‘బొమ్మ’ ఏ సక్సెస్ స్టోరీ  (part – 1)

 

భువన చంద్ర

 

bhuvanachandra (5)నంబర్ వన్ సినిమా.. టేబుల్ ప్రాఫిట్. బయ్యర్లకి అద్భుతంగా నచ్చింది. నిర్మాతకి రిలీజుకి ముందే లాభాల్ని తెచ్చిపెట్టింది. ఇంకేం కావాలి? ప్రివ్యూ షోలు వేశారు. చూసినవాళ్లకి మతిపోయింది. ఓ కొత్త డైరెక్టర్. ఓ సీనియర్ డైరెక్టర్ దగ్గర ఎన్నాళ్లో పని చేశాడు. అంతే!! కానీ అతని ఫస్ట్ పిక్చర్ టేకింగ్ చూసి అవాక్కయ్యారు సినీ జనాలు.

థియేటర్లో మాత్రం ‘క్లాస్’ టాక్ వచ్చింది అంటే కమర్షియల్‌గా ఫ్లాప్ అన్నమాట. చూసిన ప్రతీ ప్రేక్షకుడు”ఓహో!” అన్నాడు. కాని జనాలు ఎగబడలేదు. వాళ్లకి కావల్సినది అందులో వున్నా, తక్కువ మోతాదులో వుంది. మానవత్వం పాలు మాత్రం చాలా ఎక్కువగా ఆలోచింపచేసేంత వుంది.

“మాకు కావల్సింది  ఎంటర్‌టైన్‌మెంట్. మానవత్వమూ, మట్టిగడ్డలూ కాదు” ఓ సమీక్షకుడు  ఓపెన్‌గా చెప్పిన మాట ఇది. కమర్షియల్ సినిమాని ద్వేషించేది ఇతనే.

” ఈ కుర్రాళ్లంతా ఇంతే. సినిమా అంటే వినోదాన్ని ఇవ్వాలి గానీ, నీతిబోధలెందుకూ?”అన్నాడో సీనియర్ పాత్రికేయుడు. ఆ సినిమానీ, దర్శకుడ్నీ ఆకాశానికెత్తింది అతనే.

నవ్వుకున్నాడు ‘సారధి’. అతనే ఆ సినిమా డైరెక్టరు. ఓడలు బళ్ళూ, బళ్లు ఓడలూ అవుతాయన్న సామెత వినడమే కానీ ఇంత క్విక్‌గా క్షణాల మీద మారిపోతాయని అతను కలలో కూడా వూహించలేదు.

‘సినిమా అద్భుతం  కానీ ప్రేక్షకులు కరువయ్యారు.’ ఇదేమి కామెంటూ? ఈ కామెంటు ఈనాడు  ఉంది… “సినిమా సూపరు.. కలెక్షన్లే నిల్లు’ అని.

ఫస్ట్ ఎటెంప్ట్‌తోనే అన్ని ఏరియాలూ అమ్ముడుపోయాయని తెలిసిన రోజున కనీసం పదిమంది పెద్దా చిన్నా ప్రొడ్యూసర్లు సారధి వెంటపడ్డారు. ఓ పెద్ద నిర్మాత అయితే ఏకంగా ‘బ్లాంక్ చెక్’ ఇచ్చాడు. సారధి ఏమాత్రం తొందరపడలేదు.

‘సినిమా రిలీజయ్యాక చూద్దాం. అంతే కాదు. కథ రెడీ చేసుకోకుండా బ్లాంక్ చెక్ ఎలా తీసుకోనూ’ అని సున్నితంగా తిరస్కరించాడు. సిన్సియర్‌గా ఉండటం గొప్ప విషయమే. కానీ సారధిని అదే ముంచింది.

సినిమా ‘టాక్’ బాయటికి రాగానే తుపాకీగుండు శబ్దం విని ఎగిరిపోయే కాకుల్లాగా ప్రొడ్యూసర్లు ఎగిరిపోయారు. “నా రెండో సినిమాకి నువ్వే డైరెక్టరువి” అన్న మొదటి సినిమా నిర్మాత కూడా మొహం చాటేశాడు. రాజ్ కపూర్ పాటలో ఓ లైనుంది. “హీరోసే జోకర్ బన్‌జానా పడ్‌తా హై” అన్నట్టు నిన్నటిదాకా పరిచయం కోసం ఎగబడ్డ క్షణమాత్ర అభిమానులంతా ఇవాళ మొహం మీదే “ఏంటి గురూగారు  పిక్చర్ పోయిందంటగా..!” అని ఎగతాళిగా అడుగుతుంటే సారధి అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు.

*****

“ఎన్నాళ్లిలా ఇంట్లోనే కూర్చుంటారూ..” అనునయంగా అన్నది భార్య. “నా మీద నాకు నమ్మకం కుదిరి జనాన్ని పిచ్చెక్కించే  స్క్రిప్టు తయారయ్యేవరకు…! “నవ్వుతూనే అన్నాడు సారధి. ఆ నవ్వులో ‘కసి’ వుంది. “అంటే?” అయోమయంగా అన్నది భార్య. నేనో గొప్ప సినిమా తియ్యాలనుకుంటున్నాను. తీశాను. రిలీజ్‌కి ముందే నిర్మాతకి లాభం తెచ్చి పెట్టిన సినిమా అది. ప్రేక్షకులకి నచ్చలేదు. కారణాలు లక్ష వుండొచ్చు. కానీ నేను తీసిన సినిమా మాత్రం నిజంగా మానవత్వంతో కూడిన గొప్ప సినిమా. ఆ సినిమా గురించి ఎవరేమన్నా, అనుకున్నా నిజం నిజమే. అదీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నది గొప్ప సినిమా గురించి కాదు. ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ థియేటర్‌కి రప్పించే సినిమా గురించి” వివరించాడు సారధి. చాలా కాలం తరవాత వీడిన మౌనం అది. ఏడాది గడిచింది. రెండేళ్లు గడిచాయి. జనలు సారధిని మరిచిపోయారు. జనాలు అంటే ఇక్కడ ప్రేక్షకులని అర్ధం కాదు. సినీజనాలు. ఆదాయం పొలం మీద వచ్చేది కొంచెమే అయినా సునీతి అంటే సారధి భార్య గుంభనంగా సంసారాన్ని నెట్టుకొచ్చింది. మూడేళ్లు దాటాక అవకాశం వచ్చింది సారధికి, వెతుక్కుంటూ… ఓ NRI సారధి తీసిన సినిమాని చూసి ఇంప్రెస్ అయి వెతుక్కుంటూ ఇంటికొచ్చాడు.

