మిరకిల్

 

 

అల్లం వంశీ  

వాళ్లిద్దరు ఒకరి జబ్బ మీద ఒకరు చేతులేసుకోని, అడుగుల అడుగేసుకుంట లోపటికి నడిచిన్లు..

ఆ లోపట..వెలుతురు కూడా అచ్చం చీకటిలెక్కనే కనపడ్తాంది..

ఎందుకంటే,అన్ని బార్లల్ల ఉన్నట్టే ఈడకూడా “తక్కువ వెలుతురు,ఎక్కువ చీకటి” అన్న ప్రాథమిక సూత్రం అమల్లఉన్నది.. అట్లా డిమ్ము లైటుకింద తాగుతె మస్తు “ఎక్కుతదనేది” తాగేటోళ్ల నమ్మకమైతే, ఆ లోవెలుతురుల వాళ్లు ఇంకో రెండు పెగ్గులు ఎక్కువ తాగుతరనేది అమ్మేటోళ్ల అనుభవం..

బారంటె మళ్ల వట్టి బారు కాదది, జనతా బారు.. “ఎవరుపడితె వాళ్ళు, ఏడపడితె ఆడ కూసోని.. తాగ బుద్ధైంది తాగుకుంటా, తిన బుద్ధైంది తినుకుంటా.. ఎక్కేటోనికి ఎక్కనిస్తూ,  కక్కేటోన్ని కక్కనిస్తూ… కోపమస్తె కొట్టుకుంటా, దుఃఖమస్తె చీదుకుంటా.. ఒర్రేటోన్ని ఒర్రనిస్తూ, బొర్రేటోన్ని బొర్రనిస్తూ..ఇట్లా.. ఒక మనిషిని మొత్తానికి మొత్తంగా నూటికి నూరుపాళ్లు వానికి నచ్చినట్టువాన్ని ఉండనిచ్చే గ‘మ్మత్తైన’చోటు..”

ఆ వాతావరణమంతా చల్లచల్లటి ఆల్కహాలు వాసనలు, వేడివేడి సిగరెట్ పొగలు.. గల గల గ్లాసులూ, కర కర ముక్కలూ.. డొక్కు డొక్కు బల్లలూ,  ముక్క ముక్క మనుషులూ..మత్తు మత్తు చూపులూ, ముద్ద ముద్ద మాటలు…

వీటన్నీటి మధ్యల.. తాగేటోల్లు తాగుతనే ఉన్నరు, వాగేటోల్లు వాగుతనే ఉన్నరు..

 

******

వెనక నుంచి ఆరో టేబుల్ మీద, చేతిల బీరు గ్లాసుతోని ఉన్న మనిషే కార్తిక్, ఎర్ర టీషర్ట్ తొడుక్కోని ఉన్నడు చూశిన్లా? అగో ఆయినే.. అతనికి ఎదురుంగ సిమెంట్ కలర్ టీషర్ట్ ఏస్కొని కూచున్నాయినె వినయ్.. అదే, ఆ గ్లాసులకు నిమ్మళంగ బీరువంపుతున్నడు చూడూ.. ఆ పిలగాడు.. ఇంతకుముందు లోపటికచ్చింది వీళ్లిద్దరే..

నువ్ బీర్ మస్తు పోస్తవ్రా భై,అస్సల్ నురుగు రాకుండ.. కార్తిక్ అన్నడు..

అరే.. నీకెక్కిందిరా…

అరే మామా..  నిజంగనేరా… నిజ్జంగ నిజం చెప్తానా, ఆ వెయిటర్ సుత నీ అంత పర్ఫెక్ట్ పొయ్యడెర్కేనా?

సాల్తియ్ గనీ ఈడికి ఆపేద్దామా, ఇంకో రెండు చెప్పాల్నా??

ఏంది అప్పుడేనా?? ఇయ్యాల నీన్ మస్త్ తాగుదామని ఫిక్స్ అయిన్రా భై… ఇప్పుడప్పుడే నువ్ చాల్ అనే మాటనకు..

సరే ఐతె ఇంకో రెండు చెప్తానమరి…

అరే… అంత ఏగిరం దేనికిరా? ఇదైతే ఒడ్వనియ్యరాదు. ఇప్పుడే చెప్తే మళ్ల చేదెక్కుతయ్.. బొచ్చెడ్ టైమున్నది, నువ్వైతె పుర్సత్ గ కూసోని  తాగు..

సరేపటు కానియ్…

ఇద్దరు గ్లాసుల్లేపి చెరి రెండుబుక్కలు తాగిన్లు.

ముంగటున్న చికెన్ పకోడి నోట్లేసుకుంటూ కార్తిక్ అన్నడు- అరేయ్.. మామా… నువ్వే చెప్రా… మా అయ్యదో చిన్న చికెన్ సెంటరూ.. మీ అయ్యదేమో సింగరేణిల బాయిపని.. అంతేనాకాదా?

ఔ.. అంతేగారా..

ఆ.. అని ఇంకో బుక్క తాగుకుంట.. “మీ అయ్య రోజుకు ఎన్మిది గంటలు పనిజేస్తె నెలకు యాభైవేలు జీతమస్తది.. మా అయ్య చీకటి తోని లేచింది మొదలు మళ్ల చీకటి వడేదాంక చికెన్ కొట్టుకుంట కూసున్నా నెలకు ఇరువై వేలు మిగుల్తె మస్తెక్కువ..  అంతేనా కాదా?”

గంతేగని..ఇప్పుడు వాళ్ల ముచ్చటెందుకు మతికచ్చిందిరా నీకు?

ఉట్టిగనేకనీ..ఇది చెప్పు.. మీకు సింగరేణోల్లు డబుల్ బెడ్రూం క్వాటరిచ్చిన్లు… మాది మాత్రం మూడు రూముల కిరాయి కొంప.. అంతేనా గాదా??

ఇప్పుడు అయన్నెందుకురా.. వేరే ఇంకేమన్న మాట్లాడరాదు..

అరే? మాట్లాడంగ మధ్యల రాకురా నువ్వు.. నేన్ చెప్పేది మొత్తమిను…

తాగితె కార్తిక్ ఎవరి మాట వినడని వినయ్ కి ఎరికే కాబట్టి సప్పుడు చెయ్యకుంట కూచున్నడు..

ఆ.. చెప్రా… మీకో రెండెకరాల జాగున్నది కదా ఊళ్ళె?

మ్మ్… పత్తి వెట్టిన్లట ఈ యేడు..

ఆ చేనుకు అందాదకు రేటెంతుంటదిరా?

ఎకురం పది చిల్లరుంటది కావచ్చురా… నిరుడు బోరేపిచ్చినం కదా, నీళ్ల సౌలతున్నది కావట్టిఈయేడు ఇంకో లక్ష పెరిగినట్టేఅనుకోవాలె!

ఇద్దరికీ ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగ మందు ఎక్కుతాంది.. మాటలు ముద్ద ముద్దగ వస్తున్నయి..

Kadha-Saranga-2-300x268

“రైట్.. రైట్… గంతే ఉంటదిగనీ..”

అని చికెన్ ముక్క నములుకుంట- మా అయ్య కూడ, ఇల్లు కట్టనీకి ఏన్నన్న ఓ రెండు గుంటల జాగా దొర్కుతె కొందామని చూశిండుకనీ, ముప్పై లక్షలకు తక్కువలేదు మామ మన కాడ..

ఔరా.. తెలంగాణచ్చినంకమనకెళ్లి రేట్లు మస్తు పెరిగినయ్.. ఐనాసుత ఏదైతె అదైంది ఏన్నో ఓకాడ కొనిపారెయ్యున్లిరా ఇప్పుడే, పోను పోను ఇంకింత పిరమైతయ్..

ఏంది కొని పారేశుడా??అయిపైసలాలేకుంటే పెంకాసులా?? గా పైసలే ఉంటే గియన్ని తిప్పలెందుకుపడ్దుము..మంచిగ ఈపాటికి ఇల్లే కడ్తుండేగారా! మా అయ్య కాడ ఓ పదిహేనిర్వై ఉన్నట్టున్నయ్గంతే.. వాస్తవానికిఅయిసుత చెల్లె పెండ్లికోసం పక్కకు పెట్టినయ్…

మ్మ్..

