వికట విటులు

 

మధురవాణి: ఒక వేశ్య

రామప్పంతులు: ఆమె కొత్త విటుడు

గిరీశం: ఆమె ప్రస్తుత విటుడు

పూటకూళ్ళమ్మ: ఒక విధవ

 

రామ: (జేబులోంచి చుట్ట తీసి పంట కొరికి) పిల్లా, అగ్గిపుల్ల!

మధు: (అగ్గిపుల్ల వెలిగిస్తుండగా పంతులు బుగ్గ గిల్లాడు) మొగవాడికయినా ఆడదానికయినా నీతి ఉండాలి. తాకవద్దంటే చెవిని బెట్టరు గదా!

రామ: నిన్ను ఉంచుకోవడానికి అంతా నిశ్చయమయి రేపో నేడో మంచి ముహూర్తం చూసి మా వూరు లేవతీసుకు వెళ్ళడానికి సిద్ధవయ్యుంటే యింకా యవడో కోన్కిస్కాహే గాడి ఆడాలో ఉన్నానంటూ పాతివ్రత్యం నటిస్తావేమిటి!?

మధు: వేశ్య అనగానే అంత చులకనా పంతులు గారూ? సానిదానికి మాత్రం నీతి ఉండొద్దా? మా పంతులు గారిని పిలిచి, ‘అయ్యా, యిటుపైన మీతోవ మీది, నాతోవ నాది’ అని తెగతెంపులు చేసుకున్నదాకా నేను పరాధీనురాలినే అని యంచండి. మీరు దెప్పిపొడిచినట్టు ఆయన వైదీకయితేనేమి, కిరస్తానం మనిషయితేనేమి, పూటకూల్లమ్మను వుంచుకుంటేనేమి… నన్ను ఇన్నాళ్ళూ ఆ మహరాజు పోషించాడు కాడా! మీరంతకన్న రసికులయినా, నామనస్సు మీరు యంత జూరగొన్నా, ఆయన యడల విశ్వాసం నాకు మట్టుకు ఉండొద్దా?

రామ: పెద్దపెద్ద మాటలు ప్రయోగిస్తున్నావు! వాడి బతుక్కి వాడు పూటకూళ్ళమ్మని వుంచుకోవడం కూడానా? పూటకూళ్ళమ్మే వాణ్ణి వుంచుకొని యింత గంజి పోస్తుంది.

మధు: అన్యాయం మాటలు ఆడకండి, ఆయన యంత చదువుకున్నాడు, ఆయనకి యంత ప్రఖ్యాతి వుంది! నేడో రేపో గొప్ప వుద్యోగం కానైయ్యుంది.

రామ: యేం వెర్రి నమ్మకం! నీవు సానివాళ్ళలో తప్ప పుట్టావు. గిరీశంగారు, గిరీశంగారు అని పెద్ద పేరు పెడతావేవిటి, వాణ్ణి చిన్నప్పుడు గిర్రడని మేం పిలిచే వాళ్ళం. వాడికల్లా ఒక్కటే వుద్యోగం దేవుడు రాశాడు. యేవిటో తెలిసిందా? పూటకూళ్ళమ్మ యింట్లో దప్పిక్కి చేరి అరవ చాకిరీ చెయ్యడం.

మధు: యీ మాటలు ఆయన్ని అడుగుదునా?

రామ: తప్పకుండా, కావలిస్తే నేను చెప్పానని కూడా చెప్పు!

మధు: అయినా ఆయన గుణయోగ్యతలతో నాకేం పని? యేవయినా ఆయన నాకు యజమాని. ఆయన తప్పులు నాకళ్లకు కనబడవ్!

రామ: అయితే అతనికి విడాకులు యెప్పుడిస్తావు?

మధు: యిక్కడి రుణాలూ పణాలూ తీర్చుకోడానికి మీరు శలవిచ్చిన రెండు వందలూ యిప్పిస్తే యీ క్షణం తెగతెంపులు చేసుకుంటాను.

రామ: అయితే యింద (మధురవాణి అందుకొంటుండగా రామప్పంతులు చెయిపట్టి లాగును. మధురవాణి కోపంతో నోట్లు పారేసి దూరంగా పోవును)

మధు: మీతో కాలక్షేపం చెయ్యడం కష్టం. ఒక నిర్ణయం మీద నిలవని మనిషి. ఏవన్నమ్మను?

రామ: (నోట్లు యెత్తి) క్షమించు, అపరాధం (నోట్లు చేతికిచ్చి) లెక్కపెట్టి చూసుకో!

