గమనమే గమ్యం-10

 

 

Volga-1ఐతే ఆ తర్వాత ఇక శారదకే కాదు ఎవరికీ ఏమీ ఆలోచించే సమయం లేదు. దండియాత్ర మొదలైంది. అది దావానలంలా పాకింది. దేశమంతా ఉప్పు ఉడుకుతోంది. మద్రాసు సముద్రం మాత్రం చల్లగా ఉంది. మద్రాసు నిశ్శబ్దాన్ని చూస్తే శారదకు ఆశ్చర్యంగా ఉంది. ఆవేశమూ కలుగుతోంది. దుర్గ ఏం చేస్తోంది?

రెండు మూడు రోజులు  ఆందోళనతో గడిచిన తర్వాత దుర్గను కలిసి మాట్లాడాలని బయల్దేరుతుంటే దుర్గే శారద ఇలలు వెతుక్కుంటూ వచ్చింది. అదే మొదటిసారి దుర్గ ఈ ఇంటికి రావటం. శారద సంతోషంతో పొంగిపోతూ దుర్గ భుజాల చుట్టూ చేయి వేసి గలగలా నవ్వుతూ దుర్గను తల్లి దగ్గరకు తీసికెళ్ళింది. ఇక సుబ్బమ్మగారి హడావుడి చూసి తీరాలి. సుబ్బమ్మ గారు అతిథులను చూస్తే ఆగలేరు. అందులోనూ తనకు ఇష్టమైన వాళ్ళంటే మరీ .  ఆమె పెట్టినవన్నీ తినాలి. చెప్పేవన్నీ వినాలి. శారద దుర్గను తల్లినుంచి రక్షించి మేడమీదకు తీసికెళ్ళింది.

‘‘చూశావా దుర్గా! గాంధీగారు సత్యాగ్రహంలోకి ఆడవాళ్ళు అప్పుడే రావల్సిన అవసరం లేదంటున్నారు. నువ్వేం చేస్తావు?’’

‘‘నేను చెయ్యవలసింది చేసేశాను.  గాంధీగారికి ఉత్తరం రాశాను. ఆయన ఒప్పుకుంటారు. ఆయన అనుమతించకపోయినా నేను శాసన్లోల్లంఘనం చేసి తీరతాను. ప్రజల చేత చేయిస్తాను’’ దుర్గ కళ్ళు జ్యోతుల్లా ప్రకాశిస్తున్నాయి.

‘‘నువ్వు గాంధీగారి శాసనాన్ని కూడా ఉల్లంఘిస్తావా?’’

దుర్గ ధీరలా పలికింది.

‘‘శాసనం అన్న మాటకే తల ఒంచకూడదు. శాసనరూపంలో ఎవరేం చెప్పినా  ఉల్లంఘించాల్సిందే. అది గాంధీగారు నేర్పిందే’’

‘‘ఔను. కానీ ఏం చేస్తావు? ఎలా చేస్తావు?’’

‘‘పంతులు గారు రెండు రోజుల్లో మద్రాసు వస్తారు. ఆయనతో,  ప్రకాశం గారితో మాట్లాడి మద్రాసులో నిప్పురాజెయ్యాలి. ఉప్పు వండాలి’’.

‘‘ప్రకాశం గారు గుంటూరు, బెజవాడ వెళ్తానంటున్నారుగా?’’

‘‘అక్కడ నాయకులెందరో ఉన్నారు. అంతగా అయితే ఒకసారి వెళ్ళి వాళ్ళను ఉత్సాహపరిచి రావొచ్చు. కానీ మద్రాసు ఇంత పెద్ద నగరం. బ్రిటీష్‌వాళ్ళ పరిపాలనా కేంద్రంలో చిన్ననిప్పురవ్వ కూడా లేకుండా ఉంటే ఎలా? అది వాళ్ళ బలమనుకోరూ?’’

‘‘ఐతే నువ్వు సిద్ధమయ్యావా?’’

‘‘సిద్ధమయ్యాను శారదా? మరి నువ్వు?’’

‘‘నాకీ చదువనే బంధం ఒకటుందిగా.నాన్నకు మాటిచ్చాను. చదువుకి భంగం రాకుండా ఏం చెయ్యగలనో అదంతా చేస్తాను’’

‘‘నువ్వు చాలా చెయ్యాలి. చేస్తావు. నాకు తెలుసు’’

‘‘మా అన్నపూర్ణ ఇప్పుడు కాకినాడలో ఉంది. తను కూడా సత్యాగ్రహం చేస్తుంది. నాకు తెలుసు.’’

ఇద్దరికీ సత్యాగ్రహం ఎలా చెయ్యాలో, ప్రజలను ఎలా సమీకరించాలో ఎంత మాట్లాడుకున్నా తనివి తీరటం లేదు.

దుర్గ ఇక వెళ్ళాల్సిన సమయం అయిందంటూ లేచింది. చివరిగా తన భయమూ శారదతో చెప్పింది.

‘‘మనం ఇన్ని ఆలోచిస్తున్నామా. ఆ నాయకులు  వచ్చి హఠాత్తుగా నిర్ణయాలు  చేసేస్తారు. మనం అనుసరించాల్సిందే. వివరించే వ్యవధానం కూడా తీసుకోరు. ఉద్యమంలో నాయకుల్ని ఎదిరిస్తే అది ఉద్యమానికి హాని చేస్తుందంటారు. మనం వాళ్ళ పొరపాట్లను చెప్తూ ఒక్క మాట మాట్లాడటానికి ఎంతో ఆలోచించాలి. ఈ లోపల  జరగాల్సిన నష్టం జరిగే పోతోంది. నాయకులు ఉండాలి , కానీ ఇలా ఉండకూడదనిపిస్తుంది’’.

