వద్దు వద్దు కోపము

 

అవినేని భాస్కర్ 

 

Avineni Bhaskarఅన్నిటికీ ఆంక్షలు పెడుతున్నాను అని కోపపడకు. నీ దారిన నిన్నొదిలేస్తున్నాను. నాకు ఇంకేం చెప్పకు. నేను విసిగిపోయాను. చాలు. నీకు ఇష్టమొచ్చినట్టు వెళ్ళు. నేను కన్నతల్లినైయుంటే నా మాట వినేవాడివి. నేను కేవలం వదినని.

నీ ఆశయాలకీ, ఆశలకీ ఏ నాడూ అడ్డు చెప్పినదాన్ని కాను. నిన్నెప్పుడు మనసు నొప్పించేలా పన్నెత్తు మాటయినా అనలేదు. అలా చూసుకున్నాను. అలాంటి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. అప్యాయతగా తిరిగే నువ్వు ఇప్పుడు దగ్గరే(గోరికెలన) ఉంటూ ముభావంగా, అంటీ ముట్టనట్టు, పరాయివాడిలా తిరుగుతుంటే చాలా మనోవ్యధకి లోనౌతున్నాను. ఎప్పట్లానే సహజంగా మెలగమని నిన్ను ప్రేమగా వేడుకుంటున్నాను.

 

నువ్వేంచెప్పినా కాదనలేదు, సణిగి విసుక్కోలేదు! అలాంటి నాతో మొండిగా విసురుగా ప్రవర్తిస్తున్నావు. నాకెలా ఉంటుంది చెప్పు? నేను కన్నీళ్ళతో సాధించేసుకుంటున్నాను అనుకోకు. నాకూ బాధ కలగడం నిజమే కానీ నేనేం ఏడవట్లేదు. చెంపలమీద చెమటకారితే తుడుచుకుంటున్నాను అంతే. ఏడవలేదన్నానుకదా నామాటలు అతిక్రమించవచ్చు అని భావించకు. కన్నతల్లికంటే ఎక్కువ ప్రేమతో పెంచాను. అసలు నిన్ను పంపలేను.

ఎప్పుడూ నిన్ను విడిచి దూరంగా ఉండెరగను. నీ మీద కోపంచూపించడమూ ఎరగను. నొచ్చుకొని దూరంగా వెళ్ళిపోయి ఈ తల్లికి వంచన చెయ్యాలని ఎలా అనుకున్నావు? నువ్వు మామూలు మానవ శిశువుకావు. ఆ తిరుమలగిరి వేంకటేశుడివి. పిల్లవాడివైనావుగనుక కల్లాకపటంలేక తల్లిప్రేమని కురిపించుతున్నానుగానీ (దేవుడినే ఆదుకున్నాను అన్న) గర్వంతోకాదని ప్రార్థిస్తున్నాను.

annamayya

AUDIO : వద్దు వద్దు కోపము (ఇక్కడ వినండి)

పల్లవి
వద్దు వద్దు కోపము వదినె నింతే నీకు
సుద్దులేల చెప్పేవు సొలసితి నిన్నునుచరణం 1
మారుకొన్న దానఁగాను మాటాడినదానఁగాను
యేరా నాతోనేల యెగ్గు పట్టేవు
గీరితి నింతే గోరకెలని పరాకు రాఁగా
కూరిమి నిట్టే వేఁడుకొనేను నిన్నుచరణం 2
గుంపించినదానఁ గాను గొణఁగిన దానఁగాను
తెంపున నేరా నన్ను దీకొనేవు
చెంపల చెమట జార చేఁతఁదుడిచితి నింతే
అంపలేను ఆయమంటి ఆదరించే నిన్నును

చరణం 3
పాసివున్నదానఁ గాను పదరినదానఁగాను
వేసరక నన్నునేల వెడ్డువెట్టేవు
ఆసల శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
మోసలేదు నీకునాకు మొక్కుమెచ్చే నిన్నును

 

తాత్పర్యం (Explanation) :
అన్నిటికీ ఆంక్షలు పెడుతున్నాను అని కోపపడకు. నీ దారిన నిన్నొదిలేస్తున్నాను. నాకు ఇంకేం చెప్పకు. నేను విసిగిపోయాను. చాలు. నీకు ఇష్టమొచ్చినట్టు వెళ్ళు. నేను కన్నతల్లినైయుంటే నా మాట వినేవాడివి. నేను కేవలం వదినని.

