“చేత” కాదు..”కాలు” కాదు!

 

సుధా శ్రీనాథ్ 

sudha “నాన్న ఈ రోజు గుడికి కాలి నడకన వస్తారంట.  Even though the weather is so very good to take a long walk, మళ్ళీ అంత దూరం నడిచేందుకు నాకు మనసు లేదు; మన చేత కాదు కూడా. మనమిద్దరం కార్లో వెళ్దాం. క్లాస్‍కు లేట్ కాకూడదు. ఇవ్వాళ మీకు భగవద్గీత స్పర్ధలున్నాయి కదూ.” మనసులోని మాటను పాపతో చెప్పాను.

అమేరికాకు వచ్చిన తర్వాత మేం నడవడమే తగ్గి పోయింది. స్కూల్ కాలేజీలకెళ్ళాలన్నా కారెక్కాలి. కొత్తిమేర కూర తీసుకు రావాలన్నా కారెక్కాలి. ఏం కొనాలన్నా, ఎక్కడికెళ్ళాలన్నా కారెక్కాలి. నడుచుకొనెళ్ళి కలవాలంటే దగ్గర్లో ఎవ్వరూ లేరు, నడుచుకొనెళ్ళి చేసుకొచ్చే పనులయితే అస్సల్లేవు. అందుకని ఒక ఆదివారం రోజు DFW Hindu temple కు కాలి నడకనే వెళ్ళాలని నిశ్చయించుకొన్నారు శ్రీనాథ్ గారు. తెల్లవార్నే లేచి, త్వరగా తయారై, తిండి తిని ముందుగానే బయలుదేరారు పది గంటలకు మొదలయ్యే క్లాస్‌కని. ప్రతి ఆదివారం గుడికి వెళ్తున్నా కూడా ఇదే మొదటి సారి ఆయనిలా కాలి నడకన బయలుదేరడం. అప్పుడు మేం అర్వింగ్‍లోని Las Colinas లో ఉన్నాం. ఇంటి నుంచి గుడికి సుమారు పది మైళ్ళ దూరం. మేమిద్దరం కార్లో వేళ్ళేటప్పుడు దారి పొడుగునా నాన్న కోసం వెదుకుతూనే వచ్చింది పాప. MacArthur రోడ్డు ప్రక్కన ఆయన కనపడగానే తనకు ఎనలేని సంతోషం. “అమ్మా! మనం కూడా నాన్న జతలో ఇక్కడ్నుంచి నడుద్దామా?” నాన్నని చూస్తున్నట్టే చటుక్కున దూసుకొచ్చింది ప్రశ్న వెనక సీట్లో కూర్చొన్న పాపనుంచి. అమేరికాలో పిల్లల సురక్షతా దృష్టితో పన్నెండేళ్ళ వయసు లేక 135 cms ఎత్తు వచ్చేంత వరకు పిల్లలు కార్లో ముందు సీట్లో కూర్చొని ప్రయాణించేట్టు లేదు. సురక్షతా నియమాల్ని అందరూ పాటిస్తారు. నియమాల్ని ఉల్లంఘిస్తే పెనాల్టీస్ చాలా ఎక్కువ.

“నా చేత కాదు పాపడూ అంత దూరం నడిచేందుకు. అదీగాక కారిక్కడెక్కడో పార్క్ చేసి వేళ్తే మళ్ళీ ఇక్కడిదాకా నడిచి రావాలి, లేక పోతే ఎవరి కార్లోనైనా ఇక్కడి వరకూ రావాలి. ఎందుకవన్నీ లేని పోని కష్టాలు.” తనని disappoint చేసినా పర్వాలేదని అద్దంలో తనని చూస్తూ నిజం చెప్పాను. పాపలో సహకరించే గుణం చాలా ఉండింది. ఒక క్షణం తన కళ్ళలో నిరాశ కనపడి మాయమైంది.

