తనదే ఆ ఆకాశం!

 

చైతన్య పింగళి 

chaitanya

(ఇది చైతన్య పింగళి మొదటి కథ.

చైతన్య గతంలో “చిట్టగాంగ్ విప్లవ వనితలు” అనే పుస్తకంతో పాటు కొన్ని వ్యాసాలు రాశారు. భారతదేశంలో వ్యక్తిగత పోరాటాలు కాకుండా ఒక విప్లవ సంస్థలో వనితలు చేరడం చిట్టగాంగ్ లో స్థాపితమైన ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీతోనే మొదలు. చైతన్య పుస్తకం ఈ చారిత్రాత్మకమైన పోరాటానికి అక్షర నివాళి. దీంతో పాటు ఇతర అనేక వ్యాసాలు రాసినప్పటికీ చైతన్య కథా రచనా ప్రయత్నం ఇదే మొదలు)

వారం రోజులుగా ఆమె రావటం లేదు. ఐదింటికే ఆమె వాకింగ్‌ ట్రాక్  మీద నిదానంగా నడుస్తుండేది.

పూల వాసన చూస్తూ… పూల చెట్ల పక్కన నిలబడి గాలి పీలుస్తూ.. కులాసాగా నడిచేది. సరిగ్గా నా వాకింగ్‌ పూర్తి అయ్యేసరికి ఆ అపార్ట్మెంట్ల  మధ్య సందుల్లో నుండి పారిజాత కాడ రంగులో మెరుస్తున్న సూర్యుడు కనిపించేవాడు. ఆకాశంలో పుడుతున్న సూర్యుడిని చూస్తూ నిలబడిపోయేది. సూర్యుడిని మామిడి పండు అనుకుని ఆత్రంగా చూసే చంటి హనుమంతుడు ఇలాగే ఉండేవాడేమో అనిపించేది ఆమె మొహం చూస్తే. నాలుగు నెలలుగా చూస్తున్నా – ప్రతి రోజూ ఇదే వరస. ఇక ఆమె వాకింగ్‌ చేసేది ఎప్పుడు? ఒళ్ళు తగ్గేది ఎప్పుడు? అని నాకనిపించేది.

ఒకరోజు ఉండబట్టలేక, వేగంగా నడుస్తూనే ఆమెకి చెప్పాను. “ఇలా నడిస్తే సన్నబడరండి” అని. ఆమె చటుక్కున నవ్వింది.

“నేను సన్నబడాలని అనుకోవట్లేదండి” అంది.

“మరి అంత పొద్దున్నే ఎందుకొస్తారండి?” అని ఆశ్యర్యంగా అడిగా. నా మొహం ఎలా కనిపించిందో ఏమో కాని మళ్ళీ నవ్వుతూ “ఊరికే!” అంది.

ఊరికేనా!! సన్నబడాలనుకోకపోతే, ఇంకో గంట దుప్పటి తన్ని పడుకోక, ఊరికే అలా పొద్దున్నే ఎందుకు లేవటం!? అనిపించింది.

ఆ రెండో రోజు నుండే ఆమె కనిపించలేదు. నేను నడిచేటప్పుడు పదే పదే పార్కు మెయిన్‌గేట్‌ వైపు చూసేదాన్నిఆమె వస్తుందేమో అని. ఎందుకు రావట్లేదు? నేను అడిగినందుకు ఏమన్నా ఫీల్‌ అయిందా? ‘ఊరికే రావటం ఎందుకూ, నిద్రపోక’ అని ఆమెకే అనిపించిందా? ఆరోగ్యం బాలేదా? అయినా, నాకెందుకు ఎవరెట్లా నడిస్తే… నోటి దురద కాకపోతే! అని కనీసం వందసార్లు తిట్టుకుని ఉంటా.

నాలుగో రోజు అనుకుంటా.. ఆగలేక, పక్కనే గడ్డిలో యోగా చేసుకుంటున్న ఓ పెద్దావిడని అడిగా – “రోజూ వస్తుంది చూడండి… పొడుగు జుట్టు, చిన్న కళ్ళు, ఒకావిడ… ఆమె మీకు తెలుసా?” అని.

“లక్ష్మా? తెలుసు. ఏదైనా పని మీద ఎక్కడికైనా వెళ్ళిందేమో!” అన్నది.

ఆ పెద్దావిడ నేను అడగకుండానే లక్ష్మిని గురించి ఇంకొన్ని విషయాలు చెప్పింది. ఊరుకోరుగా ఏదో ఒకటి చెప్పకపోతే తోచదు మనకి మానవులకి.

ఆమె పేరు లక్ష్మి అన్నమాట అనుకున్నాను. ఇంకో మూడు రోజుల పాటు బ్రిస్క్‌ వాక్‌ చేస్తూ, ఫోన్లో టైం, పార్కు గేటు చూస్తూ, గడిపేశాను. ఇంటికి వచ్చాక ఆవిడ విషయం మర్చిపోయేదాన్ని. ఇంటికి వచ్చాక నాకెన్ని పనులని. ఏడున్నరకల్లా ఆయనకి బాక్సు కట్టాలి. పిల్లలిద్దర్ని నిద్రలేపి వాళ్ళకి పళ్ళు తోమించి, స్నానాలు చేయించాలి. అబ్బా, నరకం అది. మా అమ్మాయి ధాత్రి – జడ వేయించుకునేందుకు కూడా దానికి సహనం ఉండదు. అబ్బాయి పేరు సత్యాంశ్‌. వాడికి ఎనిమిదేళ్ళు. పుట్టినప్పటి నుండి వాడు నిజం చెప్పటం ఇప్పటి దాకా విన్లేదు. వీళ్ళకి ఈ పేర్లు ఎందుకు పెట్టామా? అనుకుంటాం నేను, మా ఆయన. ఈ పిడుగులిద్దరిని తయారు చేసి, టిఫిన్‌ తినిపించి, పావు తక్కువ తొమ్మిదికి స్కూల్లో దింపేసరికి నా తల ప్రాణం తోకకొస్తుంది.

ఆయన, పిల్లలు వెళ్ళిపోయాక పావుగంట సేపు నడుం వాలుస్తాను. అంతే. మళ్ళీ పరుగు. పిల్లలు పడేసినవి సర్ది, బట్టలు అల్మారాలో పెట్టి, పొయ్యి తుడిచి, స్నానం చేసి కాసేపు పేపరు తిరగేస్తా. ఈ లోగా మధ్యాహ్నం అవుతుంది. ఒక్క మధ్యాహ్నం పూటే నేను ప్రశాంతంగా అన్నం తినేది. టివిలో ఛానెళ్ళు మారుస్తూ తింటాను. ఆ తర్వాత ఏముంది. మళ్ళీ పరుగులే. కూరగాయలు తేవటమో, ఇస్త్రీ చేయటమో.. ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. అసలే… పిల్లలు, ఆయన సాయంత్రం ఆవురావురుమంటూ వస్తారు. వాళ్ళు తినటానికి ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు వచ్చాక ఏముంటుంది… పిల్లలకి స్నానాలు, హోంవర్కు చేయించటం, వంట చేసి తినిపించటం, రెండో రోజు టిఫిన్‌ చేయటానికి పిండి గ్రైండర్‌లో వేయటం, అందరం భోజనం చేయటం… అలా.. .అలా… పడుకునే సరికి ఏ రోజూ పదిన్నర తక్కువ కాదు. రోజూ ఇదే పని. మా ఇంట్లో వాషింగ్‌ మిషన్ తిరుగుతున్నట్టు, లేచినదగ్గర నుండి పని అయ్యేదాకా తిరుగుతూనే ఉంటాను. ఆ వాకింగ్‌ కూడా థైరాయిడ్‌ వచ్చింది కాబట్టి. సాయంత్రాలు అస్సలు కుదరదు కాబట్టి, పొద్దున్నే చచ్చినట్టు నిద్రలేచి, పార్కుకి వెళ్తున్నా అంతే. లేకపోతే, నేనెప్పటికి కదలాలి!

అసలందుకే నాకు ఆవిడని చూస్తే ఆశ్చర్యం.

