అతనొక వేకువ పసిమి వెలుతురు…

 

కుప్పిలి  పద్మ
(ఆగస్టు పదిహేడు త్రిపురనేని శ్రీనివాస్ కన్ను మూసిన రోజు)
 

త్రిపురనేని శ్రీనివాస్ ని తలచుకోవడమంటే వేకువ కంటే  ముందు  వికసించే సూర్యోదయాన్ని,    వసంతమేఘ ఘర్జనని, శరత్కాలపు వెన్నెలని,  యువకవుల కవిత్వపు సెలిబ్రేషన్ని తలచుకోవటం.
* * *
వొకకానొక వసంత కాలపు సాయంకాలం.  వొక సాహితీ  మీటింగ్ ప్రాంగణంలో వుపన్యాసం వింటూ ఆకాశంలో నిండు చందమామని చూస్తున్నాను.
వో నవ్వు మాటలు కలగలసిన పిలుపు. వెనక్కి చూసాను. కిసుక్కున నవ్వుతోన్న చందమామ.  తిరిగి ఆకాశం వైపు చూసాను. ఆ ఆకాశపు చందమామ అక్కడే వున్నాడు.  మరి యెవరీ చందమామ అని తిరిగి చూసాను.  కృష్ణ గాలులు నులివెచ్చగా  వీస్తున్న ఆ మల్లెల కాలంలో ‘ప్రవహించు గోదావరి’ని   చూసాను.
 * * *
‘గోదావ‌రీ ప్ర‌వ‌హించు ‘  అంటూ  తిపురనేని శ్రీ‌నివాస్‌, సౌదా  కలసి సాహిత్యప్రవాహం లోకి కలసి ప్రవహించటం  మొదలుపెట్టారు.అప్పుడు  ఆ కవిత్వనవ్య ధార తళతళతో  చదవురుల మనసులని మిలమిలలాడించింది.

ఆ తరువాత
‘కవిత్వం కావాలి  కవిత్వం

అక్షరం నిండా  జలజలలాడిపోయే
కవిత్వం కావాలి
ప్రజల మీదే రాయి
ప్రజలల్లోని  అగాధ గాధల  మీదే రాయి
కవిత్వం రాయి
కాగితం మీంచి కన్నులోకి వెన్నులోకి గన్నులోకి
దూసుకు పోయే కవిత్వం రాయి
అలా వొక వాక్యం చదవగానే
శత్రువు ఠారెత్తి  పోవాలి
అమాయకుడు ఆయుధమై హోరెత్తి పోవాలి
కవిత్వం వేరు వచనం వేరు
సాదాసీదా డీలా వాక్యం రాసి
కవిత్వమని బుకాయించకు
కవిత్వాన్ని వంచించకు
వచనమై తేలిపోతావ్…  అంటూ పదునైన కవిత్వంతో  1989లో త్రిపుర‌నేని శ్రీ‌నివాస్ ‘ర‌హ‌స్యోద్య‌మం’ ప్రచురించారు. తెలుగు విప్ల‌వ క‌విత్వం సరికొత్తగా  రెపరెపలాడింది. ఆ సరి కొత్త గాలితో  కవిత్వపు హృదయాలు వుప్పొంగాయి.
యిప్పుడు మళ్ళీ  ఆ ‘ర‌హ‌స్యోద్య‌మం’ వేగుంట మోహ‌న‌ప్ర‌సాద్ గారి ఆంగ్లానువాదంతో రెండు  భాష‌ల్లో, కె.శ్రీనివాస్ గారి ముందు మాటతో  రాబోతోన్నయీ పుస్తకాన్ని శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వ‌రావు  గారు ప్ర‌చురించారు. విశ్వేశ్వర రావు గారి  కవిత్వం మీద వున్న గౌరవానికి,  శ్రీను  మీద వున్న  ప్రేమకి, యీ పుస్తకం వొక  నిదర్శనం.  ఆ  పుస్తకం రావటం అన్నది శ్రీను స్నేహితులకి, ఆప్తులకి యెంత  సంతోషాన్ని  కలిగిస్తుందో  కవిత్వాభిమానులకి అంతే ఆనందాన్ని యిస్తుంది.
యిప్పటికీ నవయవ్వనంతో తేజోవంతంగా  ప్రకాశిస్తోన్న  త్రి. శ్రీ. కి కవిత్వం రాయటమే కాదు యెక్కడ కవిత్వంలో కొత్తదనం కనిపించినా , అస్తిత్వాల   ఆనవాలు మెరిసినా  యెంతో  యిష్టంగా ప్రారంభించిన  క‌విత్వ ప్ర‌చుర‌ణ‌ల నుంచి 1990 నుంచి 94 వ‌ర‌కు 14 పుస్తకాలు ప్రచురించాడు. వస్తువు, రూపం వ్యైవిధ్య భరితం.  అవి వరుసగా

