‘స్టిల్ లైఫ్’ లో ప్రాణం పొదుగుతున్న రమేష్!

 

సామాన్యశాస్త్రం ‘జీవనచ్ఛాయ’

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం (ఆగస్టు 19 ) సందర్భంగా హైదరాబాద్‌లోని ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీలో సామాన్యశాస్త్రం ఏకచిత్ర ప్రదర్శన (సింగిల్ ఎగ్జిబిట్ షో) 18వ తేదీ మంగళవారం సాయంత్రం ఐదున్నరకు ప్రారంభం. ముఖ్య అతిథులు జి.భరత్ భూషణ్, అల్లం నారాయణ, కె.వి.రమణాచారి. candid picture, life photography ప్రాముఖ్యాన్ని తెలిపే ఈ ప్రదర్శన ఆదివారం దాకా ఉంటుంది. అందరికీ ఆహ్వానం.

– కందుకూరి రమేష్ బాబు, 99480 77893

ఈ సందర్భంగా  రామా చంద్రమౌళి ప్రత్యేక రచన 

raamaa chaMdramouliప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని..ఐలమ్మ ఆర్ట్ గ్యాలరీ, సుందరయ్య విజ్ఞాన కేంద్రం,బాగ్ లింగంపల్లి,హైదరాబాద్ లో ప్రఖ్యాత ’ లైఫ్ ’ ఛాయాగ్రాహకులు  కందుకూరి రమేష్ బాబు ఒక విలక్షణతతో..అత్యంత సాహసోపేతంగా 19 నుండి 23 ఆగస్ట్ 2015 వరకు ఏర్పాటు చేస్తున్న ‘ ఏక ఛాయాచిత్ర ప్రదర్శన ‘ (single exhibit show) సందర్భంగా..రమేష్ బాబు గురించిన ముచ్చట.

ఈ ప్రదర్శనలో కేవలం 3′ X 5’ సైజ్ గల క్రింద చూపిన ఒకే ఒక్క ఛాయాచిత్రం మాత్రమే ప్రదర్శితమౌతుంది. సాధారణంగా ఆర్ట్ ఎగ్జ్బిషన్ లలో ఒకే లేదా భిన్న కళాకారులకు సంబంధించిన పలు చిత్రాలు ప్రేక్షకుల సందర్శనార్థం ప్రదర్శితమౌతాయి.కాని ఈ విధంగా ఒకే ఒక్క విలక్షణమైన చిత్రాన్ని రసజ్ఞులైన  వీక్షకులకోసం  ఏర్పాటు చేయడం ఒక సాహసోపేతమైన .. కించిత్తు దర్పంతోనూ, ఒక ప్రత్యేక లక్ష్యంతోనూ కూడుకున్న చర్యగా భావించవలసి వస్తోంది.ఒక జీవనచ్ఛాయా చిత్రకారునిగా గాఢ గంభీరతనూ,అర్థాన్నీ,లోతైన జీవన సంక్షోభాన్నీ అత్యంత గరిష్ఠ స్థాయిలో వ్యక్తీకరిస్తున్న ఈ చిత్రం నిజంగానే  ‘ ఒక్కటే అనేక చిత్రాలకు సమానం కదా ‘ అన్న ఒక ప్రశంసాత్మక అబ్బురాన్ని కలిగిస్తున్న విషయంకూడా తప్పక స్ఫురిస్తుంది అందరికీ . ఈ నేపథ్యంలో..