పట్టీలు నల్లబడ్డాయి, తోముకుందామంటేనే నాకు వ్యవధి దొరకటం లేదు. అలాంటిది పదేళ్ళకోసారి ఇంటికొచ్చే అన్నయ్యను చూసుకున్నట్టు ప్రతి రోజూ సూర్యుడిని చూసేంత ఓపిక, తీరిక… ఆవిడకి, అదే ఆ లక్ష్మికి ఎలా దొరుకుతోందబ్బా!? అని అనుకుంటూనే ఉన్నాను. పైగా నోరు ఊరుకోక, సన్నబడాలంటే ఇలా నడవకూడదు అని ఓ సలహా కూడా ఇచ్చాను. లావుగా ఉన్నారు అని అంటున్నాననుకుని ఆవిడ పార్కుకి రావట్లేదా? – అనుమానం నాకు.

Kadha-Saranga-2-300x268

***

సరిగ్గా వారం తర్వాత ఆవిడ మళ్ళీ పొద్దున్నే ఐదింటికి పార్కులో నిదానంగా నడుస్తూ కనిపించింది. “హాయ్‌” అన్నాను. ఎంత గట్టిగా అన్నానో ఏమో… పార్క్‌లో అందరూ నన్నే చూశారు.

ఆమె కూడా “హాయ్‌” అన్నది.

“ఏమయ్యారండి బాబు, నేను వారం రోజు నుండి టెన్షన్‌ పడుతున్నా. నేనన్న మాటకి ఫీల్‌ అయ్యారేమో నని” అంటూ నా బ్రిస్క్‌ వాకింగ్‌కి సిద్ధం అవుతున్నా.

“అయ్యో… మీరేమన్నారని ఫీల్ అవడం? నేను వైజాగ్‌ వెళ్ళానండి” అన్నది.

“బంధువుల దగ్గరకా?” అని అడిగాను. అడిగిన అర సెకనులో నాకు సిగ్గనిపించింది, ఆరాలు తీస్తున్నాననుకుంటుందేమో అని.

“స్నేహితులున్నారు. ఊరికే.. అలా వైజాగ్‌ ఓసారి చుట్టి వచ్చాను” అన్నది.

“ఊరికేనా… సముద్రం దగ్గర సూర్యోదయం చూడటానికేనా!?” అన్నాను నవ్వుతూ.

ఆమె కూడా పెద్దగా నవ్వింది.

నేల మీద నిలబడి, అంతెత్తున పూసే పున్నాగ పూలని చూస్తే ఎలా ఉంటుంది.. గుత్తులు గుత్తులుగా ఆకాశంలోని నక్షత్రాలు రాలుతున్నట్టు ఉండదూ…. అచ్చం అలాగే నవ్వింది. ఆ రోజు నుండి ప్రతి రోజూ మేం పలకరించుకునేవాళ్ళం. కొంత స్నేహితులం అయ్యాం. వాకింగ్‌ అయ్యాక, ఇంటికి వెళ్ళేప్పుడు కలిసే వెళ్ళేవాళ్ళం. మా ఇంటికి రెండు సందుల అవతల వాళ్ళ ఇల్లు.

లక్ష్మి వాకింగ్‌కి వేసుకొచ్చే కుర్తా, పైజమాలు చాలా బావుండేవి. ఒక రోజు అడిగాను, అవెక్కడ కొంటావని. తనే డిజైన్‌ చేసుకుంటాను అని చెప్పింది. తనకో సొంత స్టోర్‌ ఉందట. నాకు కొంచెం బట్టల మీద ఆసక్తి ఎక్కువ. తన ఆహ్వానం మీద ఓసారి ఆమె డిజైనర్‌ స్టోర్‌కి వెళ్ళాను.

చేనేత, ఖాదితో చేసిన టాప్స్‌, సల్వార్స్‌, స్కర్ట్స్, కుర్తా పైజమా, చీరలు ఎంత ట్రెండీగా, ఎంత హుందాగా ఉన్నాయని! చేనేతలో కూడా మోడ్రన్‌ డ్రస్సు కుట్టొచ్చా! అని ఆశ్చర్యపోయాను. నేను అక్కడ ఉన్నప్పుడే ఇద్దరు కస్టమర్లు వచ్చారు. చెరో సల్వారు తీసుకున్నారు. వాళ్ళకి అవి నప్పవు అనిపించింది నాకు. అసలే నాకు నోరు ఆగదు కదా… వాళ్ళకి ఆ మాట చెప్పేశాను.

“మీరు కాస్త చామనచాయగా ఉన్నారు, కాబట్టి మీకు ఇలాంటి టాప్స్‌ బావుంటాయి” అని ఒకావిడకి చెప్పాను. ఇంకో ఆవిడని చూసి, “మీరు నడుం భాగం దగ్గర కొంచెం ఎక్కువగా లావు అనిపిస్తున్నారు. కాబట్టి, బెల్‌ బోటమ్‌ కాని, బోటమ్‌ దగ్గర కాస్త కుచ్చు ఉండేలా ఉండే పైజమాలు కాని తీసుకోండి. చెవుకి కూడా పెద్ద రింగు పెట్టుకోండి… సూపర్‌గా ఉంటారు” అని చెప్పాను. వాళ్ళిద్దరూ ఏమనుకున్నారో ఏమో, ఎంచుకున్నవి పక్కన పెట్టేసి, నా సలహా ప్రకారం కొన్నారు.

నన్ను చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది. “నీకు వస్త్రధారణ మీద మంచి పట్టు ఉంది. నేను కస్టమర్లకి ఇలా మొహమాటం లేకుండా చెప్పలేను… నాతో కలిసి పని చేయరాదూ… ఇద్దరికీ లాభం” అన్నది.

నాకెక్కడ కుదురుతుంది! నేను నవ్వేసి ఊరుకున్నాను. ఆ తర్వాత మేమిద్దరం చాలా దగ్గర మిత్రులమయ్యాం. పార్క్‌లోనే కాకుండా, ఇంటికొచ్చాక ఫోన్లలో కూడా గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్లం.

మా పిల్లలు, వాళ్ళ అల్లరి, మా ఆయన, ఆయన ఉద్యోగం.. నా గోల నేను చెబుతూ ఉండేదాన్ని. ఆవిడ వింటూ ఉండేది. ఆమె సంగతులు ఏమీ చెప్పేది కాదు.

ఒకరోజు ఉండబట్టలేక, పార్కులో యోగా చేసే పెద్దావిడ చెప్పిన విషయాన్ని అడిగేశాను.

“లక్ష్మీ, నీకు పెళ్ళి కాలేదటగా?’ అని.

“కాలేదు. కాదు… చేసుకోలేదు” అన్నది, ‘చేసుకోలేదు’ని ఒత్తి పలుకుతూ.

నాకంటే తను పెద్దదే. నాతో పాటే పెళ్ళి చేసుకోనుంటే ఈ పాటికి పిల్లలు పది, ఎనిమిది తరగతుల్లో ఉండేవారు. ఎందుకు పెళ్ళి చేసుకోలేదా అనే పురుగు తొలుస్తోంది నన్ను. తనతో ఏర్పడిన చనువుతో “ఎందుకు లక్ష్మీ, ఏమన్నా లవ్‌ ఫెయిల్యూరా?’ అని అడిగాను. మళ్ళీ అదే నవ్వు. ఆ నవ్వు చూస్తే మాత్రం ఎవడూ ఈమెని వదులుకోడు, ఇది లవ్‌ ఫెయ్యిల్యూర్‌ వ్యవహారం కాదు అనిపించింది.

మరుక్షణంలోనే నాకో భయంకరమైన అనుమానం పుట్టింది. అసలే ‘నిర్భయ’ ఘటన జరిగినప్పటి నుండి టివిల్లో ఆడవాళ్ళకి సంబంధించిన చర్చ తెగ చూస్తున్నాను. ఫెమినిజం అనే మాట పట్ల సమాజంలో ఉన్న అజ్ఞానమే నాలో కూడా ఉంది. అది అజ్ఞానం అని అప్పటికి తెలియదనుకోండి. ఫెమినిస్టులంటే వాళ్ళెవరో ప్రత్యేకమైన, విచిత్రమైన, తేడా మనుషులని, వాళ్ళకి మగాళ్ళంటే పడదనే మూఢనమ్మకం చాలా మందిలా నాకూ ఉండేది. అందుకే వెంటనే అనుమానంగా అడిగా…

“ఈ నవ్వు చూసిన వాడెవ్వడూ నిన్ను వదులుకోలేడులే గాని నాకు ఓ అనుమానం – నువ్వు ఫెమినిస్టువా? మగాళ్ళంటే పడదా?” అని.

