నదిలో వొదిలిన పాదం..

 

అఫ్సర్ 

 

1

యింకేమీ చెప్పలేను ఆట్టే-

యెన్ని సార్లయినా నది చుట్టూ తిరుగుతాను.

అదే ఆకాశాన్నీ, అదే నీటినీ,

నడుమ యెక్కడో మెరిసే తడి నేలనీ

మళ్ళీ మళ్ళీ కొన్ని మెటఫర్లలోనో ప్రతీకల్లోనో దాచేసుకుంటాను,

మొత్తంగా నదిని నాదైన అనుభవంగా మార్చుకునే మాయా దర్పణమేదీ దొరక్క-

 

2

చాలా వాట్ని విదిలించుకొని

బహుశా నన్ను నేను కూడా వదిలించుకొని

నది భుజమ్మీద చేతులేస్తూ

యెన్ని వందల అడుగులైనా నడిచే వెళ్ళిపోతాను,

ప్రతి అడుగులో నది నన్నేమేం అడుగుతూ వచ్చిందో

వాటికి కొన్ని సమాధానాలు గాల్లో రాస్తూ వెళ్ళిపోతాను.

అన్ని సమాధానాలూ నీలోనే వున్నాయి కదా,

ఎందుకలా దిక్కుల్ని తడుముకుంటూ వుంటావని అడుగుతూనే వుంటుంది  నది,

విడిపోయే అడుగు దగ్గిర కాసేపు నిలబడి వెనక్కి చూపిస్తూ.

 

ఆ సమాధానాలన్నీ మళ్ళీ నీలోనే రాలిపోయాయని అంటాను నిస్సహాయంగా-

 

3

అప్పటిదాకా లేని వొంటరి తనమేదో

తను వెళ్ళిపోయాకే నన్ను చుట్టేస్తుంది,

వెళ్ళిపోయిన తన రెండు చేతుల మధ్యనే యింకా నేను వున్నానని తనకూ తెలుసు.

 

అప్పటిదాకా నేను విదిలించుకొని వచ్చేసిన

అన్ని బెంగలూ, అన్ని చీకట్లూ మళ్ళీ నన్ను అలుముకుంటాయి,

యింకా మిగిలిపోయిన ఆ సాయంత్రపు చీకట్లోకి జారిపోతాను,

యింక ఈ రాత్రిని యెట్లా గట్టెక్కాలా అని లోపలా బయటా మసకబారుతుంది లోకమంతా.

 

4

అప్పుడొక్క అరక్షణం వెనక్కి తిరిగి

నన్ను వదిలి వెళ్ళిన నదిని

తడిసిన కళ్ళతో చూస్తాను,

“అంతా బాగుంది కానీ,

నీలోకి నన్ను వొంపుకోవడం యెలానో నీకు యింకా తెలియలేదు.

నీలోపల తడి వున్నంత మేరా నేనే వున్నాను, వొక్క సారి తడిమి చూసుకో.”

అంటుంది నది.

 

5

బహుశా,

నాలోకి ప్రవహించిన తన అడుగులు కనిపించకే అనుకుంటా,

మళ్ళీ మళ్ళీ నది దగ్గిరకి వస్తాను,

అలా వచ్చిన ప్రతి సారీ యింకొన్ని నీటి దీపాలు వొంట్లో

వెలిగించుకొని వెళ్ళిపోతాను,

నాలోపలి చీకటి వొడ్డు మీదికి.

*

Painting: Cartoonist Raju

మీ మాటలు

  1. తిలక్ బొమ్మరాజు says:

    కళ్ళల్లో వత్తులేసుకుని చదవడం అలవాటయిపోయింది మీ కవిత్వాన్ని.మీరు వాడే మెటాఫర్ అంటూ యేమి వుండదు.మొత్తం కవితే వో నిండు ప్రతీకలా కనిపిస్తుంది.మీలోని తడి నది కళ్ళలోనూ కనిపిస్తోంది.యెప్పుడు వేదనను యింత గొప్పగా యెలా రాస్తారో గాని మీ కవిత్వం కదిలించేస్తుంది చదివిన ప్రతిసారి.
    థాంక్స్ ఫర్ ది గ్రేట్ పోయెమ్ అఫ్సర్ గారు.