“సార్, మీ సినిమా చూశాను. అది ఓ మేధావి మాత్రమే తీయగల సినిమా. నాకెందుకో సినిమాలంటే చిన్నప్పటినించి పిచ్చి. నన్ను నేను నిర్మాతగా చూసుకోవాలన్న ఆత్రంతోటే అమెరికా వెళ్లాను. కడుపు కట్టుకొని సంపాయించాను. ఇప్పుడు రెండు కోట్లు పోయినా నాకొచ్చే నష్టం లేదు. కనుక మీరు నాకో సినిమా తీసిపెట్టండి. కథ గురించి నేను అడగను. రెమ్యూనరేషన్లూ అవీ ఎవరికి ఎంతో నాకు తెలీదు. ఇదిగో రెండు కోట్లకి విలువైన చెక్ బుక్. ఒక్కో చెక్ మీద పదిలక్షల చొప్పున ఇరవై చెక్కులు వున్నై. సినిమా తీసేటప్పుడు మాత్రం నేను మీ పక్కనుండాలి. అంతే. నేను ఏ విషయంలోనూ జోక్యం చేసుకోను. సినిమా నిర్మాణం గురించిన అవగాహన కోసం నేను మీ పక్కన వుండాలనుకుంటున్నాను. అదీ మీకు ఇష్టం అయితేనే..” అంటూ చెక్ బుక్ సారథి చేతిలో పెట్టాడు.

చిన్నగా నవ్వాడు సారధి. “నేను ఫ్లాప్ సినిమా డైరెక్టర్ని. జనాలు నన్ను మర్చిపోయారు. కానీ, మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. థాంక్యూ. సరిగ్గా రెండు నెలల తరవాత ఇదే చెక్‌బుక్‌తో రండి. కథ సిద్ధంగా వుంటుంది. “షేక్‌హాండ్ ఇచ్చి అన్నాడు. అతను ఆనందంగా “ముందుగా ధన్యవాదాలు అందుకోండి. 2 నెలల తరవాత కలుస్తా” అని వెళ్లిపోయాడు.

painting: Rafi Haque

painting: Rafi Haque

“అదేంటండి.. ఆయన పేరు కూడా అడగలేదు?” ఆశ్చర్యంగా అన్నది సునీతి.

“కథ సిద్ధంగానే వుంది. డైలాగ్స్‌తో సహా సిద్ధం చేయడానికి టైం అడిగాను. అతను వచ్చి నా మీద నాకున్న నమ్మకాన్ని వందరెట్లు పెంచాడు. అతని అసలు పేరు ఏదైనా నేను మాత్రం అతన్ని ‘విశ్వాసం’ షార్ట్‌కట్ విశ్వం అంటాను..” గలగలా నవ్వాడు సారధి మూడేళ్ళ తరవాత. సునీతి పొంగిపోయింది. గబగబా చేతి గాజులు తాకట్టు పెట్టి రెండు మంచి డ్రెస్సులూ, ఓ పది బాల్ పెన్నులూ, స్క్రిప్టు వ్రాయడానికి A4 కాయితాల కట్టలూ, ఓ టేబుల్ లైటూ మొదలైన సరంజామాతో పాటు అతనికి ఇష్టమైన పిండి వంటలు చేసింది. సారధి కళ్ళల్లో చెమ్మ.

 

*****

“ఇదిగో అయిదువేలు ఎడ్వాన్సూ. డైలాగ్స్ నువ్వే రాస్తున్నావు!” రమణ చేతికి కాష్ ఇచ్చి అన్నాడు సారధి. ఆ అయిదువేలూ భార్యవి. గాజులు తాకట్టు పెట్టిన బాపతువి.

కన్నీళ్లతో రమణ సారధిని కౌగిలించుకుని “థాంక్యూ సారధీ.. స్నేహానికి విలువిచ్చే నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. ప్రాణం పెట్టి డైలాగులు రాస్తా..” అన్నాడు.

సారధి , రమణ, గుప్త, శీనూ వీళ్లంతా ఒకప్పుడు రూంమేట్స్. ఒక్కోసారి డబ్బుల్లేక ఒకే దోశని నలుగుతూ పంచుకు రోజులున్నాయి. భగవతి మెస్ వాడు దయామయుడు. హార్లిక్స్ బాటిల్ నిండా సాంబారు ఇచ్చేవాడు.

