగుల పొడవు, ఉత్తరం నుంచి దచ్చిణానికి 250 అడుగులు ఎడెలుపుతో నాలుగు బాగాలుగా ఒగే పునాది మింద కట్టిండారు. నాలుగు ఇండ్లకీ తూరుపు పడమరల దిక్కులకి వాకిళ్లు. విడివిడిగా వున్నాకుడా ఉత్తరం దచ్చిణంగా అన్ని ఇండ్లనూ కలిపే వాకిళ్లు. వాటికే వేరేగా సేద బాయి.
     అన్ని ఇండ్ల లోనూ బంగారు పనికి, ఎండి పనికి, ఇనప సామాన్లు సేసేకి,ఇగ్రహాలు సెక్కేకి వేరే వేరే రూములు. పడమర పక్క కవురుసాల్లు. ఇంత పెద్ద ఇంటిని ఆకాలంలో ఆరు నెల్లకే కట్టిరంట!!
     ఆ సుట్టూ పక్కల ఇరవై ముప్పై పల్లిల్లో పెద్ద పేరు తెచ్చుకొన్న ఆశార్లంట వాళ్లు. రైతుల కంతా అప్పులిచ్చేదే కాకుండా  వాళ్ల యగిసాయానికి(వ్యవసాయానికి) కావల్సిన ఇనుము సామాన్లు, ఎద్దుల బండ్లు ఇతరాలన్నీ తయారు సేసి ఇస్తావుండ్రంట. ఇంగ బంగారు, ఎండి సొమ్ములు సేసేకి వాళ్లకి మించినోళ్లు లేరంట!!
     అందుకే ఆ సుట్టూ పక్కల ఊర్ల జనాలు యాబై ఎద్దుల బండ్లు కట్టుకోని, బాగా బలిసి సేగు బారిండే పనస, మామిడి, నేరిడి,పత్తి(మేడి), ఊడుగ,యాప, ఇప్పి… ఇట్లా మాన్లన్నీ నరుక్కోనొచ్చి కట్టి పొయ్యిరంట. పెద్ద పెద్ద దూలాల మింద శక్క పలకలు పర్సి కట్టిన మొదతి మాడీ అదేనంట. మేము ఆ ఇల్లు కొన్నంక ఒగసారి ఇంగులీసోళ్లు టూరొచ్చి– ఈ రోడ్లో నుంచి ఆ రోడ్లో దంకా వరుస కంబాల్తో కనిపించే ఇంటిని ఇసిత్రంగా సూసి పోటో తీసుక పోయిండ్రి!!
     మా ఊర్లో మొదట సదువు నేర్సింది కూడా ఆశార్లేనంట!! ఊరికి ఉత్తరం దిక్కు ఇరవై యకరాల దంకా దచ్చినం పక్క బసనపల్లికి ఆనుకొని ఇరవై యకరాల దంకా బూములు వాళ్లవే. ఆ తావ బాయిలు పండ్ల తోటలూ వుంటా వుండె. ఆంజనేయుని గుడి కట్టిచ్చి మొదట పూజారి తనంగూడా వాళ్లే సేస్తా వుండిరంట!!(దీనికి సంబంధించి వెంకట్రామా చారి చెప్పిన కథనాల్లో వివరించ గలను).
    ఆశార్ల నాలుగిండ్లలో ఒగ బాగానికి హక్కుదారు నీకంఠాశారి. మా ఊరి కూలి బడికి ఆయప్పే అయ్యవారంట.(కూలిబడి=డబ్బులు, ధాన్యం తీసుకొని చదువులు చెప్పే వీధి బడి) 1930 నుంచి గవుర్నమెంటు ఇసుకూలు వొచ్చే ఒరుకూ (1955) ఆయప్పే తన సొంత ఇంట్లో సదువులు నేర్పిచ్చిండాడు. ఆ ఇంటిని 1960 లో మాకి ఆయప్ప అమ్మేసి పట్నానికి ఎల్లిపాయ.
     ఈది బడి నడిసే తపుడు 1930 ఆ సగాల్లో దాని ముందర ఒగ కంప సెట్టు నాటిండాడు. అది సూసేకి జాలి మాను(నల్ల తుమ్మ) మాదిరీ వుండే దానికి అందరూ దాన్ని సీమ జాలి (సర్కారు తుమ్మ)మాను అని పిలుస్తా వుండ్రి.