నా ప్రశ్నకి ఆమె రోడ్డు మీద ఆగిపోయి, రెప్ప వేయకుండా చూసింది. ఆమె చూపుకి సిగ్గుపడ్డాను. అడక్కుండా ఉండాల్సింది!

“టెర్రరిస్టువా? అని అడిగినంత భయంగా అడిగావేంటి? ఫెమినిస్టుకి మగాళ్ళంటే పడదని నీకెవరు చెప్పారు? ఫెమినిస్టులైన మగవాళ్ళు కూడా ఉంటారు, నీకు తెలీదా? అసలు ఫెమినిస్టులు పెళ్ళిళ్ళు చేసుకోరని నీకెవరు చెప్పారు? పెళ్ళి చేసుకున్న వాళ్ళు ఫెమినిస్టులు కాదనుకుంటున్నావా?” అంది నవ్వుతూ. అది మొహమాటం కొద్దీ నవ్వే నవ్వు.

satya1నాలాంటి వాళ్ళని ఎంతమంది ఆ ప్రశ్న వేశారో కాని.. ఆమె మొహం చూస్తే నా మీద నాకే ‘ఛీ’ అనిపించింది. పాపం, నన్ను చెప్పు తీసుకుని కొట్టకుండా సమాధానం చెప్పింది. అది చాలు.

మళ్ళీ ఆమే మాట కలుపుతూ.. “సర్లే కాని, రేపు నా షాప్‌ ఎక్స్‌టెన్షన్‌. తప్పకుండా రా పిల్లల్ని తీసుకుని. ధాత్రికి ఏమన్నా మంచి టాప్స్‌, స్కర్ట్స్‌ తీసుకుందువు” అన్నది. సరే అని వచ్చేశా.

ఎండాకాలం వచ్చింది కదా, నేతకి డిమాండు బాగా పెరిగిందట. పైగా, మగవాళ్ళకి కూడా చేనేత షర్టు, పైజమాలు డిజైన్‌ చేసిందట. వాటి కోసమే షాపు ఎక్స్‌టెన్షన్‌.

మా ఆయన్ని రమ్మని బతిమాలా, కాని ఆయన కదల్లేదు. “మగవాళ్ళకండి ఆ షాపు, ఓసారి చూడండి” అని పోరుతూనే ఉన్నాను. తర్వాతెప్పుడైనా వస్తాలే అన్నాడు. నేను, పిల్లలే వెళ్ళాం.

చాలా సింపుల్‌గా జరిగింది ఓపెనింగ్‌ ఫంక్షన్‌. ఆ ఫంక్షన్‌ జరుగుతున్నంత సేపు నేను రెప్ప వేయకుండా ఆమెనే చూస్తున్నాను. పెళ్ళికాక ముందు నాకు కూడా సొంతంగా ఏదన్నా చేసుకోవాలని ఉండేది. కాని, పెళ్ళి కాగానే పిల్లలు. వాళ్ళు కాస్త పెద్దయ్యాక, ఏదో ఒకటి చేసుకోవచ్చులే అనుకున్నా. ఇప్పుడు ఓపికా, ఆసక్తి… రెండూ లేవు.

ఎవరి సాయం లేకుండా, సొంతగా ఒక డిజైనర్‌ స్టోర్‌ నడుపుతోందంటే… మాటలా? అసలు ఆ పార్టీలో టీ కప్పుతో సహా ఒక్క ప్లాస్టిక్‌ వస్తువు లేదు! డిన్నర్‌ కూడా సింపుల్ గా ఉంది. పైగా, ఆహారం వృథా చేయకండి అని చేత్తో రాసిన పేపరుని బఫె దగ్గర అంటించింది కూడా! ఆమె ఏం చేసినా, ఏదో ప్రత్యేకం ఉంటుంది – మిగిలిన ప్రపంచానికి భిన్నంగా. అందుకే ఆమె సాన్నిధ్యం అంటే నాకు చాలా ఇష్టం.

పార్టీ అయ్యేప్పటికి పది అయింది. దాదాపుగా అందరూ వెళ్ళిపోయారు. అప్పటికే బాబు, పాప సోఫాలో పడుకుని నిద్రపోయారు. నిద్ర పోయిన వాళ్ళని చూస్తూ “కాసేపు ఆగు, ఇద్దరం కలిసే వెళదాం. పడుకున్నారు కదా లేపడం ఎందుకు?” అన్నది.

సర్దుకుంటున్న ఆమెకి సహాయం చేస్తూ “పెళ్ళెందుకు చేసుకోలేదు?” అని అడిగాను.

“ఇదేంటి… ఈ టైంలో…” అంటూ చిన్నగా నవ్వింది. మొదటిసారి ఇదే ప్రశ్న వేసినప్పుడు నన్ను అభావంగా చూసింది కాని ఇప్పుడు ఆమె ముఖం సీరియస్ గానే ఉంది. నాలో ఏదో అంతర్మధనం జరుగుతోందనీ, అందుకే అడుగుతున్నానని ఆమెకి అర్థం అయినట్లుంది.

“ఇంట్రెస్టు లేదు. నమ్మకం లేదు. మగవాళ్ళ మీద కాదు. పెళ్ళి అనే వ్యవస్థ మీద. నీకెలా అర్ధమౌతుందో నాకు తెలియదు. అయినా, అడిగావని చెబుతున్నాను…” అన్నది.

“సినిమాకే ఒక్కరం వెళ్ళలేం. నువ్వు జీవితమంతా ఒక్కదానివే ఎలా బతుకుతావు? నీ గురించి తలచుకుంటే నాకు కంగారుగా ఉంది” అన్నాను.

“ఏం కంగారు అక్కర్లేదు. ఇన్నాళ్ళు బతకలేదా? తర్వాతా అంతే” అన్నది.

“పిల్లలతో అంత ప్రేమగా ఉంటావు. నీకు పిల్లలు కావాలనిపించలేదా?” అని అడిగాను. ఆమెకి ఆ ప్రశ్న గుచ్చినట్టు అనిపించిందేమో! ఆమె మొహంలో తేడా స్పష్టంగా గమనించగలిగాను. నల్లబడ్డ ఆమె ముఖం చూడగానే నా లోపల రహస్యంగా దాగి ఉన్న నా అహం చల్లారింది.

ఇన్ని రోజులూ నాలో లేనిది ‘ఏదో’ ఆమెలో ఉంది, దాని వల్లే ఆమె పట్ల నాకు ఆకర్షణ, వికర్షణ అనిపించేది. అదేంటో స్పష్టంగా నాకే తెలీదు. ఏదో మూల ఒక అసూయ అయితే ఉండేది. ఇప్పుడు సమాధానం చెప్పలేకపోతున్న ఆమె మౌనం వల్ల నా దగ్గర ఉన్నదేదో ఆమెకి లేదు అనిపించింది. ఇక ఆమె దాన్ని ఎన్నటికీ సంపాదించలేదు అనే భావం నాకు రెప్పపాటు మెదిలింది. కాని మళ్ళీ కాసేపటికే నాకు పాపం అనిపించింది కూడా.

నిద్ర పోతున్న నా పిల్లల్ని చూస్తూ అన్నది…. “ వీళ్ళు నా పిల్లలు కాదు అని నాకు అనిపించదు. ఈ పిల్లలనే కాదు నాకు ఏ పిల్లల్ని చూసినా నా పిల్లలే అనిపిస్తుంది. సొంత పిల్లలైతే వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళయి, ఆస్తుల కోసం మనతో తగాదా పడటం చూడాల్సి వస్తుందేమో! ఇలా ఉంటే, ఎప్పటికి ఆ బాధ ఉండదు కదా” అన్నది.

“సమర్థించుకోవడం కోసం చెబుతున్నావా? పిల్లల గురించిన ప్రశ్న అడగ్గానే నీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయ్‌. నేను చూశాను” అన్నాను.

