ఒకరకంగా మనవే రాజుగారి వస్త్రాలు …

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh

దుస్తులు మార్చుకోవడం.

నిజానికి మన ప్రపంచం ఒకటి.
మరో ప్రపంచం ఒకటి.

రెండు ప్రపంచాలుంటాయి.

సాధారణంగా మన ప్రపంచంలోని అనుభవం నుంచి వేరే ప్రపంచం అనుభవాలను బేరీజు వేసుకుంటూ ఉంటాం.
కానీ, మరో ప్రపంచం తీరుతెన్నులు మనకు అందవు.

జాలిచూపులు, సానుభూతి వచనాలు, విచార పడటాలు మామూలే.
కానీ, అవతలి వాళ్లకు మన భావాలు తెలియవు, చాలాసార్లు.

వాళ్ల ఉనికి మనం ఫీలవుతాం.
మరి మన ఉనికిని వాళ్లు ఫీలవుతారా?

ఆశ్చర్యంగా వుంటుంది.
మన జీవన ప్రవాహాన్ని ఒరుసుకుంటూ వాళ్లుంటారనుకుంటాం.
కానీ, వాళ్లు మనల్ని పట్టించుకునేది చాలా తక్కువ అంటే ఆశ్చర్యంగా వుంటుందిగానీ నిజం.

ఒక రకంగా ‘వాళ్లను మనం పట్టించుకోనట్టే’ అంటే విచారపడొద్దు సుమా.
నిజం.

దుస్తులు మార్చుకోవడమే చూడండి.
ఈ చిత్రంలోనూ అదే ఉన్నది.

ఇటు మనం…అటు మనం..
మధ్యలో వాళ్లు.

ఆమె చీర కట్టుకుంటున్నప్పుడు మాత్రం ఒకే చిత్రంలో భిన్న ప్రపంచాలను కంపోజ్ చేయగలిగాను.
చూస్తూ ఉంటే గానీ తెలియదు, ఎవరి ప్రపంచం వారిదని!

మీకు బాగా తెలిసిన ప్రపంచంలోకి వస్తే, అది రహస్యం. ప్రైవసీతో కూడింది.
అవును మరి. ఉదాహరణకు మన ఇంట్లో వాళ్లు బట్టలు మార్చుకోవడం పూర్తిగా వేరు.
అమ్మ. అక్క. భార్య.
ముఖ్యంగా స్త్రీలకు సంబంధించే చూద్దాం…

మన వాళ్లు చాటుగానే దుస్తులు మార్చుకుంటారు.
బాత్రూం నుంచి బయటకు వచ్చి గదిలోకి వెళ్లేప్పుడు ఓ క్షణం మన కంట పడతారు. చూస్తాం.
చూడం కూడా.
చూస్తే, బహుశా అది మన అర్ధాంగి అయితే చూస్తాం.

వారు చీర కట్టుకునేటప్పుడు చూస్తాం.
ఎంతో ఒడుపుగా ఆ చీర ఒక కట్టుగా మారేంత వరకూ చూస్తాం.
వారు చింగులు సర్దుకుంటే సహకరిస్తాం కూడా.
జాకెట్టు హుక్స్ పెట్టమంటే పెడతాం.

జడ వేసుకున్నాక జడపిన్ను మధ్యలో ఉన్నదీ లేనిదీ అడిగితే చెబుతాం.
ఇట్లా కొన్ని అలవాట్లుంటాయి. కొంత సన్నిహిత దృశ్య ప్రపంచం వుంటుంది.

కానీ, మరో ప్రపంచం వుంటుంది.
అది మనకు దృశ్యాదృశ్యమే.

+++

ఒకవేళ కాదు నిజమే.

వాళ్లు బతికేది వీధిలో అనుకోండి. వాళ్ల స్నానాదులు మనకు తెలియవు.
వాళ్లు జుట్టు ఆరబెట్టుకోవడమూ తెలియదు.
లంగా జాకెట్టు ఎలా వదులుతారో, మరో జత ఎలా వేసుకుంటారో తెలియదు.
పంటి బిగువన చీరను పట్టుకుని జాకెట్టు వేసుకుంటారా? ఏమో!
తర్వాత చీరను ఎలా చుట్టుకుంటారో అసలు వారి కట్టెలాంటిదో?
ఎన్ని గజాల చీరను ఎంత సేపట్లో ధరిస్తారో ఏమో!
మీరేమైనా చూశారా?

ఎంత చప్పున ఆ పని కానిస్తారో లేదా ఎంత నిదానంగా వారలా పబ్లిక్ గా దుస్తులు మార్చుకుంటారో తెలుసా? వీధుల్లో బిక్షగాళ్లు లేదా వీధుల్లో ఒక కళను ప్రదర్శించి పొట్ట పోసుకునే వారు లేదా సంచార తోగలు లేదా ఇంకెవరైనా కావచ్చు. ఒక ఆచ్ఛాదన వుంచుకుని ఆ దుస్తులను మార్చుకుంటారా? లేక ఎటువంటి తెరలు లేకుండా త్వరత్వరగా బట్టలు మార్చుకుంటారా?

గమనిస్తే గానీ తెలియని దృశ్య ప్రపంచంలో మనదొక ప్రపంచం వారిదొక ప్రపంచం.

మనం సిగ్గిల్లినట్టే వారూ సిగ్గుపడతారా? మనలాగే వాళ్లు సున్నితంగా ఉంటారా?
లేక మనమే మోటుగా ఉంటున్నామా?
తెలియనే తెలియని మనది కాని మరో ప్రపంచం.