    • తిలక్, “మొత్తం కవితే వో నిండు ప్రతీకలా ” అనడం బాగుంది. అది నా లక్ష్యం కవిత్వంలో…ఇంకా అందుకోవాల్సిన లక్ష్యం!

  2. అదే ఆకాశాన్నీ, అదే నీటినీ,
    నడుమ యెక్కడో మెరిసే తడి నేలనీ
    మళ్ళీ మళ్ళీ కొన్ని మెటఫర్లలోనో ప్రతీకల్లోనో దాచేసుకుంటాను,
    మొత్తంగా నదిని నాదైన అనుభవంగా మార్చుకునే మాయా దర్పణమేదీ దొరక్క-

    తరచూ నేను మీ మాంత్రిక పదజాలం లో కరిగి ప్రవహించిన నదినై పోతుంటాను. థాంక్స్ ఫర్ ది యునీక్ పోయెమ్.

    • నాగరాజు గారు, “మాంత్రిక పదజాలం ” నా దృష్టిలో కవిత వొక miracle! దానికి మాంత్రిక పదజాలమే కావాలి మరి..

  3. రాజు గారి ఆర్ట్ కూడా అద్భుతం గా ఉంది. అభినందనలు.

  4. N Venugopal says:

    అఫ్సర్

    ఈ వేదనామయ సజలనయనాల అశ్రుసిక్త కవిత్వం ఎడబాటుకు గురైన ఒంటరి మనిషిదా, నలుదిక్కులా కమ్ముకుంటున్న మానవసంబంధాల శైథిల్యానిదా, యుగయుగాలుగా కన్నీరు కారుస్తున్న నదిదా, నదిని కోల్పోయిన ప్రకృతిదా….. నీ కవిత్వం అద్భుతమని కొత్తగా చెప్పనక్కరలేదు గాని, ఈ కవితలో వేదన, విచికిత్స, ఊహ, ప్రతీక పొరలుపొరలుగా విచ్చుకుంటున్నాయి. ఉహు, ఆరని దుఃఖంలా చెంపల మీద జారుతున్నాయి.

    • వేణు, ఈ కవిత అంతస్సూత్రం నీకు తెలిసింది. “వేదన, విచికిత్స, ఊహ, ప్రతీక ” మూడింటి synthesis.

  5. sreelatha says:

    నీ లోపల తడి ఉన్నంత మేరా నేనే ఉన్నాను. తడిమి చూసుకో కావాలంటే. ఎంత ఆద్రత అఫ్సర్ గారూ మీ కవిత్వంలో.. ఆ తడి లోలోపల ఉన్నన్నాళ్ళూ కవిత నదిలా జీవన వాహినియై పారుతూనే ఉంటుంది. చాల బావుంది మీ కవిత..

  6. సాయంత్రాలు నది ఒడ్డున నడుస్తూ నడుస్తూ, నదితో ఏర్పరచుకున్న గొప్ప స్నేహ బంధం సుస్పష్టంగా హాయిగా వుంది సర్ !! “మళ్ళీ మళ్ళీ నది దగ్గిరకి వస్తాను,అలా వచ్చిన ప్రతి సారీ యింకొన్ని నీటి దీపాలు వొంట్లో వెలిగించుకొని వెళ్ళిపోతాను,నాలోపలి చీకటి వొడ్డు మీదికి. ” – మళ్ళీ మళ్ళీ మీ కవితల దగ్గరకి వచ్చి , కొన్ని దీపాలను వెలిగించుకొని వెళ్తున్నాం సర్ !! Thank u for the beautiful poem .

    • రేఖ గారూ, మీ వ్యాఖ్యలు ఎప్పుడూ చాలా ప్రతిఫలనాత్మకంగా వుంటాయి. ధైర్యాన్నిస్తాయి.

  7. రెడ్డి రామకృష్ణ says:

    బావుంది సార్, మంచి పోయమ్ .ముఖ్యంగా చివరిపేరా చాలా బాగుంది.

