అల్క మానవు గదా యికనైన…

మంజువాణి: ఒక వేశ్య

కొండిభొట్లు: తార్పుడుగాడు

భీమారావు పంతులు: విటుడు

(మంజువాణి తలదువ్వుకుంటూ కుర్చీపైని కూర్చుండును. కొండిభొట్లు ప్రవేశించును)

మంజు:  దండం శాస్తుల్లు గార్కి. వెంకీ, శాస్తుల్లు గార్ని కూర్చోబెట్టి పీట వెయ్యే!

కొండి:    సకలైశ్వర్య సిద్ధిరస్తు. పంతుళవారు పాదాక్రాంతాభవంతు….. ఆ తలవెండ్రుకలు సాక్షాత్తూ చమరీవాలాల్లాగా శోభిల్లుచున్నాయి. విన్నావా మంజువాణీ!

మంజు:  ఇంకా యేవి యెలా వున్నాయి?

కొండి:    యెదిన్ని వర్నించడానికి సెఖ్యం కాకుండా వున్నాయి… ముఖం చంద్రబింబంలా వున్నది. కళ్ళు కలవరేకుల్లా వున్నయి. గళం శంఖంలా వున్నది. బాహువులు లతల్లా వున్నయి. మరెవచ్చీ….

మంజు:  మరెవచ్చి అక్కడ ఆగండి.

కొండి:    మంజువాణీ! అధికం యేల? నీ సౌందర్యం రంభా ఊర్వశీ మేనకా తిలోత్తమాదుల్ను ధిక్కరించి వెక్కిరించి యున్నది.

మంజు:  మాపంతులుగారి వెధవ అప్పగారి సాటి యేమాత్రమయ్నా వస్తుందా?

కొండి:    హాశ్యానికైనా అనగూడని మాటలున్నాయి. (పొడుం పీల్చును)

మంజు:  చెయ్యగాలేంది చెప్పడమా తప్పొచ్చింది?

కొండి:    దేవతలు చేసే పనుల్ని, బ్రాహ్మలు చేసే పనుల్ని తప్పు పట్టకూడదు. స్వర్గంలో వాళ్ళు దేముళ్ళయితే, భూలోకంలో మేం దేముళ్ళము; అంచేతనే మమ్మల్ని భూసురులంటారు. చదువుకున్నదానివి నీకు తెలియందేమున్నది.

మంజు:  వెధవల్ని తరింపజేసే భూసురోత్తములకు నమస్కారము (నిలుచుని నుదుట చేతులు మొగిడ్చి నమస్కారము చేయును) (భీమారావుపంతులు ప్రవేశించును)

భీమా:   యేమిటీ నాటకం?

మంజు:  ముక్కోటి దేవతలు స్వర్గంలో వుంటే, భూమ్మీద దేవతలు బ్రాహ్మణులని కొండిభొట్లు గారు శలవిచ్చారు. అందుచేత వేశ్య యింటికి అనుగ్రహించి వేంచేస్ని భూసురోత్తముల్ని కొలుస్తున్నాను.

భీమా:   నీవు యెంత యెకసెక్యం చేసినా మేం దేవతలమే, అందుకు రవ్వంతైనా సందేహము లేదు.

మంజు:  భూలోకంలో కృష్ణావతారం లాంటి రసికులు మీరు. కృష్ణావతారం కుదిరింది; కాని శాస్తుల్లు గారు యే దేముడి అవతారమో పోల్చలేకుండా వున్నాను.

భీమా:   పట్టణం వెళ్ళినప్పుడు నేను పరంగీ స్త్రీల సహవాసం చేశానని నీకు చాడీలు చెప్పారు గనుక శాస్తుల్లు గారు సాక్షాత్తూ నారదావతారం.

మంజు:  అన్నా! మరచిపోయినాను. యెంత బుద్ధి తక్కువ మనిషిని; దూరముగా నిలుచొండి. ప్రాయచ్చిత్తం చేసుకొంటేనేగాని దగ్గరకు రానియ్యను.

భీమా:   శాస్త్రుల్లుగారూ! యేమిటండి ప్రాయచ్చిత్తం? నకక్షతమా, దంతక్షతమా?

