సగం ఆకాశంపై ఇంకో సంతకం!

 

 

  (ఆగస్టు 23 మెర్సీ మార్గరెట్ తొలి కవిత్వ సంపుటి “మాటల మడుగు” ఆవిష్కరణ సందర్భంగా)

 

నేను వెతుక్కుంటున్న ప్రపంచం దొరకడం లేదు

కొత్త నేలా, కొత్త ఆకాశమూ దొరకడం లేదు

సర్లే, కొత్త నేలా కొత్త ఆకాశమూ దొరికాయి కదా అనుకుంటే

కొత్త మానవుడి ఆచూకీ దొరకడం లేదు ఎక్కడా!

-చాలా కాలం కిందట యేదో ఆడియో క్యాసెట్ లో విన్న కైఫీ ఆజ్మీ ఘజల్ గుర్తొస్తోంది, ఇవాళ మెర్సీ కవిత్వం రెండో సారి చదవడం పూర్తి చేసాక! ఆ వెంటనే, రెండు ప్రశ్నలు నా ఆలోచనల నిండా అలముకున్నాయి.

కవిత్వం రాయడం అనే ప్రక్రియ కవికి ఎందుకు అంతగా అవసరం? నాలుగు కవిత్వ వాక్యాల తరవాత ఆ కవి ప్రపంచం గానీ, అది  చదివిన చదువరి ప్రపంచం గానీ కొంచెమైనా మారుతాయా? ఈ రెండు ప్రశ్నలు అడగడం తేలిక; వాటి సమాధానాలు అంత తేలిక కాదు.

కాని, కవిత్వాన్ని తన సంభాషణకి సాధనంగా ప్రకటించుకున్నాక, ఆ కవి ప్రపంచం చాలా మారిపోతుంది. తన అనుభవాన్నీ, చెప్పాలనుకున్న విషయాన్ని ఆవిష్కరించడంలో ఆ కవి వెతుక్కునే దారులు అప్పటిదాకా మనకి అపరిచితంగా వున్నా, కొద్దిసేపట్లో అవి పరిచితమై, వొక ఆత్మీయమైన బంధం కవికీ, చదువరికీ మధ్య మొలకలెత్తుతుంది.

అంటే, వొక ఆత్మీయ నేస్తం లేని లోటుని ఆ కవిత్వం నెమ్మదిగా భర్తీ చేయడం మొదలెడుతుంది. అలాంటప్పుడు ఆ కవి ఎవరు, అతను/ ఆమె భౌతిక ఉనికి ఏమిటీ అన్న ప్రశ్నలు అర్థరహితంగా కనిపిస్తాయి. వాక్యాలతో మొదలైన ఆ బంధం జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టాలలో కూడా ఆ వాక్యాల ఆసరా వెతుక్కునేట్టు చేస్తుంది.

అలాంటప్పుడు, చాలా సంక్లిష్టంగా అనిపించే జీవన ప్రహేళికలో వొక నేలా, ఆకాశమే కాదు, కొత్త మానవత్వపు చిరునామా కూడా దొరికినట్టే! అలాంటి అనుబంధాన్ని అల్లుకునే కవిత్వపు వంతెన – మెర్సీ మార్గరెట్ కవిత్వం.

1

సాధారణ స్త్రీవాద కవిత్వం దాదాపూ తగ్గుముఖం పట్టి, దళిత, ముస్లిం, తెలంగాణా  స్త్రీవాదాల నిర్దిష్టత (local –specific feminism) ముందుకొస్తున్న దశలో మెర్సీ కవిత్వం మనం చదువుతున్నాం. అలాగే, భావప్రకటనకి సంబంధించి వ్యక్తిగత ధోరణి యింకో రూపం ఎత్తుతున్న దశలో కూడా మనం వున్నాం. ప్రపంచీకరణ తరవాతి extreme individualism తెలిసో తెలియకో ప్రతి కవిలోనూ ఇప్పుడు కనిపిస్తోంది. ఇది క్రమంగా  సామాజిక నిరాకరణగా మారిపోతోందా అన్న సంశయమూ వొక్కోసారి వస్తోంది. ఆ సంశయాలని తుడిచేస్తూ, ఈ రెండీటినీ బ్యాలెన్స్ చేసే స్వరాల్లో మెర్సీ వొకటి.