దుర్గ మనసులో ఎంత ఆవేదన ఉందో అర్థమైంది శారదకు.

‘‘దుర్గా ` నువ్వే నాయకురాలివి. నీలో ఆ స్వభావం ఉంది. నిన్ను చూసి అందరూ ప్రేరణ పొందుతారు’’.

దుర్గ నవ్వింది.

‘‘నేను సాహసంతో చేసే పనులను జనం మెచ్చుకుంటారు. ఆ సాహసాలు  కావాలి. కానీ నా ఆలోచనలను, నా మేధస్సు వీటిని అంగీకరించటం పురుషులకు అంత తేలిక కాదు. ఆడవాళ్ళను అలా గుర్తించటానికి ఇంకా సమయం రాలేదేమో  ’’

శారద దుర్గ నిరాశను తగ్గించాలనుకుంది.

‘‘ఎందుకు రాలేదు. సరోజినీ నాయుడిని గుర్తించటం లేదా?’’

‘‘ఆమె చదువు, ఆ చొరవ, ఆ దూసుకుపోయే తత్త్వం, సాహసం తెలివి ఇవన్నీ ఒక పురుషుడికి ఉంటే ఇంకా పెద్ద నాయకుడు అయ్యేవాడు.  ఇన్నీ ఉన్నా సరోజినీ నిర్ణయాలు  చేసే స్థాయిలో లేదేమో అనిపిస్తుంది.’’

‘‘కాలం మారుతుంది దుర్గా, మనమూ నిర్ణయాలు  తీసుకుంటాం. అన్ని పనులూ  చేస్తాం’’

‘‘ఔను. చెయ్యాలి. మనం చాలా పనులు  చెయ్యాలి. ముందు మద్రాసులో సత్యాగ్రహం ప్రారంభించాలి. దానిలో ఎవరు కాదన్నా నేను ముందుంటాను.’’

దుర్గను మెచ్చుకోలుగా చూసింది శారద.

దుర్గ కాసేపు సుబ్బమ్మగారితో కబుర్లు చెప్పి వెళ్ళిపోయింది.

మరో రెండు మూడు రోజు మద్రాసు నిస్తబ్దంగానే ఉంది. గుంటూరు, కృష్ణ మండలాల్లో సత్యాగ్రహం మొదలయిందని వార్తలొస్తున్నాయి.

ప్రకాశంగారు విజయవాడ బయల్దేరుతుండగా వెళ్ళి ఆయన్ని మద్రాసులో ఈ నిశ్శబ్దమేమిటని నిలదీసింది. ఒక్కరోజు అటు వెళ్ళి వచ్చి మద్రాసు సంగతి చూస్తానన్నాడాయన.

నాగేశ్వరరావు పంతులు  గారిని కూడా సంప్రదించి దుర్గ రంగంలోకి దూకింది.

olga title

పేటలన్నీ తిరిగింది. ప్రతి ఇంటి వాకిలీ తట్టింది. ఆమెకు మరికొందరు స్త్రీలు  తోడయ్యారు. పెద్దా, చిన్నా, బీదా, గొప్పా తేడాలు  లేకుండా వచ్చారు. దుర్గ అందరినీ నడిపించింది. ప్రకాశం గారు రావటంతో అందరిలో ఉద్రేకం రెట్టింపయింది. ఊరేగింపులు  మొదయ్యాయి. పోలీసులకూ, లాఠీచార్జీకూ భయపడే వారెవరూ లేరు. శారద అంతా చూస్తూనే ఉంది. దూరంగా ఉండక తప్పలేదు. కాలేజీ మానేందుకు లేదు. పరీక్షలు  తరుముకొస్తున్నాయి.

శారద లోపల్నించి వస్తున్న ఆవేశాన్ని ఉద్రేకాన్ని అదుపు చేసుకోలేక సతమతమవుతోంది.

ఆసక్తి లేకుండానే ఆస్పత్రికి కాలేజీకి వెళ్ళివస్తోంది. ఆ రోజు శారదకు ఏదో జరుగుతుందనిపించింది. తన జీవితంలో ఏదో చిన్న మార్పయినా రావానీ వస్తుందనీ అనిపించింది.

ఉద్వేగాన్ని అణుచుకుంటూ ఆస్పత్రికి నడుస్తోంది.

ఎదురుగా గుంపుగా యువకులు నినాదాలు  చేసుకుంటూ వస్తున్నారు. శారద ఉత్సాహంగా వారివైపు నడుస్తోంది. అందులో శారద మిత్రులు కూడా ఉన్నారు. సుదర్శనాన్ని దూరం నుంచే పోల్చుకుంది. అతను చదువు పూర్తిచేసి పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. శారదకు మంచి మిత్రుడు. వాళ్ళ నినాదాలు  విని జనం కూడా వస్తున్నారు. ఇంతలో వాళ్ళను తరుముతున్నట్లే వెనుకనుంచి పోలీసులు  వచ్చి పడ్డారు. గుంపు చెల్లాచెదరయింది. కొందరు పారిపోయారు. కొందరు అలాగే నినాదాలిస్తూ నిలబడిపోయారు. పోలీసు లాఠీలు  పైకిలేచాయి. యువకుల శరీరాల మీద అవి విరుగుతున్నాయి. శారద పరిగెత్తుతూ అక్కడికి వెళ్ళేసరికి కిందపడిన యువకులను ఒదిలి కొందరిని అరెస్టు చేశామని తీసుకెళ్ళారు పోలీసులు. రక్తసిక్తమైన బట్టలతో దెబ్బలతో నేలమీద పడి ఉన్నారు నలుగురు. శారద వాళ్ళను ఒక్కొక్కరినే లేపి పక్కనున్న చెట్టు కిందికి చేర్చింది. అందులో సుదర్శనం ఉన్నాడు. అందరికంటే అతనికే ఎక్కువ దెబ్బలు  తగిలాయి.