ramesh

పై ఫోటోకూ నాకూ ఒక వ్యక్తిగత సంబంధముంది.’ నమస్తే తెలంగాణ ‘ పత్రిక కొత్తగా పుట్టిన రోజుల్లో ప్రతి ఆదివారం అనుబంధ పుస్తకం ‘బతుకమ్మ ‘ సంచిక చివరి అట్టపై ఒక పూర్తిపేజి ఛాయాచిత్రం ప్రచురించబడి కళాత్మకమైన  ఫోటో ప్రియులను అలరించేది.ఆ విధంగా..ఒకటా రెండా..అనేకం వచ్చాయి.ఆ క్రమంలో నా హృదయాన్ని దోచుకుంటున్న ఈ  కె ఆర్ బి..అన్న ఫోటోగ్రాఫర్ ఎవరబ్బా అని ప్రత్యేకంగా వాకబుచేసి ఒకరోజు ఫోన్ చేసి..తర్వాత్తర్వాత పలుమార్లు కలుసుకుని..స్నేహించి..ఆత్మీయులమై..రమేష్ బాబు ఫోటోలంటే నాకు ఎంత పిచ్చి ఏర్పడిందంటే..2012 లో వెలువడ్డ ( తెలుగులో..ఇంగ్లిష్ లో ప్రసిద్ధ అనువాదకులు ప్రొఫెసర్ కె.పురుషోత్తం చేత తర్జుమా చేయబడిన) నా ఎనిమిదవ కవితా సంపుటి ” అంతర “పుస్తకంలోని  ప్రతి కవితకూ ఒక పూర్తి పేజి ఫోటో చొప్పున  అరవై కవితలకు అరవై ఫోటోలను  ఉపయోగించుకున్నాను.ఆ పుస్తకం అంతర్జాతీయ ప్రమాణాలతో వెలువడి తర్వాత ప్రతిష్టాత్మక ‘ ఫ్రీవర్స్ ఫ్రంట్-2012 ‘,’ సహృదయ-2013′ వంటి ఎన్నో పురస్కారాలను సాధించింది.

ఆ పుస్తకంలో..’ పాదాల కింది నేల ‘ అన్న కవితకు ఈ రోజు రమేష్ బాబు ఎంతో గర్వంగా ‘ ఏక చిత్ర ప్రదర్శన ‘ గా పెడ్తున్న ఈ అద్భుత చిత్రం ఉపయోగించబడింది.ఇదే కవితను నేను 2012 లో ఆగ్రాలో జరిగిన తొమ్మిది దేశాల ‘సార్క్ ‘ సాహిత్య శిఖరాగ్ర సదస్సులో చదివినప్పుడూ, 22 దేశాల ప్రతినిధులు పాల్గొన్న “2013-జైపూర్ అంతర్జాతీయ సూఫీ సదస్సు” లోనూ చదివినప్పుడు ఈ ఫోటో తో సహానా కవిత కూడా  గ్యాలరీలో ప్రదర్శించబడ్డప్పుడు అనేకమంది విదేశీ ప్రముఖుల ప్రశంసలను పొందింది..ఫోటో..కవితకూడా.అప్పుడు అనేక ప్రాచ్య  ప్రతినిధులు ఈ ఫోటోలోని విలక్షణతను నన్నడిగి తెలుసుకోవడం ఒక మధురమైన జ్ఞాపకం.

krb-5

photo: C.M.Praveen Kumar

నాకున్న వ్యక్తిగత అనుబంధంతో రమేష్ ను అడిగానొకసారి..’నీకూ ఇతర ఫొటోగ్రఫర్లకూ తేడా ఏమిటి ‘అని. అతను చెప్పిన జవాబు నన్ను ముగ్దుణ్ణి చేసి నిజమేకదా అని అబ్బురపర్చింది.అది..” అందరూ తమకు నచ్చిన దృశ్యాన్ని capture  చేస్తే..నా ఎదుట తారసపడే సజీవ జీవన చిత్రం మాత్రం అదే నన్ను capture చేస్తుందన్నా..” అన్నాడు.అది అక్షరాలా నిజం.అప్పుడప్పుడు రమేష్ తో కొన్ని రోజులు గడిపిన నేను..ఒక్క నిద్రపోయేటప్పుడు తప్పితే నిరంతరం కెమెరా అతని శరీరంలో ఒక భాగంవలె వెంట ఉండడం గ్రహించాను .ఎందుకలా అంటే..’ ప్రత్యేకంగా వెదుకకుండానే అనుక్షణం మన నిత్య గమనంలో ఎక్కడ ఒక అద్భుతమైన సామాన్య మానవుని సజీవ జీవన పోరాట సౌందర్యం కంటబడ్తుందో చెప్పలేం ..ఆ క్షణమే ఆ అద్భుత దృశ్యాన్ని  ఒడిసిపట్టుకుని..నిక్షిప్తం చేయాలి.. ‘ అని జవాబు.అతని  గాఢాసక్తి అది .శివునికి మూడో కన్నులాగ రమేష్ కు కెమరా ఒక మూడో భుజం.