నీ ఆశయాలకీ, ఆశలకీ ఏ నాడూ అడ్డు చెప్పినదాన్ని కాను. నిన్నెప్పుడు మనసు నొప్పించేలా పన్నెత్తు మాటయినా అనలేదు. అలా చూసుకున్నాను. అలాంటి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. అప్యాయతగా తిరిగే నువ్వు ఇప్పుడు దగ్గరే(గోరికెలన) ఉంటూ ముభావంగా, అంటీ ముట్టనట్టు, పరాయివాడిలా తిరుగుతుంటే చాలా మనోవ్యధకి లోనౌతున్నాను. ఎప్పట్లానే సహజంగా మెలగమని నిన్ను ప్రేమగా వేడుకుంటున్నాను.

నువ్వేంచెప్పినా కాదనలేదు, సణిగి విసుక్కోలేదు! అలాంటి నాతో మొండిగా విసురుగా ప్రవర్తిస్తున్నావు. నాకెలా ఉంటుంది చెప్పు? నేను కన్నీళ్ళతో సాధించేసుకుంటున్నాను అనుకోకు. నాకూ బాధ కలగడం నిజమే కానీ నేనేం ఏడవట్లేదు. చెంపలమీద చెమటకారితే తుడుచుకుంటున్నాను అంతే. ఏడవలేదన్నానుకదా నామాటలు అతిక్రమించవచ్చు అని భావించకు. కన్నతల్లికంటే ఎక్కువ ప్రేమతో పెంచాను. అసలు నిన్ను పంపలేను.

ఎప్పుడూ నిన్ను విడిచి దూరంగా ఉండెరగను. నీ మీద కోపంచూపించడమూ ఎరగను. నొచ్చుకొని దూరంగా వెళ్ళిపోయి ఈ తల్లికి వంచన చెయ్యాలని ఎలా అనుకున్నావు? నువ్వు మామూలు మానవ శిశువుకావు. ఆ తిరుమలగిరి వేంకటేశుడివి. పిల్లవాడివైనావుగనుక కల్లాకపటంలేక తల్లిప్రేమని కురిపించుతున్నానుగానీ (దేవుడినే ఆదుకున్నాను అన్న) గర్వంతోకాదని ప్రార్థిస్తున్నాను.


కొన్ని పదాలకు అర్థాలు ( Context based meaning) :

సుద్దులు = మాటలు
సొలసితి = విసిగిపోతిని

 

మారుకొను = అడ్డగించు, ఎదిరించు, ఆపివేయు
ఎగ్గుపట్టు = తప్పుగా భావించు
గీరితిని = మూర్చపోతిని, సొమ్మసిల్లితిని
గోరకెలన = దరిదాపుల్లో, దగ్గర, సమీపాన
పరాకు = ఉదాసీనత, indifference

 

గుంపించు = అతిక్రమించు
గొణగు = సణుగుడు/సనుగుడు, మారుపలుకు
తెంపున = విసురుగా, rudeness
దీకొను = ఎదిరించు
అంపలేను = పంపలేను
ఆయమంటి = మనసులోచేరి
ఆదరించు = పోషించు, సాకు

పాసి = ఎడబాసి, దూరంగా, విడిచిపెట్టి
పదరు = ఆత్రపడు
వేసరక = నొచ్చుకోక
వెడ్డువెట్టేవు = వంచించేవు
మోసలేదు = కపటంలేదు
మొక్కుమెచ్చు = ప్రార్ధించి మెచ్చుకొను

 

మీ మాటలు

 1. Mythili Abbaraju says:

  రెగ్యులర్ గా మీ శీర్షిక చదువుతున్నాను ..చక్కగా ఉంటోంది .చాలా అర్థాలు తెలుస్తున్నాయి.