  8. vasavi pydi says:

    నది చుట్టూ కవి అడుగులు ఆ జాడల అన్వేషణ లో నెమ్మదిగా జాలువారుతున్న కవిత చాల బాగుంది

  9. నదిలో మనుషులు బలహీనతలు పోసుకున్నాక .. నేనిలా వ్యధ చెందాను .. కలతపడకు ..కలత పడకు
    సాగరుడా ..!
    కల్లోలపడకు .. కల్లోలపడకు
    సోదరుడా ..!!
    ఉద్రుతితో .. ఉరవడిలో
    నీదాకా రాలేదు ఈ మధ్య
    కొన్నాళ్ళు గోదావరి .
    మా ప్రభుత .. మా జనత
    వూళ్ళ న్ని ఖాళీ చేసి
    ఊరేగుతూ .. వచ్చారు గోదావరి దరికి
    ఆదరువు లేకనో .. ఏ దారులు దొరకకనో
    దారులన్నీ గోదారికి దగ్గరయ్యా యి
    పుణ్యాలకు కొందరు పాపాలతో కొందరు
    మునకలేసి మురిసినారు
    గోదావరిని ఆపినారు
    కలత పడకు .. కల్లోలపడకు
    సాగరుడా ..!
    ఉద్రుతితో .. ఉరవడిలో
    నీదాకా రాలేదు ఈ మధ్య
    కొన్నాళ్ళు గోదావరి .
    కాసులు కేసులతో కొందరు
    నిద్రలేని రాత్రులతో కొందరు
    వాచాలత వచనాలే
    ప్రవచనాలుగా వల్లించి
    సామాన్యుల సంగతులకు
    గతులను జోడించి
    ఊగించి .. సాగించి . శాసిస్తూ
    శాస్త్రాలతో కొందరు
    వార్తల వర్తకాల నర్తనాలతో
    మేలుకొని కొందరు
    మునకలేసి మురిపింప చేసినారు
    నీ దాకా రాకుండా గోదావరిని ఆపినారు
    కలత పడకు .. కల్లోలపడకు
    సాగరుడా ..!
    ఉద్రుతితో .. ఉరవడిలో
    నీదాకా రాలేదు ఈ మధ్య
    కొన్నాళ్ళు గోదావరి .
    కష్టాలు నష్టాలు తొలగాలని కొందరు
    రాష్ట్రాలకు రచ్చలు రావాలని కొందరు
    వస్తే గిస్తే .. తమకేదో లాభిస్తుందని కొందరు
    పార్టీలు మునగాలని కొందరు
    పార్టీతో తెగతెంపులు కావాలని కొందరు
    తుంపుల ముంపులతో
    కొంపలు కూల్చాలని కొందరు
    మునకలేసి మురిసినారు
    గోదావరిని ఆపినారు
    కలత పడకు .. కల్లోలపడకు
    సాగరుడా ..!
    ఉద్రుతితో .. ఉరవడిలో
    నీదాకా రాలేదు ఈ మధ్య
    కొన్నాళ్ళు గోదావరి .
    పంటలు పండాలని అప్పులు తీరాలని
    కొడుకుకి వుద్యోగం రావాలని
    కూతురికి పెళ్లి కావాలని
    రోడ్లో అంగడి .. చేలో గొంగడి
    రోట్లో పచ్చడి.. నోట్లో ముద్ద
    ఇంట్లో గొడ్డు గోదా .. చల్లగా ఉంటె చాలని
    దూర భారాలు గడిచి గోదావరి ఒడ్డుకు చేరి
    మునకలేసి మొక్కినారు ..
    పితృదేవుల ఋణం కొంత తీర్చినారు
    పామరులు ఎందరో…
    పుష్కరము గడిచింది.. హడావిడి ముగిసింది..
    పల్లకీలు బోయీలు… బోనాల వైపు మళ్ళినాయి
    కొన్ని గాయాలతో రోడ్లన్నీ ఎరుపు చేసి
    కొన్ని ప్రాణాలతో గోదారమ్మకు దిష్టి తీసి
    సాగానంపాము సాగరుడా
    అదిగో చూడు !! అన్నిటిని కన్నీటిని
    మోసుకొని మళ్ళి నీ చెంతకే వస్తోంది
    గోదావరి
    కలత పడకు .. కల్లోలపడకు
    సాగరుడా ..!
    ఉద్రుతితో .. ఉరవడిలో
    నీదాకా రాలేదు ఈ మధ్య
    కొన్నాళ్ళు గోదావరి .
    గమనిక:
    నిజానికి కాటన్ దొర ఒక్కడే
    గోదావరిని ఆపినాడు ఆనకట్ట కట్టినాడు
    మా కన్నీళ్లను తుడిచినాడు… ఈ
    సుధీర్హ వ్యధకు మన్నించండి