1. క్రితం త‌ర్వాత‌… ఆరుగురు యువ క‌వుల సంయుక్త క‌విత 2. యెక్క‌డైనా యిక్క‌డే… ప్రీతిష్‌నంది క‌విత్వానువాదం త్రిపుర‌నేని శ్రీ‌నివాస్ 3.19 క‌విత‌లు… గాలి నాస‌ర‌రెడ్డి  4. ఒఖ‌డే… స్మైల్  5. బ‌తికిన క్ష‌ణాలు… వేగుంట మోహ‌న‌ప్ర‌సాద్ 6. ఇక ఈ క్ష‌ణం… నీలిమా గోపీచంద్ 7. ఫోర్త్ ప‌ర్స‌న్ సింగుల‌ర్‌… గుడిహాళం ర‌ఘునాథం 8. బాధ‌లూ-సంద‌ర్భాలూ… త్రిపుర 9. గురిచూసి పాడే పాట‌…స్త్రీవాద క‌విత‌లు 10. ఎన్నెలో ఎన్నెలో… రావిశాస్త్రి క‌విత్వం 11. పుట్టుమ‌చ్చ‌… ఖాద‌ర్ మొహియుద్దీన్ 12. మ‌రోవైపు… దేశ‌దే శాల క‌విత్వానువాదం త్రిపురనేని శ్రీ‌నివాస్ 13.స్వ‌ప్న‌లిపి… అజంతా 14.అజంతా 14. చిక్క‌న‌వుతున్న పాట‌… ద‌ళిత క‌విత్వం 15. హో… త్రిపుర‌నేని శ్రీ‌నివాస్ క‌విత్వం. 1997లో క‌విత్వం ప్ర‌చుర‌ణ‌లు 15వ పుస్త‌కంగా శ్రీను  స్నేహితులు ప్ర‌చురించారు.