కొండి:    అది యెంత అదృష్టవంతులకుగాని సంప్రాప్తమవుతుంది. ముక్కుతిమ్మన్న యేమన్నాడు.

నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబూని తా

చిన అదినాకు మన్ననయ; చెల్వగు నీ పద పల్లవంబు మ

త్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నే

ననియెద; అల్క మానవు గదా యికనైన అరాళకుంతలా

స్వేతముఖులు గనుక బ్రాహ్మడికి రజతదానం చేస్తే ప్రత్యువాయం పోతుంది. మాకుర్రవాడు మెటిక్లేషను పరీక్షకు కట్టాలి. యీబీదబ్రాహ్మడికి దానం యిస్తే సమయానికి పనికి వస్తుంది.

మంజు:  నిత్య సువాసినికి సువర్నదానం చెయ్యమని లేదా?

భీమా:   (తనలో) దీని తస్సాగొయ్యా! బంగారపు సరకును మళ్ళీ తెమ్మంటుంది కాబోలు. (పైకి) తొందరపని వుంది. యిప్పుడే వెళ్ళి వస్తాను. (వెళ్లిపోవును)

కొండి:    మంజువాణి! బహు పుణ్యాత్మురాలివి, యేమైనా సాయం చేస్తేనే గాని కుర్రవాడు పరీక్షకు వెళ్ళే సాధనం కనబడదు.

మంజు:  పంతులుగారి అప్పని అడుగరాదా?

కొండి:    యెవర్నీ అడక్కుండా యేమయింది. వైదీకపాళ్ళని పుట్టించినప్పుడే బ్రహ్మ రాసిపడేశాడు. “ముష్టెత్తుకొండర్రా” అని.

మంజు:  యేది యిందాకటి పద్యం చదవండీ.

కొండి:    (రాగవరసను చదువును) నను భవదీయ…. (అలా చదువుతుండగా వెనకవైపు వచ్చి మంజువాణి శాస్తులు వీపు మీద తన్నును) ఓస్నీ అమ్మా శిఖా… (అని, తగ్గి) ఆహా! మల్లిపువ్వుల గుత్తా? పట్టుకుచ్చా? మలయమారుతమా వీపు తాకినది?

మంజు:  సానిదాని కాలు.

కొండి:    కాదు, కాదు, మన్మథుని వాడి వాలు.

మంజు:  ప్రాస కుదిరింది కాని, శాస్తుల్లు గారు! యీ తాపు మదనశాస్త్రంలో క్రియక్రింద పరిగణన మవుతుందా, భూసురోత్తములను తన్నిన పాపం క్రింద పరిగణనమవుతుందా?

కొండి:    పదిరూపాయలు పారేస్తే పుణ్యం కింద పరిణామం అవుతుంది.

మంజు:  పాటుపడక పైసా రాదు.

కొండి:    మంజువాణి! యెంత చదువుకున్నా మావంటి వాళ్ళం నీకు వక్క మాటకు సదుత్తరం చెప్పగలమా? బాపనాళ్ళని కనికరించి, ఒక డబ్బు సొమ్ము యివ్వాలి గాని.

మంజు:  వేశ్యల ద్రవ్యం పాపిష్టిది. బేరం తెచ్చి రుసుం పుచ్చుకుంటే ప్రత్యువాయువుండదు.

కొండి:    యీ వూళ్ళో నానాటికి రసికత సన్నగిల్లుతూన్నది. “అంధునకు గొరయ వెన్నెల” అన్నట్టు యీ వూళ్ళో మూర్ఖులకు నీ రూపలావణ్య విలాస విశేషములు అగ్రాహ్యములు. తోవంట పోయే పొన్నూరు వాళ్ళను కాచి పట్టుకోవాలి.

మంజు:  పది డబ్బులు రాల్చగలిగే వాళ్ళను యెంచి మరీ పట్టుకురండి.

*

మీ మాటలు

  1. బ్రెయిన్ డెడ్ says:

    Ha missed reading your lines . finally !

  2. Krishna Prasadrao says:

    రియల్లీ గ్రేట్

  3. M.KALIDASU says:

    ఏ తప్పుకయునా డబ్బు చెల్లేస్తే సరిపోతుంది అనే ట్రైబల్ప్ సమప్రదయానికి దీనికి ఏమీ తేడా లేదు

మీ మాటలు

*