ప్రదర్శనలో ఉన్న ఈ బొమ్మ గురించి తన స్వంత అన్వయింపు గురించి అడిగినప్పుడు..రమేషన్నాడు…

 ‘ అందులో  ఉన్న ఒక స్త్రీ..ఒక పురుషుడు ఈ మన భారతదేశ వర్తమాన సంక్షుభిత సమాజంలోని అట్టడుగు వర్గ విస్మృత వ్యక్తుల జీవన పొరాటాన్ని ప్రతిబింబిస్తున్న సజీవ చిత్రం.వాళ్ళు గారడీ వాళ్ళు కావచ్చు.సంచారజాతులకు సంబంధించిన గ్రామీణ కళాకారులు కావచ్చు..ద్రిమ్మరులు కావచ్చు.ఎవరైనా ఒక స్థిరత్వమూ..ఒక ప్రత్యేక అస్తిత్వమూ లేక నిత్య జీవిక కోసం..ఆకలి కడుపులతో అలమటిస్తున్నవాళ్ళు.జూబ్లీ హిల్స్ ,హైదరాబాద్ లో నడిరోడ్డు మధ్య ఎవరి పరుగులు వారివిగా పరుగెత్తుతున్న తీరికలేని నగరవాసుల మధ్య ప్రదర్శిస్తున్న జఠిలమైన ఒక ఫీట్ అది.ఎంతో అర్థవంతమైన..మనుషులను లోతుగా ఆలోచింపజేసే ఒక విన్యాసమది.పురుషుని కాళ్ళకింద కనబడని భూమి..పురుషుని తలపై ఒక భూదేవిలా భారాన్నంతా మోపి ప్రతిష్ఠితమైన స్త్రీ పాదాలు. ఒట్టి మట్టి పాదాలు..మాసిన బట్టలతో దీన పేద ప్రజల ప్రతినిధులుగా చూపులనిండా కొట్టొచ్చినట్టు దైన్యం.శూన్యం వాళ్ళ కళ్ళలో . తాత్విక దృష్టితో చూస్తే..ఒకరి భారాన్ని మరొకరు మోస్తూ స్త్రీ పురుష సంయోగ సంగమాల్లో,విలీనతలో ఏకత్వభిన్నతలో అభిన్నమై నిలిచిన బింబం..ప్రతీక అది. నిరాడంబరమైన అతిసహజ  స్త్రీపురుష  సమన్వయ  సహాకారాలతో కొనసాగే శ్రామిక క్రతువు అది. సంయోగ యోగం. ‘ అని. నిజమే కదా.

ఒక కళాకారునిలో దాగిఉన్న ప్రతిభను గుర్తించి..రీ డిస్కవర్ చేసేందుకు ఎవరో ఒక దార్శనికుడైన మహానుభావుడు అతనికి తారసపడ్డం యాదృచ్ఛికమే ఐనా అది అదృష్టమే. ఒక కమలాహాసన్ ను,ఒక రజనీకాంత్ నూ గుర్తించగలిగిన కె.బాలచందర్..ఒక ఎ.ఆర్.రెహమాన్ ను,ఒక సంతోష్ శివన్ నూ గుర్తించేందుకు ఒక మణిరత్నం..కావాలి.ఐతే మన రమేష్ ను ఎవరూ గుర్తించలేదుగాని..తనే తనలో క్షిప్తమై ఉన్న కళను గుర్తించగలిగిన  వ్యక్తిని వెదుక్కుంటూ వెళ్ళి తన గురువును అన్వేషించుకుని శిష్యరికం చేశాడు ఓ ఏదాదిపాటు దీక్షతో..చేస్తున్న ఉద్యోగాన్నికూడా వదలి.

రమేష్ గురువు జాతీయ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్ రఘురాయ్ .ఒక ఏడాదికాలం హైదరాబాద్,తిరుపతి,ఢిల్లీ,కోల్ కటా..ఇలా అనేక ప్రాంతాలను ఒక శిష్యునిగా,సహచరునిగా,విద్యార్థిగా,మిత్రునిగా వెంట తిరిగి  తనలో దాగిఉన్న’ అగ్ని’ ని తాను గుర్తించి కెమెరాను ఒక ఆయుధంగా స్వీకరించినవాడు రమేష్ బాబు.గురువు చెప్పిన  ప్రధాన విద్య..’ నువ్వు అతి సహజంగా ఫోటోను తీసి దాన్ని ప్రజాపరం చేయ్.అదే నీ వస్తువు,నీ శ్రమ,నీ సృజన.నువ్విక నిష్క్రమించు .ఇక నీ కృతే ప్రజలతో సంధానమై నువ్వేమిటో నీకు చెబుతుంది ‘ అని.అందుకే అందరు ఫోటోగ్రాఫర్లు వాడే ‘ఫోటో షాప్ ‘ ను రమేష్ వాడడు.తన కెమెరాలో అతి సహజంగా జన్మించిన చిత్రాన్ని ఉన్నదున్నట్టుగా మనకందిస్తాడు.మెరుగులూ,అలంకారాలూ,మేకప్పులూ ఉండవు.సహజమైన సృష్టి ఎప్పుడూ జీవాన్ని నింపుకుని అందంగానే ఉంటుంది.అందుకే..’ ఫేస్ బుక్’ మిత్రులకు గత కొన్నేళ్ళుగా 2000 కు పైగా అద్బుతమైన ఫోటోలను ‘ మై సిటీ అండ్ మై పీపుల్’ పేర అందిస్తున్నాడు