‘‘మీరు శారద కదా’’ అన్నాడు వారిలో ఒక యువకుడు.

‘‘ఔను. మీకెలా తెలుసు?’’

‘‘చాన్నాళ్ళక్రితం గాంధీగారి మీటింగులో చూశాను. ఆ రోజు సభలో గాంధీ గారెంత ఆకర్షణో మీరూ అంత ఆకర్షణ’’

నొప్పిలో కూడా అతని కళ్ళు నవ్వుతున్నాయి.

శారద గంభీరమైపోయింది.

‘‘బాధ్యతగ పనులు  చేస్తూ మీరలా మాట్లాడకూడదు. మీరిక్కడే కూచోండి. నేను టాక్సీ దొరుకుతుందేమో తీసుకొస్తాను. హాస్పిటల్‌కి తీసుకెళ్తాను’’ అంటూ టాక్సీ కోసం వెళ్ళింది.

పదిహేను నిమిషాపైనే పట్టింది శారద టాక్సీలో వచ్చేసరికి. అందరినీ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. ముగ్గురికి చిన్నదెబ్బలే ప్రమాదం లేదని కట్టు కట్టి మందులిచ్చి పంపారు.

సుదర్శనానికి తలమీద పెద్ద దెబ్బ తాకింది. ఒకటి రెండు రోజులు  ఆస్పత్రిలో ఉంటే మంచిదన్నారు.

శారద సుదర్శనాన్ని ఆస్పత్రిలో చేర్పించి, అతనికి కావలసిన ఏర్పాట్లు చూసి ఆ తర్వాత క్లాసుకి వెళ్ళింది. అప్పటికే ఒక క్లాసు అయిపోయింది. అప్పుడు అందరిముందూ క్షమాపణ చెప్పటం కంటే ముందే వెళ్ళి వివరిస్తే మంచిదనుకుంది శారద.

శారదను చూడగానే ఆ తెల్ల ప్రొఫెసర్‌ ముఖం ఎర్రబడిరది.

‘‘మీ ఇండియన్స్‌కి అసలు బుద్ధిరాదు’’ అంటూ మొదలుపెట్టాడు.

శారద జేవురించిన ముఖంతో ‘‘ఔను సరే మా ఇండియన్స్‌కి బుద్ధిలేదు. ఉంటే బ్రిటీష్‌వాళ్ళు మమ్మల్ని పరిపాలించగలిగేవారా? బుద్ధి రావటం కూడా కష్టమే. వచ్చేది ఉంటే మిమ్మల్ని సహిస్తూ కూచుంటామా?’’

ఆ ప్రొఫెసర్‌కి కోపం కట్టు తెంచుకుంది.

‘‘ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా?’’

‘‘తెలుసు సర్‌ ` ఒక బ్రిటీష్‌ ప్రొఫెసర్‌తో మాట్లాడుతున్నాను. విద్యార్థి క్లాస్‌కి రాలేకపోతే కారణం ఏమిటని అడిగి తెలుసుకోవానే అవసరం ఉందనుకోని అహంకారపు బ్రిటీష్‌ ప్రొఫెసర్‌తోటి. నేను మీ క్లాసుకి రాకపోవటానికి కారణం అనాగరికమైన మీ పోలీసు వ్యవస్థ సర్‌’’

‘‘వాట్‌’’

‘‘ఔను. వందేమాతరం అన్నందుకు లాఠీలు విరిగేలా, యువకుల తలలు బద్దలయ్యేలా కొట్టమని ఆదేశించిన అనాగరిక బ్రిటీష్‌ పోలీసులు .  చెప్పండి సర్‌ . అది అనాగరికత కాకపోతే మరేమిటి? మమ్మల్ని అనాగరికులని హేళన చేస్తారే. మీ నాగరికత ఏమిటి సర్‌. అమాయకు ప్రాణాలు  తియ్యటమేనా? అది ఆటవికం సర్‌ ’’

‘‘మిస్‌. శారదా ` వాట్‌ హాపెన్‌డ్‌ ?టెల్‌ మి ఎవ్రీథింగ్‌’’.

శారద అంతా వివరించి చెప్పిన తీరుకి ఆ ప్రొఫెసర్‌ చల్లబడ్డాడు. ఆయన కూడా వచ్చి సుదర్శనాన్ని చూశాడు. పోలీసుల తరపున ఆయన క్షమాపణ చెబుతానన్నాడు. శారదను మెచ్చుకుని వెళ్ళాడు.

olga

‘‘మంచి సివిలైజ్‌డ్‌ మాన్‌’’ అన్నాడు సుదర్శన్‌.

శారద తేలికగా నవ్వేసింది.

‘‘ఇంతమాత్రం నాగరీకంగా ఉండటం కష్టమేమీ కాదు. నేనీయనను ఒదలబోవటం లేదు. జరిగినది, జరుగుతున్నదీ అన్యాయమని ఈయన గారి చేత ప్రభుత్వానికి లేఖ రాయిస్తాను. దానికేమంటాడో దాన్ని బట్టి తెలుస్తుంది ఈయనెంత నాగరీకుడో ` ఇంక నేను వెళ్తాను’’ శారద కూడా బాగా అలిసిపోయింది.