ఇక్కడ ఓ విషయం చెప్పక తప్పదు. T.Nagar  కోడంబాకం సినిమావాళ్లకి నిలయాలు. గీతా కేఫ్, బాలాజీ కేఫ్, డబ్బులున్న సమయాల్లో స్వాగతిస్తే  టి.నగర్ పోస్టాఫీస్ దగ్గరుండే తోపుడుబండి హోటల్సు (వాటినే ‘కయ్యేంది’ భవన్లంటారు సరదాగా) సామాన్య సినీనటులకి రాజప్రాసాదాలు. రూపాయికి నాలుగిడ్లీలు ఆ రోజుల్లో. భగవతి హోటల్ సంగతి చెప్పక్కర్లా. హోటల్ చాలా చిన్నది. బిజినెస్ మాత్రం లెక్కలేనిది. నూటికి అరవై సినిమాలకి టిఫిన్ సప్లైలు అక్కడినించే. ఆ హోటల్ ఎదురు సందులోనే ‘మలర్‌కొడి’ మాన్షన్ వుండేది. 30 గదులు, 3 అంతస్థులు. అన్ని గదుల్లో 8/8. అద్దె నెలకి 400. సందు మొదట్లో మహా రచయిత ఆరుద్రగారి ఇల్లు, ఆయన అపురూపమైన లైబ్రరీ.

ఇహ తెలుగువాళ్లు. ఇంక్లూడింగ్ సినీ నటీనటుల అడ్డాలు రెండు. ఒకటి రాణీ బుక్ సెంటర్. రాణీగారు ఎంత కలివిడి మనిషి అంటే ఏ కష్టం వచ్చినా మొదట గుర్తొచ్చేది ఆవిడే. ఎడంచేతికి తెలీకుండా కుడిచేత్తో ఎంతమందిని ఆదుకున్నారో నాకూ తెలుసు. పుస్తకాలు దొరకాలంటే అక్కడే. ఫలానా పుస్తకం అని అడిగితే చాలు ఎక్కడినుంచైనా సరే తెప్పించి మరీ ఇస్తారు. అట్లూరి అనిల్ వారబ్బాయే.

రెండో అడ్డా పానగల్ పార్కు దగ్గర స్టాండర్డ్ ఎలక్ట్రికల్స్ ముందరున్న ప్లాట్‌ఫాం. అక్కడే డాక్టర్ గోపాలకృష్ణగారు ఉండేవారు. టీకి డబ్బులు లేవని బాధపడక్కర్లా. ఎవరొచ్చినా ఆయన స్వయంగా పక్కనున్న టీ కొట్లోంచి టీ పట్టుకొచ్చి ఇచ్చేవారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే వీళ్లు నలుగుతూ మలర్‌కొడి మేన్షన్‌లో ఓ గదిలో వుండేవారు. నేనూ అక్కడే (కొన్నాళ్ల తరవాతే అనుకోండి) వుండేవాడ్ని రూం నంబర్ 34.

“ప్రాణం కాదు రమణా. అడుగడుగునా హాస్యం వుండాలి. ఆలోచించు. ప్రతీ డైలాగు ఓ శ్వాసలాంటిది మనకి” భుజం తట్టి అన్నాడు సారధి. రమణలో పిచ్చి స్పార్క్ వుందని సారధికి తెలుసు. ఫుడ్‌కి లాటరీ కొట్టేటప్పుడు వాళ్ల పొట్టలకి అతని ‘మాట’లే ఆహారంగా  మారేవి. అతి సున్నితమైన హాస్యం అతని ప్రతి మాటలోనూ తొణికిసలాడేది. మొదటి సినిమా సమయంలో రమణ తండ్రి పోవడంతో వేరేవాళ్లచేత డైలాగ్స్ రాయించాడు. ఇప్పుడు యీ కథకి సరైన సంభాషణలు రమణ మాత్రమే రాయగలడని సారధికి ఖచ్చితంగా తెలుసు. శీనూ, గుప్తా అసిస్టెంటు డైరెక్టర్లు.  “ఫ్రెండ్స్ మీ ఎడ్వాన్సులు నిర్మాత వచ్చిన రోజే ఇస్తాను. అప్పటివరకూ చెరో వెయ్యి.” అని తలో వెయ్యి రూపాయలు ఇచ్చాడు. అదీ గాజుల పుణ్యమే.

యజ్ఞం  మొదలైంది. పొద్దున ఆరింటికి మొదలైతే అర్ధరాత్రి వరకు స్క్రిప్ట్ మీదే. హోటల్‌నించి తెప్పించేంత డబ్బులేదు. సునీతి వంటమనిషి అవతారం ఎత్తింది.

చిత్రంగా రెండు నెలల  తరవాత వస్తానన్న నిర్మాత పదిహేను రోజుల ముందే వచ్చాడు.  మిరకిల్స్ జరుగుతాయి. స్క్రిప్టు వర్క్‌లో అతనూ పాలు పంచుకున్నాడు. కురుక్షేత్రాన్ని ఏం వర్ణిస్తాం? యుద్ధాన్ని చూసినా అర్ధం కాదు. పాలుపంచుకుంటేనే అంటే సైనికుడిలా యుద్ధం చేస్తేనే అసలు విషయం అర్ధమవుతుంది. ఆ నిర్మాత పేరు రాఘవ చెరుకూరి. వచ్చిన రెండో రోజునే యజ్ఞవాటిక “బృందావన్” హోటల్‌లోకి మారింది. అది మధ్యతరగతివాళ్లకి ప్రియమైన హోటల్. రూములు కొంచెం పెద్దవే. అద్దె రోజుకి ఎనభై రూపాయలు. రాఘవ ‘సవేరా’ హోటల్ని ప్రిఫర్ చేశాడుగానీ సారధి ఒప్పుకోలేదు. “రాఘవగారూ మాకు ఇది చాలు. ఆలోచించడానికి ఇది సరిపోతుంది. ఆలోచించి, ఆలోచించి బుర్ర వేడెక్కితే తిరగడానికి పాండీబజారుంది. సరికొత్త ఆలోచనలు పుట్టుకొచ్చేది  ఈ రోడ్డు మీదే. ఎందరు మహారచయితలూ, దర్శకులూ, నటీనటులూ అక్కడ తిరిగారు. అదో ఆ గీతా కేఫ్‌లోనే రోజు ఘంటసాలగారు ఇడ్లీ తిని కాఫీ తాగేవారు. అదిగో ఆ చెట్టు కిందే సి.యస్.ఆర్‌గారూ కారు పార్కు చేసి దాన్ని ఆనుకుని నిలబడి స్టైలుగా సిగరెట్లు కాల్చేది. అదిగో ఆ  పానగల్ పార్కులో మల్లాది వారి సిమెంటు బెంచీ. ఓహ్.. యీ ఇన్స్పిరేషన్ స్టార్ హోటల్లో ఎలా దొరుకుతుందీ?” అని నవ్వాడు.