  ” ఆసల శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
  మోసలేదు నీకునాకు ” మీ వ్యాఖ్య చదవకపోతే ఈ మాటల అర్థం మరొకలాగా స్పష్టమయేది…

  నిజానికి ఇప్పుడూ ఆశ్చర్యంగానే ఉందండీ. వదినె అన్నమాటను తన కన్నా పెద్దదైన మేనత్త / మేనమామల కూతురికి ఉపయోగించటం ఇప్పటికీ ఉంది కదా [ చాలా ఇళ్ళలో ‘ అక్క ‘ అని పిలిచేస్తూ ఉన్నా ]

  • మీ వంటి పెద్దలు ఈ శీర్షికని రెగులర్ గా చదువుతుండటం ఆనందంగా ఉంది.

   ”ఆసల శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
   మోసలేదు నీకునాకు ” ఈ మాటల నేను చెప్పిన అర్థం సరి అని కూడా అనేలేమేమో మైథిలి మేడం. కీర్తనలోని సందర్భాన్నిబట్టి ఇలా వివరణ రాశాను.

   మేనత్త, మేనమామ కూతుర్లను (పెద్దవారైతే) వదిన అని పిలవడం కలదు. ఈ కీర్తనని ఆమెకు కూడా అన్వయించుకోవచ్చేమో. నాకైతే ఇలా అన్వయించుకుంటేనే భావం సరిగ్గా ఉంటుందనిపించింది.

   థేంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వేల్యుబుల్ కామెంట్స్ :-)

 2. Sreelatha says:

  నిజంగా బాస్కర్ గారు అర్థాలు రాయకపోయి ఉంటే చాలా చోట్ల వేరే అర్థాలు స్పురించేవి. చక్కని పాట మరింత చక్కని వివరణ . చాల బావుందండి..

 3. SrInivas Vuruputuri says:

  ఆయము అంటే మనస్సు అని అర్థం ఉందా? నిఘంటువులో కనపడలేదు. ఎప్పుడో చదివిన జయప్రభగారి పుస్తకంలో ఆ మాటకిచ్చిన అర్థం వేరు. అది శృంగారార్థమే.

  “గీరితి నింతే గోరకెలని పరాకు రాఁగా, కూరిమి నిట్టే వేఁడుకొనేను నిన్ను” – అంటే పొరబాటున గోటి అంచుతో గీరాను, (కోపించ వద్దని) ప్రేమ కొద్దీ వేడుకుంటున్నాను” అని అర్థం కాదా?

  పోనీ మీరన్నట్లు ఇది రేవతీదేవి మాతృవాత్సల్యపు మనోవ్యథ అనుకుందాము. అలాంటి కథలు ఇంకెక్కడైనా ఉంటే రెఫరెన్సులు ఇవ్వగలరా? నాకు తెలిసిన రేవతీదేవి మాయాబజార్‌లోని ఛాయాదేవిగారు మాత్రమే. :)

  • ఆయము అంటే మనస్సు అని అర్థం ఉందా? నిఘంటువులో కనపడలేదు.
   — నిఘంటువలలో ఆయము అన్నపదానికి మనసు అని లేదు శ్రీనివాస్ గారూ. జయప్రభగారు చెప్పిన అర్థమే చాలావరకు సరి. రాధికా స్వాంతనంలో ముద్దు పళని తరచు ఆయం అన్నపదాన్ని మర్మస్థానం అన్న అర్థంతోనే రాశారు. అయితే ఈ కీర్తనలో ఆ అర్థం ఇమడదు. ఈ పదానికిగల వివిధ అర్థాలు పట్టుకున్నాను. ఆయము అంటే లోతైనది, లోలోపలున్నది అన్న అర్థాలుకూడా ఉన్నాయి. ఆయి అన్న పదానికి తల్లి అన్న అర్థం ఉంది. భావం పట్టుకోలేక చాలా తికమకపడ్డాను. ఈ కాంటెక్స్‌ట్ కి ఆయమంటి అంటే మనసులో పెంచుకున్న అన్న భావం అన్నట్టు అన్వయించాను. ఇది సరి అని అనడంలేదు. సరైన అర్థం ఎవరైనా చెప్తే తెలుసుకుంటాను :-)
   .
   .
   “గీరితి నింతే గోరకెలని పరాకు రాఁగా, కూరిమి నిట్టే వేఁడుకొనేను నిన్ను” – అంటే పొరబాటున గోటి అంచుతో గీరాను, (కోపించ వద్దని) ప్రేమ కొద్దీ వేడుకుంటున్నాను” అని అర్థం కాదా? —- మీరు చెప్పిన అర్థం కూడా కరెక్టే అండి. గోర అన్న పదానికి పలు అర్థాలున్నాయి. కుండ, బాన అన్న అర్థాలు కూడా ఉన్నాయి. ఈ సందర్భానికి సరిపడేది ఏదో దాన్ని తీసుకుని వివరణ రాశాను. మీరిచ్చినది కూడా బాగుంది.
   .
   .