గ్లాసులు, సీసలు ఖాళీ అవుడుతోని వినయ్ వెయిటర్ ను పిలిచి ఇంకో రెండు బీర్లూ చెప్పిండు…

అరే.. నువ్వియాల ఫష్టు సాలరీ ఎత్తినవని సంబురంగ దావతిస్తాంటే, నేనిట్ల మాట్లాడ్తానా అని తప్పుగ అనుకోక్రా భైప్లీజ్..

నీయయ్యా, నేనెందుకట్లనుకుంటరా??  ఎవని ప్రాబ్లంస్ వానికుంటయ్…

యా… థ్యాంక్స్ రా మామా, నా బాధ నీకు సమజైంది… లవ్యూ రా మామా.. అంటుండoగ, వెయిటర్ ఇంకో రెండు తీస్కచ్చి ఇద్దరి గ్లాసులు నింపిపొయిండు.. ఇద్దరు మళ్ల చెరో బుక్క తాగినంక కార్తిక్-

మామా..మనిద్దరం సిక్స్త్  క్లాస్ కాంచి జబ్బకు జబ్బ దోస్తులం గారా??

మ్మ్…

“మ్మ్” కాదు..మంచిగ చెప్పు…

మ్మ్ అంటే ఔననేరాహౌలే..

అట్ల కాదుబే, నువ్ మంచిగ నోరు తెరిచి నోటితోని చెప్పాలె..

ఔ..ను.. మనం చెడ్డీలకాంచి జాన్ జిగిరీ జబ్బల్ జబ్బల దోస్తాం.. ఐతేందిరా ఇప్పుడూ..

విను విను…ఓకే…. మనిద్దరిది ఒకటే బడా కాదా??

యా.. ఇద్దరిది సేంటు సేం ఒకటే బడి.. ఒకటే క్లాసు.. ఒకటే బేంచూ..

చలో, మరి ఇంటర్, డిగ్రీ??

అన్ని సేం సేమే బే..ఒక్కదాన్నే ఎన్ని సార్లడుగుతవ్రా?

వాళ్ల కండ్లల్ల మత్తు ఇప్పుడు స్పష్టంగా కనిపడ్తాంది.. మాటల్లో ముద్దతనం ఉండనే ఉన్నది..

అరే.. మొత్తం ఇన్రా…మరి మనిద్దరిల సదువుల ఎవడ్రా టాపరు??

నువ్వే మామా.. మన చిన్నప్పటికాంచి మొత్తం అన్నీట్ల నువ్వేగారా టాపరువు..

ఆ.. మళ్ల పీజీ ఎంట్రన్స్ ల నా ర్యాంకెంత మతికున్నదారా నీకు??

ఎందుకు మతికిలేద్రా.. నీది డెబ్బై ఎన్మిది, నాది రెండొందల నాలుగు..

కదా?? అంత మంచి ర్యాంకచ్చిసుత నాకెన్ల సీటచ్చింది, నీకెన్ల సీటచ్చిందిరా??

నాది ఓయూ క్యాంపస్.. నీది అదేదో ప్రైవేట్ కాలేజ్ మామా నాకు దాని పే..రూ.. అదేదో సెయింట్ లూనిజో..లూయిసో.. లారిసో…ఏందో ఉండెగారా? మతికస్తలేదు!!

పోనియ్ అదిడ్శిపెట్టుగనీ.. అంత నప్పతట్ల కాలేజిల సదివిసుత నేన్ పీజిల యూనివర్సిటీ గోల్డ్ మెడల్ కొట్టిన్నాలేదా?

అరే మామా నేన్ ఆల్రడీ మస్తుసార్ల చెప్పినా, మళ్ళిప్పుడు చెప్తున్నా..ఎప్పుడన్నగానీ, ఏడనన్నగానీసదువుల నిన్నుకొట్టినోడేలేడ్రా భై.. నువ్ తోపురా నిజంగా..

“కదా??కనిఇయ్యాల నేన్రోడ్డుమీద బేవార్సూ, నువ్వు మాత్రంసెంట్రల్ ఎక్సైస్ డిపార్టుమెంటుల ఇన్స్పెక్టరూ…”

“దాంట్లె ఏముందిరా.. ఐపేంది ఇడ్శిపెట్టి, నెక్స్ట్ ఇయర్ ఇంకింత సీరియస్ గ సదువురా భై, వట్టిగనే పోస్టు కొడ్తవ్ నువ్వు.. నీ ట్యాలెంటుకు అసలది విషయమే కాదు..”

అచ్చా??? నీ ఏజ్ ఎంతరా ఇప్పుడు?

ముప్పై? ఐతే??

మరి నాకెంతరా?

మనిద్దరి ఏజ్ సేమేగాబే.. నాక్ ముప్పై ఐతె నీకు ముప్పయే…

కదా?? మరి ముడ్డికింద ముప్పయ్యేండ్లున్నా నన్ను ఎక్సాం రాయనిచ్చుటానికి వాడేమన్న నా బామ్మర్దా??

అర్రెర్రే..!! కరెక్టే మామా, సారీరా….నాకా ముచ్చటే యాదికిలేదు..

ఎందుకుంటదిరా? మీకు రిజర్వేషన్ ఉన్నది, ఈసారి కాకపోతె ఇంకోసారి.. రాకుంటె మళ్ళోసారి… ఇంక ఐదారేండ్లుకాదు, నువ్ ముసలోనివయ్యేదాంక రాసుకోవచ్చు..ఫీజు కట్టేదున్నదా, చదివి కొట్టేదున్నదా?? ఉట్టిగ క్వాలిఫై ఐతె జాబు… ఇంకనా గురించెందుకు యాదికెందుకుంటదిరా..! అస్సల్ ఉండది..

అరే.. అట్లంటవేందిరా.. నేనేమన్న కావాల్నని అన్ననా? లైట్ తీస్కోరా భై.. అని చివరి చికెన్ ముక్క నోట్లెవెట్టుకున్నడు వినయ్..

“ఏంది లైట్ తీస్కోవాల్నా?ఎందుకు తీస్కోవాల్రా లైటు? ఆ?? చెప్పు ఎందుకు తీస్కోవాలె??  మొన్నటి ఆ ఎక్సాం ల   నాకు టూ ఫార్టీ ఔటాఫ్ థ్రీ హండ్రెడ్ వస్తే నీకెన్నచ్చినయ్రా? ఆ?? చెప్పు ఎన్నచ్చినయ్?? టూ నాట్ సెవన్… ఔనా కాదా?? రెండొందల ఏడచ్చిన నిన్నేమో పిలిచిమరీ ఉద్యోగమిచ్చిన్లు, నీకంటె ముప్పై మూడు మార్కులెక్కువచ్చిన నన్ను మాత్రం పిలిచినోడులేడు, అడిగినోడులేడు.. ఇయ్యాల నువ్ నెలకు నలభై వేలు సంపాయిస్తుంటె, నేన్ మాత్రం బేవార్స్ గానిలెక్క రోడ్లువట్టుకోని తిర్గవడ్తి.. ఎందుక్ తీస్కోవాల్రా లైటూ?? ఛత్..” అని ఎత్తిన గ్లాసు దించకుండ గటగట గ్లాసుడు బీరును ఒక్కబుక్కల తాగి.. ఇంకో రెండు బీర్లకూ, చికెన్ లెగ్ పీసులకూఆర్డరిచ్చిండు కార్తిక్..

వినయ్ ఏం మాట్లాడకుంట తన బీరు లాస్ట్ సిప్పు తాగుతున్నడు..

పోని మళ్లోసారి రాద్దామంటె కూడ “మాకు” ఏజ్ లిమిట్ అని కాలవడే.. ఛత్.. నీ… రిజర్వేషన్లకున్న పారేత్తు..  అసలీ రిజర్వేషన్లను #@Y%*#%………

ఛీ..నాకు జాబ్ అస్తె నువ్ మంచిగ ఖుషీగ ఫీల్ ఐతవ్ అనుకున్నగని గిట్ల మాట్లాడ్తవ్ అనుకోలేర భై.. ఛీఛీ.. నేన్ పోతున్నా.. అనుకుంట వినయ్ లేవబోయిండు..