.’ వన్ ఇండియా.కాం’ దినపత్రికలో..రోజుకొక్కటి చొప్పున ఇప్పటికి కొన్నేళ్ళుగా వేయికి పైగా ఫోటోలను ‘మై సిటీ..మై పీపుల్ ‘ పేర ప్రచురిస్తున్నాడు. బహుళ పాఠకాదరణ గల ప్రసిద్ధ అంతర్జాల వారపత్రిక ” సారంగ” లో గత వంద వారాలనుండి ‘దృశ్యాదృశ్యం’ శీర్షికన ఒక పులకింపజేసే ఫొటోతో పాటు అర్థవంతమైన వ్యాఖ్యనుకూడా జతచేసి అందిస్తున్నాడు.ఈ మూడు నిత్యకృత్యాల్లోనూ వేలాదిమంది వీక్షకులు విభ్రమంతో పెట్టే వారి వారి కామెంట్స్ ను నేనెరుగుదును.నేనుకూడా అనేకసార్లు మైమరచి సూపర్ లేటివ్స్ లో వ్యాఖ్యలను పోస్ట్ చేసిన సందర్భాలు కోకొల్లలు.అందుకే మొన్న నేనన్నా రమేష్ తో..’నీ ఈ ప్రదర్శనలో వాడిన ” A pictureis worth A thousand words  ” అన్న వ్యాఖ్య సరియైంది కాదేమో రమేష్..వేయి పదాలుకాదు..అసలు అనేక సాహిత్య ప్రక్రియలూ,రూపాలూ ఏవీ కూడా వ్యక్తీకరించలేని అత్యంత సంక్లిష్ట  మహానుభూతులను నీ ఒక్క ఫోటో మాత్రమే వ్యక్తీకరించగలదు..వేరే ఏ ఇతర కళారూపాలూ చేయలేవా పనిని’ అని.

కందుకూరు రమేష్ బాబు ఫేస్ బుక్ లో ‘తల్లి కొంగు ‘ శీర్షికన అందించిన అనేక వందల అర్థవంతమైన,ఆర్ద్రమైన ఫోటోలు కూడా ఎందరు ప్రేక్షకుల మన్ననలను పొందాయో చెప్పలేము.అసలు ఇంత సహజమైన నిర్ణయాత్మక క్షణాలను (decisive moments)  ఇతను ఎలా బంధించగలిగాడబ్బా..అని చకితులమైపోతాము.తల్లి కొంగు ఎలా తన బిడ్డకు ఒక రక్షణ కవచమై..పరిష్వంగమై..అక్కున చేర్చుకునే ప్రాణధాతువౌతుందో ప్రతి ఫోటో చెబుతూనే ఉంటుంది.

