కోతిస్వామ్యంలో విపక్షం

 

 

సత్యమూర్తి

కోతుల రాజ్యం చట్టసభ అరుపులతో, కేకలతో దద్దరిల్లుతోంది. అధికార, విపక్ష కోతులు సభాధ్యక్ష స్థానం ముందుకు దూసుకొచ్చి గొడవ చేస్తున్నాయి.

‘‘మన రాజ్యం సొమ్మును దోచుకెళ్లిన ఆ నల్లకొండముచ్చును గంపెడు బాదం పప్పులు తీసుకుని కట్లువిప్పి వదిలేసిన మంత్రి బొట్టమ్మ రాజీనామా చెయ్యాలి.. రాజీనామా చెయ్యాలి..’’ విపక్ష కోతులు గట్టిగా అరిచాయి.

బొట్టమ్మకు కోపం మండుకొచ్చింది. తోకను నిలువునా నిక్కబొడుచుకుని, కోరలు బయటపెట్టి గుర్రుమంది.

‘‘మీ పీకల్ని కసుక్కున కొరికేస్తా. ఆ కొండముచ్చు పెళ్లాం చావుబతుకుల్లో ఉందంటే సాటి కోతిజాతిదే కదా అని జాలిపడి దాన్ని వదిలేశా. అది పెళ్లాం దగ్గరికిపోకుండా ముండదగ్గరికి పోతుందని నాకేం తెలుసు? నేను బాదం పప్పులూ తీసుకోలేదు, గీదం పప్పులూ తీసుకోలేదు. మేం తిన్న గంపెడు పప్పులూ నేనూ, నా మొగుడూ, కూతురూ సొయంగా చెట్టెక్కి తెంపుకుని పగలగొట్టుకుని తిన్నవి. ఆ పిప్పి చూసి తెగ కుళ్లుకుంటున్నారు. నేను రాజీనామా చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి.. బస్తీమే సవాల్..’’ అని కసిరింది.

‘‘నువ్వు గంపెడు బాదం పప్పులు తీసుకునే వదిలేశావు. ఈ దేశంలోని కోతులకు రెండు బాదం గింజలు దొరకడమే గగనంగా ఉంటే నీకు గంపెడు ఎలా వచ్చాయ్? గడ్డి కరిచానని, తప్పు ఒప్పేసుకుని, రాజీనామా చెయ్!’’ విపక్ష కోతులకు పెద్ద అయిన బోడెమ్మ అరిచింది. అసలే ఎర్రగా ఉన్న దాని ముఖం కోపంతో మరింత ఎరుపెక్కింది. బోడెమ్మకు దాని బిడ్డ గట్టిగా వంత పలికింది. ‘‘బాదం పప్పులు మింగిన బొట్టమ్మ గద్దె దిగాలి. పెద్దమంత్రి బవిరిగడ్డం వెంటనే ఇక్కడికొచ్చి జవాబు చెప్పాలి!’’ అని గొంతు పగిలేలా అరిచింది.

విపక్ష కోతులు చప్పట్లు చరిచాయి.

బొట్టమ్మ తోక మరింత ఉబ్బింది.

‘‘ఒసే బోడీ.. నోరు మూసుకోవే! నువ్వూ, నీ మొగుడూ ఆనాడు చిప్పెడు దోసగింజలు పుచ్చుకుని ఒకటి కాదు, రెండు దొంగముండా తెల్లకొండముచ్చులను వదిలేయలేదా? ఒరే బోడెమ్మ కొడుకా! నోటికొచ్చినట్టు వాగమాక. ఇంటికెళ్లి నీ వంశ చరిత్ర చదువుకో!’’

మూడువందల అధికార కోతులు కిచకిచ నవ్వుతూ గట్టిగా చప్పట్లు కొట్టాయి. సభ భూకంపం వచ్చినట్టు కంపించిపోయింది.

విపక్ష కోతులు కూడా వెనక్కి తగ్గలేదు. అన్నీ కలిపి నలబయ్యే ఉన్నా కోరలు బయటపెట్టి సత్తువకొద్దీ భీకరంగా గుర్రుమన్నాయి.