“నడిచేది కాళ్ళతో కదూ అమ్మా? నువ్వెందుకు ‘చేత కాదు’ చేతకాదని అంటావు? ‘నా కాళ్ళక్కాదు’ అని అంటే తప్పా?” మొదలయ్యాయి బేతాళ ప్రశ్నలు.

“అవునమ్ములూ. నువ్వన్న మాట నిజమే. అయితే నాకు సాధ్యం కాదు అనే అర్థంతో మేమలా వాడుతాం. నా వల్ల కాదని కూడా అంటారనుకో. కొన్ని expressions వాడుక వల్ల dictionary meaning కంటే పూర్తిగా వేరే అర్థాన్నిస్తాయి. అది రోజూ తెలుగు మాట్లాడటం వల్ల రాను రాను నీకే తెలుస్తుంది. ఇది can’t అనే అర్థంతో వాడుతాం.”

ఆహా! అందుకే కాబోలు ఏదైనా తినేందుకెక్కువనిపిస్తే కూడా నా చేతకాదంటారు కదూ అని ఇంకో ఉదాహరణమిచ్చింది తనే.

ఆ రోజు భగవద్గీత శ్లోకాల స్పర్ధలో క్లాస్‌లోని పిల్లలందరూ పాల్గొన్నారు. పిల్లలు భగవద్గీతలోని శ్లోకాలను కంఠస్థం చేసుకొని స్పష్టమైన ఉచ్ఛారణతో పలకడం విని, ఆ రోజు జడ్జిగా వచ్చిన చిన్మయానికేతన్ స్వామీజీ పరమానందంతో ప్రశంసించారు. తక్కువ సమయంలో ఇరవై శ్లోకాల్ని కంఠస్థం చేయడం పిల్లల ఆసక్తి మరియు ఏకాగ్రతలను తెలుపుతుందన్నారు. ఏకాగ్రత లేనివారికి ఇంత బాగా నేర్చుకోవడం చేతకాదని టీచర్ చెప్పగా విని పాప నా వైపు చూసింది. ఇక్కడ కూడా ‘చేతకాదు’ అనే వాడారనే అర్థం ఆ చిలిపి కళ్ళలో.

తర్వాత భోజనాలప్పుడొచ్చింది ఇంకో ప్రశ్న. ఇంగ్లిష్‌లో ‘నంచుకుని’ అనేందుకేమనాలి అని. అది పూర్తిగా భారతీయ పదమని దాన్ని అనువాదం చేయడం నా చేత కాదని నవ్వాను. పెరుగన్నానికి గోంగూర లేక ఆవకాయ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అలా నంచుకోవడం తనకిష్టమనే విషయం తన అమేరికన్ స్నేహితులకు చెప్పాలని పాప ఆరాటం. ‘Pickles add special taste to yogurt rice. I like it.’ అని అనాలంతే. మనం రోజూ వాడే కొన్ని తెలుగు పదాలను ఇంగ్లిష్‌లోకి మార్చేందుకు సాధ్యం కాదన్న మాట అనింది పాప. అవును. ఏ భాషే కానీ ఆ భాషను వాడే ప్రజల సంస్కృతిని ప్రతిబింబించేలాగుంటుంది. మన వాడుకలను సూచించే పదాలు మన భాషలో ఉంటాయంతే. మనలా రొట్టెకు కూర నంచుకోవడం మరియు పెరుగన్నానికి ఆవగాయ నంచుకొని తినడంలాంటి పద్ధతులు బహుశః వేరెక్కడా ఉన్నట్టు లేవు. విదేశీ భాషల్లో దాన్ని సూచించే పదం లేనప్పుడు ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.