ఆమెని రొక్కిస్తున్నానని నాకు తెలుస్తోంది. అయినా ఆమెని అంతగా కార్నర్‌ చేయటం వల్ల నాకేం ఉపయోగమో నాకే అర్ధం కాకుండా ప్రశ్నిస్తున్నాను.

ఆమె నాలాంటి అనేకమంది వేసే ఇలాంటి క్రూర ప్రశ్నలకి అలవాటు పడినట్టు ఉంది. ఏమాత్రం అసహ్యపడకుండా నిదానంగానే చెప్పింది… “మా అమ్మ గుర్తొచ్చింది. నేను పెళ్ళి చేసుకోను అని ఆమెకి అర్ధమయ్యాక, ఆమె ప్రతి క్షణం కుమిలి పోయేది. అమ్మని బాధపెట్టకూడదు అనిపించేది కాని పెళ్ళికి ఒప్పుకోలేకపోయాను. నన్ను చూడటానికి ఊరు నుండి వచ్చినప్పుడల్లా… ‘ఒక్క మనుమడినో, మనుమరాలినో ఎత్తుకోలేకపోయాను’ అని బాధ పడేది. నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు కాని, అమ్మని ఆ క్షణాన చూస్తే మాత్రం.. పెళ్ళి, పిల్లలు ఉంటే బావుండేదేమో అనిపిస్తుంది. అంతే. అది గుర్తొచ్చింది. అంతకంటే ఏం లేదు” అన్నది.

ఆమె తల్లి ఎలా ఉంటుందో నాకూ చూడాలనిపించింది. లక్ష్మి తల్లి రూపాన్ని ఊహించుకుంటున్నాను.

మళ్ళీ తనే “ఎవరి వల్ల అయినా పర్లేదు, నాకు పిల్లలే కావాలి అని నేను అనుకోలేను. నాకిష్టమైన వ్యక్తితో కావాలి. సాధ్యమా? ఆ స్వేచ్ఛ నాకుందా? సంఘం బతకనిస్తుందా? చట్టం ఒప్పుకుంటుందా? పిల్లులకి, కుక్కలకి ఉన్న హక్కు, అవకాశం మనుషు్యలమైన మనకి లేదు. ఆడదాన్ని కదా… పిల్లలు కావాలని అప్పుడప్పుడు శరీరం మొండి చేస్తుంది” అంది.

ఆమె చెబుతుంటే నాకెటు చూడాలో అర్ధం కాలేదు. అప్పటికే పదిన్నర అయింది. ఆమె గడియారం చూస్తూ “వెళ్దామా?” అంది.

“సరే” అన్నాను. ధాత్రిని నేను ఎత్తుకున్నాను. సత్యని తను ఎత్తుకుంది. కార్లో వెనక సీట్లో ఇద్దరిని పడుకోబెట్టి, నేను ముందు సీట్లో కూర్చున్నాను. లక్ష్మి మళ్ళీ షాపు దగ్గరకి వెళ్ళి షట్టర్‌ దింపి, తాళం వేస్తుంటే ఆమెనే చూస్తూ కూర్చున్నాను. satya1

‘పెళ్ళి ఎందుకు చేసుకోలేదు?’ అని నేను అడిగినట్టే… ‘పెళ్ళి ఎందుకు చేసుకున్నావు?’ అని ఆమె నన్ను అడిగితే ఏం సమాధానం ఉంది? నిజమే, ఎందుకు చేసుకున్నాను? పిజి చేశాను. తర్వాత ఒక సంవత్సరం ఉద్యోగం. అప్పటికే పెళ్ళి వయసు వచ్చేస్తోందని చుట్టాల గోల. అమ్మానాన్న సంబంధాల మీద సంబంధాలు తెచ్చారు. వాళ్ళలో నాకు నచ్చిన ఒకడిని పెళ్ళి చేసుకున్నా.

అంతేగా… అంతేనా అంటే.. ఇప్పుడు ఆయన నా పంచప్రాణాలు. నా తోడు నీడ అయిన నా భర్త మా కులం కాకపోయి ఉంటే, అతని ఫొటోనే నా దగ్గరకి రాకపోతే – నేను వేరే వాడిని చేసుకునేదాన్ని. అతనితో కూడా పిల్లలు పుట్టేవారు. నేనిచ్చే కట్నం, కులం, ఎత్తు, బరువు అన్నీ కుదిరిన సంబంధం ద్వారా ఏ భర్త వస్తే – ఆ భర్త వల్లే పుట్టేవారు. అప్పుడూ ఇలానే ఉండేదాన్ని. ఇంతేనా నేను!? ఇదా నేను!!?

ఆమె షట్టరు మూసి, నడుచుకుంటూ కారు దగ్గరకి వచ్చిన ఆ మూడు నిమిషాల్లో… నాకు పడిన మూడు ముళ్ళతో నేను సాధించేదేమిటో, ఆమెకి లేనిదేమిటో నాకు అర్ధం కాలేదు.

లక్ష్మి డ్రైవింగ్‌ సీట్లో కూర్చుని సీటు బెల్ట్ పెట్టుకుంటోంది.

“ఎప్పుడూ ఒంటరితనం అనిపించలేదా? అందరూ సినిమాకి షికార్లకి జంటతో వస్తుంటే… ఏదో మిస్‌ అయ్యాను అనిపించలేదా?” అని అడిగాను. ఈసారి నాలోపల ఏ కోశానా శాడిజం లేదు. అసూయ లేదు. నా దగ్గర లేనిది, ఆమె దగ్గర ఉన్నది ఏదో నాకు అర్ధమైపోయింది. అది ` స్వంత నిర్ణయం’ తీసుకునే ఆత్మవిశ్వాసం.

లక్ష్మి మౌనంగా కారు స్టార్ట్‌ చేసింది. ఈసారి లక్ష్మి కంట్లో నుండి నీరు చెంప మీదకి జారి… కారు హెడ్ లైట్ల వెలుగులో మెరిశాయి. నేను ఆమెనే చూస్తున్నాను. కారుని ముందుకు దూకించి నిదానంగా నడుపుతూ అంది…

“అనిపించింది… చాలా సార్లు అనిపించింది. అనిపించలేదు అని బొంకే పిరికిదాన్ని కాదు. నాతో ప్రతిరోజూ గంటలు గంటలు మాట్లాడే నా స్నేహితులు కూడా ఏ పండగ రోజో, ఆదివారం రోజో కనిపించరు. ఫోన్‌ చేశాననుకో… అమ్మాయి అయితే, పనుందే అంటారు. మగవాళ్ళయితే, అసలు లిఫ్ట్‌ చేయని సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళ భార్య పక్కన ఉంటే మాట్లాడరు అనిపిస్తుంది నాకు. వాళ్ళు నా ఇంటికి నిస్సంకోచంగా ఇష్టమైనప్పుడు వస్తారు. నా టేస్ట్‌ని పొగుడుతారు. ఇంటిని అందంగా ఉంచుకునే తీరుకి ‘వహ్వా’ అంటారు. కాని నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మొహమాటంగా, ఇబ్బందిగా నవ్వుతూ ఉంటారు. అందరూ అని కాదు… కొందరు. వాళ్ళ భార్యలు నన్ను పలకరించి, మంచి నీళ్ళు ఇస్తుంటేనే.. నాకు అర్ధమైపోతుంది. వీళ్ళు నన్ను ‘పొటెన్షియల్‌ థ్రెట్‌’గా చూస్తున్నారు అని. కాని దానికి నేనేం చేస్తాను? నెమ్మదిగా అలాంటి వాళ్ళని దూరం పెడతా. ఇంకొందరు వెధవలు ఉంటారు – ఒంటరి మహిళ అనగానే, పడుతుందేమో చూద్దాం అనుకునేవాళ్ళు. వాళ్ళని హద్దుల్లో ఉంచటానికి చాలా మానసిక శ్రమ చేయాల్సి వస్తుంది” అన్నది. వెదురు చెట్ల మధ్య ఇరుక్కున్న గాలి చేసే జీర శబ్దంలా ఆమె మాట గారగా ఉంది.

