శివారెడ్డి జీవితమంతా కవిసమయమే!

నారాయణ స్వామి వెంకట యోగి 

(శివారెడ్డి 72వ పుట్టిన రోజు సందర్భంగా)

  swamy1“ఏం నాన్నా యెంత సేపైంది వచ్చి?’ అంటూ ఆప్యాయంగా సార్ బుజం తడితే చదువుతున్న పుస్తకం లోంచి ఉలిక్కి పడి తలెత్తి చూసి లేచి నిల్చుని “ఇంతకు ముందే సార్ “ అంటూ నమస్తే పెట్టాను. “నువ్వు చదువుతూ కూర్చో. మరో వరస క్లాస్ ఉంది నేనిప్పుడే వెళ్ళి త్వరగా ముగించుకుని వచ్చేస్తా. తర్వాత వెళ్ళిపోవచ్చు మనం” అంటూ లాకర్ లోంచి మరో టెక్స్ట్ బుక్ తీసుకుని క్లాస్ కు బయలుదేరారు. “సరే సార్ ఈ కవి కవిత్వం చాలా బాగుంది మీరొచ్చే లోపు మరిన్ని పద్యాలు  చదువుతా “ అంటూ పుస్తకం లో తలదూర్చేసా. యిప్పుడే వస్తానన్న సార్ మరో గంట దాకా కాని రాడని తెలుసు. పాఠం చెప్పడం ఆయనకెంత యిష్టమో అదీ ఆధునిక కవిత్వం బి ఏ బి యెస్సీ పిల్లలకు చెప్పడం యింకెంత యిష్టమో నాకు అంతకుముందే  యెరుక. సారు ఆధునిక కవిత్వం పాఠం చెప్తుంటే వినడం ఒక గొప్ప అపురూపమైన అనుభవం.

కాలం – 1983. స్థలం హైదరాబాదులో జాంబాగ్ కోఠిలో వివేక వర్ధిని సాయంకళాశాల.

దాదాపు గంటంబావు  తర్వాత హడావిడిగా తరగతి లోంచి బయటకు వస్తూ గడియారం చూసుకుని “యెనిమిదిన్నర అయిందే!  యివాళ్ళ ఫుల్ వర్క్ లోడ్.  సారీ నాన్నా లేట్ అయిపోయింది. యింక మనం బయలుదేరదాం పద” అంటూ బుజం మీద చెయ్యి వేసి బయటకు నడిపించుకుపోయారు. యింక అక్కడ్నుంచీ హరిద్వార్ హోటల్ దాకా నడక. నేను చదువుతున్న కవి కవిత్వం నుండి (అది సార్ అంతకు ముందు వారం ఇచ్చిన పుస్తకమే) మొదలు పెడితే ప్రపంచం మొత్తం చుట్టేసే వారు సారు. నిండా  పద్దెనిమిదేళ్ళు కూడా సరిగా నిండని నా బుజం మీద చనువుగా చేయి వేసి నాన్నా అని పిలుస్తూ,  తనతో గడిపిన ప్రతిక్షణమూ ప్రపంచ కవులనీ  కవిత్వాన్నీ పలవరిస్తూ విడమరిచి చెప్తూ మధ్య మధ్య లో, గొప్ప నవలల గురించీ, కథల గురించీ,  మంచి సినిమాల గురించీ, మంచి సంగీతం గురించీ ప్రస్తావిస్తూ మళ్ళీ కవిత్వలోకి దూకేవారు.  అప్పుడప్పుడే యీత నేర్చుకుంటున్న నాకు ఆ మహా సముద్రం లో అండగా చుక్కానిగా నిలబడిన సార్ యింకెవరో కాదు కె.శివా రెడ్డి గారు. వివేక వర్ధిని సాయంకళాశాల లో యింగ్లీషు అధ్యాపకునిగా పనిచేస్తూ తనకు దొరికిన ప్రతి క్షణాన్నీ కవిత్వం కోసమే, కవిత్వం తోనే, యిప్పటికీ,  గడపడాని కిష్టపడే మహా  కవి, గొప్ప మనిషీ.

అప్పుడప్పుడే పోతన మందార మకరంద మాధుర్యాలనుండీ,  బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకలనుండి బయటపడి  శ్రీ శ్రీ ని, దిగంబర కవులనీ, తిరగబడు కవులనీ , రాత్రి కవితా సంకలనాన్ని, వీ వీ చలినెగళ్ళు, జీవనాడులనీ ,  కె, శివారెడ్డి రక్తం సూర్యుడు,చర్య, నేత్రధనుస్సు, ఆసుపత్రి గీతాలని చదివిన గొప్ప విసురూ, ఆవేశమూ ఆకలిలతో,  సమాజం మీద వ్యవస్థ మీద ధిక్కార భావంతో  , ఉన్న పరిస్థితి ని మార్చడానికి కవిత్వం రాయాలని కంకణం కట్టుకున్న కౌమార ప్రాయమది. జే యన్  టీ యూ నాగార్జునసాగర్ యింజనీరింగ్ కళాశాల లో 1981 లో చేరిన నాకు, సిద్దిపేట నుండి వచ్చినా యేచ్ పీ యెస్ లో ఐదేండ్ల చదువు పుణ్యమా అని హైదరాబాద్ కొత్తేమీ కాదు. యేచ్ పీ యెస్ లో యెలీటిస్ట్ ఆధిపత్యమూ అణచివేతలకింద నలిగిపోయిన నాకు సిద్దిపేటలో సాహిత్య వాతావరణం కొత్త ఊపిరులనిచ్చింది.