అసలు నువ్వు నీ ఫోటోలతో..ఇంత బీభత్స  ఆర్ద్ర రస విన్యాసాన్ని ఎందుకోసం చేస్తున్నట్టు రమేష్..అని  నేనడిగినప్పుడు..’ఈ భిన్న అణచివేతల మధ్య నలిగిపోతున్న..నిస్సహాయంగా అణగారిపోతున్న అతి సామాన్య భారత పౌరులనూ, వాళ్ల వెతలనూ చూస్తున్నప్పుడల్లా నేను ఒకసారి ఒక ఏక పాత్రాభినయాన్ని..కొన్నిసార్లు బహు పాత్రాభినయాన్ని..మరికొన్నిసార్లు..జనంలోనుండే అకస్మాత్తుగా ఏ మేకప్పూ లేని పాత్రలతో ఒక వీధి నాటకంగా నన్ను నేను మార్చుకుని మౌన వేదననూ,దుఃఖాన్నీ ప్రకటిస్తూ ప్రదర్శిస్తున్నానన్నా..’ అని వాపోయినప్పుడు..నిజంగానే నేను స్తబ్దుణ్ణైన  సందర్భాలు చాలా ఉన్నాయి.రమేష్ కు తన ఈ ‘ లైఫ్ ఫోటోగ్రఫీ ‘ ఒక ఎమిటివ్ మీడియా(emittive media)..ఒక బలమైన వ్యక్తీకరణ మాధ్యమం. ఒక ప్రత్యేక భాష..ఛాయా చిత్ర  భాష అది.ఉద్వేగపూరితుడైన ఒక కళాకారుడు తన్ను తాను ఖాళీ చేసుకుంటే తప్ప మళ్ళీ తనను తాను తాజా ఆలోచనలతో పునరావేశపర్చుకోలేడు.అదే జరుగుతోంది ఇతని ఈ అనంత ప్రయాణంలో.

ఒక సృజనకారుని ఆలోచనలూ,అన్వయింపులూ నిజగానే చాలా చిత్రంగా ఉంటాయి.ప్రతి భారతీయ స్త్రీకి..ముఖ్యంగా తెలుగు స్త్రీలకు..తన ఇంటి వాకిలే ఒక కాన్వాస్..రంగస్థలం.ప్రతిరోజూ తన నిత్యనూతన సృజనాత్మకతతో తన ఇంటి చారెడు మట్టి వాకిలిని తన ముగ్గులతో (రంగవల్లులతో) శోభింపజేసి  సౌభాగ్య ప్రదాతయైన దేవునికీ,తన ఇంటికి వచ్చే ప్రతి అతిథికీ స్వాగతం పలుకుతుంది స్త్రీ.ప్రతి దినమూ ఒక కొత్త ముగ్గు.కొత్త రూపు.కొత్త అలంకరణ. కొత్త రంగులు.ఇంత ప్రశస్తమైన ‘ముగ్గులను ‘ ఒక అంశంగా తీసుకుని రమేష్ బాబు 5000 చిత్రాలను తీశాడు.అంటాడు..” అన్నా..ఈ ముగ్గుల ఫోటో లైబ్రరీ 2020 తర్వాతి తరంకోసం.ఎందుకంటే..ఇక రాబోయే తరానికి మట్టి వాకిళ్ళుండవు.అన్నీ కాంక్రీట్ జంగళ్ళే.వాళ్ళు ఈ నా ఫోటోలలోనే తమ  గత వైభవాన్ని చూసుకుంటూ మున్ముందు మురిసిపోవాల్సి  ఉంటుంది” అని.నిజమే ఇది.

కెమరా అనే ఆయుధంతో..భిన్న విన్యాసాలను విజయవంతంగా చేస్తున్న రమేష్ బాబు..తన గురువైన రఘురాయ్ జీవిత కథను అత్యంత ప్రేమతో..భక్తితో..’ సత్యం శివం సుందరం’ పేరుతో ఒక బృహత్ గ్రంథాన్ని  వెలువరించాలని 2010 నుండి శ్రమిస్తున్నాడు.బహుశా రఘురాయ్ జన్మదినమైన రాబోయే డిసెంబర్ 18 న ఆవిష్కరిస్తాడేమో.

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించిన తన తండ్రి కె.కిషన్(కె కె)..తమ ఊరు..ఎల్లారెడ్డి పేట లో నడిపిన  జ్యోతి చిత్రాలయ..స్వాతి ఫోటో స్టూడియో..లో ఫోటో కళ ‘అ ఆ’ లను నేర్చుకున్న రమేష్ బాబు..ఇప్పటికి ఆ కళలో పోస్ట్ డాక్టోరల్ డిగ్రీని సాధించాడనే నావంటి ‘ సామాన్యు ‘ లం అనుకుంటున్నాం.ఐనా ఇంకా సాధించవలసింది అనంతమే కదా.