అమేరికాలో ఉన్నందువల్ల పిల్లలు తెలుగు వినడం తక్కువ, మాట్లాడటం ఇంకా తక్కువ. మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు వాళ్ళకు అడుగడుగునా అడ్డంకుల్లా చిన్ని చిన్ని సంశయాలు తలెత్తుతూనే ఉంటాయి. అవి ప్రశ్నలై బయటికొస్తూనే ఉంటాయి. ఆ ప్రశ్నలకు సరియైన బదులిచ్చేందుకు మనం మన వంతు ప్రయత్నం చేయలేదంటే వారి ఆసక్తికది వెనుకబాటు. వాళ్ళెక్కువగా వినే భాష English కాబట్టి తెలుగు పదాల్ని, వాక్యాల్ని ఇంగ్లిష్ పదాలతో, వాక్యాలతో పోల్చి చూసి, ఎక్కడెక్కడ పొందిక లేదనిపిస్తుందో అక్కడ కుతూహలంతో ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఆ ప్రశ్నలకు వాళ్ళకర్థమయ్యేటట్టు బదులిచ్చే తెలివి కానీ, ఓపిక గానీ నాకుండలేదు. అయితే పిల్లలకు మన భాష నేర్పేందుకని క్లాస్ మొదలయ్యాక తొలి దశలోనే వాళ్ళ సంశయాలను పరిహరించాలనే ఉద్దేశంతో అవి రెండింటినీ ప్రజ్ఞాపూర్వకంగా కొద్ది కొద్దిగా నేర్చుకోవాల్సి వచ్చింది.

buduguపిల్లలు మనూర్లో పెరిగితే అవంతట అవే తెలిసే పదాలు, వాడుకలూ కూడా ఇక్కడ తగినంత పరిశ్రమ వేసి నేర్చుకోవాలి. బహుశః అమేరికాంధ్ర తల్లిదండ్రులందరూ దీన్ని గమనించి ఉంటారు. అమేరికాంధ్రుల పిల్లల ప్రశ్నల styleఏ వేరేనని చెప్పక్కర్లేదు. ఈ పిల్లలు గమనించినంత సూక్ష్మాతిసూక్ష్మాలు ఆ వయసులో నేను గమనించలేదనేది నూటికి నూరు పాళ్ళు సత్యం. ఒక్కోసారి వీళ్ళ ముందు మనం చాలా మొరటనిపిస్తుంది కూడా. To tell you the truth, it added a new interesting dimension to my thinking. అన్ని అనుభవాలకూ అక్షర రూపమిచ్చేందుకు నా చేత కాదు. అయితే పిల్లల ప్రశ్నల నా అనుభవాల చిన్ని అవలోకనం ఇక్కడుంది. వీటిలో కొన్నైనా అమేరికాంధ్రులందరికి తమ పిల్లలకు తెలుగు నేర్పేటప్పుడు స్వంత అనుభవానికి వచ్చి వుంటాయి.

ఏవేవో ప్రశ్నలకు బదులిచ్చే ఓపిక లేనప్పుడొక సారి మా పాపతో ప్రశ్నలతో విసిగించద్దు పొమ్మంటే “పొమ్మని అనొద్దమ్మా.” అని ఏడ్చింది. తనొక్కతే ఎక్కడికో వెళ్ళి పోవాలేమోననుకొని భయపడిందేమో. దగ్గరకి తీసుకొని “ఎక్కడికీ వెళ్ళాల్సిన పని లేదు పాపడూ. నాకిప్పుడు వేరే పనులున్నాయి. నీ ప్రశ్నలతో విసిగించకు అని అంతే. It just means don’t bother me right now.” అని వివరించి ఓదార్చాల్సి వచ్చింది. తనకప్పుడింకా మూడేళ్ళ వయస్సు. అమ్మానాన్నలు తప్ప వేరే బంధువర్గాన్నే చూడకుండా అందర్నుంచి దూరంగా పెరిగేటప్పుడు పిల్లల మనసులో కూడా ఒంటరితనం ఆవరిస్తుందేమో. పిల్లలు చాలా సున్నిత మనస్కులై భావుకులవుతారేమోనని అనిపించింది. ఏవేవో తప్పుగా ఊహించుకొని బాధపడతారని కూడా అనిపించింది.