మధు: ఆమాత్రం మిమ్మల్ని నమ్మకపోతే మీతో రానే రాను. యింత రసికులయ్యుండీ నామనస్సు కనిపెట్టజాలినారు కారు గదా! మీనోట్లు మీవద్దనే వుంచండి. నేను డబ్బు కక్కూర్తి మనిషిని కాను.

రామ: వద్దు, వద్దు, వద్దు! నీ మనస్సు కనుక్కుందామని అన్నమాట గాని మరొకటి కాదు. గాని, యీ గిరీశం గుంటవెధవ, వీడెవడో మాగొప్ప వాడనుకున్తున్నావేవిటి!?

మధు: ఆయన్ని నాయదట తూల్నాడితే యిదిగో తలుపు తీశాను, విజయం చెయ్యండి. అదుగో గిరీశంగారే వస్తున్నారు, ఆమాటేదో ఆయన్తోటే చెప్పండి.

రామ: వేళాకోళం ఆడుతున్నావూ?

గిరీశం: (బయటినుంచి) మైడియర్….

రామ: (తనలో) అన్న… వేళగాని వేళొచ్చాడు గాడిదకొడుకు. తంతాడు కాబోలు, యేవిటి సాధనం? యీ మంచం కింద దూరదాం. (మంచం కింద దూరును)

గిరీశం: (ప్రవేశించి) వెల్, మైడియర్ ఎంప్రెస్ (బుజం మీద చెయ్యి వెయ్యబోవును)

మధు: (తప్పించుకొని) ముట్టబోకండి.

గిరీశం: (నిర్ఘాంతపోయి) అదేమిటి ఆ వికారం!

మధు: ఏదో ఒకటి..

గిరీశం: మైలబడితే స్తానం చేసి వేగిరం రా!

మధు: యిప్పుడేం తొందర, తలంటుకుంటాను.

రామ: (తనలో) చబాష్, యేమి నీతయిన మనిషి యిది! వెధవని ముట్టుకోనివ్వకుండా యెత్తు యెత్తింది.

గిరీశం: మయిలా గియిలా మా యింగ్లీషు వారికి లక్ష్యం లేదు. యిలారా (దగ్గరకు చేరును)

మధు: (వేలుచూపి) అక్కడనే ఆగండి. మీరు కిరస్తానం అయితే కావచ్చును. నేను కిరస్తానం యింకా కాలేదే! మీరు కిరస్తానం అన్నమాట యిప్పుడే ఒహరు చెప్పగా విన్నాను.

రామ: (తనలో) నేను చెప్పానంటుందా యేమిటి?

గిరీశం: ఒకరు చెప్పగా విన్నావూ? ఎవరా జెప్పింది? యవడికిక్కడికి రావడానికి మగుదూర్ వుంది? యిలాంటి చాడీకోర్ కబుర్లు చెప్పడానికి ఎవడికి గుండుంది? చెప్పు!

రామ: (తనలో) తంతాడు కాబోలు, యరక్క చిక్కడ్డాను.

మధు: మొగాడే చెప్పాలా యేవిటి? ఆడవాళ్ళకి దేవుడు నోరివ్వలేదా?

గిరీశం: (తనలో) పూటకూళ్ళముండ చెప్పింది కాబోలు. (పైకి) ఆడదా? ఆడదాన్ని నోరు బెట్టుకు బతకమనే దేవుడు చేశాడు. పరువయిన ఆడది నీ యింటి కెందుకొస్తుంది?

మధు: పరువయిన మొగాళ్ళొచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళెందుకు రాకూడదు? ముందు కూచోండి, తరవాత కోప్పడుదురు గాని, చుట్ట తీసుకోండి, అదుగో అగ్గిపెట్ట.

గిరీశం: ముట్టుకోడానికి వల్ల లేకపోతే అగ్గిపుల్ల వెలిగించి యివ్వడానికయినా పెట్టిపుట్టాను కానా? యివాళ మహా ఉత్సాహంగా వచ్చాను గాని, ఉత్సాహభంగం చేశావ్!

మధు: యేవిటా ఉత్సాహం?

గిరీశం: యిదిగో, జేబులో హైదరాబాద్ నైజాం వారి దగ్గిర్నించి వచ్చిన ఫర్మానా! మానాస్తం నవాబ్ సదరదాలత్ బావురల్లీఖాన్ ఇస్పహన్ జంగ్ బహద్దర్ వారు సిఫార్స్ చేసి వెయ్యి సిక్కా రూపాయలు జీతంతో ముసాయిబ్ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేషా బాద్షా వారి హుజూర్న వుండడం.