పిరికితనం వల్ల కారిన కన్నీళ్లు  కావు అవి. బహుశా సమాజంలో పేరుకుపోయిన మూర్ఖత్వాన్ని చూసి అయి ఉంటుంది. నాకూ ఏడుపొచ్చింది. పెళ్ళి అయినా వదలరు, కాకపోయినా వదలరు, పసిపిల్లలయినా వదలరు… ఎందుకిలా ఉంటారు? మగాళ్ళంటే ఇంతేనా? నా భర్త కూడా అటువంటి మగవాళ్ళలో ఒకడా? రేపు నా కొడుకు కూడా ఇలా తయారవుతాడా? నా కూతురు కూడా ఇలాంటి బాధలు పడాలా? ఏవేవో ఆలోచనలు. చటుక్కున  ఆమె అంతకుముందన్న మాట గుర్తొచ్చింది.

“ఫెమినిస్టులయిన మగవాళ్ళు కూడా ఉంటారన్నావు… ఉంటారు కదా!?” అన్నాను. ఏదో రూఢి పరుచుకోవాలని, విని సంతోషపడాలని నా తాపత్రయం.

“ఎందుకుండరు? ఇలా అన్నానని అందరు మగవాళ్ళని, అందరు ఆడవాళ్ళనీ ఒక వర్గం క్రింద జమకట్టకూడదు. కదా!” అని చిన్నగా నవ్వింది. ఆ చీకట్లో కూడా ఆమె పలువరస ఎంత బావుందో. ఆ నవ్వులోని అందానికి ఆత్మవిశ్వాసం అంటినట్టుంది!

ఇంత మాట్లాడినా ఇంకా ఏదో సందేహం నాలో. ఇల్లు దగ్గరకి వచ్చేస్తోంది. “రేపు ముసలిదానివి అయితే, ఎవరు చూసుకుంటారు నిన్ను?” అని అడిగాను.

ఆమె సడెన్‌ బ్రేక్‌ వేసింది. ఈ ప్రశ్నకి ఆమెకి భయం వేసిందేమో అనుకున్నాను. వెనక సీట్లో ఉన్న పిల్లలు ముందుకు పడబోయారు. వాళ్ళని ఇద్దరం చెరో చేత్తో ఆపాం. సద్దుకుని, మళ్ళీ నిద్రలోకి జారిపోయారు.

satya1“దేశంలో ఇన్ని వృద్ధాశ్రమాలు ఎందుకు ఉన్నాయి? మీ అమ్మానాన్న నీ దగ్గర ఎందుకు లేరు? నిన్ను మోసి, కని, పెంచిన నీ తల్లిదండ్రుల్ని నువ్వెందుకు చూసుకోవట్లేదు? పోనీ, సంఘం శాసనం ప్రకారం నీ అత్తమామలయినా నీ దగ్గర ఉండాలిగా. ఎందుకు లేరు? పిల్లలు ముసలి తల్లిదండ్రుల్ని చూసుకోవటం అంటేనే చిరాకు పడుతున్నారు గమనించావా? మన పిల్లలే మనల్ని చూస్తారని నమ్మకం లేదు. నీకుందా?” సూటిగా నన్ను చూస్తూ అడిగింది.

నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. “మా అమ్మానాన్నలు నా దగ్గరకి రారు లక్ష్మీ, ఆడపిల్ల దగ్గర ఉంటే అందరూ ఏమనుకుంటారు? అంటారు. ఇక మా అత్తగారు, మామగార్లతో నాకు తగాదా. పెద్ద పెద్ద కొట్లాటలేం కాదు కాని పిల్లల పెంపకం విషయంలో, ఆయన్ని సహాయం అడిగే విషయంలో మా అత్తగారికి నాకు మాటా మాటా వచ్చేది. వాళ్ళు తనకే సొంతం అయినట్టు మాట్లాడేది. నేను సహించలేకపోయేదాన్ని. ఆయన ఇంటికి రాగానే, ఇద్దరం పోరే వాళ్ళం. మా పంచాయితీలు పడలేక, ఊళ్ళోనే ఉండండి, మీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను అని చెప్పి, వాళ్ళతో తిట్లు తిని, వాళ్ళని ఊరు పంపించేశాడు” అన్నాను.

ఏదో అపరాధభావం నాలో.

సినిమా రీలు తిరిగినట్టు నాకన్నీ కళ్ళముందు తిరుగుతున్నాయి. వాళ్ళతో ఇంతకు ముందు జరిగిన సంఘటనలు ఎలా జరిగాయన్న ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు లేవన్నట్టు లక్ష్మి వైపు చూశాను.

నా ఇబ్బందిని గ్రహించినట్లుగా రోడ్డువైపు చూస్తూ తనే మాట్లాడటం మొదలుపెట్టింది. “నీకొకటి చెప్పనా… నాకు ఏదన్నా చేయాలనిపిస్తేనే చేస్తాను. అందరూ చెబుతున్నారని, చేస్తున్నారని కాదు. ఈ కారులో పెట్రోల్  పోసి, స్టార్టు చేస్తే.. స్టార్టవుతుంది. కారుకి, నాకు తేడా ఏంటి? ప్రయోగం చెయ్యాలి. ధైర్యం చెయ్యాలి. కష్టాలుంటాయి. కన్నీళ్ళుంటాయి. ఒంటరితనం ఉంటుంది. ఏకాంతం ఉంటుంది. ప్రేమించేవాళ్ళు ఉంటారు. ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఇది నా జీవితం.. మన పార్కులో ఆ పెద్దావిడ చేసే యోగా లాగా.. ప్రతి రోజూ నేను చేయాల్సిన సాధన. అలాగే ఎవరికి వారు వారి జీవితానికి తగినట్లు వారు చేయాల్సిన సాధన – కదా!?” అంది.

రోజూ చేయాల్సిన సాధన అనగానే… నేను రోజూ తుడిచే గ్యాస్  స్టవ్ గుర్తొచ్చింది. మా ఆయన దగ్గర, పిల్లల దగ్గరా అనే మాట గుర్తొచ్చింది – ‘నేను మనిషినా, మిషన్నా? చేసిన పనే చేయటానికి’ అని. ఇది తప్పని కాదు కాని నాకంటూ నేను చేయవలసిన సాధన ఏమిటో నేను తెలుసుకోవాలి కదా అనిపించిన ఆ క్షణం నాకు అపురూపమైనది.

ఇల్లొచ్చేసింది. నేను కార్లో కూర్చునే మా ఆయనకి ఫోన్‌ చేశాను. ఆయన బైటకి వచ్చి, పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరిని ఇంట్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టాడు. కార్లోనే నిశ్శబ్దంగా కూర్చున్న నన్ను దిగదేమిటి అన్నట్లు చూశాడు. ‘వస్తాను, మీరెళ్ళండి’ అన్నాను. ఆయన లోపలకి వెళ్ళాక, గేర్‌ రాడ్‌ మీద ఉన్న లక్ష్మి చేతిని పట్టుకుని –

“లక్ష్మీ! నాకు నీ కొత్త షాపులో ఉద్యోగం ఇస్తావా?” అన్నాను. నా రెండు చేతులూ తన చేతుల్లోకి ఆప్యాయంగా తీసుకుని షేక్‌హ్యాండ్‌ ఇస్తూ “ష్యూర్” అన్నది.

నేను థాంక్స్‌ అని చెప్పి… కారు దిగబోయా కాని.. నా మనసులో ఉన్న ఒక మాట చెప్పకపోతే.. సంతృప్తి ఉండదు. సీట్లో వెనక్కి వాలి, చెప్పాను…

“లక్ష్మీ, మా ఆయనకి నిన్ను పరిచయం చేయలేదు. పొటెన్షియల్‌ థ్రెట్‌ అనిపించి కాదు. ఇప్పుడు.. నీతో ఈ ఏకాంతం.. ఈ క్షణాలు ఇలా పదిలంగా దాచుకోవాలనిపించింది” అన్నాను.

ఆమె నా చేతిని గట్టిగా నొక్కి… నా నుదిటి మీద ముద్దు పెట్టింది. ఒక ముద్దు అంత ధైర్యం కలిగిస్తుందని… అప్పుడే తెలిసింది!!!