  10. లిపిజ్వలన says:

    ఇ౦కేమీ చెప్పలేను ఆట్టే – చాలానే ఉన్నాయి కాని చెప్పాలనిలేదు ,చెప్పే స్థితిలో లేను,ఇప్పటికి చెప్పి౦దే ఎక్కువ ఎందుకని చెప్పలేను .ఎన్ని సార్లయినా నది చుట్టూ తిరుగుతాను, ఇప్పటికి చాలాసార్లు తిరిగాను ఇప్పుడు తిరుగుతున్నాను ఇకపైనా తిరుగుతాను అదే ఆకాశం అదే నీరు ఎక్కడో తడినేల నాకు మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగా అనిపిస్తాయి అందుకే మల్లీమల్లీ ప్రతీకలలో రూపకాల్లో దాచుకు౦టాను. అసామాన్య విషయాలు సామాన్య౦గా చెప్పుకొచ్చి ఒక్క జవాబు నదిని నాదైన అనుభవంగా మార్చుకునే మాయాదర్పనమేదీ దొరక్క మళ్ళీ మళ్ళీ కొత్తగా ఆవిష్కరిస్తూనే ఉ౦టాను. అవును నది జీవితానికి ప్రతీకేగా …..
    విదిలిలి౦చుకునే మాటే చెప్తు౦ది ఎంత అయిష్టతో నన్ను నేను కూడా వదిలి౦చుకుని అస్తిత్వాన్నో ఇష్టాన్నో త్యాగం చేసి మైమరచి నదితో పాటు నడిచి వెల్లిపోదాం ఒక్క కవికే సాధ్యం కదా? నిజమే సమాధానాలు లోనే ఉన్నాయి వెతుక్కోడం మాత్రం చుట్టూ దిక్కుల్లోనా ? విడిపోవడం ఎక్కడ ఎవరితో ఎవరితో వారా? ఒక భావనతో అస్తిత్వమా ? సమాధానాలు నదిలో రాలిపోడం లేదూ లోలోన రాలిపోడం ……….
    నదిరె౦డు చేతియా మధ్య ఉ౦దగానె చుట్టేసిన ఒ౦తరి తనం దా౦తో పాటు బె౦గలో చీకట్లూ చీకట్లోకి జారి మసకబారిన లోకాన రాత్రిని గట్టెక్కే ఊహ అద్భుతం
    వెనక్కుతిరిగి తడిసిన నదిని చోదత౦లో ఒక బె౦గ నిజమే నదిని ఒ౦పుకోదమ్ తెలీకే అసలు చిక్కంతా తడి ఉన్నంత మేరా ఉన్నది నదేగా .. అది నది చెప్తేనే తెలుస్తు౦దిగాని తెలీదు కదా
    అవును లోలోన నదిని తెలుసుకోలేకే మళ్ళీ మళ్ళీ నది వద్దకు వెళ్ళడం నీటి దీపాలు వెలిగి౦చుకు లోపలి చీకటి ఒడ్డుకి వెళ్ళడం బావుంది గొప్ప భావన

  11. అప్పుడొక్క అరక్షణం వెనక్కి తిరిగి

    నన్ను వదిలి వెళ్ళిన నదిని

    తడిసిన కళ్ళతో చూస్తాను,

    “అంతా బాగుంది కానీ,

    నీలోకి నన్ను వొంపుకోవడం యెలానో నీకు యింకా తెలియలేదు.

