సినిమా “కేవలం” సినిమా కాదు!

 

కత్తి మహేష్ 

 

“పాప్యులర్ సినిమా మనకు ఒక కల. సమాజం, ప్రజలు తమలో అంతర్గతంగా ఉన్న కోరికలను, ఆశలను వెండితెరమీద చూసుకుని ఆనందించే సాధనం. ప్రస్తుతం వస్తున్న సినిమాలు కొన్ని చూస్తుంటే, మనం కంటున్న కలలు ఇంత దారుణమా అనిపించకమానదు” అన్నారు ప్రముఖ బాలీవుడ్ రైటర్, లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్.

“సినిమాను సినిమాగానే చూడాలి” అనే చాలా మంది నినాదం ఈ కలల సినిమా గురించే. కలని కలలాగే చూడండి, నిజానితో పోల్చుకుని బాధపడటమో, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమో వృధా అనేది వీళ్ళ భావన కావొచ్చు. నిజంగా కలలని పట్టించుకోకూడదా ! మరి కలల రాకుమారుళ్ళని ఆరాధించడం ఎందుకు? కలలో వచ్చే రాకుమార్తెల కోసం గుళ్ళూగోపురాలూ కట్టేంత అభిమానం ఎందుకు? ఈ కలల లెక్కల్ని, గొప్పతనాల్ని, కష్టాన్నీ జాతి గౌరవానికీ లంకె పెట్టడం ఎందుకూ? అని అడిగితే మాత్రం ఈ కలల బేహారుల దగ్గర సమాధానం ఉండదు.

నిజంగా సినిమా ఒక చీకటిగదిలో సామూహికంగా కనే కలగా మాత్రమే తీసిపారేయదగ్గదైతే, ఎప్పుడో  అది తన ప్రాముఖ్యతని కోల్పోయేది. ఇంతటి స్థానాన్ని సంపాదించేదే కాదు. ముఖ్యంగా ఒక సినిమా నటుడిని నాయకుడిని చేసిన సమాజం, మరో సినిమా నటుడు నేతగా మారితే ఆశగా చూసిన సమాజం, ఇంకో నటుడు కేవలం ప్రశ్నించడానికి వచ్చాననే సరికీ సపోర్టు చేసిన పార్టీకి పట్టంకట్టిన సమాజంలో సినిమా కేవలం కలమాత్రమే, దానికీ సమాజానికీ అస్సలు సంబంధం లేదు అంటే ఎట్లా ఒప్పుకునేది?  బాహుబలి సినిమా తెలుగు జాతికి గర్వకారణమనే నోటితోనే, అందులోని సెక్సిస్ట్ దృక్కోణాన్ని తెగనాడితే దానికి సమాధానంగా సినిమాని సినిమాగా చూడమని జవాబు వస్తే ఎట్లా ఊరుకునేది? శంకరాభరణం సినిమా గురించి ప్రవచనాలు చెప్పుకుంటున్న తరుణంలో, అదొక భ్రాహ్మణికల్ ఆధిపత్య భావజాలానికి చిహ్నమని చెబితే భరించలేని పరిస్థితి ఎందుకొస్తోందో ఆలోచించాల్సిందే !

 

అందుకే సినిమా ఎవరికి సినిమా మాత్రమే అనే ప్రశ్న అత్యవసరం. సినిమాని కేవలం సినిమాగా మాత్రమే చూడండి అనే భావజాలం వెనకున్న కుట్రలు అర్థం చేసుకోవడమూ అంతే అవసరం.

అంతకన్నా ముందు, సినిమా కల మాత్రమే కాకపోతే మరేమిటి? కేవలం కల అయినంత మాత్రానా అది అర్థరహితమా? అనేవాటికి సమాధానాలు తెలుసుకోవాలి. ” “It (cinema) doesn’t give you what you desire – it tells you how to desire.”” అంటాడు ప్రముఖ తత్వవేత్త స్లావో జిజాక్. అంటే సినిమా కేవలం మనం కనే కల కాదు. మనం ఎలాంటి కలలు కనాలో చెప్పే వాహిక. మరి ఈ కలలు ఎలా ఉండాలో ఎవరు నిర్ధారిస్తున్నారు? వాళ్ళకి నేపధ్యం ఉందా? అజెండా ఉండకుండా ఉంటుందా? అన్నదగ్గర అసలు సమస్య మొదలౌతుంది. అందుకోసం కొంత చరిత్ర తెలుసుకోవడం అవసరం.