“నువ్వెప్పుడూ అంతే. ఎక్కడ చదివిన పుస్తకాలు అక్కడే వదిలేస్తావు. వాటిని shelfలో ఉంచడం మర్చి పోతావు.” అని కోప్పడినప్పుడు “ఎప్పుడూ కాదమ్మా. Sometimes I forget, sorry!” అని మొహం చిన్నబుచ్చుకొన్న పాపను చూసి “ఎప్పుడూ అంటే always అని dictionary meaning ఉన్నా కూడా మేం వాడేది most of the times అనే అర్థంతో. మాకు ఓపికల్లేనప్పుడు అది sometimes  అనే అర్థం కూడా ఇస్తుంది.” వివరించి చెప్పాను. అయితే ఎందుకిలా చిన్ని విషయాలను మళ్ళీ నకారాత్మకంగా పెద్దవి చేస్తున్నానా అని అనిపించింది.  నేను మాట్లాడే తీరు మార్చుకోవాలని కూడా అనిపించింది. ఎందుకంటే ఇంగ్లిష్‌లో ఇట్లాంటి సందర్భంలో ‘ఎప్పుడూ’ అని వాడరు. సందర్భోచితమైన ‘చాలా సార్లు’ అని అంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలే కానీ గోరంతను కొండంత చేయడమెందుకా అని కూడా అనిపించింది.

ఎవరిదో అసహనీయమైన వైఖరి వల్ల బాధ పడి “వాళ్ళంతే. మారే రకం కాదులే. కుక్క తోక ఎన్నటికీ వంకరే.” అన్న నాన్న మాటలు విని “నాన్నా! That is too strong a statement. They might change for the better later sometime.” అనింది పాప. నాలుగైదేళ్ళ వయసులో, విషయాలేమీ తెలీక పోయినా పెద్ద ఆరిందాలా మాట్లాడిందనిపించినా కూడా, అవును కదా మనమింత కఠినంగా ఎవరి గురించి ఆలోచించినా తప్పనుకొన్నానే గానీ ఆయన మాటల్ని పాప ముందు సమర్థించుకోవాలని అస్సలనిపించలేదు. అందుకే అన్నారు ‘పాపలు మంచికి రూపాలు’ అని. పిల్లల మనసులో మానవీయత, ప్రామాణికత మున్నగు విలువలు నూటికి నూరు పాళ్ళు అర్థవంతగా వెలసి ఉంటాయి. వారి స్వచ్ఛ భావాలను కాపాడగల్గితే ఎంత బాగుణ్ణనిపించింది. ఒక్కోసారి మనకు తెల్సిన జీవన మౌల్యాలే చిన్ని పాపల మాటలై వారి నోటి నుంచి వచ్చి మమ్మల్ని వదలకుండా వెంటాడుతూనే ఉంటాయి.

ఈ తరం పిల్లలు మన ప్రతి మాటనూ గమనిస్తూ ఉంటారు. భాష నేర్చుకోవాలన్న ఆసక్తి, పట్టుదల ఉన్న పిల్లలు మనం ఒకటి తెలిపితే చాలు, పది నేర్చుకోంటారనేది అతిశయోక్తి కాదు. మన తప్పులు మనం తిద్దుకొంటూ సాగితే అవి వాళ్ళ తప్పులై కొనసాగే అవకాశముండదు.

buduguమా స్నేహితుడింట్లో వాళ్ళబ్బాయి కిరణ్ “మా నాన్నగారు పేర్లు గుర్తురానప్పుడు తన పేరు అదేదో ఉంది లేక వాళ్ళ ఊరి పేరు అదేదో ఉంది అంటారు. ఏదో ఉంటుందనేది అందరికీ తెల్సు కదా. వారి పేరు గుర్తు రావడం లేదనో లేక మర్చి పోయిందనో ఒప్పుకోవచ్చుగా” అంటూ నవ్వాడు. ఎందుకంటే ఇంగ్లిష్‌లోనైతే గుర్తురాని సందర్భంలో నేరుగా గుర్తులేదని చెప్పడమే వాడుక. చెప్పే తీరు ఒక్కో భాషలో, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుందంతే కానీ తప్పర్థం చేసుకోకూడదని వివరించి చెప్పారు కోవెల్లోని తెలుగు క్లాస్ టీచర్.