‘‘చాలా సహాయం చేశావు శారదా. మళ్ళీ కనపడతావుగా’’

‘‘ఎందుకు కనపడను? రాత్రికి భోజనం తెస్తాను. నువ్వీ ఆస్పత్రిలో ఉన్నంతవరకూ నా అతిథివి. రోజూ కనబడతాను’’.

‘‘ధన్యుడిని. ధన్యవాదాలు’’.

‘‘ధన్యవాదాలు చెప్పాల్సింది నేను. మిమ్మల్నందరినీ ఇక్కడికి తెచ్చినపుడు నాకు మంచి ఆలోచన వచ్చింది. ఇక్కడి మెడికల్‌ విద్యార్థులను ఒక గ్రూపుగా చేసి సత్యాగ్రహులకు ప్రథమ చికిత్స నుంచీ అవసరమైన సేవలూ  చికిత్సలూ చేయటానికి పంపాలనుకుంటున్నాం. సాయంత్రం ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాను. వస్తాను’’.

వెళ్తున్న శారదను మెచ్చుకోలుగా చూస్తూ ఉండిపోయాడు సుదర్శనం.

సత్యాగ్రహం తీవ్రంగానే నడుస్తోంది. దుర్గ మద్రాసంతా తానై తిరుగుతోంది. దుర్గను అరెస్టు చేశారనే పుకార్లు ప్రబలుతున్నాయి. శారద అతి ప్రయత్నం మీద దుర్గను కలిసి తను తయారుచేసిన వైద్యుల బృందాన్ని పరిచయం చేసింది. దుర్గను చూస్తే ఒక శక్తిని చూసినట్లే అనిపించింది వారికి. పూర్వపు దుర్గకూ ఇప్పటి దుర్గకూ పోలికే లేదు. ఓర్పుగా భర్తకు సేవ చేసే దుర్గ ఇపుడు ఉత్సాహం, ఉద్రేకం, ఆవేశం, ఆలోచన అన్నీ ఒకచోటకు చేరి మానవహారం దాల్చిన మహా చైతన్యంలాగ ఉంది. శారదకు అన్నీ ఒదిలేసి దుర్గతోపాటు ఉండిపోవాలనిపించింది.

సత్యాగ్రహులు ,దెబ్బలు  తిన్నవారు శారద బృందం దగ్గరకు వస్తున్నారు. వాళ్ళ దెబ్బలు  చూస్తుంటే శారద గుండె మండిపోతోంది. వాళ్ళకా దెబ్బలు  తగలకుండా చూసే అవకాశం లేదు. దెబ్బలు తగిలాక వైద్యం చెయ్యాలి.

కొన్నాళ్ళకు దుర్గ కనబడటం మానేసింది. అరెస్టు చేశారనీ, తప్పించుకు తిరుగుతోందనే, ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షమవుతోందనే వార్తలు  వస్తున్నాయి.

సుదర్శనం పత్రికలో ఉద్రేకపూరితమైన వ్యాసాలు  రాస్తున్నాడు. మూర్తి సత్యాగ్రహులలో ఒకడిగా వెళ్ళి దెబ్బలు  తిని పడి ఉన్నాడు. రామకృష్ణ, మిగిలిన విద్యార్థి మిత్రులంతా తమ తమ ఊళ్ళకు తరలివెళ్ళి అక్కడ సత్యాగ్రహం జరిగేలా ఉద్యమించారు.

శారద క్షణం తీరిక లేకుండా పనిచేస్తోంది.

రైల్వే కార్మికులు సమ్మెకు దిగుతున్నారని సుదర్శనం చెబితే ఆ నాయకులను కలిసి వచ్చింది.

ఎన్ని చేస్తున్నా అసంతృప్తే. తను సత్యాగ్రహం చెయ్యలేదు. అరెస్టు కాకూడదు. చదువుకు అంతరాయం కలగకూడదు. ఎందుకు తనీ చదువుకు బందీ అయింది? దుర్గ కూడా చదువు మానవద్దంటుంది. దేశం ఇలా మండుతుంటే ఆ జ్వాలల్లో దూకకుండా, పుస్తకాలు  కట్టకట్టి ఆ మంటల్లో పారెయ్యకుండా చదవటం దుర్భరంగా ఉంది శారదకు.

క్రమంగా ఉద్యమం ఊపు తగ్గుతోంది. అరెస్టు, అరెస్టు, జైళ్ళు నిండిపోతున్నాయి.

దుర్గాబాయి, అన్నపూర్ణా వెల్లూరు  జైల్లో  ఉన్నారని కచ్చితమైన సమాచారం వచ్చింది.

శారదకు వెళ్ళి వాళ్ళిద్దరినీ చూసి అభినందించి రావాలనే కోరిక పుట్టి అది మహోధృతమైంది.

కానీ వాళ్ళతో ఏ బంధుత్వమూ లేదు. అనుమతి ఎలా దొరుకుతుంది వారిని చూడటానికి.

వెల్లూరు  వెళ్ళొచ్చు. అక్కడ మెడికల్‌ కాలేజీలో స్నేహితులను కలవొచ్చు. కానీ జైలుకి ఎవరు రానిస్తారు?

ఒక ప్రయత్నం చేసి చూద్దామనుకుంది. సత్యాగ్రహుల మీద పోలీసు చర్యను అన్యాయమన్న ప్రొఫెసర్‌ తనకీ విషయంలో సహాయ పడగలడేమో ఒక రాయి వేసి చూద్దామనుకుంది.

అన్నపూర్ణకూ, తనకూ చిన్ననాటి నుంచీ ఉన్న స్నేహాన్ని వర్ణించి చెప్పి ఆయనలో సానుభూతి రేకెత్తించింది.