కార్తిక్ అతన్ని ఆపి కూచోబెడుతూ- అరే ఆగుబే.. నేన్ చెప్పేది మొత్తం ఇను.. దా కూసో..అన్నీటికి ఫీల్ ఐతవేందిరా నువ్వు…! అసల్ నీ మీద నాకు కోపమెందుకుంటది చెప్పురా?మనిద్దరం చెడ్డీల కాంచి దోస్తులం, నీకు జాబ్ అచ్చినందుకు దునియల ఫష్ట్ ఖుషీ అయింది ఎవడన్న ఉన్నడా అంటె అది నీనే మామా.. నిజ్జంగ చెప్తున్నా.. నీక్ జాబ్ అచ్చినందుకు నేన్ పిచ్చ ఖుష్ రా.. నాకేం నీమీద జెలస్ లేద్రా భై..

మరి ఇంతక్ ముందు మాట్లాడిందంత ఏందిరా?? ఖుషీ అయినోడు అట్ల మాట్లాడ్తడా??

అరేయ్.. మామా.. నా బాధ నీకు సమజ్ కాలేరా…

ఇంతలనే వెయిటర్ బీర్లూ, లెగ్ పీసులు తెచ్చి టేబుల్ మీద పెట్టి పొయిండు..

MIRACLE1వీళ్లు,ఎవరి బీరు వాళ్లు నోటితోని తెరుచుకున్నరు కని గ్లాసుల్ల పోశింది మాత్రం కార్తికే.. అందుకే మీద కొద్దికొద్దిగ నురుగు కనపడ్తాంది..ఇద్దరు మళ్ల చెరొక బుక్కతాగినంక, వినయ్ కు లెగ్ పీస్ అందిచ్చుకుంట కార్తిక్- “అరేయ్.. మామా.. నేనెందుకు రంది వడ్తున్ననో నీక్ సమజ్ కాలేరా.. నా పొజిషన్ల ఉంటె తెలుస్తదిరా ఆ బాధేంటిదో… అంత కష్టపడిచదివీ, మంచి మార్కులు కొట్టినాసుతా జాబ్ రాకపాయే! పోనీ మళ్ల రాసి చూద్దామంటె ఏజు లేదాయే… మనం సదివిన తొక్కల ఎమ్మెస్సీకి ప్రైవేట్ ల టీచర్ జాబ్ తప్ప ఇంకో జాబేముంటరా?? వాడిచ్చే మూడు నాలుగు వేలకు అటా జాబు చెయ్యలేనూ, ఇటు గవర్నమెంటు జాబు కొడ్తామంటె అదేమో ఒకమానంగ వచ్చి కాలవడదు..  నీక్ తెల్వద్రా భై నా పొజిషన్..  నీకు సమజవుడు కూడ కష్టమే..  అరే,నీ గుండె మీద చెయ్యేస్కోని చెప్పు,నేనా జాబ్ కోసం ఎంత కష్టపడ్డనోనీకెర్కలేదారా??

నిజమేరాకష్టపడ్డవ్..నేన్గిన కాదన్ననా?కని దానికి నేనేo చేస్త చెప్పు? నాకు రిజర్వేషన్ ఉన్నది కాబట్టి లక్కుల జాబచ్చిందీ.. నీకు లేదు కాబట్టి రాలేదు.. దానికి ఎవలేం చేస్తర్రా?? కిస్మత్.. గంతే…

కిస్మతేందిరా కిస్మతు? కష్టపడ్డోనికి నౌకరియ్యాలెగని కిస్మతున్నోనికి ఇచ్చుడేందిరా? మళ్ళ నిన్ను అంటున్నా అనుకునేవ్రో!! నేన్ మన సిస్టం ను తప్పు వడ్తున్నా..

ఎమ్మోరా భై.. నాకు జాబస్తె  నువ్ గింత ఘోరంగ రియాక్ట్ అయితవని నేనైతె ఎన్నడు అనుకోలే…

అగో మళ్లగదే మాట? నేన్ నిన్నంటలేను మామా.. ఈ మొత్తం సిస్టమ్ను అంటానా.. నన్ను బకరాగాన్ని చేసి బలి పశువును జేస్తె నాక్ కోపం రావొద్దా చెప్పు??  అసల్ దునియా మొత్తమ్మీద ఏన్నన్న ఉన్నదారా ఇట్ల? సదివినోడు సంక నాకి పోవాల్నట, సదువురానోడు మాత్రం సర్కార్ నౌకర్లు చెయ్యాల్నట! నీ య్.. ఇదేం లెక్కరా భై?? అని గ్లాసులేపి రెండు బుక్కల్లో మొత్తం బీరు తాగి, ఇంకింత ఆవేశంగ మాట్లాడుతున్నడు కార్తిక్..

పొద్దున లేశిందిగుత్తా రాజ్యాంగం రాజ్యాంగం అని గొంతులు చింపుకుంటరు కని, అన్ల “అందరు సమానం” అని రాశున్న మాటను ఒక్కడు పట్టించుకోడేందిరా భైనాకర్థంగాదు? “మాకు” సమాధులు తొవ్వుకుంట, మీకు కోటలు కట్టిచ్చుడేనారా సమానమంటే?ఇదేక్కడి సామ్యవాదం, సౌభ్రాతృత్వం భై నాక్ తెల్వక అడుగుతా..?చత్..మీకు మాకంటె ఎక్కువ ఆస్థులున్నయ్, మీ అయ్యకు సర్కార్ నౌకరున్నది, క్వార్టర్స్ ఉన్నయ్, ఇన్సురెన్సులూ, అలవెన్సులూ, సబ్సిడీలూ, హెల్తుకార్డులూ, పెన్షన్లు తొక్కా తొండం సవాలక్షున్నయ్.. అయినా నీకు రిజర్వేషన్ ఉంటది, నువ్వెన్నిసార్లైనా పరిక్ష రాయచ్చూ, తక్కువ మార్కులచ్చినా జాబ్ కొట్టచ్చూ.. మాకో గజం జాగ లేదు, అయ్యకు పర్మినెంటు నౌకరిలేదు, రోగమచ్చినా రొప్పచ్చినామంచి దావఖానకుపోను దిక్కులేదు, అసల్ బతుక్కే భరోసా లేదుర భై.. అసొంటిది మాకు రిజర్వేషన్ ఉండదు,  టాప్ మార్కులచ్చినా జాబురాదూ,పోనీమళ్లోసారి రాద్దామంటె ఏజు చాన్సుండదు!ఏం న్యాయమ్రా భై ఇదీ??  మస్తు బాధైతున్నది మామా నాకు…  అరేయ్.. మళ్ల చెప్తున్నా నేన్ నిన్నంటలేను భై, మన సిస్టం ను అంటున్నా.. సిస్టం మొత్తం ఖరాబైపేందిరా ఏడికాడికి..

వినయ్ఏం మాట్లాడకుంట, చేతిలో ఉన్న చికెన్ బొక్కను ఖాళీ గ్లాసుకు కొట్టుకుంటూ కార్తిక్ చెప్పేది వింటున్నడంతే..

ఇంకో బుక్కెడు బీరు తాగినంక కార్తిక్ గొంతు ఇంకోరకంగ మారింది.. “అసల్ నన్నడుగుతె ఆ రాజ్యాంగంల రిజర్వేషన్ ఆర్టికిల్సు మొత్తం మలిపేశి, మళ్ల కొత్తగ రాపియ్యాల్రా భై… ఒకనికి రిజర్వేషన్ మీద మంచి సర్కార్ జాబ్ అస్తె ఇంక వానికి పుట్టేటోళ్లకు రిజర్వేషన్ ఇయ్యద్దు మళ్ల… కొత్తగ మంచిగ,ఈసారి కరెక్టుగమళ్లఅందరికి కొత్త “ఇన్ కం సర్టిఫికెట్” లు ఇప్పిచ్చి ఎవడైతె న్యాయంగ గరీబోడుంటడో వాడే కులపోడైనా సరే వానికి రిజర్వేషన్ పెట్టాలె.. బలిశినోడుంటె వాడే కులపోడైనాసరే రిజర్వేషన్ పీకిపారెయ్యాలె…”ఇంక ఇసొంటియే మంచి మంచి పాయింట్లుఆలోచించి అన్ల కలపాలెఅంతేగనివాళ్ళేందిరా భై, గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు ఆడఏమున్నదో ఏంలేదో చూడకుంట, ముందు వెనక ఏం ఆలోచించకుంట పదేండ్లకోసారి పొడిగించుకుంట పోతనే ఉన్నరు! ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కలిపి ఇప్పటికే నలభై తొమ్మిదిన్నర శాతం రిజర్వేషన్లున్నయ్.. అంటె దాదాపు సగం.. పోనీ మిగిలిన యాభైల ఏమన్న కాంపిటిషన్ తక్కువుంటదా అంటె అన్ల మళ్ల వీళ్లందరితోని పోటీయేనాయే! అరేయ్ నువ్వే చెప్పురా అప్పుడు రాజ్యాంగం రాశిన కాలం నాటికీ, ఇయ్యాల్టికీ మీ బతుకుల్లో కొద్దిగసుత మార్పు రాలేదారా?? మొత్తం కాకపోయిన ఎంతోకొంత, ఓ చారాన మందమన్న మీ పరిస్తితి మంచిగ్గాలేదా చెప్పు?? నీ గుండె మీద చెయ్యేస్కోని చెప్పు మామా…

ఆ? ఐతే??