రామ: యేవిట్రా వీడి గోతాలు!

గిరీశం: యింత శుభవార్త తెచ్చినా, దగ్గిరికి రానిచ్చావు కావు గదా? నాతో హైదరాబాద్ వస్తావా?

మధు: నే యెందుకు? పూటకూళ్ళమ్మని తీసికెళ్ళండి.

గిరీశం: పూటకూళ్ళమ్మ యేవయినా పెంట పెడుతుందా యేవిటి?

మధు: మీకే తెలియాలి.

గిరీశం: నీ తెలివితక్కువ చూస్తే నాకు నవ్వొస్తూంది. యెవడే మాటన్నా నామీద నమ్మడమేనా? యీ ఘోరవైన అబద్ధాలు నీతో చెప్పేవాడు సప్తసముద్రాలు దాటినా వాడి పిలకట్టుకొని పిస్తోల్తో వళ్ళు తూట్లు పడేటట్టు ఢా ఢా మని కొట్టకపోతినట్టయినా నాపేరు గిరీశమే, నినదభీషణ శంఖము దేవదత్తమే! కబడ్దార్!

మధు: సముద్రాలవతలికెళ్ళి వెతకక్కర్లేదు. ఆ చెప్పిన మనిషి మీ యదటే చెబుతాడు.

రామ: (తనలో) యీ ముండ నన్ను బయలుబెడుతుంది కాబోల్రా దైవమా!

గిరీశం: (తనలో) థాంక్గాడ్.. అయితే పూటకూళ్ళదాన్దెబ్బ తగల్లేదు. (పైకి) యిలాంటి దుర్మార్గపకూతలు ఆ యిల్లాలు చెవిన పడితే చాలా ఖేదిస్తుంది. ఆ పాపవంతా నిన్ను చుట్టుకుంటుంది. ఆమె యంత పతివ్రత! యంత యోగ్యురాలు!

మధు: వెధవముండకి పాతివ్రత్యం అన్నమాట యీ నాటికి విన్నాను.

గిరీశం: దానికి… కాదు, ఆమెకి మొగుళ్ళేకపోయినా ఆమెను వెధవనడానికి వీల్లేదు.

మధు: మీరుండగా వెధవెలా అవుతుంది?

గిరీశం: నాన్సెన్స్… యిదుగో విను. దాని నిజం యేవిటంటే… పూటకూళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేశే రోజుల్లో ఒక కునుష్టి ముసలాడికి కట్ట నిశ్చయించారు. ఆ ముసలాడు పెళ్లిపీటల మీదే గుటుక్కుమన్నాడు. మరిదాన్నెవరూ పెళ్ళాడారు కారు.

మధు: అయితే మరి మీకు తప్పలేదే?

గిరీశం: యేవిటీ యీ కొత్తమాటలూ! నాకు ఆదీ అంటూ తెలీకుండా వుంది! ఆహా, సరసం విరసం లోకి దిగుతూందే! హాస్యానికంటే నివ్వేవన్నా ఆనందవే! నిజవనిగానీ అంటివా, చూడు నా తడాఖా. యవడీ మాటలు పేల్తున్నాడో వాడి పేరు తక్షణం చెబుతావా, చెప్పవా?

మధు: రామ….

రామ: (తనలో) సచ్చాన్రా, పేరు చెప్పేసింది!

మధు: రామ!రామ! ఒహరు చెప్పేదేమిటి, లోకమంతా కోడై కూస్తుంటేను! (వీథిలోనుంచి తలుపు తలుపు అని ధ్వని)

గిరీశం: (తెల్లపోయి) తలుపు తియ్యొద్దు, తియ్యొద్దు, ఆ పిలిచే మనిషి వెర్రిముండ. మనుషుల్ని కరుస్తుంది.

మధు: తలుపు తీసే వుంది.

గిరీశం: చంగున వెళ్లి గడియ వేసెయ్.

మధు: అదుగో, తలుపు తోసుకు వస్తూంది.

గిరీశం: గెంటేయ్, గెంటేయ్…

మధు: ఆ వయ్యారం చూస్తే మీ పతివ్రతలా కనిపిస్తూంది.

(మధురవాణి వాకిట్లోకి వెళ్ళింది. గిరీశం దాక్కోడానికి మంచం కింద దూరాడు)

గిరీశం: (తనలో) దొంగలంజ. సరసుణ్ణి దాచిందోయ్ మంచం కింద. యిదేమిటో మంచి మనిషి అని భ్రమించాను. దీన్తస్సగొయ్యా సిగపాయ దీసి తందును గాని, యిది సమయం కాదు. (పైకి) యవరన్నా మీరు, మహానుభావులు?

