నేను గాక ఇంకెవరని?

రేఖా జ్యోతి 
నేను గాక నిన్ను తెలిసిందెవరని ?
ఒక్క మాట చెప్పు

నిన్ను చూసిందెవరని ?

నిన్ను నిన్నుగా నేను గాక చూసిందెవరని ?

ఈ నీ కనిపించే ముఖాన్ని
దానిమీద అతికించిన ఓ నవ్వునీ చూసినవారే కానీ,
నీ అంతర్ముఖాన్ని, దాని సౌందర్యాన్ని
నాలా ఆరాధించినది ఎవరని?
నీ మౌనాన్ని వినగల వారు ,
నీ మాటల్ని మూటకట్టి దాచుకొనే వారు
నీ శూన్యాన్ని  వర్ణించగల వారు
నీ ఒక్కచూపుతో పద్యం రాయ గలవారు
నీ నవ్వుల తరగలలో ఊయలలూగే వారు
నీ గమ్యాన్ని నీకంటే ముందు సవరించే వారు
నేను గాక ఇంకెవరని?
నీ చేతిలోని తెల్లని కాగితాన్ని పదే పదే చదువుకొని మురిసి పోయింది
నేను గాక ఇంకెవరని?
నిన్న నీవు స్వాతి చినుకై  ఎక్కడ కురిశావో
ఇవాళ కన్నీటి చుక్కై ఎందుకు కుములుతున్నావో
నేను గాక నిన్ను తెలిసిందెవరని ?
ఒక్క పరుగులో వచ్చి ఎందుకు వాలిపోతావో
ఏదో  మలుపులో కాలాల తరబడి ఎందుకు ఆగిపోతావో
నేను గాక నిన్ను సమర్ధించిందెవరని ?
ఒక్క మాట చెప్పు
నా నుంచి దాగిపోవడానికీ నా జ్ఞాపకాన్నే కప్పుకున్నావని
నాకుగాక ఇక వేరే తెలిసిందెవరికని ??
కారణాలు ఏవైతేనేం ?
ఇదేదీ వద్దనుకొని ఎగిరిపోవడానికి నీవు  రెక్కలు తొడుక్కున్నప్పుడు
నేనొక్కదాన్నీ హర్షిస్తే ఇక నిన్ను ఆపేదెవరని ?
అయినా,
నిన్ను అంతగా తెలియని లోకంలోకి ఏం పోతావులే బంగారూ !!
హాయిగా ఉండిపోరాదూ,  నీదైన ఈ ప్రియాంకంలో !

*

మీ మాటలు

 1. ఇంత చిన్ని చిన్ని పదాలతో..అంత అద్బుతమైన భావాలు వ్యక్తపరచటం .. నిజంగా అభినందనీయం

 2. చాలా బాగా రాసారు రేఖా.. మీ స్వరంలో మునుపటికన్నా స్థిరత్వం, స్పష్టత, వేగం.. భావాలలో మీదైన కోమలత్వం.. మనలో ఉండే ద్వైదీ భావాలను అందంగా ఆవిష్కరించారు..

 3. “నిన్ను అంతగా తెలియని లోకంలోకి ఏం పోతావులే బంగారూ !!
  హాయిగా ఉండిపోరాదూ, నీదైన ఈ ప్రియాంకంలో!”
  అద్భుతం గా ఉంది రేఖమ్మా! పొందికైన మాటలతో … పారిజాల సున్నితత్వామంతా రంగరించి రాసావు. ఇలాంటి ప్రియాంకం లో ఒదిగిపొవడనికి ఏంటో అదృష్టం చేసుకొని ఉండాలి :)
  అభినందనలు!

 4. ఎంతో భాగ్యం ఉండాలి ఇలాంటి ప్రియాంకంలో ఒదిగిపోడానికి!