ఐతే ఏందిరా..  సిచువేషన్ ఓ చారాన మందం మంచిగైందీ అన్నపుడు రిజర్వేషన్లల్ల ఓ చారన మందం కట్ చెయ్యాల్నా వద్దా? చెప్పు నువ్వే.. యేడాదికొక్క శాతం తీసుకుంటపేనా, మొత్తం తీసెయ్యడానికి యాభైయ్యేండ్లు పడ్తదిగారా భై??  ఒకటేసారి మొత్తం తీశేత్తా అంటె అలవాటుపడ్డ పానం ఊకుంటదా? లొల్లి లొల్లి చెయ్యరారా.. అందుకే ఇప్పటికెళ్లే యేడాదికొక్క పర్సెంటన్న కోసుకుంట పోతె, ఇంకో యాభై యేండ్లవరకన్న సిచువేషన్ జర సెట్ ఐతది.. అంతేగని ఆ పని చెయ్యకుంట ఓట్లకోసం ఎవనికి వాడు యేటికేటికి దొరికినంత పెంచుకుంట పోతున్నరుతప్ప, నా అసొంటోళ్ల బతుకు నాశనమైపోతాందని అసల్ ఒక్కడన్న ఆలోచిస్తున్నడార భై? చత్..నా రందంత అదే మామా…

అని చెప్తున్నంతల..కార్తిక్ సెల్ రింగ్ అయింది..మాటలాపి తను కాల్ లిఫ్ట్ చేసిండు..అవతలి వైపు మాట్లాడుతున్నది కార్తిక్ వాళ్ల చెల్లె కీర్తి.

ఆ హలో.. కిట్టూ?? చెప్పురా..

ఆ అన్నా. ఎక్కడున్నావ్??

నేను వినయ్ గానితోని బయటికచ్చిన్రా.. నాకు లేటయితదిగని మీరు తిని పడుకోన్లి..

సరేగనీ.. ఆ మంచిరాల సంబంధమోళ్లు సాయింత్రం నానకు ఫోన్ చేసి,ఫోటోస్ నీ మెయిల్ కి పంపినమని చెప్పిన్లట.. వచ్చినయా అని అడుగమంటున్నడు నాన..

ఔనా?? ఎమ్మోనే మరి నేన్ సూళ్లేదు… నా ఫోన్ల నెట్ బ్యాలెన్స్ అయిపేందిగనిరాంగ రాంగ ఏయించుకోనస్తా, రేప్పొద్దున చూద్దాంతీ.. నానకు చెప్పు..

మర్శిపోకు మరి..

నాక్ మా మతికుంటదిగని, నువ్వైతెఆ తాళం చెయ్యి పూలకుండీ కింద పెట్టుడు మర్శిపోకు..

ఓకే.. ఓకే..

ఓకే అనుడుగాదు.. పేనసారి ఇట్లనేఅని నువ్ మర్శిపొయిపంటె, నేన్ గేటు దూకంగనే నాన లేశిండు.. అందుకె మళ్ల మళ్ల చెప్తున్నా, గేటుకు తాళమేశినంక తాళం చెయ్యి మంచిగ చెయ్యికి అందేటట్టుఆపూలకుండీకింద పెట్టు.. సరేనా??

అబా సరేఅన్నా.. పెడ్తా అంటున్నకదా!నువ్వైతె నెట్ బ్యాలెన్స్ వేయించుకోనిరా.. అని కాల్ కట్ చేసిందామె..

కార్తిక్ ఫోన్ పక్కవెట్టి మళ్ల గ్లాస్ పట్టుకున్నడు..

ఏందటరా? జల్ది రమ్మంటున్నదా?? వినయ్ అడిగిండు..

రమ్మనుడు కాద్రా.. అదేదో సంబంధం గురించి… వాళ్లు పిలగాని ఫోటోల్ నా మెయిల్ కు పంపిన్లట, వచ్చినయా అని అడగటానికి చేసింది…

అచ్చా.. ఓకే ఓకే…

మాదాన్ల ఆడపిల్లలున్నోళ్లకు కష్టమ్రా భై నిజంగ… ప్రైవేట్ నౌకర్ చేసేటోనిక్కుడ కం సే కం ఇర్వై లక్షలియ్యలె.. ఇగ గవర్నమెంటోడంటె యాభైకి తక్కువడగడు, మళ్ళ బండీ, బట్టలూ, బోళ్లూ.. బొచ్చెడుంటయ్రా అయ్యా!! ఇయన్నివోను మళ్ళ పెండ్లిఫంక్షను ఖర్చు అలగ్.. పెద్ద పరేషాన్ పట్టుకున్నదిరా మాకైతె! ఆ జాగను అమ్మైనా సరేగని, మంచి సంబంధం దొర్కుతె చేశేద్దామనుకుంటున్నమ్రా ఈ యేడు..

అచ్చాచ్చా.. ఓకే ఓకే… అనుకుంటనే వినయ్ గ్లాస్ బీరును ఒక్క బుక్కలో తాగి, మిగిలిన చికెన్ బొక్కను కంకుకుంట అన్నడు-

అరే.. మామా..  నేన్ ఒకటడుగుత చెప్రా..

ఏందిరా?

ఇట్లంటున్నా అని నువ్వేం అనుకోవద్దు మరి?

అనుకోనుచెప్పుబే..

మామా.. మా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ కంటె జర రిచ్చేగారా??

జరంతేందిబే?? జమీన్ ఆస్మాన్ ఫరఖ్….         ఇంకో బీర్ చెప్పాల్నారా?

నాకిప్పటికే ఎక్కువైoది..నీగ్గావాల్నంటె చెప్పుకో..

నాక్కూడ మస్తైందిగని, ఇంకొక్కటి చెప్తావన్ బై టూ తాగిపోదాం ఓకేనా?

సరే చెప్పు…

వెయిటర్ ని పిలిచి ఇంకో బీర్ ఆర్డర్ ఇచ్చిండు కార్తిక్…

అయిపేందా?? ఇoగ నేనడిగిందానికి చెప్పు.. నా నౌకరి మంచిదేనా కాదా?

అరే మంచిందేందిరా? కిరాక్ నౌకర్ర భై నీది.. సెంట్రల్ ఎక్సైస్ ఇన్స్పెక్టర్ అంటేందిరా?? ఫుల్లు పైసల్.. స్టాటింగ్ స్టాటింగే నలభైవేల్ జీతం, ఏ వన్  క్వాటర్సూ, అలవెన్సులు, ఇన్సురెన్సులు…  కథా కార్ఖానా…. సెంట్రల్ గౌట్ జాబంటె మాటలార? లొల్లంటె లొల్లి నౌకర్రా భై నీది..

అదే అదే… సరేమరి నేను చూపుకు ఎట్లుంటర? ఐ మీన్ మంచిగ అందంగ ఉంటనా అని?

ఔ నీ హైట్ ఎంతో ఉండేరా? సిక్సా, సిక్స్ వన్నా?

సిక్స్ వన్..

ఆ..! సిక్స్ వన్ హైటున్నోడు అసల్ మన కాలేజిలనే ఎవ్వడులేకుండెగారా? డిగ్రీల మన క్లాసోల్లందరు గా సుమలత ఎంబడివడ్తుంటె, ఆమె మాత్రం నీకు ప్రపోస్ చేశేగార అప్పట్ల? వట్టిగ ఇడ్శిపెట్టుకున్నవ్గని ఆమెను చేస్కుంటే మస్తుంటుండె భై ఇప్పుడు..