అట్లా కె. శివారెడ్ది గారు పరిచయమయ్యారు. కొత్తగా రాస్తున్న వారికీ, యువ,  నవ కవులకూ సార్  సాన్నిహిత్యం   అపురూపమైందనీ , కవిత్వ, సాహిత్య, సంగీత, సినిమా రంగాలలో కొత్త ప్రపంచాలను పరిచయం చేస్తుందని సిద్దిపేటలో నందిని సిధారెడ్డి సారు, యెస్. ప్రవీణ్ చెపితే శివా రెడ్డి గారి తో పరిచయం చేసుకున్నాను. ఆ పరిచయం యింతింతై అన్నట్టుగా అతి కొద్ది కాలం లోనే చాలా గాఢమైన సాన్నిహిత్యంగా మారడానికి ముఖ్య కారణం సారే! అప్పటికే నాలుగు కవితా సంకలనాలు ప్రచురించి ప్రముఖ కవిగా చలామణీ అవుతున్నా,  అట్లాంటి యావే లేకుండా నాతో పాటు తనూ  18 యేండ్ల వాడై పోయి  బుజం మీద చేయి వేసి అత్యంత ఆప్యాయంగా,  ఆత్మీయంగా దగ్గరైన అత్యంత సన్నిహితులైన వారు శివారెడ్డి సార్. యేనాడూ తాను సీనియర్ కవినని కానీ (యిప్పటికీ కూడా) తనకు చాల తెలుసనీ తాను సాధించింది యెక్కువనీ అనుకోకుండా, నిర్లక్ష్యం గానీ , చిరాకు గానీ కోపం కానీ   దగ్గరకు రానీయకుండా యెంతో స్నేహంగా మసలుతారు. అరమరికల్లేకుండా మాట్లాడ్డం, హిప్పోక్రసీ, ద్వంద్వ విలువలూ, యేదో దాచుకుని మాట్లాడ్డం, రాజకీయంగా మాట్లాడ్డం, పొడిపొడిగా రెండు ముక్కలు కవిత్వం గురించి చెప్పేసి, ‘ ఇప్పుడు సమయం లేదు  తర్వాత కలవ’ మనడం లాంటి యేనాడూ చేయలేదు సారు. ఉన్నదంతా బాహాటంగా చెప్పేసెయ్యడం, యింకా నేర్చుకోవాలి, చదవాలి, ప్రపంచ కవిత్వం లో నిండా మునిగి తడిసిపోవాలి అన్న దాహం తో తపించిపోయే వారు శివారెడ్డి సారు.( యిప్పటికీ యిన్ని యేండ్ల తర్వా త యెప్పుడు కలిసినా యే కొత్త కవిత్వ పుస్తకాన్ని తెచ్చావని అడిగి  , తీసుకుపోయిన పుస్తకా న్ని అపురూపంగా ఆనందంతో మిలమిలలాడే కళ్ళతో అందుకుంటారు. ) అందువల్లే  ప్రతి సాయంత్రమూ కాలేజీ హాస్టల్ నుండి వీ వీ కాలేజి కి రావడం,సార్ తో క్లాసులయ్యాక అయితే హరిద్వార్ కో,  లేకపోతే  ఖైరతాబాద్ లో ద్వారకా కో వెళ్ళిపోయే వాణ్ణి.

siva1

శివారెడ్డి అంటే నిరంతర అధ్యయనమే!

అప్పుడు శివారెడ్డి గారితో మా సంభాషణలకు ప్రదానమైన అడ్డా ద్వారకా హోటల్. దాదాపు ప్రతి సాయంత్రమూ అక్కడ కవులూ, కవిత్వాభిమానులూ  గుమిగూడే వారు శివారెడ్డి  గారి కోసం. యెన్ని ముచ్చట్లు యెన్ని ముచ్చట్లు, ప్రపంచ కవిత్వ వీధుల్లో యెంత నిరంతర నిర్విరామ చంక్రమణం, మహాకవుల కవితా వాక్యాల చుట్టూ పరిభ్రమణం, సార్ తో గడిపిన ప్రతి క్షణమూ అమోఘమూ   అద్భుతమూ, అపురూపమున్నూ. కొన్ని సమయాల్లోనైనా కవిత్వం మాట్లాడక యింక మరే సంగతి మాట్లాడినా –  అది ప్రత్యక్ష పరోక్ష జీవితానుభవం కావచ్చు లేదా యింకేదైనా కావచ్చు –  అందులోనూ  కవిత్వానికి సంబంధించిన ముడిసరుకు తప్పనిసరిగా ఉండేది. తవ్వుకోవాలే కానీ కవిత్వ జల నిరంతరం ఊరే  గొప్ప చెలిమ శివారెడ్డి గారు. కవిత్వ దాహంతో ఉన్నవారందరికీ  అలవోకగా అమృతాన్ని పంచి ఇస్తారు.