     మేము ఇల్లు కొని రిపేరీ సేస్తా వుంటే ముండ్ల సెట్టు ఇండ్ల ముందర వుండకూడదు, దాన్ని నరికేయమని శానా మంది మా నాయనికి సెప్పిరి. అయితే అది అపుటుకే పెద్దగా పెరిగింది. ఎనుములు కట్టేసేకి నీడగా ఉంటుందని మా నాయన దాని కిందపక్క వుండే సన్నాబన్నా కొమ్ములు కత్తిరించి ఇడిసి పెట్టె. బెంగలూరు రోడ్డుకు పక్కలోనే వుండే ఆ సెట్టు, ఆకాశానికి తీగల మాదిరీ పెరుగుకొంటా గుత్తులు గుత్తులు కాయలు కాయబట్టె. సుట్టూ పక్కల వూర్ల జనాలు వాళ్ల సేన్ల సుట్టూ కల్ల(కంచె) మాదిరీ పెంచు కొనేకి తిరునాల్లకు ఒచ్చినట్ల ఒచ్చి కోసుకు పోబట్రి!!
     కరువు వొచ్చి మేము ఊరిడిసి కర్నాటకాకు వలసపొయ్యి,12 ఏండ్లకు తిరిగొచ్చి, ఇంగొగు ఊర్లో సేద్యం సేసి ఆడ కూడా ఓడిపోతిమి!! వానలు ఏటిచ్చి మా ఊరిపక్క పల్లెలన్నీ ఏరు పురుగు కొరికేసిన మల్లె తీగల మాదిరీ ఎండి దుంప నాశన మైనా… ఈ సీమ జాలి సెట్టు మాత్రం వాడబట్ట లేదు!! ఇపుడు యా పొలం బీడు నేల్లో సూసినా సీమతుమ్మ మాన్లే సిట్టడివి మాదిరీ అల్లుకు పోయిండివి. రాత్రీ పగలూ కష్ట జీవులు ఆ సెట్లని నరికి లారీల్లో తమిల దేశానికి తోలినా తరుగుతా వుండ్లేదు.
    బూమికానా కనిపించే మొదల్లు నరికేసినా, లోపలుండే కూటేర్లు మాత్రం రాచ్చాసి గడ్డల మాదిరీ ఊరి పొయ్యిండివి. ఇపుడు ప్రొక్లెయినర్లు తెచ్చి ఊడబెరికి కాల్సి బొగ్గులు సేసి పాత ఇనుము కరిగిస్తావుండే కార్కానాలకి అమ్ముతావుండారు.
    మా ఇంటి ముందర మాన్లోని కొమ్మలను ఆర్నెల్లకొగసారి నరుకుతా వుంటిమి.వంత సేసేకి గ్యాసు ఒచ్చినంక ఇడిసిపెడితిమి. సింతమాను మాదిరీ పెద్దగా పెరిగిన ఆసెట్లో నల్ల సీడ(పేను బంక) పడిండె. అవు సుట్టూ పక్కల ఇండ్లల్లో పడి గలీజు అయితా వుందని పంచాయితీ పెడితే 2005 కు యనకా ముందు దాన్ని నరికేస్తిమి.(దాని వేళ్లు ఇంకా భూమిలోనే ఉన్నాయి.సీమ ప్రాంతం సర్కారు తుమ్మకు అదే ఆది వృక్షమని చెప్పడాన్ని ఎవరైనా శాస్త్రీయంగా పరీక్షించవచ్చు).
     ఈ సీమ జాలి నుంచి ప్రయోజనం ఏమంటే ఇక్కడ వానల్లేక బూముల్లో పంటలు లేక పోయినా యాడజూసినా పచ్చగా కనిపిస్తాయి.బీదా సాదా వంట సెరక్కు దేవుని సెట్టు మాదిరీ ఎంత నరికినా సిగరిస్తానే వుంటుంది!!