అదో అద్భుతమైన పాఠం అనిపించింది రాఘవ చెరుకూరికి. ఆ క్షణం నించే సారధిని ‘గురువుగారూ’ అని పిలవటం మొదలెట్టాడు. చిన్న చిన్న వేషాలు వేసే  ఓ నటుడ్ని హీరోగా బుక్ చేశాడు సారధి. అతనికి తగ్గట్టు సంభాషణల్ని కూడా మార్చారు. యజ్ఞంలో ఆ  యువకుడూ పాల్గొనడం మొదలైంది. కారణం ‘హీరో’ అవకాశం వస్తుందని జీవితంలో ఏనాడూ ఆతను అనుకోలేకపోవడంచేత. హీరోయిన్ కొత్త. కేరక్టర్ ఆర్టిస్టులు మాత్రం పాతవాళ్లూ, సారధి మీద నమ్మకం వున్నవాళ్ళూ. స్క్రిప్టు ‘బౌండ్ బుక్’గా మారింది. విజయా గార్డెన్స్‌లో విఘ్నేశ్వరుడి ముందు షూటింగ్ నిరాడంబరంగా ప్రారంభం అయింది. ప్రతీ డైలాగూ ఓ పంచ్ డైలాగే. రమణ మాడ్యులేషన్‌తో సహా నటీనటులకి తర్ఫీదిస్తే సారధి నటించి చూపించేవాడు. ముప్పై అయిదు రోజుల్లో గుమ్మడికాయ కొట్టేశారు (అంటే షూటింగ్ పూర్తయిపోయిందన్నమాట.) పగలూ, రాత్రీ లేకుండా ఎడిటింగ్, రీరికార్డింగ్ నెలరోజుల్లో పూర్తయ్యాయి. ఫస్ట్ కాపీ ‘గుడ్‌లక్ థియేటర్’లో చూశారు. ( ఈ గుడ్‌లక్ థియేటర్ జి.వి గారిది. అంటే ద గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం అన్నగారిది. ఇప్పటికీ వుంది. అక్కడ ప్రివ్యూ వేస్తే లక్ అని చాలా మందికి నమ్మకం. నిజం కూడా). ప్రస్తుతం దాని పేరు 4 ఫ్రేమ్స్)

యూనిట్ వాళ్లు మాత్రమే చూశారు కుటుంబాలతో. హిలేరియస్. సాధారణంగా సిగ్గరి అయిన సునీతి  సినిమా పూర్తయ్యి లైట్లు వెలగగానే ఆనందంగా సారధిని కౌగిలించుకుంది. ఆ అపూర్వదృశ్యానికి అందరూ చప్పట్లు కొడితే మైమరపులోంచి ఇవతలపడ్డ సునీతి సిగ్గుల మొగ్గ అయింది.

“గురువుగారూ! ఇది హిట్ కాదు. సూపర్ డూపర్ హిట్” సారధి కాళ్లకి నమస్కారం చేసి అన్నాడు రాఘవ చెరుకూరి. డబ్బు అతని చేతిమీదుగానే ఇప్పిస్తూ ఉండటంతో అతనికి తెలుసు సారధి ఒక్క పైసా కూడా రెమ్యూనరేషన్‌గా తీసుకోలేదని. అంతే కాదు సునీతి రాళ్ల నెక్లేసూ, మూడు గొలుసులూ, చెవి దిద్దులూ ఆఖరికి నాంతాడు మాయమై మెడలో పసుపు కొమ్మ కట్టిన నల్లపూసల తాడు మాత్రమే వునందాన్న విషయాన్ని స్పష్టంగా గుర్తించాడు. ఒక కోటి ఎనభై లక్షల్లో పిక్చర్ పూర్తయింది. మిగిలిన ఇరవై వేలూ రాఘవ దగ్గరే వున్నాయి. ప్రతీదానికి రసీదులు వున్నాయి. ఫైనాన్సు వ్యవహారాలన్నీ అతని చేతిమీదుగానే నడిచాయి.

సినిమా వాళ్లంత భోళా మనుషులు ఎక్కడా కనిపించరు. ముఖ్యంగా ‘టెక్నీషియన్లు’. వాళ్ల పని వాళ్లదే తప్ప మిగతా విషయాలు వాళ్లకి పట్టదు. ‘టెక్నీషియన్స్’ రాజకీయాలు నడపరు. ‘టాక్’ బయటపడింది.