సార్ దగ్గర సముద్రమంత గ్రంథాలయం. యింటి నిండా సందు లేకుండా పుస్తకాలు. ఆకలిగా పుస్తకాలను చూస్తుంటే,  తడుముతుంటే “ యిదిగో ఈ ఆఫ్రికన్ కవి కవిత్వం చదువు, యిదిగో ఈయన గ్రీకు దేశపు మహాకవి రిట్సాస్ ఇది తీసికెళ్ళి చదువు,  ఇదిగో ఇది నెరూడా పుస్తకం ఈయన బ్రేటన్ బ్రేటన్ బా దక్షిణాఫ్రికా కవి తీసికెళ్ళి   చదువు”  అంటూ యెంతమాత్రం సంకోచం లేకుండా, ప్రేమగా ఆప్యాయంగా బాగా ఆకలిగొన్న వాడికి అద్భుతమైన భోజనం  యెంతో ఆత్మీయంగా పెట్టినట్టుగా పుస్తకాలనిచ్చేవారు. అయితే జాగ్రత్తగా తీసుకుని రమ్మనే వారే తప్ప యేనాడూ “ యేదా పుస్తకం యేమైందీ”  అంటూ అడిగే వారు కాదు. సెంఘార్, చికాయా యూ టాంసీ, సిల్ చినీ కోకర్ , డేవిడ్ డయోప్ , రిట్సాస్  ఐమీ సెజేర్, సెజార్ వయేహో లాంటి ప్రపంచ మహాకవులెందరినో పరిచయం చేసారు. వాళ్ళలో అప్పటికే చాలా మందిని అనువాదం చేసి ఉన్నారు. శ్రీ శ్రీ తర్వాత, నిజానికి అంతకన్నా యెక్కువగా విస్తారంగా అనేక ప్రపంచ మహాకవులను తెలుగు లోకి అనువాదాలు చేసి పరిచయం చేసిన వారు శివారెడ్డి గారు.

ప్రపంచ వ్యాప్తంగా  మహాకవుల కవిత్వాన్ని యెందుకు చదవాలో కలిసిన ప్రతి సారీ  నొక్కి చెప్పే వారు. ‘యితర కవుల కవిత్వాన్ని చదవడం వల్ల మూడు గొప్ప ప్రయోజనాలున్నై’  అనే వారు… ఒకటి – ఆ కవి ఒక వస్తువుని యెట్లా  కవిత్వం చేసాడు, యెట్లా ఊహించాడు ,ఒక పద్యాన్ని యెట్ల్లా నిర్మించాడు, యేయే పదచిత్రాలని, యే యే ఉపమానాలని, ఉత్ప్రేక్షలని వాడాడు, యేట్లా పద్యం conceive చేసాడు అనేది తెలుస్తుంది, రెండు – యే యే వస్తువులని యెంచుకున్నాడు, తన అనుభవం లోకి వచ్చిన ఆ వస్తువుని, అనుభూతినీ , యే ప్రాపంచిక దృక్పథంతో,  యెట్లా తన పద్యంలో ప్రతిఫలించాడు అని తెలుస్తుంది,  మూడు – అనేకానేక కవుల తర్వాత రాస్తున్న మనం వారందరికంటే భిన్నంగా పద్యం యెట్లా రాయగలం? యింతకు ముందు యెవరూ చేయనట్లు  యెట్లా ఊహ చెయ్యగలం, వస్తువుని చూడగలం , కొత్తగా  పద్యం చెప్పగలం –  అనేది వాళ్ళందరినీ చదవడం వల్ల నేర్చుకొగలుగుతాం. యితర కవుల కవిత్వాన్ని చదవడం వల్ల మనం రాసే కవిత్వానికి కొత్త బాట యేర్పడుతుంది, మనకు కవులుగా కొత్త గొంతుక యేర్పడుతుంది. అట్లాంటి కొత్త గొంతుక, మనదైన ముద్ర, వ్యక్తిత్వం , మనదైన పద్యం రాయగలగాలంటే తప్పకుండా అందరి కవుల పద్యాలని చదవాలి వారి పోకడలని పరిశీలించి విశ్లేషించి మనం కొత్త పోకడలు పోవాలి అనే వారు.  దేని గురించైనా రాయి, ముందు కవిత్వం,  మంచి కవిత్వం రాయి,  మనదైన ప్రాపంచిక దృక్పథంతో (worldly outlook) ప్రతి వస్తువును మంచి  కవిత్వం చేయడం అన్నింటికన్నా ముఖ్యం అనేవారు. పీడిత ప్రజల పక్షం వహించే ప్రాపంచిక దృక్పథం లేక పోతే యెంత మంచి కవిత్వం రాసినా దాని వల్ల  ప్రయోజనముండదనీ, మంచి  కవిత్వం కానప్పుడు నువ్వెంత గొప్ప దృక్పథం తో వస్తువుని చెప్పినా  అది కవిత్వంగా నిలబడదనీ గుర్తుపెట్టుకొమ్మనే వారు.