Sankarabharanam

సినిమా అనేది అన్ని కళల సమాహారమే అయినా, వీటన్నిటినీ సమీకరించడానికి కావలసిన ముఖ్య సాధనం డబ్బు. సినిమా పుట్టినదగ్గరనుంచీ ఇప్పటివరకూ అదనపు సంపత్తి (ఎక్సెస్ క్యాపిటల్) ఉన్న వర్గం పోషించిన కాస్టీ కళ సినిమా. మూకీ నుంచీ టాకీ వచ్చిన మొదట్లో అప్పటికే పాప్యులర్ అయిన పద్యనాటకాలని సినిమాలుగా మలిచినా, ఎప్పుడైతే సాంఘికాలు తెరకెక్కడం మొదలయ్యాయో అప్పటి నుంచీ రాజకీయాలూ సినిమాలో భాగం అవ్వడం సహజమయ్యింది. సంఘం గురించి, సమాజం గురించి కథ చెప్పాలంటే కొన్ని నిజాల్ని చెప్పాలి, సమస్యల్ని విప్పాలి, పరిస్థితుల్ని విష్లేషించి కథాంశాలుగా మలచాలి. మరీ ముఖ్యంగా ప్రాంతీయ సామాజిక రాజకియ స్ఫ్రుహలేకపోతే అర్థవంతమైన సినిమా తయరయ్యేది కాదు, జనరంజకం అయ్యేదీ కాదు. నెహ్రూ మార్క్ దేశభక్తి నుంచీ, ప్రజానాట్య మండలి మార్కు విప్లవాల వరకూ అన్నీ సినిమా సబ్జెక్ట్లే అయ్యాయి. అప్పట్లో సినిమాని సినిమాగా మాత్రమే చూడండి అనే నినాదం కనిపించదు.

సామాజిక స్పృహ అనే వేరే ఆయుధం అప్పట్లో చాలా పాప్యులర్. సినిమాకి సామజిక బాధ్యత ఉంది అంటూనే విజయవంతంగా వాళ్ల వాళ్ల అజెండాల్ని అమలు పర్చుకున్న సమయం అది. అందుకే క్యాపిటలిస్ట్ రామోజీరావు “ప్రతిఘటన” తీసినా జై అన్నాం, పక్కా బిజినెస్ మ్యాన్ రామానాయుడు “ముందడుగు” అన్నా, మంచి సినిమా అనుకున్నాం. అభ్యుదయం పేరుతో హైదవం మార్కు కులాంతర వివాహం ‘సప్తపది ‘ ని కళ్ళకద్దుకున్నాం.  ఏది సేలబుల్లో అది తీశారు అనడం కన్నా, సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ఇలాంటి సినిమాలు వచ్చాయని నమ్మాము. అందులో కొంత వరకూ నిజం ఉంది కూడా. మరీ బాహాటంగా కుల అజెండాలు, రాజకీయ ప్రాధాన్యతలు లేని కాలం అది. ఒకవేళ ఉన్నా, సామజిక బాధ్యత అనే వెసులు బాటు ధోరణి కొంత ఉండటం గుడ్డిలో మెల్ల.

లిబరలైజేషన్, ప్రైవెటైజేషన్,గ్లోబలైజేషన్ మొదలయ్యాక వినోదం అందించే రంగాలైన సినిమాలలో, టీవీల్లో మార్కెట్ భావజాల వ్యాప్తికి తగ్గ అన్ని హంగులూ కల్పించారు. నిర్థిష్టమైన విలువలు లేవంటూనే కంజ్యూమరిజాన్ని పెంపొందించే విలువల్ని రంగరించడం మొదలెట్టారు. డబ్బు, అధికారం, ఆధునిక లైఫ్ స్టైల్ మాత్రమే పరమావధి అవ్వాలంటే చూపించే కలలు మారాలి. ఏ కలలు కనాలో నేర్పే సాధనాల నైపుణ్యం పెరగాలి. జాతీయ స్థాయిలో, ముఖ్యంగా హిందీ సినిమాలో జరిగిన గణనీయమైన మార్పు చూసుకుంటే ఎంత పద్దతిగా ఎన్నారై కలలు, అర్బన్ కథలుగా మారాయో అర్థమైపోతుంది. కానీ సామాజిక స్పృహ, రాజకీయ పరిఙ్జానం, దైనందిక సమాజంలో అస్తిత్వాల ప్రమేయం బలంగా ఉన్న స్థానిక ప్రాంతీయ సినిమాలలో కేవలం కలల్లో మార్పు వస్తే సరిపోదు, కలల్ని ప్రశ్నించలేనంతగా మభ్యపెట్టాలి.