 5. Mythili Abbaraju says:

  సౌకుమార్యానికి అవధి గా ‘ బిస తంతువుల ‘ [ తామర తూడులోపలి దారాల ] ను చెబుతారు. వాటితో అల్లినట్లుంటుంది రేఖ కవిత్వం.

  ఈమె ఈ[ నా ] కాలపుదైనందుకు ఎంత ఆనందమనీ ..

  అవునండీ ఆ భాగ్యశాలి కీ ఆ సంగతి తెలుసును..:)

  • _/\_ సాహిత్యం తో జీవనోత్సాహం లోకి నడిపించిన మీకు , సారంగకి సదా కృతఙ్ఞతలు !! మీ అభినందన లోని పదాలెంత బాగున్నాయో ! అంత అర్హత కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తాను మైథిలీ Mam !!

 6. ఏదో మలుపులో కాలాల తరబడి ఎందుకు ఆగిపోతావో
  నేను గాక నిన్ను సమర్ధించిందెవరని ?………….చాలా బాగుంది జ్యోతి గారు

  • నిజమే కదా, ప్రపంచంలో మనని పూర్తిగా తెలిసినవారు ఒక్కరైనా వుంటారు కదా అని !! థాంక్ యూ కుమార్ గారు

 7. నా నుంచి దాగిపోవడానికీ నా జ్ఞాపకాన్నే కప్పుకున్నావని

  నాకుగాక ఇక వేరే తెలిసిందెవరికని ?? :) :) I love this…..

 8. sasi kala says:

  నిజంగా ఒక మనిషి ఎదురుగా కూర్చొని ఆర్తితో తన ఫీలింగ్ చెపుతున్నట్లు ఉంది . మీరు చాలా బాగా వ్రాస్తారు

 9. కవిత్వం అప్పుడప్పుడు పంచభూతాల్లో ఒకటౌతుందేమో..లేకుంటే కొన్ని పదాలకు ఇంత స్పర్శజ్ఞానం ఎలా వస్తుంది.నీ అక్షరాలకు ఆ శక్తి ఉందండి.

 10. విలాసాగరం రవీందర్ says:

  బాగుంది మీ కవిత రేఖ గారు

 11. Narayanaswamy says:

  బాగుంది చాలా ! నాకు ” లో ‘ చాలా నచ్చాయి – గొప్ప ప్రేమ అంటే స్వేచ్చ అని ప్రేమతో కూడిన సంపూర్ణ స్వేచ్చ ఇంకా గొప్పదనీ బాగా చెప్పారు

  • “గొప్ప ప్రేమ అంటే స్వేచ్చ అని ప్రేమతో కూడిన సంపూర్ణ స్వేచ్చ…ఇంకా గొప్పదనీ ” Thank u so much Narayana Swamy Sir !

 12. Rajendra Prasad Chimata says:

  నిన్నునిన్నుగా ప్రేమించుటకై నీ కోసమె కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము
  అన్న పాట గుర్తోస్తోంది. కాల్పనికమైన గొప్ప ఊహ, భావన. శుభాకాంక్షలు

  • ధన్యవాదాలండీ రాజేంద్ర ప్రసాద్ గారు ! చిన్న ప్రయత్నానికి పెద్ద ‘ శుభాకాంక్షలు’ ఇచ్చినందుకు

 13. నిషిగంధ says:

  కవిత మొత్తం వడివడిగా సాగుతూనే చాలా సున్నితంగా తాకుతోంది!!
  ఆ ‘నేను గాక ‘ అన్నప్పుడల్లా కొండంత ఆత్మీయతతో పాటు, ఆత్మస్థైర్యం కూడా నిండుగా ధ్వనిస్తోంది!

  ఇహ, ఇలా ‘నువ్వు గాక…’ వేరెవరూ చెప్పలేరు, రేఖా!

 14. ‘ చెప్పక తప్పలేదు, తనకున్నదేమిటో, చూస్తూ చూస్తూ చీకటికి వదిలేయలేక ‘ అన్నట్టు , Thank u so much Nishi !

మీ మాటలు

*