అట్లానే ‘ప్రతీదీ కవిత్వానికి ఉపయోగపడేట్టుగా యెట్లా చూడాలి, ప్రతి క్షణమూ ప్రతి సంఘటనా  మనం కవిత్వం రాయడానికి ఉపయోగపడేలా యెట్లా చేసుకోవాలా అనే ఆలోచించాలి’   అని చెప్పేవారు. ఉదాహరణకు, ఒక మంచి సినిమా చూసినప్పడు మన స్పందన కవిత్వంగా యెట్లా మార్చుకోవాలో ఆలోచించమని చెప్పేవారు. అప్పటికే హైదరాబాదు లో మంచి సినిమాలని యెంపిక చేసి ప్రదర్శించే ఫిల్మ్ క్లబ్ ఒకటి నడుస్తూ ఉండేది. అక్కడా, మాక్స్ ముల్లర్ భవన్, అలైన్స్ ఫ్రాంసై  లో మంచి సినిమాలనెన్నో చూసే అవకాశం దొరికింది. ఒక సినిమాని యెట్లా ‘ కవి దృష్టి’ తో చూడాలి, దాన్ని కవితాత్మకంగా యెట్లా అనుభవించి పలవరించాలి అని శివారెడ్డి గారి దగ్గరే నేర్చుకున్నా నేను. అకిరా కురొసావా ‘దెర్సూ ఉజలా’ సినిమా చూసినంక శివారెడ్డి గారు రాసిన  ‘అడవులు భయపెడతాయి’ అనే కవిత ఒక సినిమా ని కవిత్వంలోయెట్లా ప్రతిబింబించవచ్చో అద్భుతంగా చూయిస్తుంది. సినిమా అనేక కళల సమ్మేళనం కాబట్టి. ఆయా కళల్లో ప్రతి దానిలోనూ కవిత్వం ప్రతిధ్వనించే అవకాశం ఉంది కాబట్టి (నటన కావచ్చు, చాయాగ్రహణం కావచ్చు, సంగీతం కావచ్చు, మాటలు కావచ్చు ) సినిమా ప్రతి క్షణమూ కవితాత్మకంగా ఉండాలి అనే వారు. అప్పుడే మళయాళ దర్శకుడు, గొప్ప సెల్ల్యులాయిడ్ కవీ  అరవిందన్ రెట్రాస్పెక్టివ్ ప్రదర్శిస్తే ‘ఒరిదతు’, ‘కాంచన సీత’,’ తంపు’,’వాస్తుహార’, ‘ఉత్తరాయణం’ లాంటి అద్భుత కావ్యాలాంటి సినిమాలు సారూ, ప్రకాషూ , నేనూ చూసి తడిసిపోయాం.  ఆ సినిమాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనేక కవితలకు ప్రేరణయ్యాయి కూడా. యూరుగ్వాయి   రాజకీయ ఖైదీలగురించి తీసిన ‘ఐస్ ఆఫ్ బర్డ్స్ ‘ అనే సినిమా చూసాక నేను రాసిన పద్యం విని శివారెడ్డి గారు నీళ్ళు నిండిన కళ్ళతో గాఢంగా కౌగలించుకున్నారు. ఒక మంచి పద్యం గానీ ఒక గొప్ప కవితా వాక్యం గానీ వింటే నిలువెల్లా పులకించి, పరవశించి పోయి కళ్ళనీళ్ళ పర్యంతమై కరిగిపోయే కవితామూర్తి శివారెడ్డి గారు.

1983-84 కాలంలో మా హాస్టల్ గన్ ఫౌండ్రీ లోని ఒక పాడుబడ్డ భవంతిలోకి మార్చారు. కింగ్  కోఠీ నుండి బషీర్ బాగ్ చౌరస్తాకి నడిచి వెళ్తుంటే మధ్యలో భారతీయ విద్యాభవన్ ని ఆనుకుని ఉండేదది. అప్పుడంతా కలినడకే – హైదరాబాద్ వీధి వీధినా కాలినడకతో  రాత్రింబవళ్ళు తిరిగి తిరిగి మహా నగరం మారుమూలలనీ, జీవితపు చీకటి కోణాలనీ , వెల్తురు  ఛాయల్నీ ప్రతి నెత్తురు బొట్టులో యింకించుకుని రంగరించుకున్నాం. మా సంచారానికి  శివారెడ్డి గారి కవిత్వ కరదీపిక తోడైంది. సారిచ్చిన కవిత్వం టార్చిలైటు తో నగరం మూల మూలలా శోధించాం జీవితానుభవ రహస్యాలకోసం , కవిత్వం ముడిసరుకు కోసం. అట్లే యేదైనా కవి కవిత్వం చదివినా ఒక సారి కాదు,  ఆ కవి మన ఆలోచనల్లో, చైతన్యం లో, చివరికి  నరనరాల్లోపూర్తిగా యింకే దాకా చదవమనే వారు. ఒక పద్యాన్ని చదివాలి. మళ్ళీ మళ్ళీ చదవాలి,  ప్రతి  కవితా పాదాన్నీ  చదివి మననం చేసుకోవాలి, ఆ కవిలో మనం పరకాయ ప్రవేశం చేయాలి అప్పుడే అనేకానేక కవుల కవిత్వ మెళకువలు మనకు అర్థమౌతాయ్. మన చైతన్యం లో భాగమై మనకి  కొత్తగా  చూడడం ఊహించడం నేర్పి, ఒక  కొత్త గొంతుకనిస్తాయి.  అందుకే యిప్పటికీ యే కొత్త ప్రపంచ కవి కవిత్వం కనబడినా ఆప్యాయంగా అక్కున చేర్చుకుని   తన స్వంతం చేసుకుంటారు. ఆ కవి కవిత్వాన్ని తనలో  భాగం  చేసుకుంటారు. తనదైన కొత్త గొంతుకని నిత్య నూతనంగా పలికిస్తారు.