అధికార కోతులు కాస్త భయపడ్డాయి. వెంటనే తేరుకుని, ‘‘విపక్షం కోతిస్వామ్యాన్ని హత్య చేస్తోంది’’ అని నినదించాయి.

సభాధ్యక్ష కోతి చిద్విలాసంగా నవ్వింది. అధికార అరుపులు దానికి కర్ణపేయంగా అనిపించాయి.

‘‘అవును, విపక్షం కోతిస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది, పూడ్చేస్తోంది, కాల్చేస్తోంది. విపక్ష కోతులకు రేపట్నుంచి ఇక మాట్లాడే అవకాశమే ఇవ్వను’’ అంటూ సభను వాయిదా వేసింది.

***

Painting: Slade Smiley

Painting: Slade Smiley

అధికారపక్ష కోతులన్నీ పసనచెట్టు కొమ్మలమీద సమావేశమయ్యాయి.

‘‘సభ ఇట్లా సాగితే కష్టం. విపక్ష కోతులు చెప్పేదే నిజమని దేశం నమ్మే ప్రమాదముంది. అందుకే ఎదురుదాడి చేయండి. బోడెమ్మపై, బోడెమ్మ కొడుకుపై నానా నిందలూ వెయ్యండి. కోతిస్వామ్యాన్ని మనం కాదు, అవే హత్య చేస్తున్నాయని చాటింపు వెయ్యించండి..’’ పెద్ద మంత్రి బవిరిగడ్డం ఆదేశించింది.

భేటీ ముగిసింది. బవిరిగడ్డం చెట్లకొమ్మలు పట్టుకుని నాలుగు యోగాసనాలు వేసింది. ఆయాసం తీర్చుకుని దోనెడు తేనెతాగి బ్రేవ్ మని త్రేన్చింది. చచ్చిన మిణుగురుపురుగులను తన పేరులా అతికించిన పట్టు చొక్కా వేసుకుని, నీటిగుంటలో తనను తాను చూసుకుంటూ తెగమురిసిపోయింది. ఇంతలో రాజ్యపెద్ద తెల్లగడ్డం నుంచి పిలుపు వచ్చింది.

***

‘‘నాయనా, బవిరిగడ్డమూ! పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషం సుమీ. అసలు నువ్వు రావేమోనని కాస్త భయపడ్డాను. సభలో అధికార కోతులు తమ గొంతు నొక్కేస్తున్నాయని విపక్ష కోతులు నాకు తాటాకు ఫిర్యాదు చేశాయి. సభాధ్యక్ష కోతి తీరు నాకేం నచ్చలేదు. అది మీ పక్షమే కావొచ్చు, కానీ మనకొక సభానీతి, న్యాయమూ ఉంది. ఎంతైనా మనది కోతిస్వామ్యం. కొన్ని కనీస విలువలూ, సంప్రదాయాలూ పాటించాలి. కనీసం పాటిస్తున్నట్టు నటించనైనా నటించాలి. విపక్షాన్ని మాట్లాడనివ్వాలి.. ఒక్క విపక్షాన్నే కాదు గొంతుక ఉన్నవాళ్లందరినీ మాట్లాడనివ్వాలి.. గొంతుకలేనివాళ్ల మూగగొంతుకలనూ వినాలి..’’ తెల్లగడ్డం పండిన జామపండును కొరుకుతూ అంది.

బవిరి గడ్డం చిరాగ్గా చూసింది.

‘‘నువ్వెప్పుడూ ఇంతే. ఎప్పుడూ ఆ పాతకాలం సొల్లు కబుర్లే చెబుతావు. ఈ దేశంలోని అశేషవానరానీకం మమ్మల్ని ఎన్నుకున్నది మా మాటలు వినడానికే కానీ విపక్షం మాటలు వినడానికి కాదు. నీకు తల పండిపోయింది కానీ, బుర్ర పండలేదు..’’