mercy

మెర్సీని కవిత్వ లోకంలో బలంగా పరిచయం చేసిన కవిత “ప్రశ్నలగది.” ఈ కవితలో మెర్సీ అన్వేషణకి ఎన్ని రూపాలున్నాయో అవన్నీ అద్దంలో ప్రతిఫలించినట్టు కనిపిస్తాయి. వొకే వొక కవితలో కవి వ్యక్తిత్వాన్ని చూపించాలనుకోవడం దురాశే కాని, ఎందుకో నాకు నమ్మకం- అలా చెయ్యచ్చు అని! కవి ఏదో వొక కవితలో తన మొత్తం ప్రాణం పొదుగుతాడు; తన ప్రయాణానికి ఆ కవిత తెలియకుండానే benchmark అవుతుంది. అది ఎలా అన్నది అర్థం కావాలంటే “ప్రశ్నలగది” కవిత మొత్తం ఇక్కడ quote చేయాలి.

అప్పుడప్పుడు

ఆ గదిలోకెళ్ళడం అవసరం

అంటూ వొక అనివార్యత(inevitability)ని మన ముందు సృష్టించి అప్పుడు కవితలోకి తీసుకెళ్తుంది మెర్సీ. ఇది మంచి శిల్పం అయితే, అక్కడితోనే ఈ కవిత ఆగిపోదు.  ఇందులో మెర్సీ నిబద్ధతని చెప్పే వాక్యాలు చాలా వున్నాయి. ప్రశ్నల గదిలోకి ఎందుకు వెళ్ళాలి అన్న ప్రశ్న వెనక మెర్సీ చూపించిన rationalization  ఈ కవితకి మూల బిందువు.

కవి వ్యక్తిత్వాన్ని- అది సొంతమైనా, కవిత్వమైనా- ఆమె వెతుకులాటతో మాత్రమే సరిగా measure చేయగలమని అనుకుంటాను. అన్నట్టూ, వెతుకులాట అంటే మళ్ళీ ఇప్పటికీ ఇస్మాయిల్ గారి కవితే గుర్తొస్తుంది.

నింగి దేనికోసం
వంగి వెతుక్కుంటుంది?
నేల దేనికోసం
నీలంగా సాగుతుంది?
కాసార మెవరికోసం
కన్నార్పక చూస్తుంది?
ఆకలి దప్పులు లేని గాలి
వాకిళ్ళనెందుకు తెరుస్తుంది?
బొడ్డులో కన్ను తాపుకుని
బావి ఏమి గాలిస్తుంది?
ఒక్క చోటనే చెట్టు నిత్య
మెక్కడికి ప్రయాణిస్తుంది?

ఇస్మాయిల్ గారు ఈ కవితలో చెప్పిన భిన్న స్తితులకు కవి గానీ, కవిత్వ సృజన గానీ  ఏ మాత్రం భిన్నం కాదు. ఇందుకవితని లో ఇస్మాయిల్ గారు అడుగుతూ వెళ్ళిన ప్రశ్నలకి ఈ కాలంలో ఈ క్షణంలో నేను మెర్సీ “ప్రశ్నల గది” కవితని వొక సమాధానంగా చూస్తున్నా.

అన్ని సమాధానాలూ  దొరుకుతాయన్న హామీ లేదు జీవితంలోనూ, కవిత్వంలోనూ!

వెతుకులాట ఎక్కడో వొక చోట ఆగిపోతుందన్న హామీ అంతకంటే లేదు. అయితే, కవిత్వం వొక హామీ ఇస్తుంది. జీవితంతో ఉద్వేగ బంధాన్నిస్తుంది. ఎడరతెరపి లేకుండా ప్రశ్నించే సహనాన్నిస్తుంది. ఈ  మూడింటి కోసమే మనం కవిత్వాన్ని ఇంతగా ప్రేమిస్తాం. నమ్ముకుంటాం. చాలా కవితల్లో మెర్సీ కవిత్వ పుట్టుక గురించీ, నడక గురించీ ఆలోచించడం కనిపిస్తుంది. కవిత్వాన్ని  వొక savior గా నమ్మినప్పుడు మాత్రమే ఈ ఆలోచన ఇన్ని రూపాల్లో కనిపిస్తుంది. ఇలాంటి నాకు బాగా నచ్చిన సందర్భం- “కవులు-కాగితం” అనే కవిత. చాలా తేలికగా వుండే కవిత ఇది. కాని, బరువైన ఆలోచనని దాచుకున్న కవిత.