***

(Image: Satya Sufi)

మీ మాటలు

  1. మణి వడ్లమాని says:

    చైతన్యా! కధ బాగా నచ్చింది. కధనం బాగా ఉంది. ఎలా తెస్తవా చివరికి అనుకున్నాను. ముగింపు సూపర్బ్.

    wishing you all the best.

  2. Sai Padma says:

    మనం రాయాలనుకున్న భావం.. కథ.. నేపధ్యం.. మరొకళ్ళు రాస్తే ఎంత ఆశ్చర్యం, ఆనందం కలుగుతుందో , అంతా మొదటి కథలోనే కలిగించావు చైతన్యా .. భలే నచ్చావు .. నీలో మంచి కథకురాలు ఉందని నాకు తెలిసినా ..ఇలా అచ్చులో చదవటం నేనే రాసినంత సంతోషంగా ఉంది .. స్త్రీ వాదం నుండి మనిషి వాదం లోకి ఎదిగే క్రమంలో కూడా వొంటరితనం తప్పదు.. ఎవరి సొంత వొంతరితనాల్లో వాళ్లకి ఇన్ సెక్యూరిటీ ఉండదు .. మంచి మంచి కథ.. నీకో ముద్దు .. ఇంకా బోల్డు ధైర్యం కోసం ..మరిన్ని కథల కోసం.. కాబట్టి ఇందులో చాలా స్వార్ధం ఉంది.. !
    చదవాల్సిన కథ

    • chaithanya says:

      పద్మ.. ముద్దు ఇచునన్దుకు థాంక్స్. చెప్పా కదా.. ఎం అన్నారో.. ఆడవాళ్ళ మధ్య ఏకాంతం, ముద్దు ఎందుకు అని? చాల చాల థాంక్స్..

  3. DR.K L V PRASAD says:

    మీ కథ చాలాబాగుంది .మీలో పరిపక్వత చెందిన రచయిత్రి దాగి ఉంది. ఇది నాకు మీ మొదటి కథ అనిపించడం లేదు.
    కథలు రాయడం కొనసాగించండి. మీ కలం నుండి చాలా మంచి కథలు జాలువారే అవకాశం మెండుగా వుంది .
    శుభాకాంక్షలతౌ,
    డా. కె. ఎల్. వి. ప్రసాద్
    హనంకొండ-4

  4. చాలా చాలా బాగుందండీ , మనం అనుకున్నది ,అనుభవిస్తున్నది సమాధానం తో సహా అక్షరాల్లో ఎక్కడైనా కనిపిస్తే ఎలా వుంటుందో అలా వుంది చైతన్యగారూ !! wish u Good Luck :)

    • chaithanya says:

      నిజమే… ఒంటరి మహిళల పట్ల.. దుర్మార్గంగా ఉంటుంది ప్రపంచం..! థాంక్ యు..

  5. లిపిజ్వలన says:

    సరిగ్గా అదే కావలసినది, స్వ౦త ఆలోచన గల వ్యక్తిత్వం, ఎంత బాగా చెప్పారు-కధగా

  6. అమ్మలూ…ఇంకా ఇంకా మంచి కథలు రావాలి. మానం ముందు ముందు manchi ఫ్రెండ్స్ అవబోతున్నాము. సెకండ్ హాఫ్ చాలా బావుంది.

    • chaithanya says:

      నిజమే.. సాహిత్యం వాళ్ళ, ఐడియాలజీ వాళ్ళ వచ్చే స్నేహాలు బాగుంటాయి.. థాంక్ యు..

  7. nvsrmurthy says:

    రచనలో ఊహల ఊసులు కాకుండ భావాల నిజాయితి, స్పష్టత, మార్గదర్శకత చక్కగ ప్రతిబింబిస్తున్నాయి. చైతన్యగారు చైతన్యము కలిగించే మరెన్నో రచనలు చేసి హితము,మోదము కలిగించాలని కోరుకుంటూ సుభాభినందనలతో….

  8. satya sufi says:

    కథ చదివాక మల్లి ప్రయాణం చేశాను నీతో….. గతం దాకా…. అందమైన గ్యాపకం దాక… :))

    • chaithanya says:

      సూఫీ డియర్.. థాంక్ యు.. నాకు గుర్తుంది ఆ రోజు కార్ లో మాట్లాడుకున్నది.. గ్రేట్ డే . థాంక్ యు.. ఫర్ ది పెయింటింగ్

  9. మీ ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ పుస్తకం చదివినపుడే మీలో మంచి భావుకురాలు ఉన్నారని అర్ధం అయింది. మీ వ్యూస్ ఆడ్ అయి మంచి కధ తయారు అయ్యింది. వ్యక్తీకరణ నూతనంగా ఉంది. ఇంకా విస్తృతమైన అంశాలతో మీ కధలు రావాలని కోరుకొంటున్నాను.

    • chaithanya says:

      రామ సుందరి గారు.. చిట్టగాంగ్ విప్లవ వనితలు పుస్తకం నాకు చేసిన మేలు మర్చిపోలేను. చాల నేర్చుకున్న. ఆ పుస్తకాన్ని ఎవరైనా తలిస్తే చాల సంతోషంగా ఉంటుంది.. చాల థాంక్స్.. ఈ కదా ఇంకా బాగా ఉండాల్సింది.. ఫస్ట్ టైం అని అందర్రు మేచుకున్తున్నారు.. అది అయితే తెల్సు నాకు. ఏది ఏమైనా… thank u

  10. కె. కె. రామయ్య says:

    చిట్టగాంగ్ విప్లవ వనితలు
    రచన: చైతన్య పింగళి వెల: రూ. 80
    ప్రతులకు : జనహర్ష పబ్లిషర్స్ ప్రై.లి.3-8-347,
    మన్సూరాబాద్, చంద్రపురి కాలనీ, ఎల్‌బీ నగర్,
    హైదరాబాద్-500074, ఫోన్ : 9848019076

  11. Saamaanya says:

    కథ చాలా బాగుందండీ ప్రశ్నోత్య్జర కార్యక్రమ శైలితో విషయం భలే చెప్పించారు.ఒంటరి మహిళ పట్ల సమాజానికి వుండే ఆసక్తిని అతి చొరవ వున్న పాత్రని సృష్టించి భలే అడిగించారు .ఆ పాత్రలో సమాజమంతా వుంది .అటువైపు ఆవిడోక్కటే వుంది .కథ చాలా బాగుంది . ఈ మధ్య వరుసగా కథా ప్రపంచం వాళ్ళు పెడుతున్న గొప్ప గొప్పరచయితల అనువాద కధలు చదువుతూ వున్నా అదే పనిగా …ఆ కధల్లాగే గొప్పగా అనిపించింది మీ కధ కూడా .కంగ్రాట్స్.

    • chaithanya says:

      సామాన్య గారు.. చాల చాల థాంక్స్.. చాలా చాలా…

  12. N Venugopal says:

    చైతన్యా,

    కథ చాల చాల బాగుందమ్మా…. ఇతివృత్తం సరే, కథనం, నిర్మాణం కూడ ఎంత బాగున్నాయో… ఇంకా ఇంకా రాయాలి…

    • chaithanya says:

      సర్, నాకో అనుమానం. అది పోదు.. ఫస్ట్ స్టొరీ కాబట్టి బావుంది బావంది అంటున్నారని. థాంక్ యు.. రా

      • chaithanya says:

        సర్ .. పొరపాటున ‘రా’ టైపు అయ్యింది.. ఏమి అనుకోకండి

  13. వనజ తాతినేని says:

    ఆమెకి నచ్చిన ఆమె జీవితం కోసం చేస్తున్న సాధన చాలా బావుంది. చాలా శ్రద్దగా కూడా వ్రాసారు . అభినందనలు

  14. vasavi pydi says:

    కథ చాలాబాగుంది సారంగ ద్వార చాలమంచి సాహిత్యం ,రచయితల, రచయిత్రిల గురించి తెలుస్తుంది అందరు ఓ కుటుంబంలా కలసిపోయి ,సంగీతం ,చిత్రాలు ,సినిమాలు ,అప్పుడప్పుడు గిల్లికజ్జాలు అన్నీ చాల చాల బాగుంటున్నాయి

    • chaithanya says:

      నిజమే వాసవి గారు.. నాకు చాలామంది కొత్త స్నేహితులు.. సారంగ ద్వారానే పరిచయం అయ్యారు..