    నీలోపల తడి వున్నంత మేరా నేనే వున్నాను, వొక్క సారి తడిమి చూసుకో.”

    అంటుంది నది.

    ———————-

    ఎంత గొప్పగా చెపారు అఫ్సర్ గారూ! ఈ కవిత చదువుతూంటే నిజంగా పులకలు పుట్టాయి!

  12. balasudhakarmouli says:

    ప్రవాహం ! ముగింపు వాక్యం అద్భుతం. అసలు దానికోసమే నా ఎదురుచూపు.. !

  13. Mythili Abbaraju says:

    Monet దో Pissarro దో నది బొమ్మ చూస్తున్నట్లుంది…నిజానికి మీ కవితలన్నీ నా వరకు impressionistic bliss !!!!

  14. విలాసాగరం రవీందర says:

    నీలోపల తడి వున్నంత మేరా నేనే వున్నాను, వొక్క సారి తడిమి చూసుకో.”
    అంటుంది నది.
    ——————

    చాలా బాగుంది కవిత. అఫ్సర్ గారు

  15. సాయి పద్మ says:

    కొన్ని నీటి దీపాలు వొంట్లో .. మంచి కవిత
    నదితో అనుబంధం ఈస్తటిక్ గా
    వొక యాబ్శ్రాక్ట్ పెయింటింగ్ లా బొమ్మ కట్టేరు ..!

  16. అఫ్సర్ కవిత్వం చదవడానికి ముందు కొన్ని తయారీలు చేసుకోవాలి ,మనసులో ఉన్న బాధలూ ,చీకట్లూ ఉండ చుట్టి విసిరేయాలి ,రైలు నది మీద వెళుతూ ఉంటే అర్ధ రూపాయి నాణాలు నది లోకి విసిరేసినట్టు , ఖాళీ చేసుకోవాలి , ఆ జాగా లోకి ఓ కవిత మెల్లగా ,నింపాదిగా నది లా ప్రవహించి ,ఆ ఖాళీ ని నింపుతుందని నిక్కచ్చిగా తెలుసు మరి మనకి
    .” అంతా బాగుంది కానీ,
    నీలోకి నన్ను వొంపుకోవడం యెలానో నీకు యింకా తెలియలేదు.
    నీలోపల తడి వున్నంత మేరా నేనే వున్నాను, వొక్క సారి తడిమి చూసుకో.”
    అంటుంది నది.
    అంటారు అఫ్సర్ ..మనం మళ్ళీ నదిలా ప్రవహించవచ్చు ,కవిత్వం లాగానూ ప్రావహించవచ్చు ..ఇంక మన ఇష్టమే
    ప్రతి కవిత్వాన్ని ఒక అనుభూతి గా ఎలా మారుస్తారో , ఆ మంత్ర దండం పేరు ఏమిటో ? ఆ జీవిత స్పర్శ ఏ చెలిమి పంచిందో ?
    ఏమో ? మనకి మటుకు అఫ్సర్ యోగం ..కలుగుతుంది .
    వసంత లక్ష్మి

  17. akella ravi prakash says:

    Baavundi
    Kaani ekkado nee paata vakyalni
    Kavitwanni repeat chesinatlu anipinchindi

    • రవి, పునరుక్తి నిజమే కావచ్చు, నది గురించి చాలా రాసేశాను ఈ ముప్ఫయ్యేళ్లుగా..నీకు తెలుసు.

  18. నది ఒడ్డున చెలమ తీసి నీళ్ళు తాగినంత తియ్యగా, ఎండిన నదిని చూసినంత దుక్ఖంగా అనిపించింది. థ్యాంక్స్.