సామాన్యుని గురించే నిరంతరం తపించే రమేష్..తన పాత్రికేయ,ఛాయచిత్ర కృతులన్నింటినీ ‘ సామాన్య శాస్త్రం ‘ పేరనే వెలువరిస్తూ వస్తున్నాడు.తనకు నచ్చిన కొన్ని ఫోటోలతో 2012 లో ‘ జీవనచ్ఛాయ ‘ పేర,2014 లో ‘ చిత్రలిపి..మగువల ముగ్గులు ‘ పేర నిర్వహించిన రెండు ఫోటో ఎగ్జిబిషన్ లలో తనేమిటో ఋజువు చేసుకున్నాడు. ప్రదర్శనశాలల్లో సాధారణంగా ఒక కళాకారుడు తనకు నచ్చిన తన చిత్రాలనే పెడుతాడు.ఆ విధంగా..నేను చూచినంత వరకు రమేష్ బాబు ఫోటోలన్నీ ఎగ్జిబిషన్ లలో ప్రదర్శన కనువైనవే..అర్హమైనవే. వాటినే గనుక  ప్రదర్శిస్తే..ఆ హాల్ కొన్ని కిలోమీటర్ల పొడవు వుండి..ఒక ‘ వరల్డ్ రికార్డ్ ‘ ఎగ్జిబిషన్ ఔతుందేమో.ఐనా కందుకూరు రమేష్ బాబు తప్పకుండా అందరూ గుర్తించవలసిన ” రేపటి  ప్రపంచ స్థాయి  లైఫ్ ఫోటోగ్రాఫ రే ” కదా.

*

 

మీ మాటలు

 1. అబ్బ! ఈ అద్బుత ఛాయా చిత్రంపై నాదే మొదటి కామెంట్ కావాలనుకున్నాను. ఆ అవకాశం దక్కినందుకు చెప్పరాని ఆనందం. ఎందుకంటే ఈ photo exhibition inaugural function పాల్గొని ఇప్పుడే బయటికి వచ్చాను. కనుల నిండా original ఫోటోను చూసిన భాగ్యవంతుల్లో నేనొకడిని.కళ్ళలో నిండిపోయి ఫోటో అక్షరాలకు అడ్డొస్తుంది.

  • kandukuri ramesh babu says:

   అన్న. చాల ఆనందంగా ఉంది. ఎంత బాగా జరిగింది ప్రారంబం. థాంక్ యు వేరి మచ్ అన్న. అలిశెట్టి ప్రభాకర్ ఉంటె ఎంత సంతోషించే వాడు!

 2. కొట్టం రామకృష్ణారెడ్డి says:

  ఇప్పుడే ఇంటికి వచ్చాక, కంప్యూటర్ పెట్టి చూస్తే, కందుకూరి రమేష్ బాబు గురించి కనిపించింది. ఈ మధ్య గత కొద్ది కాలంగా అతని ఫోటోలను గమనిస్తున్నాను, నిజంగా అతని రచనల లాగే మనసుని లాగేస్తాయి. సజీవమైన కథలని వినిపిస్తాయి,బహుశా చూపిస్తాయి అనాలేమో, అవి కదిపేస్తాయి, కుదిపేస్తాయి. అతని వ్యక్తిత్వం అతని ఫోటోలలో కనిపిస్తుందని అనిపిస్తుంది.

 3. Dr.Pasunoori Ravinder says:

  ఒక నిబ‌ద్ధ‌త‌తో, స‌మాజం ప‌ట్ల అవ్యాజ్య‌మైన ప్రేమ‌తో, సామాన్యజ‌నం ప‌ట్ల గుండెల నిండా పాయిరంతో కందుకూరి ర‌మేష‌న్న చేస్తున్న కృషి అజ‌రామ‌రమైంది. ర‌మేష‌న్న ప్ర‌స్థానానికి ఈ వ్యాసం ఒక బ్యూటిఫుల్ ఫోటో, పోట్రెయిట్‌.
  ఆల్ ది బెస్ట్ టూ హిస్టారిక‌ల్ ఎగ్జిబిష‌న్‌. ఒక అసామాన్యమైన‌ ఫోటోగ్రాఫ‌ర్‌ను అద్భుతంగా ప‌రిచయం చేసిన రామా చంద్ర‌మౌళి సార్‌కి, ప్ర‌చురించిన సారంగ్‌కి థ్యాంక్స్‌…
  -డాక్ట‌ర్ ప‌సునూరి ర‌వీంద‌ర్‌

  • kandukuri ramesh babu says:

   బ్యూటిఫుల్ ఫోటో, పోట్రెయిట్‌. నిజం చెప్పావు తమ్మీ. థాంక్ యు,
   నువ్వు రావాలి. కలిసి ఆ బొమ్మను చూద్దాం బ్రదర్…

 4. mercy margaret says:

  ..’ఈ భిన్న అణచివేతల మధ్య నలిగిపోతున్న..నిస్సహాయంగా అణగారిపోతున్న అతి సామాన్య భారత పౌరులనూ, వాళ్ల వెతలనూ చూస్తున్నప్పుడల్లా నేను ఒకసారి ఒక ఏక పాత్రాభినయాన్ని..కొన్నిసార్లు బహు పాత్రాభినయాన్ని..మరికొన్నిసార్లు..జనంలోనుండే అకస్మాత్తుగా ఏ మేకప్పూ లేని పాత్రలతో ఒక వీధి నాటకంగా నన్ను నేను మార్చుకుని మౌన వేదననూ,దుఃఖాన్నీ ప్రకటిస్తూ ప్రదర్శిస్తున్నానన్నా..’ అని వాపోయినప్పుడు…..
  నిజమే రోజో ఏదో ఒక జీవిత చిత్రం చూడడం తెలుసు గాని ఫేస్ బుక్ లో ,అలాగే సారంగ ఫీచర్ చదవడం వరకు తెలుసు గాని మౌళి సర్ మీ ఈ పరిచయం చదివాక నాకు రమేషన్న గురించి చాలా తక్కువ తెలుసు అనిపించింది ..

 5. My 2nd innings on KRB’s THE PICTURE.
  Exhibition ఆరంభిస్తూ భారతభూషణ్ అన్నట్లు ఈ చిత్రం వేయి భావాల చెలిమె. తలపై నిలువెత్తు మనిషిని మోస్తూ లాఘవంగా అడుగులేసే కూటివిద్య విన్యాసమిది. Normal life లో చూసే దృశ్యాన్ని ఎలా frame లో బిగిస్తే కళాఖండం అవుతుందో,ఆ ప్రతిభ రమేష్ బాబుకు ఎంత వుందో ఆయన నిరూపించుకున్న సందర్భాలెన్నో. Beyond the frame అంతా మన ఊహలకు వదిలేయడం ఓ ప్రజ్ఞ .
  నాకైతే ఈ సాహసి భూగోళాన్ని మోస్తున్న Hercules.
  ముత్యాలసరాలు వేలాడే కిరీటం లేకుండా కృష్ణ రాయల్నిఊహించుకోలేము.వేళ్ళ వెండి పట్టీల కాళ్ళ కిరీటదారి ఈ ధీరుడు. ఆమె కుడి కాలి బొటనవేలు గోరు కమిలిపోయి వుంది. కమిలిన నలుపు రంగు వేలే ఆ కిరీటానికి మరకతము.
  తరువుకు గిరి భారమా గిరికి తరువు భారమా అన్నాడు సినీకవి. తరువును మోస్తున్న గిరి ఇతడు. బోడగుట్ట ఓ నిర్జీవి, సమాధి.
  పచ్చ బొట్టేసిన…(బాహుబలి) పాటలో ఇరువురి బాహువులు కలిస్తే నెమలి బొమ్మ పురి విప్పినట్లు ఇక్కడ శిరసు పై పాదాలు ఆ synchronization కు దృశ్యమానం.
  ఇప్పుడు వాళ్ళెక్కడ సేద తీర్చుకున్టున్నారో గాని..వారి చిత్రానికి దక్కిన ఈ గౌరవం, నీరాజనం వారికి తెలిస్తే ఎంత బాగుండు.
  మామూలుగా ఫోటో తీయడమే ఓ కళ. అంత రద్దీలో బ్యాలెన్సు కోసం కదులుతుండె వారిని ఇంత అద్భుతంగా కెమరాలో బంధించడం రమేష్ ప్రజ్ఞకు ఓ పరీక్ష.
  చివరగా ..రమేష్ బాబు తన కెమరాను,photographyని లాఘవంగా balance తప్పకుండా జాగ్రత్త పడుతున్నట్లు ఆ బొమ్మలో కనబడ్డాడు.
  Undoubtedly it is a world class masterpiece in photography.

  ( అఫ్సర్ గారూ ఈ కామెంట్ మీ కంట పడితే straight information గా ఓ click కు అందుబాటులో ఉంచితే హైదరాబాదీలకు ఈ జీవన చ్చాయా చిత్రాన్ని చూసే భాగ్యం కలిగించిన వారవుతారు .ఆదివారం 23.08.2015 వరకే ఈ సౌభాగ్యం )

మీ మాటలు

*