లైట్ గనీ.. అంటె మొత్తానికి నేన్ మంచిగనే ఉంటా అంటవ్!

నీకేందిరా భై… పిచ్చ స్మార్ట్ నువ్..

కదా?? ఐతె.. మీ చెల్లెను నాకిచ్చి పెండ్లి చేస్తరా మామా? నాకు కీర్తి అంటె మస్తిష్టం..

కార్తిక్ కి ఒక్క క్షణం వినయ్ ఏమంటున్నడో సమజ్ కాలేదు..

నాకు నయా పైసా కట్నం వద్దు మామా, మీ చెల్లెను నాకిచ్చి పెండ్లి చేస్తే చాలు, మొత్తం పెళ్లి ఖర్చులుకూడ మేమే పెట్టుకుంటం..

అరేయ్?? ఏం మాట్లాడ్తున్నవ్ బే?? దిమాగ్గిన ఖరాబైందా??

లేద్ నిజంగనే అంటున్నరా, నాకు మీ చెల్లంటె నిజంగ మస్తిష్టం మామా.. దునియాల ఏ మొగడు చూస్కోనంత మంచిగ చూస్కుంటరా మీ చెల్లెను, ప్లీస్.. అని వినయ్ మాట పూర్తికాక ముందే.. కార్తిక్-

అరేయ్.. అసల్ ఏం మాట్లాడుతున్నవ్ సమజైతుందారానీకు?? మందెక్కువై మెదడు ఖరాబైనట్టున్నది.. చల్.. మస్త్ ఎక్కువైంది ఇంక పోదాం పా..

ఏ.. ఆగురా.. కూసో కూసో… మొత్తం ఇనుబే.. ప్లీస్… అని కార్తిక్ ను బలవంతంగ మళ్ల కూచోబెట్టి- అట్లంటవేందిరా?నాకేం తక్కువ చెప్పు.. మంచి నౌకరున్నదీ.. ఆస్థి పాస్థులున్నయీ… మంచిగ అందంగుంటా.. నాకేం తక్కువరా భై?  పైకెళ్లి నాకు నయా పైసా కట్నం కూడ వద్దంటున్నగారా?? ఇంకేం గావాల్రా మీకు?? మీ చెల్లెను కూడ మంచిగ చూస్కుంటా అని చెప్తున్న గదామామా.. ప్లీస్ రా..

తలకాయ్ తిరుగుతాందారా?? వద్దన్నకొద్ది మళ్ళ అదే మాట మాట్లాడుతున్నవ్.. నువ్వస్తెరా లేకుంటెలేదు నేన్ పోతున్నా.. అని లేవబోతుంటె వినయ్ మళ్ల అతన్ని కూచోబెట్టి-

అరేయ్.. నేనేం తాగి మాట్లాడ్తలేను.. నిజంగ సీరియస్ గనే అంటున్న.. నాకు మీ చెల్లెలంటె చాన ఇష్టమ్రా, నాకు జాబ్ వచ్చేదాక అడగొద్దనే ఇన్ని రోజులు అడగలేదు బట్ ఇయ్యాల జాబ్ వచ్చిందికాబట్టే ధైర్యంగ అడుగుతున్నరా… ప్లీస్ మామ మస్తు మంచిగ చూస్కుంటర, వేరే సంబంధాలు చూడకండీ.. నేన్ చేస్కుంటరా మీ చెల్లెను..

అరేయ్.. లాష్ట్ అండ్ ఫైనల్ చెప్తానా..ఇంక ఈ టాపిక్ ఇక్కడికి ఇడ్శిపెట్టు…కార్తిక్ బలవంతoగ కోపాన్ని ఆపుకుంట అన్నడు..

నేన్ మంచోన్ని కాదారా?చిన్నప్పట్నుంచినన్ను చూస్తనేఉన్నవ్ గారా.. నలుగురికి మంచే చేస్తగని ఎప్పుడన్న ఎవనికన్న చెడుపు చేషిన్నారా నేను? నాగురించి ఎర్క లేదారా నీకు?

నువ్ మంచోనివిగావట్టే ఇంతసేప్ నీతోని మాట్లాడ్తున్నా అదే ఇంకోడింకోడైతె ఈపాటికి వాని గూబ గుయ్యిమంటుండే..

అరేయ్.. ప్లీస్.. అర్తంచేస్కోరా భై..

నువ్ మంచోనివని నాకెర్కే కని అయన్ని కాని ముచ్చట్లు.. వట్టిగ నువ్ డిస్టర్బ్ గాకు నన్ను డిస్టర్బ్ చెయ్యకు..ఇప్పటికే మస్తైంది, ఇంక ఆపు..

అరేయ్ మంచోన్నే ఐతె మరి ఒప్పుకోడానికేందిరా?నువ్వుకూడా నన్ను అర్థం చేస్కోపోతె ఎట్లరా..

వెయిటర్ బీర్ తెచ్చి రెండు గ్లాసుల్లో చెరి సగం పోశి వెళ్ళిపోయిండుగని వాళ్లిద్దరు ఆ గ్లాసుల్ని ముట్టలే..

MIRACLE1

ఒక నిమిషం గట్టిగ ఊపిరి తీస్కోని కార్తికే ఓపిగ్గ చెప్పుడు వెట్టిండు- అరేవినయ్..  నువ్ మంచోనివే.. నీకు మంచి ఉద్యోగం, ఆస్థిపాస్తులు.. మొత్తం అన్ని ఉన్నయ్.. పైకెళ్ళి  మీ ఇంట్లోల్లు కూడ కట్నానికి ఆశపడే మనుషులు కాదు.. ఆ ముచ్చట కూడ నాకెర్కే..  ఇంక సాఫ్ సీదా చెప్పల్నంటే, మేం సొంతంగ వెతికినాసుత ఇంతమంచి సంబంధం మా చెల్లెకు దొర్కదు గావచ్చు… కనీ… కని మా చెల్లెను నీకిచ్చి చేశుడన్నది  కాని ముచ్చట… అర్థం చేస్కో.. సరేనా?? అంతే ఇంక.. ఈ టాపిక్ ఇక్కడికి విడిచిపెట్టు.. ఆయింత తాగు.. పోదాం..

అరేయ్.. అన్నితీర్ల మంచి సంబంధం అని నువ్వే అంటున్నవ్గారా?? మరి ఒప్పుకోడానికేంది చెప్పు? ముందుగాల నీకిష్టమా కాదా చెప్పు? నీకు ఓకే అంటే అటేంక మీ ఇంట్లోళ్లను మనిద్దరం కలిశి ఒప్పియ్యొచ్చు..

అద్దన్న పాటే ఊకె పాడక్రా.. నేనూ, మా చెల్లె ఇద్దరం ఒప్పుకున్నా మా అమ్మనానలుఒప్పుకోరు.. ప్లీజ్… దయచేసి ఇంకా ముచ్చట విడిశిపెట్ర భై..

అట్లకాదు నువ్ చెప్పు.. నీకిష్టమేనా?

కార్తిక్ నిశ్శబ్దంగ తన గ్లాస్ ను చేతులకు తీసుకోని మెల్ల మెల్లగ తాగుతున్నడే తప్పితే ఓ రెండు నిమిషాలు అసలేం మాట్లాడలే.. సగం గ్లాసు ఖాళీ అయినంక-

నాకిష్టమే రా.. ఇప్పుడే చెప్పినకదా మా అంతట మేం సొంతంగ వెతికినా కూడ నీ అంత మంచోన్ని మా చెల్లెకు తేలమని.. ఆ మాట వాస్తవం..ఎందుకంటె నిజంగ నా లైఫ్ ల నీ అంత పాజిటివ్ ఆటిట్యూడ్ ఉన్నోన్ని  నేనిప్పటిదాంక చూల్లే…

ఎవడో ముక్కు మొఖం తెల్వనోనికి మా చెల్లెనిచ్చి పెండ్లి చేశుడుకంటే, చిన్నప్పటికెళ్ళి మాతోనే కలిశిపెరిగినోనివి, అన్నితీర్ల మంచోనివీ.. నీకిచ్చి చేస్తెనే మా చెల్లె మంచిగుంటదని నాక్కూడ అనిపిస్తుందిరా.. కని…

వినయ్ మొఖంలో చిన్న వెలుగు..