ప్రపంచీకరణ తొంభై దశకంలో మొదలైనా అది స్థిరపడి, కలల్ని శాసించే రంగంలో వేళ్ళూను కోవడానికి పది సంవత్సరాలు పట్టిందనే అనుకోవాలి. కొంత అయోమయ స్థితి, ఏ కథలు చెప్పాలో అర్థంకాని స్థితి నుంచీ భాషా ఫర్మాట్, ఢీ-రెడీ ఫార్మేట్, ఎస్కేపిస్టు ప్రేమకథల ఫార్మేట్ అనే మూడు అత్యుత్తమ భ్రమల మూసల్ని ఆలంబనగా చేసుకుని కొత్త అజెండాని ‘తెర మీదకి ‘ తెచ్చారు.

 

బాషా నుంచీ బాహుబలి వరకూ మనకు చెప్పే సూపర్ హీరో కథ ఒకటే. సామాన్యుల్లో సామాన్యుడిగా బ్రతికే ఒక గొప్పోడు రాజు అని తెలియడం. ఆ రాజు నేపధ్యంలో ఎంత గొప్పగా తన ప్రజల్ని చూసుకునేవాడో చూపించి, చివరికి విలన్ను జయించి మళ్ళీ రాజవడం. చాలా వరకూ విలన్లు కూడా దాయాదులో, బందువులో లేక వైరి వర్గం ఫ్యాక్షన్ వాళ్ళో ఉంటారు. అత్యంత మామూలుగా కనిపించే ఈ కథలో మార్కెట్ ఎకానమీని శాసించే కుట్ర ఏముంది అనేది ఎవరూ ప్రశ్నించని విషయం. అదే ఈ ఫార్ములా సక్సెస్. ‘రెడ్డి ‘, ‘నాయుడు ‘, ‘చౌదరి ‘ అంటూ నాయకులకి పేర్లు పెట్టినా మనం కలనే చూస్తాంగానీ, ఆ కలల ఔచిత్యాన్ని ప్రశ్నించం. అధికార కులాలే నాయకులు, మిగతావాళ్ళు బానిసలు అనే రీడింగ్ ఎక్కడ ఈ సినిమాల్ని అర్థం చేసుకోవడంలో వాడేస్తారో అనే ఖంగారులో ఒక కొత్త నినాదం పుట్టీంది. అదే…”సినిమాని సినిమాగా చూడండి” అని.

Bahubali-Posters-Prabhas-Bahubali-Posters

ఢీ-రెఢీ ఫార్ములాది మరో తీరు. సోకాల్డ్ దుర్మార్గులైన జోకర్ విలన్లను, తన (అతి)తెలివితేటలతో ముప్పతిప్పలూ పెట్టి మోసం చేసి, దొరక్కుండా తప్పించుకుని గెలిచే ఘరానా మోసగాడు హీరో. కుర్ర విలన్ ఏ హీరోయిన్ను సిన్సియర్గా మోహిస్తాడో, అదే హీరోయిన్ను హీరో బలవంతంగా ప్రేమిస్తాడు. ఇక్కడ హీరో ఎవరు, విలన్ ఎవరు అనే విషయం నటులు నిర్దేశిస్తారేగానీ పాత్రలు, వాటి ఔచిత్యాలూ కాదు. హీరో రాం స్థానంలో విలన్ సోనూ సూద్ ని, సోనూ సూద్ స్థానంలో రాం ని వేసి చూసుకోండి. అప్పుడు మీరు విలన్ను ఎక్కువగా ప్రేమిస్తారు. హీరోని అంతకంత ద్వేషిస్తారు. మరి దీని ప్రభావం సమాజం మీద, జనాల ఆలోచనల మీదా లేవంటారా?!? రేవంత్ రెడ్డి తొడకొట్టి జైలుకెళ్ళినా, ఘన స్వాగతంతో మనం జైలు బయట స్వాగతిస్తున్నామంటే ఎంతగా హీరో అయిన విలన్ కి అలవాటుపడిపోయామో తెలియడం లేదా ! అందుకే, మనం సినిమాని సినిమాగా చూడాలి. కదా !