     ఒగనాడు పది అడుగులకు మించి పెరిగిన సెరుకు తోట బూముల్లో తుమ్మ మాన్లు ముండ్లతీగల్తో సీమలు దూరని సిట్టడవి, కాకులు దూరని కారడవి మాదిరీ పెరిగిండివి.(01.08.2015 నాడు పొలాల్లో తీసిన ఫోటో జతపరుస్తున్నాను.ఈ రోజుదాకా ఇక్కడ ఈ వర్షాకాలంలో ఒక పదును వాన కూడా పడలేదు!!).
     ఇంగ కమసల ఆశార్ల కతకొస్తాము!!
IMG_0010
     మేము కొన్న దానికి ఉత్తం పక్క ఒగటి, దచ్చినం పక్క రెండు ఇండ్లూ వాళ్లవే.
     పొద్దున్నే లేస్తూనే వాళ్ల ఇండ్ల ముందర జనాలంతా పరస మాదిరీ సేరుతావుండ్రి. కొత్తగా ఇనప సామాన్లు సేయించేకి, పాతవి సరిసేసేకి రైతులు ఒగరి మింద ఒగరు పడతావుండ్రి. యంత మంది ఆశార్లు సుత్తి, సమ్మెట, శాణము, పట్టుకారాల్తో పనులు సేసినా నాలుగయిదు కొలిమిలు పెట్టి పెద్ద పెద్ద తిత్తుల్తో ఊదినా, బండ్ల కొద్దీ బొగ్గులు కాల్సినా పనులు తెముల్తా వుండ్లేదు!!
     వాళ్ల ఇండ్లలో లో కణజాలు(భూములోపల పాత్రలుగా కట్టినవి) పై కణజాలు(భూతలానికి పైన కట్టినవి) ఉండేవి.యాభై పల్లాల(బస్తాల) గింజలు పట్టేవి.(పాడుబడిన మాయింట్లో ఇప్పటికీ కణజం వుంది.అయితె అక్కడికి వెళ్లడానికి కుదరలేదు) పంట కోతలయినంక రైతులిచ్చే గింజల్తో ఆ కణజాలన్నీ నిండిపోతా వున్నెంట!!
     ఇంగ వాళ్లు సేస్తా వున్న ఎండి, బంగారు సొమ్ములు, పంచలోహ ఇగ్రహాలు యంత సుందరముగా,యన్ని కండ్లున్నా సూసేకి తనివి తీర్తా వుండ్లేదు.నేను రోగంతో తగ్గుకొంటా, తుమ్ముకొంటా ఇంట్లో పండుకొంటే వాళ్లు సుత్తితో ఏసే దెబ్బల్ని బట్టే అది ఎండిదో, బంగారుదో,ఇనుముదో, ఇత్తడిదో తెలుస్తావుండె!!
     పెండ్లిండ్ల కాలంలో రైతులే కాకుండా ఇందూపురం లోని షరాబోల్లంతా ఈల్లతోనే రకరకాల సొమ్ములు సేయిస్తా వుండ్రి. ఆసొమ్ములు సేసేది.బంగారు తునకని కమ్మచ్చులో దూరిచ్చి సన్న దారం మాదిరీ తయారు సేసేదీ అన్నీ సుస్తావుంటి.వాళ్ల ఇంట్లో ఒగ మూగాయప్పుండె.ఆయప్పకి మాట్లు వొస్తావుండ్లేదు. పెదవులు కదిలిచ్చి సేతుల్తో సైగలు సేస్తే అర్తం సేసుకొంటా వుండె. పొద్దస్తమ్మనమూ ఆయప్పకి సొమ్ములు సేసే పనే.
     ముసలాయప్ప పేరు యంగటరామాశారి. ఆయప్ప పని ఇగ్రహాలు సేసేది. మా దెండిండ్లకీ ఒగే కవురుసాలి. బెంగులూరు, మైసూరు,బళ్లారి నుంచి ఇగ్రహాలు సేసేకి ఆయప్పకే ఇస్తావుండ్రి. ఇగ్రహాలు యట్ల సేస్తావున్నంటే… కావల్సిన ఆకారముతో మొదట బొమ్మ తయారు సేస్తావుండె. దాని మింద బంక మన్ను(నెర్రెలు చీలనిది) నున్నగా నూరింది పల్సగా బల్లి పర్ర మాదిరీ ఆరేకొద్దీ పూస్తావుండె. బొమ్మ కిందబాగం పీటందగ్గర సన్న రంద్రం ఇడుస్తావుండె. ఆరకంగా అంగులం మందం పూసినంక దాన్ని కుంపట్లో పెట్టి యచ్చగా సేస్తే మైనమంతా కారిపోతావుండె. లోపల ఇగ్రహం ఆకారం మిగుల్తావుండె. దాన్ని ఇసకలో పెట్టి పీతం కింద ఇడిసిన రంద్రంలో పంచ లోహాలు కరిగించి పోస్తావుండె.