   పోనీ మీరన్నట్లు ఇది రేవతీదేవి మాతృవాత్సల్యపు మనోవ్యథ అనుకుందాము. అలాంటి కథలు ఇంకెక్కడైనా ఉంటే రెఫరెన్సులు ఇవ్వగలరా? నాకు తెలిసిన రేవతీదేవి మాయాబజార్‌లోని ఛాయాదేవిగారు మాత్రమే. :-)
   — రేవతి దేవి గురించిన ప్రస్తావన అన్నమయ్య కీర్తనల్లోనే చాలా చోట్ల చదివినట్టు గుర్తుందండి. “ఔనయ్యా మేలెరిగిన ఆణికాడవు” అన్న కీర్తనలో ఉంది. గుర్తొచ్చినప్పుడు మిగిలినవి చెప్తాను.

   ధన్యవాదములు.

 4. Krishna Veni Chari says:

  భాస్కర్‍ గారూ, మీరు రెగ్యులర్గా రాస్తారని తెలియదు. కీర్తన ఎంత చక్కగా ఉందో మీరిచ్చిన అర్థం/వివరణా అంతే బాగున్నాయి.

 5. ఎంత అందమైన కీర్తన ! అంతే అందమైన తాత్పర్యం ! :)

 6. సురేశ్ కొలిచాల says:

  భాస్కర్ గారు,

  ఈ పాటకు మాతృపరమైన అన్వయం కుదుర్చడానికి చాలా ఊహాత్మకశక్తి కావాలి. ఆ రకమైన సృజనాత్మక చాతుర్యాన్ని మీరు ఈ వ్యాసంలో చూపించారు. అభినందనలు.

  But your explanation is untenable and absolutely wrong! :-)

  One simple counter: పల్లవి చివర “సొలసితి నిన్నును” అని ఉంది గమనించారా? “సొలసితి నిన్నును” అన్నది సకర్మక వాక్యం. మీరు “సొలసితి” అంటే విసిగిపోతిని అన్న అర్థం ఇచ్చారు. విసిగిపోవు- అన్నది అకర్మకక్రియ. “విసిగిపోయాను నిన్ను” అన్నది తెలుగులో అర్థంలేని పదబంధం. అన్నమయ్య సొలసు- అన్న క్రియను ఎన్నో కీర్తనల్లో “మోహించు-“, “పరవశం పొందు” అన్న అర్థంలో సకర్మక క్రియగానే వాడాడు. (అంతర్యామి, అలసితి, సొలసితి అన్నది exception ఇక్కడ) కొన్ని ఉదాహరణలు:

  సొలపులు మావంటి సుదతులకేలే? (26-228)
  (మొహాలు, పారవశ్యాలు మావంటి స్త్రీలకు ఎలా?)
  ఈతనిని ఏలా సొలసేవు ఎందాకా నీవు? (14-584)
  (ఈతన్ని ఎందుకు ఎంతకాలం మోహిస్తావు నువ్వు?)
  చొప్పలెత్తి యెటువలె సొలతు నిన్ను? (14-556)

  సొలసు- అన్నది సకర్మకంగా వాడినప్పుడు మోహించు- అన్న అర్థమే చెప్పుకోవాలి.