*  *  *
అస్తిత్వ‌వాద వుద్య‌మాల  వేకువలో  శ్రీను తను యించార్జ్ గా వున్న  వార్తాపత్రికల్లో స్త్రీ, ద‌ళిత‌, మైనారిటీ వాదాల సాహిత్యానికి  మొదట  ప్రాధాన్యత నిచ్చేవాడు. కధ నైనా,
కవిత్వానైనా  మామూలుగా  రాస్తే నిర్మొహమాటంగా  యిది యీ కాలపు రచన కాదని చెప్పేవాడు.
నేను బలంగా నమ్మే, యిష్టమైన  స్త్రీ వాద ఫిలాసఫీతో  రాసిన మసిగుడ్డ  కథని శ్రీను ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో  ప్రచురించాడు.  ఆ కథకి వచ్చిన అద్భుతమైన  రెస్పాన్స్ చూసి నేను   ఆశ్చర్యపోయాను. ఆ కథ  స్త్రీ వాద కధా  ప్రపంచంలో స్పష్టమైన స్త్రీవాద కథకురాలిగా  నిలబెట్టింది.
ఆ తరువాత మరి కొన్ని కథలు వివిధ పత్రికల్లో  అచ్చుఅయ్యాయి. నిర్ణయం కథ చదివి అందులో వైష్ణవి పిల్లల  విషయంలో తీసుకొన్న నిర్ణయం చూసి గట్టిగా నవ్వుతూ  ‘ అరే, యీ విషయంలో కూడా  మా మగవాళ్ళ కి  నిర్ణయించే హక్కుని వుంచవా ‘  అని అడిగాడు. ఆ తరువాతెప్పుడో  ఆ కథలో  నీ నరేషన్ చాల నచ్చింది.  కుటుంబాలకి సంబంధించిన  ఆ ముఖ్యమైన అంశం అంత సునాయాసంగా చర్చించావో అని చెప్పినప్పుడు తిరిగి వొక సీరియస్ చర్చ. భలే  భాద్యతగా చర్చించేవాడు.
నా  రెండవ కథా సంకలనం ‘ ముక్త ‘  శ్రీనివాస్ కి  అంకితం యిచ్చాను.
 * * *
మోడల్స్  జీవితం పై వొక కథ రాసాను.  ఆ కథ చదివి  శ్రీను అటువంటి అనేక లేయర్స్ వున్న వస్తువుని  తీసుకొన్నప్పుడు ఆ విషయాలలో  సంక్లిష్టతని పాత్రల స్వభావాలని  మరింత అవగాహనతో రాయాలని, అందులోని విషయాలని మరింత లోతుగా అర్ధం చేసుకోడానికి వసంతలక్ష్మి గారు, వసంత  కన్నభిరన్ గారి వంటి అనుభవజ్ఞులతో  మాట్లాడితే  విషయాలు మరింత బాగా అర్ధం అవుతాయని వొక  వుత్తరం రాసాడు. ఆ వుత్తరం  వొక కథకురాలిగా  నన్ను నేను మరింత మెరుగుపరచుకోడానికి  తోడ్పడింది.
 * * *
త్రి శ్రీ.  సాహిత్యానికి  సంబంధించి హితబోధలు  చెయ్యకుండా వొక మంచి మాట, వొక సూచన  చేస్తే మాత్రం అవి ఆ  రచయితకి, సాహిత్యానికి  అత్యంత విలువైనవిగా వుండేవి.
కథలో అస్థిత్వాన్ని అంతర్లీనంగా రాసినా,  ప్రస్పుటంగా రాసినా సరే  కథ యెప్పుడు కథకి  సంబంధించిన యీస్థటిక్స్ తో  కథ కథలానే  వుండాలి వ్యాసం లా  వుండకూడదనే వాడు.
 * * *
అస్తిత్వ వాదరచనలని  అర్ధం చేసుకోవటంలో,  ప్రచురించటం పై యెనలేని అవగాహన వుండేది తనకి.  రాబోయే కాలపు  సాహిత్య ప్రవాహానికి  తను  ముందుగానే తెరచిన తలుపుల్లోంచి  అస్థిత్వ వాద సాహిత్యం యెలా వొప్పొంగిందో  మనం  చూస్తూనే వున్నాం.
 * * *
బిమల్ రాయ్  సుజాతని చూస్తే  కళ్ళు చెమ్మగిల్లే   శ్రీనుకి మన నాగేశ్వరరావు గారి దేవదాసే దేవదాస్…  వొక పాజిటివ్ ద్ధిక్కారపు  సంతకం  యెప్పుడు వొకలానే  యెందుకుండదో, వుండలేదో  త్రిపురనేని శ్రీనివాస్ కి  ఖచ్చితంగా అప్పుడే  తెలుసు. ఆ  తరువాత సాహిత్య ప్రపంచానికి మెల్లమెల్లగా  తెలియసాగింది.
* * *
 త్రిపురనేని శ్రీనివాస్ ని తలచుకోవడమంటే వేకువ కంటే  ముందు  వికసించే సూర్యోదయాన్ని, వసంతమేఘ ఘర్జనని, శరత్కాలపు వెన్నెలని,  యువకవుల కవిత్వపు సెలిబ్రేషన్  న్ని తలచుకోవటం మాత్రమే కాదు  వొక సాహిత్య  యవ్వనోత్సాహాన్ని నెమరేసుకోవటమే.
Kuppili Padma Photo

మీ మాటలు

  1. Delhi Subrahmanyam says:

    కొత్త విషయాలతో త్రిపురనేని శ్రీనివాస్ జ్జ్ఞాపకాలు తెలిపిన పద్మ గారికి అభినందనలు. సాధారణం గా తత్న రచనా మీద గానీ తన నాటక మీద కానీ విమర్శ అంతా ఇష్ట పడరు . కన్నె పద్మ గారు చాలా నిజాయితీగా రాసిన ” మోడల్స్ జీవితం పై వొక కథ రాసాను. ఆ కథ చదివి శ్రీను అటువంటి అనేక లేయర్స్ వున్న వస్తువుని తీసుకొన్నప్పుడు ఆ విషయాలలో సంక్లిష్టతని పాత్రల స్వభావాలని మరింత అవగాహనతో రాయాలని, అందులోని విషయాలని మరింత లోతుగా అర్ధం చేసుకోడానికి వసంతలక్ష్మి గారు, వసంత కన్నభిరన్ గారి వంటి అనుభవజ్ఞులతో మాట్లాడితే విషయాలు మరింత బాగా అర్ధం అవుతాయని వొక వుత్తరం రాసాడు. ఆ వుత్తరం వొక కథకురాలిగా నన్ను నేను మరింత మెరుగుపరచుకోడానికి తోడ్పడింది.” మాటలకి ఆవిడని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.. కవిత్వం కావాలి కవిత్వం
    అక్షరం నిండా జలజలలాడిపోయే
    కవిత్వం కావాలి
    ప్రజల మీదే రాయి
    ప్రజలల్లోని అగాధ గాధల మీదే రాయి
    కవిత్వం రాయి
    కాగితం మీంచి కన్నులోకి వెన్నులోకి గన్నులోకి
    దూసుకు పోయే కవిత్వం రాయి
    అలా వొక వాక్యం చదవగానే
    శత్రువు ఠారెత్తి పోవాలి
    అమాయకుడు ఆయుధమై హోరెత్తి పోవాలి