     అట్ల పోత పోసినంక రకరకాల పోగర్లతో సెక్కి లచ్చిమి, శివుడు,సీతారామ లచ్చుమనులు,కాళికాదేవి, ఆంజనేయుడు…ఇట్లావన్నీ సేస్తావుండె. ఆ బొమ్మలు నిజంగా నడిసొచ్చే దేవాను దేవతల మాదిరీ ఉంటావుండె. వాటి జతకి ఆయప్ప శార్దూలం పద్యాల్తో శతకాలూ, జాతకాలూ రాస్తావుండె. బొలే కతలు సెప్పుతా వుండె. అవనీ ఈడ సెప్పేకి కుదరదుకానీ ….ఒగటి సిత్తూరు తీరుపు–
     ముందు కాలంలో సూద్రోల్లు బాయిలో నీల్లు సేదినంక బాపనోళ్లు–ఆ తాడును,బాయి అరుగునూ,గిలకనీ కడిగి సుద్ది సేసి నీళ్లు తోడుతా వుండ్రంట. ఒగదినం కమసల ఆశార్లు నీల్లు సేదినంక బాపనోళ్లు అట్లే సేసిరంట. అపుడు ఆశారు తాము శూద్దరోల్లు కాదని బాపనోళ్లతో సమానమని సిత్తూరు కోరుట్లో వ్యాజ్యం ఏసిరంట.అవుడు కోరుట్లో ఆశార్లు గూడా బాపనోల్లతో సమానమే అని తీరుపు వొచ్చినంట.
     ఒగసారి ఒగ రైతు కొత్తగా కొడవలి సేపిచ్చేకి ఒస్తే పెద్ద ఆశారి ఇంట్లో ఉండ్లేదంట. పిల్ల ఆశారే కొడవలి తయారు సేసిచ్చినంట. అది మొద్దోని ముక్కు గూడా తెగుతావుండ్లేదంట.
     ఒగనాడు పెద్ద ఆశారి సొరకాయని మోసుకోని సేని తావ నుంచి ఇంటికొస్తావున్నంట. దావలో రైతు ఎదురుపడి “స్వామీ ఆయుదము మీ సేతిలో అయితేనే సరుక్కున తెగుతుంది.మీ పనితనానికి ఎదురే వుండెల్లేదు.  మీ పిల్లోనికి ఏమీ శాతగాదు. ఆయప్ప సేసిన కొడవల్తో కోసీ కోసీ సేతులు బొబ్బలు పాయకానీ గడ్డి తెగలేదు” అన్నెంట.
     అపుడు ఆశారి కొడవలి సేతికి తీసుకోని సేని గట్టుమిందపెట్టి సొరకాయతో రెండు దెబ్బలు ఏసి “ఇంక బాగ తెగుతుంది పో”– అన్నెంట. తిరగ దినం కొడవలి బాగా తెగుతా వుందనిసెప్పి రైతు గంపడు రాగులు తెచ్చి పాతర్లో పోసినంట!!
     ఈ ఆశారికి అవతలింట్లో లచ్చిమీ నారాయనాశారి. ఆయప్ప యంత ఇద్యా వంతుడంటే ఒగ మనిషిని ఎదురుగా కూకోపెడితే పొల్లు పోకుండా అట్లే బొమ్మ గీస్తావుండె.