రీరికార్డింగ్‌లో పాల్గొన్న ప్రతీ మ్యూజీషియనూ సారధి సరికొత్త సినిమా “వసంతమా.. నువ్వే నా ప్రాణం” సినిమా సూపర్‌గా వుందనీ, ప్రతీ పాటా, ప్రతీ మాటా ఆణిముత్యమనీ ఫ్రెండ్స్‌లో చెప్పడంతో మౌత్ పబ్లిసిటీ వచ్చింది. సినిమా చూసిన టెక్నీషియన్ల కుటుంబాలు చేసిన మౌత్ పబ్లిసిటీ పాండీబజార్లో మోగిపోయింది. సినిమా రాత్రి 9 గంటలకి పూర్తయితే రాత్రి 10.30 నించే బయ్యర్ల నించి ఫోన్లు .. పిక్చర్‌ని కొనడానికి సిద్ధంగా వున్నామనీ,కలవడానికి టైం చెప్పమనీ. ఉక్కిరిబిక్కిరైన రాఘవ సారధి ఇంటికొచ్చి విషయాన్ని చెబితే సారధి ఒకటే మాట అన్నాదు. “వెయిట్ చేద్దాం రాఘవగారూ. ఒక్కరోజు ఆగుదాం. అన్నట్టు రేపొద్దున్నే మీరొస్తే ఇద్దరం ‘ముప్పత్తమ్మ’గుదికి వెళ్ళొద్దాం. కొబ్బరికాయ కొడతానని మొక్కుకున్నాను” అని.

‘ముప్పత్తం’ గుడిలో మొక్కుకుంటే, ఫలితం వెంటనే వస్తుందనీ, కోరుకున్నది జరిగి తీరుతుందనీ నమ్మకం. ఇప్పటికీ ఆ గుడికి రష్ ఎక్కువే. ఇంకో గుడి మా వలసరవాకంలో వున్న ఆంజనేయర్ కోవిల్.

మొక్కు తీర్చుకున్నాక రమణ, శీను, గుప్త, రాఘవ, సారధి అందరూ సారధి ఇంట్లోనే టిఫిన్ చేశారు. సునీతి కొసరి కొసరి తినిపించింది. తగ మూడేళ్లుగా భర్త మౌనంతో భారమైన ఆమె హృదయం నిన్న రాత్రి సినిమా చూశాక ఒక్కసారిగా రెక్కలు విప్పుకుని , ఆకాశంలో ఎగురుతున్న రాజహంసలా మారింది. ఉప్మా, ఇడ్లీ, గారెలు, ఆవడ సమస్తం ఆమె స్వయంగా చేసినవే.

రాఘవ ఆమెని గమనిస్తూనే వున్నాడు మూడున్నర నెలలుగా. రోజురోజుకీ ఆమె అంటే అతనికి గౌరవం పెరుగుతూనే వుంది. ప్రశాంతమైన మొహం అన్నం పెట్టినా, ఆఖరికి మంచినీళ్లు ఇచ్చినా అందులోని ఆప్యాయతా, ఆదరణా అతని మనసుని కట్టి పడేసేవి. అందర్నీ ఒకేలా చూసేది. టిఫిన్ అయ్యాక అప్రయత్నంగానే ఆమె పాదాలకి నమస్కరించాడు రాఘవ.

ఆడాళ్లు  పిల్లల్ని కనడంతో ‘తల్లు’లవుతారు . అంతే ‘మాతృత్వపు’ పరిధి వేరు. అది ‘అమ్మ’దనం. అందర్నీ బిడ్డలుగా చూడగలగడం. ఆ అమ్మదనం (మాతృత్వం) నిండుగా ఉన్నది గనకే థెరెసాని ‘మదర థెరెసా’ అని ప్రేమతో పిలుచుకున్నాం. ఆ మాతృత్వం ఆమె అణువణువునా వున్నది గనకే జిల్లేళ్ళమూడి అమ్మనీ ‘అమ్మ’ అని నోరారా పిలిచాం. అంతెందుకూ, పుట్టిన క్షణం నించి మరణించేవరకూ యీ నేల తల్లిని ‘మదర్ ఎర్త్’ గానే పిలుచుకుంటున్నాం. చివరికి ఆమె ఒడిలోనే ఒరిగిపోతున్నాం. అలిసిన శరీరాలకి ఆమె ఒడిలోనే విశ్రాంతినిస్తున్నాం. సునీతి టిఫిన్ పెట్టాక అలాటి భావనే కలిగింది రాఘవకి. “అయ్యయ్యో… అదేమిటి రాఘవగారూ” అని ఖంగారూ, బిడియంతో అన్నది సునీతి.

“అమ్మా సారధిగారు సాగరమైతే, మీరు స్వచ్చ గోదావరి. అందుకే నా వందనం” నోరారా అన్నాడు రాఘవ.

painting: Rafi Haque

*****

 

‘అయిదు కోట్లకి’ అమ్ముడయింది సినిమా. ప్రతి టెక్నీషియన్‌కీ రిలీజ్ ముందరే మాట్లాడుకున్నంత ఎమౌంట్ + అయిదు వేలు అప్రీషియేషన్ ఎమౌంటు ఇచ్చాడు రాఘవ. రమణకి లక్ష. శీనూ, గుప్తాలకి యాభైవేలు. ఇలా అందరూ ఆనందంతో పొంగిపోయేంత పారితోషికాలు ఇచ్చాడు.