కని? కని ఏంది చెప్పురా..

అరేయ్.. నేన్ ఫ్రాంక్ గ ఒకటిచెప్తరా.. నువ్ ఫీల్ ఐతె మాత్రంనేన్ చేశేదేం లేదుముందే చెప్తున్న..

నేనేం ఫీల్ గానుచెప్పురా..

మా నానమ్మ ఎర్కేగదా.. చిన్నప్పుడు నువ్ మా ఇంటికచ్చినప్పుడు ఆమేం చేశేదో నీకెరికేనా??

ఎమ్మోరా?ఏం చేశేది?..

మంచి నీళ్లిచ్చినా, చాయ్ ఇచ్చినానీకు సెపరేట్ గఓ బుగ్గెండి గ్లాసుల పోశిస్తుండే మతికున్నదా..

ఆ.. ఆ.. కరెక్టే రా.. ఎప్పుడన్నెప్పుడన్న మీ అమ్మ స్టీల్ గ్లాసుల పోశిచ్చినాసుత తిడ్తుంటే..

ఆ.. అదే.. మా నానమ్మ ఒక్క నీకనే కాదు… మా ఇంటికి “తక్కువోళ్ళు” ఎవ్వరచ్చినా ఆ బుగ్గెండి గ్లాసులనే పోశిస్తది.. ఇంక మేం చిన్నప్పుడు లొల్లి వెట్టుకునేది కాబట్టి ఆయింత నిన్నొక్కన్ని ఇంట్లకు రానిచ్చేదిగని వేరేటోల్లైతెఅసల్ ఇంటి గలమ లోపటికి రానియ్యకపొయ్యేది..

అంటే??

అంటేందిరాఅంటే?? మాకన్న “తక్కువోళ్లను” అసల్ మా ఇంటి గడుపకూడ దాటనియ్యకపొయ్యేది అంటున్న.. నువ్వచ్చి పొయినంక కూడ మా నానమ్మ నువ్ కూసున్న జాగల నీళ్లుపోశి కడిగేది ఎర్కేనా?? అగో అంత ఉంటది వాళ్లకు “ఎక్కువ తక్కువా” అని..

కావచ్చురా, కని ఇప్పుడు మీ నానమ్మ లేదుకదా…. మరింకేంది ప్రాబ్లం?

మొత్తం విన్రా.. మా అమ్మా నానాలు, మా నానమ్మంత ఘోరంగ నీతోని ఎప్పుడు ప్రవర్తించకపోవచ్చు… వాళ్లు నిన్నెప్పుడు తక్కువ చేసి చూడకుండ మాతోని సమానంగనే నిన్నుకూడ కలుపుకపోవచ్చూ.. కని అంత మాత్రాన ఇప్పుడు నువ్ మా చెల్లెను చేస్కుంటా అనంగనే వాళ్లు ఒప్పుకుంటరు అనుకోకు..

మా పెద్దనానోళ్ల కొడుకు రఘన్న కూడా చిన్నప్పటినుంచి మా ఇంట్లనే పెరిగిండు నీకెర్కే కదా?? ఆయినె ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేస్కున్నందుకే మా నాన ఇప్పటికి మూడేండ్ల నుండి ఆయినెతోని మాట బంజేషిండు.. ఇంటిగ్గాదుకదా దుకాణం కాడికిసుత రానిస్తలేడు..అసొంటోడు సొంత బిడ్డను నీకిచ్చి పెడ్లి చెయ్యమంటె చేస్తడా చెప్పూ?? అందుకే చెప్తాన, అయన్ని కాని ముచ్చట్లురా భై.. వుట్టిగ కలల్ కనకు..

కదా?? మరి మాకు రిజర్వేషన్ ఉండుట్ల తప్పేమున్నదిరా??

ఏందిరా?? పిస్స గిన లేశిందా? అసల్ నేన్ చెప్పిందానికీ, నువ్వనేదానికీ ఏమన్న సంబంధం ఉన్నదా??

ఉన్నది.. ఉన్నది కాబట్టే అంటున్న..

ఒక్క అరగంట ముంగట నువ్వేం మాట్లాడినవో నీకు మతికున్నదా? మాకన్నున్నయ్ అయినా రిజర్వేషన్ దేనికీ అదీ ఇదని అడిగినవ్ కదా?? అగో,దానికి జవాబు చానా స్పష్టంగా సూటిగ నీ నోటితోనినువ్వే చెప్పినవ్ చూడు..

కార్తిక్కి విషయం మెల్లమెల్లగ అర్తమైతుంది..

నీకు తెల్సింది మీ నాన్నమ్మ ఒక్కలే.. కని అసొంటి నానమ్మల అనుభవాలు నాకు కోకొల్లలు.. ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందల యేండ్లకెళ్లి ఆ “తక్కువ”నూ, వాళ్లు చూసే “చిన్న”చూపును భరించుకుంటస్తున్నమ్రా మేమూ.. నీకు తెల్సింది రెండు గిలాసల పద్దతొక్కటే.. కాని మేం పడ్డ అవమానాలు కొన్ని వందల రకాలు..ఇంతకన్నా వేల రెట్లకుట్రలను, వివక్షలను ఎదుర్కోని ఎదుర్కోని ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగ మనుషుల్లెక గుర్తించబడ్తున్నంరా మేము..

అంటే? మా తాత ముత్తాతలు చేసిన తప్పులకు ఇప్పుడు మేం శిక్ష అనుభవించాల్నారా?

మీ మూడు తరాల చూపుల్లో తేడాను ఇప్పుడు నువ్వే చెప్పినవ్ గారా?మీ నానమ్మ కాలంలో మేం మీకంటె “తక్కువ” వాళ్లం.. మీ నానతరంలో మేం కేవలం మీకుమనుషులుగా “సమాంతరం” అంతేకనీ మీలో కలవడానికి వీలులేదు.. కని ఇప్పుడు మనదగ్గరికొచ్చేసరికి మనిద్దరం సమానం..అదేరాభై రిజర్వేషన్ లు మా బతుకుల్లో తెచ్చిన తేడా…అవే లేకపొయ్యుంటే?? ఊహించుడు కూడ కష్టంమామా..!!అది శిక్ష అని నువ్వనుకుంటున్నవ్.. కని అది మాకు రక్ష అని మేం అనుకుంటున్నం…ఇది నీకు సమజయ్యేటట్టు చెప్పాల్ననే మీ చెల్లెను పెండ్లి చేస్కుంటా అని మజాక్ చేసిన్రా.. తప్పుగ అనుకోక్రా భై.. సారీ మామా..

కార్తిక్ కి అసల్ ఏం మాట్లాడాల్నో తెలుస్తలేదు… అంత “క్లియ్యర్ ఈక్వేషన్” విన్నంకఇంకేం మాట్లాడ్తడు..!

ఒక రెండు నిమిషాలకు పరిస్తితి కొద్దిగ సల్లవడ్దది..

అంటే? నువ్ మా చెల్లెను నిజంగ ఇష్టపడలేదారా?

లేదు మామా, నీకు చెల్లైతె నాకు చెల్లే గారా..

సాలె గా.. ఎంత షాక్ ఇచ్చినవ్రా నాకు..

మరిలేకపోతె ఏందిరా నువ్వు.. ఇగ చూస్తున్న అగ చూస్తున్న, ఒక మానంగ రిజర్వేషన్లను తిడ్తనే ఉన్నవ్.. అందుకే..

అరే నిజమే భై.. కని నువ్వే చెప్పురా.. మా నానమ్మ కాలానికీ ఇప్పటికీ మార్పులేదా?? వాళ్లు అసల్ ఇంట్లకు రానియ్యకపొయ్యేది.. మా నాన వాళ్లు ఇంట్లకు రానిస్తరూ కలవనిస్తరు అన్నిచేస్తరుకని పెండ్లంటె మాత్రం ఒప్పుకోరు.. కని నేన్నిన్నెప్పుడన్న చిన్నచూపు చూశిన్నారా భై? ఇప్పుడే పెండ్లికిసూత ఓకే అంటినిగారా?? నిన్ను సమానంగ అనుకోందే ఆ మాటంటనారా? మరింకిందెకురా నీకు రిజర్వేషన్?