    ఒగ సారి(1970 ఆ ప్రాంతం)నాకు బాగా గురుతు ఒగ ఆసామి వివేకానందుని ఫోటో తీసుకోని బొంబాయినుంచి కారులో ఒచ్చిండె. పెద్దది అయిదారు కేజీలది బంగారు రేకు ఇచ్చింటే బొమ్మలో వున్నట్లే దాన్ని ఉబ్బెత్తుగా సెక్కి తయారు సేసిండె. దాన్ని సూసేని ఇందూపురంలోని షావుకార్లంతా జటకాల్లోవొచ్చిండ్రి.
     వాళ్ల సేతుల్లో కళమ్మ తల్లి కాళ్లు కదిపి నడుస్తావుండె. వాళ్ళు రేకు మింద గీత గీస్తే అది సూర్యుని కిరనాల మాదిరీ మెరుస్తావుండె. సుత్తితో కొట్టి శాణంతో సెక్కిన ఏడిదయినా నిండయిన ఇగ్రహం గానో, ఇంపుదీరి పంటలు పండిచ్చే పని ముట్టుగానో తయారవుతా వుండె. వాళ్లంటే ఊరందరికీ గవురవమే!!  అట్లాది…….
     1975-80 కాలానికి పెద్ద ఆశార్లంతా కాలమయి పాయిరి. వాళ్ల వారసు దార్లకెవరికీ కళలు కాదుగానీ నాలుగు అచ్చరం ముక్కలుగూడా అబ్బలేదు!!అంతా కూలీ నాలీ సేసి బతుకులు ఈడుస్తా వుండారు. సివరి ఆశారి దాసప్ప(65సం.) ఒగడు మాత్రం వారానికి ఒగసారి కొలిమి అంటిచ్చి సావుకోసరం బతుకు ఈడుస్తా వుండాడు.
*****
    1960-65 కాలం తీసుకొంటే మా ఊరి జనాబా ఏడెనిమి నూర్లు వుంటుంది. అపుడు సదువు నేర్సింది( కేవలం చదవడం, రాయడం) మా నాయన ఇంకో ముగ్గురు నలుగురు మాత్రమే!! అయినా కళలకు కొదువే వుండ్లేదు!!
    పొద్దున్నే కపిల పాట్లు, సేన్లలో నాట్ల పాట్లు, తవ్వకాలవి, గానిగిండ్ల యాళ పాట్లు యా తావ సూసినా ఇనిపిస్తా వుండె. ఉప్పర అనుమంతప్ప అని ఒగాయప్ప వుండె. ఆయప్ప కత మొదలు పెడితే నెల దినాలు నిలపకుండా సెప్పుతా వున్నెంట!! అందుకే ఆయప్పని కతల అనుమంతప్ప అని పిలుస్తా వుండ్రి.
     ఇంగ ఇండ్లలో ఆడోల్లు ఇసర పాటలు, దంపుడు పాటలు, నలుగు పాటలు, యాగటి మనిషిని కూకోబట్టి పాడే పాట్లు, పెండ్లిపాట్లు, ఊయాల పాట్లు యన్ని రాగాల్తోనో ఇనిపిస్తా వుండె.
     ఇంగ పండగ లొస్తే యా సందులో సూసినా కోలాట పాట్లే!! నిక్కారు కట్టేది నేర్సిన ప్రతి మొగోడూ ఎగురుకొంటా కుణుసుకొంట కోలాట ఏస్తావుండె. అట్లా పాట్లన్నీ నేర్సు కోవల్లని, సిన్నప్పుటినుంచి నాకి శానా ఇదిగా వుండె. వలస బతుకులు, అనారోగ్యము, ఉద్యోగమూ సేసుకొంటా  పుట్టినూరికి దూరమయ్యి, 1990 లో రవ్వంత దగ్గరికొస్తి. పాటల కోసర ఎదికితే ఒగటీ కనిపించలేదు ఇనిపించలేదు!! అంతలోనే—–
IMG_0012