యేది చూసినా దీన్ని కవిత్వమెట్లా చేయాలా అనే దృష్టి తోనే చూడాలి అని సార్ చెప్పిన పాఠాన్ని నరనరానా యింకించుకున్నాం. అప్పుడు పీ డీ యెస్ యూ లో చాలా చురుగ్గా పని చేస్తున్న రోజులు. అయితే కవిత్వం లేదా విద్యార్థి ఉద్యమం అన్నట్టు ప్రతి క్షణాన్ని గడిపేవాణ్ణి. నాకు తోడు,  కవిత్వం రాయకపోయినా ప్రకాషూ (ఒకటే కవిత రాసాడీయన – ‘Eyes of the Birds’ చూసి), కవిత్వం రాస్తూ సుధాకిరణ్ ఉండేవారు. మా హాస్టల్ లో పీ డీ యెస్ యూ ప్రభావం చాలా బలంగా ఉండేది. చాలా మంది విద్యార్థులు మా తోడుండే వారు. అవతలి  పక్షం లో యే బీ వీ పీ కూడా ఉండేది. అయితే పీ డీ యెస్ యూ లో ఉన్న విద్యార్థులు చాలా మంది పుస్తకాలకు దూరంగా మరీ ముఖ్యం కవిత్వానికి బహు దూరంగా ఉండే వారు. క్లాస్ టెక్స్ట్ బుక్స్ చదవడమే యెక్కువ యింక వేరే పుస్తకాలా అని పెదవ్విరిచే వారు. ప్రకాషూ నేనూ ఆదివారం రాగానే ఆబిడ్స్ వీధుల్లో ఆకలితో వీర విహారం చేసి కనీసం రెండు మూడు పుస్తకాలు కొనుక్కొస్తే తెగ ఆశ్చర్యపోయే వారంతా. చక్కగా ఉన్న కొద్ది పాకెట్ మనీ తో యేదో సినిమా చూడక వీళ్లకిదేమి పిచ్చి అని మమ్మల్ని చూసేవారు.

వీళ్ళతో యెట్లా అయినా పుస్తకాలు చదివించాలి కనీసం అటువైపు దృష్టి మళ్ళించాలి అనుకుని ఒక సారి శివారెడ్డి గారితో ప్రస్తావించి ‘సార్ మీరొకసారి మా హాస్టల్ కి వచ్చి మాట్లాడాలి – పుస్తకాలూ  సాహిత్యమూ యెందుకు చదవాలో మా వాళ్ళకి చెప్పాలి’ అని అన్నాను. ‘ ‘సరే అట్లాగే ఒక ఆదివారం సాయంత్రం వస్తాన’న్నారు. మా వాళ్లందరినీ ఒక రూం లో జమ చేసాము. సారు వచ్చారు. పరిచయాల తర్వాత దాదాపు గంటన్నర పైగా ఉపన్యాసం – నెమ్మది గా చిన్న నీటి ఊటలాగా మొదలై,  మెల్ల మెల్ల గా పుంజుకుంటూ,  ఒక మహా ప్రవాహమై, వుధృత జలపాతమై అందరినీ తడిపి ముద్ద చేసింది. ఆ పాడుబడ్డ హాస్టభవంతిలో రూం లకు పూర్తిగా గోడలు లేక దాదాపు అన్ని రూముల్లోకీ సార్ మార్దవ గంభీర స్వరంలో ఉపన్యాసం ప్రవహించి ఒక్కొక్కరే విద్యార్థులు రూం లోకి  రావడమూ, లోనా బయటా కిక్కిరిసి పోవడమూ జరిగింది.