ఆయన ఆలోచించి తప్పక సహాయపడతానన్నాడు. సహాయం చేశాడు కూడా. ఆ ప్రొఫెసర్‌ అన్నగారు వెల్లూరు ఆసుపత్రిలో డాక్టరు. వెల్లూరు  జైలు  అధికారికి మంచి స్నేహితుడు.

అతన్నించి ఉత్తరం ఒకటి శారదకు ఇప్పించాడు. శారద ఆఘమేఘాల మీద వెల్లూరు  వెళ్లింది.

జైలు  అధికారి ఉత్తరం చూసి కూడా సందేహంలో పడ్డాడు. శారద జైల్లోని వాళ్ళకు ఏదైనా సమాచారం తెచ్చిందా అనేది అతని సందేహం.

శారద పదే పదే అభ్యర్థిస్తుంటే చివరకు కాదనలేకపోయాడు.

ఖైదీలు బంధువులని  కలుసుకునే గదిలో ఆరాటంగా కూచుంది శారద. ముందుగా ఎవరొస్తారు? దుర్గా ? అన్నపూర్ణా ? ఎలా ఉన్నారో ? ఏమంటారో?ప్రతిక్షణం నిదానంగా గడుస్తోంది. చివరికి అన్నపూర్ణ వచ్చింది.

శారద లేచి కౌగిలించుకుంది. ఇద్దరి కళ్ళల్లో నీళ్ళు.

olga title

అన్నపూర్ణ బాగా చిక్కిపోయింది. సన్నటి శరీరంలో ఎత్తుగా ఉన్న పొట్ట. శారద అవునా అన్నట్టు చూసింది.

ఔనన్నట్టు నవ్వింది అన్నపూర్ణ.

‘‘జైల్లో పుడుతుందా నీ కూతురు. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు’’.

‘‘నీరసం లేదు. ఏం లేదు. మన వాళ్ళంతా నాకు ఎక్కడెక్కడి నుంచో మంచి తిండి తెచ్చి మెక్కబెడుతున్నారు. మొన్ననే నా సీమంతం కూడా చేశారు’’ దర్జాగా చెప్పింది అన్నపూర్ణ.

‘‘సీమంతమా?’’

‘‘ఔను. దుర్గ ఉందిగా. ఊరుకుంటుందా? ఎంత హడావుడీ చేసిందనీ! అందరూ తలా రూపాయి, అర్దా వేసుకున్నారు. పూలు , పళ్ళూ తెప్పించారు. దానికి వార్డెన్‌ని ఎలా ఒప్పించిందో దుర్గకే తెలియాలి. తనే నాకు పూలజడ వేసింది. పాటలు , నృత్యాలు  ఒకటి కాదనుకో. సందడే సందడి. ఇంటి దగ్గరుంటే మీ అన్నగారు సీమంతమా గాడిదగుడ్డా అని తీసి పారేసేవారు. ఇక్కడ నాకు జరగని ముచ్చట లేదనుకో’’.

అన్నపూర్ణ జైలు  జీవితమంతా శారదకు చెబుతుంటే కాలం తెలియలేదు.’’

‘‘అసలు  దుర్గను జైల్లో  చూడాలి. శిక్ష అనుభవిస్తున్నానన్న స్పృహే లేదు. ఏదో సంబరంలో పాల్గొనటానికి వచ్చినట్లుంది. మేమంతా అప్పుడప్పుడు ఇంటి గురించి బెంగపడుతుంటాం. దుర్గ వచ్చి ఏదో ఒకటి చేసి బెంగ పోగొడుతుంది’’.

శారద తను తయారు చేసిన విద్యార్థుల గ్రూపు గురించి చెప్పింది.

‘‘ఇప్పుడు మాకంత పని లేదు. ఉద్యమం చల్లారుతోంది క్రమంగా. ఎందుకో తెలియటం లేదు. ఇపుడు నాకు రైల్వే కార్మికుల సమ్మె గురించే ఆశ ` అన్నపూర్ణా ఆ కార్మికులను చూస్తుంటే గుండె నీరయిపోయిందే . ఎంత దరిద్రం, దైన్యం’’

శారద మద్రాసు విశేషాలు  చెబుతుండగా సమయం దాటిపోయిందని అన్నపూర్ణకు పిలుపు వచ్చింది. అన్నపూర్ణ వెళ్ళిపోయింది.

జరిగిందంతా కలా నిజమా అనుకుంటూ మద్రాసు వచ్చేసింది శారద.

*

గాంధీ – ఇర్విన్‌ ఒడంబడిక గురించి పేపర్లన్నింటిలో ప్రముఖంగా వచ్చింది. చేసిన సత్యాగ్రహానికి, త్యాగాలకూ, చిందిన రక్తానికి ఏమైనా ప్రయోజనం ఉందా అని యువతరం ఆవేశపడుతున్నపుడే భగత్‌సింగ్‌ని, అతని సహచరులను ఉరి తీశారు.

శారద ఆ వార్త విని అచేతనంగా ఉండిపోయింది చాలాసేపు.

సుదర్శనం చాలా ఆందోళనతో వచ్చాడు శారద దగ్గరకు.

ఇద్దరూ కలిసి మైలాపూర్‌ సముద్ర తీరంలో చాలాసేపు మాటలు  లేకుండా కూర్చుండి పోయారు.

సుదర్శనం ముఖం, శరీరం అంతా చెమటతో తడిసిపోయింది.

‘‘కాసేపు సముద్రంలో ఈతకొట్టి రా సుదర్శనం. చల్లబడతావు’’ అంది శారద అతని ఉద్రేకాన్ని చూసి నవ్వుతూ.