తెల్లగడ్డం నొచ్చుకుంది. అయినా పట్టించుకోకుండా తన ధర్మాన్ని పాటించింది.

‘‘బవిరిగడ్డమూ! నా మాటలు నీకు కోపం తెప్పిస్తాయి. అయినాసరే, నిష్కర్షగానే మాట్లాడదలచుకున్నా. నీకు దేశస్థాయి రాజకీయాల్లో అనుభవం తక్కువ కనుక ఇలా అవివేకంగా మాట్లాడుతున్నావు. ఈ సువిశాల వానరరాజ్యంలో నువ్వు ఇదివరకు ఓ  మండలానికే పెద్దమంత్రిగా పనిచేశావు. దేశానికి ఎట్లా పెద్దమంత్రివయ్యావో నీ అంతరాత్మకు తెలుసు, నువ్వాడిన అబద్ధాలకు తెలుసు, నీ మండలంలో పారిన చిన్నకోతుల నెత్తురుకు తెలుసు. నీ చేతులకింకా ఆ నెత్తుటి మరకలు పోలేదు. పోనీ, ఇప్పుడైనా మారావా, అంటే అదీ లేదు. ఇప్పుడూ అవే మాటలూ, అవే చేతలూ! కోతిస్వామ్యం అంటే ఆటవికస్వామ్యం కాదు నాయనా. ఎదుటి కోతి చెప్పింది వినడం, జవాబివ్వగలితే ఇవ్వడమే కోతిస్వామ్యం. ఆ కోతి మాటను ఖండించు. కానీ ముందు దాని మాటను సాంతం విను. నువ్వు అధికారంలో ఉన్నావు కనుక నీకు మాట్లాడే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. అందుకేగా మరుగుదొడ్డి కాన్నుంచి అంతర్జాతీయ మహాసభ వరకు ఎక్కడ అవకాశం దొరికినా నోట్లో బారెడు బాకా పెట్టుకుని కోతుల కర్ణభేరీలను బద్దలుగొడుతున్నావు. మరుగుదొడ్డి నుంచి మంత్రతంత్రాల వరకు దేనిపైనైనా ఏకధాటిగా వదురుతున్నావు. సభలే కాకుండా నెలకోసారి గొట్టం పట్టుకుని మనసులో మాటంటూ ఉన్నదీ లేనిదీ చెప్పి మాయ చేస్తున్నావు.

ఇన్ని అవకాశాలూ నీకు కోతిస్వామ్యమే కదా ఇచ్చింది. విపక్షమూ, విపక్ష గొంతుకా లేని కోతిస్వామ్యం ఉండదు నాయనా. ఉన్నా నేతిబీరకాయే. అందుకే నువ్వు మన కోతిస్వామ్యపు మౌలిక విలువల గురించి బాగా తెలుసుకోవాలి. చూస్తూంటే నీకు అందులో ఓనమాలు కూడా తెలియనట్టుందే..’’

తెల్లగడ్డం ఆయాసంతో విరామం తీసుకుంది.

బవిరిగడ్డం ముఖం కందగడ్డగా మారిపోయింది.

‘‘విపక్షం, విపక్షం..! అసలు అధికార పక్షం లేకపోతే విపక్షమెక్కడ?’’  అని అరిచింది.

‘‘నేనూ ఆ మాటే ఇంకోలా అడుగుతున్నా. విపక్షం లేకపోతే అధికార పక్షమెక్కడ?’’

‘‘నువ్వెన్నయినా చెప్పు. అధికారంలో ఉన్నవాళ్ల మాటే చెల్లుబాటు కావాలి. అంతే..’’