ఉపన్యాసం అయిపోగానే ఒక మహా జలపాతం కింద నో ఒక వెచ్చని ఆత్మీయ వర్షం లోనో తడిసి ముద్దయినట్టు విద్యార్థులంతా తన్మయత్వంతో మమేకమయ్యారు. పుస్తకాలూ , సాహిత్యమంటే యేమిటి, వాటిల్లో యేముంటుంది, వాటిని యెందుకు చదవాలి, యెట్లా చదవాలి, మంచి సాహిత్యానికి చెడ్డసాహిత్యానికి తేడా యేమిటి, వ్యాపార సాహిత్య లక్షణాలేమిటి (యండమూరి తదితరులు వ్యాపార సాహిత్య రంగాన్ని  రాజ్యమేలుతున్న కాలమది) , మంచి సాహిత్యాన్ని చదవడం వల్ల మనకు యేమిటి ప్రయోజనం, అది మనల్ని యెట్లా ప్రభావితం చేస్తుంది, యెట్లా వికాసమిస్తుంది, మన జీవితాలని మార్చేశక్తి మంచి సాహిత్యానికీ కవిత్వానికీ యెట్లా ఉన్నది-  అని అనేక విషయాలని అత్యంత సులువుగా అర్థమయ్యే ప్రపంచసాహిత్యలోంచీ , జీవితానుభవాలనుంచీ ఉదాహరణలతో, దారాళంగా ఆకట్టుకునేలా అద్భుతంగా చెప్పారు. విద్యార్థులంతా ఆలోచనలు ఝుమ్మని  చుట్టుముడుతుంటే  ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయారు. అప్పట్నుండీ సార్ కి అభిమానులైపోయారు. మేము కొన్న పుస్తకాలకు ఆ రోజునుండీ డిమాండ్ పెరిగిపోయింది. ఒక చిన్న నోట్ బుక్ లో తీసుకున్న పుస్తం పేరూ తమ పేరూ రాయమని పెడితే అది ఒక నెల రోజుల లోపే నిండి పోయింది కూడా. యిద్దరు ముగ్గురు కవిత్వ రాసే ప్రయత్నాలు చేసారు కూడా. అదీ సార్ ఉపన్యాస శక్తి  ప్రభావం.

siva2

శివారెడ్డి గారిలో మరో గొప్ప లక్షణం కవిత్వాన్ని, మంచి కవిత్వాన్ని సర్వకాల సర్వావస్థలలోనూ ప్రేమించడం – ఇది అందరికీ సాధ్యమయే పని కాదు. జీవితంలో అనేకానేక సందర్భాలుంటై. కొన్ని దుఃఖ సందర్భాలు, చిరాకూ కోపాల తో కూడిన  సందర్భాలు, కష్టనష్టాల్లొ ఉన్నప్పుడూ ‘యిది కవిత్వానికి సమయం కాదనీ ’  ,’ ఇప్పుడు కవిత్వమేమి టీ వేళా పాళా లేకుండా’  అని యెందరో అనడం ప్రత్యక్షంగా  చూసాను నేను. కానీ ఒక్క శివారెడ్డి గారి విషయంలోనే యెప్పుడైనా, యెక్కడైనా యెట్లాంటి పరిస్థితుల్లోనైనా కవిత్వం గురించి సాహిత్యం గురించీ   నిరభ్యంతరంగా నిర్మొహమాటంగా మాట్లా డ వచ్చు, కవిత్వం వినిపించవచ్చు ‘యెట్లుంది సార్ యేమైనా సూచనలివ్వండి’ అని కూడా అడగవచ్చు. అదీ సార్ గొప్ప తనం.

ఓ సారి ఒక పద్యం రాసి దాన్ని యెట్లాగైనా సరే సార్ కి వినిపించాలని కాలేజీ కి వెళ్ళా. అప్పటికే యెనిమిది దాటటం వల్ల సార్ వెళ్ళి పోయారు. అక్కడ్నుంచి నడిచి హరిద్వార్ హోటల్ కి వెళితే అక్కడా లేరు. వనస్తలిపురం బస్సెక్కి సార్ ఇంటికెళ్ళే సరికి రాత్రి పదకొండు దాటింది. యేమనుకుంటారో అనే మొహమాటం లేకుండా తలుపు తడితే ఆంటీ తలుపు తీసి ఆశ్చర్య పోయి, ‘సారు బాగా అలసి పోయి పడుకున్నారు నాన్నారేప్పొద్దున మాట్లాడుదువు  కానీ’  అని ఈ రాత్రి పొద్దు పోయింది కదా ఇక్కడే పడుకో’ మంటూ హాలు లో నాకోసం జాగా చేస్తున్న సమయానికి సారు లేవనే లేచారు.  ‘యేమైంది స్వామీ యింత రాత్రి? ’ అంటూ హాలులోకి వచ్చారు. నేను వచ్చిన సంగతి విని కళ్ళనీళ్ళ పర్యంతమయ్యారు. ‘స్వామి కేదైనా పెట్టు తినడానికి’  అని నా పరిస్థితి నెరిగి ఆంటీ కి చెప్పారు. ముందు పద్యం వినిపించమని పద్యం విన్నాక ‘అద్భుతం స్వామీ’ అని కళ్ళ నిండా  నీటితో కౌగలించుకుని, నేను తినే దాకా ముచ్చట్లెన్నో చెప్పి తిన్నాక కూడా చాలా సేపు గడిపారు నాతో. అదీ సార్ కి కవిత్వం మీదా కవులమీదా ఉన్న అభిమానమూ, ప్రేమా వాత్సల్యమూ.  అట్లాగే యెప్పుడు కలిసినా ‘డబ్బులున్నాయా నాన్నా? పుస్తకాలవీ కొంటున్నావు కదా, ఇదిగో ఇవి ఉంచు’ అంటూ తన దగ్గర సరిపడా ఉన్నా లేకున్నా,తనకి సరిపోతాయా లేవా అనే ఆలోచన లేకుండా డబ్బులు తీసి జేబులో కుక్కే వారు. ‘వద్దు సార్ ‘ నా దగ్గర ఉన్నాయ’న్నా యెక్కడ నీ మొహం అంటూ బలవంతంగా ఇచ్చే వారు. తానిచ్చే డబ్బులు వృధా కావనే గొప్ప నమ్మకం సారుకు. డబ్బుని లెక్క చేయని ఆత్మవిశ్వాసమూ, చిత్తు కాగితాలుగా చూసి దాని మాలిన్యాన్నంటనివ్వని మహోన్నత మానవీయ లక్షణం. మాననీయ కవితా స్వభావం శివారెడ్డి గారిది.