ఇక ప్రేమ కథలు. స్త్రీ స్వేచ్చ పెరుగుతున్న సమాజంలో, అమ్మాయిలు దొరకని అబ్బాయిల ఇన్సెక్యూరిటీలను, డీవియంట్ ప్రవర్తనను హీరోయిజంగా చూపితే దానికుండే కరెన్సీ ఎక్కువ. ఎందుకంటే, మెజారిటీ అబ్బాయిలు ఆ బ్రాకెట్లోనే ఉంటారు కాబట్టి. థియేటర్లలో సామూహికంగా కుతి తీర్చుకోవడానికో, వాయొలెన్సును, స్టాకింగుని, టీజింగుని పాఠాలుగా నేర్చుకుని ప్రేమించకపోతే అమ్మాయిల మీద యాసిడ్లు పొయ్యడానికో సినిమాల్ని సినిమాలుగా చూడాలి.

ఇలా ఒక్కో సామాజిక వర్గాన్ని తనదైన మత్తులో జోగేలా చేస్తూ, తమ మార్కెట్ అజెండాల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెల్తున్న  సినిమాని సినిమాగా ఎలా చూడాలి? ఎందుకు చూడాలి?
సినిమా ఒక కళ, దానికొక సామాజిక బాధ్యత ఉంది అనేది ఒక పద్దతి ప్రకారం బూతు అయిపోయిన చోట, నిజమే సినిమాని సినిమాగా మాత్రమే చూడాలి.
మరి వీళ్ళే సినిమాని కళామతల్లి అంటారెందుకు. కళామతల్లి అంటే కళల తల్లి కాదు. కళలలో ‘మతల్లి” అంటే ఉత్కృష్టమైనది అని. అంటే అత్యంత గొప్ప కళ అని. ఈ భ్రమలెందుకు మళ్ళీ !

సామాజిక ప్రయోజనత్వాన్ని, బాధ్యతని, అస్తిత్వ ప్రకటనల భాగస్వామ్యాన్నీ ఎంత పకడ్బందీగా సినిమాలో లేకుండా చేసి అధికారానికీ, మార్కెట్ కూ కొమ్ముకాస్తున్నాయో అంతే పకడ్బందీగా “తూచ్ సినిమా ఈజ్ ఓన్లీ సిమా ఎహే ” అనే నినాదాన్నీ బలపరుస్తున్నాయి. సినిమాని సీరియస్గా తీసుకుని ప్రశ్నంచడం మొదలుపెడితే జనాలని కలలు అనే భ్రమల్లో ముంచి ఉంచడం కష్టం. తమ అజెండాల్ని కొనసాగించడం కష్టం. కొందరు కాన్షియస్గా, మరికొందరు సబ్-కాన్షియస్గా ఈ కుట్రలో భాగమైపోతూ, ఎలా ఉన్నా సినిమాకు జై కొడతాం, సినిమా అవలక్షణాలను కూడా నెత్తికెత్తుకుని ఊరేగతాం అని పూనకం పూనుతుంటే, వాళ్లని ఒక్క చెపదెబ్బ కొట్టి “ఇంతగా ఫీలైపోతున్నావంటే సినిమాని సినిమాలాగా మీరూ చూడటం లేదురా బాబూ!” అని చెప్పాలనిపిస్తుంది. తేడా అంతా మనలో ఎవరికీ సినిమా సినిమా మాత్రమే కాదు అని తెలుసుకోకపోవడం వల్ల వస్తోంది.

సినిమా సినిమా మాత్రమే కాదు. అదొక అవిభాజ్య సామాజిక కళ అని నమ్మి దాన్ని సీరియస్గా తీసుకోకపోతే మన సామాజిక పతనానికి అది బలమైన సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుంది.

*

మీ మాటలు

  1. Suresh Kumar Digumarthi says:

    ఆవేదన….

  2. Suresh Kumar Digumarthi says:

    అన్ని సార్లు సినిమాని సినిమా లాగా చూడడం కుదరదు. ఎవరి మనసును కదిపేసే/ కుదిపేసే దృశ్యాలు వారికి కనిపించినపుడు సినిమాని సినిమా లాగా చూడడం కుదరదు, పక్కవాళ్లకు మాత్రమే అనిపిస్తుంది సినిమాని సినిమా లాగా చూడాలని.

  3. “అందులోని సెక్సిస్ట్ దృక్కోణాన్ని తెగనాడితే దానికి సమాధానంగా సినిమాని సినిమాగా చూడమని జవాబు వస్తే ఎట్లా ఊరుకునేది? ”

    No you don’t keep quite, valid point , but its hardly sexist, and the integrity of the girl who raked this storm should be questioned ( just like the communists questioning everything ). She is been doing such things since that Nirbhaya rape. And boy this helped , not for her , but other dozen or so folks who made fun of her in YouTube. Apparently that girl thinks she is a celebrity, yeah right, in one of the charitable event planned by NRIs from that district, she was asking why they are inviting her, because she is popular. She was told to take a break. Since that storm she did squat to stop it. Bringing the issue to the TVs and media will not solve the issue, it will help gain more popularity for that person.Juvenile immature rants needs to be shown their place.