‘‘నీకు నవ్వెలా వస్తోంది శారదా. భగత్‌సింగ్‌ని తల్చుకుంటే నాకు దు:ఖం ఆగటం లేదు. ఇంత అన్యాయమా?’’ సుదర్శనం ఏడ్చేశాడు.

‘‘ఈ దేశంలో అన్యాయం లేనిదెక్కడో చెప్పు. అన్యాయాన్ని సహించటం అలవాటు చేసేశారు’’.

‘‘కానీ శారదా, గాంధీ ఎలా దీనిని చూస్తూ ఊరుకున్నారు? ఆపటానికి ఎందుకు ప్రయత్నించలేదు? నాకు గాంధీ మీద విశ్వాసం పోయింది. చాలా కోపంగా ఉంది.’’

‘‘ఒద్దు సుదర్శనం.  విశ్వాసాన్ని పోగొట్టుకోకు. ఇవాళ దేశానికి గాంధీ మాత్రమే ఆశాకిరణంలా ఉన్నారు. ఆయనని కూడా నమ్మకపోతే మనం బతకలేం’’.

‘కానీ ఆయనేం చేశాడు ` వైస్రాయితో జరిపిన చర్చల్లో భగత్‌సింగ్‌ ఉరిని ఆపాలనేది ఒక షరతుగా ఎందుకు పెట్టలేదు’’ తీవ్రత ఆగటం లేదు సుదర్శనం కంఠంలో.

‘‘ఏమో? ఎందుకు పెట్టలేదో? నమ్ము. సకారణంగానే గాంధీ అలా చేశారని నమ్ము. ఆ మాత్రం నమ్మకం లేకపోతే శాంతి ఉండదు. బతకటం కష్టమైపోతుంది. నేను విశ్వసిస్తున్నాను. నీకూ చెబుతాను నా విశ్వాసానికి కారణాలను. కారణాలతో పనిలేకుండా లక్షలమంది విశ్వసిస్తున్నారు గాంధీని. ఆ ఆధారాన్ని ఒదలొద్దు’’ సుదర్శనం భుజం మీద చేయి వేసింది శారద.

‘‘కానీ శారదా! భగత్‌సింగ్‌ ఎంత ధైర్యంగా ఉరికంబమెక్కారో తెలుసా? తృణప్రాయంగా చూశాడు ప్రాణాన్ని. పాట పాడుతూ ఉరికంబం ఎక్కాడు’’ సుదర్శనానికి దు:ఖం ఆగటం లేదు. వెక్కి వెక్కి ఏడ్చాడు.

శారద కళ్ళనుంచి నీళ్ళు కారుతున్నా అవి వెలుగుతున్న ప్రమిదల్లా కాంతిని విరజిమ్ముతున్నాయి.

‘‘సుదర్శనం. అంత బేలగా అయిపోకూడదు నువ్వు. భగత్‌సింగ్‌ మరణించాడని నువ్వు ఏడుస్తున్నావు. కానీ అతనికి తెలుసు తనకు మరణమన్నదే లేదని. అతనికి చాలా ముందు చూపు. అతనికి తెలుసు క్షలాది యువతీ యువకుల మనసుల్లో చిరకాలం తాను జీవించబోతున్నానని. అందుకే ఆయనకంత ఉత్సాహం ఉరికంబం దగ్గర. అమృతం తాగాడాయన ఆ క్షణంలో. భగత్‌సింగ్‌ చనిపోయాడని ఎందుకనుకుంటున్నావు? ఎలా అనుకుంటున్నావు? నీకు ఆయన ఎన్నడైనా కనిపించాడా? ఒక్కసారైనా చూశావా? అతనొక వెలుగు. అతనొక మార్గం. ఎప్పటికీ అలాగే ఉంటాడు. ఎవరిమీదనైనా మనకి విశ్వాసం పోతుందేమో. కానీ భగత్‌సింగ్‌ మన విశ్వాసాన్ని ఎన్నడూ పోగొట్టుకోడు. ఉజ్జ్వలంగా గా జీవిస్తూ, శ్వాసిస్తూ, మన రక్తంలో ప్రవహిస్తూ ఉంటాడు.’’

శారద మాటలు సుదర్శనం దు:ఖాన్ని పోగొట్టి అతనిలో కొత్త చైతన్యాన్ని నింపాయి. శారదలో ఉన్న శక్తి అదే . శారద చుట్టూ చేరే యువకులూ  విద్యార్థులు  తమ తమ నిరాశా నిస్పృహలను పోగొట్టుకునేది ఈ విధంగానే.

బలహీనంగా శారద దగ్గరకు వచ్చిన సుదర్శన్‌ కొత్త బలంతో అక్కడినుంచి బయల్దేరాడు.

‘‘మూర్తిని చూశావా? దెబ్బలు  బాగానే తగిలాయి’’ అన్నాడు వెళ్ళబోతూ.

‘‘చూడలేదు. వాళ్ళు నాకు తెలియదు’’ అంది శారద నిర్లిప్తంగా.

‘‘నేనిప్పుడు అక్కడికే వెళ్దామనుకుంటున్నా. నువ్వూ రాకూడదు?’’

శారద రెండు నిమిషాలు  తటపటాయించింది. వెళ్తేనే మంచిది. మూర్తిని ఆ ఇంట్లో భార్యా పిల్లల  మధ్య చూస్తే తన మనసు ప్రశాంతం కావచ్చు.

‘‘నేను వస్తాను. ముందు మా ఇంటికి వెళ్ళి వెళ్దాం’’. ఇద్దరూ శారద ఇల్లు చేరారు.

శారద లోపలికి వెళ్ళి తల్లితో చెప్పి చీరె మార్చుకుని వచ్చింది.