అంతగా  కవిత్వానికి జీవితాన్ని అంకితం చేసారు కాబట్టే యింకెవ్వరికీ రానన్ని కష్టాలొచ్చినా , యెడతెగని దుఃఖ సందర్భాలెదురైనా,  అంతులేని శోక అగాధాలోకి నెట్టి వేయబడ్డా కవిత్వాన్నే నమ్ముకున్నారు, కవిత్వాన్నే  ప్రేమించారు, ఆరాధించారు, తానే కవిత్వం,కవిత్వమే తాను – సర్వస్వం కవిత్వమే అయ్యారు. కాలు విరిగి రెండు సంవత్సరాలు మంచం పాలయినా కించిత్తైనా చెదరని ఆత్మ విశ్వాసంతో, సడలని కవిత్వం మీద ప్రేమతో అధ్బుతమైన కవిత్వం ‘అంతర్జనం’ రాసారు. తాను అప్పటిదాకా రాసిన కవిత్వం కన్నా భిన్నంగా తనదైన కొత్త గొంతుకని పలికించారు. యెందరో మంది కవులకు కరదీపిక, గురువూ, సన్నిహితుడూ, ఆత్మీయుడూ అయ్యారు.  పదిహేను కవితా  సంకలనాలని ప్రచురించి,  యింకా నవనవోన్మేషమైన కవిత్వాన్ని సృష్టిస్తూ   నిరంతర కవితా వ్యవసాయం చేస్తున్న అలుపెరుగని రైతూ,  పసి పిల్లవాడూ శివారెడ్డి గారు. 72 వసంతాలు పూర్తి చేసుకున్న నవ యవ్వనుడు శివారెడ్డి సారు కు  హార్థిక శుభాకాంక్షలు.

*

మీ మాటలు

  1. buchireddy gangula says:

    అ రోజుల్లో —- Krishna శాస్త్రి గారు — దాశరథి గారు —–నేడు నిండు అయిన కవులు
    వర వర రావు గారు — శివా రెడ్డి గారు

    నిండు కుండ తొణకదు — వాళ్ళు అంతే

    అప్పుడు — యిప్పుడు — ఎప్పుడు — అదే ఆప్యాయత —అదే చూపు — అదే ప్రేమ -అదే చనువు —-
    గొప్ప కవులు — మారని తిరు

    యేమని చెప్పను యింకా —-

    స్వామి గారు — చక్కగా చెప్పారు — sir
    ——————————————————————————————-
    బుచ్చి రెడ్డి గంగుల

  2. Delhi Subrahmanyam says:

    ఎన్ని గొప్ప కొత్త విషయాలు తెలిపారు స్వామి గారూ. శివారెడ్డి గారిని డిల్లి లో కలసి మీరు రాసినంత దగ్గరగానే చర్చలో పాల్గొన్న అదృష్టం నాకూ దక్కింది. నేను రచయతను కాకపోయినా ఒక సాహిత్య అబ్గిమని గ వారి కవితలు చదివి , వారి తో చర్చలో ఎన్నో విషయాలు నేర్చుకున్న వాడిని. అభినందనలు స్వామి గారూ.

  3. sailajamithra says:

    మహా కవులు గా పిలవబడుతున్నా మానసిక పరిపూర్ణత లేని వారెందరో సాహితీ లోకం లో .. ఇలాంటి ఈ అసంపూర్ణ లోకానికి శివారెడ్డి గారు ఒక సంపూర్ణ అక్షరం . నేను మాట్లాడిన కొద్ది సమయం లో వీరు కవిత్వానికి వ్యక్తిత్వానికి చాల దగ్గరగా ఉన్నట్లు అనిపించారు . వీరి గురించి ఎన్నో నాకు తెలియని, ఎందరో తెలుసుకోవలసిన విషయాలను అందించిన నారాయణ స్వామి గారికి కృతజ్ఞతలు. కవి శివారెడ్డి గారికి నా జన్మదిన శుభాకాంక్షలు