అందరు నీలెక్క ఆలోచిస్తె మంచిగునే ఉండురా భై.. ఆలోచించరు కాబట్టే వాటికింకా వ్యాలిడిటీ పెంచుతున్నరు.. నిజంగ ఇంకో పది ఇర్వై ఏండ్లల్ల నీలెక్కనే మన తరం అందరు “ఆ సమాంతరాన్ని సమానం చేశిపారేశిన్లంటె” మనస్పూర్తిగ నా రిజర్వేషన్ నేనే తీపిస్తసరేనా? ఐ మీన్ నా పిల్లలకు, రిజర్వేషన్ తీపిస్త..

అంటె వాళ్లుకూడ అప్పుడు జెనెరల్ ఇగ? మెరిట్ ల కొట్టాల్సిందేఅంటవ్..

మరి అంతేగా మామా.. అని ఇద్దరు ఆ మిగిలిన బీర్ చీర్స్ కొట్టుకోని తాగేశిన్లు..

ఇంకోటి చెప్దామా? చాలా?? వినయ్ అడిగిండు

సాల్ రా భై, మస్తైంది.. బిల్లు తెమ్మనిగ పోదాం..

అరేయ్ మరి ఫుడ్డూ?? ఒక చికెన్ బిర్యాని చెప్పల్నా.. చెరిసగం తిందాం?

వద్దూ.. బయట తిందాం…

వినయ్ బిల్లుకట్టి, టిప్ ఇచ్చి వచ్చిండు.. ఇద్దరు సొలుగుకుంట బయటకు నడుస్తున్నరు..

అరే మామా చెల్లె గురించి అట్లన్నందుకు సారీరా..

అరే లైట్ బే.. నేనే సారీ మామా అట్ల మాట్లాడినందుకు, నువ్ ఫష్ట్ సాలరీ ఎత్తి సంబురంగ నాక్ దావతిస్తుంటేనేనే నీ మూడ్ పాడ్ చేశినా.. సారీరాభై..

అరే లైట్ బే…చోడ్ దే.. ఔన్రా, మన స్టేట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడ్డట్టున్నదిగారా అప్లై చేష్నవా? దానికి జెనెరలే ముప్పై ఐదేండ్లున్నట్టున్నదిగా..

ఆ చేష్న మామా, సదూతున్న..

ఆ.. మంచిగ సదూరా నీకుట్టిగనే అస్తదది.. కావాల్నంటె కోచిన జాయిన్ గా మామా.. ఫీజ్ నేన్ కడ్త..

ఏ.. ఎందుక్ బే.. వద్దద్దు.. ఇప్పటికే నాకొరకు యాభై అర్వై వేలు పెట్టినవ్..  ఇంక సాల్ మామా.. లైట్..

అరేయ్? అయన్నెందుకు లెక్కలు వెడ్తున్నవ్రా.. నేనెమన్న మందికి వెడ్తున్ననా.. నీకేకదా.. ఇగో ఈ ఏటీయం కార్డ్ తీస్కపో.. కోచింగ్ కు ఎంతైతదో కనుక్కోని మంచి దాంట్ల జెయిన్ గా… సరేనా.. పాస్ వర్డ్ ఎరికేగా.. అనుకుంట కార్డును కార్తిక్ జేబుల పెట్టిండు వినయ్..

లవ్ యూ రా మామా..

అరేయ్.. నీకు మందెక్కువైందిబే..

కదా?? అయినా సరే బైక్ నేనే నడుపుతా..

సరే సరేగని తొవ్వల ఏన్నన్న ఆపి నెట్ బ్యాలెన్స్ ఏయించుకో.. చెల్లె చెప్పిందికదా..

ఆ రైటే మామా నేనసల్ మర్శేపేన..

కార్తిక్ బైక్ స్టార్ట్ చేసిండు.. వినయ్,కార్తిక్ వీపునే “మెత్త”లెక్క చేసుకోనిబైక్ మీదనే పడుకున్నడు.. చీకటి వెలుగుల రోడ్లను దాటుకుంటూ దాటుకుంటూ ముందుకు పొయ్యీ పొయ్యీ బైక్ ఒకదగ్గర ఆగింది..

కార్తిక్, వినయ్ని లేపుతున్నడు..

అరే లేరా.. లే.. నువ్ లోపటికి నడు, నేన్ రీచార్జ్ చేయించుకొస్తా అని వినయ్ ని అక్కడ దించి కార్తిక్ పక్క షాపుదిక్కుకు  నడిశిండు..

“ఏంది అప్పుడే అచ్చిందా” అని కండ్లు నులుముకుంట వినయ్ ఒక్క రెండడుగులు బిర్యాని సెంటర్ దిక్కు వేశిండోలేదో సడన్ గ ఎవరో పట్టి ఆపినట్టు ఠక్కున ఆగిపొయిండు..ఎదురుంగ ఎర్రని రంగుల పెద్ద పెద్ద అక్షరాలు రాసున్న ఒక బోర్డు కనపడ్తాంది..

అప్పుడే కొత్తగ అక్షరాలు చదవడం నేర్చుకున్నోడు చదివినట్లుచదువుతున్నడు వినయ్ ఆ బోర్డును- “ముబారక్…క..ళ్యా..ణి… బి..ర్యా..నీ… సెంటర్..”

తను చూస్తున్నది నిజమో కాదోనని అవే అక్షరాలను ఒకటికి రెండు సార్లు చదివిండు.. కనిఎన్నిసార్లు సదివినా అవి మారలేదు.. తను చూస్తున్నది నిజ్జంగ నిజమే..అవి అవే అక్షరాలు..

క…..ళ్యా….ణీ…. బి…..ర్యా……నీ…

ఇంతల కార్తిక్ రీచార్జ్ చేయించుకోనివచ్చి, నోరెళ్లబెట్టి నిలుచున్న వినయ్ జబ్బ మీద చెయ్యేసిండు.. వినయ్ ఆశ్చర్యంతోని అట్లనే గుడ్లు పెద్దవిచేసి చూస్తూ-

ఏందిరా?? ఈడికి పట్కచ్చినవ్?? మందెక్కువైమజాక్ చేస్తున్నవా?లేకుంటె నిజంగనే దిమాగ్ఖరాబైందా??”

సమాంతరాన్ని సమానం చెయ్యాలెగా మామా..చలో పారా.. ఇయ్యాల్టికెళ్ళి నేన్ సుత నీ తిండి తింటా..

ఇన్నిరోజులు తాను గొడ్డు మాంసం తింటా అంటెనే తీవ్రంగ అసహ్యించుకునే కార్తిక్, ఇప్పుడు తనంతట తానుగా  తింటా అనేసరికి వినయ్ కి అస్సల్ ఏం అనాల్నో తెలుస్తలేదు…కాని ఆ అద్భుత క్షణంలో, అప్పటిదాకా జీవితంలో ఎన్నడు తన నోటి నుంచి రాని మాటలు వాటంతట అవి అప్రయత్నంగనే బయటికొచ్చినయ్..

లవ్ యూ మామా..వినయ్ అన్నడు..

లవ్ యూ టూ రా భై…..

ఇప్పుడా రెండు మొఖాల్లోనూ చిన్న చిరునవ్వూ.. పెద్ద సంతృప్తీ..

ఆ కళ్లకిప్పుడు చీకటి కూడా వెలుగులెక్క కనపడుతోంది…

వాళ్లిద్దరు ఒకరి జబ్బ మీద ఒకరు చేతులేసుకోని, అడుగుల అడుగేసుకుంట లోపటికి నడిచిన్లు..

 

*

allam-vamsi

మీ మాటలు

  1. చైతన్య అల్లం says:

    కథ ప్రథమ భాగం అంత వీనికేమయింది ఇట్ల రాస్తున్నడు, ఫ్రస్టేషన్ల రాస్తున్నడా అనుకున్న. మెల్లగ పర్స్పెక్టివ్ మారినపుడు కథ పువ్వు లాగా విచ్చుకున్నది. సున్నితమైన సమస్యని అంతే సున్నితంగ చెప్పిన తీరు మంచిగున్నది. సంభాషణ, కథనం మంచిగ నడిపించినవ్. గ్రేట్ జాబ్ రా.