అవును,

కవులు కాగితాలపై కలుస్తారు

సగం దూరం ప్రయాణించిన తరువాత

బాటసారుల్లా కొందరు

 

నదుల్లా వెంటాడుతూ, మనతో

మన ఆలోచనల్లో

ఇంకొందరు

కవిత్వాన్ని గురించి ప్రతి కవీ తనదైన వూహ చేయకుండా ఉండడు. ఆ ఊహని చదువరి కోణం నించి చేయడం ఈ కవితలో విశేషం. కవీ, చదువరీ వొకే దారిలో వెళ్తూ కూడా రెండు వేర్వేరు ప్రపంచాల్లో బతుకుతారు. అంటే రెండు  వాక్యం చదువుతూ కూడా భిన్నమైన వూహల్లో తమని తాము నిలబెట్టుకుంటారు. ఆ రెండు వూహలూ నిజమే. వాటిని ఇద్దరూ సమానంగా value చేయగలిగినప్పుడే కవిత ఇద్దరి మనసుల్లోనూ బతుకుతుంది, లేదా నిలిచి వుంటుంది. కొన్ని సార్లు అంతకు ముందు అనుకున్న వాటిని కొట్టివేసే సహనమూ వున్నప్పుడే ఇది అర్థవంతమైన ప్రయాణం అవుతుంది.

మెర్సీ అంటుంది:

పునర్లిఖించుకోవాలి

నన్ను నేను

పాత మాటలకు నిర్దాక్షిణ్యంగా కత్తెర వేసి

ఇప్పటి నేనుగా కొత్త ఆసనమేసి

పాత పాళీకి కొత్త మాటలు అభ్యాసం చేయించి…

ఇదంతా ఆ  అర్థవంతమైన ప్రయాణంలో భాగమే. ఈ ప్రయాణానికి అర్థం వుంది అనుకున్న తరవాత మెర్సీ యెన్ని కవిత్వ దూరాలు వెళ్లిందో అక్కడల్లా తన footprints లాంటి వాక్యాల్ని ముద్రించి సాగిపోయింది.

 

2

వెతుకులాటే కవిత్వం ఉనికి అనుకుంటే, వెతికి సాధించేది కాదు, వెతుక్కుంటూ వుండడమే కవిత్వం.

ఈ కవితా సంపుటి చదువుతున్నప్పుడు మెర్సీ ఎన్ని వ్యక్తిగత, సామూహిక అనుభవాలు తన కవిత్వంలో రికార్డు చేసిందో చూస్తే, కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆమె తన ఏకాంతపు గాఢమైన అనుభూతిని ఎంత చెప్పిందో, సామూహికంగా తన అస్తిత్వాన్ని అంతే వివరంగా చెప్పుకుంటూ వెళ్ళింది.

వొక కవితలో తనే చెప్పుకున్నట్టు:

తడిమే ప్రతి చూపులో

వినే ప్రతిమాటలో నూత్న వెలుగుతో

నన్ను నేను కాల్చుకోవాలి

కాల్చుకోవడం అనేది ఇక్కడ తపనకి పరాకాష్ట. స్త్రీవాదం ఎక్కడో వొక చోట ఆగిపోవాలని ఎదురుచూస్తున్న వాళ్లకి నిరాశా, వొక షాక్ ఇచ్చేట్టుగా మెర్సీ తనలోని స్త్రీచైతన్యంతో రాసిన కవితలు ఇందులో చాలా వున్నాయి. Feminine sensibility,  gendered identity అనేవి సిద్ధాంతపు గోడలు దాటి అనుదిన జీవితంలోంచి నేరుగా కవిత్వంలోకి ప్రవేశిస్తే ఎలా వుంటుందో చెప్పే ఉదాహరణలు ఈ కవిత్వంలో కనిపిస్తాయి. “విత్తనపు వీర్యం ఆడా? మగా?” లాంటి కవితలు వొకానొక ఉదాహరణ మాత్రమే.

సామూహక అస్తిత్వం అనేది గట్టిగా వినిపించే ప్రతి వర్తమాన సందర్భాన్నీ మెర్సీ కవిత్వం చేసింది. “అమానత్ స్వరం” కవిత చూడండి –ఈ కవిత కొంత వాచ్యం అయిన మాట నిజమే కాని, ఇందులో వినిపిస్తున్న ఘోష మన గుండెల్ని పిండేస్తుంది.

ఇప్పుడు

కన్నీరు కార్చి అయ్యో అనకండి

మా అక్కో చెల్లో తల్లో కాదని

తప్పుకుపోకండి

తల్లిదండ్రులారా,

వీలయితే మీ కొడుకులను స్త్రీలను గౌరవించడం

నేర్పండని

ఎలుగెత్తి ఏడుస్తూ ఘోషిస్తుంది

అమానత్ స్వరం!