    రాసిన త్రిపురనేని శ్రీనివాస్ యెప్పటికీ చిరస్మరణీయుడే

    • Kuppili Padma says:

      ఢిల్లీ సుబ్రహ్మణ్యం గారు, నమస్తే. మీవంటి అనుభవజ్ఞులు యీ చిన్ని వ్యాసంపై మీ అభిప్రాయం చెప్పటం, శ్రీనుని తలచుకోవటం, ఆ కవిత్వాన్ని పలవరించటం మీరు సాహిత్యాన్ని యెంతగా ప్రేమిస్తారో తెలియచేసింది మరోసారి. మన ఆలోచనలని మెరుగు పరిచే మంచి సూచనలు చేసేవారిని మరచిపోకూడదని నేను నమ్ముతాను. Thank you.

  2. g.venkata krishna says:

    కత మీద త్రిశ్రీ అభిప్రాయం చాలా ఆప్ట్ గా ఉంది .త్రిశ్రీ ని ఒకే ఒక్కసారి చూ సిన అనుభవం నాది ఎప్పటికి గుర్తుండిపోయే జ్ఞాపకం .పద్మ గారికి థాంక్స్ ..

  3. కె.కె. రామయ్య says:

    ‘ధగ్దమైనా సరే, సూర్యుడినే కౌగలించుకుంటాను’ అన్న త్రిపురనేని శ్రీనివాస్‌ ని ఎంతో ఆర్తితో స్మరించారు పద్మగారు.
    శ్రీనివాస్ అంటే త్రిపుర గారికి ఎంతో ఇష్టమని రాయటం మరిచారేమో.
    ‘స్వప్నలిపి’ కవిత్వ పుస్తకాన్ని ప్రచురించటానికి ఎందరెందరో ప్రయత్నించినా మొగ్గు చూపని అజంతా గారు శ్రీనివాస్ కోరిన తర్వాతే అందుకు అంగీకరించారనీ పెద్దలు చెపుతుంటారు.

    తనని అత్యంతంగా అభిమానించిన ‘ మో’ గారు, గాలి నాసరరెడ్డి గార్లు త్రిపురనేని శ్రీనివాస్‌ గురించి ఏవన్నారో వినాలనుంది.
    త్రిపురనేని శ్రీనివాస్ యెప్పటికీ చిరస్మరణీయుడే.

    • Kuppili Padma says:

      కె.కె. రామయ్య గారు, మీకు త్రిపురగారంటే భలే యిష్టం కదా మాకు యిష్టమైనట్టే. శ్రీను అంటే త్రిపుర గారికి యిష్టం. శ్రీనుకీ యిష్టమే. త్రిపురగారు నేను చాల సార్లు తన గురించి మాట్లాడుకునేవాళ్ళం. మర్చిపోలేదు. కాని యిక్కడ యెన్నోరాయాలి. అజంతా గారు శ్రీను గురించి నాకు యెంతో ప్రేమగా చెప్పినవి చాల విషయాలు వున్నాయి. అలానే స్మైల్ గారు. శివసాగర్ గారు. మో గారు… యిలా యెంతో మందికి శ్రీను అంటే చాల ప్రేమ. అవన్నీ యిందులో రాయటం యెలా ?! నాసరరెడ్డి గారు వొక రైట్ అప్ రాసారు. చాల విషయాలు రికార్డ్ చెయ్యాల్సినవి వున్నాయి. Thank you.