రామ: నేను రామప్పంతుల్నిరా, అబ్బాయీ!

గిరీశం: తమరా, యీ మాత్రం దానికి మంచం కింద దాగోవాలా మహానుభావా? నన్నడిగితే యిలాంటి లంజల్ని యిరవై మందిని మీకు కన్యాదానం చేతునే!

రామ: (తనలో) బతికాన్రా దేవుడా; (పైకి) నువ్వురా బాబూ దీన్నుంచుకున్నావు! ఆలా తెలిస్తే నే రాక పోదును సుమా!

గిరీశం: అన్నా, యీ లంజని యన్నడూ నమ్మకండి, యిలా యిరవైమందిని దాచగల శక్తుంది దీనికి.

రామ: రెండువందలు దొబ్బిందిరా బాబూ!

గిరీశం: నువ్వులేం జాగర్త చేశారా?

రామ: అంతేనా?

గిరీశం: మరేమిటి!? (మధురవాణిని తోసుకుంటూ పూటకూళ్ళమ్మ లోపలి కొచ్చింది)

మధు: మీరన్న మనిషి యిక్కడ లేరంటే చెవిని బెట్టరు గదా!

పూట: నీయింట్లో జొరబడ్డాడని వీథులో వాళ్ళు చెబితే నీమాట నమ్ముతానా యేవిటి? ఆ వెధవ వుంటే నాకేం కావాలి, వుండకుంటే నాకేం కావాలి. వాడు నీకిచ్చిన యిరవయి రూపాయలూ యిచ్చెయ్.

మధు: ఎవడి కిచ్చావో వాణ్ణే అడగవమ్మా!

పూట: వెధవ కనబడితే సిగపాయ దీసి చీపురుకట్టతో మొత్తుదును. యెక్కడ దాచావేవిటి!?

మధు: నాకు దాచడం ఖర్మవేవి? నేను మొగనాల్ని కాను, వెధవముండనీ కాను. నాయింటి కొచ్చేవాడు మహరాజు లాగా పబ్లీగ్గా వస్తాడు. (కంటిసైగతో మంచం కింద చూపును)

పూట: (మంచం కిందుకు వంగి) నీ పరువు బుగ్గయినట్టే వుంది. లేచిరా (చీపురుకట్ట తిరగేసి కొట్టును)

రామ: ఓర్నాయనా నన్నెందుక్కొడతావే దండుముండా! (బయటికి వచ్చును)

మధు: ఆయన్నెందుకు కొట్టావు? నాయింటి కొచ్చి యేవిటీ రవ్వ?

రామ: నీ సిగాతరగా, ఆడదానివై పోయినావే, లేకుంటే చంపేసి పోదును. నీ రంకుమొగుణ్ణి కొట్టక నన్నెందుక్కొట్టావే ముండా? అందుకా నన్ను ముందుకు తోసి తాను గోడవేపు దాగున్నాడు?

పూట: ఆ వెధవ కూడా వున్నాడూ మంచం కింద? కుక్కా పైకిరా!

గిరీశం: వెర్రప్పా! మంచం కిందికిరా, వెర్రి వదలగొడతాను.

పూట: అప్పనుట్రా వెధవా నీకు? నీకు భయపడతాననుకున్నావా యేమిటి? (మంచం కిందికి దూరును. గిరీశం అవతలి వేపు నుంచి పైకి వచ్చి రామప్పంతులు నెత్తిన బలంగా చరిచి పారిపోవును)

రామ: సచ్చాన్రా నాయనా! మధురవాణీ, యేవీ బేహద్బీ! కనిష్టీబుక్కబురంపించు!

మధు: యెందుకు పబ్లీకున అల్లరీ అవమానవున్నూ! (ముద్దుబెట్టుకొని) మాటాడక వూరుకొండి. దొంగ దెబ్బ కొట్టినవాడిదే అవమానం; మీది కాదు.

రామ: నొప్పెవడిదనుకున్నావు? ఆముండ మంచం కింద నించి రాదేం? చీపురుకట్ట లాక్కో!

పూట: (మంచం కింద నుంచి వచ్చి) ఫడేల్మంటే పస్తాయించి చూస్తున్నాను. నీ మొగతనం యేడిసినట్టే వుంది. (వెళ్లిపోవును)

*

 

మీ మాటలు

  1. Krishna Prasadrao says:

    అద్బుత్గం

మీ మాటలు

*