‘‘మూర్ఖంగా మాట్లాడక. అధికారం శాశ్వతం కాదు. మీ పక్షం ఇదివరకు విపక్షమన్న సంగతి మర్చిపోకు. నీ పదవీ కాలం పూర్తయ్యాక, ఎన్నికల్లో ఓడితే నువ్వూ విపక్షంలోనే కూర్చుంటావు. అప్పుడూ ఇలాగే మాట్లాడతావా? విపక్షం ఉన్నది అధికార పక్షాన్ని విమర్శించడానికి కాక వత్తాసు పలకడానికా? పూర్వం నీలాగే.. అధికారంలో ఉన్నవాడి మాటకు ఎదురులేదని విర్రవీగి పతనమైన రాజుకోతి కథ చెబుతాను విను.. ’’

బవిరిగడ్డానికి ఈ మాటలు విసుగనిపించినా, రాజులన్నా, రాజుల కథలన్నా ఇష్టం కనుక చెవులు రిక్కించింది.

‘‘పూర్వం ఒక రాజుకోతి ఉండేది. అది నపుంసక కోతి కావడం వల్ల తనకు దక్కని రతిసౌఖ్యం మిగతా కోతులకు దక్కొద్దని రాజ్యంలో రతి కార్యాన్ని నిషేధించింది. దానికి నిర్బంధ బ్రహ్మచర్య చట్టం అని దొంగపేరు పెట్టింది. అది రాజరిక వ్యవస్థే అయినా భిన్నాభిప్రాయాలు వినడంలో తప్పేమీలేదని రాజుకోతి ఆస్థానంలో తీర్మానం తెచ్చి చర్చ పెట్టింది. ఆస్థాన కవి క్రియాశక్తీ, పెద్దమంత్రీ ఆ చట్టాన్ని వ్యతిరేకించాయి. శృంగారాన్ని నిషేధిస్తే జీవితంలో రుచిపోతుందని వాదించింది కవికోతి. రతికార్యంలో రుచేమీ లేదని స్వానుభవంతో తెలుసుకున్న రాజుకోతి కవి మాటను తోసిపుచ్చింది. మన్మథకార్యంపై నిషేధం ప్రకృతి విరుద్ధమని వాదించింది పెద్దమంత్రి. ప్రకృతి శక్తులను జయించడమే కోతి లక్షణమంటూ ఆ అభ్యంతరాన్నీ తోసిపుచ్చింది రాజుకోతి. తీర్మానం నెగ్గింది. రతి నిషేధం అమల్లోకి వచ్చింది. పెళ్లి వ్యవస్థ రద్దయింది. పెళ్లయిన కోతులు విడాకులు తీసుకోవాలని తాఖీదులు జారీ అయ్యాయి. శాసనాన్ని అమలు చెయ్యడానికి బోలెడు కోతులు కావాల్సి వచ్చింది. నిరుద్యోగం తగ్గింది. రాజుకోతికి మరో చక్కని ఆలోచనా వచ్చింది. ఆడామగా కోతులను విడదీయడానికి దేశం మధ్యన ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఇరవై అడుగుల గోడకట్టించి తూర్పువైపున ఆడకోతులను, పడమటివైపున మగ కోతులను ఉంచింది. అయితే ఈ చట్టం వల్ల వచ్చే తరానికి కోతులే ఉండవని పెద్దమంత్రి ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చిక్కు సమస్యేనని తోచింది రాజుకోతికి. రతిపై నిషేధం, ప్రజావృద్ధి అనే భిన్న కోణాలను సమన్వయం చేయడంపై బుర్ర చించుకుంది. రాజ్యంలో మంచిప్రవర్తన గల మగకోతులను ఎంపిక చేసి, అవి నెలకు రెండు మూడుసార్లు తూర్పు వైపుకు వెళ్లడానికి ఏర్పాటు చేసింది. నిర్బంధ బ్రహ్మచర్యానికి అపరాధంగా స్వచ్ఛంద వ్యభిచారం. అయితే మళ్లీ ఒక సమస్య వచ్చిపడింది. తన తదనంతరం రాజ్యాన్ని ఎవరు పాలించాలీ అని. తనకు వారసులు లేరు, ఉండరు కనుక పక్కరాజ్యం దండెత్తి రాజ్యాన్ని ఆక్రమించుకుంటుంది. ఈ సమస్యకూ పరిష్కారం దొరికింది. పడమటి కొండల్లోని ఓ యోగికోతికి మహత్యాలున్నాయని తెలుసుకుని అంతఃపురానికి తీసుకొచ్చింది రాజుకోతి. యోగికి అక్కడ పరిచర్యలు జరిగాయి. యోగి మహిమతో రాజుకోతి తండ్రి వితంతువుల్లోని అందమైన కోతి గర్భం దాల్చింది. పదినెలలు తిరిగే సరికి రాజుకు పండంటి తమ్ముడు కోతి పుట్టింది. సమస్య తీరింది. అయితే తూర్పువైపున్న ఆడకోతులూ పిల్లల్ని కనేయసాగాయి. రాజుకోతి ఆశ్చర్యపోయింది. మగకోతి సంపర్కం లేకపోయినా తన పిన్నమ్మకు పిల్ల పుట్టింది కనుక తతిమ్మా ఆడకోతులు పిల్లలను కనడానికీ ఆ యోగి మహిమే కారణమని నమ్మింది. రాజ్యపాలన సుఖంగా సాగుతుండగా రెండేళ్ల తర్వాత పక్క రాజ్య సైన్యం దండెత్తి వచ్చింది. దాన్ని ఆస్థాన కవి క్రియాశక్తే తీసుకొచ్చింది. పక్క రాజ్య సైన్యాధిపతికోతి రాజుకోతిని గద్దె దింపి తమ్ముడు కోతిని ఎక్కించి తానే పాలించసాగింది. సదరు సైన్యాధిపతికీ ఈ సంతాన వ్యవహారంపై అనుమానమొచ్చింది. యోగికోతి చలవే కాబోలనుకుంది. అయితే అడ్డుగోడ కింద అటునుంచి ఆడకోతులూ, ఇటు నుంచి మగకోతులూ తవ్విన సొరంగాలు ఉన్నాయన్న సంగతి తర్వాత బయటపడింది. అయినా ఆడామగా కోతులు అవి తాము తవ్వలేదని, పందికొక్కుల పని అయ్యుంటుందని అన్నాయి…’’

