మదాలస

 

శ్రీధరుడు:  కొత్త విటుడు

మదాలస: ఒక వేశ్య

 

శ్రీధ:    మదాలసా, మనకాపక్క ఇంట్లో మంగళవాద్యాలు, ఈపక్క ఇంట్లో శోకాలూ, శాపనార్ధాలూ వినిపిస్తున్నాయి. ఏమిటి సంగతి?

మదా: ముందు ఏ యింటి ముచ్చట చెప్పమంటారు?

శ్రీధ:    చెడ్డ కబురు ముందు చెప్పు. తర్వాత మంగళకరమైన విషయం మరింత శోభిస్తుంది.

మదా: ఐతే వినండి. మనకాపక్క ఇంట్లో ఉండే కామసాని వొట్టి మోసగత్తె, ఆశబోతూను. దాని కూతురు పుష్పసాని చక్కని చుక్క. పుష్పసానిని ఉంచిన విటుడు దానినొదిలి ఒక్క రాత్రి కూడా ఉండలేడు.

శ్రీధ:    నిన్నొదిలి నేనుండలేనట్లు.

మదా: మన్మథుడి దయ ఎప్పటికీ అట్లాగే ఉండాలి. సరే, కథలోకి వస్తే, రాత్రి ఒక తమిళ బ్రాహ్మడు సుఖం కోరి కామసాని ఇంటి తలుపు తట్టాడట. అతడు బాగా ధనవంతుడట. వేశ్య చక్కని దైతే కోరినంత రోవట్టు (శుల్కం) చెల్లిస్తానన్నాడట. కామసానికి ఆశ పుట్టింది. పుష్పసానిని ఎరగా చూపి అతని దగ్గర బాగా ధనం గుంజిందట. తీరా పక్కలోకి పంపాల్సి వచ్చేసరికి గదిలో దీపం లేకుండా చేసి ఇంట్లోని పనిమనిషిని అతని శయ్యకు తార్చిందట.

శ్రీధ:    ఎంత మోసం?

మదా: ఔను! పొద్దున్నే జరిగిన మోసాన్ని గ్రహించి ఆ పరదేశి తలవరులకు ఫిర్యాదు చేశాడట. వాళ్ళు కామసానిని పిలిపిస్తే వెళ్ళి నానా రభసా చేసిందట. నా కూతురు సాక్షాత్తూ ప్రతాపరుద్ర మహారాజు వచ్చినా లక్ష్యం చెయ్యదు, ఈ తమిళ బ్రాహ్మడికా కొంగు పరిచేది అని వీరంగం వేసిందట. ఏం చెయ్యాలో తెలియక వాళ్ళు తలలు పట్టుకు కూర్చుంటే ఆ సమయానికి అక్కడే ఉన్న గోవింద మంచనశర్మ గారు తీర్పు చేశారట.

శ్రీధ:    ఆయనెవరు?

మదా: ఆయన కాసల్నాటి శాఖీయులు. పెద్దలు సంపాదించి ఇచ్చిన ఆస్తిని వేశ్యావాటికలో ధార బోస్తున్న మహానుభావులు. జారధర్మములు చక్కగా అనుష్టించిన విట శ్రేష్ఠుడు.

శ్రీధ:    ఓహో…. ఏమి తీర్పు చేశారాయన?

మదా: వేశ్యల తల్లులు చేసే ఇలాంటి నేరాలకు నాలుగు రకాల శిక్షలు చెప్పారాయన. ముక్కు దూలం దాకా తెగ్గోయడమొకటి, పళ్ళు మొత్తం రాలగొట్టడమొకటి, గూబలదాకా చెవులు రెండూ కోయడమొకటి, నున్నగా తల గొరిగించడమొకటి.

శ్రీధ:    ఈ ముసల్దానికి ఏమి శిక్ష వేశారు?

మదా: తలగొరిగించి వదిలేశారు. ముక్కో చెవులో కోస్తే తీరిపోయేది.

శ్రీధ:    పోన్లే పాపం.

మదా: పాపం తలచకూడదు దాన్ని. దొంగముండ. కులం పరువు తీసింది.

శ్రీధ:    సరి సరి. మరి ఇటువైపు శుభకార్యం మాటేమిటి?

మదా: కామమంజరి కూతురు మదనరేఖకు ఈ రోజు ముకురవీక్షా మహోత్సవం జరుగుతోంది.

శ్రీధ:    ఇలాంటి ఉత్సవం గురించి నేనెప్పుడూ వినలేదు. ఏమిటది?

మదా: ఇది వేశ్యాకులం మాత్రమే జరుపుకొనే ఉత్సవం. ఈడేరిన పిల్లకు అద్దం చూపి ‘మన్మధవేధ దీక్ష’ ఇస్తారు. అద్దం మా సానివారికి శ్రీ మహాలక్ష్మితో సమానం. ఈ తంతు జరగనిదే ఆ పిల్లకు విటుడితో కలిసే అధికారం ఉండదు.

శ్రీధ:    ఓహో! సోమయాజులు ఆరణి సంగ్రహించిన తర్వాతే యజ్ఞం చేస్తారు. అలాగే మీరు అద్దం చూసిన తర్వాతే వృత్తిలోకి ప్రారంభిస్తారన్నమాట. ఇంతకూ ఈ తంతు ఎలా నిర్వహిస్తారు?

మదా: ఒక మంచి రోజు చూసి ముకుర వీక్షణానికి ముహూర్తం నిర్ణయిస్తారు. బంధుమిత్రులందరినీ ఆహ్వానిస్తారు. పిల్ల తండ్రిని రావించి పిల్లకు చెవిలో మంత్రం చెప్పిస్తారు. తండ్రి తన తొడపై పిల్లను కూర్చోబెట్టుకొని అద్దం చూపుతాడు. పిల్లకు దీవెనలతో పాటు కానుక లిస్తాడు. దాంతో క్రతువు ముగుస్తుంది. ఇక కొత్త సాని కోసం ఎదురు చూసే విటుల పంట పండుతుంది.

శ్రీధ:    బాగుంది. ఇంతకూ మదనరేఖ పేరుకు తగ్గదేనా?

మదా: కొత్త రుచుల పైకి మనసు పోతున్నట్టుంది.

శ్రీధ:    అబ్బే అదేం లేదు. ఊరికే కుతూహలం కొద్దీ అడిగాను. అంతలోకే అలకా? అన్నట్టు బంగారు గొలుసు కావాలన్నావు కదూ! సాయంత్రం విపణివీథికి వెళ్ళొద్దాం. సిద్ధంగా ఉండు.

*

మీ మాటలు

*