వీళ్ళిద్దరూ ట్రిప్లికేన్‌లో ఉన్న మూర్తి ఇంటికి వెళ్ళేసరికి సాయంత్రమయింది. బస్సు, ట్రాము ఒక పట్టాన దొరకలేదు.

వీళ్ళిద్దరినీ ఆహ్వానించిన మూర్తి భార్య లక్ష్మిని చూస్తే శారదకు ఏదో జాలి పొంగుకొచ్చింది.

లక్ష్మి వీళ్ళిద్దరినీ మూర్తి పడుకుని ఉన్న గదిలోకి తీసికెళ్ళింది.

విశామైన గది. గాలీ వెలుతురు వచ్చేగది.

మూర్తి మధ్యాహ్నపు నిద్రనుండి అపుడే లేచినట్లున్నాడు. చాలా బలహీనంగా అనిపించాడు.

‘‘నా భార్య లక్ష్మి’’

‘‘పరిచయం అయింది’’ ప్రశాంతంగా నవ్వింది శారద.

సుదర్శనం కుశల ప్రశ్నలు అడుగుతుంటే శారద నాడి చూసి, కళ్ళూ నాలుకా పరీక్షించింది.

లక్ష్మి వంక తిరిగి ‘‘రక్తం బాగా పోయినట్లుంది. పాలు రెండు పూటలా ఇవ్వండి. వేరుశనగపప్పు, బెల్లం కలిపి ఉండలు చేసిపెట్టండి. అంతా బాగుంది. కంగారుపడాల్సిందేమీ లేదు’’ అని ధైర్యం చెప్తున్నట్లు అన్నది.

‘‘భగత్‌సింగ్‌ని ఉరి తీశారని విని తట్టుకోలేక శారద దగ్గరకు వెళ్ళాను. శారద మాటతో కాస్త ఊరట కలిగింది. ఇద్దరం నిన్ను చూడాలని ఇక్కడకు వచ్చాం’’.

‘‘మంచిపని చేశారు. భగత్‌సింగ్‌ ఉరితో భారత ప్రజలకు బ్రిటీష్‌ ప్రభుత్వం మీద అసహ్యం, కోపం మరింత పెరుగుతాయి.’’

‘‘కానీ గాంధి ఈ ఉరిని ఆపొచ్చుగదా ` శారద ఎంత చెప్పినా నాకు గాంధీ మీద ఈ విషయంలో కోపంగానే ఉంది’’.

‘‘లేదు సుదర్శనం. గాంధీనే కాదు. ఎవరూ ఆపలేరు భగత్‌సింగ్‌ మరణాన్ని. అతను దేశ స్వాతంత్రానికి తన జీవితాన్ని కానుక చేయదల్చుకున్నాడు. అది గాంధీకి అర్థమైందేమో’’.

‘‘అంటే `’’ సుదర్శనే అసహనంగా అన్నాడు.

‘‘అంతే. భగత్‌సింగ్‌ మార్గం, గాంధీ మార్గం పూర్తిగా భిన్నం. ఆ భిన్నత్వాన్ని అంగీకరించాడు గాంధి. భగత్‌సింగ్‌ దేశంలోని యువతరానికి సాహసం నేర్పదల్చుకున్నాడు. భగత్‌సింగ్‌ బ్రిటీష్‌ వాళ్ళను క్షమాపణ అడుగుతాడా? తాను చేసింది ఇంకో పదిసార్లయినా అవకాశం వస్తే అలాగే చేస్తానంటాడు. చెరసాలనూ, ఉరికొయ్యనూ, ప్రాణత్యాగాలనూ లెక్కచెయ్యని సాహసం భగత్‌సింగ్‌ది, అతని సహచరులది. ఆ సాహసం రగిలించాడు భగత్‌సింగ్‌. యువతరంలో  ఆ యువతీ యువకుల సాహసం, దీక్ష కావాలి గాంధికి. ఆ సాహసాన్ని ఆయన మరో మార్గంలో నడిపిస్తాడు. ఆ మార్గంలో నిత్యం ప్రయాణించే సాహస యాత్రికులను భగత్‌సింగ్‌ మన జాతికి అందించాడు’’ శారద తన ఆలోచనకు మరింత స్పష్టమైన రూపాన్నిచ్చి చెప్తున్న మూర్తివంక అలాగే చూస్తుండి పోయింది.

సుదర్శనం మరింత అసహనంగా లేచి నిబడ్డాడు.

‘‘అంటే ఇది రాజకీయ ఎత్తుగడా? ` ’’

‘‘కావొచ్చు. కాకపోవచ్చు ` ’’ అన్నాడు మూర్తి.

శారద కాస్త గట్టిగా చెప్పింది.

‘‘కాదు,కానే కాదు. గాంధి ఏం చెయ్యాలని నీవనుకుంటున్నావు సుదర్శనం? భగత్‌సింగ్‌ని ఉరి తీయొద్దని, క్షమించమని అడగటమంటే అతని మార్గం నుంచి అతన్ని దారి మళ్ళించటమే. గాంధీ ఇతరుల విశ్వాసాను గౌరవిస్తాడు. ఈ సంఘటనను మనం మామూలు దృష్టితో, బాధతో, మమకారంతో అర్థం చేసుకోకూడదు. చాలా ఉన్నతం భగత్‌సింగ్‌ ప్రాణత్యాగం. గాంధీనో, మరొకరో రక్షిస్తే జీవించి, లేకపోతే మరణించేంత స్వల్ప ప్రాణం కాదు భగత్‌సింగ్‌ది. ఆయన లక్ష్యం వేరు. భగత్‌సింగ్‌ మరణించాడని నువ్వంటున్నావు. అతనికి మరణమే లేదని నేనంటున్నాను. యువకుల మనసు మీద భగత్‌సింగ్‌ వేసిన ముద్ర ముందు గాంధీ చాలడు. అది ఇవాళ కాదు . ముందు ముందు ఇంకా బాగా తెలుస్తుంది’’.