+++

అసలు కట్టు బొట్టు అన్నది ఎవరికైనా ఒక సంస్కృతి.
కానీ, ఇది మన ప్రపంచం భావనా లేక వారిది కూడానా?

అసలు ఫుట్ పాత్ పై జీవించే వారికి కట్టు – బొట్టు, వేషం – భాషా, తిండీ- తిప్పలూ, ముచ్చట్లూ- అచ్చట్లూ – అన్నీనూ ఒక దృశ్యాదృశ్యం. వారిని చూడటమే మనకు తెలుసు గానీ అసలు చూపు అంతానూ ‘ఔట్ సైడర్’ గానే అని నమ్ముతారా? అందుకే అనడం మరో ప్రపంచం అని! మనది వేరూ … వారిది వేరూ అని!

అసలుకి అంతానూ కూడా వాళ్ల ప్రపంచంలోకి మనం వెళ్లడం అసమంజసం.
అర్థం కాదు కూడానూ.
అసలు మన ప్రపంచంలోకి వాళ్లు రావడం ఈ చిత్రం.
అందుకే ఒక చూపు సారించినట్టు విచిత్రంగా వుంటుందీ చిత్రం.

+++

బజారులో వెళుతూ మనం వాళ్లను ఎలాగైత చిల్లరగాళ్లు గానో, బిక్షగాళ్లనో లేదా దొమ్మరివాళ్లనో అనుకుంటూ తప్పుకుని పోతామో…అలాగే వాళ్లు ఏ కార్యకలాపాల్లో ఉన్నాకూడానూ మనకు సెన్సిటివ్ గా అనిపించదు. అనిపించినా ‘పాపం’ అని భావిస్తాం. ‘అయ్యో పాపం’ అనే అంటాం. కొన్నిసార్లు తలదాచుకోవడానికి నీడలేని ఇలాంటి వాళ్లను చూసి సానుభూతితో మన హృదయాలు కరిగిపోతాయి. ద్రవిస్తాయి. ‘సమాజం ఎప్పుడు మారుతుందో’ అని లోలోపల అనుకుంటూ వాళ్లనుంచి తప్పుకుంటాం.

కానీ, చిత్రం ఏమిటంటే లేదా దృశ్యం ఏమిటంటే వాళ్లు నిజంగా అద్భుతమైన మనుషులు. మనల్ని చూసి, ‘వీరెప్పుడు మారుతారో’ అని ఎన్నడూ అనుకోరు. గోడలు లేని ప్రపంచంలో జీవించే ఆ మనుషులు తమ స్వేచ్ఛ గురించి మనకు లెక్చర్లు దంచరు. లేదా మన భద్ర జీవితం పట్ల కించత్తు కూడా అసూయ పడరు. అసహ్యమూ వుండదు. మాటల్తో ఎద్దేవా చేయరు. ఎన్నడు కూడానూ మనల్ని వాళ్ల జాలి చూపులతో వేధించరు కూడా. నిందాపూర్వకంగా అస్సలు మాట్లాడరు. నిశితమైన వాడి వేడి విమర్శలూ అస్సలు చేయరు. సిద్ధాంత రాద్ధాంతాలతో కూడానూ సతాయించరు. జస్ట్ వాళ్లలా జీవిస్తారు. మన ‘చిన్న ప్రపంచం’ పట్ల వారికి చిన్నచూపేమీ వుండకుండా బతుకుతారు.

చిన్నచూపు లేకపోగా,  వారు మన ఉనికితో నిమిత్తం లేకుండా ఉన్నచోటే ఉంటారు. అక్కడే రిలాక్స్ అవుతారు. పిల్లా జెల్లా అంతా కూడా ఒకే గదిలో జీవించినట్లు మరో ప్రపంచంలో వాళ్లలా అన్ని కార్యకలాపాలతో ఒక ఓపెన్ హౌజ్ లో జీవిస్తూ ఉంటారు. విశ్వం వాళ్ల ఇల్లు అన్నట్టు మన ప్రపంచం అందులో ఒక చిన్న అరలా వాళ్లలా సంకోచించకుండా జీవితం గడుపుతారు. పేండ్లు చూసుకుంటారు. దుస్తులూ మార్చుకుంటారు. పని ఉంటే ఆ పనిలోకి మారిపోతారు.

చిత్రమేమిటంటే, వాళ్ల ఏకాంత లోకాలను, ప్రేమమయ సాన్నిహిత్య క్షణాలను అవలోకించాలంటే, అనుభవించాలంటే మనం సరిపోం. నిజం. మరో ప్రపంచం ఒకటి మన మధ్య ఉన్నంత మాత్రాన దాన్ని మనం అస్సలు దర్శించలేం.

జీవితాలంతే. అన్నీ అర్థం కావు. అనుభూతి చెందలేం.

 

అందుకే మనం రోడ్డుమీది మనుషులం. ఇంటికి చేర్చే రోడ్డు ఉన్న మనుషులం.

‘రోడ్డున పడ్డ జీవితాలు’ అని మనం అనుకునేవి ‘నిలబడ్డ జీవితాలు’.
కష్టసుఖాలతో రాటుదేలి నిమిత్తంగా నిర్లజ్జగా, నిర్భయంగా మన మధ్యే తెరుచుకునే దుస్తులవి.ఒకరకంగా మనవే రాజుగారి వస్త్రాలు. కనబడవు. వాళ్లకెన్నడూ కానరావు.
బహుశా వాళ్లెప్పుడూ చూడరనుకుంటాను. అక్కర్లేదు కూడానూ.

~
( చిత్రం తీసింది, ముషీరాబాద్ చౌరస్తా, హైదరాబాద్ లో)

మీ మాటలు

*