  4. Aranya Krishna says:

    చాలా మంచి సంస్మరణ. శ్రీనివాస్ ని మనం ఎంత మిస్ అవుతున్నదీ పద్మ గారి స్మరణిక తెలియచేస్తున్నది. సామాజిక ప్రయోజనంతో అలరారుతున్న ఆధునిక తెలుగు కవిత్వానికి ఈస్తటిక్స్ అద్దటానికి శ్రీనివాస్ చేసిన కృషి అమోఘం. ఓ కవి వయసైపోయి కనుమూస్తేనే ఎంతో బాధపడతాం. మరి ఉద్యమ కాంక్షతో రగిలిపోయే ఓ యువకవి చేతిలో జెండా పట్టుకునే మరణిస్తే ఎంత బాధాకరం? 15, 20 సంవత్సరాల క్రితం ఎలా వుందో తెలుగు కవిత్వం ఈ రోజున కనీసం అదే స్థితిలో ఉందా అనే సందేహం కలుగుతుంది. తెలుగు కవిత్వం రాసి పరంగా, వాసి పరంగా ఎదగాల్సినంతగా ఎదగకపోవటం త్రిశ్రీ లేని లోటు వల్ల కూడా కావొచ్చు.

    • Kuppili Padma says:

      అరణ్య కృష్ణ గారు, ‘సామాజిక ప్రయోజనంతో అలరారుతున్న ఆధునిక తెలుగు కవిత్వానికి ఈస్తటిక్స్ అద్దటానికి శ్రీనివాస్ చేసిన కృషి అమోఘం’ – అవునండి. Thank you .

  5. Rajaram t says:

    త్రి.శ్రీ స్మరణ వ్యాసం బాగుంది.అతని జ్ణాపకాలు మళ్లిఒ మరోసారి గుర్తొచ్చాయి.

  6. buchireddygangula says:

    సంస్మరణ — చాలా భాగుంది Padma గారు

    Srinivas గారి బుక్స్ — ఎక్కడ దొరుకుతాయో తెలియచేస్తారా —దయతో
    store.name..//phone. number..
    e-mail.me— hanamkonda.@aol. com.
    —————————————————————————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  7. తిలక్ బొమ్మరాజు says:

    కుప్పిలి పద్మ గారు మీరు రాసిన యీ వ్యాసం చాలా బాగుంది.యింతకు ముందు త్రిపురనేని శ్రీనివాస్ గారి గురించి మీరు రాసిన వ్యాసాలు చదివాను.ఆయన కవిత్వం గురించీ,సాహిత్యం గురించీ యింత క్షుణ్ణంగా రాయడం చాలా సంతోషానిచ్చిమ్ది.ఆయన కవిత్వం మీదా,కథల పైన మీకున్న ప్రేమను యిలా అక్షరాలుగా కురిపించడం యెంతగానో నచ్చింది.థాంక్యు.

  8. ప్రసాదమూర్తి says:

    పద్మా సాహిత్య యవ్వనోత్సాహంతో త్రి.శ్రీ.ని తలుచుకున్న తీరు బాగుంది. మనం స్మరించే వ్యక్తిని బట్టి మన భాష రూపుదిద్దుకుంటుంది. అది నీ వ్యాసంలో అలవోకగానే వచ్చి వుంటుంది. నాకు కూడా శ్రీనివాస్ తో చాలా అనుబంధం వుంది. నా మొదటి కవితా సంపుటి మొత్తం దళిత బహుజన స్త్రీవాదాలతో నిండిపోవడానికి కారణం శ్రీనివాసే. అతను చనిపోయినప్పుడు నేను రాసిన ఆయుధానికి మెరుపు నువ్వే అనే కవిత నా మొదటి సంకలనంలో వుంది. నువ్వు రహస్యం తోలు తీసిన రహస్యానివి..ఒక్క నిజాయితీ వాక్యం కోసం ముప్పయి వసంతాలు రాల్చుకున్నవాడివి అని అప్పుడు నేను రాసిన కవితా వాక్యాలు ఇంకా గుండెల్లో కదులుతూనే వున్నాయి. త్రి.శ్రీ.ని ఉరకలెత్తే భాషలో తల్చుకున్నందుకు అభినందనలు.

  9. Kuppili Padma says:

    BUCHIREDDYGANGULA garu, రహస్యోద్యమం కావాలంటే శ్రీశ్రీ ప్రింటర్స్ వారు పంపించగలరు. వారి మెయిల్ id kavita.viswam@gmail.com ( వారి అనుమతితోనే మెయిల్ id ని యిస్తున్నాను. ఆసక్తి గలవారు ఆ మెయిల్ id కి రాయవచ్చు ) Thank you .

  10. Kuppili Padma says:

    తిలక్ గారు , thank you .

  11. Kuppili Padma says:

    ప్రసాద్ మూర్తి గారు , మీరు మీ జ్ఞాపకాలని పంచుకోవటం బాగుంది.Thank you .

మీ మాటలు

*