మొదటిసారి అప్రెంటీస్‌లకీ, అసిస్టెంటు డైరెక్టర్లకీ ఎవరూ పెద్దగా రెమ్యూనరేషన్ ఇవ్వరు. తిండి ఖర్చులూ, ట్రాన్స్‌పోర్ట్ మొదలైన ఖర్చులూ పోనూ అయిదు వేలిస్తే గొప్ప. అట్లాంటిది వాళ్లకి యాభై వేలివ్వడం అంటే కుబేరుడు స్వయంగా వరం ఇవ్వడం లాంటిదే. రమణ అడ్వాన్సుగాక మరో పదివేలు ఎక్స్‌పెక్ట్ చేశాడు. లక్ష చేతికి రావడంతో కళ్లు తిరిగిపోయాయి. సారధికి మాత్రం రాఘవ ఏమీ ఇవ్వలేదు. సారధికి ఆ ఆలోచనే రాలేదు. అతని ఆలోచనంతా సినిమా రిలీజ్ మీదే. లక్షాతొంబై ఆలోచనలు.

మొదటి సినిమాకి ఇలాగే టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. కానీ థియేటర్లో బోల్తాపడింది. అచ్చం అలాగే కోటీ ఎనభై లక్షలకి తీసిన సినిమాని బయ్యర్లు షో లేయుంచుకొని చూసి అయిదున్నర కోట్లకి కొనేశారు.

పిక్చరు ఏ మాత్రం అటుఇటు అయినా తన పని జీవసమాధే. ఆపరేషన్ సక్సెస్ పేషంట్ డెడ్‌గా తయారవుతుంది. అతని టెన్షన్ సునీతికి తెలుస్తూనే వుంది. రాఘవకి కూడా. ఇద్దరూ సారధికి ధైర్యం చెబుతూనే వున్నారు. ఆగస్టు 17 రిలీజు . చిత్రం ఏమంటే ఆగస్టు 15న ఓ పెద్ద సినిమా రిలీజు కావల్సి వుంది. ఆగస్టు 22న చిరంజీవిగారి సినిమా రిలీజు. కారణం ఆ రోజు ఆయన పుట్టినరోజు.

రెండు పెద్ద సినిమాల మధ్య ఓ చిన్న చిన్న సినిమా నిలబడగలదా? నిలబడుతుందా? బయ్యర్లు పిచ్చ ధైర్యంతో వున్నారు.

“రాఘవగారూ, నేను ఆగస్టు 17న మద్రాసులో  వుండను. 18న కలుస్తా మిమ్మల్ని. ఐ జస్ట్ వాంట్ టు బీ అలోన్” అన్నాడు సారధి పదహారో తేదీ వుదయం 10 గంటలకి.

సునీతి వాళ్లిద్దరికీ ‘పొంగరాలు’ వడ్డిస్తోంది. సారధి మాట విని షాకైంది. సారధి ఆమె వంక జూసి , “కంగారు పడకు. ఒంటరిగా ఓ రోజు గడపాలని వుంది. నా మనసుకి రెస్టు కావాలి. 18న పొద్దుటికల్లా వస్తాను. టిఫిన్ ఇక్కడే అంటే మనింట్లోనే అరేంజ్ చెయ్యి. శీనూ, గుప్తా, రమణ, రాఘవ కూడా మనతోనే టిఫిన్ చేస్తారు” అని నవ్వాడు. సన్నగా నిట్టూర్చింది సునీతి. మనసులో మాత్రం అనుకుంది. “పిచ్చివాడా నీ కష్టం,నువ్వు పడుతున్న టెన్షన్ అన్నీ నాకు తెలుసు. కానీ యీ మూడేళ్ళ పైచిలుకులో నా మనసూ, శరీరమూ ఎలా వున్నాయో, ఏమైపోయాయో, ఎంత టెన్షన్‌ని భరించాయో నీకేం తెలుసూ. నీకెలా అర్ధమౌతుందీ?” అని

17 తెల్లవారుఝామున కారు అద్దెకి తీసుకుని ఒంటరిగా వెళ్లిపోయాడు సారధి..

 

*****

“తెలుగు సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం. ‘వసంతమా’ సినిమా. రెండు భారీ సినిమాల మధ్య రిలీజైంది. కానీ పది కోట్ల కలెక్షన్స్‌ని దాటుతుంది. అద్భుతంగా యీ సినిమాని తెరకెక్కించిన ఘనత ఒక్కరికే.. దర్శకుడు సారధికే దక్కుతుంది” నిష్పక్షపాతంగా రివ్యూలు రాసే ఓ ఇంగ్లీషు పత్రిక రివ్యూ ఇది. ఇండీన్ ఎక్స్‌ప్రెస్, డక్కన్ హెరాల్డ్, ఈనాడు, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ .. అన్ని పత్రికలదీ ఒకేమాట. ‘వసంతమా’ ఓ అద్భుతమైన సినిమా అని. జనరంజకంగా మలచబడిందనీ – ‘మాయాబజార్’లా పదికాలాల పాటు నిలుస్తుందనీ.

‘వసంతమా’ సినిమా రిలీజైన థియేటర్లో ముందు జనం క్యూలు కట్టారు.నిన్నటిదాకా చిన్న చిన్న వేషాలు వేసిన ‘మోహన్’ ఇవాళ ‘వసంతమా మోహన్’ అయ్యాడు. పది పిక్చర్లలో హీరోగా బుక్ అయ్యాడు. సరికొత్త హీరోయిన్ లక్షణ కూడ ఎనిమిది సినిమాల్లో హీరోయింగా సంతకం చేసింది.