    శంకరాభరణం సినిమా గురించి ప్రవచనాలు చెప్పుకుంటున్న తరుణంలో, అదొక భ్రాహ్మణికల్ ఆధిపత్య భావజాలానికి చిహ్నమని చెబితే భరించలేని పరిస్థితి ఎందుకొస్తోందో ఆలోచించాల్సిందే !

    And please , its 2015, even if a Dalit learns music or becomes a pundit, he would do it the same way. Its not Brahmanism, its discipline. Those were the days the leftist writes wrote such trash. Not in the day of internet. Sorry.

  4. // అదొక భ్రాహ్మణికల్ ఆధిపత్య భావజాలానికి చిహ్నమని చెబితే భరించలేని పరిస్థితి ఎందుకొస్తోందో ఆలోచించాల్సిందే//
    కాదని చెప్తే మీరు ఎందుకు భరించలేక పోతున్నారో ??
    మీతో ( మీరు అంటే మీరు కాదు, మీలాంటి భావజాలం ఉన్నవాళ్ళు ) వచ్చిన చిక్కే ఇది , మీరు మాత్రమె తెలివైన వాళ్ళు అని , మిగతా వాళ్ళంతా తెలివి తక్కువ దద్దమ్మ లు అన్నట్టు మాట్లాడతారు ..

  5. Aranya Krishna says:

    చాలా మంచి విశ్లేషణ.

  6. పిన్నమనేని మృత్యుంజయరావు says:

    మహేష్ గారూ! ఇంతకీ సినిమా ఎలా ఉండాలో చెప్పారు కాదు. అవిభాజ్య సామాజిక కళ అంటే ఏమిటో వివరిస్తే బాగుండేది.

  7. Mythili Abbaraju says:

    అయ్యా.బాగానే ఉన్నది గానీ జావేద్ అక్తర్ గారి ‘పాపులర్ సినీమా కలలు ‘ ఏ మాత్రం మెరుగైనవి ??
    ఆయన బిమల్ రాయ్ కాదుగదా. .. ? ఇప్పుడు వృద్ధుడవటమే అర్హత , బహుశా .
    ( మంచి కవి అనేది వేరే సంగతి )

  8. B. Rama Naidu, London says:

    మంచి ప్రయత్నం. ఇది చాలా పెద్ద కాన్వాస్. నా ఉద్దేశంలో మీరు చెప్పే అంశాలకు ప్రాదిపదిక ఏమిటో వివరించాలి – అది మీద సొంత పరిశోధన ద్వారా కాని లేదా ఈ విషయాల మీద వచ్చిన సాహిత్య ఆధ్యయనం ద్వారా గాని ఆధారపడి చెప్పాలి. పిన్నమనేని గారు చెప్పినట్లు మీరు సినిమా ఎలా ఉండాలో చెబితే మీ ప్రాతిపదిక పాఠకులకు అర్థమయ్యి ఉండేది. ఉదాహరణకు మీరు సప్తపది సినిమా గురించి చెప్పిన ‘అభ్యుదయం పేరుతో హైదవం మార్కు కులాంతర వివాహం ‘సప్తపది ‘ ని కళ్ళకద్దుకున్నాం’ అన్న విషయన్ని విశ్లేషించాలి. అది ఎలా హైందవ మార్క్ సినిమానో వివరించాలి. మీరు చాలా భావనలను ప్రతిపాదిస్తూ పోయారు, కాని వాటికీ సంభందించిన విశ్లేషణ లేకపోవడమే మీ వ్యాసం లోని గ్యాప్. మనందరికీ చాలా ‘భావనలు’ ఉంటాయి, కాని వాటిని రాసే ముందు నిగ్గుదేల్చుకోవాలి.

  9. చక్రి says:

    ఆయనంతే ఏ సినిమాలో అయినా ఓ పట్టు పంచో…మొహాన కుంకుమో నామమో పెట్టుకొని మనిషి కనపడితే చాలు బ్రాహ్మణికల్ అధిపత్య భావజాలం అనేస్తాడు..సినిమాని తిట్టెస్తాడు, ఎటుతిరిగీ పాయిం
    టుని అక్కడికే తెస్తాడు.. అదో భావజాలం !!

Leave a Reply to B. Rama Naidu, London Cancel reply

*