      అందరూ అచ్చిరాలు నేర్సల్ల, దేశాన్ని వుద్దారకం సేయల్ల అని వుద్యమము ఒస్తే నేను దాంట్లో కూరుకు పోతి. అపుడు పల్లి జనాలకి కోలాట పాటల్తో సదువు సెప్పిస్తే బాగుంటుంది అనుకోని కాలికి బలపం గట్టుకోని ఇల్లయిన ఇల్లూ తిరిగితే ఒగ కురుబాయపా రవ్వన్ని సెప్పె. అదిగూడా పూరా పాట్లు కాకుండా మొదటి శరణాలు మాత్రం అర్తం కాకుండా మారిపొయ్యిండివి!! రాగాలు మాత్రం మిగిలిండివి!! అవస్తలు పడి “లచ్చిమి పెండ్లి” అనే కోలాట పాటల కత తయారు సేస్తి. కోలాట ఏపిచ్చుకోని ఎర్రోని మాదిరీ ఊరూరు తిరగలాడితి!! అది తెలిసి ఆకాశవాణి అనంతపురము వాళ్లు మా గుంపును ఎదుక్కొచ్చి రికార్డు సేసుకుపొయ్యి శానా సార్లు ఇనిపిచ్చిరి!!
      ఒగ పాట సదవండి……
ఉంగరమా  ముద్దుటుంగరమా  మా రాము సేతిలో  బంగారమా….(ప్రజల నోట దొరికిన అవ శేషం)
తిరగ రాసింది..అక్షరమా ముద్దుటక్షరమా మా నోటి మాటలా ఆకారమా!!
                 నిన్ను మొదటెవరు పలికిరే అక్షరమా!!
                 నీకు పేరెవరు పెట్టిరే అక్షరమా!!
                 మా బతుకులో వెలుగైన అక్షరమా………!!
       ఇప్పుడు మా ఊరిసుట్టూ పది పదకొండు కాలనీలు (టీచర్స్ కాలనీ, వీవరుసు కాలనీ, ఆటో నగర్, డ్రయివర్స్ కాలనీ,ఎస్టేటు, యస్.సి. కాలనీ, పోస్టల్ కాలనీ, హవుసింగు బోర్డు, హవుసింగు బోర్డు కాలనీ, యన్. టి ఆర్. కాలనీ…..మొ.) జనాబా సూస్తే పది పదకొండు వేలు దాటింది. దగ్గరదగ్గర అంతా సదువులు నేర్సిన వాళ్ళే!!
      అయితే ఒగ మనిషికి గూడా పాటలు పాడేది రాదు. కతలు సెప్పేది అసలుకే తెలీదు. వానలు యగేసుకోనె. పెన్నేరు ఎండి పాయ. ఎండిన ఏటి ఇసకని బెంగలూరు సిటీకి రాజకీయమాయప్పగారు దొంగగా తోలి కోటాదీశులయిపాయిరి. పంటలు పచ్చదనాలతో కల్సి సహజముగా జనాల నోర్లల్లో పుట్టిన పాటలు, ఆటలు, నాటకాలు, కతలు కనిపించకుండా కాటికి సేరి పాయ.
    నికాల్సుగా, నిజాయితీగా, నిరాడంబరముగా, అమాయికముగా– అడవిలోని తంగేడు పూలంత అచ్చముగా బతికిన జనాలని పాడు సదువులు, యాపారం సినీమాలు,ఇండుల్లో దూరిన కట్ల పాములట్లా కేబులు వయిర్లూ, రాజకీయమోళ్ల మాయదారి ఎత్తులు నాశన సేశె.
     జీవితమంటే మరిసి నాటకాలాడేది, ఊరుమ్మడి బతుకులు మర్సి కులాల కోటలు కట్టేది, కష్టం సేసి తినేది మర్సి మాసకారి మాటల్తో దోసుకోని తినేది బాగ నేర్సిరి.
       ఇపుడు తినేది సినీమాలు.తాగేది సినీమాలు. పాడేది సినీమాలు. నడిసేది సినీమాలు. మాట్లాడేది సినీమాలు. రాజకీయాలు సినీమాలు. అన్నీ క్రుతకాలు  కుత్సితాలు నేల ఇడిసిన సాములు.
అసలు మనిషి మాయమై పాయ! ఆ మనిషితో పాటు కళల పంటలు కూడా కాలమయి పాయ!!
*