  15. ఆర్.దమయంతి. says:

    కథని కొత్త గా చెప్పడం బావుంది.

  16. chaithanya says:

    థాంక్స్ అంది దమయంతి గారు

  17. Vamshi Naarani says:

    చైతన్య గారూ,

    Interesting narration. We are peeping into Lakshmi’s mind and heart thru protagonist’s POV. Crisp. I enjoyed reading it. Good one. Congratulations. Thank You.

  18. చైతన్యా, కథ బావుందని నేను చెప్పినట్లే… గుడ్.. ఇంకా మరిన్ని కథలు రాయాలి సుమా!

  19. సారంగ లో కథ చదివేముందు ఆ కథకు వచ్చిన కామెంట్స్ చదువుతాను – ఎందుకంటే కామెంట్స్ రాసిన వాళ్ళను బట్టి ఆ కథ స్థాయి తెలుస్తుంది. ఆ తర్వాతే కథ మొదలుపెడతా చదవడం – మీ కథ కూడా అలానే చదివాను (రమా సుందరి , సామాన్య, అపర్ణ, వేణు గార్లు కామెంట్స్ రాసారు. తప్పక చదవాల్సిందే అనుకున్నాను )
    రొడ్డకొట్టుడుగా మిమ్మల్ని పొగడడం కాదు కాని కథలో అంతర్లీనంగా మీ గొప్ప వ్యక్తిత్వం బోధపడింది. వస్తువు , కథనం , ఆరంభం , ముగింపు … వీటి గురించి చెప్పడానికి ఏమీలేదు – అభినందనలు. నిజానికి ఉదయం మెయిల్స్ చెక్ చేస్తున్నప్పుడే బెంగళూరు బెమ్మ రాచ్చసుడు ఒకాయన మీ కథను చదవమని అమెరికాకు వినబడేలా డప్పు కొట్టాడు . ఆయన ఎప్పుడు కొట్టే తప్పేట మోతే కదా అనుకున్నాను కాని … కథ ఇంత గొప్పగా ఉంటుందని ఊహించ లేదు . కథ కు ప్రయోజనం ఉండాలి . చదివిన తర్వాత మనం ఎటు పయనిస్తున్నాం అనే ఆలోచన కలిగించాలి . ఆ ప్రయోజనం మీ కథకు ఉంది – ఆల్ ద బెస్ట్ .

    • chaithanya says:

      గొరుసు గారు.. ఆయన naaku call చేసారు. నేను ఆశ్చర్యపోయ.. ఆ ప్రేమకి. మీ గురించి కూడా చెప్పారు. చాల థాంక్స్ సర్..

  20. చందు - తులసి says:

    చైతన్య గారు….మీరింకా కథలు రాయలేదా….?
    ఇదే మొదటి కథా…? ఎందుకంటే మీరు పదేళ్ళ క్రితమే విజయ విహారం లో గొప్పగా రాసేవారు కదా…
    – ఆనంద్ సినిమాను చాలా చక్కగా వర్ణించారు.
    -ఇంకోటి బృందావన కాలనీ సినిమా ఉతికి ఆరేశారు…..నాకు టీవీలో ఆ సినిమా వచ్చినపుడల్లా మీరే గుర్తొస్తారు.
    ఆ పత్రిక ఆగిపోయాక మళ్ళీ కనపడలేదు….
    మళ్ళీ ఇపుడే…..మీ పేరు కనపడగానే గబగబా
    చదివేశాను….
    కథ బాగుంది. …ముఖ్యంగా నెరేషన్ ……
    ముగింపులో స్పార్క్ సూపర్ .
    .కానీ మీ అక్షరాల విలువ తెలిసిన వాడిని కాబట్టి….నా కైతే పూర్తి సంతృప్తి కలగలేదు..
    మీ నుంచి మరిన్ని మంచి కథలు రావాలని కొరుకుంటున్నాను.

    • chaithanya says:

      చందు తులసి గారు.. విజయవిహారం తో పాటు చిట్టగాంగ్ విప్లవ వనితలు అనే పుస్తకం కూడా raasanu. కాని కధలు రాసే ధైర్యం చేయలేదు. ఎందుకో తెలీదు. కదా రాయటమే కష్టం అండి. రాసాక అనిపిస్తోంది. ఎనీవే, థాంక్ యు వేరి మచ్. తర్వాత కధలు కొంచం మెరుగ్గా ఉంటాయేమో చూడాలి.. థాంక్ యు

  21. rajani patibandla says:

    అమ్మడూ నిజంగా మొదటి కధ అంటే నమ్మేలా లేదు. మళ్లీ మళ్లీ వినిపించే ప్రశ్నలకి మహా సున్నితం గా ముగింపు ఇచ్చావు సామాన్య తరవాత మరో మంచి కధకురాలిని చూస్తాననే ఆశ కలుగుతోంది పెయింటింగ్ కూడా బావుంది

    • chaithanya says:

      రజని గారు.. రజని గారు.. అని కావాలనే రెండు సార్లు రాసాను ముందు పోస్ట్ లో. అంటే.. చిన్న గెంతు గెంతి ఉత్సాహం గా ఉన్నాను అన్నమాట మీ కామెంట్ chusi

  22. chaithanya says:

    రజని గారు.. రజని గారు… థాంక్ యు. మీరు శభాష్ అంటే.. అంత కంటే ఇంకేం కావలి..?

  23. గుడ్ స్టొరీ

  24. కోడూరి విజయకుమార్ says:

    చైతన్య గారు …. కథ చాలా బాగుంది … మొదటి కథ అంటే నమ్మలేనంతగా !
    ఈ కథ, కేవలం ‘ పెళ్లి చేసుకోవడం ‘ – ‘ చేసుకోకపోవడం ‘ అనే అంశానికి పరిమితమైన కథలా అనిపించలేదు ….
    అంతకు మించి, ‘మన జీవితాన్ని మనకు ఇష్టమైన పద్ధతిలో జీవించడం’ అనే సున్నితమైన అంశాన్ని స్పృశించిన కథ అనిపించింది !

  25. బ్రెయిన్ డెడ్ says:

    ఒక కధ చదివినప్పుడు అందులో ఒక జ్ఞాపకంలోనో ఒక క్యారెక్టర్లోనో మనల్ని మనం చూసుకోగలిగితే రైటర్ సక్సెస్ అయినట్లే . కుడోస్

  26. బాగా రాసారు

  27. Chimata Rajendra Prasad says:

    మంచి ఫెమినిస్ట్ కథ. మొదటి కథ కాదు అనిపించేంత పరిపక్వత కలిగిన కథ.అభినందనలు!!

    • chaithanya says:

      రాజేంద్ర ప్రసాద్ గారు.. థాంక్ యు.. మంచి ఫెమినిస్ట్ కదా annanduku

  28. Bhasker koorapati says:

    చైతనగారూ..
    ఇది మీ మొదటి కథ అంటే నమ్మబుద్ది కావడంలేదు!
    ఓ చేయితిరిగిన రచయిత్రి రాసినట్టుగా ఉంది
    మీ కలం నుంచి మరిన్ని మంచి కథల్ని ఆశిస్తూ…
    ఆల్ ద బెస్ట్ అండీ…
    –భాస్కర్ కూరపాటి.

  29. mohan.ravipati says:

    కథ చాలా బాగుంది, ముగింపు చాలా బాగుంది, ఇది మీ మొదటి కథ అంటే నమ్మటం కష్టం కంగ్రాట్స్

  30. chaithanya says:

    మోహన్ గారు.. చాల థాంక్స్..

  31. What a prose! What a matured writing. Man you will go places. All the best. Will wait to read more from you.

    “ఆ నవ్వులోని అందానికి ఆత్మవిశ్వాసం అంటినట్టుంది”

  32. Kuppili Padma says:

    చైతన్య గారు, వుత్సాహంగా అనిపించింది. Congratulations. All the best..