‘‘ఔను సుదర్శనం. నా అభిప్రాయం కూడా అదే . శారదా నేనూ ఒక్కలాగే ఆలోచిస్తాం. కదూ శారదా’’.

శారదకు ఒక్కసారి పట్టరాని దు:ఖం వచ్చింది. దానిని నిగ్రహించుకుని పేలవంగా నవ్వింది.

లక్ష్మి ఫలహారాలేవో తీసుకొచ్చింది. లక్ష్మితో పాటు రెండేళ్ళ వయసున్న చిన్న పిల్లవాడు కూడా వచ్చాడు.

‘‘మా అబ్బాయి’’ అంది లక్ష్మి.

‘‘వాడి పేరు మీ నాన్నగారి పేరే , రామారావు’’ మూర్తి శారద కళ్ళల్లోకి చూసే ప్రయత్నం చేశాడు.

శారద పిల్లవాడిని దగ్గరకు తీసుకుంది. ఎత్తి ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల మీద ముద్దు పెట్టింది.

సుదర్శనం తను పనిచేస్తున్న పత్రిక విశేషాలేవో చెబుతూ కూచున్నాడు.

‘‘ఆలస్యం అవుతోంది. వెళ్దామా’’ అని లేచింది శారద.

లక్ష్మి శారదకు బొట్టుపెట్టి తాంబూంలం ఇచ్చింది.

ఆ రాత్రి శారద మనసు ప్రశాంతమైంది. మూర్తి మంచి స్నేహితుడు. అంతేనని ఆమె మనసుని స్థిరం చేసుకుంది.

‘‘మూర్తి మగవాడు కాకపోతే ఎలా అరమరికలు  లేకుండా స్నేహం చేసేదో అలాగే చెయ్యాలి. మూర్తి ఈ స్నేహాన్ని ప్రేమ అనుకుంటున్నాడు. స్త్రీ పురుషుల మధ్య స్నేహం కొత్తగా ఏర్పడుతోంది. బహుశ ఆ స్నేహాన్ని తనలాగా ఆస్వాదిస్తున్న స్త్రీ ఆంధ్రదేశంలో యింకొకరు లేరేమో. తనకు మగ స్నేహితులే చుట్టూ . వాళ్ళతో చాలా స్వేచ్ఛగా మాట్లాడుతోంది. వాళ్ళ భుజాల మీద చేతులు వేస్తుంది. వాళ్ళు నిరాశతో ఏడుస్తుంటే తల నిమిరి బుజ్జగిస్తుంది. వాళ్ళెవరూ దానిని వేరే రకంగా తీసుకోలేదు. కొందరు అక్కా అని బాంధవ్యం కలుపుకున్నా స్నేహంగానే చూసేవారు చాలామందే ఉన్నారు. బహుశ మూర్తి ఈ స్నేహం ప్రేమగా అనుకుంటున్నాడేమో. సుదర్శనంతో స్నేహానికి, మూర్తితో స్నేహానికి తేడా ఏమిటి? ఏమీ లేదు. సుదర్శనంతో కంటే మూర్తితో తన భావాలు  బాగా దగ్గరవుతాయి. తను సుదర్శనానికి బలం ఇవ్వగదు. మూర్తి తనకు బలం ఇవ్వగలడు. భావాలలో తనకంటె బలమైన పురుషుడిని మొదటిసారి చూసి తను కూడా కొంత సంచలనానికి, ఆకర్షణకు లోనయింది. అది ప్రేమ అనుకున్నది. తనలాంటి ఆధునిక స్త్రీని ఎన్నడూ చూడని మూర్తి తనని చూసి ఆకర్షితుడై ప్రేమిస్తున్నాననుకున్నాడు. కానీ ఇదంతా తాత్కాలికం. తమది స్నేహం.స్త్రీ పురుషుల మధ్య స్నేహం కుదురుతుంది. నాన్నకూ, హరిబాబాయికి ఉన్న స్నేహం లాంటిదే తమ స్నేహం.

శారదకు చలం గారి ‘శశిరేఖ’ పుస్తకం గుర్తొచ్చింది. స్నేహం, ప్రేమ మోహం వీటి గురించి గందరగోళ పడే కదా శశిరేఖ అంత ఘర్షణ పడిరది. తనకా గందరగోళం ఉండకూడదు `

శశిరేఖ గురించి కొత్తగా ఆలోచించటానికి చాలా ఉందనిపించింది. ఆ పుస్తకం తీసి చదువుతూ నిద్రపోయింది.

మరుసటి రోజు కాలేజీలో ఆస్పత్రిలో పనులన్నీ ముగిసాక ప్రొఫెసర్‌ దగ్గరకు వెళ్ళింది. స్త్రీ పురుష సంబంధాలను మానసిక శాస్త్ర రీత్యానూ, సామాజికంగానూ విశ్లేషణ చేసే పుస్తకాలేమైనా ఉన్నాయా అని అడిగింది. హెవలాక్‌ ఎల్లిస్‌ పుస్తకం చదివారా అని అడిగాడాయన. లేదంది. ‘‘నా దగ్గరుంది ఇస్తాను’’ అని తనతో పాటు శారదను ఇంటికి తీసికెళ్ళి ఆ పుస్తకం ఇచ్చి పంపాడు.

***

 

మీ మాటలు

*