సారధి మాత్రం ఎప్పటిలా మౌనంగా ఇంట్లోనే ఉన్నాడు. 18 ఉదయం అతను ఇంటికి వచ్చిన దగ్గర్నించి మౌనంగానే వుంటున్నాడు. రోజురోజుకీ అతనికోసం వచ్చే నిర్మాతల  సంఖ్య పెరుగుతూనే వుంది. కానీ అతను ఎవర్నీ కలవటంలా. రాఘవ అర్జంటుగా అమెరికా వెళ్లాల్సి వచ్చి వెళ్లిపోయాడు. సినిమా రిలీజై పదిరోజులైంది. యీ పదిరోజుల్లోనూ మొదట వేసిన 35 ప్రింట్స్ కాక మరో నలభై ప్రింట్స్ వేశారు. కలెక్షన్లు ఎనిమిది కోట్లు దాటినై. టిక్కెట్లు కొనుక్కుని చూసేవాళ్లకంటే టిక్కెట్లు దొరక్క నిరాశతో వెనక్కి మళ్లే వాళ్లే ఎక్కువమందున్నారు. దాంతో తెలుగు సినిమా చరిత్రలో ‘వసంతమా’ అన్ని రికార్డులనీ బ్రేక్ చేస్తుందని సినీ పండితులు ఘంటాపధంగా చెబుతున్నారు.

సునీతికి ఏమీ అర్ధం కావడంలేదు. డబ్బు చిల్లిగవ్వ లేదు. పాపం ‘మల్లికడై'(కిరాణ కొట్టు) శరవణన్ మంచివాడు. అడిగిందల్లా అప్పుగా వెంటనే ఇస్తున్నాడు. సారధి పిక్చర్ సూపర్ హిట్టని అతనికీ తెలుసు. తెలుగు కస్టమర్లు తెగ చెప్పారు సినిమా గురించి. శరవణన్‌కి ఈ విషయం తెలుసునని సునీతికి తెలీదు. అందుకే శరవణన్ మంచితనానికి పదేపదే నమస్కరిస్తోంది.

సెప్టెంబరు రెండో తారీఖున కొత్త కారు ఇంటిముందు ఆగింది. రాఘవ చెరుకూరి భార్యతో సహా దిగాడు. సునీతి సంబరంగా వాళ్లని స్వాగతించింది. సారధి గది తలుపులు తట్టింది. సారధి బైటికొచ్చాడు. పది పన్నెండు రోజుల గడ్డంతో.

“గురూగారూ” అంటూ రాఘవ సారధి కాళ్ల దగ్గర కూలబడ్డాడు. అతని భార్య కూడా కూర్చుంది.

“చ.. చ.. ఇదేంటి రాఘవగారూ..” కంగారుగా అన్నాడు సారధి. “నన్ను నిర్మాతని చేశారు. మామూలు నిర్మాతనిగాదు. స్టార్ యాక్టర్లందరూ నాకు ఫోన్ చేశారు. కాల్‌షీట్లు  ఇవ్వడానికి సిద్ధంగా వున్నామని. అది చాలు నాకు. నా ఆశ తీరింది. మీ రుణం మాత్రం యీ జన్మకి తీరదు. ఒక్క పైసా మీకు నేనివ్వలేదు. ఒక్క పైసా మీరు తీసుకోలేదు. సీతమ్మలాంటి సునీతిగారి మెడలో నగలన్నీ తాకట్టుకి వెళ్లిపోయాయని తెలుసు. అప్పటికీ మీరు నన్ను ఏదీ అడగలేదు. నిజమైన స్నేహానికి నిర్వచనం మీరు. ఇదిగో – యీ కారు ఈ క్షణం నుంచి మీది. ఇదిగో ఇవి నేను మీకోసం కొన్న ట్రిబుల్ బెడ్‌రూం అపార్ట్‌మెంట్ తాళాలు ఇదిగో. ఈ చెక్కు మీది. నేను  సినిమా తీస్తే అది మీతోనే అవుతుంది” అంటూ కన్నీళ్లతో చెక్కుని పాదాల మీద వుంచాడు రాఘవ. సారధి అతని భుజాలు పట్టుకుని లేవదీశాడు. సునీతి కళ్లల్లో నీళ్ళు జలజలా రాలాయి. రాఘవ భార్య ఆమెని హత్తుకుని కళ్లు తుడిచింది తన పైట చెంగుతో.

‘ఇవి నీవి..’ అపార్టుమెంటు తాళాలూ, కారు తాళాలూ చెక్కూ అన్నీ సునీతికి ఇచ్చి అన్నాడు సారధి. ఆశ్చర్యంగా చూసింది సునీతి.”నేను పడ్డ కష్టంలోనూ, టెన్షన్లోనూ వున్నది నా స్వార్ధం మాత్రమే. అంటే అది ప్రొఫెషన్‌కు సంబంధించింది. మరి యీ మూడేళ్లకు పైగా నువ్వు పడ్డ టెన్షన్ సంగతి? అందులో ఏ స్వార్ధమూ లేదు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోనూ?” సునీతి వంక చూస్తూ అన్నాడు సారధి. గొంతులో గుండె కొట్టుకుంటుంటే వచ్చిన మాటలవి.

“ఇన్ని రోజులు ఆ గదిలో మౌనంగా…” అడిగింది సునీతి.

“జస్ట్ వన్ మినిట్..” గది లోపలికెళ్లి క్షణంలో బయటికొచ్చాడు సారధి. అతని చేతిలో ఓ ఫైలుంది. ఆ ఫైల్ మీద అందంగా ‘దాహం’ అనే టైటిల్ రాసి వుంది. “ఇది నేను చెయ్యబోయే నెక్స్ట్ సినిమా. ” నవ్వాడు సారధి. సునీతికి ఆ ఫైల్ అందించి దగ్గరకి తీసుకుంటూ..

*****

‘సక్సెస్’ నా ‘బిడ్డ’ అని చెప్పుకోవడానికి లక్ష మంది రెడీగా వుంటారు. ఫెయిల్యూర్‌ని ‘నా బిడ్డ’ అని చెప్పడానికి ఎవరూ ఒప్పుకోరు.