  సొలసితి నిన్నును – మోహించాను నిన్ను; గీరితి నింతే గోర – గోరుతో గీరాను, పరాకు రాగా; చెంపల చెమట జారగా చేత తుడిచాను అంతే; ఆయము అంటి ఆదరించే నిన్నును అంపలేను; ఆశల శ్రీ వేంకటేశ ఆ విధంగా నన్నుఁ కూడితివి; నీకు నాకు మధ్య వంచన లేదు శ్రీవేంకటేశా! అన్నవి ఆ వరసలో చదివితే శృంగారపరమైన అర్థమే తప్ప వేరే అర్థంలో చెప్పడం వీలు కాదు, నా దృష్టిలో.

  • సురేశ్ గారూ,
   నిజమే. ఈ కీర్తనకి మాతృపరమైన అన్వయం రాయడానికి చాలానే శ్రమపడ్డాను. కీర్తనలో పదాలన్నీ స్పష్టంగా శృంగార పరమైన భావాన్నే సూచిస్తున్నాయి. మరి అన్నమయ్య యే కాలంనాటి జీవితవిధానాన్ని ఊహించిరాశాడో అన్నది నాకు అంతుచిక్కడంలేదు. పోనీ రామాయణంలో వాలి మరణానంతరం తారా-సుఘ్రీవులు కలిసి కాపురం చేశారన్నట్టే వాల్మీకి రాశాడు కదా? అలాంటొక సంర్భాన్ని వేంకటేశుడికి అన్వయించి అన్నమయ్య ఈ కీర్తన రాశాడేమేనన్న కోణంలోకూడా వివరణ ఆలోచించాను. అలా అన్వయం కుదరలేదు.
   .
   “నాకూ నువ్వంటే ఇష్టమే, మోహమే! అయితే నీకు నాకు వావి (పెళ్ళాడటానికి యోగ్యమైన చుట్టరికం) కుదరదు. ఎందుకంటే నువ్వు నా అత్త కూతురితో రతిక్రీడ జరిపావు కావున వరుసకి మనం అన్నాచెల్లెలం. నాతో కూడితే దోషాలంటుకుంటాయి. ఆ పాపం నాకు కట్టకుండ తప్పుకో” అని నాయిక సరసాలాడే ధోరణి కీర్తనలుకూడా ఉన్నాయి. వాటిలో స్పష్టమైన శృంగార భావాలే ఉన్నాయి. వాటిని అన్న-చెల్లి బంధాలుగా అన్వయించలేము. అయితే వదిన గళం వినిపించే ఈ కీర్తన శృంగారపరమైన అన్వయానికి లొంగలేదు. నేను చదివినంతవరకు మరే కీర్తనలోకూడా వదిన ప్రస్తాపము లేదు. ఈ ఒక్క కీర్తనలో అన్నమయ్య కావాలనే శృంగారపరమైన పదాలు వాడి ప్రయోగాత్మకంగా రాశాడేమో అని ఫిక్స్ అయ్యాను. అందుకే మాతృపరమైన అన్వయానికి సరిపడేట్టు ఉన్న అర్థాలను జతపరచి వివరణ రాశాను. వ్యాకర
   .
   జ్ఞానం అందించకున్నా పరవాలేదుగానీ పాఠకులని భ్రమింపచేయకూడదన్నది నేను బాగానే నమ్ముతాను. నా అన్వయంతో అలా మిస్లీడ్ చేస్తున్నట్టు అనిపిస్తే చెప్పగలరు. శృంగారపరమైన అన్వయం రాయలేనుగానీ ఈ పోస్ట్ ని మాత్రం తొలగించమని చెప్తాను :-)
   .
   మీరు కౌంటర్ గా ఇచ్చిన అన్ని ఉధాహరణలూ సరియైనవే. మీరు చెప్పినట్టు వ్యాకరణం ప్రకారంగా కూడా నా వివరణ అతకడంలేదు.

 7. S. Narayanaswamy says:

  Interesting explanation, Bhaskar.

మీ మాటలు

*