  19. rajani patibandla says:

    నదిని అనుభవం గా మార్చుకునే మాయా దర్పణం దొరకలేదంటూనే మాలో అక్షరాల తడితో దీపాలు వెలిగించి సముద్రమంత అనుభూతిని పొంగించిన కవి మాంత్రికుడా……..అభినందనలు

  20. Jayashree Naidu says:

    ప్రకృతిలోని అంశాలతో మమేకం కావడం ఎంత హాయో మీ కవితలోని ప్రతి పదంలోని ఆర్ద్రత చెపుతోంది.
    హాయైన భావంలోంచి ఆర్ద్రత లోకి ప్రవహిస్తూ ఆత్మావలోకన సంభాషణగా మాస్టర్లీ గా వుందీ కవిత అఫ్సర్ జి

    • ప్రకృతి నాకు ఎప్పుడూ ఆత్మీయమే…ఆ మాటకొస్తే అక్కడే నేను నేనుగా ఉంటానేమో…జయా!

  21. పిన్నమనేని మృత్యుంజయరావు says:

    నది భుజమ్మీద చేతులేస్తూ … ఈ మూడు పదాలూ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి అఫ్సర్ గారూ!

  22. ప్రవాహ ఉరవడిలో కొట్టుకుపోతూ కాసిన్ని నీటి దీపాలను దోసిళ్ళలో పోడువుకున్నధన్యవాదాలు సర్

  23. raamaa chandramouli says:

    అఫ్సర్..బాగుందయ్యా.

    – మౌళి

  24. నిషిగంధ says:

    ఇంక ఆశ్చర్యపోయే ఓపిక కూడా లేదు అఫ్సర్ జీ, ఇట్లెట్లా మీకు అతి మామూలు పదాలతో సముద్రాన్ని మించిన లోతైన భావాలు కూడగట్టడం వచ్చిందో అని!
    నేనెప్పుడు మీ కవితల్లో సమీరాలు, హేమంతాలు, ప్రాంగణాలూ అనే భాషని చూడను. నడవడం, చూడటం, కదలడం అంటూనే చెప్పలేనంతగా మనసుని తడి చేశేస్తారు!!

    నదిని మీరు మీలోకి ఒంపుకోలేకపోయారు కానీ మీ కవిత మాతం మమ్మల్ని ఆసాంతం ఒంపేసుకుందండీ!!

    • నిషి, వొక్కో సారి ఎంత ధైర్యంగా వుంటుందో కొందరి గొంతు వింటే…ఆ వాక్యాల్లోంచి వింటూ వుంటాను. మీ మాటలు నాక్కొంచెం నమ్మకమిస్తున్నాయి.

  25. Kuppili Padma says:

    అఫ్సర్, అన్నివున్నా సమూహంలోనూ వెంటాడే వొంటరితనం స్థానంలో భర్తీ కావససిన దాని కోసం ‘మాయా దర్పణం’ చూపిస్తుందేమోనని వెతుకుతూనే వుండటం యీ కాలపు వేదన …మనందరి వేదన… నువ్వు యిలా యింత అద్భుతంగా వ్యక్తపరుస్తు వెతుకుతుంటే కవిత్వమే ఆ మాయా దర్పణంని దాచేస్తుంది కనిపించకుండా… కనిపిస్తే నువ్వు కవిత్వం రాయవని …

    • పద్మా, “మాయా దర్పణంని దాచేస్తుంది కనిపించకుండా… కనిపిస్తే నువ్వు కవిత్వం రాయవని …” చాలా బాగుంది ఈ ఫీలింగ్!

  26. msk krishnajyothi says:

    నది చల్లగా వుంది-లోతుగా కూడా అనిపిస్తోంది-వెన్నులో ఒణుకు. నదిలో నువ్వు వదిలిన కవిత పాదాలు ఈదుతూ రంగు రంగుల చేప పిల్లల్లా మెరుస్తున్నాయి. నాకు లాగ వాటికి చలిని గురించి, లోతుని గురించి భయం లేనట్టుంది. బొత్తిగా మారుమూల పిల్ల కాలవ ఒడ్డున తిరిగే నేను-సముద్రమంత జ్ఞానంతో అమేజాన్ ల ఒడ్డున మీరు-భలే!

    • భలే వారే…అందరమూ పిల్లకాల్వల వొడ్డున వున్న వాళ్ళమే! సముద్రం దరిదాపుల్లో కూడా లేదు నాకు…

  27. కవిత చాలా బాగుంది సర్

Leave a Reply to అఫ్సర్ Cancel reply

*