కనుల అలల కలకలం…

 

 

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh

 

నిజానికి ఒక చేపల మార్కెట్ కు వెళ్లి కనులను చిత్రించాలి.
చేపలను. ఆ చేపలను చూసే కనులను.

మీనాక్షులను.
వారి లోచనాలను.

కానీ, మనుషులు గ్యాలరీకే వెళతారు.
ప్రదర్శనకే వెళతారు.

కదలక మెదలక నిశ్చలంగా ఉండే చిత్రంతోనే మనిషి దోబూచులాడుతాడు.
కనెక్టు అవుతాడు.

అలవాటు.

తాను కదలాలి.
అవతల మాత్రం కదలక మెదలక ఉండాలి.
ఏమిటో ఈ చోద్యం!

కానీ, ఇక్కడకు రండి.
ఇది నా ప్లేస్. గ్యాలరీ.

కనుల కొలను.

చూడండి.
ఆమెతో సహా చూస్తూనే ఉండండి.

ఒక సింగిల్ ఇమేజ్ ను ముందు పెట్టుకుని…
అద్దంలో మీ మొహాన్ని మీరే చూసి మురిసినట్టు ఒక్కొక్కరిలో మీరే ఉన్నట్టు ఊహించండి.
వాళ్లను మీరే అనుకుని చూడండి.
ఆ ముఖారవిందాలను, అందలి భావుకతనూ కనులతో పరికించండి.

కొన్ని వికసిత పుష్పాలు. మరికొన్ని వాడిన పుష్పాలు.
మొగ్గలూ కొన్ని.

ఎంత బాగుంటుందో చూడండి.

నిమిషమైనా సమయం తీసుకుంటే మీ కళ్లు శుభ్రమవుతాయి.
చూడండి.

కళ్లు పలికే భావాలను కనులారా ఆస్వాదించండి.
ఎంత ముద్దుగా ఉంటై!
చూడండి.

మనిషిలోని భావాలను వ్యక్తం చేసే ఆ కళ్లు లలిత కళలు…
కలలు గనే ఆ కళ్లు పరిపరి విధములు!

అవి పలు దిక్కులా… వివిధాలుగా వ్యక్తమవుతూ ఉంటే…
ఆ కళ్లు, వారి మోములూ, వారి రూప లావణ్యమూ ఎంత బాగుంటవి!

ఆత్మలు గోచరించే కళ్లు.
దేహంలో విహరించే కలువలు.

ఎంత గమ్మత్తుగా ఉంటై.

కళ్లు – ఒక చూడ ముచ్చట.

కానీ, ఛాయా చిత్రకారుడిగా ఒక గ్రూప్ ఫొటో చేస్తున్నప్పుడు ఒకసారైనా కళ్లనే చేయాలని ఉంటుంది.
అందులో పలు దిక్కులా చూసే కళ్లను తీయాలనీ ఉంటుంది.
కానీ కుదరదు.

వేర్వేరు దిక్కుల్లోకి చూసే చూపులని ఒక్క చూపుతో కట్టిపడేయాలని ఉంటుంది.
కానీ, కష్టం.

సాధారణంగా గ్రూప్  ఫొటో చేస్తుంటే ఎవరో ఒకరు కళ్లు మూస్తారు.
మరో ఫొటో. ఇంకో ఫొటో – ఇట్లా చేసి, తీసిందాంట్లోంచి ఒకటి ఖాయం చేసుకోవలసి ఉంటుంది.
కానీ, చిత్రం. అదే పెయింటింగ్ అయితే… వాటిల్లో అన్నీ తెరిచిన కళ్లే. చూసే కనులే.
మూసుకున్నట్టు గీయడం కష్టం.
ఇంకా కష్టం.

ఈ చిత్రం ఒక కనుల ఖండిక.
కాళోజీ కవితలా, కళ్లపై ఆయన సుదీర్ఘంగా అల్లిన కవితా జగత్తులా
ఒక్కోసారి కొన్ని వందల కళ్లు పక్షుల్లా రెపరెలపాడి రెక్క ముడుచుకున్నట్టు..
వాటన్నిటినీ చిత్రానువాదం చేయాలంటే పెయింటింగే బెటరు.
ఛాయాచిత్రం మటుకు కష్టం.

అభిమానంగా. అయోమయంగా.
అసహనంగా.

తృప్తిగా. ఆనందంగా.
ఆరా తీస్తున్నట్టుగా..

ఎన్నో విధాలుగా ఆ కళ్లు.
చూడండి.

చిలుకా ఉంది.
ఏమిటో అది పైకి చూస్తూ ఉన్నది.
ఒకటి కాదు, చాలా ఉన్నాయి.

నిజానికి ఆ స్త్రీలందరూ చిలకలా?
ఏమో!

+++

ఇంకో చిత్రంలో ఒక కన్నూ ఉన్నది,.
అదీ చూస్తూ ఉన్నది. కానీ ఆందోళనగా ఉంది. భయంగా ఉంది.
అది స్త్రీ చూపే. కానీ, పురుషుడిలా భయపెడుతున్నది.

ఎవరో ఒక చిత్రకారుడు గీసిన ఆ చిత్రాల్లో ఒక సామాన్యమైన స్త్రీ కూడా ఉంది.
నిండుగ అలంకృతమైన స్త్రీలూ ఉన్నారు.
కానీ, నా దృష్టి మాత్రం వాటిని చూస్తున్న స్త్రీ పై ఉంది.
ఆయా చిత్రాలను తదేకంగా చూస్తూ ఉన్న మనిషి నా చిత్రం.

ఆయా చిత్రాల్లోని అలంకరణా ఒక శోభ.
ఆ దుస్తులు, లావణ్యం, వయ్యారం – అన్నీనూ ఒక సుదీర్ఘమైన లేఖనం.

తక్షణం కాదు.
ఎంతోకాలం వేసిన చిత్రాలే అవన్నీ.

ఇవన్నీ సరే.
నా చిత్రం చూడండి.

ఆమె చూస్తూ ఉన్న చిత్రం చూడండి.
అందులో అనేక చిత్రాలు.

అన్నీ ముడిచిన శిఖలైతే
ఈమె పరవళ్లు. పరువం.

సంప్రదాయం అది
ఇది ఆధునికం.

అది ఒక ఘడియ అయితే
ఇది ఒక క్షణం.

అవును. క్షణంలో పదోవంతు కూడా కాదు.
250 వంతు.

చిత్రలేఖనం ఒక సుదీర్ఘ ప్రస్థానం.
ఛాయా చిత్రణం మటుకు ఒక లిప్తలేఖణం.

అందుకే నిజం ఛాయ.
కల్పన చిత్రం.

కనుము
రెంటినీ.

కానైతే,
కనుము..
ప్రదర్శన లేనప్పుడు కూడానూ.

దృశ్యాదృశ్యం.

~

మీ మాటలు

  1. నిజమే ..ఆ బొమ్మలలోని కనులన్నీ చేపలే …నీ artistic vision తో మాకో కొత్త చూపునిచ్చావు ..మాకిప్పుడు నీలాల అలల మధ్య చేపలే అగుపడుతున్నాయి ..

  2. Narayanaswamy says:

    బ్యూటిఫుల్ రమేష్! బాగుంది చాలా !!

మీ మాటలు

*