  2. Sandeep M says:

    కథలు చదవడం అలవాటైందే నీ కథలతోని. ఇప్పటివరకు రాసినవాటిల్లో మిరాకిల్ ఏ నిజంగ మిరాకిల్. అసల్ రెండు సైడ్లని ఇంత మంచిగ బ్యాలెన్స్ చెయ్యడం నిజంగ సూపర్ కంగ్రాట్స్ రా.

  3. Sans Sabbani says:

    Bravo!!
    I expected a different ending which focuses on “hating each other” and I thought many questions will remain unanswered!
    But u totally took the story to a whole new level.. I Really liked it.
    Thank you bro. -SS

  4. వంశీ గా చాలా బాగుంది రా స్టోరీ ….. గ్రేట్ జాబ్ రా…నా పేరు కూడా ఉంది అందులో ఇంకా సంతోషం … ;-)

  5. Rakesh Jukuri says:

    Paina Chaitanya annaki Sandeep ki emanipinchindho absolutely naaku adhe anipinchindhi mama.. U Became Master Dear…

  6. Narayanaswamy says:

    బాగా రాసినవు వంశీ ! లాజికల్ గ మంచిగ గుంజుకొచ్చినవు – భాష మంచిగున్నది !

  7. Sravanth khanna says:

    నైస్ స్టొరీ, బాగుంది మంచి షార్ట్ ఫిలిం లాగ.

  8. padmaja rachamalla says:

    చాలా బావుంది..గాడ్ బ్లస్

  9. వాణి says:

    కథ చాలా బావుందండి.

  10. శాంతి ప్రబోధ says:

    భాష, యాస, కథనం, కథా వస్తువు అన్ని బాగున్నై అల్లం వంశీ

  11. Allam Krishna Vamshi says:

    ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్పూర్తిగా కృతఙ్ఞతలు.. చాలా సంతోషం నిజంగా మీ ప్రోత్సాహానికి. హ్యాపీ.. -అల్లం వంశీ

  12. వనజ తాతినేని says:

    నిజాయితీగా వ్రాసారు . గొప్ప ఆశావాదంతో వ్రాసారు . ముగింపు చాలా నచ్చింది . మంచి స్నేహితులు కాబట్టి మంచిగా అర్ధం చేసుకున్నారు. సమాజంలో ఇలాంటి మార్పు రావాలంటే ఓ వందేళ్ళు పడుతుంది . మీ కథలు ఎప్పుడూ క్రొత్త పుంతలు త్రొక్కుతూ ఉంటాయి. అభినందనలు వంశీ !

  13. లిపిజ్వలన says:

    కధాకధన౦ బాగు౦ది. సమస్య నిత్య నూతన౦ దీనికి పరిష్కార౦ ఏమిటి? కుల మతాల వ్యవస్థ వ్యతిరేకి౦చి పెళ్ళిళ్ళు జరిగినా ఎక్కువ అనే వారు ఎ౦త ఒదిగిఉన్నా తమలో కలుపుకోలేని వారిని, మాటమాటలో తప్పులు వేడికి ఒక జీవితకాలం వేది౦చే వారిని కూడా చూసాను.నరనరాన ఇ౦కిపోయిన ఈ ఈగోలు ఎప్పటికిపోయేను? ఈ జబ్బుకు మ౦దేదీ?

  14. Gopi Reddy Yedula says:

    ప్రాణ స్నేహితంలో కూడా కుల సమస్య ఎంత అడ్డుగోడగా ఉందో కళ్ళకు కట్టించారు. ఫై ఫై చర్చల్లో “ఇప్పుడు కులాలు యాడున్నయండీ” అనే దాటుడు సమాధానం ఇచ్చే వాళ్లకి ఇది అర్ధవంత మైన సమాధానం. కుల సమస్య చర్చల్లో ఏదో ఒక వర్గం కూసింత ద్వేషాన్ని ప్రదర్శించడం సాధారణం. కానీ అదేమీ లేకుండా సమస్యని సమస్యగా చిత్రించిన శిల్పం అద్భుతం. కుల సమస్యని వ్యాసాల్లో కాకుండా కథలో చర్చించడం చాలా బాగుంది.

    • Allam Krishna Vamshi says:

      థాంక్యూ సర్, నా ఉద్దేశాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీరు అర్థంచేసుకోవడం నాకు చాలా మంచిగనిపిస్తోంది! హ్యాపి :)

  15. kiran sannidhi says:

    “” Power of Ur MIND reflects from Ur Words , through Ur Pen “”

  16. Sandeep M says:

    గుజరాత్ లో హార్దిక్ పటేల్ రిజర్వేషన్లకోసం ఉద్యమం చేపట్టిన నేపధ్యంలో రిజర్వేషన్ల పై మళ్ళీ చర్చ మొదలైంది. ఈ సంధర్భంగా ఈ కథ ప్రాముఖ్యత మరింత పెరింగిందని నేను అనుకుంటున్నాను, వీలైనంత ఎక్కువ మందికి ఈ కథ చేరుకోవడం తక్షణ అవసరం అని నా భావన. దయచెసి షేర్ చేయగలరు.

    • Allam Krishna Vamshi says:

      చానా చానా థాంక్స్ రా మామ, ఫుల్ కాంఫిడెన్స్ వచ్చిందిరా నీ మాటలకు! మంచి ఆలోచనతో నేన్ చేసిన ప్రయత్నాన్ని ఇంత మంచిగ రిసీవ్ గ చేస్కున్నందుకు ఫుల్ ఖుష్ మామా.. థాంక్స్ రా..

  17. N Venugopal says:

    చాల చాల బాగుంది వంశీ. విషయం, వాదనలు, భాష, వాతావరణం అన్నీ సరిగ్గా కుదిరినయి. సృజన ‘సాహితీమిత్రులు’ లో రాజన్న కథలు పైకి చదివి వినిపిస్తూ ఆ విషయానికి, వాదనలకు, అద్భుతమైన నుడికారానికి మహానందం అనుభవించిన ముప్పై ఏళ్ల కిందటి రోజులు గుర్తొచ్చినయి. కీపిటప్. ఇప్పటికే నీ కథలు గొప్ప వాగ్దానంగా ఉన్నాయనుకో. అది నిలబెట్టుకుంటావని గట్టిగా అనిపిస్తున్నది…

    • Allam Krishna Vamshi says:

      ఇంతమంచి ప్రోత్సాహం ఉన్నంక నిలబెట్టుకోకుండ ఎట్లా ఉంటా అన్నా.. తప్పకుండ మంచి కథలు రాసే ప్రయత్నం చేస్తాను, మీ మాటలు నాకెంత బలానిచ్చినయో చెప్పడానికి నిజంగ నా దగ్గర మాటలు లెవ్వు, చానా చానా సంతోషం అన్నా… థాంక్యూ సో మచ్… పెదనాన (రాజన్న) స్థాయికి చేరడం ఒక కల, అంత స్థాయికి చేరుకోలేనేమో గని ఐతె ఆలోచనలను మాత్రం తప్పకుండ కొనసాగిస్తా..
      మళ్లొక్కసారి మనస్పూర్థిగా థాంక్స్ మీకు నిజంగా చాన సంతోషమన్నా..

  18. వాన చినుకులు వాలినట్టు ఒక్కొక్క మాట వస్తుంటే చెరువు నిండిపోయినట్టు మనసు నిండిపోయింది .గొప్ప ఎక్స్ప్రెషన్. కాని కార్తిక్ ఇష్టం సినిమాటిక్ గ మారిపోవడం కథ కోసమే అన్నట్టు వుంది . సహజంగా లేదు .చెప్ప దలుచుకున్న విషయం కోసం సాగ తీసినట్టు వుంది కథ . అయితే ఆ సాగతీ తలో కూడా కొంత టెంపో నడపడం బాగుంది విషయం అలాంటిది కథను రెండు సార్లు చదివాను

  19. Allam Krishna Vamshi says:

    చాలా చాలా సంతోషం సార్.. కథ గురించి మీ విలువైన అభిప్రాయాన్ని షేర్ చేస్కున్నందుకు మనస్పూర్థిగా కృతఙ్ఞతలు.. చాలా గొప్ప అనుభూతి కలిగింది మీరు చెప్పింది చదూతుంటె.. థాంక్యూ సార్..

Leave a Reply to Narayanaswamy Cancel reply

*