తెల్లగడ్డం కోతి కథ పూర్తిచేసింది.

బవిరిగడ్డం ముఖం మాడిపోయింది.

‘‘అందుకే నాయనా, ఇంతలా నెత్తీనోరూ కొట్టుకుని చెబుతున్నాను. కోతిస్వామ్యానికి విపక్షం రతికార్యమంత అవసరమైనది, సహజమైనది. అది లేకపోతే చర్చ ఉండదు. సంభాషణా ఉండదు. భవిష్యత్తూ ఉండదు. ఆటవికత్వం రాజ్యమేలుతుంది. మనం కోతులం. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు. మాట్లాడే శక్తి ఇచ్చాడు. మాట్లాడుకుందాం, తిట్టుకుందాం, అరచుకుందాం, గుర్రుమందాం. ఆ కోతులు నీ తప్పులను ఎండగట్టనీ. నువ్వూ వాటి తప్పులను ఎండగట్టు. అంతే కానీ వాటి గొంతు నొక్కేయకుమీ, కోతిస్వామ్యానికి కళంకం తేకుమీ.. నీ పుణ్యం ఉంటుంది..’’

 

(ఈ కథలోని నపుంసక రాజుకోతి కథ శ్రీశ్రీ రాసిన ‘మొహబ్బత్ ఖాన్’కు కొన్ని మార్పులతో సంక్షిప్తం)

మీ మాటలు

  1. పిన్నమనేని మృత్యుంజయరావు says:

    హమ్మయ్య! కోతిస్వామ్యమే కదా! ప్రజాస్వామ్యం గురించేమోనని హడిలి చచ్చాను.

  2. బ్రెయిన్ డెడ్ says:

    హ హ లవ్డ్ ఇట్ . రోజువారి డ్రామాని ఇంత అద్భుతంగా రిక్రియేట్ చేసిన మీకు కుడోస్

మీ మాటలు

*