  33. chaithanya says:

    కుప్పిలి పద్మ గారు.. థాంక్స్ andi

  34. నిషిగంధ says:

    అడిగిన ప్రశ్నలన్నిటికీ ఏ డ్రమాటిక్ గతాల ప్రస్తావన లేకుండా లక్ష్మి సమాధానాలు చెప్పడం బావుందండీ!

    మీ శైలి చాలా నచ్చింది నాకు.. టైమ్ తీసుకున్నా సరే రాసేవన్నీ ఇలాంటివే రాస్తానని ప్రామిస్ చేయాలి మీరు మాకు! :-)

  35. శ్రీరామ్ వేలమూరి says:

    చాలా బాగారాసారు చైతన్య గారూ ,,keep writing

  36. కె.కె. రామయ్య says:

    చైతన్య పింగళి గారి “తనదే ఆ ఆకాశం! “ కధ ప్రింటు కాపీని చదివి పెద్దలు, ఆ తరం ప్రముఖ కధకులు, త్రిపుర గారి మాటల్లో కధారచయితల పక్షపాతి, తొలితరం ఫెమినిస్ట్ అనిపించుకున్న శ్రీ భమిడిపాటి జగన్నాథరావు గారు చాలా చాలా ఆనందపడుతూ ఇలా ముచ్చడించారు.

    “ఇప్పుడు వస్తున్నటువంటి మంచి మంచి కధలతో పోల్చి చూస్తే కాన్సెప్ట్ వైజ్ గా కాని, నెరేషన్ వైజ్ గా కాని చాలా హయ్యర్ లెవల్ లో రాసిన కధ. చాలా ఈజ్తో ఉన్న కధ.”

    “I was thrilled to read this great short story. (ఐ వజ్ థ్రిల్డ్ టు రీడ్ దిస్ గ్రేట్ షార్ట్ స్టోరీ). యీ కధను ఇంగ్లీషులోకి కాని, హిందీలోకి కాని అనువదిస్తే ఇండియాలోని గొప్ప కధల సరసన చోటు చేసుకుంటుంది. మనవాళ్ల ట్రడిషనల్ తింకింగ్స్ ఇంకా పోలేదు. అటువంటి వాళ్లకి ఇది తప్పనిసరిగా చూపాలి.”

    “యీ కధను ‘మహిత కధ’ సామాన్య గారు కూడా మెచ్చు కున్నారుగా, వచ్చే సంవత్సరం వారి ‘ప్రాతినిధ్య’ కధా సంకలం లో “తనదే ఆ ఆకాశం! “ తప్పక చోటు చేసుకుంటుందని ఆశించారు”.

    చెయ్యి తిరిగిన కధకుడు గొరుసు జగదీశ్వర రెడ్డి గారు యీ కధను మెచ్చుకోవటం, బెంగుళూరు బెమ్మరాచ్చసుడిని మరవక పోవటం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పమన్నారు.

    కవితలకు పెద్దపీట వేసే అఫ్సర్ గారి సారంగ e-పత్రికలో యీ కధ వచ్చిందా అని వివరాలు కనుక్కుని అఫ్సర్ గారికి అభినందనలు తెలియజెయ్యమన్నారు.

    ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్ ని ఎంత సెన్సిటివ్ గా, బాలెన్స్డ్ గా హాండిల్ చేసింది ఇంత చిన్న అమ్మాయి అన్నారు. తను శ్రీ పింగళి వెంకయ్య గారి మనుమరాలనుకుంటా సార్ అంటే ~ ప్రతి భారతీయుడు గర్వంగా ఎగురవేసే జాతీయజెండా రూపశిల్పి, తెలుగువారి ముద్దు బిడ్డ ~ పింగళి వెంకయ్య గారిని ఎనెన్నో విధాల స్మరించుకున్నారు.

    తనకు ఇంతటి ఆనందం కలిగించిన కధను రాసిన చైతన్య గారిని మనసారా అభినందిస్తూ, వారి నుండి మరిన్ని రచనలకై ఆశిస్తున్నానన్నారు శ్రీ భ.జ.రా గారు.

  37. AMARENDRA DASARI says:

    రామయ్య గారి పుణ్యమా అని ఇపుడే చదివాను..బావుంది..తెలుగు కథకు మరో కొత్త ఊపు అందించే మనిషి దొరికారు గదా అని గొప్ప సంతోషం గా ఉంది …

  38. A story that’s close to my heart. Thanks for writing.

  39. chaithanya says:

    ప్రవీణ థాంక్స్..

  40. srivasthava says:

    కధనం చాల బాగుంద్. అల్ ది బెస్ట్

  41. కె.కె. రామయ్య says:

    “తనదే ఆ ఆకాశం! “ కధ ప్రింటు కాపీని చదివిన ‘బుడ్డగిత్త రంకి’ కదా రచయిత శ్రీ పుట్టా పెంచల్డాసు ఎంతో ఆనందపడుతూ, చైతన్య పింగళి గారికి హార్దిక అభినందనలు తెలియజేస్తున్నారు. హాస్పిటల్ పాలై రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఈ కధ చదవటం ద్వ్యారా లభించిన ఎల్లలులేని ఆనందానికి రచయిత్రికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు.

    ఈ సందర్భంలో తమిళ దళిత రచయిత్రి భామ గారు ( Bama Faustina Soosairaj ) రాసిన ఆత్మకథ “కరుక్కు” (1992) ( Karukku తాటి ఆకులు ? పాల్మైరా లీవ్స్ ), హృదయాన్ని కదిలించే “కరుక్కు” ని కూడా తలుచుకున్నారు.

    చైతన్య గారి కలం నుండి జీవితాన్ని ఆవిష్కరించే మరిన్ని అద్భుత రచనలు రావాలని ఆశించారు.

  42. కె.కె. రామయ్య says:

    ఎందరెందరో ప్రశంసలు అందుకున్న చైతన్య పింగళి గారి మొదటి కథా సంకలనం “మనసులో వెన్నెల” ప్రింటు కాపీలను నవోదయ బుక్ హౌస్, కాచీగూడ, హైద్రాబాదు వారి క్రింద ఇవ్వబడిన లింకు నుండి కానీ

    http://www.telugubooks.in/products/manasulo-వెన్నెల

    e-పుస్తకాన్నికినిగే ఆన్ లైన్ యీ-బుక్ స్టోర్ వారి క్రింద ఇవ్వబడిన లింకు నుండి కానీ పొందవచ్చు.

    http://kinige.com/author/Chaithanya%20Pingali

  43. కె.కె. రామయ్య says:

    “మనసులో వెన్నెల” ప్రింటు పుస్తకంలో “తనదే ఆ ఆకాశం! “ కధని చదివి ఆనందించిన సాహితీ బందుగు, త్రిపుర గారి ఆప్తమిత్ర, పెద్దలు శ్రీ రామడుగు రాధాకృష్ణమూర్తి గారు చైతన్య పింగళి గారికి తన అభినందనలు, శుభాశీసులు తెలియజేయ్యమన్నారు. ప్రతిభావంతురాలైన ఓ వర్ధమాన రచయిత్రిని సారంగ ద్వారా కదాలోకానికి పరిచయం చేసిన అఫ్సర్ గారినీ అభినందించారు.

  44. k sivanageswararao says:

    పాజిటివ్ గా బాగా వ్రాసారు

  45. కె.కె. రామయ్య says:

    “చిట్టగాంగ్ విప్లవ వనితలు” ( చిట్టగాంగ్ విప్లవ వనితల సాహస గాథలు ) పుస్తకం 2016వ సంవత్సర కేంద్ర సాహిత్య యువ పురస్కార అవార్డుకు ఎంపికైన సందర్భంగా చైతన్య పింగళి గారికి హార్దిక శుభాకాంక్షలు.

    http://www.telugubooks.in/products/chittagang-viplava-vanitalu

  46. కె.కె. రామయ్య says:

    చైతన్య పింగళి గారి “చిట్టగాంగ్ విప్లవ వనితలు” పుస్తకం 2016వ సంవత్సర కేంద్ర సాహిత్య యువ పురస్కార అవార్డు అందుకున్న సందర్భంగా త్రిపుర గారి ఆప్తమిత్ర, పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు చైతన్య గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Leave a Reply to RAKUMARI Cancel reply

*