మీ మాటలు

 1. కళల పంటలు మనకే గాని ఈ నాటి పిల్లలకు కాసుల పంటలే కావాలి.ఈ స్మృతులు ఏ మ్యూజియం లో ఉంచుదాం? మన తర్వాత ఇవి ఎవరిక్కావాలి? మనతోపాటు మనిషికూడా మాయమవుతాడు ఈ భూమ్మీద. మీ గ్యాపకాల్ని కలిపిన కథనం, లోకల్ మాట బాగున్నై .

  • Sadlapalle Chidambara Reddy says:

   సోదర స్తానిక మాటల్నీ స్తానిక సమస్యల్నీ తవ్వి పొసుకొవడానికె నేను పడుతున్న తాపత్రయం . మీ స్పందనలు వందనాలు.

  • Sadlapalle Chidambara Reddy says:

   బి.నరసన్ గారూ ఇప్పటి తరం గతాన్ని తెలుసుకొని తమ జీవితాలు బెరేజు వేసుకొని ,స్తానిక పదజాలాన్ని గౌరవించాలని ప్రపంచీకరణం వాగులో కొట్టుకుపోకుండా ఎవరికీ వారు బతికే మార్గం వెతుక్కో గలరని నా తాపత్రయం. అందుకే ఈ తొడిపొత .

 2. “ నికాల్సుగా, నిజాయితీగా, నిరాడంబరముగా, అమాయికముగా– అడవిలోని తంగేడు పూలంత అచ్చముగా బతికిన జనాలని పాడు సదువులు, యాపారం సినీమాలు,ఇండుల్లో దూరిన కట్ల పాములట్లా కేబులు వయిర్లూ, రాజకీయమోళ్ల మాయదారి ఎత్తులు నాశన సేశె.”

  • Sadlapalle Chidambara Reddy says:

   జయప్రకాశ్ గారూ మీరు గుర్తు చెసినవాటి మూలంగా నేటి యువతరంలో సామాజిక స్పృహ ఆలోచనా స్తాయి పడిపోయింది. కేవలం క్షణికమైన ఆనందంలో మునిగి తేలుతున్నారు శ్రమను గౌరవించే పధ్ధతి మారింది ఇది నేను గమనించిన సత్యం . మీ స్పందనకు ధన్యవాదాలు.

 3. buchi reddy gangula says:

  తినేది –తాగేది –నడిసేది — మాట్లాడేది —పాడేది ** సినిమాలు **
  అంతా రాజకియెం —తెలుగు రాష్ట్రం లో నయినా –అమెరికాలో నయినా ??
  కులాలు ఉన్నాయి
  అంతస్తుల తేడాలున్నాయి
  హెచ్చు -తగ్గులు ఉన్నాయి
  మానవ సంభందాలు –డబ్బు తో ముడిపడి ఉన్నాయి

  మాట
  బాట
  paata… అంతా రాజకియెం — ఎక్కడ అయినా — ఎప్పుడు అయినా
  రెడ్డి గారు — చక్కగా చెప్పారు సర్
  ———————————————————————–
  బుచ్చి రెడ్డి గంగుల

  • Sadlapalle Chidambara Reddy says:

   బుచ్చిరెడ్డి గంగుల గారూ మీ హృదయానికి ధన్యవాదాలు.

 4. విన్నకోట నరసింహారావు says:

  ఆవేదనతో నిండిన మీ వ్యాసం చదువుతుంటే గోరటి వెంకన్న గారు వ్రాసిన “పల్లె కన్నీరు పెడుతోందో” పాట గుర్తొచ్చింది. భారీ Urban Migration వల్ల గ్రామీణ పరిశ్రమలకి, చేతివృత్తులకి / నైపుణ్యాలకి పట్టిన భ్రష్టుత్వం ఇది.

  • Sadlapalle Chidambara Reddy says:

   విన్నకోట నరసింహారావు గారూ అసలు మా పల్లెల్ని గూర్చి ఎంత భయంకర నిజాలు చెప్పినా తక్కువెనండీ!! రాబోయే కాలాన్ని ఊహించడమె నిరాశకు గురిచేస్తోంది.గతాన్ని ఈ తరానికి గుర్తు చేస్తామన్న తపన నాది.మీ స్పందనకు ధన్యవాదాలు.

మీ మాటలు

*