ఇందులో కవిత్వం ఏముందన్న ప్రశ్నకి ముందే ఈ వాక్యాలలోని విసురూ, ఆవేశం మనల్ని చుట్టుముడ్తాయి. దీన్ని ఇంగ్లీషులో అయితే attitudinal poetry అనవచ్చేమో! కేవలం వొక attitude చెప్పడం వరకే ఆ కవిత పని. ఇవి మెర్సీ మామూలుగా రాసే కవితలకి భిన్నంగా వుంటాయి. మామూలుగా మెర్సీ కవిత్వంలో వుండే సాంద్రతా, imaginary coherence, symbolic integrity వంటివి వీటిలో కనిపించవు. “కాల్చుకోవాలి” అన్న క్రియని మెర్సీ ఇంతకు ముందు వొక కవితలో వాడింది. అలాంటి అత్మదహన ప్రక్రియ ఈ attitudinal poetry లో కనిపిస్తుంది. తనలోని వొక ఆవేశాన్ని తక్షణమే చెప్పాలన్న తపన నిలవనీయనప్పుడు కవి అసలు తన లోపల సాగుతున్న అంతర్యుద్ధాన్ని యింకా విడమరచి చెప్పలేని వూపిరాడనివ్వని స్థితిలో రాసిన కవితలు ఇవి.

3

కవిత్వంలో ఇది మెర్సీ తొలి అడుగు.

కాని, ఇందులో చాలా కవితలు ఆమె ఆలోచనా పరిపక్వతనీ, కవిత్వ శిల్ప పరిణతినీ చెప్తాయి. కొన్ని కవితలు తొందరలో రాసినట్టనిపించి కొంచెం అసంతృప్తి కలిగిస్తాయి కూడా – బలమైన కవితలు ఎక్కువ వుండడం వల్ల అలాంటి బలహీనమైన కవితలు తేలికగా మన మనః ఫలకమ్మీంచి జారిపోతాయి.

వస్తుపరంగా మెర్సీ ఇంకా విస్తృతిని సాధించవచ్చు అనిపిస్తుంది. తెలుగుసాహిత్యంలో క్రైస్తవ జీవన అస్తిత్వం అంతగా ప్రతిబింబించిన దాఖాలాలు లేవు. ఈ దిశగా కవిత్వంలో విల్సన్ సుధాకర్, కథల్లో వినోదిని చేస్తున్నలాంటి కృషికి తగినంత కొనసాగింపు లేకపోవడం పెద్ద లోపం. మెర్సీ కొన్ని కవితల్లో ఆ ప్రయత్నం చేసింది కాని అది ఇంకా బలపడాల్సిన అవసరం వుంది. తనదైన జీవితం నించి తెచ్చే ఏ అనుభవమైనా – అది కొంత వాచ్యం అనిపించినా కూడా- ఇప్పుడు చాలా అవసరం.

మెర్సీ మలి అడుగు అటు వేపు పడాలని కోరుకుంటున్నా.

-అఫ్సర్

ఆగస్టు 17, 2014.

 

 

 

 

 

మీ మాటలు

 1. సర్ , ఎప్పట్లాగే మీ వచనం ఓ సరికొత్త పాఠం లా …..

 2. Thanks for your support and blessings afsar sir…

 3. narayana sharma says:

  మెర్సీ మార్గరేట్ కవయిత్రిగా తొలి ప్రయత్నానికి మేలిమి పరిచయం..శుభాకాంక్షలు

 4. Delhi Subrahmanyam says:

  అఫ్సర్ గారూ, మీరు మెదైన ప్రత్యేక సయిలి లో మెర్సి కవితలని చాలా చక్కగా పాఠకులను చదివే లాగా ప్రోత్సహించే పరిచయం చేశారు. రేపు (23 ఆగష్టు న) ఈ కవితా సంకలన ఆవిష్కరణ హుందాగా జరగాలని నా శుభాకాంక్షలు. మెర్సి కి అభినందలతోపాటు శుభాకాంక్షలు.

 5. Dr. Vani Devulapally says:

  అఫ్సర్ గారూ! మీ సమీక్ష ఎప్పటి లానే బావుంది . మెర్సీ గారికి అభినందనలు !

 6. syed sabir hussain says:

  కవయిత్రి మెర్సీ మార్గరెట్ గారికి, అద్భుతమైన సమీక్షతో ప్రోత్సహించిన కవి అఫ్సర్ గారికి అభినందనలు.

మీ మాటలు

*