కిరణ్ చాలా మాటకారి. అందర్నీ ఆకట్టుకొనే శక్తి తన ముద్దు మాటలకుంది. తనకేదైనా అర్థం కానప్పుడు చిరునవ్వులతో ప్రశ్నిస్తాడు. “మేం హైదరాబాద్‌కెళ్ళినప్పుడు దారిలో ఒకర్ని directions అడిగితే ముందుకెళ్ళి leftక్కొట్టి rightక్కొట్టాలన్నారు. ఇక్కడ కొట్టడం అనెందుకొచ్చింది?” కిరణ్ ప్రశ్నకు పెద్దాయన బదులిచ్చారు. బహుశః ఎద్దుల బండిని కావల్సిన దిక్కుకు మరల్చాలంటే ఎద్దులకు కొరడాతో ఓ చిన్ని దెబ్బ కొట్టేవారు. అందువల్ల కొట్టడం అంటే బండి నడపడమనే అర్థంలో వాడుకలో వచ్చియుంటుంది. ఇప్పుడు మోటార్ వాహనాలక్కూడా అదే పదం వాడటం కొనసాగిందన్నారు.

మెట్లు దిగేటప్పుడు జారి పడి తన కాలికి మూగదెబ్బ తగిలిందన్నారు పెద్దావిడొకరు. అంటే కంటికి కనపడేలాంటి గాయం కాదు కాబట్టి దాన్ని మూగదెబ్బ అంటామన్నారు. పిల్లలకు ఒకటే నవ్వు. దెబ్బవల్ల కల్గిన గాయం కనపడలేదని దాన్ని గుడ్డి దెబ్బనాలా లేక గాయం నోరు విప్పలేదని మూగ దెబ్బనాలా అనే వాదాలతో సాగాయి మాటలు. మొత్తానికి పిల్లల మనసుల్లో మన భాషపై మూగప్రేమ మొదలై తెలుగుదనం వైపు ఆసక్తి వస్తూందనడానికి ఇది నిలువుటద్దమన్నారు టీచర్.

తెలుగుగడ్డ నుంచి దూరంగా ఉన్నందువల్ల భాష పట్ల పిల్లల మనసులో చెలరేగే గందరగోళాల్ని నివారించేందుకు పెద్దల ప్రతిభా పాటవాల సహాయం అత్యవసరమనే సత్యం ప్రతి నిత్యమూ కళ్ళ ముందుకొస్తూనే ఉంటుంది. అంతే కాదు, మన భాషాసంస్కృతిని, సంగీత సాహిత్యాలనీ ముందు తరాలకు అందించాలంటే మనం చెప్పే విధానాల్లో, మన ఆలోచనల్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లలు తెలుగు చదివి, విని ఆనందించేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉందంటూ పెద్దాయన చేసిన ఉపదేశం గుర్తొచ్చింది.

“జీవితమున్నదే మన నవ్వులు, ప్రీతి, తపన, ప్రామాణికత, మానవీయత, మన సంస్కృతి, మన కలలు, ఆశయాలు అన్నీ మన వాళ్ళతో పంచుకోవడానికి మరియు దానివల్ల ఆహ్లాదకరమైన సుదీర్ఘ సంబంధాలను పెంచుకోవడానికి. స్వస్థ కుటుంబాలే స్వస్థ సమాజాన్ని కట్టగలవు. అందుకే ప్రవాస భారతీయులు కూడా తమ భాషని, భాషాప్రేమని తమ పిల్లలతో పంచుకొని పెంచుకోవడానికని ఆరాటపడతారు. తమ భావనల్ని, కలల్ని తమ పిల్లలకు తెలిపే ప్రయత్నాల్లో భాష నేర్పడం కూడా ఒక ముఖ్యమైన అంశం. ఏ విషయం గురించి కానీ ఆలోచించి, అనుభవించి తమ ఆలోచనలను, అనుభవాలను పంచుకోవడానికి ఉపయోగపడే అమూల్య సాధనమే భాష. అమ్మ భాష మన జీవితంతో ముడిపడియున్న ఒక విడదీయరాని భాగం.”