ఈ కథ సక్సెస్ కథ.

కథలో కథ మరో కథ వుంది.

దాని పేరు “బొరుసు”

అన్నట్టు బొమ్మా బొరుసుల్లానే, సక్సెస్, ఫెయిల్యూర్లు ఒకే నాణానికి రెండు ముఖాలు.

“దేరీజ్ నో సక్సెస్ వితవుట్ ఫెయిల్యూర్’ అనేది నా అనుభవం నాకు నేర్పిన పాఠం..

అది మరో కథలో చెప్పుకుందాం

మీ

భువనచంద్ర..

 

మీ మాటలు

 1. బాగా రాశారు భువనచంద్ర గారు.

  • BHUVANACHANDRA says:

   శ్రీను గారూ నమస్తే మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు

 2. అద్భుతంగా రాశారు మాష్టారూ. గుక్క తిప్పుకోకుండా చదివించారు.

  ఈ సారధి గారి అసలు పేరేంటి ?

  ఆ సినిమా అసల పేరు అదేనా ?? విన్నట్టు లేదు

  • BHUVANACHANDRA says:

   శ్రీని గారూ అసలు పేరు ని మార్చాను ….పేరు మీకు చిరపరిచితమే …..కధ మీకు నచ్చినందుకు నా ధన్యవాదాలు

 3. నవరసాలతో మనసును స్పృశించారు. మంచి సినీ నేపథ్య కథని అందించినందుకు ధన్యవాదాలు.

  • BHUVANACHANDRA says:

   ప్రతాప వేంకటసుబ్బారాయుడు గారూ మీకు నా ధన్యవాదాలండీ ..నమస్తే

 4. kollurusiva nageswarao says:

  గుడ్ – బాగా వ్రాసారు

 5. మళ్ళీ చాలా రోజులకు దర్శనం భువన చంద్ర గారూ …
  ఎప్పట్లానే మీ సూదంటురాయి అక్షరాల వెంట నా ఇనుప నేత్రాల పరుగో పరుగు :)
  రాఘవ లాంటి వారు నిజ్జంగా ఉన్నారంటారా ? పెద్దలు అంటారే … కొందరు ఈ భూమ్మీద ఉండబట్టే వానలు కురుస్తున్నాయని – కృతజ్ఞత కు కొలబద్ద మనుషులు కూడా ఉంటారు అనిపించింది – ధన్యవాదాలు.

  • BHUVANACHANDRA says:

   GORUSU గారూ మీ ఉత్తరాలు ఎప్పుడూ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయండీ ….అలాగే ఇప్పుడూ ఎంతో ఆనందం కలిగింది .ఈ చిత్రసీమలో కూడా ఎంతోమంది మంచివాళ్ళు వున్నారు …అయితే విషాదాలూ, బాధలు ,మోసాలూ గురించి రాయడం ఎందుకంటే ,అవి చదివి అయినా కొందరు జాగ్రత్త పడతారనే ఆశతో….రాఘవ లాంటి వారు ఉన్నారండీ ….అందుకే పరిశ్రమ ఇంకా పచ్చగా వుంది . మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సర్ ,,,,,,,,,

 6. వనజ తాతినేని says:

  ప్రతి రంగంలోనూ జయాపజయాలు ఉంటాయి . సినిమా రంగంలో వీటి ప్రభావం మాత్రం వేరుగా ఉంటుందనేది ఇలాంటి వాస్తవ జీవిత కథలు చదివినప్పుడు తెలుస్తుంది .
  దర్శకుడిగా ఈ దర్శకుడు ఎన్ని విజయాలు సాధించారో గాని అసలైన విజయం ఇంట్లోనే .. భార్య రూపంలో ఉందండీ ! సునీతి గారి కోసం మళ్ళీ మళ్ళీ చదివాను . గొప్ప ఇల్లాళ్ళు ఉండబట్టే పురుషులు వాళ్ళ రంగాలలో నిలబదతారండీ ! అలాగే నిర్మాత రాఘవ గారు లాంటి వాళ్ళు కూడా ఉండబట్టే ఇంకా మంచితనం మీద నమ్మకం పోకుండా చావకుండా బతికి ఉంటున్నారు లోకంలో .

  విలువలతో ఉన్న జీవిత కథలని మీరు హృద్యంగా చెప్పడం చాలా బావుంది . ఆపకండి సర్ ! వ్రాస్తూనే ఉండండి .

  • BHUVANACHANDRA says:

   వనజ గారూ ,నమస్తే …చాలా సంతోషమండీ చదివి రెస్పాన్స్ ఇచ్చినందుకు , హృదయపూర్వక ధన్యవాదాలండీ

 7. మానవ ప్రతిస్పందనలు ఎంత గొప్పగా ఉంటాయి
  నమ్మకం, త్యాగం, కృషి, పట్టుదల ఉన్న
  వాస్తవ చరిత్ర కదిలించింది
  బాగా నచ్చింది భువనచంద్ర గారూ

  • BHUVANACHANDRA says:

   ధన్యవాదాలు గోపి గారూ …మీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా వుందండీ

 8. BHUVANACHANDRA says:

  వనజ గారూ ,నమస్తే …చాలా సంతోషమండీ చదివి రెస్పాన్స్ ఇచ్చినందుకు , హృదయపూర్వక ధన్యవాదాలండీ ….

 9. చదివేను..

  ఇదేకాదు..

  మీవి దాదాపు అన్నీ..

  చెప్పాలి..రాయలేను..
  ఎలా మాట్లాడాలి మీతో?
  ఈమెయిలు చెయ్యండి.. తప్పదు!

మీ మాటలు

*