రాత్రంతా జీవిస్తూ ఉండడానికీ….

ఒకలాంటి ప్రశాంతమైన అలసటా, విరామపు రాత్రీ కలిసి వస్తే..
ఆలోచలన్నీ వదిలించేసుకోవడానికని తల విదిలించుకున్నప్పుడే, సరిగ్గా అప్పుడే, మరుగున పడ్డ జ్ఞాపకాలేవో పలకరిస్తే.. ముఖ్యంగా అవి ఒకప్పటి అపురూపాలైతే!?
అన్నిటినీ ముందేసుకుని..
సగానికి వంగిపోయిన నెమలీకలూ.. చిట్లిన సముద్రపు గవ్వలూ.. ఎండిన గులాబి రేకులూ… ఇంకు వెలిసి రాలి పోతున్న అక్షరాలూ…
అన్నిటినీ తడిమి, తరచి తరచి చూసుకుంటూ
సర్వం మరిచి, రెండు అలల మధ్య నిశ్శబ్దాన్ని చేజిక్కించుకున్నట్టు .. దాటిపోయిన వెన్నెల గాలిని అతి జాగ్రత్తగా ఇంకొక్కసారి ఒడిసిపట్టుకుని..
మనల్ని మనం తాకే ప్రయత్నం చేసుకోడానికి, కొన్ని రాత్రిళ్ళు సహాయం చేస్తాయి..
రాత్రంతా జీవిస్తూ ఉండడానికీ…. మొదటి వెలుగు కిరణంతోటే మళ్ళీ మరణించడానికీ చాలా రాత్రిళ్ళు సహకరిస్తాయి!
gulzar

రాత్రంతా

రాత్రంతా చల్లగాలి వీస్తూనే ఉంది
రాత్రంతా నెగడు రగిలిస్తూనే ఉన్నాము
నేను గతం తాలూకు ఎండిపోతున్న కొన్ని కొమ్మల్ని నరికేశాను
నువ్వు కూడా గడిచిపోయిన క్షణాల ఆకుల్ని విరిచేశావు
ఆపైన నేనేమో నా జేబులోంచి జీవం లేని కవితలన్నిటినీ తీశేశాను
ఇహ నువ్వు కూడా చేతుల్లోంచి వెలిసిపోయిన ఉత్తరాలని తెరిచావు
నా ఈ కళ్ళతో కొన్ని తీగల్ని తుంఛేశాను
చేతుల్లోంచి ఇంకొన్ని పాతబడ్డ గీతల్ని పారేశాను
నువ్వేమో కనురెప్పల తడి పొడినంతా వదిలేశావు
రాత్రంతా మన శరీరాలపై పెరుగుతూ మనకి దొరికినవన్నీ
నరికి మండుతున్న నెగడులోకి విసిరేశాము
రాత్రంతా మన ఊపిరి ప్రతీ జ్వాలలో శ్వాస నింపింది
రెండు శరీరాల ఇంధనాన్ని మండిస్తూనే ఉంది
రాత్రంతా ఒక మరణిస్తున్న బంధం వేడిలో చలి కాచుకుంటూనే ఉన్నాము.
satya

మూలం:

Raat bhar sard hawa chalti rahi
raat bhar hamne alaav taapa

maine maazi se kai khushk see shaakhien kaati
tumne bhi gujre hue lamhon ke patte tode
meine jebon se nikali sabhi sukhi nazmein
tumne bhi haathon se murjhaaye hue khat khole
apnee in aankhon se meine kai maanze tode
aur haathon se kai baasi lakeeren phenki
tumne palkon pe nami sookh gayee thee, so gira di
raat bhar jo bhi mila ugte badan par humko
kaat ke daal diya jalte alaawon main use

Raat bhar phoonkon se har lau ko jagaye rakha
aur do jismon ke indhan ko jalaye rakha
raat bhar bujhte hue rishte ko taapa humne…

————————-

Painting: Satya Sufi

మీ మాటలు

  1. Krishna Prasadrao says:

    పిక్చర్స్ అండ్ పోయెట్రీ వ్యాస్ సూపర్బ్

  2. నిషిగంధ says:

    ధన్యవాదాలు, కృష్ణ ప్రసాదరావు గారు.

  3. srivasthava says:

    పెయింటింగ్ అండ్ పోయెట్రీ చాల చాల బాగున్నై

  4. నిషీ, నీ మాటలు విని , ఈ కవిత చదివి – ఈ రాత్రికి జీవం పోయడానికే నేను మేలుకున్నట్టున్నాను. బ్యూటిఫుల్ !!!

Leave a Reply to నిషిగంధ Cancel reply

*