ఈ నెలాఖర్లో మన తెలుగు దినోత్సవం వస్తూంది. తెలుగు భాష మనది; నిండుగ వెలుగు భాష మనది అని మళ్ళీ మళ్ళీ పాడే సమయమిది. సమస్త తెలుగు బాంధవులకు తెలుగు దినోత్సవపు శుభాకాంక్షలు!

*

మీ మాటలు

  1. మీది ఎంత గొప్ప పరిశీలన! అంతకు మించిన విశ్లేషణ! ఈ రెండిటినీ మించిన వచనం . మీ మాటల్లో ఓ వెన్నలాంటి తెల్లని మనసు తేటగా తేరి కనిపిస్తుంది . మనః పూర్వక అభినందనలు

  2. వనజ తాతినేని says:

    చాలా బావుంది . సునిశిత పరిశీలన మీది . అలాగే చాలా శ్రద్ద తో వ్రాసారు . అభినందనలు .

  3. Sudha Srinath says:

    అన్ని అనుభవాలకూ అక్షర రూపమిచ్చేందుకు నా చేత కాదు. అయితే ప్రయత్నిస్తున్నానంతే. మీ ఈ ప్రోత్సాహభరిత అభినందనలకు కృతజ్ఞతలండి.

  4. వెంకట్ కొండపల్లి says:

    అరే ! ఇది నిజమే కదా? ఇలా ఒకసారి ఫలానా వాళ్ళ పాప ఇలాగే అడిగింది కదా? అని చాలా విషయాలు మన జీవితం లో చూచినవీ జరిగినవీ మళ్ళీ గుర్తుకు తెచ్చారు. చక్కగా వ్రాసారు సుధా గారు. మీకు కృతజ్ఞతలు .

  5. అవునండి. పిల్లల బాల్యం, వారి ముగ్ధత, ఆ ముగ్ధ మనస్సులోని స్వచ్ఛ భావాలు గుర్తుకు తెచ్చారు. థ్యాంక్స్.

  6. Dr. Rajendra Prasad Chimata. says:

    చాలా ఇంట్రస్టి ం గ్ గా ఉంది. చాలా ఉత్సాహకరంగా ఉంది. కొనసాగించండి. శుభాకాంక్షలు .

  7. సుధా గారూ పిల్లల ప్రశ్నలు వాళ్లకు మనం ఓపికగా జవాబు చెప్పడం నిజంగా అవసరం. మీది చదవగానే మా పాప చిన్నప్పుడు ఒకసారి అన్నం తినకపోతే నానా అన్నం తినకపోతే జ్వరం వస్తుంది.వీక్ అవుతావు ఏవేవో అప్పటికి చెప్పను. ఆ తర్వాత ఎండలో ఆడుతుంటే మల్లి అదే రిపీట్ చేశాను. వెంటనే బాణం లా ప్రశ్న అమ్మా ఇంతకూ తినకపోతే జ్వరం వస్తుందా ఎండలో తిరిగితే జ్వరం వస్తుందా అని. పిల్లలు ఎప్పుడు ఎలాంటి ప్రశ్నలు వేస్తారో ఆ లేత మనస్సులో ప్రశ్నల వర్షం సాగుతూనే ఉంటుంది.

    సారీ మీరు పరిచయం లేకపోయినా ఏదేదో రాసాను.అండ్ మీ మొత్తం ఆర్టికల్ లో చివరి పారా కన్నా ముందుది కొంచెం మిగతా భాగమంత సులువుగా లేదనిపించింది ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమె ఎక్కువ పరిచయం లేకుండా స్వతంత్రత తీసుకున్నందుకు ఏమీ అనుకోకండి.

  8. చాలా బావుందండి.

మీ మాటలు

*