  4. Narayanaswamy says:

    బుచ్చి రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం గారు, శైలజ మిత్ర గారు నచ్చినందుకు నెనర్లు – శివారెడ్డి గారి సాహచర్యం ఒక సముద్రం లాంటిది – అందులో నేను పైన పట్టిచ్చినవి ఒకటీ అరా కెరటాలె

  5. buchireddy gangula says:

    స్వామి గారు

    అన్నం ఉడికిందో లే ధో — చూడటాని కి — 2 మెతుకులు చూస్తే తెలిసిపోతుంది కదా సర్–
    అది మీకు తెలుసు —
    యీ రోజుల్లో 2 పుస్తకాలు అచ్చు వేసుకొని కొంచం రచయిత గా పేరు రాగానే —-ఎంత పోజు ?? ఎంత టెక్కు ??సామాన్య జనం తో మాట్లాడారు —వాళ్ళు చాల తెలివి అయిన
    వాళ్ళలాగా — బింకం // గర్వం —??? నోబెల్ ప్రైజ్ వచ్చి నట్లు ఫీల్ అవుతూ —- గుర్తింపు కోసం ఆరాటం — ఆర్బాటం చేసుకుంటూ — పేస్ బుక్ // ట్విట్టర్ ల లో రోజు కనిపిస్తూ — వినిపిస్తూ — నేటి రాజకీయ నేతల్లా — గ్రూప్లు లు // కూటమి లు ?? రాయడం ఒకటి ?? చేసేది –చేస్తున్నది వేరే తిరు — the.buck.starts.from.me.. అని మ ర్చి పోతూ —-
    సాహితి అకాడమి నుండి అవార్డ్స్ కోసం —పద్మశ్రీ — బిరుదుల కోసం — నేతల్లా
    రాజకీయాలు చేస్తూ —-
    అందుకే వాళ్ళ ను నిండు అయిన కవులు అని రాశాను
    priniciples..vision..honesty.. leadership.skills. commitment.. ఉన్న గొప్ప కవులు
    వరవర రావు గారు — శివారెడ్డి గారు
    వర వర రావు గారు నా ఫ్రెండ్ అని చెప్పు కుంటూ గర్వపడుతాను
    నా జిల్లా లో పుట్టిన విప్లవ నాయకుడు
    ——————————————————
    బుచ్చి రెడ్డి గంగుల

  6. తానే కవిత్వం,కవిత్వమే తాను – సర్వస్వం కవిత్వమే అయ్యారు. ఈ వాక్యమొక్కటి చాలు గురువు గారిని చూపడానికి. తనతో ఏ కొద్ది పరిచయమున్న వారికైనా మరిచిపోలేని అనుభూతిని ఇవ్వగలరు తన మాటల బలిమితో ప్రేమతో. మీ అనుభవం మాతో పంచుకోవడం కవిత్వం గురించి గురువు గారి మాటలను చెప్పడం ఓ పాఠంలా సాగి మంచి పరిచయం చేసారు. గురువు గారి జన్మదినం కానుక గొప్పగా వుంది సార్..

  7. balasudhakarmouli says:

    జీవితాన్ని కవిత్వం చేసుకోవటానికి ఇది వొక్కటి చాలు…

  8. prasadamurty says:

    శివారెడ్డి గారి గురించి ఎవరు రాసినా ఆ అక్షరాల్లో నేను నన్ను కూడా చూసుకోడానికి ప్రయత్నిస్తాను. ఆయన తన తర్వాతి తరం కవులందరిలో అంతగా ఒక విడదీయరాని భాగమైపోయాడు. స్వామీ నువ్వు రాసింది చదువుతూ వుంటే చాలా సార్లు కన్నీళ్ళు వచ్చాయి. గువురుగారికి ఇంతకంటె గొప్ప బహుమతి ఏముంది?

  9. Narayanaswamy says:

    డియర్ వర్మా, సుధాకర్,ప్రసాదమూర్తి అన్నా మీతో పాటూ నేనూ శివారెడ్డి గారి సాన్నిహిత్యం లో పెరిగినవాణ్ణే – నా జ్ఞాపకాల కలబోత ఇది – నచ్చినందుకు నెనర్లు

  10. అంతే అంతే . ఈ పెద్దోళ్ళు అంతే . ఆత్మీయమైన స్పర్శ ,కంటి చివరి బాష్పాలు ఇంత కన్నా వాళ్ళ గొప్పదనాన్ని చెప్పటానికి ఏమి కావాలి . చక్కగా వ్రాసారు . శివారెడ్డి గారు ఇంకెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలి అని ఆకాంక్షిస్తున్నాను .

  11. g.venkata krishna says:

    స్వామి గారూ చాలా బాగా రాసారు . గొప్ప అనుభూతి నిండిన మీ అనుభవాలు , నిజానికి ఎన్తమన్దివో…ఇది శివారెడ్డి సార్ అభిమానులకు కానుక …..థాంక్స్ .

  12. Narayanaswamy says:

    శశికళ గారూ వెంకట కృష్ణ గారూ – నచ్చినందుకు నెనర్లు

  13. Narayanaswamy says:

    శశికళ గారూ వెంకట కృష్ణ గారూ – నచ్చినందుకు చాలా చాలా సంతోషం

మీ మాటలు

*